నైతిక విలువలకు నీరాజనం! | Jayalalithaa similar to the rule in this country, the number of contingently increasing restrictions. | Sakshi
Sakshi News home page

నైతిక విలువలకు నీరాజనం!

Published Mon, Sep 29 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

నైతిక విలువలకు నీరాజనం!

నైతిక విలువలకు నీరాజనం!

జయలలిత  మాదిరిగానే ఈ దేశంలో పాలనకు అనర్హులయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. అందుకే కాస్త ఆలస్యంగానే అయినా, కొద్ది రోజుల క్రితం దేశ అత్యున్నత స్థానం ఇచ్చిన తీర్పును గుర్తు చేసుకోవాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం (ఆగస్ట్ 27, 2014) ఇచ్చిన ఆ తీర్పు విశిష్టమైనది. చరిత్రాత్మకమైనది.
 
 అధికారిక స్థానాలలో అవినీతికి ఆలవాలమైన, ఆర్థిక గూండాయిజం కన్నా ఈ దేశంలోని ‘మేధావి’ గుడ్డిలో మెల్లలాగా కొంత మెరుగు.
 సోమనాథ్ చటర్జీ
 (లోక్‌సభ మాజీ సభాపతి, ఆగస్ట్ 23, 1995)

 ‘పట్టుకో పట్టుకోమనేవాడే గానీ, పట్టుకున్నవాడు ఒక్కడూ లేడు’ అని సామెత. ఒకవేళ పట్టుబడవలసిన వాళ్లు పట్టుబడితే అనేక రకాల వలస ప్రభుత్వ చట్టాలతో కుదిరిన ‘వియ్యం’ తరువాత ఆ అవకాశవాద చట్టాల ఆధారంగా రూపొందించిన భారత రాజ్యాంగ వ్యవస్థ కింద పనిచేస్తున్న పాలక వ్యవస్థలు ఎలా అవినీతిమయంగా వ్యవహరిస్తాయో 65 ఏళ్ల రాజకీయ స్వాతంత్య్రం నిరూపించింది.

ఏమున్నది గర్వకారణం?

1947 తరువాత,  తొలి దశాబ్దంలో కొంత మినహా, మిగిలిన యాభైఅయిదేళ్ల కాలాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ‘దేశంలో చిట్టచివరి పేదజీవి కూడా దారిద్య్రం బాధ నుంచి, పీడన నుంచి విముక్తి పొందేవరకు స్వాతంత్య్రం వచ్చినట్టు కాదు’ అన్న జాతిపిత గాంధీ మాట ఎంత దూరదృష్టి గలదో దేశ ప్రజలు ఆలోచించుకోవలసిన దశలోకి  ప్రవేశించారనిపిస్తుంది. ఆరు దశాబ్దాల కాలంలోనే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎంతో చేటు జరిగింది. ఎన్నికలలో మోసాలు, అవినీతి కారణంగా సివిల్, క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ఎంపీలు దాదాపు 200 మందికి పైగానే ఉన్నారని ఇటీవలి సర్వేలలో తేలింది. వీరిలో ప్రధానులు, మంత్రుల స్థాయి వారు కూడా ఉన్నారు. పక్షపాత రాజకీయాలలో భాగంగా మైనారిటీలపైన జరిపిన హత్యాకాండతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు కూడా ఉన్నారు. ఇలాంటి వారు అన్ని పార్టీలలోను ఉన్నారు.

అవినీతి సామ్రాజ్ఞి

ఈ పూర్వరంగం నుంచి చూస్తే తమిళనాడుకు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత కూడా కనిపిస్తారు. ఇంతకు ముందు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి కూడా ఇందుకు మినహాయింపు కాదు. జయలలిత అవినీతి ఆరోపణల కేసు విచారణ పూర్తి కావడానికి 18 ఏళ్లు పట్టింది. విచారణ ప్రహసనంలో 259 మంది సాక్షులను విచారించారు (వీరిలో కొందరు తరువాత జారుకున్నారు. ఆమె తరఫున డిఫెన్స్ సాక్షులుగా 99 మంది ఉన్నారు.) మద్రాసు హైకోర్టు, మరికొన్ని కింది కోర్టులు ఆమెపై నమోదైన కొన్ని కేసులను కొట్టివేశాయి. మిగిలినవి చివరికి మద్రాస్ నుంచి బెంగళూరులో ఏర్పాటు చేసిన జడ్జి జాన్ మైఖేల్ డి కున్హా ప్రత్యేక న్యాయస్థానానికి చేరుకున్నాయి. సాక్ష్యాలకు సంబంధించిన 1,066 పత్రాలను, 2,341 అనుబంధ (ఎగ్జిబిట్) పత్రాలను పరిశీలించి జస్టిస్  కున్హా సెప్టెంబర్ 27న తీర్పు వెలువరించారు. న్యాయమూర్తి జయలలితకు భారీ శిక్షే విధించారు. ఆమె అధికారంలో ఉండగా జరిగిన రూ.65 కోట్ల రూపాయల అవినీతి కుంభకోణానికి రూ.100 కోట్లు జరిమానా విధించారు. జైలుకు పంపారు. ఈ తీర్పుతో జయలలిత తన శాసనసభ్యత్వాన్నీ, తద్వారా ముఖ్యమంత్రి పదవినీ కోల్పోయారు. అంతేకాదు, పదేళ్ల వరకు (ఇక్కడ చెన్నారెడ్డి ఎన్నిక చెల్లక ఆరేళ్లపాటు ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హుడైనట్టు) ఆమె ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హురాలవుతారు.

 ఇలా ఇంకెందరో?

జయలలిత  మాదిరిగానే ఈ దేశంలో పాలనకు అనర్హులయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. అందుకే కాస్త ఆలస్యంగానే అయినా, కొద్ది రోజుల క్రితం దేశ అత్యున్నత స్థానం ఇచ్చిన తీర్పును గుర్తు చేసుకోవాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం (ఆగస్ట్ 27, 2014) ఇచ్చిన ఆ తీర్పు విశిష్టమైనది. చరిత్రాత్మకమైనది. అవినీతిపరులైన రాజకీయ పాలకులకూ, చట్టసభల సభ్యులకు, అధికార గణాలకు నసాళానికి అంటే విధంగా వెలువడిన తీర్పు ఇది. గత ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన ప్రధానులు, ప్రభుత్వాలలో భాగస్వాములైన మంత్రులు,  పలువురు మాజీ ముఖ్యమంత్రులు, లెజిస్లేటర్లు ఈ తీర్పు పరిధిలోకి రారని చెప్పలేం. నిజానికి ప్రత్యేక కోర్టులో జడ్జి కున్హా చెప్పిన తీర్పు కన్నా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. ఎం.లోధా అధ్యక్షతన ధర్మాసనం తాజాగా ఇచ్చిన తీర్పు విస్తృతిలో ఎంతో పెద్దది. దేశ వ్యాప్తంగా వర్తించగలిగేది. అన్ని నైతిక విలువలను పాతిపెట్టి పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు ఏ విధంగా  ఎన్నికలలో, పాలనలో క్రిమినల్ చర్యలకు తెగబడ్డారో ఇంతకు ముందు అనేక కమిషన్‌లూ, కమిటీలూ వెల్లడించాయి. కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రులు ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డారో కూడా ఆయా సంఘాలు నిర్ధారించాయి. ఈ కమిటీలు, కమిషన్‌లతో పాటు లా కమిషన్ కూడా ప్రత్యేక నివేదికను వెలువరించినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ‘మనోజ్ నరూలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీం కోర్టు తీవ్ర స్వరంతో ఆ తీర్పును వెలువరించింది.
 ధర్మాసనం తరఫున జస్టిస్ దీపక్ మిశ్రా మెజారిటీ తీర్పును ఇలా ప్రకటించారు: ‘పాలకులు పాలనా పగ్గాలను చేపట్టే ముందు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని ప్రమాణం చేస్తారు. అది ప్రజలు వారిపై ఉంచిన విశ్వాసం (ట్రస్ట్). అందువల్ల ప్రధానమంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ తీవ్రమైన క్రిమినల్ కేసులు, ఆరోపణలు ఉన్నవారిని మంత్రివర్గంలోకి తీసుకొనరాదు. రాజ్యాంగం చెప్పేది కూడా అదే.’ ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనకర్తలు విధి నిర్వహణలో పాటించవలసిన నైతిక విలువలను, సంప్రదాయాలను ఉటంకిస్తూ ఎన్నికల కమిషన్, లా కమిషన్ కూడా సమగ్రమైన నివేదికలు ఇచ్చాయి. వీటితో పాటు అధికారిక స్థానాలలో జరిగే అవినీతి గురించి సంతానం కమిటీ, దినేశ్ గోస్వామి కమిటీలతో పాటు, కేంద్ర నేర పరిశోధన, హోంశాఖలకు శాఖకు చెందిన వోహ్రా కమిటీ కూడా పాలనా రంగంలో పెరిగిపోతున్న అవినీతి చర్యలనూ, నేరపూరిత రాజకీయాల తీరును ఎండగడుతూ నివేదించాయి. ఇంతటి సవివరమైన నివేదికలు ప్రభుత్వానికి సమర్పించినా ఫలితం మాత్రం లేదు. సివిల్, క్రిమినల్ చట్టాలకు కొన్ని సవరణలు వచ్చినా మార్పు లేకపోగా, నానాటికీ తీసికట్టు నాగంభొట్లు తీరుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితులకు ప్రధాన కారణంగా వోహ్రా కమిటీ (1993) ఒక అంశాన్ని పేర్కొన్నది. ‘భారతీయ సమాజంలో నేరగాళ్ల సిండికేట్లు పెరిగిపోతున్నాయి. అనేక రంగాలతో నేరగాళ్లు తమ సంబంధాలను విస్తరించుకున్నారు. ఈ క్రిమినల్ ముఠాలకు, రాజకీయులకు, పోలీసులకు, అధికార గణాలకు మధ్య దేశ వ్యాప్తంగా సంబంధాలున్నాయని స్పష్టమైంది’ అని కమిటీ వెల్లడించింది. చట్టాలలోని లొసుగులను ఆధారం చేసుకుని నేరం రుజువయ్యేదాకా నిందితుడు నేరగాడు కాదన్న పద్ధతితో కేసులను ఏళ్లూ పూళ్లూ కొనసాగిస్తున్నారు. ఈలోగా ధనబలంతో సాక్షులను తారుమారు చేస్తున్నారు.

ఇక్కడ కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులకూ లెజిస్టేటర్లకూ ఎలాంటి క్రిమినల్ జాతకాలు ఉన్నాయో లోక్‌సత్తా జరిపిన సర్వేక్షణలో రుజువైంది. ఇంతకూ ఆదర్శపాలన అందించవలసిన పాలక పక్షాలు ఇలా అవినీతికీ, మోసాలకూ ఎందుకు పాల్పడుతున్నాయి? ఆ ఉత్తమ లక్ష్యానికి ఎందుకు దూరమైపోతున్నాయి? ఇందుకు మూల కారణం - దేశంలో తమ ఊడలను బలంగా దించుకోవడానికీ, ఇందుకు అవసరమైతే షరతులతో కూడిన విదేశీ, స్వదేశీ గుత్తపెట్టుబడులతో బాహాటంగా షరీకై ప్రజల మీద మరింత పీడనను కొనసాగించడానికీ సంపన్న వర్గాలు ఎంచుకున్న పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యవస్థే. ఇందులో ప్రజాబాహుళ్యానికి ఎలాంటి పాత్రా లేదు. కానీ ఇంత జరుగుతున్నా, ఇన్ని కిరాతకాలకు పాలక పక్షాలు పాల్పడుతున్నా ప్రజాబాహుళ్యం కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవడానికి కారణం- చైతన్యాన్ని పెంచగల నాయకత్వం కొరవడడమే.
 
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)  -  ఏబీకే ప్రసాద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement