హుకుం జారీచేసిన హుదూద్ | Issued repeated Hudood | Sakshi
Sakshi News home page

హుకుం జారీచేసిన హుదూద్

Published Mon, Oct 20 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

హుకుం జారీచేసిన హుదూద్

హుకుం జారీచేసిన హుదూద్

ఆంధ్రప్రదేశ్ రాజధానికి విజయవాడ-గుంటూరు ప్రాంతాలు, ముఖ్యంగాఆ రెండు పట్టణాలూ ఎంత మాత్రం అనుకూలం కానివని ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు గుర్తించడం అవసరం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మంచిది.వందిమాగదుల మాటలకు విలువ ఇవ్వకుండా, ప్రభుత్వం మొండిపట్టు పట్టకుండా నిపుణులు సూచించినట్లు అన్నివిధాలా అనుకూలంగా, సముద్ర మట్టానికి 300-400 మీటర్ల ఎత్తులో ఉన్న దొనకొండ- వినుకొండ- బోళ్లపల్లి- మార్టూరు ప్రాంతాలలో కొత్త రాజధానికి హంగులు సమకూర్చుకోవడం అత్యంత అభిలషణీయంగా ఉంటుంది.
 
ప్రకృతి వైపరీత్యాలు రాజకీయ పాలకశక్తుల పతనానికి దారితీస్తాయి. ఆ పరిస్థితులలో విపత్తును తమకు అనుకూ లంగా మలుచుకోవాలని రాజకీయ నాయకులు తరచూ ప్రయత్నిస్తారు. ఈ తొక్కిసలాటలో పాలకులు తమ ప్రయోజనం కోసం అధికారగణంతో ఘర్షణకు దిగుతారు.

 - ప్రొఫెసర్ సి. రాఘవులు (డీన్ ఆఫ్ సోషల్ సెన్సైస్, రిటైర్డ్ డెరైక్టర్, విపత్తుల నివారణ అధ్యయన కేంద్రం, నాగార్జున విశ్వవిద్యాలయం) చెన్నైలో ఇచ్చిన ప్రసంగం (1994) నుంచి.

విపత్తుల తరువాత అలాంటి పరిస్థితులు తలెత్తకుం డా జాగ్రత్త పడడానికి నిపుణులు పాత, కొత్త నివేదికలలో పొందుపరిచిన సలహాలను పాటించడం పాలకులకే శ్రేయస్కరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలు రెండురకాలు: ఒకటి- రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపిక నిర్ణయం ఒక సంక్షోభ స్థాయికి చేరుకోవడం. రెండు- విభజన జరిగిన వెనువెంటనే కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రం ‘హుదూద్’ పెను తుపాను బారినపడటం. ఈ తుపాను నాలుగు జిల్లాలను, విశాఖ నగరం సహా పలు పట్టణాలను ఇప్పట్లో తేరుకోలేని విధంగా నష్టపరిచింది. ఈ రెండింటిలో ఒకటి మానవ కల్పితమైన వికారపు చేష్ట. ముఖ్యమంత్రి పదవుల వేటలో తెలుగుజాతిని యూపీఏ ప్రభుత్వం రెండుగా చీల్చింది. రెండవది, ప్రకృతి చేసిన విలయ తాండవం. నిజానికి పర్యావరణానికి మనిషి తలపెడుతున్న హాని కారణంగా ప్రకృతి వికటించిన ఫలితమిది.

తక్షణం గుర్తించవలసిన వాస్తవం

ప్రస్తుతం ఆ రెండు సమస్యల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజానీ కం నలిగిపోతున్నది. ప్రజలనూ, రాష్ట్రాన్నీ ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి ప్రతి ఒక్కరూ ఆలోచిం చాలి. విభజన తరువాత అధికారం చేపట్టిన పాలకులు దేనికోసమో ఉవ్విళ్లూరుతూ, తొందరపాటుతో విజయవా డ-గుంటూరులను కొత్త రాజధానిగా ప్రకటించారు. ఇవి జనంతో కిక్కిరిసి ఉండే నగరాలు. తీరా ప్రకటించిన తరు వాత గాని అసలు సమస్యలు తెలిసిరాలేదు. ఇలాంటి చోట రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో ఒక్కొక్కటిగా అనుభవానికి రావడం వెంటనే మొదలైంది. ఏదో రకంగా అధికారం చేపట్టగలిగామన్న ‘సంబడం’లో ఈ పాలకులు సమస్య ఆనుపానులను పట్టించుకోకుండా పక్కకు పెట్టేశారు. ప్రజాభిప్రాయాన్ని గాని, కొందరు చేసిన హెచ్చరికలను గాని పట్టించుకునే తీరిక వారికి లేకపోయింది. రాజధాని ఎంపిక మీద కేం ద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన సాధికారికి నివేదికలో ఏం చెప్పిందో తెలుసుకునే ఓపిక కూడా పాలకు లకు లోపించింది. ముందుగా తీసుకున్న నిర్ణయాన్నే అమ లుచేయడానికి ఒడిగట్టారు.
 
నిగ్గుతేలిన హెచ్చరికల స్వరూపం

ఈ సమస్యను అసలు శాసనసభలో చర్చకు కూడా రానీ యకుండా, శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన విలువైన సల హాలను ఏకపక్షంగా తోసిపుచ్చారు. కేంద్రంలో బీజేపీతో పొత్తు కలిపిన తెలుగుదేశం నిరంకుశ నిర్ణయాలకు అల వాటు పడి, ఇక్కడ శాసనసభలో విపక్షం గొంతు నొక్కే సింది. కానీ, ఆచరణ, అనుభవం ప్రకారం శివరామకృష్ణన్ చేసిన హెచ్చరికలు వాస్తవికమైనవేనని ఇప్పుడు రుజు వైంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దేశం మొత్తం మీద విపత్తులకు గురికావడానికి అత్యధిక అవకాశాలు ఉన్న రాష్ట్రాలలో ఒకటి ఆంధ్ర ప్రదేశ్. రాష్ట్రంలో ఎక్కువ భాగం తరచూ దుర్భిక్షానికి గుర వుతోంది. ఈ పరిస్థితిలో పట్టణ ప్రాంతాలకు నీటి భద్రత సమస్యగా మారిపోతోంది. ఇక గ్రామీణ ప్రాంత ప్రజానీ కం మీద దీని ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోస్తా ప్రాంతం తరచూ పెనుతుపానులకు గురవుతూ, ఆక స్మిక వరదల బారిన పడుతోంది. ప్రధాన నదులు ప్రవ హించే మార్గంలోనే జనావాసాలు ఉండడంతో ఈ సమస్య తప్పడం లేదు. భూకంపాలు తరచుగా రాకపోయినా, వచ్చినప్పుడు కోస్తాలోని ప్రధాన పట్టణ కేంద్రాలలో భవ నాలు కుదుపునకు గురవుతున్నాయి. ఈ తీవ్ర పరిణామా లకూ త్వరితగతిన జరుగుతున్న పట్టణ ప్రాంతాల విస్తర ణకూ సంబంధం ఉంది. వాతావరణ మార్పులు మున్ముం దు పెను తుపానులకు, వాటి విస్తరణకూ, ఫలితంగా సముద్రంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని శివరామకృష్ణన్ కమిటీ నిపుణులు పేర్కొన్నారు. అందువల్లనే ‘విజయ వాడ-గుంటూరు- మంగళగిరి- తెనాలి’, పరిసర ప్రాంతా లూ (వీజీఎంటీ) నూతన రాజధాని నిర్మాణానికి అనువై నవి కావని విస్పష్టంగా సలహా ఇచ్చింది.

అందరి మాటా అదే

 శివరామకృష్ణన్ నివేదికలోని ఈ అంశాలను జాతీయ స్థాయిలో ప్రణాళికా, భవన నిర్మాణ కేంద్రం (ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్) డెరైక్టర్ ఎన్.శ్రీధరన్ కూడా బలపరి చారు. ఏటా అక్టోబర్-నవంబర్ మాసాల్లో కోస్తాను పెను తుపానులు చుట్టుముట్టి భారీ ఎత్తున ధన, ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వానికి తీవ్ర సమస్యగా పరిణమించిందని (14-10-2014) పేర్కొనడం విశేషం! మొత్తం ఆంధ్ర కోస్తా అంతా పెనుతుపానులకు సంబం ధించినంత వరకు తీవ్రనష్టాలకు గురిచేసే మండలాల్లోనే విస్తరించి ఉందని నిపుణులు తాజాగా కూడా హెచ్చరిం చారు. ఈ దృష్ట్యానే శ్రీధరన్ ప్రస్తుత పట్టణాభివృద్ధి కేం ద్రాలు, తూర్పు కోస్తా ఆర్థిక లావాదేవీల నడవ (కారిడార్) సహా, ఇటు చెన్నై నుంచి అటు కోల్‌కతా వరకూ భారీ తుపానుల దెబ్బకు గురయ్యేంత సమీపంలో ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న తటస్థ మండలంలో 15 ప్రథమశ్రేణి పట్టణాలు, 15 ద్వితీయ శ్రేణి పట్టణాలు, 13 తృతీయ శ్రేణి, నాల్గవ స్థాయి పట్ట ణాలు ఉన్నాయి. హుదూద్ విలయం ముగిసిన వారం తరువాత కూడా కోస్తా ప్రాంతాలకు వాటిల్లిన కష్టనష్టాలు ఎంతటివో ఇప్పటికి స్పష్టం కాని పరిస్థితి. ప్రాణనష్టం నలుగురితో ఆగిందని మొదట్లో ఆ బాధ మధ్యనే తృప్తి పడ్డాం. రెండు రోజులకే ఆ సంఖ్య 43కి చేరుకోవడం, విశా ఖపట్టణానికి, యావత్తు ఉత్తర కోస్తా మూడు జిల్లాలకు, తూర్పు గోదావరి జిల్లాకు జరిగిన భారీ నష్టం రూ.70 వేల కోట్లని ముఖ్యమంత్రే ప్రకటించటమూ గమనార్హం!

ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి

ఈ పూర్వరంగంలో ఏపీ రాజధానికి విజయవాడ-గుంటూ రు ప్రాంతాలు, ముఖ్యంగా ఆ రెండు పట్టణాలూ ఎంత మాత్రం అనుకూలం కానివని ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు గుర్తించడం మంచిది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మంచిది. వందిమాగదుల మాటలకే విలువ ఇవ్వకుండా, మొండిపట్టు పట్టకుండా నిపుణులు సూచించినట్లు అన్ని విధాలా అనుకూలంగానూ, సముద్ర మట్టానికి 300-400 మీటర్ల ఎత్తులో ఉన్న దొనకొండ-వినుకొండ-బోళ్లపల్లి- మార్టూరు ప్రాంతాలలో కొత్త రాజధానికి హంగులు సమకూర్చుకోవడం అత్యంత అభిలషణీయంగా ఉంటుం ది. అందుకే రాజధానికి మూడు జోన్లతో పాటు, నాలుగు, ప్రాంతాలను శివరామకృష్ణన్ కమిటీ తుది నివేదికలో అనువైన, పరిశీలనార్హమైనవిగా ప్రతిపాదించింది. వాటిలో భాగంగా దొనకొండ ప్రాంతాలను కూడా చేర్చింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు సారవంతమైన వ్యవసాయ భూములకు ప్రసిద్ధి. అవి భారతదేశ ధాన్యాగా రాలలో విశిష్టమైనవి. కాబట్టి భూములను వ్యవసాయేతర పనులకు వినియోగించబోవటం ప్రజల ఆహార భద్రతకు చేటని కమిటీ అభిప్రా యపడింది.  
 
విజ్ఞత ప్రదర్శించాలి

 ఇంత వివరమైన హెచ్చరికల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పాలకుల పునరాలోచించకుండా ఇంకా ‘గుళ్లో ప్రదక్షిణలు’ మాదిరిగానే విజయవాడ-గుంటూరు ప్రాంతంలోనే రాజ ధాని నిర్మాణమంటూ మంకు పట్టు పడుతున్నారు. ఇందు కోసం భూములు ఇవ్వకపోతే ఆర్డినెన్స్ ద్వారానైనా రైతుల నుంచి గుంజుకుంటామని బెదిరింపులకు దిగడం సంస్కా రమూ కాదు, క్షంతవ్యమూ కాదు. రాజధాని ఎంపికపై కమిటీ నిపుణులు చేసిన ప్రతిపాదనలు సలహాలు మాత్ర మే, వాటిని రాష్ర్ట ప్రభుత్వం తలదాల్చవలసిన అవసరం లేదని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల ఇప్పటికీ మోరాయి స్తున్నారు. శివరామకృష్ణన్ నివేదిక బయటకు వచ్చిన తరు వాత కూడా తనకు ఏ నివేదికా అందలేదని సీఎం కోత కోస్తూవచ్చారు. నిజానికి పాలకులు వినమ్రతతో మెలగి రాష్ట్ర రాజధాని ఎంపిక నిర్ణయాన్ని పునరాలోచించక తప్ప ని పరిస్థితులను ‘హుదూద్’ సృష్టించింది. ఇలాంటి నిరం తర సంక్షోభం, సంకటాలకు రాష్ట్ర ప్రజలను వదిలిపెట్ట కుండా ప్రకటించిన నిర్ణయం గురించి పాలకులు పునరా లోచించడం మంచిది. నిపుణులు చేసిన హెచ్చరికలే నేడు వాస్తవంగా కళ్ల ముందు నిలిచాయని పాలకులు గుర్తించి విజ్ఞతతో మెలగాలనీ, తెలివి తెచ్చుకోవాలనీ ఆశిద్దాం. అంతేగాని ‘కరువునొక్క దాసరి’ అన్నట్టుగా ఈ పాలకుల పాలనా కాలం కరువుతో ప్రారంభమై, కరువు భారంతో సాగి, కరువు బాధతోనే ముగిసిపోకూడదు.    
 
 ఏబీకే ప్రసాద్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement