
సీమపై కుట్ర జరుగుతోంది
అఖిలపక్ష సమావేశంలో రైతు నేతలు
మైదుకూరు(చాపాడు):
‘ఒక్కప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిని పోగోట్టుకున్నాము.. ఇప్పుడేమో రాయలసీమకు తాగు, సాగు నీరిందించే శ్రీశైలం నికర జలాలను దక్కకుండా చేసేందుకు సీమపై కుట్ర జరుగుతోంది.. మనకు అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది.. ఉద్యమాలు చేసైనా సరే శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిపై మన హక్కును కాపాడుకోవాలి’.. అని రైతు నేతలు గళం విప్పారు. మైదుకూరు పట్టణంలోని జెడ్పీ హైస్కూలు ప్రాంగణంలో ఆదివారం రాయలసీమ సాగునీటి అవసరాల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టంపై అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు.
ప్రభుత్వం మోసం చేస్తోంది
- రాయలసీమ సాగునీటి సాధన
సమితి కన్వీనర్ లెక్కల వెంకటరెడ్డి శ్రీశైలం జలాశయంలో 107 జీఓ ప్రకారం 854 అడుగులకు నీటి మట్టం చేరుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణకు ఇచ్చే విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలని, లేకుంటే రాయలసీమ ఎండిపోతుందని తెలిసినా కూడా ప్రభుత్వం పోరాటం చేయకుండా మోసం చేస్తోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ లెక్కల వెంకటరెడ్డి విమర్శించారు.
గతంలో మన రాజధానిని పోగోట్టుకున్నామని, ఇదే క్రమంలో సాగునీటికి ఇబ్బంది వస్తుందని శ్రీశైలం నుంచి మనకు ఉత్పత్తి చేసే విద్యుత్‌ను కోల్పోయామని, ఇప్పుడేమో పూర్తిగా రాయలసీమను ఎడారిగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు మన ప్రభుత్వం సీమపై కుట్ర పన్నుతోందన్నారు. పోరాటాలు చే సైనా సరే మన హక్కును మనమే కాపాడుకోవాలన్నారు.
రాయలసీమను ప్రభుత్వం
పట్టించుకోవడం లేదు:
- వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాదరెడ్డి
శ్రీశైలం ప్రాజెక్టులో మనకు, తెలంగాణ రాష్ట్రానికి మధ్య ఏర్పడిన సమస్య విషయం మన ప్రభుత్వం రాయలసీమను పట్టించుకోవటం లేదని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 854 అడుగులకు పెంచుతూ 107 జీఓను తీసుకువచ్చార న్నారు. దీని ప్రకారం కేసీ కెనాల్‌కు సాగునీటి తర్వాతనే అత్యవసరమైతే సర్కాలు జిల్లాలకు తాగునీటిని, పంటలు ఎండితే సాగునీరు ఇవ్వొచ్చని జీఓలో పేర్కొన్నారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన కమిటీ కో-కన్వీనర్లు పోలు కొండారెడ్డి, వీరనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ మైదుకూరు మైనార్టీ నాయకుడు మదీనాదస్తగిరి, చాపాడుకు చెందిన సీవీ సుబ్బారెడ్డి, జిల్లా పసుపు రైతు సంఘం అధ్యక్షుడు గుండంరాజు సుబ్బయ్య, ప్రజాపక్షం నేత గోశెట్టి రమణయ్య, టీజీపీ పోరాట సమితి అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, మైదుకూరు రైతు నాయకుడు డీఎన్ నారాయణ, దండోరా నాయకుడు నాగయ్య, కేసీకెనాల్ సమితి ప్రెసిడెంటు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.