సుబ్రమణ్యస్వామి పిటిషన్‌తో 1996లో విచారణ ప్రారంభం
చెన్నై: జయలలితపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ దాదాపు 18 ఏళ్లు సాగింది. 1996లో సుబ్రమణ్య స్వామి పిటిషన్‌తో చెన్నైలో ప్రారంభమైన విచారణ 2014లో బెంగళూరులో ముగిసింది. ఇంతకాలం ఈ విచారణ సాగడానికి కారణాలను విశ్లేషిస్తే.. విచారణ ప్రారంభం నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో నిందితులు వేసిన లెక్కకు మించిన పిటిషన్లు, అభ్యర్థనలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సాక్షులు మాట మార్చడం, పునర్విచారణ కోరడం, విచారణను చెన్నై కోర్టు నుంచి బెంగళూరు కోర్టుకు మార్చడం మరికొన్ని కారణాలు. విచారణ చివరలో కోర్టు అడిగిన 1,339 ప్రశ్నలకు జయలలిత జవాబిచ్చారు. అయితే, అందులో చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ఆమె సమయమడిగి, వాయిదా కోరారు.
1996 నుంచి..2014 వరకు
1996: తమిళనాడు ముఖ్యమంత్రిగా 1991 నుంచి 1996 వరకు ఉన్న జయలలిత.. ఆ కాలంలో ఆదాయానికి మించి రూ. 66.65 కోట్లను అక్రమంగా సంపాదించారని అప్పుడు జనతాపార్టీలో, నేడు బీజేపీలో ఉన్న సుబ్రమణ్య స్వామి కేసు వేశారు. సీఎం కాకముందు 1991లో ఆమె ఆస్తులు రూ. 2.01 కోట్లని, ముఖ్యమంత్రిగా నెలకు ఒక్క రూపాయి మాత్రమే ఆమె వేతనంగా తీసుకున్నారని, 1996లో ఆమె ఆస్తుల విలువ రూ. 66.65 కోట్లకు చేరిందని అందులో ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరపాల్సిందిగా రాష్ట్ర నిఘా, అవినీతి నిరోధక విభాగాన్ని కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ సహా పలు చోట్ల సోదాలు జరిపి కిలోల కొద్దీ నగలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీన పర్చుకున్నారు. డిసెంబర్ 7న జయలలితను అరెస్ట్ చేశారు. 1996లో డీఎంకే అధికారంలోకి వచ్చాక ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది.
1997: చెన్నైలో జయలలితతో పాటు ఆమెకు అత్యంత సన్నిహితురాలైన శశికళ, ఆమె బంధువు ఇళవరసి, జయ దత్త పుత్రుడు సుధాకరన్‌లపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణ ప్రారంభం.
2000: పదిమంది మినహా 260 మంది ప్రాసిక్యూషన్ సాక్షుల విచారణపూర్తి.
2001: అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఘనవిజయం. సీఎంగా జయలలిత ప్రమాణం. టాన్సి కేసులో దోషిగా తేలినందున సీఎంగా జయలలిత అనర్హురాలంటూ సుప్రీం తీర్పు. దాంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా. అనంతరం ఆ కేసులో జయను నిర్దోషిగా తేలడంతో
మళ్లీ అధికార పీఠంపైకి జయలలిత.రాజీనామా చేసిన ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులు. మాటమార్చిన పలువురు ప్రాసిక్యూషన్ సాక్షులు(గతంలో వీరంతా జయకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారు).
2003: జయలలిత అధికారంలో ఉండటం వల్ల విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, విచారణను కర్ణాటక కోర్టుకు మార్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన డీఎంకే నేత అన్బళగన్. కేసును బెంగళూరు కోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు.
2005: ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్‌పీపీ)గా బీవీ ఆచార్యను నియమించిన కర్ణాటక ప్రభుత్వం.
2011: కోర్టు విచారణకు హాజరైన జయలలిత.
2012: ఎస్‌పీపీగా కొనసాగలేనంటూ కర్నాటక ప్రభుత్వానికి ఆచార్య అభ్యర్థన.
2013: ఆచార్య రాజీనామా ఆమోదం. ఎస్‌పీపీగా భవానీ సింగ్ నియామకం. అనంతరం ఎలాంటి కారణాలు చూపకుండా, కర్ణాటక హైకోర్టును సంప్రదించకుండా భవానీసింగ్‌ను విధుల నుంచి తప్పిస్తూ కర్ణాటక ప్రభుత్వ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు. జయలలిత నుంచి 1997లో స్వాధీనం చేసుకున్న నగలు ఇతర విలువైన వస్తువులను చెన్నై ఆర్‌బీఐ శాఖలో భద్రపరచాలని ప్రత్యేక కోర్టు ఆదేశం.
2014: సెప్టెంబర్ 20న తీర్పు ఇస్తామని, ఆ రోజు నిందితులంతా హాజరు కావాలని ప్రత్యేక కోర్టు ఆదేశాలు. పోలీసులు భద్రతాకారణాలు చూపడంతో కోర్టును బెంగళూరు శివార్లలో ఉన్న ఒక జైలు ఆవరణలోకి మారుస్తూ.. తీర్పును సెప్టెంబర్ 27కి వాయిదా వేసిన కోర్టు.
సెప్టెంబర్ 27: జయలలితను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు.
జయకు కేసులు కొత్తకాదు!
పురచ్చితలైవి జయలలితకు కేసులు కొత్త కాదు. డజనుకు పైగా కేసులను ఆమె ఎదుర్కొన్నారు. వాటిలో చాలా కేసుల నుంచి నిర్దోషిగా బయటపడ్డారు.తమిళనాడు చిన్న తరహా పరిశ్రమల సంస్థ(తాన్సీ) కేసుల్లో చెన్నై ప్రత్యేక కోర్టు 2000 సంవత్సరంలో ఆమెను దోషిగా నిర్ధారించి, ఒక కేసులో మూడేళ్లు, మరో కేసులో రెండేళ్లు శిక్ష విధించింది. అనంతరం మద్రాస్ హైకోర్టు ఆ కేసుల్లో జయలలితను నిర్దోషిగా తేల్చింది.రాష్ట్రంలో డీఎంకే అధికారంలో ఉన్న 1996-2001 మధ్య జయలలితపై నమోదైన 14 కేసుల్లో చాలా కేసుల నుంచి ఆమె నిర్దోషిగా బయటపడ్డారు. ప్రభుత్వ నిబంధనలను కాదని, పర్యావరణ ప్రాముఖ్యత కలిగిన కొడెకైనాల్‌లో ‘ప్లజంట్ స్టే’ హోటల్‌కు అనుమతించిన కేసులో ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆ తరువాత ఆ కేసును మద్రాస్ హైకోర్టు కొట్టేసింది.
1996లో అధికారం కోల్పోయాక ‘కలర్ టీవీ’ కేసులో జయలలితను అరెస్ట్ చేశారు. అనంతరం ఆ కేసునూ కొట్టేశారు.బొగ్గు దిగుమతుల ఒప్పందం కేసు నుంచి 2001లో, రూ. 28.28 కోట్ల స్పిక్ పెట్టుబడుల ఉపసంహరణ కేసు నుంచి 2004లో ఆమె నిర్దోషిగా బయటపడ్డారు. సుప్రీంకోర్టు అనుమతితో లండన్ హోటల్స్ కేసును ప్రభుత్వమే ఉపసంహరించుకుంది. 3 లక్షల డాలర్ల బహుమతి కేసును 2011లో మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది.ఆదాయపన్ను రిటర్న్స్ కేసు విచారణలో ఉంది.
18 ఏళ్లు సాగిన విచారణ
Published Sun, Sep 28 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM
Advertisement
Advertisement