ఆర్టీసీ డ్రాఫ్ట్ బిల్లును ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు తెలంగాణ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు రాజ్‌భవన్ నుంచి ఇంకా అనుమతి దక్కలేదు. తాజాగా ఈ వ్యవహారంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విస్ట్ ఇచ్చారు. మరో మూడు వివరాలపై ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీంతో గవర్నర్ సంధించిన ప్రశ్నలపై ప్రభుత్వం సమాధానాలు సిద్ధం చేస్తోంది.
► ఆర్టీసీకి చెందిన భూములు, భవనాలు ఎన్ని ఉన్నాయి.
► డిపోలవారీగా ఉద్యోగుల సంఖ్య ఎంత?
► పర్మినెంట్ కానిఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా?
‘‘నిన్న బిల్లు పంపి ఇవ్వాళ సంతకం కావాలంటే కరెక్ట్ కాదు. నేను ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కోసమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నా. ఏ బిల్లులోలైనా నిబంధనల ప్రకారమే నేను వెళ్తున్నాను. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నా. ప్రతీ బిల్లుకు కొన్ని రూల్స్ ఉంటాయి. కార్మికులకు వివిధ రూపాల్లో రావాల్సిన బకాయిలు, నిధుల గురించి ప్రభుత్వాన్ని అడిగాము. నేను పీపుల్ ఫ్రెండ్లి గవర్నర్ ను. బిల్లుపై రాజ్ భవన్ ఆఫీస్ కు ఎలాగైతే నిరసనగా వచ్చారో..ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయండి. రాజ్ భవన్ కు నిరసనగా కార్మికులు వచ్చినందుకు నేనేం బాధపడటం లేదు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్...హెల్త్ బెనిఫిట్స్ పై ముసాయిధలో స్పష్టత లేదు. మీరు భవిష్యత్ హక్కుల కోసం అడగటం న్యాయమే కానీ బకాయిల విషయంలో మీ పోరాట స్ఫూర్తిని ఎందుకు ప్రశ్నించడం లేదు?. నేను ఆర్టీసీ కార్మికుల కోసమే ఉన్నా...మీ హక్కుల కోసమే అడుగుతున్నా ప్రాధాన్యత క్రమంలో మీ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాలని అడుగుతున్నా. బిల్లులో స్పష్టత లేవని గవర్నర్ అడుగుతున్నట్లు...ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి. బాధ్యతాయుత గవర్నర్ వ్యవస్థలో భాగంగానే నేను మీ న్యాయమైన అంశాల విషయంలో స్పష్టత కోసమే ఆపాను. అంతే తప్ప ఇంకో ఉద్దేశం లేదు. భవిష్యత్ ఎలాంటి సమస్యలు రాకూడదనే బిల్లులో స్పష్టత కోరుతున్నా అని ఆమె యూనియన్ నేతలను ఉద్దేశించి ఆమె పుదుచ్చేరి నుంచి వీడియో కాల్ ద్వారా వ్యాఖ్యానించినట్లు సమాచారం.
టీఎస్సార్‌టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలను ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
- ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు.
- ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడతారు?
- ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా?
- విజభన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు.
- పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు?
వీటితో పాటు ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను గవర్నర్ కోరారు.
దీనికి ప్రభుత్వం నుంచి..
ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని.. సంస్థ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కార్పొరేషన్ (TSRTC) యథాతథంగా కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. అలాగే కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని పేర్కొంది. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పింఛన్లు, తదితరాలకు సంబంధించి ఎలాంటి అయోమయం లేదన్న ప్రభుత్వం.. ప్రభుత్వంలో తీసుకున్న తర్వాత కార్మికులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. వేతనాలు, భత్యం, కేడర్, పదోన్నతులకు ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. ఈ మేరకు గవర్నర్ అడిగిన అన్ని అంశాలపై వివరణ ఇచ్చామని.. శాసనసభలో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
అంతకు ముందు గవర్నర్ ఆర్టీసీ బిల్లు డ్రాఫ్ట్‌పై సంతకం చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కాసేపు బస్సులు నిలిపివేసి నమ్మె చేపట్టారు. హైదరాబాద్‌లో రాజ్‌భవన్ వద్దకు చేరుకుని కొందరు ఉద్యోగులు గవర్నర్ సంతకం చేయాలంటూ ధర్నా చేపట్టారు. రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లు క్లియరెన్స్ అవుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment