Prasad ABK
-
ఏబీకేకు ‘వైఎస్సార్ పురస్కారం’
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌కు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ప్రదానం చేశారు. ఏబీకేను శాలువాతో సత్కరించి రూ.10 లక్షల చెక్కు, వైఎస్సార్ జ్ఞాపికను అందజేశారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. గత నవంబర్ 1న విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన డాక్టర్ వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారం ప్రదాన కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల ఏబీకే హాజరుకాలేకపోయారు. అయినప్పటికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీచేసి తనకు ఈ పురస్కారాన్ని అందజేయడంపట్ల ఏబీకే సంతోషం వ్యక్తం చేశారు. ఇది పత్రికారంగంలో పనిచేసిన, చేస్తున్న తన సహచరులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పురస్కారం తన చేతుల మీదుగా ఏబీకేకు అందించడం అదృష్టంగా భావిస్తున్నట్టు అమర్ అన్నారు. ఆయన కాలమ్స్ పాఠకులను ఆలోచింపజేస్తున్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు, విశాలాంధ్ర సంపాదకుడు ఆర్వీ రామారావు, చరిత్ర పరిశోధకుడు శివనాగిరెడ్డి, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. -
హుకుం జారీచేసిన హుదూద్
ఆంధ్రప్రదేశ్ రాజధానికి విజయవాడ-గుంటూరు ప్రాంతాలు, ముఖ్యంగాఆ రెండు పట్టణాలూ ఎంత మాత్రం అనుకూలం కానివని ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు గుర్తించడం అవసరం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మంచిది.వందిమాగదుల మాటలకు విలువ ఇవ్వకుండా, ప్రభుత్వం మొండిపట్టు పట్టకుండా నిపుణులు సూచించినట్లు అన్నివిధాలా అనుకూలంగా, సముద్ర మట్టానికి 300-400 మీటర్ల ఎత్తులో ఉన్న దొనకొండ- వినుకొండ- బోళ్లపల్లి- మార్టూరు ప్రాంతాలలో కొత్త రాజధానికి హంగులు సమకూర్చుకోవడం అత్యంత అభిలషణీయంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు రాజకీయ పాలకశక్తుల పతనానికి దారితీస్తాయి. ఆ పరిస్థితులలో విపత్తును తమకు అనుకూ లంగా మలుచుకోవాలని రాజకీయ నాయకులు తరచూ ప్రయత్నిస్తారు. ఈ తొక్కిసలాటలో పాలకులు తమ ప్రయోజనం కోసం అధికారగణంతో ఘర్షణకు దిగుతారు. - ప్రొఫెసర్ సి. రాఘవులు (డీన్ ఆఫ్ సోషల్ సెన్సైస్, రిటైర్డ్ డెరైక్టర్, విపత్తుల నివారణ అధ్యయన కేంద్రం, నాగార్జున విశ్వవిద్యాలయం) చెన్నైలో ఇచ్చిన ప్రసంగం (1994) నుంచి. విపత్తుల తరువాత అలాంటి పరిస్థితులు తలెత్తకుం డా జాగ్రత్త పడడానికి నిపుణులు పాత, కొత్త నివేదికలలో పొందుపరిచిన సలహాలను పాటించడం పాలకులకే శ్రేయస్కరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలు రెండురకాలు: ఒకటి- రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపిక నిర్ణయం ఒక సంక్షోభ స్థాయికి చేరుకోవడం. రెండు- విభజన జరిగిన వెనువెంటనే కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రం ‘హుదూద్’ పెను తుపాను బారినపడటం. ఈ తుపాను నాలుగు జిల్లాలను, విశాఖ నగరం సహా పలు పట్టణాలను ఇప్పట్లో తేరుకోలేని విధంగా నష్టపరిచింది. ఈ రెండింటిలో ఒకటి మానవ కల్పితమైన వికారపు చేష్ట. ముఖ్యమంత్రి పదవుల వేటలో తెలుగుజాతిని యూపీఏ ప్రభుత్వం రెండుగా చీల్చింది. రెండవది, ప్రకృతి చేసిన విలయ తాండవం. నిజానికి పర్యావరణానికి మనిషి తలపెడుతున్న హాని కారణంగా ప్రకృతి వికటించిన ఫలితమిది. తక్షణం గుర్తించవలసిన వాస్తవం ప్రస్తుతం