The capital of Andhra Pradesh
-
సమన్వయంతో సమున్నత రాజధాని
సాక్షి ప్రతినిధి, గుంటూరు : దేశం గర్వించదగిన రాజధాని రూపకల్పనకు ప్రభుత్వం, అధికారులు, ప్రజల మధ్య సమన్వయం అవసరం. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవ్యాంధ్ర రాజధానిలో సింగపూర్ అనుసరిస్తున్న సిటీ, అర్బన్ ప్లానింగ్, సర్వే విధానాలతో పాటు పోలీసింగ్‌పై ఓ నివేదికను రూపొందించనున్నాం. వీటి అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24 వరకు సింగపూర్‌లో పర్యటించిన అధికారుల బృందంలో ఒకరైన శ్రీధర్ అక్కడి విధానాలు, ప్రభుత్వ శా ఖల మధ్య సమన్వయాన్ని ‘సాక్షి ప్రతినిధి’కి వివరించారు. అర్బన్, సిటీ ప్లానింగ్‌కు సంబంధించిన విధి విధానాలు నవ్యాంధ్ర రాజధానిలో వినియోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆ వివరాలు.. 770 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సింగపూర్‌లో సహజ సిద్ధమైన ప్రకృతి వనరులు లేవు. ట్రేడింగ్ హబ్‌గా ఖ్యాతిగాంచడంతో వాణిజ్యం, ఓడరేవులు, సేవారంగాల నుంచి అధిక ఆదాయం వస్తోంది. అక్కడ ఒక రహదారి నిర్మించాల్సి వస్తే అనుబంధ శాఖల అధికారులతో కలసి నిర్ణయం తీసుకుంటారు. దీని వల్ల భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ప్రభుత్వ నిధులు వృథా కావు. మనవద్ద అలాంటి విధానమేదీ లేదు. ఎవరికి ఆటంకం కలిగితే వారు కొత్తగా నిర్మించిన రహదారినైనా సరే పగలగొడతారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం అని భావిస్తే చెట్లను నరికేస్తారు. ఇలాంటివి నవ్యాంధ్ర రాజధానిలో జరగకుండా ఉండాలంటే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అవసరం. ఇక అక్కడి ప్రజలు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వినియోగిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా సింగపూర్ ప్రభుత్వం సేవా రంగాన్ని అభివృద్ధి చేసింది. రవాణాకు సంబంధించి ప్రజలు నేరుగా ఇంట్లోకి, ప్రభుత్వ కార్యాలయాల్లోకి అడుగుపెట్టే విధంగా మెట్రోట్రైన్ను రూపొందించారు. ఆర్థిక సౌలభ్యం ఉన్నప్పటికీ 90 శాతం ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టునే వినియోగించుకుంటారు. నడక, సైక్లింగ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. 30 శాతం భూమిని భవనాలు, కట్టడాలకు కేటాయించి, మిగిలిన ప్రాంతంలో విశాలమైన రహదారులు, గ్రీనరీ ఏర్పాటు చేశా రు. గృహనిర్మాణానికి సంబంధించి 90 శాతం భవనాలను ప్రభుత్వమే నిర్మించి ప్రజలకు విక్రయిస్తోంది. లేకుంటే అద్దెకు ఇస్తోంది. సింగపూర్ మొత్తానికి రెండు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అక్కడి సర్వే విధానాన్ని ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంత సాంకేతిక నైపుణ్యతతో ఆ విధానాన్ని అమలులోకి తీసుకురావచ్చు. ఇక్కడ భూ ఆధారిత సర్వే మాత్రమే జరుగుతోంది. దీనికి సింగపూర్ విధానాన్ని అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అక్కడి ప్రజల్లో చైతన్యం, క్రమశిక్షణ ఎక్కువ. అందువల్లే తక్కువ సంఖ్యలో పోలీసులు ఉన్నప్పటికీ శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. షాపింగ్ కాంప్లెక్సులు, బహుళ అంతస్తుల భవనాలకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీస్ శాఖ పరిశీలనలోనే ఉంటాయి. రహదారులపై పోలీసులు కనిపించకపోయినప్పటికీ, కెమెరాల పరిశీలనతో శాంతిభద్రతలను పరిరక్షించగలుగుతున్నారు. ఇక్కడి నుంచి వివిధ శాఖలకు చెందిన అధికారులు సింగపూర్ అధ్యయన టూర్లో పొల్గొన్నారు. ఆ శాఖలకు చెందిన అధికారులు వాటిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతారు. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
రాజధాని రైతుకు భరోసా
{పతిప్రాదిత గ్రామాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ కమిటీ తొలి రోజు ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల రైతులతో ముఖాముఖీ ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సహించబోమని వైఎస్సార్ సీపీ నేతల స్పష్టీకరణ ముఖ్యమంత్రి, టీడీపీ నేతల వైఖరికి అడ్డుకట్ట వేయాలని కోరిన ఆయా గ్రామాల రైతులు {పాణాలైనా ఇస్తాం గానీ భూములు ఇచ్చేదిలేదని తెగేసి చెప్పిన అన్నదాతలు గుంటూరు సిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం జరిపిన పర్యటన బాధిత రైతుల్లో భరోసా నింపింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నేతల వైఖరితో ఆందోళన చెందుతున్న ఆయా గ్రామాల రైతుల్లో నమ్మకాన్ని కలగజేసింది. నాయకులంతా మూకుమ్మడిగా తమ గ్రామాలకు తరలి రావడం, జోరు వానలో కూడా బురదలో నడుస్తూ సారవంతమైన తమ పొలాల్లో పర్యటించడం వారిలో నూతనోత్తేజాన్ని రేకెత్తించింది. రైతులు, రైతు కూలీలు, కౌలుదారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సహించబోమని వైఎస్సార్ సీపీ నేతలు సంఘటితంగా స్పష్టం చేయడంతో వారికి తమ భూముల పట్ల, భవితపై నమ్మకం కుదిరింది. ఉదయం ఉండవల్లి నుంచి ప్రారంభమైన కమిటీ పర్యటన పెనుమాక, నిడమర్రు గ్రామాల్లో సాగింది. ► మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో మాజీ మంత్రి పార్ధసారథి, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), కోన రఘుపతి, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, ముస్తఫా, గొట్టిపాటి రవికుమార్, రైతు నేత ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు గ్రామాల్లో పర్యటించారు. ► అక్కడి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. స్వయంగా పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించి రైతుల స్థితిగతులను అంచనా వేశారు. రైతుల ఆవేదనను ఆలకించారు. తొలుత రాజధాని నిర్మాణానికి పొలాలిచ్చే అంశంపై ఉండవల్లి ఉగ్రరూపం దాల్చింది. ఊరు ఊరంతా ఉవ్వెత్తున విరుచుకుపడింది. ప్రాణాలైనా ఇస్తాం కానీ పొలాలిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మా సమాధులపై సింగపూర్ కడతారా? అని ప్రశ్నించింది.