The High Court
-
ఆయేషా మీరా కేసు పునర్విచారణకు సిట్
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణ బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్లో 2007 డిసెంబర్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో ఆయన్ను ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించింది. ఈ కేసులో అసలైన దోషులను పట్టుకోవడంలో పోలీసుల అలక్ష్యాన్ని తప్పుబట్టిన హైకోర్టు.. పునర్విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణకు డీజీపీ నండూరి సాంబశివరావు ప్రతిపాదించడంతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. డీఐజీ స్థాయి అధికారి సిట్‌కు నేతృత్వం వహిస్తారని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ ఆనురాధ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిట్ దర్యాప్తును విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించనున్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి సోమాజిగూడ: పర్యావరణ పరిరక్షణకు అటుప్రభుత్వాలు..ఇటు పౌరసమాజం చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఇది అందరి బాధ్యతగా గుర్తించాలని పాట్నా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. ఒక చెట్టు నరికితే 10 మొక్కలు నాటేలా ఆచరణీయమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఎస్ ) ఆధ్వర్యంలో బేగంపేట సెస్ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన ఎర్త్‌డే, 7 వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నాగరికత పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకం దెబ్బతిందన్నారు. పంచభూతాల మయమైన సృష్టిలో ఇప్పటికే గాలి, నీరు, భూమి కలుషితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డదిడ్డమైన విధానాలు, ఆచరణీయమైన దృక్పథం లేకపోవడం, మానవ స్వార్థం మరింత చేటు చేస్తున్నాయన్నారు. ఒక సృష్టమైన విధానంతో ముందుకు వెళ్తేనే మనుగడ సాధ్యమన్నారు. పర్యావరణం, మెక్కల పెంపకం, తూర్పు కనుమల పరిరక్షణకు అంకిత భావంతో కృషి చేస్తున్న సీజీఎస్ సంస్థను అభినందించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని ఇల్లు, నీరు అడుగుతారని, దాంతో పాటు మెక్కలు కూడా పెంచాలని డిమాండ్ చేయాలని సూచించారు. మొక్కల పెంపకంలో విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ సీతారామరావు మాట్లాడుతూ సంస్థ గత ఏడేళ్లుగా చేస్తున్న సేవలను అభినందించారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ లక్ష మెక్కల పెంపకం లక్ష్యంతో ఏడేళ్ల క్రితం ప్రారభమైన సీజీఎస్ సంస్థ నేడు లక్షలాది మొక్కలు పెంచే స్థాయికి చేరుకోవడంతో పాటు దాదాపు 1700 కిలోమీటర్లు విస్తరించి ఉన్న తూర్పు కనుమల పరిరక్షణ, నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ క్రమంలో సంబంధిత రాష్ట్రాల ఎంపీలు, అధికారులు, సంస్థల మద్దతు కూడా కూడగట్టడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుండి ప్రత్యేక అవార్డులు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుండి సీజీఆర్ ఫౌండేషన్ లెక్చర్ కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సంస్థ వ్యవస్థాపకులు లీలా లక్ష్మారెడ్డి గత ఏడేళ్ల ప్రగతిని వివరించారు. పర్యావరణ వేత్త పురుషోత్తంరెడ్డి సంస్థతో తన అనుబంధం గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పర్యావరణ సమస్యలపై స్పందిస్తున్న వందేమాతరం ఫౌండేషన్, కళాకారుడు లెనిన్‌బాబు, నాగర్‌కర్నూల్ జిల్లా సిలార్పల్లిని గ్రీన్విలేజ్గా తీర్చిదిద్దిన యువకులు, రైతు నీలాలక్ష్మి, ఎన్జీవో సత్యశ్రీ, నెక్కొండలోని యూపీఎస్ స్కూల్, డెక్కన్ క్రానికల్ జర్నలిస్ట్ సుధాకర్‌రెడ్డి , విద్యార్థి రమేష్‌లను సత్కరించి మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో పలువురు పర్యావరణ ప్రియులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇదేం తీరు!
► స్వతంత్ర సంస్థ అన్నది గుర్తుంచుకోండి ► స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఆగ్రహం ఎన్నికల యంత్రాంగం స్వతంత్ర సంస్థ అన్నది గుర్తుంచుకోండి, స్వతంత్రంగా వ్యవహరించండంటూ రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం తీరుపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మారని పక్షంలో ఎన్నికల అధికారిని కోర్టు మెట్లు ఎక్కించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు హెచ్చరించారు. సాక్షి, చెన్నై: గత ఏడాది కోర్టు కన్నెర్రతో స్థానిక సంస్థలకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీలు పిటిషన్ విచారణ న్యాయమూర్తులు రామ్మోహన్ రావు, ఎస్ఎం.సుబ్రమణ్యం నేతృత్వంలోని బెంచ్ విచారిస్తోంది. ఎన్నికల ఆగడం, అప్పీలు పిటిషన్ విచారణతో స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో గత విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణకు తగ్గట్టు ప్రస్తుతం తీసుకున్న చర్యలపై కోర్టుకు నివేదిక సమర్పిం చాలని న్యాయమూర్తు లు ఆదేశించారు. ఏప్రిల్‌లోపు ఎన్నికలు నిర్వహించేందుకు తగ్గ ఏర్పాట్లతో ఆ నివేదిక సమర్పించాలని సూచించారు. అయితే, ఏప్రిల్‌లోపు ఎన్నికల నిర్వహణ అసాధ్యమని పేర్కొంటూ, ప్రత్యేక అధికారుల పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ వివరాలతో కూడిన నివేదిక కోర్టు ముందుకు గత వారం చేరింది. నివేదిక పరిశీలనానంతరం శుక్రవారం మళ్లీ పిటిషన్ విచారణకు వచ్చింది. ఎన్నికల నిర్వహణకు తగ్గట్టు ఎన్నికల యంత్రాంగం ఎలాంటి చర్యలు ఇంత వరకు తీసుకోకపోవడంపై హైకోర్టు బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. స్వతంత్ర సంస్థ: న్యాయమూర్తులు రామ్మోహన్ రావు, సుబ్రమణ్యం నేతృత్వంలోని బెం చ్ ఉదయం విచారణను చేపట్టగా, డీఎంకే తరఫు న్యాయవాది విల్సన్ హాజరై వాదనల్ని వినిపించారు. ఎన్నికల నిర్వహణకు ఇంత వరకు ఎలాంటిచర్యలు తీసుకోలేదని బెంచ్ ముందు ఉంచారు. ఈసందర్భంగా ఎన్నికల యంత్రాంగం తరఫు న్యాయవాది పి కుమార్ తన వాదనల్ని వినిపించారు. అన్ని ఏర్పాట్లకు తాము సిద్ధంగా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వివరించారు. ప్రభుత్వం నుంచి తమకు కొన్ని రకాల అనుమతులు, ఉత్తర్వులు రావాల్సి ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకుగాను మరింత సమయం తమకు కేటాయించాలని కోరారు. దీంతో న్యాయమూర్తులు తీవ్రంగానే స్పందించారు. ఎన్నికల యంత్రాంగం స్వతంత్ర సంస్థ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రభుత్వ అనుమతి, ఉత్తర్వులు అని జాప్యం చేయడం మంచి పద్ధతి కాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత వరకు కనీస ఏర్పాట్లుకూడా చేయకపోవడం శోచనీయమని అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి మారని పక్షంలో రాష్ట్ర ఎన్నికల అధికారిని కోర్టుమెట్లు ఎక్కించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ, తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదా వేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణలో సాగుతున్న అలసత్వంపై కోర్టు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం బట్టి చూస్తే, రాష్ట్రంలో పరిపాలన ఏ మేరకు సంక్షోభంలో ఉన్నదో స్పష్టం అవుతోందని డీఎంకే కార్యనిర్వహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విమర్శించారు. -
బార్ కౌన్సిల్ అధ్యక్షునిగా మోహనకృష్ణన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం (బార్ కౌన్సిల్) అధ్యక్షునిగా మోహనకృష్ణన్ మరోసారి ఎన్నికయ్యారు. మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘంలో సుమారు 4,777 మంది సభ్యులున్నారు. ఈ సంఘానికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, సీనియర్ కార్యనిర్వాహక సభ్యులు జూని యర్ కార్యనిర్వాహక సభ్యు లు, లైబ్రేరియన్ ఉంటారు. ఈ కార్యవర్గానికి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. 2016-18 సంవత్సరానికిగానూ సంఘం ఎన్నికలు బుధవారం జరి గారుు. అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షులు మోహన్కృష్ణన్, ప్రస్తుత కార్యదర్శి అరివళగన్, పీఎం.దురైస్వామి, ఎస్.కాశీరామలింగం, ఎల్. ఉరుగవేలు, కే. సత్యపాల్, సి.విజయకుమార్ ఇలా మొత్తం ఏడుగురు పోటీపడ్డా రు. ఉపాధ్యక్ష పదవికి ఎ.అబ్దుల్‌రెహమాన్, జార్జ్ చార్లస్, ఎం. జయకుమార్, మదివానన్, ఏ. మోహన్‌దాస్, ఆర్ మురళీ, ఎస్.ముత్తురామన్ ఎస్ పద్మ, ఎన్ ప్రభాకరన్, రువా, ఎమ్ఏఏఆర్ సుధా, విక్టర్, సామువేల్ ఇలా 13 మంది బరిలోకి దిగారు. అలాగే కార్యదర్శి పదవికి పీవీ ఇళంగో, కృష్ణకుమార్, ఎస్ శశికుమార ఆర్ శివశంకర్ ఇలా మొత్తం నలుగురు పోటీపడ్డారు. కోశాధికారి స్థానానికి సీ ఆరోగ్యదాస్, ఎస్ కామరాజ్, టీ శివషణ్ముగం, కే సుబ్రమణియన్ పోటీలో నిలిచారు. ఇక మిగిలి ఉన్న లైబ్రేరియన్ స్థానానికి గజలక్ష్మి రాజేంద్రన్, కే కుమరేశన్, మహావీర్ శివాజీ, వీఎమ్ రఘు, ఏ. రాజారాం, జి. రాజేష్, టి.రవికుమార్, కేకే శివకుమార్, కే తిప్పుకల్థాన్ పోటీపడ్డారు. బుధవారం పోలింగ్ జరిగిన తరువాత బ్యాలెట్ బాక్సులను సంఘం కార్యాలయంలో గట్టి బందోబస్తు మధ్య భద్రపరిచగా గురువారం ఓట్ల లెక్కింపు సాగింది. అధ్యక్షపదవికి పోలైన ఓట్లను తొలుత లెక్కించారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన మోహనకృష్ణన్, ప్రస్తుత కార్యదర్శి అరివళగన్ల మధ్య గట్టిపోటీ నెలకొన్నట్లు ఓట్ల లెక్కింపులో తేలింది. మొదటి రౌండు నుంచి మోహనకృష్ణన్ ఆధిపత్యాన్ని చాటుకుని 1001 ఓట్ల మెజారిటీ తో అధ్యక్షులుగా మరోసారి ఎన్నికయ్యారు. -
1,506 వ్యవసాయ, ఉద్యాన పోస్టులకు గ్రీన్‌సిగ్నల్
► 4 వారాల తర్వాత భర్తీకి హైకోర్టు అనుమతి ► త్వరలో ఫలితాలు విడుదల సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, ఉద్యానశాఖలో 1,506 మండల స్థాయి అధికారుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతించింది. పోస్టులను నాలుగు వారాల తర్వాత భర్తీ చేయాలని తీర్పు చెప్పింది. దీంతో ఈ వ్యవహారంలో తదుపరి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు శుక్రవారం కేవియట్ దాఖలు చేసినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. హైకోర్టు తీర్పు ప్రకారం నాలుగు వారాల తర్వాత వ్యవసాయ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ఫలితాలు వెల్లడించాక అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే ప్రక్రియ మొదలవుతుందన్నారు. పోస్టుల భర్తీలో తమకు వెయిటేజీ కల్పించడంతోపాటు విద్యార్హతల్లోనూ సడలింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని టీఎస్పీఎస్సీ తోసిపుచ్చడాన్ని సవాల్‌చేస్తూ కొందరు కాంట్రాక్టు ఏఈవోలు గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు...పరీక్ష నిర్వహణకు అనుమతించి తుది ఫలితాల వెల్లడిపై మాత్రం స్టే విధించింది. 6,250 ఎకరాలకు ఒక ఏఈవో... రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా ప్రతి 6,250 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)ని ప్రభుత్వం నియమించనుంది. వ్యవసాయశాఖ కోసం 1,311 ఏఈవో, 120 ఏవో పోస్టులను, ఉద్యానశాఖ కోసం 75 ఉద్యానశాఖ అధికారి (హెచ్‌వో) పోస్టులను భర్తీ చేయనుంది. వారికి కొన్ని రోజులపాటు శిక్షణ ఇచ్చి రాబోయే ఖరీఫ్ నాటికి 1,506 మందిని అందుబాటులోకి తేవడమే లక్ష్యమని పార్థసారథి తెలిపారు. 6,250 ఎకరాలకు ఒక ఏఈవో అంటే దాదాపు ఒకట్రెండు గ్రామాలకు ఒక ఏఈవో ఉండే అవకాశం ఉంది. సగానికిపైగా మహిళలే... మండలాలు, గ్రామాల్లో పనిచేయబోయే ఏవో, ఏఈవో, హెచ్వోలలో సగానికిపైగా మహిళలే ఉండే అవకాశాలున్నాయి. వ్యవసాయ కోర్సులు చదివే వారిలో 60 శాతం నుంచి 70 శాతం వరకు మహిళలే ఉంటున్నారు. కాబట్టి 1,506 మందిలో సగానికిపైగా మహిళలే ఉంటారని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. -
డీడీసీఏకు ఢిల్లీ హైకోర్టు షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘా(డీడీసీఏ)నికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్ ముకుల్ ముద్గల్ నియమించిన ముగ్గురు సెలక్టర్లను తొలగిస్తూ డీడీసీఏ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ విషయంలో డీడీసీఏ హద్దు మీరి ప్రవర్తించిందని, ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని జస్టిస్ రవీంద్ర భట్, దీపా శర్మలతో కూడిన బెంచ్ తీవ్రంగా తప్పుపట్టింది. ఢిల్లీ క్రికెట్ సంఘానికి చెందిన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గతంలోనే ఆ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ ముకుల్ ముద్గల్‌ను నియమించింది. అలాగే 48 గంటల్లోగా ఆటగాళ్లకు బకారుులు చెల్లించాల్సిందిగా డీడీసీఏను కోర్టు ఆదేశించింది. -
పక్కా సమాచారంతోనే కూంబింగ్!
► మొదట మావోలే మాపై కాల్పులు జరిపారు ► లొంగిపొమ్మని హెచ్చరించినా వినలేదు ► వారి కాల్పుల్లో కమాండో అబూ బాకర్ చనిపోయారు ► ఆత్మరక్షణ కోసమే ఎదురుకాల్పులు ► హైకోర్టులో విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ కౌంటర్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుల్లో(ఏవోబీ) మావోయిస్టు అగ్రనేతల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న తరువాతనే గ్రేహౌండ్స్‌తో కలిసి కూంబింగ్ కార్యకలాపాలు చేపట్టామని విశాఖపట్నం ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ హైకోర్టుకు నివేదించారు. కూంబింగ్ సందర్భంగా తారసపడ్డ మావోయిస్టులు తమపై మొదట కాల్పులు జరిపారని, తమ గుర్తింపును తెలియచేసి లొంగిపోవాలని కోరినప్పటికీ వినిపించుకోకుండా కాల్పులు జరుపుతూనే ఉన్నారన్నారు. వారి కాల్పుల్లో మొదట పోలీసులే గాయపడ్డారని, ఈ పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే ఎదురు కాల్పులు జరపామన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని శర్మ తెలిపారు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై ఏపీ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ బుధవారం కౌంటర్ దాఖలు చేశా రు. దీనికి సమాధానమిచ్చేందుకు గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ ధర్మాసనాన్ని కోరారు. ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న మావోలు ‘విశాఖ జిల్లా ముంచింగ్‌పుట్ పోలీస్‌స్టేషన్ పరిధి నుంచి ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తూ స్థానికులను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా రెచ్చగొడుతున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఏపీ, ఒడిశా పోలీసులు, గ్రేహౌండ్ కమాండోస్ సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మావోయిస్టులు తమ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, బిహార్, మహారాష్ట్రలకు విస్తరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. గత నెల 24న రామగుహ పరిధికి పోలీసులు చేరుకున్నారు. వారిని చూడగానే మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్ కమోండో సతీష్ గాయపడగా, మరో కమోండో అబూబాకర్ మృతి చెందారు. తమ గుర్తింపును తెలియచేసి లొంగిపోవాలని హెచ్చరించినా మావోలు పట్టించుకోలేదు. దీంతో ఆత్మరక్షణ కోసం మేం కూడా ఎదురు కాల్పులు జరిపాం’ అని రాహుల్‌దేవ్ తన కౌంటర్లో పేర్కొన్నారు. ఒడిశా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ‘ఈ ఘటనపై చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో మొత్తం 24 మంది చనిపోయినట్లు ఒడిశా పోలీసుల ద్వారా తెలిసింది. ఇందులో 13 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. 11 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశాం. మిగిలిన మృతదేహాలను తీసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో ఖననం చేశాం. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు. ఘటన జరిగింది ఒడిశాలో. కేసు ఆ రాష్ట్ర పరిధిలోనే నమోదైంది. వాస్తవాలను వక్రీకరిస్తూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందువల్ల వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయండి.’ అని శర్మ తన కౌంటర్లో కోరారు. -
20లోగా కౌంటర్ దాఖలు చేయండి...
- హైకోర్టు ఆదేశం -108 ఉద్యోగులకు సెప్టెంబర్ వేతనాలు ఇప్పటికీ ఇవ్వలేదు సాక్షి, హైదరాబాద్ 108 అంబులెన్సులు నిర్వహణ దక్కించుకున్న యుకెఎస్‌ఎఎస్-బీవీజీ కన్సార్టియంపై జీవీకే సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో సర్కారు ఏంచేయాలో పాలుపోవడం లేదు. టెండరు నిబంధనల ప్రకారం ఈ రెండు సంస్థల కన్సార్టియంకు అర్హత లేదని జీవీకే సంస్థ కోర్టుకు పత్రాలను దాఖలు చేసింది. దీంతో 108 అంబులెన్సులను తక్షణమే ఆ సంస్థలకు ఇవ్వకుండా ఉపసంహరించుకోవాలని స్టే విధించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఈ సంస్థలకు అర్హత ఉందని ఎలా చేయాలో కసరత్తు చేస్తోంది. కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కౌంటర్ దాఖలు చేయడంలో భాగంగా టెండరు దక్కించుకున్న సంస్థల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో కాల్ సెంటర్‌గానీ, అంబులెన్సులు నిర్వహించిన అనుభవం గానీ ఈ సంస్థలకు లేదని జీవీకే హైకోర్టుకు చెప్పింది. సెప్టెంబర్ జీతాలు ఇప్పటికీ లేవు అక్టోబర్ నెల ముగుస్తున్నా 108 ఉద్యోగుల నిర్వహణకు ఇవ్వాల్సిన వేతనాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఉద్యోగులకు తామే సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని, సర్కారు నుంచి తమకు రావాల్సిన వేతనాలు ఇంకా రాలేదని జీవీకే సంస్థ ప్రతినిధులు చెప్పారు. సుమారు రూ.7 కోట్ల బకాయిలు ఉన్నాయని, నిధులు తక్షణమే చెల్లించాలని కోరుతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా సుమారు 6 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన వాహనాలన్నీ మరమ్మతులతో ఆగిపోతున్నాయని, దీంతో ఎమర్జెన్సీ కాల్స్‌కు సకాలంలో హాజరు కాలేకపోతున్నట్టు చెప్పుకొచ్చారు. 108 అంబులెన్సుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుగుతోంది. -
హైకోర్టుకు 13న సెలవు దినం
ఉమ్మడి హైకోర్టుతో పాటు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న కింది కోర్టులకు బక్రీద్ సందర్భంగా ఈ నెల 13వ తేదీని సెలవు దినంగా ప్రకటించారు. వాస్తవానికి హైకోర్టు గతంలోనే బక్రీద్ సందర్భంగా 12వ తేదీని సెలవుగా ప్రకటించింది. అయితే 13న బక్రీద్ నిర్వహిస్తుండటం, సుప్రీంకోర్టు కూడా ఆ రోజునే సెలవు ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు కూడా 13నే సెలవుగా ప్రకటించింది. 12వ తేదీ యథాతథంగా కోర్టు విధులు కొనసాగుతాయని రిజిష్ట్రార్ జనరల్ సిహెచ్.మానవేంద్రనాథ్‌రాయ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
మంత్రులపై పిటిషన్ కొట్టివేత
ఎన్నికల తరువాత పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరినందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రి పదవులు కట్టబెట్టారని, దీని వెనుక అవినీతి దాగి ఉందని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ముఖ్యమంత్రి సిఫారసు మేరకు మంత్రులను గవర్నర్ నియమిస్తారని పిటిషనర్‌కు గుర్తు చేసిన హైకోర్టు, పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇదే హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే స్పష్టమైన తీర్పునిచ్చిందని, అందువల్ల వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం అవినీతి కింద పరిగణించలేమని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 164 కింద గవర్నర్ ఉపయోగించే అధికారాన్ని అవినీతి కిందకు రాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మంగళవారం తీర్పు వెలువరించారు. తలసాని శ్రీనివాసయాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలకు పదవులు ఆశజూపి పార్టీ మారేలా చేశారని, తద్వారా ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు కుట్ర పన్నారని, దీని వెనుక అవినీతి కూడా దాగి ఉందని, అందువల్ల దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, సామాజిక కార్యకర్త ఫర్హత్ ఇబ్రహీం హైదరాబాద్ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన కోర్టు ఈ ఫిర్యాదును తోసిపుచ్చింది. కింది కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇబ్రహీం హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై వాదనలు విని ఈ నెల 16న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మంగళవారం తన తీర్పును వెలువరించారు. ముఖ్యమంత్రి తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకష్ణారెడ్డి చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. అవినీతి నిరోధక చట్టం కింద చేసే ఫిర్యాదులను ఆ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టులు మాత్రమే విచారించగలవని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఫిర్యాదుదారు ఏ కోర్టులో అయితే ఫిర్యాదు దాఖలు చేశారో అది ప్రత్యేక కోర్టు కాదన్నారు. అందువల్ల అక్కడ దాఖలు చేసిన ఫిర్యాదుకు విచారణార్హతే లేదని స్పష్టం చేశారు. తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం స్పీకర్ పరిధిలోని అంశమని, ఇందులో జోక్యం చేసుకోలేమంటూ ఇదే హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చిందని, వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్న ఏజీ వాదనలను న్యాయమూర్తి ఈ సందర్భంగా తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. మంత్రుల నియామకం గవర్నర్ చేస్తారని, గవర్నర్ ఉపయోగించే అధికారాలు అవినీతి చట్ట పరిధిలోకి రావన్నారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు ఏ కోణంలో చూసినా అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి రావని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తన తీర్పులో పేర్కొన్నారు. -
‘గ్రీన్ ఫార్మాసిటీ’ ఏ1నోటీసుపై స్టే
8 వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు {పభుత్వానికి నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా హైదరాబాద్: గ్రీన్ ఫార్మాసిటీ కోసం అవసరమైన 493 ఎకరాల భూమిని చర్చలు, సంప్రదింపుల ద్వారా కొనుగోలు చేసేందుకు వీలుగా మండల తహసీల్దార్ ఈ ఏడాది జనవరిలో జారీ చేసిన ఏ1 నోటీసు అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. ఎనిమిది వారాల పాటు నోటీసు అమలును నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట గ్రామంలో ఈ ఫార్మాసిటీ నిర్మించతలపెట్టిన విషయం విదితమే. అయితే చర్చల ద్వారా భూముల కొనుగోలు చేసే నిమిత్తం గత ఏడాది జూలైలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ ఎం.భారతమ్మ, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ జీవో ద్వారా కందుకూరు మండలంలోని సర్వే నంబర్ 112లోని 493 ఎకరాల భూములను గ్రీన్ ఫార్మాసిటీ కోసం కొనుగోలు చేసేందుకు తహసీల్దార్ జారీ చేసిన ఏ1 నోటీసును కూడా వారు సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ చేపట్టారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా తప్పించుకోవడానికే ప్రభుత్వం ఈ జీవో 45 జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. పిటిషనర్లందరూ కూడా అసైన్మెంట్ పట్టాదారులని వివరించారు. సంప్రదింపుల పేరుతో భూములను బలవంతంగా తీసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే ఈ వాదనలను ప్రభుత్వ న్యాయవాది తోసిపుచ్చారు. స్వచ్ఛందంగా భూములను కొనుగోలు చేసే వ్యవహారంలో ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని తెలుసుకునేందుకే తహసీల్దార్ ఏ1 నోటీసు జారీ చేశారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తహసీల్దార్ జారీ చేసిన ఏ1 నోటీసు అమలును ఎనిమిది వారాల పాటు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
'జీవో 123పై అప్పీల్ చేస్తే మేమూ ఇంప్లీడ్'
రాష్ర్టప్రభుత్వం జీవో 123 రద్దుపై హైకోర్టులో అప్పీల్ చేస్తే తాము కూడా ఇంప్లీడ్ అవుతామని సీపీఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. భూసేకరణ జీవోను కొట్టేసి హైకోర్టు వేసిన చెంపదెబ్బ నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఆ తీర్పుపై అప్పీల్ చేస్తామని మంత్రి హరీష్‌రావు చెబుతున్నారన్నారు. అయితే ప్రభుత్వం, మంత్రి హరీష్‌రావు అప్పీల్ ప్రకటనను పక్కనపెట్టి హైకోర్టు లేవనెత్తిన ఆయా అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరించడం, పేదలకు కాకుండా పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని హైకోర్టు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. అయినా పేదలకు తాము వ్యతిరేకమన్న విధంగా ప్రభుత్వం ముందుకు సాగడం సరికాదన్నారు. -
జైలు నుంచి బెయిల్‌పై లాయర్ల విడుదల
స్వాగతం పలికిన బార్ అసోసియేషన్ నాయకులు హైకోర్టును విభజించాలని నినాదాలు పోచమ్మమైదాన్ : న్యాయమూర్తిపై దాడి కేసులో అరెస్టరుున న్యాయవాదులు బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. మొద టి అదనపు కోర్టు జడ్జి కేవీ నర్సింహులు తనపై న్యాయవాదులు దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో 8 మంది న్యాయవాదులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకో ర్టు విభజన చేయాలని గత 20 రోజులుగా న్యాయవాదులు సాముహికంగా విధులు బహిష్కరించి ఉద్యమిస్తున్నారు. రంజిత్, శ్యాంకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, అంబటి శ్రీనివా స్, అల్లం నాగరాజు, రమణ, తీగల జీవన్‌గౌడ్, అఖిల్‌పాషాను మంగళవారం జైలుకు తరలించారు. విడుదలైన న్యాయవాదులు బయటకు వచ్చిన తర్వాత హైకోర్టును విభజించాలని నినాదాలు చేశారు. జై తెలంగాణ నినాదాలతో జైలు ఆవరణ హోరెత్తింది. విడుదలైన న్యాయవాదులను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జయాకర్ మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా హైకోర్టు విభజన కోసం ఉద్యమం కోనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు సహోదర్‌రెడ్డి, వద్దిరాజు గణేష్, సంజీవ్ పాల్గొన్నారు. -
మార్గదర్శకాల ప్రకారమే ప్రకటన
కరువు మండలాలపై హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం హైదరాబాద్: కరువు మండలాల ప్రకటన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కరీంనగర్ జిల్లాలోనూ ఆ మార్గదర్శకాలను అనుసరించే కరువు మండలాలను ప్రకటించినట్లు వివరించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా.. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ సిఫారసులకు విరుద్ధంగా 40 మండలాలకుగాను కేవలం 19నే కరువు మండలాలుగా ప్రకటించడాన్ని సవా లు చేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పిల్ వేసిన విషయం తెలిసిందే. గతేడాది నైరుతి రుతుపవనాల సమయంలో రాష్ట్రంలో సగ టు వర్షపాతం 713.6 మి.మి. ఉండగా, 610 మి.మి. మాత్రమే నమోదయిందని, ఈ నేపథ్యంలో కరువు మండలాల ప్రకటనకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి సిఫారసులు కోరిందని కౌంటర్లో మీనా పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ 40 మండలాలను కరువు ప్రాంతాలుగా సిఫారసు చేయగా, కమిటీ 19 మండలాలనే ఓకే చేసిందన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకున్నామని, ఆ ప్రకారం కేశవపట్నానికి మాత్రమే కరువు మండలంగా గుర్తించే అర్హత ఉందన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాన్ని కొట్టేయాలని మీనా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
సాక్షి టీవీ ప్రసారాల పునరుద్ధరణ
జర్నలిస్టుల విజయోత్సాహం నిరంతరాయంగా సాగిన ఉద్యమం ఒత్తిడి పెంచింది. హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయమనడం దానికి తోడైంది. గత్యంతరం లేక సర్కారు దిగొచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేస్తూ ఇచ్చిన మౌఖిక ఆదేశాలను ఉపసంహరించుకుంది. ఫలితంగా మంగళవారం రాత్రికే విశాఖ నగరంలో సాక్షి ప్రసారాలు పునఃప్రారంభమయ్యాయి. దీనికోసమే మొక్కవోని దీక్షతో గత 12 రోజులుగా రోడ్లేక్కి ఆందోళనలు చేసిన జర్నలిస్టుల సంఘాలు, సాక్షి సిబ్బంది బుధవారం విజయోత్సవాలు జరుపుకున్నారు. అందరికీ స్వీట్లు పంచి ఆనందం పంచుకున్నారు. -
హైకోర్టుకు ట్యుటోరియల్స్
విద్యాశాఖ కోర్టు ధిక్కారంపై పిటిషన్లు మినహాయింపు ఉన్నా వేధిస్తున్నారని ఫిర్యాదు విశాఖపట్నం: విద్యాశాఖ అధికారుల తీరుతో ఆందోళన చెందుతున్న ట్యుటోరియల్ స్కూళ్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. గుర్తింపు నుంచి మినహాయింపు పొందిన తమ స్కూళ్లను విద్యాశాఖ అధికారులు సీజ్ చేస్తున్నారంటూ నిర్వాహకులు కొద్ది రోజుల నుంచి ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారి, కలెక్టర్, ఇతర అధికారులకు వీరు వినతి పత్రాలు అందజేశారు. మరోవైపు జిల్లా విద్యాశాఖ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందంటూ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేస్తున్నాయి. తాజాగా ఈనెల 13న నగరంలోని పెదగంట్యాడకు చెందిన రాజీవ్ ట్యుటోరియల్స్ నిర్వాహకులు తమ స్కూలును విద్యాశాఖాధికారులు సీజ్ చేశారంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇందులో రాష్ట్ర విద్యాశాఖ, విద్యాశాఖ కమిషనర్, డీఈవో, ఎంఈవో (పెదగంట్యాడ)లను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై 16న విచారణ చేపట్టిన హైకోర్టు విద్యాశాఖ అధికారులు రాజీవ్ ట్యుటోరియల్స్‌ను మూసివేయడం నిరంకుశమని, అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని, సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. తక్షణమే సీలు వేసిన తాళాలను తెరచి ట్యుటోరియల్ నడపడానికి వీలు కల్పించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లా, నగర వ్యాప్తంగా ఉన్న ఇతర ట్యుటోరియల్ స్కూళ్ల తరఫున హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఏపీ ప్రైవేటు ట్యుటోరియల్ స్కూల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎన్.విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.సూర్యనారాయణ శుక్రవారం ‘సాక్షి’కి చెప్పారు. తాము ట్యుటోరియల్స్‌ను నడుపుకోవడానికి అనుమతులున్నా విద్యాశాఖాధికారులు ఏటా బడులు తెరిచే సమయానికి ఇబ్బందులు పెడుతూ స్కూళ్లను మూసివేస్తున్నారని ఆరోపించారు. తమ ట్యుటోరియల్స్‌ను రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని తెలిపారు. -
ఆ ఒక్కటి వదిలేస్తే..!
ఇంకెక్కడ స్థలం కావాలన్నా ఓకే ఒకవైపు స్వాధీనానికి నోటీసులు.. మరోవైపు బేరసారాలు బడాబాబుల పక్షాన వుడా ద్వంద్వవైఖరి అలా కుదరదన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వందలాది స్థలాలు ఖాళీగా ఉన్నా పట్టించుకోలేదు అడ్డగోలుగా ముందుకెళ్లి.. బోల్తా పడిన వుడా నిబంధనలు అలా ఉన్నాయంటున్నారు.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటే స్వాధీనం చేసుకుని తీరుతామని బీరాలు పోతున్నారు. కానీ నగరంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిన వందలాది స్థలాలు ఏళ్ల తరబడి ఖాళీగానే పడున్నాయి. అడపదడపా నోటీసులివ్వడం తప్ప.. వాటి జోలికి ఏనాడూ వెళ్లని వుడా బాబులు.. కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఇచ్చిన స్థలం విషయంలో ఎందుకింత కఠినంగా వ్యవహరించారని ఆరా తీస్తున్న కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పైగా స్వాధీనం చేసుకుంటామన్న వారు.. మధ్యలో దాన్ని వదిలేసుకుంటే.. ప్రత్యామ్నాయంగా మరో స్థలం ఇస్తామని బేరాసారాలకు దిగడమేమిటన్న తాజా వివాదం రాజుకుంటోంది. విశాఖపట్నం : వంద కోట్ల విలువైన ఎన్ఎండీసీకి చెందిన భూమిని వెనక్కి తీసుకోవాలన్న వుడా వివాదాస్పద నిర్ణయం వెనుక మరో కోణం వెలుగుచూస్తోంది. పాతికేళ్ల క్రితం ఎన్ఎండీసీ కొనుగోలు చేసిన అర ఎకరా భూమిని అడ్డగోలుగా స్వాధీనం చేసుకుని ఇంటర్ గ్లోబ్ హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు నామమాత్రపు ధరకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో వుడా బరితెగింపునకు అడ్డుకట్ట పడినా.. తెరవెనుక జరిగిన వ్యవహారాలు ఇప్పుడు ఒక్కోటీ బయటకు వస్తున్నాయి. ఖాళీగా వందలాది స్థలాలు ఏళ్ల తరబడి ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగా వదిలేయడం వల్లే బీచ్‌రోడ్డులో ఉన్న జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ఖ (ఎన్ఎండీసీ) స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టామని వుడా అధికారులు బీరాలు పోతున్నారు. నిబంధనల మేరకే అలా చేశామని వాదిస్తున్నారు. వాస్తవానికి అలా ఖాళీగా వదిలేసిన స్థలాలు నగరంలో లెక్కలేనన్ని ఉన్నాయి. ఆయా స్థలాల యజమానులకు అడపాదడపా నోటీసులు ఇవ్వడం తప్పించి ఒక్క గజం భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు వుడా అధికారులు కనీస చర్యలు చేపట్టలేదు. కానీ ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ స్థలానికి ఎసరు పెట్టేందుకు మాత్రం నిబంధనలను సాకుగా చూపించారు. మరోవైపు ఎన్ఎండీసీతో తెరవెనుక రాయబేరాలూ సాగించారు. బీచ్ రోడ్డులోని స్థలం అప్పజెబితే..నగరంలో ఎక్కడ కావాలంటే అక్కడ మరో స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే స్వాధీనం చేసుకోవాలే గానీ.. ప్రత్యామ్నాయ స్థలం ఇస్తామని బేరం పెట్టడం చూస్తే.. వుడా కుట్ర ఏమిటో అర్థమవుతుంది. ఇంటర్ గ్లోబ్ ఎంచుకున్న స్థలమట పర్యాటకాభివృద్ధి కోసం రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టాలన్న ప్రభుత్వ ఆహ్వానంపై జాతీయస్థాయి కార్పొరేటు సంస్థలు ఇటీవల విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో పర్యటించాయి. ఆ క్రమంలో విశాఖలో పర్యటించిన ఇంటర్ గ్లోబ్ హోటల్స్ ప్రతినిధులను బీచ్ రోడ్డులో సువిశాలంగా ఉన్న ఎన్ఎండీసీకి చెందిన ఖాళీ స్థలం ఆకర్షించింది. ఇక్కడైతే స్టార్ హోటల్ కట్టేందుకు తాము సిద్ధమని అప్పటికప్పుడే వారు ప్రకటించేశారు. పర్యాటకశాఖ అధికారులు ఈ విషయమై జీవీఎంసీ, రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడగా, అది గతంలో వుడా విక్రయించిన స్థలమని తేలింది. అంతే.. ఆ స్థలాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకునే పనిని ప్రభుత్వ పెద్దలు వుడా అధికారులకు అప్పజెప్పారు. మొదట్లో వుడా అధికారులు తటపటాయించినా బడాబాబులు రంగప్రవేశం చేయడంతో అడ్డగోలుగా ముందుకు వెళ్లిపోయారు. ఆ భూమిని వెనక్కి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశారు. కండిషనల్ రిజిస్ట్రేషన్‌లో ఉన్న నిబంధనను తెరపైకి తెచ్చి స్థలాన్ని వెనక్కి తీసుకునేందుకు నోటీసులిచ్చారు. వుడా అధికారులకు అక్కడా అవమానమే.. ఖాళీగా ఉన్న స్థలంలో వెంటనే నిర్మాణాలు చేపడతామని, వెనక్కి తీసుకునే చర్యలు ఉపసంహరించుకోవాలన్న ఖనిజాభివృద్ధి సంస్థ విశాఖ అధికారుల గోడును పట్టించుకోని వుడా అధికారులు.. ఇదే సమయంలో ఎన్ఎండీసీ ఉన్నతస్థాయి అధికారులతో రాయబేరం నడిపారు. బీచ్‌రోడ్డు పక్కన స్థలాన్ని వదిలేస్తే ప్రత్యామ్నాయంగా మీకు మరో చోట స్థలం ఇస్తామనే ప్రతిపాదన తీసుకొచ్చారు. వెంటనే కావాలంటే రుషికొండ సమీపంలో ఇప్పటికే నిర్మించిన రే హౌసింగ్ ప్లాట్స్ ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వుడా వీసీ టి.బాబూరావునాయుడు మే నెలలో హైదరాబాద్ వెళ్లి ఎన్ఎండీసీ చైర్పర్సన్ భారతి ఎస్.సిహాగ్ను కలిసేందుకు ప్రయత్నించారు. వుడా వ్యవహారశైలితో గుర్రుగా ఉన్న ఆమె వీసీకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. దీంతో ఆగ్రహించిన వుడా అధికారులు ఈ నెల 6న ఎన్ఎండీసీకి కేటాయించిన స్థలాన్ని వెనక్కి చేసుకుంటామంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎన్ఎండీసీ ఉన్నతాధికారులు హైకోర్టుకు వెళ్లడంతో వుడా నిర్ణయాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక కేంద్ర గనులు, ఉక్కు శాఖ మంత్రి తోమర్ ఎన్ఎండీసీకి జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఓ పక్క కోర్టు అక్షింతలు, మరో పక్క కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆగ్రహావేశాలతో వుడా పరువు నట్టేట మునిగినట్టయిందని స్వయంగా వుడా వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
లా శాఖకు హైకోర్టు చురక!
- విశ్లేషణ యాసిడ్ దాడి, రేప్‌కు ప్రయత్నించిన వ్యక్తిని చంపే అధికారం మహిళలకు ఉందంటూ.. పార్లమెంటు ఐపీసీకి చేసిన సవరణ మరుగునపడితే మహిళ లకు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని ఎలా తెలుస్తుంది? బెంగళూరు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఎన్‌ఎల్‌ఎస్‌యూఐ) విద్యార్థి వంశ్ శరద్ గుప్తకు భారతీయ క్రైస్తవ వివాహ చట్టం 1972 పూర్తి పాఠం అవసరమైంది. ఎక్కడా దొర కలేదు. న్యాయ మంత్రిత్వ శాఖ లా విభాగం అధికారిక వెబ్సైట్ http://indiacode.nic.inలో ఆ చట్టం పాఠం ఉన్నా ఒక్క వాక్యం కూడా వరసగా చదవలేనంత జటిలంగా ఉంది. విద్యార్థులకు ఉపయోగమయ్యే ఈ వెబ్సైట్లో కొన్ని చట్టాలు అసలు చదవలేమనీ, ప్రైవేట్ పబ్లిషర్లు ప్రచురించే పుస్తకాలలో మూల చట్టం తప్పులు లేకుండా ఉందనలేమనీ, అధికారిక ప్రతినిధుల ఈమెయిల్ ఐడీలు పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. 1908లో రూపొందించిన సివిల్ ప్రొసీజర్ కోడ్ తాజా ప్రతి అధికారిక వెబ్సైట్లో లేదు. అడిగితే 1908 నాటి ప్రతిని, ఆ తరువాత పార్లమెంటు చేసిన వందకు పైగా సవరణల ప్రతులను ఇస్తున్నారు. వీటన్నింటిని సమన్వయం చేసి చట్టం పాఠం ఏమిటో తెలుసుకోవాలంటే కొన్ని నెలలు పడుతుంది. సవరణలను చేరుస్తూ నవీకరించిన తాజా ప్రతిని తయారు చేయవలసిన బాధ్యత శాసనాల విభాగానిదే. సవరించిన చట్టాల్ని ప్రైవేటు ప్రచురణ కర్తలు అమ్ముకుంటున్నారు. అధికారికంగా ప్రభుత్వం సవరించిన ప్రతిని అందుబాటులోకి తేవలసి ఉంది. సవరించిన రూపంలో వందలాది చట్టాలను ఇచ్చే స్థితి లేదు. శాసన విభాగం పీఐఓ సవరించిన తాజా శాసన పాఠాలను రూపొందించి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం మొదలైందని, ఇంకా కొన్నేళ్ల సమయం పడుతుందని వివరించారు. హిందీ భాషలో కూడా చట్టాలను అనువదించే కార్యక్రమం సాగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రస్తుత దశ, పూర్తయ్యే గడువు వివరాలు ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది. దరఖాస్తుకు నెలరోజుల్లో జవాబు ఇవ్వలేదు. మొదటి అప్పీలు పట్టించుకోలేదు. తమ ఈ మెయిల్ పనిచేస్తుందో లేదో చూసుకోరు. తాము పాటించవలసిన చట్టాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ఈ చట్టాల సమాచారం ప్రభుత్వం స్వయంగా వెల్లడించాల్సింది పోయి అడిగినా చెప్పకపోవడం ఆర్టీఐ ఉల్లంఘన అవుతుందంటూ విద్యార్థులకు కలిగిన నష్టాన్ని పూరించడానికి రూ.10 వేలను యూనివర్సిటీ గ్రంథాలయానికి ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది. ప్రభుత్వమే నడిపే విశ్వవిద్యాలయానికి రూ. 10వేలు ఇస్తే ప్రభుత్వానికి ఏ నష్టమూ లేదు. ఇవ్వకపోతే యూనివర్సిటీ సీఐసీలో ఫిర్యాదు కూడా చేయకపోవచ్చు. ఈ తీర్పు చట్ట విరుద్ధమని, అన్యాయమనీ నష్టపరిహారం ఆదేశం రద్దు చేయాలని శాసన మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. చట్టాన్ని అస్పష్టంగా, అసందిగ్ధంగా అందుబాటులో లేకుండా చేయడం అంటే దాన్ని రహస్యంగా మార్చి చట్టాలను తెలుసుకునే ప్రజల హక్కును భంగపరచరాదని, ఐటీని ఉపయోగించుకుని చట్టాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం ప్రభుత్వ బాధ్యత అనీ, సవరణలతో సంస్కరించిన చట్టాల పూర్తి ప్రతులను వెబ్సైట్లో ఉంచాలనీ, గ్రంథాలయానికి పదివేలు పరిహారం ఇవ్వాలనీ, ిసీఐసీ ఆదేశిస్తే దానిపై రిట్ పిటిషన్ వేయడాన్ని ఢిల్లీ హైకోర్ట్టు ప్రశ్నించింది. ఇది ప్రభుత్వ కనీస బాధ్యత. మహిళ తనపై యాసిడ్ దాడి జరిగినా, రేప్ ప్రయత్నం జరిగినా ఆత్మరక్షణ కోసం దాడి చేసే వ్యక్తిని చంపే అధికారం ఉందంటూ నిర్భయ చట్టం ద్వారా పార్లమెంటు ఇటీవల ఐపీసీని సవరించింది. ఈ సవరణతో కూడిన తాజా ఐపీసీని సులువుగా ప్రజలకు అందుబాటులో ఉండేట్టు చేయకపోతే మహిళలు తమను రక్షించుకునే హక్కు ఉందని ఎలా తెలుసుకుంటారు? ఇటువంటి తాజా శాసన సవరణ విషయాలను ఎప్పటిలోగా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారో చెప్పాలని సీఐసీ ఆదేశించింది. దీనిపైన రిట్ దాఖలు చేసిన విద్యార్థి ఆర్టీఐని సరైన రీతిలో దరఖాస్తు వేయలేదని, ఫీజు ఇవ్వలేదని, మొదటి అప్పీలు వేయలేదని కనుక రెండో అప్పీలు వినరాదని శాసన విభాగం వాదించింది. దీన్ని తిప్పికొడుతూ ఢిల్లీ హైకోర్టు గణనీయమైన తీర్పు ఇచ్చింది. ిసీఐసీ తీర్పుపై విచారించేందుకు హైకోర్టు అప్పీలు కోర్టు కాదని, కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ అసలు న్యాయానికి అడ్డుతగలకూడదని హితవు చెప్పింది. సీఐసీ ఇచ్చిన ఆదేశం సమంజసమనీ, న్యాయ విధానాన్ని ముందుకు నడిపేదిగానూ ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ సింగ్ వివరించారు. అసలు చట్టాలు ఒక క్లిక్‌లో అందు బాటులో తేవాల్సిన బాధ్యత ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రభుత్వంపైన ఉందని సీఐసీ సరిగ్గానే చెప్పారు... ప్రభుత్వమే అన్ని చట్టాలను అందుబాటులో ఉంచాలి. రూ.10వేల పరిహారం గురించి లేవనెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ ఈ పిటిషన్ వేయడానికి రూ.10వేల కన్న ఎక్కువే ప్రభుత్వం ఖర్చుచేసి ఉంటుంది. కనుక సీఐసీ ఆదేశించిన రూ.10వేలను ఈ పిటిషన్ వేయడానికి కారకులైన అధికారుల జీతాలనుంచి మినహాయించి పరిహారం చెల్లించాలి అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సామాన్య జనంపై.. కోర్టుల్లో ప్రభుత్వాలే సుదీర్ఘ సమరాలు చేయడం ఎంత అసమంజసమో ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పులో వివరించింది. (సీఐసీలో ఈ రచయిత ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు రిట్ పిటిషన్(సి) 4761-2016లో మే 24 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
రాజ్యాంగంపై విశ్వాసానికి ఈ ఉత్తర్వులు ప్రతీక
రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ హైదరాబాద్: రోజాపై ఏడాది పాటు సస్పెన్సన్ వేటు వేస్తూ చేసిన తీర్మానం అమలును నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆమెతరపు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా రోజా రాజ్యాంగపరమైన హక్కులు పునరుద్ధరించబడ్డాయని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై విశ్వాసానికి ఈ ఉత్తర్వులు ప్రతీక అన్నారు. హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయం చేసేందుకు న్యాయస్థానాలు ఉన్నాయన్న ప్రజల నమ్మకాన్ని ఇటువంటి ఉత్తర్వులు నిలబెడతాయన్నారు. ఇవి మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని వీటిపై ఇంతకుమించి తానేమీ వ్యాఖ్యానించబోనని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల వల్ల రోజా శాసనసభకు హాజరు కావచ్చునని తెలిపారు. -
స్పీకర్ ఆఫీస్ తీరు ఇదేనా?
ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ ‘‘ఏవో సాంకేతిక కారణాలు చూపి ఒక సభ్యురాలి హక్కులకు భంగం కలిగిస్తారా? స్పీకర్ కార్యాలయం ఏం చేస్తోంది? ప్రజాప్రతినిధి పట్ల ఇలాగే వ్యవహరిస్తారా? ఒక నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో వ్యవహరించేది ఇలాగేనా? సమ్ థింగ్ రాంగ్.. పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రార్ ఎలా తిరస్కరిస్తారు? హైకోర్టు ఏం చేస్తోంది? జ్యుడీషియల్ ఆర్డర్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఇది కేవలం ఒక్క అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాత్రమే చేసినట్లు కనిపించడం లేదు.’’ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెన్షన్‌కు గురైన నగరి శాసనసభ్యురాలు, వైఎస్సార్సీపీ నేత ఆర్.కె.రోజా పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలివి. నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో రోజా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. అయితే విచారణార్హత లేదంటూ రోజా పిటిషన్‌ను హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రోజా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రోజా అప్పీలుపై జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన సుప్రీం ధర్మాసనం దాదాపు గంటకు పైగా విచారించింది. ఆ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సుప్రీం ధర్మాసనం జరిపిన విచారణ ఇలా సాగింది... ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే... తొలుత రోజా తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు ప్రారంభిస్తూ ‘‘ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాల నిబంధనావళిలోని 340(2) నిబంధన ప్రకారం ఒక సభ్యుడిని ఆ సెషన్లో మిగిలిన రోజులకు చెల్లుబాటయ్యేలా మాత్రమే సస్పెండ్ చేసేందుకు వీలుంది. కానీ రోజా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా సభా తీర్మానం పేరుతో శీతాకాల సమావేశాల్లో (డిసెంబరు 18న) ఏడాదిపాటు సస్పెన్షన్ విధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులను ఈ సస్పెన్షన్ ఉల్లంఘిస్తోంది. అంతేకాకుండా స్పీకర్ హోదాకు ఉన్న వన్నెను తగ్గిస్తుంది. ఇది సభా నిబంధనావళిని ఉల్లంఘించడమే అవుతుంది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాను సస్పెండ్ చేశారు. సమావేశాలు డిసెంబరు 22తో ముగుస్తుండగా.. ఆ సెషన్లో మిగిలిన దినాలైన 18 నుంచి 22 వరకు మాత్రమే సస్పెండ్ చేసేందుకు నిబంధనల ప్రకారం వీలుంది. కానీ ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వు కాపీ కూడా ఇవ్వలేదు. అసెంబ్లీకి వెళితే పోలీసులు అమానుషంగా ప్రవ ర్తించారు. సస్పెన్షన్‌కు సంబంధించిన కాపీ ఇవ్వాలని ఎన్నిసార్లు లేఖరాసినా స్పందన లేదు. ప్రతిపక్ష నేత లేఖ రాసినా స్పందన లేదు. చిట్టచివరకు ఆ సస్పెన్షన్ ఉత్తర్వు కాపీని మార్చి 3, 2016న హైకోర్టులో విచారణ సందర్భంలో ఇచ్చారు..’’ అని వివరించారు. హైకోర్టు రిజిస్ట్రార్ తిరస్కరించారు... ‘‘రోజా పిటిషన్ హైకోర్టులో ఫిబ్రవరి 15, 16, 17, 29 తేదీల్లో విచారణకు వచ్చింది. ఫిబ్రవరి 29న కౌంటర్దాఖలు చేయాలంటూ సింగిల్ జడ్జి ప్రతివాదికి నోటీసులు ఇస్తూ మార్చి 9కి విచారణను వాయిదావేశారు. మరోవైపు బడ్జెట్ సెషన్ మార్చి 5న ప్రారంభం కానున్న నేపథ్యంలో పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా మార్చి 3న అదనపు అడ్వొకేట్ జనరల్ సస్పెన్షన్ తీర్మానం కాపీని హైకోర్టులో ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అత్యవసర పిటిషన్‌గా పరిగణించాలని రోజా కోరినా సింగిల్ జడ్జి బెంచి ఈ పిటిషన్‌ను వినేందుకు తిరస్కరించింది. మార్చి 9నే విచారిస్తానని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 4వ తేదీనే సింగిల్ జడ్జి బెంచ్ వద్ద ఉన్న పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు వీలు కల్పించాలని, తమకు లభించిన సస్పెన్షన్ తీర్మానం ప్రతి ఆధారంగా మరిన్ని వాదనల తో తాజాగా మరో రిట్‌పిటిషన్ దాఖలు చేసుకుంటామని పిటిషనర్ రోజా దరఖాస్తు చేసుకున్నారు. అందుకు బెంచ్ సమ్మతించింది. ఈ నేపథ్యంలో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా రిజిస్ట్రార్ ఆ పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ తిరస్కరించారు. అందుకే సుప్రీం కోర్టును ఆశ్రయించాం.. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున సభ్యురాలిని సమావేశాలకు హాజరయ్యేలా ఉత్తర్వులు జారీచే యాల్సిందిగా కోరుతున్నాం..’’ అని విన్నవించారు. హైకోర్టు ఏం చేస్తోంది? రోజా తరపు న్యాయవాది అభ్యర్థన విన్న తరువాత జస్టిస్ అరుణ్‌మిశ్రా జోక్యం చేసుకుంటూ ‘మరో పిటిషన్ దాఖలు చేసుకునేందుకు సింగిల్ జడ్జి బెంచ్ స్వేచ్ఛనిచ్చినా రిజిస్ట్రార్ తిరస్కరించారా? రిజిస్ట్రార్‌కు ఏం సంబంధం? పిటిషన్‌ను ఎలా తిరస్కరిస్తారు?’ అని ప్రశ్నించారు.. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇచ్చిన తిరస్కరణ ఉత్తర్వును న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ‘అయితే అది చట్టబద్ధం కాని కారణాల వల్ల అలా జరిగి ఉండొచ్చు..’ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జస్టిస్ గోపాల గౌడ జోక్యం చేసుకుంటూ ‘హైకోర్టు ఏం చేస్తోంది? జ్యుడీషియల్ ఆర్డర్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎలా రాస్తారు? అలా చెప్పే పని ఆయనది కాదే? ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇది పద్ధతి కాదు. ఇలా ఎలా వ్యవహరిస్తారు? బడ్జెట్ సెషన్ జరుగుతుండగా.. ఇలాంటి పద్ధతికి ఎలా పాల్పడుతారు?’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో రోజా తరఫు న్యాయవాది మరోసారి లేచి బడ్జెట్ సెషన్లో రోజా మహిళల సమస్యలను లేవనెత్తాల్సి ఉందని ప్రస్తావించారు. దీంతో జస్టిస్ గోపాల గౌడ స్పందిస్తూ ‘అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎలా జ్యుడీషియల్ ఉత్తర్వులను పట్టించుకోకుండా తనకు సంబంధం లేని విధులను ఎలా నిర్వర్తిస్తారు? హైకోర్టు రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఏం జరుగుతుందో హెకోర్టు చీఫ్ జస్టిస్ తప్పకుండా తెలుసుకుని తీరాలి..’ అని వ్యాఖ్యానించారు. ‘రెండు రోజుల్లో ఈ కేసును పరిష్కరించాలని మేం చీఫ్ జస్టిస్‌కు సూచనలు ఇస్తాం.’ అని చెబుతుండగా న్యాయవాది మరోసారి తన వాదనలు వినిపించారు. ఆ తీర్పులు చూడండి.. న్యాయవాది లేచి ‘ఆర్టికల్ 32 కింద నా అభ్యర్థనను ఇక్కడే విచారించండి. గతంలో సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో ఇలాంటి విషయాలను విచారణకు స్వీకరించింది. ఇటీవలే అలగాపురం ఆర్.మోహనరాజు అండ్ అదర్స్ వర్సెస్ తమిళనాడు శాసనసభ కేసులో జస్టిస్ చలమేశ్వర్ ఇచ్చిన తీర్పును పరిశీలించండి. రాజారాంపాల్ వర్సెస్ లోక్‌సభ స్పీకర్ కేసును పరిశీలించండి..’ అని విన్నవించారు. దీంతో జస్టిస్ గోపాల గౌడ స్పందిస్తూ ‘మీ పిటిషన్ విచారించాలని మేం హైకోర్టుకు సూచిస్తాం. రిజిస్ట్రార్ చేసిన వ్యాఖ్యలు సరికాదు. చాలా తెలివిగా రాశారు. వెంటనే రోస్టర్ బెంచికి ఈ పిటిషన్ కేటాయించాలని సూచిస్తాం..’ అని పేర్కొన్నారు. దీంతో మరోసారి ఇందిరా జైసింగ్ వాదిస్తూ ‘త్వరలో బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి. ఈ నేపథ్యంలో నేను అక్కడికి వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు గానీ, ఉపశమనం గానీ దక్కించుకుంటానన్న నమ్మకం లేదు.. ’ అని వాపోయారు. ‘ఈ కోర్టులో కూడా రెండు ధర్మాసనాలు కేసు విచారణ నుంచి తప్పుకున్నాయి..’ అని వాపోయారు. దీనికి జస్టిస్ గౌడ స్పందిస్తూ ‘లేదు. మా ఉత్తర్వులు తప్పకుండా అమలవుతాయి.. ఒకవేళ మా ఉత్తర్వులు అమలు కానిపక్షంలో ఎలా అమలు చేయించాలో మాకు తెలుసు.. హైకోర్టులో ఒక పిటిషన్ విచారణలో ఉండగా మేం దీనిని విచారించలేం..’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదిపై ఆగ్రహం.. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది బసవ ప్రభు పాటిల్ లేచి వాదనలు వినిపించబోతుండగా జస్టిస్ గోపాల గౌడ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరు ఒకవేళ ఈ కేసులో వాదనలు వినిపిం చడం ప్రారంభిస్తే పిటిషన్‌ను ఇక్కడే విచారిస్తాం. ఇది డెలిబరేట్లీ(ఉద్దేశపూర్వకంగా) జరిగింది. ఇది కేవలం ఒక్క అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాత్రమే చేసినట్లు కనిపించడం లేదు..’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పాటిల్ మరోసారి ‘మా వాదన కూడా వినండి..’ అని కోరగా ‘ఇంకేం వినమంటారు? అసిస్టెంట్ రిజిస్ట్రార్ రాసింది మేం చూశాం కదా.. మీరు ఒకవేళ వాదనలు ప్రారంభిస్తే మేం కేసును వింటాం..’ అని హెచ్చరించారు. ‘దక్షిణ భారత దేశంలో ఎన్ని రిట్ పిటిషన్లు ఉన్నాయి. మా దగ్గర సమాచారం లేదా? ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్ చేయాల్సిన పనా ఇది? డిప్యూటీ రిజిస్ట్రార్, అదనపు రిజిస్ట్రార్ లేరా?..’ అని జస్టిస్ గౌడ వ్యాఖ్యానించారు. పిటిషనర్ సస్పెండయ్యాక రెండు నెలల వరకు కోర్టును ఆశ్రయించలేదని మళ్లీ పాటిల్ వాదించబోగా ‘మీరు ఇన్బిట్వీ న్ లైన్స్(మా భావాన్ని) గా అర్థం చేసుకోండి..’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో జైసింగ్ లేచి కనీ సం సస్పెన్షన్ తీర్మానం కాపీని కూడా ఇవ్వలేదని విన్నవించారు. ‘ఎందుకు ఇలా.. స్పీకర్ కార్యాలయం సస్పెన్షన్ తీర్మానాన్ని ఇవ్వలేదా? దేశంలో ఏం జరుగుతోంది? మీరు ఏదో సాంకేతిక కారణా లు చూపి ఒక సభ్యురాలి హక్కులకు భంగం కలిగి స్తారా? స్పీకర్ కార్యాలయం ఏం చేస్తోంది? ప్రజాప్రతినిధి పట్ల ఇలాగే వ్యవహరిస్తారా? ఒక నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో వ్యవహరించేది ఇలాగేనా? మమ్మల్ని బాధించింది.. సమ్ థింగ్ రాంగ్.. సమ్ థింగ్ రాంగ్..’ అంటూ పేర్కొన్నారు. జస్టిస్ అరుణ్ మిశ్రా కల్పించుకుని ‘పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని ఊరుకుంటున్నాం. కానీ మీరు ప్రభుత్వానికి మద్దతుగా వాదిస్తున్నారు. అలాగే డిఫెండ్ చేస్తానంటే ఈ కేసును ఆర్టికల్ 32 కింద ఇక్కడే విచారిస్తాం.. అసెంబ్లీ నడుస్తుండగా ఇలా ఎలా వ్యవహరిస్తారండీ? మీ క్లయింట్‌కు సరైన సలహా ఇవ్వండి’ అంటూ ఏపీ ప్రభుత్వ న్యాయవాది బసవ ప్రభు పాటిల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే మా తొలి ప్రశ్న అవుతుంది.. ‘మీరు వాదిస్తానంటే చెప్పండి.. 340(2) నిబంధన కింద ఏడాదిపాటు ఎలా సస్పెండ్చేస్తారన్నదే మా తొలి ప్రశ్నగా ఉంటుంది. అది మిమ్మల్ని ఇరకాటంలో పెడుతుంది..’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు జారీ చేసేందుకు సంసిద్ధులవుతూ ‘సింగిల్ జడ్జి బెంచ్ విని ఉండాల్సింది. వినకపోవడం న్యాయంగా లేదు.. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పని చట్టబద్ధంగా లేదు..’ అని పేర్కొన్నారు. ‘మేం పిటిషనర్‌ను బుధవారం ఉదయం 10 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ వద్ద కేసును ప్రస్తావించాలని సూచిస్తున్నాం. చీఫ్ జస్టిస్ ఈ కేసును రోస్టర్ ప్రకారంగా గానీ, లేదా ఏ బెంచికైనా గానీ ఈ పిటిషన్‌ను కేటాయించి విచారించేలా చూడాలి. మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీచేయాలి. ప్రతివాదులు కూడా ఈ కేసులో హాజరవ్వాలి. అలాగే మా ఉత్తర్వుల అమలుతో కూడిన నివేదికను ఈమెయిల్ ద్వారా, టెలెక్స్ ద్వారా మాకు సాయంత్రానికల్లా తెలపాలి.. అలాగే పిటిషన్‌కు విచారణార్హత ఉందని మా ఉత్వర్వుల్లో స్పష్టం చేస్తున్నాం. తక్షణం ఈ ఉత్తర్వులను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు తెలియపరచాలి..’ అని రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సంతోషంగా ఉంది: రోజా ‘ఆర్టికల్ 32 కింద మా పిటిషన్‌ను విచారించాలని కోరాం. ఒక్క రోజులోనే పిటిషన్‌ను విచారించాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు మార్గదర్శనం చేసింది.. నాకు చాలా సంతోషంగా ఉంది..’ అని రోజా పేర్కొన్నారు. విచారణ అనంతరం సుప్రీం కోర్టు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘సస్పెండైన రెండు నెలల వరకూ కోర్టుకు రాలేదని ప్రతివాది తరపు న్యాయవాది ఏదో చెప్పే ప్రయత్నం చేశారు.. కానీ మా ఎమ్మెల్యేలు, మా నేత రాసిన ఉత్తరాలు ఉన్నాయి.. అవన్నీ చెప్పాం.. బడ్జెట్ సమావేశాల్లో మహిళల సమస్యలపై, అధికార పార్టీ అకృత్యాలపై మాట్లాడతానని నన్ను సస్పెండ్ చేశారు. కాల్ మనీ రాకెట్‌పై మాట్లాడినందుకే, వారిని నిలదీసినందుకే నన్ను సస్పెండ్ చేశారు.. నన్ను మాత్రమే టార్గెట్ చేశారు..’ అని విమర్శించారు. అసెంబ్లీ జరుగుతున్న తీరుపై మాట్లాడుతూ ‘అధికార పార్టీ నేతలు బజారు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలపై కూడా మాట్లాడొద్దంటే ఎలా? అవిశ్వాస తీర్మానం పెడితే మా నేతను అన్‌పార్లమెంటరీ పదాలతో తిట్టారు. మా నేత మాట్లాడుతుండగానే తీర్మానాన్ని ముగించారు. ప్రజల బాధను ప్రతిపక్షాలు ఆవేదనగా, ఆవేశంగా చెప్తాయి. దాన్ని వక్రీకరించి ఇలా చేయడం సరికాదు..’ అని పేర్కొన్నారు. -
‘సెస్’ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
► అభ్యర్థి లేదా ఏజెంట్‌కు అనుమతి ► కౌంటింగ్‌కు నాలుగు టేబుళ్లు ► హైకోర్టు నిర్ణయంపైనే ► ఉత్కంఠ కోర్టు నిర్ణయానికి లోబడి ఫలితాలు ► ఎన్నికల అధికారి చంద్రమోహన్‌రెడ్డి సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, పోటీ చేసిన అభ్యర్థులు, లేదా వారి తరఫున ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఎన్నికల ఫలితాలు సాయంత్రం 3 గంటల వరకు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. పోలింగ్ సరళిపై చర్చలు ‘సెస్’ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై అంచనాలు వేస్తూ.. తమకు వచ్చే ఓట్ల గురించి అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. సిరిసిల్ల పట్టణంలో పది మంది బరిలో ఉండగా ఇద్దరి మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటల్లో ద్విముఖ పోటీ ఉండడంతో గెలుపుపై ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. ముస్తాబాద్‌లో నలుగురు పోటీలో ఉండగా అధికార టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గెలుపుపై ధీమాగా ఉన్నారు. వేములవాడ పట్టణంలో ఆరుగురు బరిలో ఉండగా విజయంపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. వేములవాడ రూరల్‌లో అధికార పార్టీ గెలుపుపై ధీమాగా ఉంది. చందుర్తిలో చతుర్ముఖ పోటీ ఉన్నా విజయంపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కోనరావుపేటలో చతుర్ముఖ పోటీలో గెలుపెవరిదో అంతుచిక్కని పరిస్థితి. ఇల్లంతకుంటలో ఆరుగురు, బోయినపల్లిలో నలుగురు పోటీలో ఉన్నారు. 11 డెరైక్టర్ స్థానాలకు 50 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. హైకోర్టుదే తుది నిర్ణయం ‘సెస్’ ఎన్నికల ఫలితాలపై హైకోర్టుదే తుది నిర్ణయంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో అర్హులైన ఓటర్లను బకాయిల పేరుతో ఓటింగ్‌కు దూరం చేశారని, చనిపోయిన ఓటర్ల స్థానంలో వారి వారసులకు అవకాశం కల్పించలేదని పేర్కొంటూ సిరిసిల్లకు చెందిన డి.ప్రభాకర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల పక్రియను కొనసాగించాలని, ఫలితాలు ఎలా వచ్చినా కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. పిటిషనర్ ప్రభాకర్‌రావు వాదనను కోర్టు సమర్థిస్తే ఎన్నికలే రద్దయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఆయన వాదనతో ఏకీభవించకుంటే ‘సెస్’ ఎన్నికలకు ఎలాంటి ప్రమాదం లేదని సహకార శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కోర్టు నిర్ణయానికి లోబడి ఫలితాలు సెస్’ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. మంగళవారం కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తాం. బుధవారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థి లేదా అతని తరఫున ఏజెంట్‌ను కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరినో ఒక్కరినే అనుమతిస్తాం. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం అందిస్తాం. ఆ పత్రంలో నోట్ పెట్టి కోర్టు నిర్ణయానికి లోబడి ఉండాలనే నిబంధనను స్పష్టం చేస్తాం. ఓట్ల లెక్కింపునకు 25 సిబ్బందిని నియమించాం. గురువారం ‘సెస్’ ఆఫీస్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మెజార్టీ డెరైక్టర్ల ఆమోదం మేరకు జరుగుతుంది. అంతిమంగా కోర్టు నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే - జి.చంద్రమోహన్‌రెడ్డి, ఎన్నికల అధికారి -
పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం అపహాస్యం
హైకోర్టు సీనియర్ న్యాయవాది, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ మాజీ కార్యదర్శి చిత్తరువు తెనాలి : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసేలా ఉన్నాయని హైకోర్టు సీనియర్ న్యాయవాది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్‌సెల్ మాజీ కార్యదర్శి చిత్తరువు శివనాగేశ్వరరావు అన్నారు. మాతృవియోగం కారణంగా తెనాలిలో ఉన్న శివనాగేశ్వరరావును బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున పరామర్శించారు. ఈ సందర్భంగా శివనాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యేలు చెబుతున్నారని గుర్తు చేస్తూ, ఏపీలో 67 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలకు అభివృద్ధి, సంక్షేమ నిధులను విడుదల చేయొద్దని ఉత్తర్వులు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. దురదృష్టకరం : డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను తాకట్టుపెడుతూ కొందరు ఎమ్మెల్యేలు అధికారపక్షం వైపు చూడటం దురదృష్టకరమన్నారు. ప్రలోభాలకులోనై పార్టీలు మారినవారికి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. జిల్లాలో తమ ఎమ్మెల్యేలకు పార్టీ మారాల్సిన పని లేదన్నారు. పార్టీ నేతలు పెరికల కాంతారావు, గుంటూరు కృష్ణ, గాదె శివరామకృష్ణారెడ్డి ఉన్నారు. -
సీమకు అన్యాయం చేస్తే సహించం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం సాధన కోసం విద్యార్థి సంఘాలు గర్జించాయి. సీమకు అన్యాయం చేస్తే సహించమంటూ నినాదాలు చేశాయి. రాయలసీమ రాష్ట్ర సాధనే ధ్యేయమని ప్రకటించాయి. సీమపై పాలకులు చూపుతున్న వివక్షపై దండెత్తాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోస్తా జపం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్, ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫెడరేషన్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు మూడు వేల మంది విద్యార్థులు హాజరై సీమ సమస్యలపై గళమెత్తారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు వీవీనాయుడు అధ్యక్షతన మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో నిర్వహించిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నక్కలమిట్ల శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 20 స్మార్ట్ సిటీలను ప్రకటించగా వెనుకబడిన రాయలసీమలో ఒక్కటి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజనతో రాళ్ల సీమగా మారిన రాయలసీకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలుకు రావాల్సిన రాజాధాని అమరావతికి తరలించారని, హైకోర్టును అక్కడే స్థాపించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీంతో సీమకు రావాల్సిన పరిశ్రమలు కోస్తాకు తరలిపోతున్నాయని, అక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుతుందన్నారు. అంతకుముందు రాజవిహార్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు 3000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణారావు, బాలసుందరం, అరుణ్‌శర్మ, రవికుమార్, నాగేశ్వరరెడ్డి, సుహాన్బాష, రాజునాయుడు, శివకుమార్, క్రాంతికుమార్, రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం వ్యాఖ్యలపై న్యాయపోరాటం
పుంగనూరు : ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబునాయుడు దళితులను అవమానపరిచేలా మాట్లాడడం సరికాదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, దళిత నేత ఎన్.రెడ్డెప్ప స్పష్టం చేశారు. హైకోర్టులో కేసు దాఖలు చేస్తామన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ‘దళితులుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు’ అంటూ మాట్లాడడం వారి మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అన్నారు. సమాజంలో దళితులు దుర్భరజీవితం గడుపుతున్నారని, వారిని ఆదుకోవాల్సింది పోయి అవహేళన చేయడం శోచనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ కులాలను అవమానపరచినా సహించేది లేదని ఈ సంద ర్భంగా రెడ్డెప్ప హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీపీలు నరసింహులు, అంజిబాబు, కౌన్సిలర్ మనోహర్, దళిత నాయకులు సురేష్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
మార్పు తప్పదు!
బీటీపీఎస్ నిర్మాణంపై నీలినీడలుముందుచూపు లేని టీఎస్ జెన్కోకేంద్రం సీరియస్ కావడంతోపునరాలోచన పనులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్ల గగ్గోలు మణుగూరు: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్) నిర్మాణంపై అస్పష్టత నెలకొంది. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దులోని సాంబాయిగూడెం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట, సీతారాంపురం గ్రామాల వద్ద నిర్మించే ప్లాంటు, ఉత్పత్తికి సంబంధించి కాలంచెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడడమే కాక కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు ల శాఖ నుంచి ఎలాంటి పర్యావరణ అనుమతులు రాకుండానే హడావుడిగా బీహెచ్ఈఎల్ ద్వారా టీఎస్ జెన్కో నిర్మాణ పనులు మొదలుపెట్టి.. శరవేగంగా చేయిస్తుండడంతో పరిస్థితి మొదటికొచ్చింది. అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే గత ఏడాది సెప్టెంబర్ నుంచే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ఒక్కొక్కటి 270 యూనిట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్ల ద్వారా 1,080 మొగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో సుమారు 1100 ఎకరాల్లో ప్లాంట్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి భూనిర్వాసిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో ప్యాకేజీలు చెల్లించకపోవడంతోపాటు ఉద్యోగాలు కోరుకున్న 371 మంది యువతకుఇప్పటికీ ఉద్యోగ హామీ పత్రాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు మాత్రం శరవేగంగా జరిగాయి. 2016 డిసెంబర్ కల్లా మొదటి యూనిట్ నుంచి 270 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో యూనిట్ పనులతోపాటు స్విచ్‌యార్డ్, బాయిలర్, చిమ్నీ పనులు సైతం పునాది దశను దాటాయి. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మానవ హక్కుల వేదిక ద్వారా నేషనల్ ట్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పర్యావరణ అనుమతులు లేనందున భద్రాద్రి పనులు నిలిపేయాలని జెన్కోను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్టే కోరుతూ టీఎస్ జెన్కో హైకోర్టును ఆశ్రయించింది. పర్యావరణ అనుమతులు లేనందున పనులెలా చేస్తారని హైకోర్టు సైతం జెన్కోను ప్రశ్నించింది. ఇందులో హైకోర్టు కేంద్ర పర్యావరణ శాఖను ప్రతివాదిగా చేర్చింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి వచ్చిన డిప్యూటీ డెరైక్టర్ కరుపయ్య గత నెల 9వ తేదీన ప్లాంట్ పనులను తనిఖీ చేసుకుని వెళ్లి.. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ సీరియస్‌గా పరిగణించడంతోపాటు హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ సైతం పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్న పనులపై ప్రశ్నించింది. దీంతో 20 రోజుల కిందట ప్లాంట్ పనులు పూర్తిగా నిలిపేశారు. తిరిగి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయమై ఇప్పటివరకు స్పష్టత లేకుండా పోయింది. ఏ అధికారి సైతం ఈ విషయమై స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు సబ్ కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు రాకపోగా, యంత్రాలు ఆపివేయడంతో అవి దెబ్బతింటాయని ఆందోళనకు గురవుతున్నారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అవలంబిస్తేనే అనుమతులు.. మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, విద్యుత్ శాఖల నిబంధనల ప్రకారం 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంకన్నా ఎక్కువగా ఉంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉంది. అయితే 1080 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మిస్తున్నందున కాలుష్యం తక్కువగా వెదజల్లే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉంది. అయితే దీనికి విరుద్ధంగా కాలంచెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ మాత్రమే వాడుతుండడంతో కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయినప్పటికీ పనులు చేపట్టడంతో పరిస్థితి గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం బంతి హైకోర్టు పరిధిలో ఉంది. మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఈ అంశాలపై హైకోర్టులో వాదనలు వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ నుంచి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారడంతోపాటు దీనికి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ మారిస్తేనే పర్యావరణ అనుమతులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. పైగా ఇప్పటివరకు యుద్ధప్రాతిపదికన పనులు చేయడంతో జెన్కోపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీంతో టీఎస్ జెన్కో పునరాలోచనలో పడింది. మరోవైపు కాలం చెల్లిన మెటీరియల్ వదిలించుకునేందుకు బీహెచ్ఈఎల్ పనికిరాని పరికరాలను టీఎస్ జెన్కోకు అంటగట్టేందుకు ప్రయత్నించిందనే అనుమానాలను పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ టెక్నాలజీ, పరికరాలు మారిస్తేనే బీటీపీఎస్‌కు పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉంది. -
పింఛన్ల పునరుద్ధరణకు హైకోర్టు ఆదేశం
ఎచ్చెర్ల : తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రరుుంచిన బాధితులకు న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... తమ పింఛన్లను జన్మభూమి- మా ఊరు కమిటీలు అకారణంగా తొలగించాయని, అర్హత ఉన్నా రాజకీయ కక్ష నేపథ్యంలో తమ జీవనాధారాన్ని దెబ్బ తీశారని ఫరీదుపేట గ్రామానికి చెందిన ఆరుగురు హైకోర్టును ఆశ్రయించారు. తాము జనవరి 21న కోర్టును ఆశ్రరుుంచగా అనుకూలంగా కోర్టు ఉత్తర్వుల ప్రతి బుధవారం అందిందని వారు చెప్పారు. తమలో పైడి అప్పారావు, కొత్తకోట చెల్లన్నలకు వృద్ధాప్య పింఛన్, కొత్తకోట పద్మావతికి వికలాంగ పింఛన్ పునరుద్దరించాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. కొత్తకోట అమ్మాయమ్మ, కొత్తకోట సూర్యనారాయణ(అర్జెంట్ నోటీస్)లకు ఎందుకు కొత్త పింఛన్లు అందజేయడం లేదో చెప్పాలని, సూర లక్ష్మీనర్సమ్మ అర్హతను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో చెప్పాలని కోర్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు చెప్పారు. బాధితులు ఎంపీడీఓ, గ్రామ, మండల జన్మభూమి కమిటీలు, గ్రామ కార్యదర్శి, డీఆర్డీఏ పీడీ, కలెక్టర్, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ కార్యనిర్వహణ అధికారులను పార్టీలుగా చేర్చారు. -
వీఆర్వోలకు టైం సెట్ చేయండి: హైకోర్టు
గామ రెవిన్యూ అధికారి (వీఆర్ఓ) ప్రతీ గ్రామంలో నిర్ధిష్ట సమయం మేర ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు సూచించింది. ఇందుకు గాను గ్రామస్థాయిలో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, రెండు మూడు గంటలు వీఆర్ఓ ఆ గ్రామంలో సమయం వెచ్చించేలా చూడాలంది. తద్వారా కూడా రెవిన్యూశాఖలో అవినీతి నిరోధించడానికి వీలవుతుందని అభిప్రాయపడింది. రెవిన్యూ, విద్యుత్‌శాఖలో అవినీతి నిరోధానికి కోర్టు సహాయకులు (అమికస్ క్యూరీ)గా ఉన్న సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి ఇచ్చిన సూచనలు, సలహాలు బాగున్నాయని, వాటిని అమలు చేసే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వానికి తెలిపింది. అలాగే అవినీతి నిరోధానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో తగిన సూచనలు, సలహాలతో ముందుకు రావాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెవిన్యూ అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటును నిర్ణయించుకుని, ఆ మేర రైతుల నుంచి వసూలు చేస్తున్నారంటూ పత్రికల్లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఈ కేసులో కోర్టు సహాయకులుగా నియమితులైన సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి అవినీతి నిరోధానికి కొన్ని సూచనలు, సలహాలను రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం, ఇవి చాలా బాగున్నాయని, ఇందుకు తాము సత్యంరెడ్డిని అభినందిస్తున్నామని తెలిపింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ, అందరి సూచనలు, సలహాలను తీసుకుని వారిపై ప్రభుత్వంతో చర్చించి, పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతాని ఆయన తెలిపారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వం కూడా సూచనలు, సలహాలతో రావాలంటూ విచారణను వాయిదా వేశారు. అమికస్ క్యూరీ చేసిన సూచనలు, సలహాలు : - గ్రామస్థాయిలో వీఆర్ఓ కీలక అధికారి. అయితే అతను గ్రామస్తులకు అందుబాటులో ఉండటం లేదు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో అతనికి ఓ ఆఫీసు ఉండాలి. నిర్ధిష్ట సమయాల్లో అక్కడకు వచ్చేలా చూస్తే గ్రామస్తులు అతన్ని కలిసేందుకు అవకాశం ఉంటుంది. వీఆర్ఓ గ్రామాలకు రావడం అరుదుగా జరుగుతోంది. వారు మండల కేంద్రాల్లోనే ఉంటున్నారు. వారంలో ఓ రోజు మినహా మిగిలిన రోజుల్లో మండల కేంద్రానికి రాకుండా వీఆర్ఓపై నిషేధం విధించాలి. - వీఆర్ఓ తప్పనిసరిగా గ్రామంలోనే నివాసం ఉండాలి. మండలంలో నివశిస్తున్న వ్యక్తినే వీఆర్ఓగా నియమించాలి. వీఆర్ఓల విద్యార్హత కనీసం ఇంటర్‌గా నిర్ణయించాలి. మండల పరిధి నుంచి వీఆర్ఓను బదిలీ చేయరాదు. రెవిన్యూ ఇన్స్పెక్టర్లు వారంలో ఓ రోజు నిర్ధిష్ట సమయంలో గ్రామాన్ని సందర్శించాలి. రైతుల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించాలి. అంతేకాక సమస్యలకు సంబంధించి వీఆర్ఓ ఓ రిజిష్టర్‌ను నిర్వహించేలా చూడాలి. గ్రామ సందర్శనకు వచ్చినప్పుడు రెవిన్యూ ఇన్స్పెక్టర్లు ఈ రిజిష్టర్‌ను తప్పక పరిశీలించాలి. - రైతులకు సహాయ సహకారాలు అందించేందుకు గ్రామ వ్యవసాయాధికారి పోస్టును సృష్టించాలి. అతను గ్రామంలోనే నివశించేలా చూడాలి. తహసీల్దార్ రెండు నెలకు ఓసారి గ్రామాన్ని సందర్శించేలా చూడాలి. రైతుల ఫిర్యాదులను పరిష్కరించేలా చూడాలి. - అమ్మకపు లావాదేవీలు జరిగినప్పుడు రికార్డుల్లో యాజమాన్యపు హక్కు వివరాలను నిర్ధిష్ట కాల పరిమితిలోపు పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలి. అలాగే రికార్డుల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నప్పుడు నిర్ధిష్ట కాల పరిమితి లోపు వాటిని వీఆర్ఓ అందచేయాలి. - మండల స్థాయిలో ఉన్న మీ సేవా కేంద్రాలను గ్రామస్థాయిలకు విస్తరించాలి. అన్ని దృవీకరణ పత్రాలు ఇందులో లభించేలా చూడాలి. - అసంపూర్తిగా ఉందన్న సాకుతో రైతులు పెట్టుకునే దరఖాస్తులను తిరస్కరించరాదు. దరఖాస్తును భర్తీ చేసేందుకు పంచాయతీ కార్యాలయాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి. అన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేయాలి. - వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే అధికారులు దానిని రిజిస్టర్ చేసుకుని నెంబర్ కేటాయించాలి. రెండు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి. రైతుల నుంచి ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదు. - బోరుకు, విద్యుత్ స్తంభానికి మధ్య దూరం ఉందంటూ రైతుల దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. స్తంభాల బాధ్యత విద్యుత్ శాఖదే కాబట్టి, వారు రైతుల దరఖాస్తులను తిరస్కరించడానికి వీల్లేదు. - ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ల విషయంలో రైతుల నుంచి ఎటువంటి డబ్బు వసూలు చేయరాదు. రైతులకు ఉచితంగా రిపేర్లు చేయాలి. అది కూడా నిర్ధిష్ట సమయంలోపు జరగాలి. - రైతులకు సంబంధించి వ్యవసాయ కనెక్షన్ల విషయంలో మండల స్థాయిలో అసిస్టెంట ఇంజనీర్ ఉండాలి. ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి గ్రామాన్ని వారికి ఒకసారి సందర్శించాలి. ప్రతీ గ్రామంలో కనీసం ఓ లైన్మెన్ ఉండాలి. అతను ఆ గ్రామంలోనే నివసిస్తుండాలి. చేసిన పనికి డబ్బు వసూలు చేయకుండా లైన్మెన్లను నిరోధించాలి. -
బోగాపురం భూ సేకరణపై హైకోర్టు స్టే
భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. భూ సేకరణకు వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు భూ సేకరణపై స్టే విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. దీంతో విజయనగరం జిల్లా కలెక్టర్ ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ నిలిచిపోనుంది. కాగా.. భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం 5,315 ఎకరాల భూమి కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది.దీనికి వ్యతిరేకంగా.. అప్పటి నుంచి ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భూ సేకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసిందంటూ ఆరోపించారు. భోగాపురానికి కేవలం45 కిలో మీటర్ల దూరంలో విశాఖ ఎయిర్ పోర్టు ఉండగా.. భోగాపురం ఎయిర్ పోర్టు దేనికని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్టు లండన్ హిత్రూ కేవలం 3వేల ఎకరాలు కాగా.. భోగాపురం ఎయిర్ పోర్టుకు 5వేలకు పైగా ఎకరాలు ఏం చేసుకుంటారని అన్నారు. -
కార్బైడ్ నిషేధంపై ఇంత అలసత్వమా?