ఆ రెండు సమస్యల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజానీ కం నలిగిపోతున్నది. ప్రజలనూ, రాష్ట్రాన్నీ ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి ప్రతి ఒక్కరూ ఆలోచిం చాలి. విభజన తరువాత అధికారం చేపట్టిన పాలకులు దేనికోసమో ఉవ్విళ్లూరుతూ, తొందరపాటుతో విజయవా డ-గుంటూరులను కొత్త రాజధానిగా ప్రకటించారు. ఇవి జనంతో కిక్కిరిసి ఉండే నగరాలు. తీరా ప్రకటించిన తరు వాత గాని అసలు సమస్యలు తెలిసిరాలేదు. ఇలాంటి చోట రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో ఒక్కొక్కటిగా అనుభవానికి రావడం వెంటనే మొదలైంది. ఏదో రకంగా అధికారం చేపట్టగలిగామన్న ‘సంబడం’లో ఈ పాలకులు సమస్య ఆనుపానులను పట్టించుకోకుండా పక్కకు పెట్టేశారు. ప్రజాభిప్రాయాన్ని గాని, కొందరు చేసిన హెచ్చరికలను గాని పట్టించుకునే తీరిక వారికి లేకపోయింది. రాజధాని ఎంపిక మీద కేం ద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన సాధికారికి నివేదికలో ఏం చెప్పిందో తెలుసుకునే ఓపిక కూడా పాలకు లకు లోపించింది. ముందుగా తీసుకున్న నిర్ణయాన్నే అమ లుచేయడానికి ఒడిగట్టారు. నిగ్గుతేలిన హెచ్చరికల స్వరూపం ఈ సమస్యను అసలు శాసనసభలో చర్చకు కూడా రానీ యకుండా, శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన విలువైన సల హాలను ఏకపక్షంగా తోసిపుచ్చారు. కేంద్రంలో బీజేపీతో పొత్తు కలిపిన తెలుగుదేశం నిరంకుశ నిర్ణయాలకు అల వాటు పడి, ఇక్కడ శాసనసభలో విపక్షం గొంతు నొక్కే సింది. కానీ, ఆచరణ, అనుభవం ప్రకారం శివరామకృష్ణన్ చేసిన హెచ్చరికలు వాస్తవికమైనవేనని ఇప్పుడు రుజు వైంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దేశం మొత్తం మీద విపత్తులకు గురికావడానికి అత్యధిక అవకాశాలు ఉన్న రాష్ట్రాలలో ఒకటి ఆంధ్ర ప్రదేశ్. రాష్ట్రంలో ఎక్కువ భాగం తరచూ దుర్భిక్షానికి గుర వుతోంది. ఈ పరిస్థితిలో పట్టణ ప్రాంతాలకు నీటి భద్రత సమస్యగా మారిపోతోంది. ఇక గ్రామీణ ప్రాంత ప్రజానీ కం మీద దీని ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోస్తా ప్రాంతం తరచూ పెనుతుపానులకు గురవుతూ, ఆక స్మిక వరదల బారిన పడుతోంది. ప్రధాన నదులు ప్రవ హించే మార్గంలోనే జనావాసాలు ఉండడంతో ఈ సమస్య తప్పడం లేదు. భూకంపాలు తరచుగా రాకపోయినా, వచ్చినప్పుడు కోస్తాలోని ప్రధాన పట్టణ కేంద్రాలలో భవ నాలు కుదుపునకు గురవుతున్నాయి. ఈ తీవ్ర పరిణామా లకూ త్వరితగతిన జరుగుతున్న పట్టణ ప్రాంతాల విస్తర ణకూ సంబంధం ఉంది. వాతావరణ మార్పులు మున్ముం దు పెను తుపానులకు, వాటి విస్తరణకూ, ఫలితంగా సముద్రంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని శివరామకృష్ణన్ కమిటీ నిపుణులు పేర్కొన్నారు. అందువల్లనే ‘విజయ వాడ-గుంటూరు- మంగళగిరి- తెనాలి’, పరిసర ప్రాంతా లూ (వీజీఎంటీ) నూతన రాజధాని నిర్మాణానికి అనువై నవి కావని విస్పష్టంగా సలహా ఇచ్చింది. అందరి మాటా అదే శివరామకృష్ణన్ నివేదికలోని ఈ అంశాలను జాతీయ స్థాయిలో ప్రణాళికా, భవన నిర్మాణ కేంద్రం (ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్) డెరైక్టర్ ఎన్.శ్రీధరన్ కూడా బలపరి చారు. ఏటా అక్టోబర్-నవంబర్ మాసాల్లో కోస్తాను పెను తుపానులు చుట్టుముట్టి భారీ ఎత్తున ధన, ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వానికి తీవ్ర సమస్యగా పరిణమించిందని (14-10-2014) పేర్కొనడం విశేషం! మొత్తం ఆంధ్ర కోస్తా అంతా పెనుతుపానులకు సంబం ధించినంత వరకు తీవ్రనష్టాలకు గురిచేసే మండలాల్లోనే విస్తరించి ఉందని నిపుణులు తాజాగా కూడా హెచ్చరిం చారు. ఈ దృష్ట్యానే శ్రీధరన్ ప్రస్తుత పట్టణాభివృద్ధి కేం ద్రాలు, తూర్పు కోస్తా ఆర్థిక లావాదేవీల నడవ (కారిడార్) సహా, ఇటు చెన్నై నుంచి అటు కోల్‌కతా వరకూ భారీ తుపానుల దెబ్బకు గురయ్యేంత సమీపంలో ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న తటస్థ మండలంలో 15 ప్రథమశ్రేణి పట్టణాలు, 15 ద్వితీయ శ్రేణి పట్టణాలు, 13 తృతీయ శ్రేణి, నాల్గవ స్థాయి పట్ట ణాలు ఉన్నాయి. హుదూద్ విలయం ముగిసిన వారం తరువాత కూడా కోస్తా ప్రాంతాలకు వాటిల్లిన కష్టనష్టాలు ఎంతటివో ఇప్పటికి స్పష్టం కాని పరిస్థితి. ప్రాణనష్టం నలుగురితో ఆగిందని మొదట్లో ఆ బాధ మధ్యనే తృప్తి పడ్డాం. రెండు రోజులకే ఆ సంఖ్య 43కి చేరుకోవడం, విశా ఖపట్టణానికి, యావత్తు ఉత్తర కోస్తా మూడు జిల్లాలకు, తూర్పు గోదావరి జిల్లాకు జరిగిన భారీ నష్టం రూ.70 వేల కోట్లని ముఖ్యమంత్రే ప్రకటించటమూ గమనార్హం! ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి ఈ పూర్వరంగంలో ఏపీ రాజధానికి విజయవాడ-గుంటూ రు ప్రాంతాలు, ముఖ్యంగా ఆ రెండు పట్టణాలూ ఎంత మాత్రం అనుకూలం కానివని ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు గుర్తించడం మంచిది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మంచిది. వందిమాగదుల మాటలకే విలువ ఇవ్వకుండా, మొండిపట్టు పట్టకుండా నిపుణులు సూచించినట్లు అన్ని విధాలా అనుకూలంగానూ, సముద్ర మట్టానికి 300-400 మీటర్ల ఎత్తులో ఉన్న దొనకొండ-వినుకొండ-బోళ్లపల్లి- మార్టూరు ప్రాంతాలలో కొత్త రాజధానికి హంగులు సమకూర్చుకోవడం అత్యంత అభిలషణీయంగా ఉంటుం ది. అందుకే రాజధానికి మూడు జోన్లతో పాటు, నాలుగు, ప్రాంతాలను శివరామకృష్ణన్ కమిటీ తుది నివేదికలో అనువైన, పరిశీలనార్హమైనవిగా ప్రతిపాదించింది. వాటిలో భాగంగా దొనకొండ ప్రాంతాలను కూడా చేర్చింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు సారవంతమైన వ్యవసాయ భూములకు ప్రసిద్ధి. అవి భారతదేశ ధాన్యాగా రాలలో విశిష్టమైనవి. కాబట్టి భూములను వ్యవసాయేతర పనులకు వినియోగించబోవటం ప్రజల ఆహార భద్రతకు చేటని కమిటీ అభిప్రా యపడింది. విజ్ఞత ప్రదర్శించాలి ఇంత వివరమైన హెచ్చరికల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పాలకుల పునరాలోచించకుండా ఇంకా ‘గుళ్లో ప్రదక్షిణలు’ మాదిరిగానే విజయవాడ-గుంటూరు ప్రాంతంలోనే రాజ ధాని నిర్మాణమంటూ మంకు పట్టు పడుతున్నారు. ఇందు కోసం భూములు ఇవ్వకపోతే ఆర్డినెన్స్ ద్వారానైనా రైతుల నుంచి గుంజుకుంటామని బెదిరింపులకు దిగడం సంస్కా రమూ కాదు, క్షంతవ్యమూ కాదు. రాజధాని ఎంపికపై కమిటీ నిపుణులు చేసిన ప్రతిపాదనలు సలహాలు మాత్ర మే, వాటిని రాష్ర్ట ప్రభుత్వం తలదాల్చవలసిన అవసరం లేదని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల ఇప్పటికీ మోరాయి స్తున్నారు. శివరామకృష్ణన్ నివేదిక బయటకు వచ్చిన తరు వాత కూడా తనకు ఏ నివేదికా అందలేదని సీఎం కోత కోస్తూవచ్చారు. నిజానికి పాలకులు వినమ్రతతో మెలగి రాష్ట్ర రాజధాని ఎంపిక నిర్ణయాన్ని పునరాలోచించక తప్ప ని పరిస్థితులను ‘హుదూద్’ సృష్టించింది. ఇలాంటి నిరం తర సంక్షోభం, సంకటాలకు రాష్ట్ర ప్రజలను వదిలిపెట్ట కుండా ప్రకటించిన నిర్ణయం గురించి పాలకులు పునరా లోచించడం మంచిది. నిపుణులు చేసిన హెచ్చరికలే నేడు వాస్తవంగా కళ్ల ముందు నిలిచాయని పాలకులు గుర్తించి విజ్ఞతతో మెలగాలనీ, తెలివి తెచ్చుకోవాలనీ ఆశిద్దాం. అంతేగాని ‘కరువునొక్క దాసరి’ అన్నట్టుగా ఈ పాలకుల పాలనా కాలం కరువుతో ప్రారంభమై, కరువు భారంతో సాగి, కరువు బాధతోనే ముగిసిపోకూడదు. ఏబీకే ప్రసాద్ -
ప్రకృతికి సెగ, తుపాన్ల పగ
వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదన్న సామెతకు కాలం చెల్లిపోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పురోగమించింది. ఇదిప్రకృతి విలయాలూ, ఉపద్రవాలూ, వాటితో జరిగే విధ్వంసాలనూ కొన్ని రోజుల ముందుగానే పసికట్టి హెచ్చరికలు చేయగలుగుతోంది. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, అది హెచ్చరించగలదే కానీ, బాధిత ప్రజలను ఒడ్డున పడవేసే చైతన్యాన్ని కలిగించలేదు. ఆ పని మానవ చైతన్యంతోనే సాధ్యం. ఇదే ఆ హెచ్చరికలకు ఆచరణలో విలువను సమకూరుస్తుంది. తూర్పు కోస్తాతీరంలోని ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల రూపురేఖలను హుదూద్ సర్వ నాశనం చేసింది. విశాఖ పట్నం దగ్గర తీరం దాటి, ఆ నగరానికి పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ రెండు రాష్ట్రాలలో జన జీవనాన్నీ, గ్రామా లనూ, అన్ని రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలను (రోడ్డు, రైల్వే మార్గాలు సహా) ఛిన్నాభిన్నం చేసింది. లక్షల ఎక రాలలో రకరకాల పంటలను నేలమట్టం చేసింది. భారత నావికా వ్యవస్థలో కీలకమైన ఈస్ట్రన్ నావెల్ కమాండ్‌కు కీలకంగా ఉన్న నగరం విశాఖ. ఆ నగర సౌందర్యం తుపా ను విలయంలో ధ్వంసమైంది. ఒక శాడిస్టు మనోవికా రంతో హుదూద్ అక్కడే తీరం దాటింది. మరో తుపాను పొంచి ఉందా? గత సంవత్సరం ఇదే అక్టోబర్‌లో కోస్తాను అతలాకుతలం చేసిన ‘పైలీన్’ బీభత్సం కన్నా ఎన్నో రెట్లు బీభత్సాన్ని నిన్నటి హుదూద్ సృష్టించింది. విషాదం ఏమిటంటే హుదూద్ విసిరిన గాలులు పెట్టిన ఘోష సైతం ఇంకా ప్రజలకు మరపునకు రాలేదు. కానీ మరో దుర్వార్త అప్పు డే సిద్ధమైపోయింది. కొద్దిరోజులలోనే- బహుశా ఈ నెలా ఖరులో లేదా నవంబర్ ఒకటో తేదీ సమీపంలోనో మరో పెను తుపాను పట్టవచ్చునని, అది ఉత్తరాంధ్రప్రదేశ్- చెన్నై కోస్తా వైపుగా దూసుకొచ్చే అవకాశం ఉందని ‘నాసా’(అమెరికా)కు చెందిన, జపాన్‌కు చెందిన శాస్త్ర వేత్తలు కొందరు అంచనా వేస్తున్నారు. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ తుపాను పంజా విసరవచ్చు. లేదా తప్పి పోనూ వచ్చు. ఇది కూడా అండమాన్ దీవులలోనే తలెత్తే అవకాశం ఉందని వారి ఊహ. హుదూద్ అడుగుజాడలలో... ఆసియాను ముమ్మరించిన రెండు పెను తుపానులలో హుదూద్ ఒకటి. దీని ఫలితాన్ని చూశాం. మరొకటి వొంగ్ఫాంగ్. ఇది జపాన్ దిశగా కదులుతున్న విలయం. హుదూద్ మాదిరిగానే ఇది కూడా గంటలకు 180 కిలో మీటర్ల వేగంతో వీచే గాలులను మూట కట్టుకుని బయలు దేరింది. జపాన్‌లోని ఒకినావా నగరాన్ని గాలిదుమా రంతో, భారీ వర్షంతో ముంచెత్తింది. ఇక్కడితో తన ప్రతాపాన్ని చాలించకుండా జపాన్లోదే కియుషీ దీవిని కూడా కబళించనున్నదని అంచనా. అందుకే ముందస్తు చర్యగా అధికార యంత్రాంగం అక్కడ నివసించే లక్షన్నర జనాభాను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఇది కూడా హుదూద్ అడుగుజాడలలోనే ఆదివారమే తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో హుదూద్ తాకిడికి గుర య్యే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలలో తుపాను కారణంగా కోటిన్నర జనాభా అన్నపానీయాలు లేకుండా బితుకుబితుకు మం టూ బతికారు. అనేక ఇక్కట్లకు గురయ్యారు. అన్నింటి కన్నా విచిత్రం ఏమిటంటే- ఇంతవరకు నమోదైన చరి త్రను బట్టి భారత ఉపఖండంలో 35 రాకాసి తుపానులు సంభవించాయి. అందులో 27 భీకర తుపానులకు బంగా ళాఖాతమే పురుడుపోసింది. అందుకే హిందూ మహా సముద్రం ఉష్టమండల తుపానులకు కేంద్ర స్థానమైందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అలాగే పైలీన్ లేదా, హుదూ ద్, ఈ రెండూ కూడా గత పదేళ్ల నుంచి పర్యావరణంలో, వాతావరణంలో కలుగుతున్న మార్పుల ఫలితాలేనని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. హుదూద్ అంటే ఇజ్రాయెల్ జాతీ య పక్షి పేరు. ఈ తుపానుకు ఒమన్ ప్రభుత్వం ఈ పేరు పెట్టింది. పరిజ్ఞానం ప్రయోజనం ఎప్పుడు? వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదన్న సామె తకు కాలం చెల్లిపోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పురోగమించింది. ఇదిప్రకృతి విలయాలూ, ఉప ద్రవాలూ, వాటితో జరిగే విధ్వంసాలనూ కొన్ని రోజుల ముందుగానే పసిగట్టి హెచ్చరికలు చేయగలుగుతోంది. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, అది హెచ్చరించగ లదే కానీ, బాధిత ప్రజలను ఒడ్డున పడవేసే చైతన్యాన్ని కలిగించలేదు. ఆ పని మానవ చైతన్యంతోనే సాధ్యం. ఇదే ఆ హెచ్చరికలకు ఆచరణలో విలువను సమకూరుస్తుంది. హుదూద్ విజృంభించబోతున్న సంగతి తెలిసిన తరువాత ఈ పనిని సైనిక, నావికా దళాలు చేపట్టాయి. రంగంలోకి దిగి వెళ్లగలిగినంత మేర చొచ్చుకుపోయి జనాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. నిజానికి ఇలాంటి విపత్తుల నుంచి కాపాడేందుకు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు (డిజాస్టర్ మేనేజ్మెంట్) లేకపోలేదు. ప్రాణనష్టం జరగకుండా లేదా ఆ నష్టాన్ని బాగా తగ్గించడానికి, ఆస్తినష్టం జరగకుండా చూడడానికి ఈ వ్యవస్థలు రూపొందించిన పథకాలకు కూడా కొరతలేదు. కానీ ఆ వ్యవస్థలు పలు సందర్భాలలో ఎందుకు సకాలంలో స్పందించడం లేదు? ప్రభుత్వాలకు, అధికారులకు పాలనానుభవం ఉన్నప్పటికీ ప్రజానీకం అం టే శ్రద్ధాసక్తులు లేనందుకే కొన్ని లోటుపాట్లు జరుగుతు న్నాయి. ప్రజా సంక్షేమం బాధ్యత నుంచి తప్పించుకునే సంస్కృతికి అలవాటు పడడం వల్ల, విపత్తుల నుంచి బయటపడగల వ్యూహరచన కొరవడినందు వల్లనే తగ్గిం చుకోగల నష్టాల పైనా కష్టాల పైనా దృష్టి సారించడం లేదు. జాతీయ విపత్తుల నివారణ ప్రాధికార వ్యవస్థను 2006లో ఏర్పాటు చేశారు. తరువాత క్రమంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఉపగ్రహ వ్యవస్థ జాతీయంగా కూడా నిలదొక్కుకుంటున్న కొద్దీ మన వాతావరణ శాస్త్ర వేత్తలు ప్రమాద హెచ్చరికలను ముందుగానే విడుదల చేయగలుగుతున్నారు. ఇంతకు ముందున్న పరిస్థితి వేరు. 1977 నాటి దివిసీమ రాకాసి తుపాను వల్ల జరిగిన భారీ ప్రాణనష్టం (10,000) గురించి, ముంచుకొస్తున్న ఆ తుపా ను గురించి ‘నాసా’(అమెరికా) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తే తప్ప మనకు తెలియలేదు. పెరుగుతున్న తుపాను ముప్పు బంగాళాఖాతం భారీ తుపానులకు నిలయంగా మారింది. అందులో పుట్టిన తుపానులు తూర్పు కోస్తాను అతలాకు తలం చేస్తున్నాయి. 1891-1977 మధ్య బంగాళాఖాతం లో 400 తుపానులు జనించాయి. అలాగే 1891-1969 మధ్య వచ్చిన 453 తుపానులకు ఈ తీరమే కారణమైనట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 1891ను ఎందుకు మైలురా యిగా తీసుకున్నారంటే, ఆ సంవత్సరమే బందరు (మచి లీపట్నం)మీద ఘోర తుపాను పడగ విప్పింది. పట్టణ వీధులన్నీ జలమయం కావడంతో బాధితులను పడవల మీద తరలించవలసి వచ్చింది. దాదాపు అంతటి ఘోర మైన తుపానులను చవిచూసిన అనుభవం నెల్లూరు, చీరాల పట్టణాలకు కూడా ఉందని రికార్డులు వెల్ల డిస్తున్నాయి. 1969 నాటి నెల్లూరు పెను తుపాను తరు వాతనే మిటిగేషన్ కమిటీ ఉనికిలోకి వచ్చింది. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలను సూచించ డమే ఈ కమిటీ ధ్యేయం. మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. తుపాను బీభత్సం మరింత తీవ్రం కానున్న దని 1980లోనే అంచనా వేశారు. బీభత్సం పెరిగే కొద్దీ ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా పెరిగిపోతాయి. అందుచేత ప్రభుత్వ వ్యవస్థలు ముందస్తు జాగ్రత్తతోనే నివారణ చర్య లను బహుముఖంగా చేపట్టాలని, చావు నెత్తి మీదకు వచ్చే వరకు వేచి ఉండరాదని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచా ర్యుడు సీవీ రాఘవులు ఒక అధ్యయన పత్రంలో స్పష్టం చేశారు. 1979 నాటి ఘోర తుపాను తరువాత ఆయన ఈ పత్రాన్ని రూపొందించారు. అతివృష్టి-అనావృష్టి తుపానులు కోస్తా ఆర్థిక వ్యవస్థను దఫదఫాలుగా నాశనం చేస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు రాయలసీమ వర్షాభా వ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు 12 శాతం తగ్గిపోయాయి. ఒక్క తెలంగాణలోనే వర్షపాతం 30 శాతం తగ్గింది. నిజానికి కడచిన దశాబ్దంగా దేశంలో వర్షపాతం తక్కువై వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని భారత ఉష్టమండల వాతావ రణ సంస్థ (పుణే) మాజీ సంచాలకుడు బీఎన్ గోస్వామి అంచనా వేశారు. దీని ప్రభావం ధాన్యం ఉత్పత్తి పైన, సగటు జాతీయోత్పత్తులపైనా కూడా ఉండబోతోంది. పర్యావరణంలో మార్పులతోను, పసిఫిక్ సముద్ర ప్రాం తంలో పుట్టి పెరుగుతున్న ఎల్-నినో, లానినో వాతావరణ వ్యవస్థల వల్ల తుపానులు, అతివృష్టి, అనావృష్టి ఏర్పడు తున్నాయి. ఇండియాలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రపం చ పర్యావరణం వేడెక్కి పోవడం కూడా కారణమేనని, ఈ పరిణామంతో వాతావరణంలో ఆవిరి పెరిగిపోతోందని ప్రొఫెసర్ గోస్వామి అంచనా. ఒకటి వాస్తవం- ‘మట్టి ఎప్పటికప్పుడు కలవరిస్తుంటుంది/ వాన నీటి స్పర్శ కోసం’ అన్న సహజ సూత్రాన్ని మరచిపోరాదు. ఏబీకే ప్రసాద్ -
నైతిక విలువలకు నీరాజనం!
జయలలిత మాదిరిగానే ఈ దేశంలో పాలనకు అనర్హులయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. అందుకే కాస్త ఆలస్యంగానే అయినా, కొద్ది రోజుల క్రితం దేశ అత్యున్నత స్థానం ఇచ్చిన తీర్పును గుర్తు చేసుకోవాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం (ఆగస్ట్ 27, 2014) ఇచ్చిన ఆ తీర్పు విశిష్టమైనది. చరిత్రాత్మకమైనది. అధికారిక స్థానాలలో అవినీతికి ఆలవాలమైన, ఆర్థిక గూండాయిజం కన్నా ఈ దేశంలోని ‘మేధావి’ గుడ్డిలో మెల్లలాగా కొంత మెరుగు. సోమనాథ్ చటర్జీ (లోక్‌సభ మాజీ సభాపతి, ఆగస్ట్ 23, 1995) ‘పట్టుకో పట్టుకోమనేవాడే గానీ, పట్టుకున్నవాడు ఒక్కడూ లేడు’ అని సామెత. ఒకవేళ పట్టుబడవలసిన వాళ్లు పట్టుబడితే అనేక రకాల వలస ప్రభుత్వ చట్టాలతో కుదిరిన ‘వియ్యం’ తరువాత ఆ అవకాశవాద చట్టాల ఆధారంగా రూపొందించిన భారత రాజ్యాంగ వ్యవస్థ కింద పనిచేస్తున్న పాలక వ్యవస్థలు ఎలా అవినీతిమయంగా వ్యవహరిస్తాయో 65 ఏళ్ల రాజకీయ స్వాతంత్య్రం నిరూపించింది. ఏమున్నది గర్వకారణం? 1947 తరువాత, తొలి దశాబ్దంలో కొంత మినహా, మిగిలిన యాభైఅయిదేళ్ల కాలాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ‘దేశంలో చిట్టచివరి పేదజీవి కూడా దారిద్య్రం బాధ నుంచి, పీడన నుంచి విముక్తి పొందేవరకు స్వాతంత్య్రం వచ్చినట్టు కాదు’ అన్న జాతిపిత గాంధీ మాట ఎంత దూరదృష్టి గలదో దేశ ప్రజలు ఆలోచించుకోవలసిన దశలోకి ప్రవేశించారనిపిస్తుంది. ఆరు దశాబ్దాల కాలంలోనే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎంతో చేటు జరిగింది. ఎన్నికలలో మోసాలు, అవినీతి కారణంగా సివిల్, క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ఎంపీలు దాదాపు 200 మందికి పైగానే ఉన్నారని ఇటీవలి సర్వేలలో తేలింది. వీరిలో ప్రధానులు, మంత్రుల స్థాయి వారు కూడా ఉన్నారు. పక్షపాత రాజకీయాలలో భాగంగా మైనారిటీలపైన జరిపిన హత్యాకాండతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు కూడా ఉన్నారు. ఇలాంటి వారు అన్ని పార్టీలలోను ఉన్నారు. అవినీతి సామ్రాజ్ఞి ఈ పూర్వరంగం నుంచి చూస్తే తమిళనాడుకు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత కూడా కనిపిస్తారు. ఇంతకు ముందు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి కూడా ఇందుకు మినహాయింపు కాదు. జయలలిత అవినీతి ఆరోపణల కేసు విచారణ పూర్తి కావడానికి 18 ఏళ్లు పట్టింది. విచారణ ప్రహసనంలో 259 మంది సాక్షులను విచారించారు (వీరిలో కొందరు తరువాత జారుకున్నారు. ఆమె తరఫున డిఫెన్స్ సాక్షులుగా 99 మంది ఉన్నారు.) మద్రాసు హైకోర్టు, మరికొన్ని కింది కోర్టులు ఆమెపై నమోదైన కొన్ని కేసులను కొట్టివేశాయి. మిగిలినవి చివరికి మద్రాస్ నుంచి బెంగళూరులో ఏర్పాటు చేసిన జడ్జి జాన్ మైఖేల్ డి కున్హా ప్రత్యేక న్యాయస్థానానికి చేరుకున్నాయి. సాక్ష్యాలకు సంబంధించిన 1,066 పత్రాలను, 2,341 అనుబంధ (ఎగ్జిబిట్) పత్రాలను పరిశీలించి జస్టిస్ కున్హా సెప్టెంబర్ 27న తీర్పు వెలువరించారు. న్యాయమూర్తి జయలలితకు భారీ శిక్షే విధించారు. ఆమె అధికారంలో ఉండగా జరిగిన రూ.65 కోట్ల రూపాయల అవినీతి కుంభకోణానికి రూ.100 కోట్లు జరిమానా విధించారు. జైలుకు పంపారు. ఈ తీర్పుతో జయలలిత తన శాసనసభ్యత్వాన్నీ, తద్వారా ముఖ్యమంత్రి పదవినీ కోల్పోయారు. అంతేకాదు, పదేళ్ల వరకు (ఇక్కడ చెన్నారెడ్డి ఎన్నిక చెల్లక ఆరేళ్లపాటు ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హుడైనట్టు) ఆమె ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హురాలవుతారు. ఇలా ఇంకెందరో? జయలలిత మాదిరిగానే ఈ దేశంలో పాలనకు అనర్హులయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. అందుకే కాస్త ఆలస్యంగానే అయినా, కొద్ది రోజుల క్రితం దేశ అత్యున్నత స్థానం ఇచ్చిన తీర్పును గుర్తు చేసుకోవాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం (ఆగస్ట్ 27, 2014) ఇచ్చిన ఆ తీర్పు విశిష్టమైనది. చరిత్రాత్మకమైనది. అవినీతిపరులైన రాజకీయ పాలకులకూ, చట్టసభల సభ్యులకు, అధికార గణాలకు నసాళానికి అంటే విధంగా వెలువడిన తీర్పు ఇది. గత ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన ప్రధానులు, ప్రభుత్వాలలో భాగస్వాములైన మంత్రులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు, లెజిస్లేటర్లు ఈ తీర్పు పరిధిలోకి రారని చెప్పలేం. నిజానికి ప్రత్యేక కోర్టులో జడ్జి కున్హా చెప్పిన తీర్పు కన్నా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. ఎం.లోధా అధ్యక్షతన ధర్మాసనం తాజాగా ఇచ్చిన తీర్పు విస్తృతిలో ఎంతో పెద్దది. దేశ వ్యాప్తంగా వర్తించగలిగేది. అన్ని నైతిక విలువలను పాతిపెట్టి పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు ఏ విధంగా ఎన్నికలలో, పాలనలో క్రిమినల్ చర్యలకు తెగబడ్డారో ఇంతకు ముందు అనేక కమిషన్లూ, కమిటీలూ వెల్లడించాయి. కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రులు ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డారో కూడా ఆయా సంఘాలు నిర్ధారించాయి. ఈ కమిటీలు, కమిషన్లతో పాటు లా కమిషన్ కూడా ప్రత్యేక నివేదికను వెలువరించినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ‘మనోజ్ నరూలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీం కోర్టు తీవ్ర స్వరంతో ఆ తీర్పును వెలువరించింది. ధర్మాసనం తరఫున జస్టిస్ దీపక్ మిశ్రా మెజారిటీ తీర్పును ఇలా ప్రకటించారు: ‘పాలకులు పాలనా పగ్గాలను చేపట్టే ముందు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని ప్రమాణం చేస్తారు. అది ప్రజలు వారిపై ఉంచిన విశ్వాసం (ట్రస్ట్). అందువల్ల ప్రధానమంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ తీవ్రమైన క్రిమినల్ కేసులు, ఆరోపణలు ఉన్నవారిని మంత్రివర్గంలోకి తీసుకొనరాదు. రాజ్యాంగం చెప్పేది కూడా అదే.’ ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనకర్తలు విధి నిర్వహణలో పాటించవలసిన నైతిక విలువలను, సంప్రదాయాలను ఉటంకిస్తూ ఎన్నికల కమిషన్, లా కమిషన్ కూడా సమగ్రమైన నివేదికలు ఇచ్చాయి. వీటితో పాటు అధికారిక స్థానాలలో జరిగే అవినీతి గురించి సంతానం కమిటీ, దినేశ్ గోస్వామి కమిటీలతో పాటు, కేంద్ర నేర పరిశోధన, హోంశాఖలకు శాఖకు చెందిన వోహ్రా కమిటీ కూడా పాలనా రంగంలో పెరిగిపోతున్న అవినీతి చర్యలనూ, నేరపూరిత రాజకీయాల తీరును ఎండగడుతూ నివేదించాయి. ఇంతటి సవివరమైన నివేదికలు ప్రభుత్వానికి సమర్పించినా ఫలితం మాత్రం లేదు. సివిల్, క్రిమినల్ చట్టాలకు కొన్ని సవరణలు వచ్చినా మార్పు లేకపోగా, నానాటికీ తీసికట్టు నాగంభొట్లు తీరుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితులకు ప్రధాన కారణంగా వోహ్రా కమిటీ (1993) ఒక అంశాన్ని పేర్కొన్నది. ‘భారతీయ సమాజంలో నేరగాళ్ల సిండికేట్లు పెరిగిపోతున్నాయి. అనేక రంగాలతో నేరగాళ్లు తమ సంబంధాలను విస్తరించుకున్నారు. ఈ క్రిమినల్ ముఠాలకు, రాజకీయులకు, పోలీసులకు, అధికార గణాలకు మధ్య దేశ వ్యాప్తంగా సంబంధాలున్నాయని స్పష్టమైంది’ అని కమిటీ వెల్లడించింది. చట్టాలలోని లొసుగులను ఆధారం చేసుకుని నేరం రుజువయ్యేదాకా నిందితుడు నేరగాడు కాదన్న పద్ధతితో కేసులను ఏళ్లూ పూళ్లూ కొనసాగిస్తున్నారు. ఈలోగా ధనబలంతో సాక్షులను తారుమారు చేస్తున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులకూ లెజిస్టేటర్లకూ ఎలాంటి క్రిమినల్ జాతకాలు ఉన్నాయో లోక్‌సత్తా జరిపిన సర్వేక్షణలో రుజువైంది. ఇంతకూ ఆదర్శపాలన అందించవలసిన పాలక పక్షాలు ఇలా అవినీతికీ, మోసాలకూ ఎందుకు పాల్పడుతున్నాయి? ఆ ఉత్తమ లక్ష్యానికి ఎందుకు దూరమైపోతున్నాయి? ఇందుకు మూల కారణం - దేశంలో తమ ఊడలను బలంగా దించుకోవడానికీ, ఇందుకు అవసరమైతే షరతులతో కూడిన విదేశీ, స్వదేశీ గుత్తపెట్టుబడులతో బాహాటంగా షరీకై ప్రజల మీద మరింత పీడనను కొనసాగించడానికీ సంపన్న వర్గాలు ఎంచుకున్న పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యవస్థే. ఇందులో ప్రజాబాహుళ్యానికి ఎలాంటి పాత్రా లేదు. కానీ ఇంత జరుగుతున్నా, ఇన్ని కిరాతకాలకు పాలక పక్షాలు పాల్పడుతున్నా ప్రజాబాహుళ్యం కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవడానికి కారణం- చైతన్యాన్ని పెంచగల నాయకత్వం కొరవడడమే. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఏబీకే ప్రసాద్