పెనుమాక పెనుకేక పెట్టింది. లాఠీలు, తూటాలకు బెదరనంది. ప్రభుత్వ ప్యాకేజీలకు లొంగనంది. ప్రభుత్వం తమ పొలా ల జోలికొస్తే తరిమి తరిమి కొడతానంది. నిడమర్రు చిర్రు బుర్రులాడింది. ఎకరం కూడా ఇచ్చేది లేదని ఏకగ్రీవంగా తీర్మానించింది. కావాలంటే ఎకరానికో రూ. లక్ష చొప్పున రాజధాని నిర్మాణానికి చందా ఇస్తానంది. సారవంతమైన తమ పొలాలు వదిలేసి వేరే ఎక్కడైనా నిర్మించుకోవాలని హితవు పలికింది.కమిటీ నేతల ఎదుట రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పసిడి రాశులు పండించే భూములను చిన్నాభిన్నం చేసే చంద్రబాబునాయుడు ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని మనవి చేసుకున్నారు. ఈ సమయంలో తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదనీ, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి మాత్రమే తామీ పర్యటనకు వచ్చామనీ, ఇందులో రాజకీయానికి తావు లేదనీ చెప్పిన వైఎస్సార్ సీపీ నేతల మాటలకు స్థానిక రైతుల్లో అనూహ్య స్పందన కనిపించింది. ఇంతటితో ఆగమని, దఫదఫాలుగా పర్యటిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదనీ పదే పదే చెప్పడంతో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు ప్రజలు,రైతులు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా హక్కుల కమిటీ ముందుంచా రు. ఆయా గ్రామాల రైతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...... తిరుగుబాటు చేస్తాం.. మావి సారవంతమైన భూములు. తరతరాలుగా పొలాలు నమ్ముకుని బతుకుతున్నాం. అమ్ముకుని కాదు. ఎట్టి పరిస్థితుల్లో గజం భూమి కూడా ఇచ్చేది లేదు. మాకే ప్యాకేజీలు అక్కర్లేదు. కాదూ కూడదని లాక్కునే ప్రయత్నం చేస్తే తిరుగుబాటు చేస్తాం. అప్పుడు మమ్మల్ని చంపి మా సమాధులపై సింగపూర్ తరహా రాజధాని కట్టుకోమనండి. - పి.శంకర్‌రెడ్డి, రైతు, ఉండవల్లి మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె... రైతులకు సాగునీరు ఇవ్వడం చేతకాదు కానీ చంద్రబాబుకు వారి పొలాలు మాత్రం కావాల్సి వచ్చాయా? రాజధాని విషయంలో ఆయన వ్యవహారం చూస్తుంటే మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా ఉంది. ఇటు రైతులు, అటు ప్రజలు ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా ఆయన నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము ఆమోదించాలా? ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వం. - శివశంకరరావు, ఉండవల్లి రుణమాఫీకి పనికిరావు కానీ... మీ పొలాల్లో సాగవుతుంది ఉద్యాన పంటలు కాబట్టి మీకు రుణమాఫీ వర్తించదన్నారు. సరే బాగానే ఉంది. రుణమాఫీకి పనికిరాని పొలాలిప్పుడు రాజధాని నిర్మాణానికి మాత్రం ఎలా పనికొస్తాయి. సారవంతమైన భూములు కాబట్టే రుణమాఫీ వర్తింపజేయ లేదు. అలాంటి మా సస్యశ్యామల భూముల్ని వదిలి పనికి రాని పొలాలుంటే చూసుకుని అక్కడ రాజధాని నిర్మాణం చేపట్టండి. - విశ్వనాథం, మాజీ ఆదర్శ రైతు, పెనుమాక ఏకగ్రీవంగా తీర్మానించాం... రాజధాని నిర్మాణ విషయమై గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు విని తీవ్ర ఆందోళనకు లోనయ్యాం. చివరకు మేమంతా కలసి కట్టుగా ఆలోచించుకుని రాజధాని నిర్మాణానికి మాగ్రామం నుండి ఒక్క ఎకరం కూడా ఇవ్వకూడదని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాం. చాలా కష్టపడి పొలాలు సాగుచేసుకుని చివరికి వైఎస్సార్ పుణ్యమాని వచ్చిన ఎత్తిపోతల పథకం వల్ల ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. ఈ తరుణంలో రాజధాని పేరిట చంద్రబాబు మాకు టోకరా వేయాలని చూస్తే నమ్మేంత వెర్రి బాగుల వాళ్ళం కాదు. - గాదె వీరాంజనేయరెడ్డి, ఎత్తిపోతల పథకం గౌరవ అధ్యక్షుడు, నిడమర్రు. మా పొట్ట కొట్టొద్దు.. పొలాల్లో పని చేయడమొక్కటే మాకు తెలుసు. ఏళ్ల తరబడి రైతు కూలీలుగానే జీవనాధారాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పుడొచ్చి రాజధాని పేరిట ఈ పొలాలు లాక్కుంటామని అంటున్నారు. అదే గనక జరిగితే, ఈ పొలాలే లేకుంటే మేమెక్కడికి పోయి బతకాలి. రాజధాని అవసరమే. కాదనడం లేదు. అయితే దయచేసి మా ఊరును మాత్రం వదిలిపెట్టండి. మా పొట్ట కొట్టకండి. - చిట్టెమ్మ, రైతు కూలీ, నిడమర్రు రాజధాని నిర్మాణానికి చందాలిస్తాం, రాజధాని నిర్మాణానికి అవసరమైతే మా గ్రామంలో ఎకరానికి లక్ష రూపాయల చొప్పున చందా ఇస్తాం కానీ సారవంతమైన మా చేల జోలికి మాత్రం రావద్దు. ఏడాదికి ఎకరానికి లక్షా 40వేల రూపాయలు కౌలు రూపంలోనే మాకు ఆదాయం వస్తుంది. అంత ఆదాయాన్నిచ్చే పొలాన్ని మీ మాటలు నమ్మి మీకిచ్చేందుకు మేము సిద్ధంగా లేము. మేమిచ్చే చందాలు తీసుకుని వేరే ఎక్కడైనా రాజధాని నిర్మించండి. - శ్రీనివాసరెడ్డి, నిడమర్రు పొలాలిచ్చేందుకు సిద్ధంగా లేం.... తాడేపల్లి మండలంలోని ఏ గ్రామం కూడా పొలాలిచ్చేందుకు సిద్ధంగా లేదు. ఇటు అధికారులు, అటు పాలకులు ఈ విషయమై చెబుతున్నవన్నీ అవాస్తవాలే. ఆ గ్రామం సిద్ధంగా ఉంది. ఈ గ్రామం సిద్ధంగా ఉంది. అంటూ పాలకులు చెబుతున్నవన్నీ నిజం కాదు. వాస్తవానికి ఒక్కరంటే ఒక్క రైతు కూడా వీసమెత్తు స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. మేం అన్ని గ్రామాల్లో తిరిగి రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నాం. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోం. -దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ ఎంపీపీ, తాడేపల్లి -
నేటి నుంచి రైతు హక్కుల కమిటీ పర్యటన
విద్యానగర్ (గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించతలపెట్టిన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం నుంచి పర్యటించనుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. బుధవారం గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మంగళగిరి, తుళ్లూరు మండలాల రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తొలుత మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ కమిటీ పర్యటన గురు,శుక్ర రెండు రోజులపాటు జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు ధర్మాన ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు, మాజీ మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), గొట్టిపాటి రవికుమార్, కొడాలినాని, ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, రైతు సంఘం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, కత్తెర సురేష్, తాడికొండ సమన్వయకర్త క్రిస్టినా పర్యటించి రైతులు, కౌలు రైతులు, కూలీలు, ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారన్నారు. కమిటీ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి బయలుదేరి ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, ఐనవోలు, శాఖమూరు గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ రాజధాని నిర్మించే ప్రాంతాల్లో రానున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, ప్రజలకు ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు, లాభనష్టాలపై ప్రజలతో చర్చిస్తామన్నారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలు, అటు రైతులకు ఇటు ప్రజలకు ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు గురించి చర్చించి వారి వారి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా పార్టీ తరఫున పోరాడేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ మాట్లాడుతూ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు నర్సిరెడ్డి, గుంటూరు రూరల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి, ఎంపీపీ రత్నకుమారి, తాడేపల్లి నగర కన్వీనర్ సాంబిరెడ్డి, పెనుమాక మండల కన్వీనర్ మేకా సాంబశివరావు, తుళ్లూరు మండల కన్వీనర్ కృష్ణారావు, నిడమర్రు, పెదవడ్లపూడి ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, శేషారావు, శాఖమూరు గ్రామ సర్పంచ్ ప్రసాదరెడ్డి, పార్టీనాయకులు మండేపూడి పురుషోత్తం, జెపీ, వేమారెడ్డి, కృష్ణమూర్తి, మెట్టు శివరామకృష్ణారెడ్డి, కిక్కురు అర్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఇంటూరి అంజిరెడ్డి, శివారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉదయం పది గంటలకు ఉండవల్లి నుంచి ప్రారంభం మంగళగిరి: రాజధాని రైతు హక్కుల పరిరక్షణ కమిటీ పర్యటన గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి మం డలం ఉండవల్లి గ్రామం నుంచి ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. ఉండవల్లి, పెనుమాక, మంగళగిరి మండలంలోని యర్రబాలెం, నవులూరు గ్రామాల్లో పర్యటించిన తరువాత కమిటీ నిడమర్రు గ్రామంలో మధ్యాహ్నం భోజన విరా మం తీసుకుంటుందని చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటలకు కురగల్లు, నీరుకొండ గ్రామాల్లో పర్యటించిన అనంతరం కమిటీ తాడి కొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందన్నారు. -
సీమపై కుట్ర జరుగుతోంది
అఖిలపక్ష సమావేశంలో రైతు నేతలు మైదుకూరు(చాపాడు): ‘ఒక్కప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిని పోగోట్టుకున్నాము.. ఇప్పుడేమో రాయలసీమకు తాగు, సాగు నీరిందించే శ్రీశైలం నికర జలాలను దక్కకుండా చేసేందుకు సీమపై కుట్ర జరుగుతోంది.. మనకు అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది.. ఉద్యమాలు చేసైనా సరే శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిపై మన హక్కును కాపాడుకోవాలి’.. అని రైతు నేతలు గళం విప్పారు. మైదుకూరు పట్టణంలోని జెడ్పీ హైస్కూలు ప్రాంగణంలో ఆదివారం రాయలసీమ సాగునీటి అవసరాల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టంపై అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. ప్రభుత్వం మోసం చేస్తోంది - రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ లెక్కల వెంకటరెడ్డి శ్రీశైలం జలాశయంలో 107 జీఓ ప్రకారం 854 అడుగులకు నీటి మట్టం చేరుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణకు ఇచ్చే విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలని, లేకుంటే రాయలసీమ ఎండిపోతుందని తెలిసినా కూడా ప్రభుత్వం పోరాటం చేయకుండా మోసం చేస్తోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ లెక్కల వెంకటరెడ్డి విమర్శించారు. గతంలో మన రాజధానిని పోగోట్టుకున్నామని, ఇదే క్రమంలో సాగునీటికి ఇబ్బంది వస్తుందని శ్రీశైలం నుంచి మనకు ఉత్పత్తి చేసే విద్యుత్‌ను కోల్పోయామని, ఇప్పుడేమో పూర్తిగా రాయలసీమను ఎడారిగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు మన ప్రభుత్వం సీమపై కుట్ర పన్నుతోందన్నారు. పోరాటాలు చే సైనా సరే మన హక్కును మనమే కాపాడుకోవాలన్నారు. రాయలసీమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: - వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాదరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టులో మనకు, తెలంగాణ రాష్ట్రానికి మధ్య ఏర్పడిన సమస్య విషయం మన ప్రభుత్వం రాయలసీమను పట్టించుకోవటం లేదని వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 854 అడుగులకు పెంచుతూ 107 జీఓను తీసుకువచ్చార న్నారు. దీని ప్రకారం కేసీ కెనాల్‌కు సాగునీటి తర్వాతనే అత్యవసరమైతే సర్కాలు జిల్లాలకు తాగునీటిని, పంటలు ఎండితే సాగునీరు ఇవ్వొచ్చని జీఓలో పేర్కొన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన కమిటీ కో-కన్వీనర్లు పోలు కొండారెడ్డి, వీరనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ మైదుకూరు మైనార్టీ నాయకుడు మదీనాదస్తగిరి, చాపాడుకు చెందిన సీవీ సుబ్బారెడ్డి, జిల్లా పసుపు రైతు సంఘం అధ్యక్షుడు గుండంరాజు సుబ్బయ్య, ప్రజాపక్షం నేత గోశెట్టి రమణయ్య, టీజీపీ పోరాట సమితి అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, మైదుకూరు రైతు నాయకుడు డీఎన్ నారాయణ, దండోరా నాయకుడు నాగయ్య, కేసీకెనాల్ సమితి ప్రెసిడెంటు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హుకుం జారీచేసిన హుదూద్
ఆంధ్రప్రదేశ్ రాజధానికి విజయవాడ-గుంటూరు ప్రాంతాలు, ముఖ్యంగాఆ రెండు పట్టణాలూ ఎంత మాత్రం అనుకూలం కానివని ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు గుర్తించడం అవసరం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మంచిది.వందిమాగదుల మాటలకు విలువ ఇవ్వకుండా, ప్రభుత్వం మొండిపట్టు పట్టకుండా నిపుణులు సూచించినట్లు అన్నివిధాలా అనుకూలంగా, సముద్ర మట్టానికి 300-400 మీటర్ల ఎత్తులో ఉన్న దొనకొండ- వినుకొండ- బోళ్లపల్లి- మార్టూరు ప్రాంతాలలో కొత్త రాజధానికి హంగులు సమకూర్చుకోవడం అత్యంత అభిలషణీయంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు రాజకీయ పాలకశక్తుల పతనానికి దారితీస్తాయి. ఆ పరిస్థితులలో విపత్తును తమకు అనుకూ లంగా మలుచుకోవాలని రాజకీయ నాయకులు తరచూ ప్రయత్నిస్తారు. ఈ తొక్కిసలాటలో పాలకులు తమ ప్రయోజనం కోసం అధికారగణంతో ఘర్షణకు దిగుతారు. - ప్రొఫెసర్ సి. రాఘవులు (డీన్ ఆఫ్ సోషల్ సెన్సైస్, రిటైర్డ్ డెరైక్టర్, విపత్తుల నివారణ అధ్యయన కేంద్రం, నాగార్జున విశ్వవిద్యాలయం) చెన్నైలో ఇచ్చిన ప్రసంగం (1994) నుంచి. విపత్తుల తరువాత అలాంటి పరిస్థితులు తలెత్తకుం డా జాగ్రత్త పడడానికి నిపుణులు పాత, కొత్త నివేదికలలో పొందుపరిచిన సలహాలను పాటించడం పాలకులకే శ్రేయస్కరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలు రెండురకాలు: ఒకటి- రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపిక నిర్ణయం ఒక సంక్షోభ స్థాయికి చేరుకోవడం. రెండు- విభజన జరిగిన వెనువెంటనే కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రం ‘హుదూద్’ పెను తుపాను బారినపడటం. ఈ తుపాను నాలుగు జిల్లాలను, విశాఖ నగరం సహా పలు పట్టణాలను ఇప్పట్లో తేరుకోలేని విధంగా నష్టపరిచింది. ఈ రెండింటిలో ఒకటి మానవ కల్పితమైన వికారపు చేష్ట. ముఖ్యమంత్రి పదవుల వేటలో తెలుగుజాతిని యూపీఏ ప్రభుత్వం రెండుగా చీల్చింది. రెండవది, ప్రకృతి చేసిన విలయ తాండవం. నిజానికి పర్యావరణానికి మనిషి తలపెడుతున్న హాని కారణంగా ప్రకృతి వికటించిన ఫలితమిది. తక్షణం గుర్తించవలసిన వాస్తవం ప్రస్తుతం ఆ రెండు సమస్యల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజానీ కం నలిగిపోతున్నది. ప్రజలనూ, రాష్ట్రాన్నీ ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి ప్రతి ఒక్కరూ ఆలోచిం చాలి. విభజన తరువాత అధికారం చేపట్టిన పాలకులు దేనికోసమో ఉవ్విళ్లూరుతూ, తొందరపాటుతో విజయవా డ-గుంటూరులను కొత్త రాజధానిగా ప్రకటించారు. ఇవి జనంతో కిక్కిరిసి ఉండే నగరాలు. తీరా ప్రకటించిన తరు వాత గాని అసలు సమస్యలు తెలిసిరాలేదు. ఇలాంటి చోట రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో ఒక్కొక్కటిగా అనుభవానికి రావడం వెంటనే మొదలైంది. ఏదో రకంగా అధికారం చేపట్టగలిగామన్న ‘సంబడం’లో ఈ పాలకులు సమస్య ఆనుపానులను పట్టించుకోకుండా పక్కకు పెట్టేశారు. ప్రజాభిప్రాయాన్ని గాని, కొందరు చేసిన హెచ్చరికలను గాని పట్టించుకునే తీరిక వారికి లేకపోయింది. రాజధాని ఎంపిక మీద కేం ద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన సాధికారికి నివేదికలో ఏం చెప్పిందో తెలుసుకునే ఓపిక కూడా పాలకు లకు లోపించింది. ముందుగా తీసుకున్న నిర్ణయాన్నే అమ లుచేయడానికి ఒడిగట్టారు. నిగ్గుతేలిన హెచ్చరికల స్వరూపం ఈ సమస్యను అసలు శాసనసభలో చర్చకు కూడా రానీ యకుండా, శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన విలువైన సల హాలను ఏకపక్షంగా తోసిపుచ్చారు. కేంద్రంలో బీజేపీతో పొత్తు కలిపిన తెలుగుదేశం నిరంకుశ నిర్ణయాలకు అల వాటు పడి, ఇక్కడ శాసనసభలో విపక్షం గొంతు నొక్కే సింది. కానీ, ఆచరణ, అనుభవం ప్రకారం శివరామకృష్ణన్ చేసిన హెచ్చరికలు వాస్తవికమైనవేనని ఇప్పుడు రుజు వైంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దేశం మొత్తం మీద విపత్తులకు గురికావడానికి అత్యధిక అవకాశాలు ఉన్న రాష్ట్రాలలో ఒకటి ఆంధ్ర ప్రదేశ్. రాష్ట్రంలో ఎక్కువ భాగం తరచూ దుర్భిక్షానికి గుర వుతోంది. ఈ పరిస్థితిలో పట్టణ ప్రాంతాలకు నీటి భద్రత సమస్యగా మారిపోతోంది. ఇక గ్రామీణ ప్రాంత ప్రజానీ కం మీద దీని ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోస్తా ప్రాంతం తరచూ పెనుతుపానులకు గురవుతూ, ఆక స్మిక వరదల బారిన పడుతోంది. ప్రధాన నదులు ప్రవ హించే మార్గంలోనే జనావాసాలు ఉండడంతో ఈ సమస్య తప్పడం లేదు. భూకంపాలు తరచుగా రాకపోయినా, వచ్చినప్పుడు కోస్తాలోని ప్రధాన పట్టణ కేంద్రాలలో భవ నాలు కుదుపునకు గురవుతున్నాయి. ఈ తీవ్ర పరిణామా లకూ త్వరితగతిన జరుగుతున్న పట్టణ ప్రాంతాల విస్తర ణకూ సంబంధం ఉంది. వాతావరణ మార్పులు మున్ముం దు పెను తుపానులకు, వాటి విస్తరణకూ, ఫలితంగా సముద్రంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని శివరామకృష్ణన్ కమిటీ నిపుణులు పేర్కొన్నారు. అందువల్లనే ‘విజయ వాడ-గుంటూరు- మంగళగిరి- తెనాలి’, పరిసర ప్రాంతా లూ (వీజీఎంటీ) నూతన రాజధాని నిర్మాణానికి అనువై నవి కావని విస్పష్టంగా సలహా ఇచ్చింది. అందరి మాటా అదే శివరామకృష్ణన్ నివేదికలోని ఈ అంశాలను జాతీయ స్థాయిలో ప్రణాళికా, భవన నిర్మాణ కేంద్రం (ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్) డెరైక్టర్ ఎన్.శ్రీధరన్ కూడా బలపరి చారు. ఏటా అక్టోబర్-నవంబర్ మాసాల్లో కోస్తాను పెను తుపానులు చుట్టుముట్టి భారీ ఎత్తున ధన, ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వానికి తీవ్ర సమస్యగా పరిణమించిందని (14-10-2014) పేర్కొనడం విశేషం! మొత్తం ఆంధ్ర కోస్తా అంతా పెనుతుపానులకు సంబం ధించినంత వరకు తీవ్రనష్టాలకు గురిచేసే మండలాల్లోనే విస్తరించి ఉందని నిపుణులు తాజాగా కూడా హెచ్చరిం చారు. ఈ దృష్ట్యానే శ్రీధరన్ ప్రస్తుత పట్టణాభివృద్ధి కేం ద్రాలు, తూర్పు కోస్తా ఆర్థిక లావాదేవీల నడవ (కారిడార్) సహా, ఇటు చెన్నై నుంచి అటు కోల్‌కతా వరకూ భారీ తుపానుల దెబ్బకు గురయ్యేంత సమీపంలో ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న తటస్థ మండలంలో 15 ప్రథమశ్రేణి పట్టణాలు, 15 ద్వితీయ శ్రేణి పట్టణాలు, 13 తృతీయ శ్రేణి, నాల్గవ స్థాయి పట్ట ణాలు ఉన్నాయి. హుదూద్ విలయం ముగిసిన వారం తరువాత కూడా కోస్తా ప్రాంతాలకు వాటిల్లిన కష్టనష్టాలు ఎంతటివో ఇప్పటికి స్పష్టం కాని పరిస్థితి. ప్రాణనష్టం నలుగురితో ఆగిందని మొదట్లో ఆ బాధ మధ్యనే తృప్తి పడ్డాం. రెండు రోజులకే ఆ సంఖ్య 43కి చేరుకోవడం, విశా ఖపట్టణానికి, యావత్తు ఉత్తర కోస్తా మూడు జిల్లాలకు, తూర్పు గోదావరి జిల్లాకు జరిగిన భారీ నష్టం రూ.70 వేల కోట్లని ముఖ్యమంత్రే ప్రకటించటమూ గమనార్హం! ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి ఈ పూర్వరంగంలో ఏపీ రాజధానికి విజయవాడ-గుంటూ రు ప్రాంతాలు, ముఖ్యంగా ఆ రెండు పట్టణాలూ ఎంత మాత్రం అనుకూలం కానివని ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు గుర్తించడం మంచిది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మంచిది. వందిమాగదుల మాటలకే విలువ ఇవ్వకుండా, మొండిపట్టు పట్టకుండా నిపుణులు సూచించినట్లు అన్ని విధాలా అనుకూలంగానూ, సముద్ర మట్టానికి 300-400 మీటర్ల ఎత్తులో ఉన్న దొనకొండ-వినుకొండ-బోళ్లపల్లి- మార్టూరు ప్రాంతాలలో కొత్త రాజధానికి హంగులు సమకూర్చుకోవడం అత్యంత అభిలషణీయంగా ఉంటుం ది. అందుకే రాజధానికి మూడు జోన్లతో పాటు, నాలుగు, ప్రాంతాలను శివరామకృష్ణన్ కమిటీ తుది నివేదికలో అనువైన, పరిశీలనార్హమైనవిగా ప్రతిపాదించింది. వాటిలో భాగంగా దొనకొండ ప్రాంతాలను కూడా చేర్చింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు సారవంతమైన వ్యవసాయ భూములకు ప్రసిద్ధి. అవి భారతదేశ ధాన్యాగా రాలలో విశిష్టమైనవి. కాబట్టి భూములను వ్యవసాయేతర పనులకు వినియోగించబోవటం ప్రజల ఆహార భద్రతకు చేటని కమిటీ అభిప్రా యపడింది. విజ్ఞత ప్రదర్శించాలి ఇంత వివరమైన హెచ్చరికల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పాలకుల పునరాలోచించకుండా ఇంకా ‘గుళ్లో ప్రదక్షిణలు’ మాదిరిగానే విజయవాడ-గుంటూరు ప్రాంతంలోనే రాజ ధాని నిర్మాణమంటూ మంకు పట్టు పడుతున్నారు. ఇందు కోసం భూములు ఇవ్వకపోతే ఆర్డినెన్స్ ద్వారానైనా రైతుల నుంచి గుంజుకుంటామని బెదిరింపులకు దిగడం సంస్కా రమూ కాదు, క్షంతవ్యమూ కాదు. రాజధాని ఎంపికపై కమిటీ నిపుణులు చేసిన ప్రతిపాదనలు సలహాలు మాత్ర మే, వాటిని రాష్ర్ట ప్రభుత్వం తలదాల్చవలసిన అవసరం లేదని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల ఇప్పటికీ మోరాయి స్తున్నారు. శివరామకృష్ణన్ నివేదిక బయటకు వచ్చిన తరు వాత కూడా తనకు ఏ నివేదికా అందలేదని సీఎం కోత కోస్తూవచ్చారు. నిజానికి పాలకులు వినమ్రతతో మెలగి రాష్ట్ర రాజధాని ఎంపిక నిర్ణయాన్ని పునరాలోచించక తప్ప ని పరిస్థితులను ‘హుదూద్’ సృష్టించింది. ఇలాంటి నిరం తర సంక్షోభం, సంకటాలకు రాష్ట్ర ప్రజలను వదిలిపెట్ట కుండా ప్రకటించిన నిర్ణయం గురించి పాలకులు పునరా లోచించడం మంచిది. నిపుణులు చేసిన హెచ్చరికలే నేడు వాస్తవంగా కళ్ల ముందు నిలిచాయని పాలకులు గుర్తించి విజ్ఞతతో మెలగాలనీ, తెలివి తెచ్చుకోవాలనీ ఆశిద్దాం. అంతేగాని ‘కరువునొక్క దాసరి’ అన్నట్టుగా ఈ పాలకుల పాలనా కాలం కరువుతో ప్రారంభమై, కరువు భారంతో సాగి, కరువు బాధతోనే ముగిసిపోకూడదు. ఏబీకే ప్రసాద్ -
మూడేళ్లలో రాజధాని తొలి దశ నిర్మాణం
-
మూడేళ్లలో రాజధాని తొలి దశ నిర్మాణం
ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని తొలి దశ నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ చెప్పారు. రాజధానికి ల్యాండ్ పూలింగ్ (రైతుల నుంచి భూ సమీకరణ) విధానాన్నే అవలంభిస్తామని తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. నెల రోజుల్లో రాజధాని నిర్మాణానికి సంబంధించిన నివేదిక ఇస్తామని, అనంతరం 8 నెలల నుంచి ఏడాదిలోగా భూ సమీకరణ పూర్తి చేస్తామని తెలిపారు. ఆ తర్వాత రెండేళ్లలో తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని సలహా కమిటీ త్వరలోనే నోయిడా, నవీ ముంబై, పుణెలలో పర్యటిస్తుందని చెప్పారు. వచ్చే నెలలో సింగపూర్‌కు వెళుతోందని, అనంతరం రాజధాని నిర్మాణంపై తుది నివేదిక ఇస్తామని తెలిపారు. ఆ తర్వాతే భూ సమీకరణపై విధానాన్ని ప్రకటిస్తామన్నారు. -
‘దొనకొండ’ను రాజధాని చేయాలి
మార్కాపురం : దొనకొండను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని మార్కాపురం, యర్రగొండపాలెం ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, విశ్రాంత హైకోర్టు జడ్జి పి.లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్జీఓ హోంలో గురువారం సాయంత్రం సీమాంధ్ర రాజధాని సాధన సమన్వయ కమిటీ సమావేశం న్యాయవాది జావీద్‌అన్వర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏపీ రాజధానిని దొనకొండలో ఏర్పాటు చేసేలా కృషి చేయాలన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై మాట్లాడతామని స్పష్టం చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు మాట్లాడుతూ కేంద్రం ఏపీలోని అన్ని జిల్లాలకు వివిధ సంస్థలు, విద్యాలయాలను ప్రకటించినప్పటికీ, ప్రకాశం జిల్లాపై వివక్ష చూపిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని వర్గాల మెప్పు పొందేందుకు తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటిస్తూ శివరామకృష్ణన్ కమిటీని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విశ్రాంత హైకోర్టు జడ్జి లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ వాసులందరూ కర్నూలును రాజధానిగా చేయాలని కోరుతున్నారని, ప్రభుత్వం ఒకవేళ కర్నూలు వైపు మొగ్గుచూపకుంటే దొనకొండను రాజధానిగా చేయాలని కోరారు. అనంతపురం కంటే పశ్చిమ ప్రకాశం వెనుకబడి ఉన్న విషయాన్ని తాము గుర్తించామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి, రాజధాని ఏర్పాటు విషయమై త్వరలోనే రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీకి సమాంతరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి పి.నారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ పనిచేస్తోందని విమర్శించారు. సీనియర్ పాత్రికేయుడు ఓఏ మల్లిక్ మాట్లాడుతూ రాజధాని కోసం ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాది అన్వర్ మాట్లాడుతూ చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీని ప్రభావితం చేయడం తగదన్నారు. సాధన కమిటీ కో-కన్వీనర్ గాయం నారాయణరెడ్డి మాట్లాడుతూ దొనకొండలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగించుకుని ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఝాన్సీ, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బీవీ శ్రీనివాసశాస్త్రి, పెద్దారవీడు మండల వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గాలి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజయోగం
విజయవాడ : నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో వేసిన పునాది రాయి నేడు ఆంధ్ర రాజధాని ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. గన్నవరం ప్రాంత అభివృద్ధి కోసం 2006లో కేసరపల్లి వద్ద ఐటీ పార్కు(మేధ) నిర్మాణానికి వైఎస్ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి గన్నవరం ప్రాంతం దశ తిరిగింది. బీడు భూములు బంగారు గనులుగా మారాయి. ఇప్పుడు తాత్కాలిక రాజధాని విజయవాడలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎయిర్‌పోర్టు ఎదురుగా ఉన్న మేధా టవర్‌లో రాష్ట్రస్థాయి కార్యాలయాలు కొన్ని కొలువుదీరనున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు ఆయా కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయి కార్యాలయాలు ఐటీ పార్కులో ఖాళీగా ఉన్న టవర్లలో ఏర్పాటుచేయడం వల్ల గన్నవరం ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. దీంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐటీ పార్కుకు వేసిన పునాదిరాయితో గన్నవరం ప్రాంతం దినదినాభివృద్ధి చెందిందని ప్రజలు ఆయన్ను స్మరించుకుంటున్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన సెంట్రల్ జైలు నిర్మాణాన్ని నిలిపివేసి వైఎస్ ఐటీపార్కు నిర్మించారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఐటీ పార్కు వల్ల వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని శంకుస్థాపన సమయంలో వైఎస్సార్ చెప్పారని, ఆయన మాటలు నిజమవుతున్నాయని హర్షం వ్యక్తంచేస్తున్నారు. బంగారు గనులుగా గన్నవరం భూములు ఐటీ పార్కు ఏర్పాటుకు ముందు గన్నవరం ప్రాంతంలో భూములు తొండ గుడ్లు పెట్టేందుకు కూడా పనికిరాకుండా మరుగున పడి ఉండేవి. అయితే 2006 నుంచి భూముల విలువలు అమాంతం పెరిగాయి. గన్నవరం, కేసరపల్లి, సావారిగూడెం, కొండపావులూరు, గోపవరపుగూడెం, ముస్తాబాద, సూరంపల్లి గ్రామాల్లో భూముల ధరలు వంద రెట్లు పెరిగాయి. గన్నవరం నుంచి హనుమాన్‌జంక్షన్ వరకు భూముల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో సన్న, చిన్నకారు రైతులు తమ పొలాలను, స్థలాలను అధిక రే ట్లకు విక్రయించి అప్పుల ఊబి నుంచి బయటపడ్డామని సంబరపడుతున్నారు. -
రెండో రాజధాని అంశాన్నీ పరిశీలిస్తాం
శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు అరోమర్ రేవి కడప: ఆంధ్రప్రదేశ్‌కు రెండో రాజధాని ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకుంటామని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు అరోమర్ రేవి తెలిపారు. కమిటీ బృందం సోమవారం వైఎస్సార్ జిల్లా పర్యటనకు వచ్చారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. అనంతరం అరోమర్ రేవి విలేకరులతో మాట్లాడారు. కరువు, వ్యవసాయం, మౌలిక సదుపాయాల పరిశీలన ద్వారా రాయలసీమ ప్రాంతం ఎంతో వెనుకబడి ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. వికేంద్రీకరణ ద్వారా ప్రాంతాల మధ్య అభివృద్ధితో సమతుల్యతను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానికి నీటి లభ్యతే కీలకమైన అంశమని ఆయన స్పష్టంచేశారు. రాజధాని ఏర్పాటుకు వీలైనంత మేరకు తక్కువ భూమినే ఉపయోగించుకోవాలని చెప్పారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్యల్లో పడిందని, కొత్త రాజధానిని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని తెలిపారు. రాజ ధాని ఏర్పాటు అంశంపై తాము కేవలం సిఫారసులకే పరిమితమని, అందరికీ న్యాయం జరి గేలా నివేదిక రూపొందిస్తామని వివరించారు. విద్యార్థుల ఆందోళన ‘రాజధాని రాయలసీమ హక్కు.. కమిటీల పేరుతో కాలయాపన చేయడం తగదు’ అంటూ ఆర్ఎస్ఎఫ్ (రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్) కమిటీ సభ్యులు సోమవారం శివరామకృష్ణన్ కమిటీ సభ్యుల ఎదుట నిరసన గళమెత్తారు. ‘శివరామకృష్ణన్ కమిటీ గో బ్యాక్’ అంటూ ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. -
సీమ రాజధాని కోసం ఉద్యమం
కర్నూలు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయకుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేపడతామని రాజధాని సాధన కమిటీ చైర్మన్ చెన్నయ్య హెచ్చరించారు. స్థానిక జలమండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు జాతంతా ఐక్యంగా ఉండాలనే ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలును అప్పట్లో వదులుకున్నామన్నారు. రాజకీయ పార్టీలు గత చరిత్రను, పెద్ద మనుషుల ఒప్పందం గురించి తెలుసుకొని రాజధానిని సీమలో ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఏర్పాటు కోసం కమిటీ ఏర్పాటు చేసిన సమయంలో సీమలో తిరుపతి, కర్నూలలో కూడా పర్యటిస్తామని చె ప్పారన్నారు. ఆ కమిటీ ఇక్కడకి రాక మనుపే రాజధాని గుంటూరు-విజయవాడ మధ్యలో ఉంటుందని లీకులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం కాకుండా ప్రజా సంక్షేమానికి ప్రయోజనకరంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ భూములు, వనరులు, నీటి సదుపాయం, జాతీయ రహదారులు, రైల్వే రవాణ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనమైన తర్వాత సీమ ప్రజలు అధిక శాతం నష్టం పోయారని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో మళ్లీ సీమకే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఇప్పటికైనా స్పందించి ఈ నెల 19 నుంచి 24వ తేది వరకు జరిగే అసెంబ్లీ సమావేశాలలో రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని గళమెత్తాలని కోరారు. లేని పక్షంలో అన్ని ఉద్యోగ, ప్రజా సంఘాల జేఏసీలను కలుపుకొని ప్రత్యేక రాయల సీమ రాష్ట్ర సాధనకు ఉద్యమం చేపడతామని చెన్నయ్య హెచ్చరించారు. సమావేశంలో రాయలసీమ రాజధాని సాధన కమిటీ చైర్మన్ సోమశేఖర శర్మ, సభ్యులు విజయ్‌కుమార్, నాగరాజు, రాజధాని సాధన కమిటీ సభ్యులు సుబ్బరాయుడు, ప్రసాద్‌రావు, నెహేమియా, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ రాజధాని బెజవాడేనా!?
-
రాజధాని బెజవాడేనా!?
విజయవాడలో పర్యటించిన సందర్భంగా జిల్లా మ్యాప్‌ను పరిశీలిస్తున్న రాజధాని కమిటీ సభ్యులు రతన్‌రాయ్, జగన్‌షా, రవీంద్రన్. చిత్రంలో కలెక్టర్ రఘునందన్‌రావు తదితరులు. సాక్షి, విజయవాడ : నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి తమ ప్రాంతం అనువుగా ఉందంటే.. తమ ప్రాంతం అనువుగా ఉందంటూ దాదాపు అన్ని జిల్లాలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లోని భూములు, నీటివనరులు, ప్రత్యేకతలు.. ఇలా ప్రతి అంశమూ తెరపైకి వస్తోంది. కలెక్టర్ మొదలుకొని తహశీల్దార్ వరకు అందరూ తమ జిల్లాలోని ప్రాంతాలు అనువుగా ఉన్నాయని శివరామకృష్ణన్ కమిటీకి నివేదికలు అందజేస్తున్నారు. వీరితోపాటు ప్రతి జిల్లాలోనూ ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వివిధ సామాజిక సేవాసంఘాలు పెద్దఎత్తున వినతిపత్రాలు అందించాయి. బెజవాడను రాజధాని చేయాలంటూ కొందరు, విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుచేయాలని మరికొందరు తమ ప్రతిపాదనలను ఇటీవల జిల్లాకు వచ్చిన శివరామకృష్ణన్ కమిటీ ముందుంచారు. కలెక్టర్ రఘునందన్‌రావు, విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు, ఉడా వీసీ పి.ఉషాకుమారి, మున్సిపల్ కమిషనర్ హరికిరణ్ తదితరులు ఆయా శాఖల వివరాలను కమిటీకి అందజేసి విజయవాడ రాజధాని ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నివేదిక ఇచ్చారు. బెజవాడపై కమిటీ సంతృప్తి.. సీమాంధ్ర జిల్లాల్లో విజయవాడ రెండో అతి పెద్ద నగరం. వాణిజ్యపరంగానూ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం జిల్లాలో పర్యటించింది. జిల్లాకు రాకముందు విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల్లో పర్యటించింది. విశాఖ అనుకూలంగా ఉన్నప్పటికీ నౌకాదళం అక్కడ ఉండడంతో అనువు కాదని ప్రాథమికంగా నిర్థారించినట్లు సమాచారం. రాజమండ్రి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ 13 జిల్లాలకు కేంద్రబిందువు కాకపోవడంతో అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో విజయవాడలో పర్యటించిన కమిటీ జిల్లాలోని వనరులు, ఇతర అంశాలపై సంతృప్తి వ్యక్తం చేసింది. 13 జిల్లాలకు విజయవాడ కేంద్రబిందువు కావడం, రైల్వే డివిజన్ ఉండడం, ప్రభుత్వ, అటవీ భూములు, దేవాదాయ శాఖ భూములు ఉండడం, కృష్ణానది ఉండడంతో నీటి సమస్య లేకపోవడం, జాతీయ రహదారులు జిల్లాలో అధికంగా ఉండడం, విద్యుత్ సమస్య తీర్చే 1500 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, ప్రెవేట్ విద్యాసంస్థలు, గుంటూరు, విజయవాడల్లో ఏడు బోధనాసుపత్రులు, రెండు విశ్వవిద్యాలయాలు, సుమారు 60కి పైగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇలా అనేక అంశాల్లో ఇతర ప్రాంతాల కంటే జిల్లా అగ్రగామిగా ఉండడంతో రాజధానిగా బెజవాడనే ఎంపిక చేస్తారనే ప్రచారం బలంగా సాగుతోంది. రాజధాని కమిటీ సభ్యుడు రతన్‌రాయ్ కూడా విజయవాడ సమాచారాన్ని సమగ్రంగా సేకరించారు. జిల్లాలోని ఖాళీ భూముల వివరాలపై పూర్తిస్థాయిలో అధికారులను అడిగి తెలుసుకుని వాటి మ్యాప్‌లను కూడా తెప్పించుకుని పరిశీలించారు. గతంలో హైపర్ కమిటీ హనుమాన్‌జంక్షన్-ఏలూరు మధ్య సుమారు నాలుగు వేల ఎకరాల భూమి ఉందని, విమానాశ్రయానికి, జాతీయ రహదారులకు అతి సమీపంలో ఉండడంతో అనువుగా ఉంటుందని సూచించిన సంగతి తెలిసిందే. దీంతో కమిటీ జంక్షన్ ప్రాంతంలోనూ పర్యటించింది. ముసునూరు మండలంలో ఉన్న 5,600 ఎకరాల అటవీప్రాంత భూముల వివరాలను తహశీల్దార్ ద్వారా తెలుసుకుని నివేదికను స్వీకరించింది. అలాగే హైపర్ కమిటీ గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మాణానికి అనువుగా భూములు ఉన్నాయని గతంలో సూచించిన నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ గుంటూరుకు వెళుతూ మార్గం మధ్యలోని ఆ భూములనూ పరిశీలించింది. పుష్కలంగా భూములు కృష్ణా జిల్లాలో అటవీప్రాంతం అధికంగా ఉంది. జిల్లాలో రెండు లక్షల ఎకరాల అటవీభూములున్నాయి. వీటిలో 1.25 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం కాగా, 75 వేల ఎకరాల భూమి అటవీ శాఖ ఆధీనంలో ఉంది. దీంతోపాటు దేవాదాయ భూములు సుమారు 36.377 ఎకరాలు ఉన్నాయి. వేలాది ఎకరాల రెవెన్యూ భూమి ఉంది. ఇక్కడ కాకుండా మరెక్కడైనా రాజధాని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తే.. ఇక్కడే రాజధాని ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో పలు సంఘాలు ఉద్యమం కొనసాగించే దిశగా ఆలోచిస్తున్నాయి.