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తీరుపై ఉమ్మడి హైకోర్టు అసహనం సాక్షి, హైదరాబాద్: కాయల్ని పక్వానికి తీసుకొచ్చేందుకు కార్బైడ్ వాడకుండా నిషేధించే విషయంలో, కార్బైడ్ వాడటం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వ్యవహార శైలిపై హైకోర్టు అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇది సమాజంలోని ప్రతి వ్యక్తిపై ప్రభావం చూపే వ్యవహారమని, ఇలాంటి వాటిలోనూ అలసత్వమేమిటని ఇరు ప్రభుత్వాలను ప్రశ్నించింది. కార్బైడ్ వాడే పండ్లను తినడం వల్ల కలిగే ప్రమాదాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని తాము ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, వాటిని అమలు చేస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపిం చడం లేదంది. ఈ మొత్తం వ్యవహారంలో ఉభయ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉన్నట్లు కని పించడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పండ్ల వ్యాపారులు కార్బైడ్ ద్వారా కాయల్ని మగ్గబెడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారం టూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు, పిల్‌గా స్వీకరించిన విషయం తెలిసిందే. -
‘హైకోర్టు తీర్పు సీఎంకు చెంపపెట్టు’
అబిడ్స్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టు చెంపపెట్టు లాంటిదని గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ అన్నారు. గ్రేటర్ ఎన్నికలపై కేసీఆర్ చేస్తున్న కుట్రలకు హైకోర్టు చరమగీతం పాడిందన్నారు. గురువారం గోషామహల్ షాహినాయత్‌గంజ్‌లోని తన కార్యాలయంలో ‘సాక్షి’తో మాట్లాడుతూ... గ్రేటర్లో ఎక్కువ సీట్లు గెలవాలని ముఖ్యమంత్రి, మంత్రులు పన్నిన కుట్రలలు భగ్నమయ్యాయన్నారు. 15 రోజుల్లో ఎలక్షన్ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించి, రిజర్వేషన్ల ప్రక్రియను నేటికీ ప్రకటించకపోవడంతో గ్రేటర్‌లోని అన్ని పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయన్నారు. నెలరోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని గురువారం హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లుతెరిచి ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలని సూచించారు. -
రూ.10 చిన్న మొత్తమే కదా: గంటా
-
రూ.10 చిన్న మొత్తమే కదా: గంటా
పది రూపాయలు చాలా చిన్న మొత్తం అని ఆంధ్ర ప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. రాజధాని కోసం స్కూల్ పిల్లల నుంచి నిర్బంధ విరాళాల వసూళ్లపై హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ఆయన బుధవారమిక్కడ స్పందించారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ భాగస్వాములుగా చేసేందుకే విరాళాలు సేకరించాలని భావించినట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కొక్కరూ రూ.పది రూపాయలు చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి రూ.10 ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ‘మై కేపిటల్, మై అమరావతి, మై బ్రిక్’ పేరిట ఈ చందాలు వసూలు చేయాలని జిల్లాల విద్యాశాఖ అధికారులకు సర్క్యులర్‌ను పంపారు. విద్యార్థుల నుంచి విరాళాల సేకరణను సవాల్ చేస్తూ బుధవారం పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని విచారణ కు స్వీకరించిన హైకోర్టు విద్యార్థుల నుంచి విరాళాల సేకరణకు సర్క్యులర్ ఎలా విడుదల చేస్తారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్ ను కొట్టివేసింది. -
టిక్...టిక్...టిక్...
► జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉత్కంఠ ► నేడో... రేపో... రిజర్వేషన్లు ► ఆ వెంటనే షెడ్యూల్....నోటిఫికేషన్ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన కోసం రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు హైకోర్టుకుఇచ్చిన హామీని అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు?.... వార్డుల రిజర్వేషన్ల ప్రకటన ఎప్పుడు విడుదలవుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. వార్డుల రిజర్వేషన్ల కోసం రాజకీయ పక్షాలతో పాటు ప్రజలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి మహిళలకు 50శాతం సీట్లు రిజర్వ్ కావడంతో అందరి దృష్టీ వాటిపైనే ఉంది. రిజర్వేషన్లు వెలువడితే తాము పోటీ చేయాల్సిన డివిజన్‌ను ఎంపిక చేసుకోవచ్చనిఎందరో ఎదురు చూస్తున్నారు. నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నం దున ఆది, సోమవారాల్లో వార్డుల రిజర్వేషన్లు, షెడ్యూలు వెలువడగలవని అంచనా వేస్తున్నారు. షెడ్యూలుతో పాటే నోటిఫికేషన్ వెలువరిస్తారనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వార్డు రిజర్వేషన్లలో అభ్యంతరాలు ఉంటే నోటిఫికేషన్ వచ్చేలోగా ఎవరైనా హైకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని .. ఆదివారం రిజర్వేషన్లు... సోమవారం షెడ్యూలు... గంటల తేడాతో నోటిఫికేషన్ జారీ కాగలవనే అంచనాలు ఉన్నాయి. నోటిఫికేషన్ వెలువడితే కోర్టుకు వెళ్లినా చేసేదేమీ ఉండదని.. ఆ మేరకుప్రభుత్వం జాగ్రత్త పడుతోందనేఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. నోటిఫికేషన్ నుంచి పోలింగ్‌కు నడుమ ఉండాల్సిన వ్యవధిని తగ్గిస్తూ జీవోకు సవరణ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత చట్టం... నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన రోజు నుంచి పోలింగ్‌కు మధ్య 12 రోజుల వ్యవధి ఉండాలని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీనిని వారం రోజులకు కుదించేలా చట్ట సవరణ చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బహుళ స్థాయి వంతెనలకు ఆదివారం శంకుస్థాపనలు జరుగనున్నాయి. మధ్యాహ్నంలోగా అవి పూర్తి చేశాక... సాయంత్రం రిజర్వేషన్లు.. సోమవారం నోటిఫికేషన్ జారీ కానుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు షెడ్యూలు వెలువడినప్పటికీ నోటిఫికేషన్ మాత్రం 8వ తేదీ తర్వాత వెలువడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బీఆర్ఎస్పై డైలమా!
హైకోర్టు ఆదేశాలతో ‘క్రమబద్ధీకరణ’పై గందరగోళం ప్రత్యామ్నాయాలపై తర్జనభర్జన సిటీబ్యూరో : దాదాపు మరోవారం రోజుల్లో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసిపోనున్న తరుణంలో బీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో అటు దరఖాస్తుదారులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారుల్లో గందరగోళం నెలకొంది. తదుపరి ఉత్తర్వులిచ్చేంతవరకు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించరాదంటూ మంగళవారం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం గ్రేటర్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై స్పందిస్తూ హైకోర్టు, తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించవ ద్దని పేర్కొంది. అయితే దరఖాస్తులను స్వీకరించవచ్చునని పేర్కొనడం వారికి కొంత ఊరట కలిగించింది. వాస్తవానికి జీహెచ్ ఎంసీ అధికారులు కూడా ఇంతవరకు దరఖాస్తుల పరిశీలన చేపట్టలేదు. ఈనెలాఖరువరకు దరఖాస్తుల స్వీకరణకు గడువుండటంతో అది ముగిశాకే సర్కిళ్ల వారీగా దరఖాస్తులను పంపిణీ చేసి, పరిష్కరించాలనే యోచనలో ఉన్నారు. జీహెచ్ఎంసీకి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కోసం దాదాపు 36 వేల దరఖాస్తులందాయి. జీహెచ్ఎంసీ అంచనా మేరకు ఇవి దాదాపు 30 శాతం మాత్రమే. మిగతావారు ఈ వారంరోజుల్లో దరఖాస్తుచేసుకుంటారని భావిస్తున్న తరుణంలో వెలువడిన హైకోర్టు అదేశాలతో ఇంకా దరఖాస్తుచేసుకోనివారితో పాటు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు సైతం గందరగోళానికి గురయ్యారు. 2007-08లో బీఆర్ఎస్ను అమల్లోకి తెచ్చినప్పుడే ఇది ఒకేసారి ఇస్తున్న మినహాయింపు అని, దీని ద్వారా క్రమబద్ధీకరణ అనంతరం భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు జరుగకుండా ఆది లోనే అడ్డుకుంటామని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ంఎసీ అధికారులు అప్పట్లో హైకోర్టుకు నివేదించినట్లు సమాచారం. దాన్ని అమలు చేయకపోగా, అప్పటి చట్టానికి సవరణ చేస్తూ దాన్నే 2015 వరకు పొడిగించారని పద్మనాభరెడ్డి పిల్లో పేర్కొన్నారు. చట్టసభలో ఆమోదం లేకుండానే చట్టసవరణ చేశారని కూడా పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది. అమలుపై సందేహాలు.. హైకోర్టు బ్రేక్ వేయడంతో ఈ పథకం అమలవుతుందా.. లేదా ? అనే సందేహా లు వ్యక్తమవుతున్నాయి. తుదితీర్పు ఎ లా ఉంటుందోననే అనుమానాలున్నా యి. అనుమతి పొందిన నిర్మాణ ప్లాన్‌కు భిన్నంగా డీవియేషన్లకు పాల్పడిన వారు, అసలు అనుమతే లేకుండా నిర్మాణాలు చేసిన వా రు బీఆర్ఎస్తో క్రమబద్ధీకరించుకునేందుకు సిద్ధమయ్యారు. ఎంతో కాలంగా వారు ఈ పథకం కో సం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం దీని అమలు ద్వారా జీహెచ్ఎంసీ ద్వారానే దాదాపు రూ.1000 కోట్ల ఆదాయం సమకూరగలదని అంచనా వేసింది. ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటే దాదా పు రూ.300 కోట్ల వరకు మాత్రమే రాగలవని అంచనా. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ఉభయవర్గాలను అయోమయంలో పడవేశాయి. ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు జీహెచ్ఎంసీకి బీపీఎస్ ద్వారా సోమవారం వరకు గడచిన నెలన్నర రోజుల్లో 25 వేల దరఖాస్తులందగా , మంగళవా రం ఒక్కరోజే దాదాపు పదివేల దరఖాస్తులందాయి.హైకోర్టు ఉత్తర్వులతో గడువు పొడిగిస్తారో లేదోననే తలంపుతో మంగళవారం మధ్యాహ్నంనుంచే ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అడ్డగోలుగా ఓసీల జారీ 2008లో ఒకసారి మినహాయింపు అని పేర్కొన్న అధికారులు దానిని 2015 వరకు పొడిగించారు. అధికారుల అంచనా మేరకే కనీసం 50 వేల అక్రమనిర్మాణాలున్నాయి. భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామని, అన్నీ సవ్యంగా ఉంటేనే తనఖానుంచి విముక్తి చేసి ఓసీ(ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఇస్తామని పేర్కొన్న అధికారులు దానిని అమలు చేయలే కపోయారు. అడ్డగోలు నిర్మాణాల క్రమబద్ధీకరణ వల్ల ఎందరికో నష్టం జరుగుతుంది. జీప్లస్1కు అనుమతి తీసుకొని ఐదారు అంతస్తులు నిర్మిస్తే పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. రహదారి విస్తీర్ణం తగినంత లేనందున ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజను కూడా వెళ్లలేదు. 2008 నాటి మినహాయింపునే కొనసాగించడం వల్ల ఇలాంటి మినహాయింపులు ఎప్పటికీ ఉంటాయనే అభిప్రాయాలు ఏర్పడతాయి. ఇది మంచిది కాదు. మేం వేసిన పిల్ కొన్ని వేలమందికి ఇబ్బం దిగా అని పించినా, లక్షల మందికి నష్టం జరుగకుండా ఉం టుంది. - పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరంఫర్ గుడ్‌గవర్నెన్స్ -
వారికి న్యాయమైన వేతనాలు దక్కాల్సిందే
ఇటుక బట్టీ కార్మికులపై యాజమాన్యాల దోపిడీ అరికట్టండి: హైకోర్టు బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమయ్యేలా చూడాలని ఆదేశం హైదరాబాద్: ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులు బట్టీల యాజమాన్యాల చేతిలో దోపిడీకి గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా వారికి చట్ట ప్రకారం వేతనాలు దక్కేలా చూడాలని, ఇందుకుగానూ కార్మికుల పేరుపై బ్యాంకు ఖాతా తెరచి, సదరు బట్టీ యజమాని ఆ ఖాతాలోనే వేతనాలను జమ చేసేలా చూడాలంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ పథకాలు ఏవి అందుతున్నాయో, అవన్నీ ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు అందాల్సిందేనని తేల్చి చెప్పింది. అసలు ఇరు రాష్ట్రాల్లో ఎన్ని ఇటుక బట్టీలున్నాయి? ఎంత మంది కార్మికులున్నారు? వారిలో వలస కార్మికులెందరు? వారి జీవన పరిస్థితులేమిటి? తదితర వివరాలను అఫిడవిట్ల రూపంలో తమ ముందుంచాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 25కు వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుమోటోగా స్వీకరించిన సుప్రీం.. ఇటుకబట్టీలో పనిచేస్తున్న ఇద్దరు ఒడిశాకు చెందిన కార్మికుల చేతులను నరికివేసిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు 2014లో సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఇటుకబట్టీల్లో పనిచేసే వలస కార్మికుల దుస్థితిపై అటు ఒడిశా, ఇటు తెలంగాణ ప్రభుత్వాల నుంచి వచ్చిన నివేదికలు పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఆయా రాష్ట్రాల హైకోర్టులకు ఈ వ్యాజ్యాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై సోమవారం మరోసారి విచారించింది. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఓ బట్టీలో పనిచేస్తున్న మహిళను పనికి ఆలస్యం వచ్చిందన్న కారణంతో ఆ బట్టీ సూపర్వైజర్లు కొట్టడంతో మృతి చెందిన ఘటనకు బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావును ప్రశ్నించింది. బాధ్యులపై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ కూడా జరిగిందని ఆయన తెలిపారు. ఏపీ నివేదికపై అసంతృప్తి.. ఈ సమయంలో ఏపీ సర్కార్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. పరిశీలించిన ధర్మాసనం.. పథకాలు ఉన్నాయని చెబితే సరిపోదని, అవి కార్మికులకు అందుతున్నాయో లేదో చూడాలంది. బట్టీల్లో పనిచేసే కార్మికులకు గృహవసతి, వైద్యం, వారి పిల్లలకు విద్యా వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. కొందరు యజమానులు రోజుకు రూ.50 చెల్లిస్తూ, రూ.300 చెల్లిస్తున్న ట్లు కార్మికుల చేత సంతకాలు తీసుకున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఇటువంటి దోపిడీ జరగకుండా అడ్డుకునేందుకు, కార్మికుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. -
హైకోర్టు మొట్టికాయలతో వీడిన మొద్దునిద్ర
రైతుల ఆత్మహత్యల నివారణకు ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు జిల్లా స్థాయిలో ప్రత్యక సెల్ ఫిర్యాదుల విభాగం నెం. 8886613778 జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో విభాగాలు ఏడీ, డీఎస్పీ, ఆర్డీవోలతో త్రిసభ్య కమిటీ రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ హైకోర్టు గట్టిగా మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వంలో కదిలిక వచ్చింది. ఎట్టకేలకు నివారణ చర్యలు చేపట్టింది. రైతుల్లో మనోస్థైరాన్ని నింపేలా ప్రత్యేక విభాగాన్ని, కమిటీలను ఏర్పాటుచేసింది. విశాఖపట్నం: వరుసగా గత ఐదేళ్లుగా విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులు... ఏయేటికాయేడు చేతికందివచ్చిన పంటలు నేలపాలవుతూ అప్పుల సుడిగుండంలో అన్నదాతలు విలవిల్లాడి పోతున్నారు. గడిచిన ఏడాదిన్నరలో రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇన్నాళ్లు పట్టించుకోవడం మానేసింది. దీనిపై కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయడంతో ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు స్పందించింది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను అనేక సూచనలు చేయడంతో ఆ దిశగా ప్రభుత్వం ఉపశమన చర్యలకు శ్రీకారంచుట్టింది. ఇందుకోసం జిల్లా, డివిజన్ స్థాయిలో బుధవారం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయిలో వ్యవసాయ శాఖ డిప్యూటీ డెరైక్టర్ రాజుబాబు నేతృత్వంలో ఈ సెల్ పనిచేస్తుంది. ఈ విభాగానికి 88866 13778 నెంబర్‌తో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. జిల్లాలో పదివ్యవసాయ సబ్ డివిజన్లు ఉండగా. ప్రతీ సబ్ డివిజన్ పరిధిలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీలు పర్యవేక్షిస్తుంటాయి. వీఆర్వోలు, వ్యవసాయాధికారులు గ్రామస్థాయిలో రైతుల ఆర్ధిక స్థితి గతులు.. మానసిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. ఎవరైనా స్థైర్యం కోల్పోయే స్థితిలో ఉంటే వెంటనే ఈసెల్‌కు సమాచారం ఇస్తే ప్రత్యేక కౌన్సెలర్ ద్వారా ఈ విభాగం నేరుగా ఆ గ్రామానికి వెళ్లి సంబంధిత రైతు కుటుంబంతో భేటీ అయి వారిలో మనోస్థైర్యం నింపేందుకు యత్నిస్తారు. అవసరమైతే నిపుణులతో వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. వారికి ఏవిధమైన సమస్యలున్నాయి.. వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆ రైతు బయట పడతాడు వంటి అంశాలపై అధ్యయనం చేసి సబ్‌డివిజన్ స్థాయిలో కమిటీ జిల్లాకు నివేదిస్తుంది. దాన్ని ప్రభుత్వానికి పంపి ఆ రైతుకు సాంత్వన చేకూర్చేలా చర్యలు చేపడతారు. ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే ఎందుకు ఆ అఘాయిత్యానికి ఒడిగట్టాల్సి వచ్చిందో పరిశీలనచేసేందుకు ఏడీ, డీఎస్పీ, ఆర్డీవోల నేతృత్వంలో త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశారు. వీరిచ్చే నివేదికను జిల్లా స్థాయిలో కలెక్టర్, వ్యవసాయ శాఖ జేడీ, ఎస్పీల నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సుచేస్తుంది. తదనుగుణంగా ఆ రైతు కుటుంబానికి అందాల్సిన ఆర్థిక సహకారాన్ని అందజేస్తారు. ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చు మీ గ్రామంలో ఏ రైతైనా.. వ్యవసాయ పరంగానే కాకుండా వివిధ కారణాలతో మనో స్థైర్యం వీడినట్టుగా గుర్తిస్తే వెంటనే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన విభాగానికి ఫోన్ చేస్తే వెంటనే ప్రత్యేక బృందాన్ని ఆ గ్రామానికి పంపిస్తాం.. ఆ రైతుకు కౌన్సెలింగ్ చేస్తాం.. ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడతాం. - వి.సత్యనారాయణ, జాయింట్ డెరైక్టర్, వ్యవసాయశాఖ -
కోర్టు ఉత్తర్వులు అమలు కావడం లేదు
అంబేడ్కర్, తెలుగు వర్సిటీల వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చిన ఏపీ ఏజీ తీవ్రంగా పరిగణిస్తామన్న ధర్మాసనం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల సేవా కేంద్రాలకు గతంలో మాదిరిగా యథాతథంగా సేవలు అందించడంతో పాటు, పరీక్షలను సైతం నిర్వహించాలని ఇరు విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లను ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అమలు కావడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ మంగళవారం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ, ఇది చాలా తీవ్రమైన అంశమని, సేవలు కొనసాగింపు, పరీక్షల నిర్వహణలో తామిచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా ఉంటే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 5కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని క్యాంపస్‌లకు తమ సేవలను నిలిపేస్తూ తెలుగు వర్సిటీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో ఉన్న ప్రాంతీయ కేంద్రాలకు అంబేడ్కర్ వర్సిటీ తన సేవలను నిలిపేసిందని, దీని వల్ల 3.5 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన సంగతి విదితమే. ఈ రెండు వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం మంగళవారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, ఏపీలోని ఈ రెండు విశ్వవిద్యాలయాల సేవా కేంద్రాల నిర్వహణ ఖర్చులను, అందులో పనిచేస్తున్న బోధనా, బోధనేతర సిబ్బంది జీతాలను ఏపీ ప్రభుత్వమే భరించాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అలాగే ఏపీలోని సేవా కేంద్రాలకు యథాతథంగా సేవలను కొనసాగించడంతో పాటు పరీక్షలను సైతం నిర్వహించాలని ఇరు విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లను గత విచారణ సమయంలో ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అయితే ఈ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం వివరాలు తమ ముందుంచాలని ఆదేశించింది. -
తిరిగి తెలంగాణకు..!
సాక్షి, హైదరాబాద్: ఐదు నెలలుగా ఉద్యోగం, జీతభత్యాలు లేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడిన ‘ఏపీ స్థానికత’ విద్యుత్ ఉద్యోగులకు ఉపశమనం లభించింది. ఈ వివాదంపై హైకోర్టు ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి. దీంతో విధుల్లోంచి రిలీవ్ చేసిన 1,251 మంది విద్యుత్ ఉద్యోగులను తిరిగి తాత్కాలికంగా చేర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు అనుమతిస్తూ బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేయగా... ఆ వెంటనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చర్యలు చేపట్టాయి. హైకోర్టు ఆదేశాల అమలుకు తమ వంతు చర్యలు తీసుకుంటున్నామని తెలుపుతూ.. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం సాయంత్రం ఏపీ జెన్కో సీఎండీ కావేటి విజయానంద్‌కు లేఖ రాశారు. జనాభా దామాషా ప్రకారం ఆ ఉద్యోగుల జీతభత్యాలు, బకాయిల్లో 42 శాతం తెలంగాణ వాటాగా.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం తమ 58 శాతం వాటాను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఉద్యోగుల జీతభత్యాలను తొలుత తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే... అందులో తమ రాష్ట్ర వాటాను తర్వాత ఇచ్చేస్తామని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. గడువు దగ్గర పడడంతో.. విద్యుత్ ఉద్యోగుల విభజనకు పుట్టినచోటు ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తూ జూన్ 6న తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వెంటనే తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు 1,251 మంది ఉద్యోగులను విధుల్లోంచి రిలీవ్ చేశాయి. మరోవైపు వారిని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు... ఆ ఉద్యోగులను తాత్కాలికంగా తెలంగాణ రాష్ట్రానికే కేటాయించడంతోపాటు జనాభా దామాషా ప్రకారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వారికి జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో తీర్పును అమలు చేయాలని గడువు విధించింది. ఈ గడువు ఈనెల 20తో ముగియనుంది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త వెనక్కితగ్గాయి. హైకోర్టు ఆదేశాల మేరకు 52 శాతం జీతభత్యాల భారాన్ని భరించేందుకు ఏపీ సర్కారు సంసిద్ధత వ్యక్తం చేయగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తుది తీర్పుపై ఉద్యోగుల భవితవ్యం ఆధారపడి ఉంది. వారు ‘సూపర్’ న్యూమరీ! రిలీవైన ఉద్యోగులను విధుల్లో చేర్చుకున్నా... వారికి గతంలో నిర్వహించిన పోస్టులను కట్టబెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించి అప్పట్లోనే ఈ ఖాళీలను భర్తీచేశారు. రిలీవైన ఉద్యోగులను తిరిగి చేర్చుకోకముందే తెలంగాణ అధికారులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతలు కల్పించి శాశ్వత ప్రాతిపదికన ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ‘రిలీవైన’ ఉద్యోగుల కోసం తాత్కాలికంగా సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని నిర్ణయం తీసుకుంది. -
ఔట్లుక్ ప్రతినిధులకు ఊరట
తీర్పు వెలువరించే వరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేత హైదరాబాద్: తన ప్రతిష్టను దెబ్బతీసేలా కథనం ప్రచురించారంటూ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఔట్లుక్ పత్రిక ప్రతినిధులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తీర్పును వెలువరించే వరకు ఈ కేసులో పిటిషనర్ల అరెస్ట్‌తోపాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. స్మితా సబర్వాల్ ప్రతిష్టను దిగజార్చేలా కథనం, కార్టూన్ ప్రచురించారంటూ ఆమె భర్త, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఈ ఏడాది జూలై 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు ఔట్లుక్ పత్రిక ప్రతినిధులు మాధవి తాతా, సాహిల్ భాటియా, కృష్ణప్రసాద్, ఇంద్రనీల్రాయ్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ వీరు జూలై 13న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు బుధవారం విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. తీర్పు వెలువరించేంత వరకు పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. -
ఉద్యోగుల సమస్యకు కమిటీ
తామే ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు ధర్మాసనం చెరో నలుగురి పేర్లను సిఫారసు చేయాలని ఆదేశం రిటైర్డ్ న్యాయమూర్తిని చైర్మన్‌గా సిఫారసు చేస్తామని వెల్లడి విచారణ ఈనెల 11కు వాయిదా హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం వ్యవహారంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున, ఇక సమస్య పరిష్కారానికి తామే ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చెరో నలుగురి పేర్లను రెండు రోజుల్లో సిఫారసు చేయాలని ఉభయ రాష్ట్రాలను ఆదేశించింది. ఇరు రాష్ట్రాలతో సంబంధంలేని వ్యక్తిని, వీలైనంతవరకు ఓ రిటైర్డ్ న్యాయమూర్తిని తాము సిఫారసు చేస్తామని, ఆ వ్యక్తి కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించేలా యోచన చేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ తొమ్మిదిమంది కలిసి వివాద పరిష్కార బాధ్యతలను చేపడుతారని స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. అలాగే రిలీవ్ అయిన ఉద్యోగులకు జీతాల చెల్లింపు వ్యవహారాన్ని కూడా శుక్రవారం తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇరు రాష్ట్రాల వాదనలు ఇలా ఉన్నాయి. ఏపీ జెన్కోలో 3,129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి: తెలంగాణ సీఎస్ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పోస్టులను విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్కోకు 9,251 పోస్టులు, టీఎస్ జెన్కోకు 7,440 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ రెండింటితో కలిపి మొత్తం 16,691 పోస్టులు ఉన్నాయి. అపాయింటెడ్ డే నాటికి మొత్తం పోస్టుల్లో 12,091 మందే పనిచేస్తున్నారు. తాత్కాలిక కేటాయింపుల కింద టీఎస్ జెన్కోకు 5,897, ఏపీ జెన్‌కు 6,122 మందిని కేటాయించారు. తద్వారా టీఎస్ జెన్కోలో 1,543 పోస్టులు టీఎస్ జెన్కోలో 3,129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీ జెన్కో కేటాయించి, బదిలీ చేసిన 512 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను ఖాళీగా ఉన్న 3,129 పోస్టుల్లో సులభంగా చేర్చవొచ్చు. స్థానికత ఆధారంగా మేం రిలీవ్ చేసిన 1,242 ఉద్యోగులను కొత్త పోస్టులు సృష్టించకుండానే ఖాళీగా ఉన్న 3,129 పోస్టుల్లో చేర్చవచ్చు. ఉద్యోగుల విభజన పరిష్కార బాధ్యతలను రిటైర్డ్ అధికారిణి షీలా బిడే నేతృత్వంలోని కమిటీకి అప్పగించాలన్న ఏపీ వాదన మాకు ఆమోదయోగ్యం కాదు. జనాభా ప్రాతిపదికనే జరగాలి: ఏపీ సీఎస్ ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగుల విభజన జనాభా ప్రాతిపదికన జరగాలి. అలా జరగని పక్షంలో పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం మూసివేతకు దారి తీయవచ్చు. ఆస్తుల, అప్పుల విభజన, ఉద్యోగుల విభజన కలిపి ఒకేసారి చేయాలి. పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజన పరస్పర చర్చల ద్వారానే జరగాలి తప్ప, ఏకపక్షంగా కాదు. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన విభజన మాకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. -
బీసీ కులాల తొలగింపు సబబే
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులనుసమర్థించిన హైకోర్టు పలువురు విద్యార్థులు, తల్లిదండ్రుల పిటిషన్లు కొట్టివేత హైదరాబాద్: బీసీ కులాల జాబితా నుంచి కళింగ, గవర, తూర్పు కాపులు.. ఇలా 138 బీసీ కులాల నుంచి 26 కులాలను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. తమ కులాలను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101, 107లకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నాయని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుత తీర్పుపై సుప్రీంను ఆశ్రయించేందుకు వీలుగా రెండు వారాలు తీర్పు అమలును నిలుపుదల చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన భీమారావు కోరగా అందుకు న్యాయస్థానం తోసిపుచ్చింది. టీ-ఏజీ వాదనలకు సమర్థన.. బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి రాసిన లేఖ ఆధారంగానే 26 కులాలను బీసీ కులాల జాబితా నుంచి తొలగించామని, అలాగే తెలంగాణలో మనుగడలో లేని కులాలను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందన్న తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. తెలంగాణ ప్రభుత్వం తొలగించిన కులాల్లో కొన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా లేవన్న బీసీ కమిషన్ వాదనలు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. -
ఒప్పందమెందుకు చేసుకోవడం లేదు?
విద్యా సంస్థలపై ఏపీ సర్కార్‌ను నిలదీసిన హైకోర్టు విద్యార్థుల జీవితాలతో ఈ కేసు ముడిపడి ఉంది రేపటి నుంచే చర్చలు ప్రారంభించండి ఉభయ రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు ధర్మాసనం ఆదేశం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో తెలంగాణ ప్రభుత్వానికి హక్కులున్న విద్యాసంస్థల విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకోవడం లేదని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఆ విద్యాసంస్థల సేవలు కావాలంటే చట్టప్రకారం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉండగా, ఆ పని ఎందుకు చేయడం లేదని, ఇందుకు ఎవరు అడ్డుపడుతున్నారని నిలదీసింది. విద్యార్థుల జీవితాలు ముడిపడి ఉన్న ఇటువంటి వ్యవహారాల్లో ప్రతిష్టకు వెళ్లొద్దని, చట్టం ప్రకారం ముందుకెళ్లాలని హితవు పలికింది. శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సేవలను ఏపీలోని దాని ప్రాంతీయ కేంద్రాలకు, క్యాంపస్‌లకు అందించేందుకు వీలుగా పరస్పరం చర్చలు జరపాలని ఇరురాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 3న తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి చాంబర్లో మధ్యాహ్నం 2గంటలకు చర్చలు జరపాలని స్పష్టం చేసింది. చర్చల్లో పురోగతి ఉండాలని, కార్యదర్శులు సహకరించుకోని పక్షంలో ఇరువురుని కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తామంది. ఈ చర్చల సారాన్ని తమ ముందుంచాలని ఇరురాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 4కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథస్థితి(స్టేటస్ కో) కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు పూర్వాపరాలివీ.. ఆంధ్రప్రదేశ్‌లోని క్యాంపస్‌లకు తమ సేవలను నిలిపేస్తూ తెలుగు విశ్వవిద్యాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో ఉన్న ప్రాంతీయకేంద్రాలకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తన సేవలను నిలిపేసిందని, దీనివల్ల 3.5లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన సంగతి విదితమే. ఈ రెండు వ్యాజ్యాలను మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(స్పెషల్ జీపీ) రమేష్ వాదనలు వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం క్యాంపస్‌ల్లో తమ సేవలను నిలిపేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని వివరించారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ, ఈ వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని రమేష్‌కు స్పష్టం చేసింది. రామకృష్ణారెడ్డి తన వాదనలను కొనసాగిస్తూ, పునర్విభజన చట్టప్రకారం మొదటి ఏడాది తర్వాత కూడా సేవలు కావాలంటే అందుకు తెలంగాణ ప్రభుత్వానికి కొంతమొత్తం చెల్లించి ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుందన్నారు. డబ్బు చెల్లిస్తే సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టుకు నివేదించారు. యూనివర్సిటీ వద్ద కార్పస్‌ఫండ్ ఉందని, దాని పంపిణీ ఇంకా జరగలేదని, కాబట్టి ఆ నిధులను వాడుకోవచ్చునని రమేష్ తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, పదవ షెడ్యూల్లో ఉన్న సంస్థల సేవల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకోవడం లేదని ఏపీ సర్కార్‌ను ప్రశ్నించింది. దీనికి రమేష్ సమాధానమిస్తూ, ఒప్పందం కుదుర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుమార్లు అభ్యర్థనలు పంపారన్నారు. దీనికి రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, డబ్బిస్తామంటే తాము ఎందుకు వద్దంటామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఒకరి ఒకరు నిందించుకోవడం ఆపి, సమస్యకు పరిష్కారం చూడండంటూ చర్చల నిమిత్తం ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
మాకు టీచర్లు కావాలి!
ఉపాధ్యాయుల కొరతపై హైకోర్టు సీజేకు 1,600 మంది విద్యార్థుల లేఖలు వాటిని సుమోటోగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం డుమ్మా కొట్టే టీచర్లను తక్షణమే సస్పెండ్ చేయండి అలసత్వం ప్రదర్శించే అధికారులపైనా చర్యలు తీసుకోండి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం విచారణ 20కి వాయిదా హైదరాబాద్: బడికి రాని టీచర్లపై, బాధ్యత తప్పిన సర్కారుపై... బడి పిల్లలు చేపట్టిన పోరాటం హైకోర్టును కదిలించింది. చదువు కోసం ఆ చిన్నారుల ఆరాటం న్యాయమూర్తులను చలింపజేసింది. ఆ పిల్లల లేఖలే రాష్ట్ర ప్రభుత్వంపై, అలసత్వపు అధికారులపై అస్త్రాలుగా మారాయి. బడికి డుమ్మా కొట్టే టీచర్లను తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చేలా చేశాయి. దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరేలా చేశాయి.తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్యను పొందలేకపోతున్నామంటూ మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు రాసిన లేఖలను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం గా స్వీకరించింది. నియామకాలు పొంది పాఠశాలలకు వెళ్లని ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేయాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటువంటి వారిని ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో విద్యార్థులకు సరపడా ఉపాధ్యాయులను నియమించడంలో అలసత్వం ప్రదర్శించే విద్యాశాఖ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని, ఈ విషయంలో మరో మాటకు తావులేదని తెలిపింది. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించే విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియచేయాలని... ఈ సమస్యను అధిగమించేందుకు ఏ చర్యలు తీసుకోబోతున్నారో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్యను పొందలేకపోతున్నామని పేర్కొంటూ మహబూబ్‌నగర్ జిల్లా బొయ్యలగూడెం, మాచర్ల, కేశవరం, చింతలకుంట, మిట్టదొడ్డి, యల్లందొడ్డి, చాగదొన, అరిగిగడ్డ గ్రామాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ నెల 6వ తేదీన ఎంవీ ఫౌండేషన్ సహకారంతో హైకోర్టు సీజే, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ వేదిక, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదికలకు లేఖలు రాశారు. తమకు వచ్చిన దాదాపు 1,600కు పైగా లేఖలను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి... వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మలచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ మేరకు రిజిస్ట్రీ ఆ లేఖలను పిల్‌గా మలిచి విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుంచింది. దీనిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి వివరాలను ధర్మాసనం ప్రస్తావించింది. కేశవరం గ్రామంలో 5, 6 తరగతులకు చెందిన 180 మంది విద్యార్థులకు ఒకే టీచర్ ఉన్నారని, చింతలకుంటలో 5వ తరగతికి చెందిన 166 మంది విద్యార్థులకు టీచరే లేరని, మిట్టదొడ్డిలో 8వ తరగతికి చెందిన 120 మంది విద్యార్థులకు టీచర్ లేరని... ఇలా వివరాలను చదివి వినిపించింది. దీనిపై ఏమంటారని రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) రామచంద్రరావును ప్రశ్నించింది. ఇది చాలా కీలక అంశమని, టీచర్ల కొరతను సీరియస్‌గా పరిగణిస్తున్నామని రామచంద్రరావు తెలిపా రు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ...‘ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఒకరు కాదు.. ఇద్దరు కాదు వందల సంఖ్యలో విద్యార్థులు మాకు లేఖలు రాశారు. మేం చదువుకుంటాం.. ఉపాధ్యాయులను నియమించండి అని అడుగుతున్నారు. దేశ భావితరాలకు ఈ మాత్రం కూడా చేయలేమంటే ఎలా..?’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉపాధ్యాయులుగా నియామకాలు పొంది పాఠశాలలకు వెళ్లని వారిని సస్పెండ్ చేయాలని.. అలా చేస్తే మిగతా వారు దారికి వస్తారని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. మిగిలింది శూన్యం.. గట్టు (మహబూబ్‌నగర్): అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మరింత నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరైన విద్య అండం లేదు. ఈ పరిస్థితిని వివరిస్తూ గట్టు మండలంలోని చింతలకుంట ప్రాథమిక పాఠశాల (పీఎస్), జెడ్పీ స్కూళ్ల విద్యార్థులు 200 మంది, సిద్దోనిపల్లి తండా పీఎస్ నుంచి 100, బలిగెర పీఎస్ 100, చమన్‌ఖాన్‌దొడ్డి పీఎస్ 100, హిందువాసి పీఎస్ 100, మిత్తదొడ్డి, దళితవాడ పీఎస్‌ల నుంచి 150, గట్టు బాలికల పీఎస్ 50, గొర్లఖాన్‌దొడ్డి పీఎస్ 100, ఆలూరు పీఎస్/జెడ్పీ స్కూళ్ల నుంచి 150, తుమ్మలచెర్వు యూపీఎస్ 100, చాగదోన పీఎస్ 100, బోయలగూడె పీఎస్ నుంచి 150, కొత్తపల్లి పీఎస్ నుంచి 50 మంది, మరికొన్ని స్కూళ్ల నుంచి ఇంకొందరు విద్యార్థులు హైకోర్టుకు లేఖలు రాశారు. అసలు చింతలకుంట పీఎస్‌లో 330 మంది విద్యార్థులుండగా.. ముగ్గురు టీచర్లు ఉండేవారు. ఇటీవలి బదిలీల్లో ఇద్దరు వెళ్లిపోవడంతో... ఒక్కరే మిగిలారు. చింతలకుంట హైస్కూల్లో 166 మంది విద్యార్థులకు బదిలీల అనంతరం ఒక్కరే మిగిలారు. ఈ స్కూల్లో మూడేళ్లుగా పదో తరగతి విద్యార్థులు 100శాతం ఫలితాలు సాధిస్తుండడం గమనార్హం. ఇక గట్టు మండలంలోని బల్గెర దళితవాడ, చమన్‌ఖాన్‌దొడ్డి, ఇందువాసి, కొత్తపల్లి, మిట్టదొడ్డి ప్రాథమిక పాఠశాల, దళితవాడ పాఠశాల, గట్టు బాలికల పాఠశాల, సిద్దొనిపల్లెతండా ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేకుండా పోయారు. మరో 21 పాఠశాలలు ఒకే టీచర్‌తో కొనసాగుతున్నాయి. ఈ మండలంలో 199 టీచర్ పోస్టులు ఉండగా 76 మంది టీచర్లే ఉన్నారు. 123 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ‘ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో మీరు మీ పిల్లలను గానీ, మీ బంధువుల పిల్లలను గానీ చేర్పించేందుకు సిద్ధంగా ఉన్నారా..?’.. - అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావుకు హైకోర్టు ప్రశ్న.. ‘లేదు..’ - రామచంద్రరావు సమాధానం -
ఇంకా ఉన్నాయ్!
పనులు చేయకుండా బిల్లులు మాయం కేసు... తవ్వినకొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలు మరో ఇద్దరు కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు కుత్బుల్లాపూర్: పనులు చేయకుండానే బిల్లులు మింగిన బాగోతానికి సంబంధించి తవ్వినకొద్దీ అవినీతి కాంట్రాక్టర్ల జాబితా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా మరో ఇద్దరు ఈ జాబితాలో చేరారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ కార్యాలయం వేదికగా రూ.46 లక్షల విలువైన 24 పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు మాయం చేసిన విషయమై జూలై 6న ‘సాక్షి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన అధికారులు ఆరుగురు కాంట్రాక్టర్లు, సహాయ కాంట్రాక్టర్, ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నార్త్‌జోన్ కార్యాలయంలో పనిచేసే ఆడిటర్లపై కేసులు నమోదు చేశారు. ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆడిటర్లను జూలై17న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించి పోలీసులు అరెస్టు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. తాజాగా శుక్రవారం అందరికీ బెయిల్ మంజూరైనట్టు తెలిసింది. తాము పనులు చేయకుండా కాజేసిన నిధులను జూలై 31లోగా వెనక్కి ఇస్తామని కోర్టుకు చెప్పిన కాంట్రాక్టర్లలో ఐదుగురు సంబంధిత మొత్తాన్ని వెనక్కి ఇచ్చారు. మరో ఇద్దరు సగం చెల్లించి.. మిగతా మొత్తానికి 15 రోజుల గడువు కావాలని కోర్టును అభ్యర్ధించారు. వెలుగు చూస్తున్న అక్రమాలు పనులు చేయకుండానే బిల్లులు కాజేసిన సంఘటనలో మరో ఇద్దరు పాత్రధారులుగా తేలారు. ఈమేరకు సంబంధిత అధికారులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్వాల్‌కు చెందిన బి.లక్ష్మణ్ జగద్గిరిగుట్ట డివిజన్లో రూ. 2.30 లక్షలు విలువ చేసే పనులను చేయకుండానే బిల్లులు తీసుకున్నట్లు గుర్తించారు. మరో కాంట్రాక్టర్ రూ.62 వేలు తీసుకున్నట్లు జీడిమెట్ల పోలీసులకు తాజాగా ఇంజినీరింగ్ అధికారులు ఫిర్యాదు చే శారు. -
తనిఖీ బృందాల నివేదికలను పరిగణనలోకి తీసుకోండి
ఏఐసీటీఈ, జేఎన్టీయూలకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం నివేదికల ఆధారంగా అప్రూవల్, అఫిలియేషన్లపై నిర్ణయం తీసుకోండి వ్యతిరేక నిర్ణయం ఉంటే రాతపూర్వకంగా ఇంజనీరింగ్ కాలేజీలకు తెలపండి ఇరువురి నిర్ణయాలు తమ తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టీకరణ విచారణ 30కి వాయిదా హైదరాబాద్: తమ ఆదేశాల మేరకు 99 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి తయారు చేసిన నివేదికల ఆధారంగా ఆ కాలేజీల అప్రూవల్ గురించి, అదే సమయంలో వాటి అఫిలియేషన్ విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) హైదరాబాద్‌లను ఆదేశించింది. తనిఖీ నివేదికల పరిశీలన తరువాత ఏదైనా కాలేజీకి అప్రూవల్‌ను ఉపసంహరించడం గానీ, అఫిలియేషన్‌ను తిరస్కరించడం గానీ చేస్తే, అందుకుగల కారణాలను రాతపూర్వకంగా ఆ కాలేజీకి తెలపడంతో పాటు ఆ కాలేజీకి తనిఖీ బృంద నివేదికనూ అందజేయాలని ఏఐసీటీఈ, జేఎన్టీయూలకు హైకోర్టు స్పష్టం చేసింది. అప్రూవల్, అఫిలియేషన్లపై ఏఐసీటీఈ, జేఎన్టీయూ తీసుకునే నిర్ణయాలు ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసీటీఈ అనుమతి ఉండి ఈ విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ పొందలేకపోయిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ జేఎన్టీయూ అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, అఫిలియేషన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో నిబంధనల మేరకు బోధనా సిబ్బంది, ల్యాబ్‌లు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలంటూ ఏఐసీటీఈ, జేఎన్టీయూ ప్రతినిధులతో 25 బృందాలను ఏర్పాటు చేస్తూ ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ అప్పీళ్లను ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా జేఎన్టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. 99 కాలేజీల తనిఖీలకు సంబంధించిన 99 నివేదికలను ఆయన కోర్టు ముందుంచారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం.. తమకు అందించిన నివేదికలను ఏఐసీటీఈకి అందజేస్తున్నామని, వాటిని పరిశీలించిన తరువాత అప్రూవల్‌పై నిర్ణయం తీసుకోవాలంది. అలాగే జేఎన్టీయూ సైతం అఫిలియేషన్‌పై నిర్ణయం తీసుకోవాలంద. అప్రూవల్‌ను ఉపసంహరించాలని ఏఐసీటీఈ భావిస్తే, అది ఏఐసీటీఈ చట్టం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగానే ఉండాలని ధర్మాసనం తెలిపింది. అఫిలియేషన్ వద్దన్న కాలేజీలను కేసుల విచారణ జాబితా నుంచి తొలగిస్తున్నామంది. అలాగే తనిఖీల నిమిత్తం జేఎన్టీయూ వద్ద రూ.2 లక్షలు డిపాజిట్ చేయని కాలేజీలు, వారంలోపు ఆ మొత్తాలను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో వారి పిటిషన్లను కొట్టేస్తామంది. అటు ఏఐసీటీఈ, ఇటు జేఎన్టీయూ తమ నిర్ణయాలను కోర్టు ముందుంచాలని, వాటిని పరిగణనలోకి తీసుకుని కేసు వాస్తవాల ఆధారంగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. -
మహా పుష్కరాలపై పిల్ కొట్టివేత..
{పభుత్వాలది ప్రచారం ఎంతమాత్రం కాదు అది కేవలంసమాచారం ఇవ్వడమే అలా చేయడం {పభుత్వాల బాధ్యత అన్ని మతాలను సమానంగా చూడటమే లౌకికవాదం ధర్మాసనం స్పష్టీకరణ హైదరాబాద్: మహాపుష్కరాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) హైకోర్టు కొట్టేసింది. పుష్కరాలకోసం ప్రభుత్వాలు చేస్తోంది ప్రచారం కాదని, ప్రజలకు సమాచారాన్నే అందిస్తున్నాయని స్పష్టంచేసింది. ప్రజల మతవిశ్వాసాలకు సంబంధించి న కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల బాధ్యతని తేల్చిచెప్పింది. పుష్కరాలద్వా రా ప్రభుత్వాలు ఓ మతాన్నే ప్రోత్సహిస్తున్నాయన్న వాదనల్లో అర్థంలేదంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. మహాపుష్కరాలకు ప్రచారం చే యడం లౌకికస్ఫూర్తికి విరుద్ధంగా ప్రకటించాలని, రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజున జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోవడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును బాధ్యుడిగా చేయాలంటూ పౌరహక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. గోదావరిలో స్నానమాచరిస్తే పుణ్యం, మోక్షం కలుగుతుందంటూ ఇరుప్రభుత్వాలు ప్రచారం హోరెత్తిస్తున్నాయని, ప్రజల డబ్బుతో ప్రభుత్వాలిలా ఓ మతపరమైన కార్యక్రమాలకు ప్రచారం చేయడం లౌకికస్ఫూర్తికి విరుద్ధమన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వాలు మహాపుష్కరాలకే కాదు.. పలు ఇతర మతకార్యక్రమాలకూ ఇలానే చేస్తున్నాయి. ప్రధాని రంజాన్‌కు ఈద్ ముబారక్ చెబితే తప్పవుతుందా? హ్యాపీ దీపావళి అంటే ఓ మతానికి మద్దతు పలుకుతున్నట్లా? మీ ప్రకారం ఓ పండుగకు సెలవు ప్రకటించడమూ తప్పన్నట్లు ఉంది. లౌకికస్ఫూర్తిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అన్నిమతాల్ని సమానంగా చూడటమే లౌకికవాదం. ప్రధాని, సీఎంలూ రంజాన్‌కు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయ డం.. ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్లడం సర్వసాధారణం. ఇలా వెళ్లడం ఓ మతాన్ని ప్రోత్సహించినట్లవుతుందని అనగలమా? వినాయకచవితి, దసరాలకు విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వాలు కోట్ల సొమ్ము ఖర్చుచేస్తూ ప్రజలకిబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇలాచేయడం ప్రభుత్వాల బాధ్యత. దీన్ని ఓ మతాన్ని ప్రోత్సహించడానికి చేస్తున్నారనడానికి వీల్లేదు కదా? పుష్కరాలకు వెళితే మీకు అదిస్తాం.. ఇదిస్తాం.. అని చెబితే తప్పు. అలా ప్రభుత్వాలు చేస్తుంటే చెప్పండి. మేం జోక్యం చేసుకుంటాం. అంతేతప్ప ఇటువంటి వ్యాజ్యాల్లో మాత్రం కాదు’’ అని వ్యాఖ్యానించింది. అత్యంత దురదృష్టకరం రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇవి అసహజ మరణాలు కానేకాదని, ఓ మనిషి చేసిన హత్యలని రఘునాథ్ నివేదించారు. ఏపీ సీఎం చంద్రబాబే దీనికి బాధ్యులని, ఆయన ప్రచారంకోసం ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణకు చేసిన ఏర్పాట్లవల్లే అంతమంది మృత్యువాత పడ్డారని తెలిపారు. రాజకీయలబ్ధికోసమే డాక్యుమెంటరీకి శ్రీకారం చుట్టారన్నారు. తెల్లవారుజాము 2 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు చంద్రబాబుకోసం జనాల్ని క్యూలైన్లలో నిలిపేశారని, దీంతో తొక్కిసలాట జరిగిందని వివరించారు. 29 మంది చనిపోయినా ఏపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టూ లేదని, అసహజ మరణాలని ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకుందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమంది. కాగా లౌకికవాదానికి ముడిపెట్టి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని విచారించలేమని, దీన్ని కొట్టేస్తున్నామని పేర్కొంది. -
విభజనాంశాలపై పార్లమెంటును స్తంభింపజేస్తాం
రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ కవిత రాష్ట్రం పట్ల కొన్ని విషయాల్లో ప్రధాని తీరు సరిగా లేదు దొంగలకే పెద్ద దొంగగా చంద్రబాబు వ్యవహారం హైదరాబాద్: హైకోర్టు, ఉద్యోగుల విభజనతోపాటు తెలంగాణకు సంబంధించిన కీలకాంశాలపై పార్లమెంటును స్తంభింపజేయడం ద్వారా కేంద్రాన్ని నిలదీస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాష్ట్రంపట్ల కొన్ని విషయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న తీరు సరిగ్గా లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వరంగ సంస్థల్లో ఆస్తులు, ఉద్యోగుల విభజన, ఎదుర్కొంటున్న సవాళ్లు-పరిష్కారాలు’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమాల అవసరం ఉండదని భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రల వల్ల వాటిని కొనసాగించాల్సి వస్తోందన్నారు. పొరుగు రాష్ట్ర పాలకులు తెలంగాణ అభివృద్ధి చెందకుండా ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం, ఖాళీలను గుర్తించకపోవడం వల్ల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. పరాయి సొమ్ము తినడానికి అలవాటు పడిన చంద్రబాబు, సీమాంధ్ర అధికారులు అడ్డదారిలో ప్రభుత్వరంగ సంస్థల్లో పాగా వేసి, తెలంగాణ బిడ్డలకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారని, దొంగలకే పెద్దగా దొంగగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని కవిత దుయ్యబట్టారు. విభజన చట్టానికి విరుద్ధంగా, అక్రమంగా సీమాంధ్ర అధికారులు ఫైళ్లు అపహరించుకుపోతున్నారని ఆరోపించారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ హైకోర్టు, ఉద్యోగుల విభ జనపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సభను స్తంభింపజేస్తామన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజనకు వేసిన షీలాభిడే, కమలనాథన్ కమిటీలు ఏడాదైనా విభజన ప్రక్రియను పూర్తిచేయట్లేదని విమర్శించారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజనపై జేఏసీలో సబ్ కమిటీ వేసి చాలా సమాచారం సేకరించామని, త్వరలో రాష్ట్రం, కేంద్రానికి అందజేస్తామన్నారు. టీజీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజనశాస్త్రీయ పద్ధతిలో జరుగలేదన్నారు. విద్యుత్తు ఉద్యోగుల విభ జన విషయంలో చేపట్టిన విధానం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేయాలన్నారు. సమావేశంలో టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కన్వీనర్ థామస్‌రెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాలు, జేఏసీల నేతలు పాల్గొన్నారు. -
మా తపనంతా పిల్లల గురించే...
క్రీడా మైదానాలు ఉండడం లేదని హైకోర్టు ఆవేదన శివాజీపార్కు లేకుంటే గవాస్కర్, సచిన్ గొప్ప క్రికెటర్లు అయ్యేవారా? ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణంపై కోర్టు వ్యాఖ్య పిల్లలు ఆడుకోవడానికి ఎంత స్థలం కేటాయిస్తారో చెప్పండి టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం.. విచారణ 20కి వాయిదా హైదరాబాద్: ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణం చేపట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తోందని అనలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ తపన ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ చేస్తున్న ప్రజల గురించి కాదని, పిల్లల గురించేనని స్పష్టం చేసింది. నగరీకరణ నేపథ్యంలో చిన్నారులు ఆడుకోవడానికి సరైన మైదానాలు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ముంబైలో శివాజీ పార్కు లేకుంటే గవాస్కర్, సచిన్ గొప్ప క్రికెటర్లు అయ్యేవారా.. వారు ప్రపంచస్థాయి క్రీడాకారులు అయ్యారంటే అది ఆ మైదానం ఘనతే. చిన్నప్పుడు నేను కూడా అక్కడే ఆడుకున్నా. హైదరాబాద్‌లోనూ క్రీడామైదానాలు ఉండి తీరాలి.’ అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే వ్యాఖ్యానించారు. స్టేడియంలో కళాభారతి నిర్మాణం పోను పిల్లలు ఆడుకునేందుకు ఎంత స్థలం కేటాయిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. స్టేడియం పక్కనే ఉన్న కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్థలాన్ని క్రీడా మైదానంగా మార్చే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిం చింది. ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన 14 ఎకరాల భూమిని కళాభారతి నిర్మాణం కోసం సాంస్కృతిక శాఖకు అప్పగిస్తూ గత నెల 23న పురపాలకశాఖ జారీ చేసిన జీవో 73ను సవాలు చేస్తూ ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్ డాక్టర్ ఎ.సుధాకర్ యాదవ్ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం తాజాగా మంగళవారం దీనిని మరోసారి విచారించింది. 14 ఎకరాల భూమిలో ఎంత విస్తీర్ణంలో కళాభారతి నిర్మిస్తున్నారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ప్రశ్నించింది. 6 ఎకరాల్లో కళాభారతి నిర్మాణం జరుగుతుందని, మిగిలిన స్థలాన్ని వదిలేస్తామని, దానిని వాకర్లు వాడుకోవచ్చని రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ‘హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ తపన మంచిదే. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూడాలన్న భావనతో ఉన్న ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో కళాభారతిని నిర్మిస్తున్నట్లు చెబుతోంది. ఇందులో తప్పేమీ లేదు. కాని మైదానాలు లేకపోతే పిల్లల పరిస్థితి ఏమిటో ఆలోచించాలి..’ అని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి జోక్యం చేసుకుంటూ, ఎన్టీఆర్ స్టేడియం పక్కనే కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉందని.. అందులోని విద్యార్థులు సైతం ఎన్టీఆర్ స్టేడియంలోనే ఆడుకుంటారని తెలి పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఆ కాలేజ్ స్థలాన్ని కూడా పిల్లలు ఆడుకునేందుకు అందుబాటులోకి తెస్తే బాగుంటుంది కదా.. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించండని ఏజీకి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహా రంలో తాము కోరిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. -
ప్రభుత్వాల జోక్యంతో ప్రమాదం
న్యాయమూర్తుల నియామకంపై జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకోవాలనే ఆలోచన ప్రభుత్వాలకు ఉంటే భవిష్యత్‌లో న్యాయ వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రాజ్యాధికారం అనేది నిజాయితీ గల వ్యక్తులకు రావాలని ఆయన అభిలషించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ దేశంలో రాజకీయ అవినీతి పెరిగిపోయిందని, ముఖ్యమంత్రి నిజాయితీగా ఉంటే రాష్ట్రమంతా అలాగే ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బాగా లేకుండా కింది స్థాయిలో బాగుండాలంటే సాధ్యం కాదన్నారు. ఇటీవల కాలంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో సాక్షులను హత్య చేస్తున్నారని, ఇది విచారకరమన్నారు. సాక్షులను హత్య చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రకాశ్, నమ్రిత జైశ్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
43% ఫిట్‌మెంట్‌పై స్పందించిన హైకోర్టు
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం హైదరాబాద్: పీఆర్సీ చేసిన సిఫారసులకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు స్పందించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. 43 శాతం ఫిట్మెంట్ ఉత్తర్వులపై తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలంటూ ‘ఫోరం ఫర్ బెటర్ లివింగ్ ’ సంస్థ చైర్పర్సన్ డి.పద్మజ ఇటీవల హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. -
గ్రామ కంఠం ప్రభుత్వ భూమి కాదు
ఆ భూములపై సర్కారు ఎలాంటి హక్కూ కోరజాలదు రిజిస్ట్రేషన్ నిరాకరించలేరు హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్: గ్రామ కంఠం భూములు ఎవరి స్వాధీనంలోనైనా ఉంటే, వాటిని ప్రభుత్వ భూములుగా పరిగణించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ భూములను ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చడానికి వీల్లేదంది. ఒకవేళ చేరిస్తే అది చట్ట విరుద్ధమవుతుందని స్పష్టం చేసింది. ఓ భూమిని ఒకసారి గ్రామ కంఠంగా వర్గీకరిస్తే, దానిపై ప్రభుత్వం హక్కును కోరజాలదంది.అది ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉందన్న కారణంతో రిజిస్టర్ చేసేందుకు నిరాకరించడానికి వీల్లేదంది. ఈ మేరకు జస్టిస్ సరస వెంకట నారాయణ బట్టి (ఎస్.వి.భట్) ఇటీవల కీలక తీర్పునిచ్చారు. విజయనగరం జిల్లా, సాలూరు గ్రామం, సర్వే నంబర్ 162/2 (పార్ట్)లోని ఓ ఇంటిని ఎస్.విజయ అనే మహిళ కొనుగోలు చేశారు. దీని రిజిస్ట్రేషన్కని సబ్ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించగా.. గ్రామ కంఠం భూమని, నిషేధిత జాబితాలో చేర్చినందువల్ల రిజిస్ట్రేషన్ కుదరదని ఆయన చెప్పారు. దీంతో విజయ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎస్.వి.భట్ తీర్పు వెలువరించారు. ‘రీ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్), ఇతర రెవిన్యూ రికార్డులను ఆధారంగా చేసుకుని గ్రామ కంఠం భూములను నిషేధిత జాబితాలో చేరుస్తున్నారు. ఆర్ఎస్ఆర్లోని కాలమ్ 4 ప్రభుత్వ, ఇనామ్ భూముల గురించి చెబుతుంది. ఇందులో ఉన్న వివరాల ఆధారంగా గ్రామ కంఠం భూములపై ప్రభుత్వానికి మాత్రమే యాజమాన్యపు హక్కు ఉంటుందనే తుది నిర్ణయానికి రావడానికి వీల్లేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఆంధ్ర ప్రాంతంలోని రెవెన్యూ రికార్డుల్లో గ్రామ కంఠం (తెలుగు), గ్రామ నాథం (తమిళం) పదాలను ఉపయోగిస్తున్నారు. ఎస్టేట్ , రైత్వారీ గ్రామా ల్లో.. ఇళ్లు, గుడిసెల నిర్మాణానికి కొంత భూమిని కేటాయించే వారు. దీన్ని గ్రామ కంఠంగా వ్యవహరిస్తారు. ఆ భూములు అత్యధిక భాగం ప్రైవేటు వ్యక్తుల వద్దనే ఉన్నాయి. ఈ భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఎ కింద నిషేధిత జాబితాలో చేర్చడం చట్ట విరుద్ధం.ప్రభుత్వం తమ ఉత్తర్వుల ద్వారా ఎప్పుడో పరిష్కారమైన వాటిని అపరిష్కృతంగా మారుస్తోంది. మద్రాసు ఎస్టేట్స్ ల్యాండ్ చట్టం లేదా ఎస్టేట్స్ చట్టం ప్రకారం చూసినా గ్రామ కంఠం ప్రభుత్వ భూమి కాదు. ఈ కారణంతో రిజిస్ట్రేషన్ చేయకపోవడం చట్ట విరుద్ధం.’ అని జస్టిస్ భట్ స్పష్టం చేశారు. -
ఎన్నికలకు రెడీ!
- జూన్ నెలాఖరులో డీలిమిటేషన్ జాబితా - ఎన్నికల నిర్వహణకు రూ.36 కోట్లు - విధులకు 50 వేల మంది సిబ్బంది - వెబ్సైట్లో రిజర్వేషన్ల వివరాలు సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 15లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఆమేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల నిర్వహణక య్యే వ్యయం... అవసరమైన సిబ్బంది... రిజర్వేషన్ల ప్రక్రియ ఎప్పుడు పూర్తి కానుందనే అంశాలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి సోమవారం తన కార్యాలయంలో జీహెచ్ంఎసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 15లోగా ఎన్నికలు పూర్తి కావాలంటే... అంతకంటే 45 రోజుల ముందు... అంటే అక్టోబర్ నెలాఖరులోగా వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు. వార్డుల (డివిజన్ల) విభజన, ఇతరత్రా పనులు ఏ మేరకు వచ్చిందీ అధికారులను ఆరా తీశారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ బదులిస్తూ ఎన్నికల నిర్వహణ .. వార్డుల విభజనకు సంబంధించి క్షేత్ర స్థాయి పనులు పూర్తయ్యాయని తెలిపారు. కార్యాలయ పనులు మాత్రం మిగిలి ఉన్నాయని చెప్పారు. జూన్ చివరి వారంలో ప్రభుత్వ ఆదేశాలు అందగానే వార్డుల డీలిమిటేషన్ తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. వార్డుల సంఖ్య 150 నుంచి 200కు పెరగనున్నాయని చెప్పారు. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు రూపొందిస్తామన్నారు. బీసీ ఓటర్ల గుర్తింపునకు ఇంటింటి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 31లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా నాగిరెడ్డి ఆదేశించారు. వార్డుల విభజన, రిజర్వేషన్లు పూర్తి కాగానే వివరాలను వెబ్సైట్లో ఉంచాల్సిందిగా సూచిం చారు. ఎన్నికలకుఅవసరమైన సిబ్బంది నియామకం, నిధులు, మౌలిక సదుపాయాలు, ఈవీఎంల సేకరణ, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, రిటర్నింగ్ అధికారుల నియామకం, తదితర అంశాలపైనా చర్చించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు తమకు 50 వేల మంది సిబ్బంది అవసరమని, దాదాపు రూ.36 కోట్లు ఖర్చు కాగలవని సోమేశ్ కుమార్ వివరించారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని చెప్పారు. ఈ అం శాల్లో ప్రాథమిక పనులు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. కొత్తగా ఏర్పాటు చేసే వార్డులు మొత్తం ఒకే నియోజకవర్గ పరిధిలో ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్జీ గోపాల్, కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్, అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) రామకృష్ణారావు, సీసీపీ ఎస్.దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోశాల తరలింపుపై హైకోర్టు స్టే
చిట్టినగర్ : గోశాల తరలింపుపై రాష్ర్ట హైకోర్టు స్టే ఇచ్చిందని విజయవాడ గోసంరక్షణ సంఘం అధ్యక్షుడు చింతలపూడి రఘురామ్ పేర్కొన్నారు. అర్జున వీధిలోని గోశాలలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత నెల 28న జరిగన ఘటనలో గోవులు మృతి చెందడంతో గోశాలను వెంటనే ఖాళీ చేయాలని సీపీ నోటీసులు ఇచ్చారన్నారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించగా గోశాలను యథాతథ స్థితిలో కొనసాగించాలని స్టే ఆర్డర్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం గోశాలలో 250 ఆవులు ఉండగా, 12 వందలకు పైగా గోవులు ఉన్నట్లు పోలీసులు భావించారన్నారు. గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. సంఘ సెక్రటరీ కమల్ నాయన్ బంగ్, గోవింద్‌కుమార్ సాబూ, సురేష్‌కుమార్ జైన్, కె.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 23 మంది కమిటీ సభ్యుల అరెస్టు గోవుల మృతి చెందిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై 23 మంది కమిటీ సభ్యులను వన్‌టౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కమిటీ అధ్యక్ష, కార్యదర్శులైన రఘురామ్‌తో పాటు కమల్‌జీలతో పాటు 23 మందిని అరెస్టు చేసి సొంత పూచికత్తుపై విడుదల చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గోశాల పరిరక్షణ కోసం మౌన ప్రదర్శన గోశాల పరిరక్షణ కోసం శుక్రవారం సాయంత్రం గోశాల కమిటీ సభ్యులు, గో ప్రేమికులు మౌన ప్రదర్శన నిర్వహించారు. గోశాల నుంచి కాళేశ్వరరావు మార్కెట్ వరకు సాగింది. -
న్యాయం జరిగింది
- విశాఖ కల ఫలించింది - హైకోర్టు బెంచి ఏర్పాటుకు మార్గం సుగమం - న్యాయవాదుల హర్షం విశాఖ,లీగల్: విశాఖ కల ఎట్టకేలకు ఫలించింది. నగరంలో హైకోర్టు బెంచి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర హైకోర్టు బెంచి ఏర్పాటుపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పుపై నగర న్యా యవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు విభజనకు సంబంధించి దాఖలైన కేసులో తుది తీర్పు వెలువడింది. రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు జరిగే వరకు విశాఖ,తిరుపతిలో బెంచిలు ఏర్పాటు చేసుకోవచ్చునని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ కల్యాణ్ సేన్ జ్యోతి గుప్త, జస్టీస్ పివి సంజయ కుమార్‌లతో కూడిన డివిజనల్ బెంచి సూచించిన సంగతి తెలి సిందే. నగరంలో ఇప్పటికే 61 కోర్టులు వున్నాయి. వీటితో పాటు సేల్ టాక్స్,కార్మిక శాఖ,వాణిజ్య ప న్నుల శాఖ అపీలు ట్రిబ్యునళ్లు,డెట్ రికవరి ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయి. విశాఖ పారిశ్రామిక, వాణిజ్య,వ్యాపార,పర్యాటక,ఐటి రంగాల్లో అపారంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోని అన్ని దేశాలను కలుపుతూ అంతర్ జాతీయ విమానాశ్రయం వుంది. ఈ నగరం హైకోర్టు బెంచి ఏర్పాటుకి అన్నివిధాలా అనుకూలమని సీనియర్ న్యాయవాది,విశాఖ న్యాయవాదుల సంఘం పూర్వ అధ్యక్షుడు ఎన్వి బదరీనాధ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విశాఖలో హైకోర్టు బెంచి సూచన సరైందన్నారు. డివి చిరకాల స్వప్నం ఫలించింది!: విశాఖలో హైకోర్టు బెంచి కోసం గత 30 ఏళ్లుగా అవిశ్రాంత పోరాటం సాగుతోందని ప్రముఖ న్యాయవాది దివంగత డివి సుబ్బారావు తనయుడు డివి సోమయాజులు తెలిపారు.రాష్ట్రాల విభజన సమయంలో శివరామకృష్ణన్ కమిటీకి డివి సుబ్బారావుతో పాటు,విశాఖ న్యాయవాదులందరు నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. హైకోర్టు ఏర్పాటుకి 1993లో న్యాయవాదులు ఆరు నెలలు విధులు బహిష్కరించి పోరాటం చేశామని ఆయన తెలిపారు. రాజధానితో పాటు హైకోర్టు ప్రతిపాదనపై డివి కేంద్ర,రాష్ట్రాలకు నివేదించిన సంధర్భలను గుర్తు చేశారు. విశాఖలో హైకోర్టు బెంచి సూచన తో డివి చిరకాల స్వప్నం ఫలించిదన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు,అఖిల భారత న్యాయవాదుల సంఘం,ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్,న్యాయవాది పరిషత్ హర్షం ప్రకటించాయి. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోటేశ్వరావు కోరారు. హైకోర్టు ఉద్యమ నేపథ్యం: విశాఖలో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. 1980 నుంచి ఈ ఉద్యమానికి ప్రాధాన్యత ఏర్పడింది. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి విశాఖ న్యాయవాదులు డీవీ సుబ్బారావు, మళ్ల సూర్యనారాయణ శాస్త్రి, కృష్ణ మోహన్ ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అందులో విశాఖలో హైకోర్టు బెంచ్ ప్రాధాన్యతను వివరించారు. సువిశాలమైన సముద్ర తీరం, మత్స్యకారులు, గిరిజనులు, కార్మికులు, పారిశ్రామికులు అధికంగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు సత్వర న్యాయం పిలుపుతో విశాఖలో హైకోర్టు బెంచ్ ప్రాధాన్యత పెరిగింది. అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమ్రంతిగా విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. తదనంతరం న్యాయవాదులు అనేక ఉద్యమాలు చేశారు. 1993లో ఆరు నెలలపాటు పూర్తిగా న్యాయవాదులందరూ విధులు బహిష్కరించి ఉద్యమ బాట పట్టారు. కేంద్ర, రాష్ట్ర పభుత్వాలకు హైకోర్టు బెంచ్ఆవశ్యకతను వివరిస్తూ అనేక వినతి పత్రాలు సమర్పించారు. విశాఖ వచ్చే మంత్రులు హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు తమ గోడు వెలిబుచ్చేవారు. 1985లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పుతో ఈ ఉద్యమం మరింత బలపడింది. న్యాయవాదులందరూ పోరాటం సాగించారు. 2014లో శివరామ కృష్ణన్ కమిషన్ రాష్ట్ర విభజనపై జరిపిన అభిప్రాయాలు సేకరించినప్పుడు అప్పటి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్.వి.బదిరినాధ్, డీవీ సుబ్బారావు,సూచనలు అందజేశారు. -
ఎన్నికల్లేవు !
- బీబీఎంపీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు - ఏకసభ్య పీఠం ఉత్తర్వులను రద్దు చేసిన చీఫ్ జస్టిస్ సాక్షి, బెంగళూరు: బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుతానికి కాస్తంత మద్దతునిచ్చేలా హైకోర్టు తీర్పు లభించింది. మే 30లోపు బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించాలంటూ హైకోర్టు ఏకసభ్య పీఠం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ రద్దు చేసింది. దీంతో ఇప్పటి వరకు ప్రతిపక్షాల విమర్శలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రభుత్వానికి కాస్తంత ఊరట లభించినట్లైంది. వివరాలు....బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు ప్రతిపక్షాలు శతవిధాలా ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలు హైకోర్టును సైతం ఆశ్రయించాయి. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయమూర్తి బి.వి.నాగరత్న నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ మే 30లోపు బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లైంది. ఎలాగైనా సరే ఈ ఆదేశాలను అడ్డుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన చేయాల్సి ఉందని, భౌగోళిక అసమానతలను నివారించడంతో పాటు బీబీఎంపీలో జరిగిన అనేక అక్రమాల పై పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉందని, అందువల్ల హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించేందుకు 6నెలల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీలులో కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీలు పై సమగ్ర విచారణ జరిపిన హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి డి.హెచ్.వఘేలా, న్యాయమూర్తి రామమోహన్ రెడ్డిలతో కూడిన డివిజనల్ బెంచ్ శుక్రవారం తన తీర్పును వెల్లడించింది. హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఎన్ని రోజుల్లోపు బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించాలన్న విషయంపై ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరిన గడువు 6 నెలలు కాబట్టి మరో ఆరు నెలల వరకు బీబీఎంపీ ఎన్నికల నిర్వహణ గండం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటపడినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు. -
నిఘా నేత్రాలు
సాక్షి, చెన్నై: రాష్ర్టంలోని అన్ని పోలీసుస్టేషన్లలో ఐదేళ్లలోపు నిఘా నేత్రాలు తప్పని సరిగా ఏర్పాటు చేసి తీరుతామని హైకోర్టుకు హోం శాఖ స్పష్టం చేసింది. ఏడాదికి 263 స్టేషన్లలో నిఘా నేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక, నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యం న్యాయవాదుల మధ్య వాదనలు జోరుగానే సాగాయి. చివరకు కేసును హైకోర్టు తోసి పుచ్చింది. రాష్ర్టంలో అనేక పోలీసు స్టేషన్లు రచ్చబండలుగా మారి ఉన్న విషయం తెలిసిందే. బాసులు పెట్టిందే చట్టం, చేసేదే న్యాయం. అలాగే, తరచూ అక్కడక్కడ చోటుచేసుకుంటున్న లాకప్ డెత్‌లు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ సమయంలో గత ఏడాది రామనాథపురంలో విచారణ పేరిట మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన యువకుడ్ని తీసుకు వెళ్లి లాకప్ డెత్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. అలాగే, అన్ని పోలీసు స్టేషన్లలో నిఘా నేత్రాలు తప్పని సరిగా ఏర్పాటు చేయాల్సిందేనన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఇందుకు మద్రాసు హైకోర్టు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే రీతిలో వ్యవహరించింది. పిటిషన్: న్యాయవాదులు పి ప్రకాష్‌రాజ్, నారాయణన్ కలిసి దాఖలు చేసిన ప్రజా వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ విచారించేందుకు నిర్ణయించింది. పోలీసు స్టేషన్లలో సాగుతున్న బండారాలను వివరిస్తూ దాఖలైన ఆ పిటిషన్‌లోని పలు అంశాలకు కోర్టు అండగా నిలిచిందని చెప్పవచ్చు. అన్ని పోలీసు స్టేషన్లలో నిఘా నేత్రాలు తప్పని సరిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్ సూచించిన వాదనతో కోర్టు ఏకీభవించింది. నిఘా నేత్రాల ఏర్పాటుకు సంబంధించి పలు మార్లు హోం శాఖకు కోర్టు అక్షింతలు వేసింది. చివరకు గత నెల సాగిన విచారణ సమయంలో ఏదో మొక్కుబడిగా వివరణ ఇచ్చి తప్పించుకునే యత్నం చేసిన హోం శాఖ అధికారులకు చీవాట్లు తప్పలేదు. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ హోం శాఖ వర్గాల పని తీరుపై తీవ్రంగానే స్పందించింది. అధికారుల్ని కోర్టు మెట్లు ఎక్కించింది. చివరకు చేసిన తప్పును సరిదిద్దుకునే పనిలో హోంశాఖ వర్గాలు పడ్డాయి. ఐదేళ్లలో నిఘా : శుక్రవారం పిటిషన్ విచారణకు రాగా, రాష్ట్ర హోం శాఖ తరపున ఐజీ(అడ్మిన్)డేవిడ్ సన్ దేవా ఆశీర్వాదం కోర్టుకు వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు 217 స్టేషన్లలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. మరో ఐదేళ్లల్లో అన్ని స్టేషన్లలో నిఘా నేత్రాలు తప్పని సరిగా ఏర్పాటు చేసి తీరుతామని, ఆయా స్టేషన్లలో రికార్డు అయ్యే దృశ్యాలను డిస్క్గా రూపొందించి భద్ర పరుస్తామని వివరించారు. ఏడాదికి 263 స్టేషన్లలో నిఘా నేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం నుంచి హోంశాఖకు అందాల్సిన నిధుల్లో పారదర్శకత లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిధుల్ని తగ్గించడంతో మోడరన్ పోలీసు స్టేషన్ ఏర్పాటులో వెనక్కు తగ్గాల్సి వచ్చిందని వివరించారు. కేంద్రం నిధుల కోతపై ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాసన్‌ను ఉద్దేశించి నిధులు తగ్గాయని చెబుతున్నారుగా, నిధుల సక్రమంగా మంజూరు అయ్యే విధంగా కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లండి అని సూచించారు. ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది అరవింద్ జోక్యం చేసుకుని ఈ విషయంగా కేంద్రానికి లేఖల్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించి ఉన్నదని వివరించారు. ఈసందర్భంగా నిధుల కోతపై కాసేపు వాదనలు జోరుగానే సాగాయి. చివరకు రాష్ట్ర హోం శాఖ ఇచ్చిన వివరణ, ఐదేళ్లలోపు నిఘా నేత్రాల ఏర్పాటు హామీతో హైకోర్టు బెంచ్ ఏకీభవించింది. దీంతో ఈ పిటిషన్ విచారణను ముగించినట్టు ప్రకటించారు. -
పాలికె ఎన్నికల ప్రక్రియ పై హైకోర్టు స్టే
ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో సోమవారం తాత్కాలిక ఊరట లభించింది. వివరాలు.. బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల ప్ర క్రియ మే 30 లోపు పూర్తి చేయాలని జస్టిస్ నాగరత్నతో కూడిన ఏకసభ్య పీఠం వెలువరించిన తీర్పును ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. ఈ కే సును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ ఘేలా, రామమోహన్రెడ్డిలతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేసింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. బీబీఎంపీను ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సీడ్ చేసింది. ఐఏ ఎస్ అధికారి విజయ్‌భాస్కర్ బీబీ ఎంపీ పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. బీబీఎంపీ విభజన విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఏకసభ్య పీఠం ఆదేశం మేరకు మే 30లోపు ఎన్నికల ని ర్వహణ అసాధ్యం. అందువల్ల ఏకసభ్య పీఠం ఇచ్చిన తీర్పును కొట్టివేయా లి.’ అని హైకోర్టుకు విన్నవించారు. ఇక రాష్ట్ర ఎ న్నికల కమిషన్ తరఫున ఫణీంద్ర వాదిస్తూ...ఎ న్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుందన్నారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. అందువల్ల ఏకసభ్య పీ ఠం ఇచ్చిన తీర్పును కొట్టి వేయాల్సిన అవసరం కాని, లేదా స్టే ఇవ్వాల్సిన అవసరం కాని లేదన్నా రు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం ఏకసభ్య పీ ఠం ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అంతేకాక అంతవర కు బీ బీఎంపీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సూచించింది. -
కేసులను త్వరితగతిన పరిష్కరించండి
- ఇప్పటికైతే జిల్లా వెనుకబడి ఉంది - రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలి - హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవికుమార్ - జిల్లా న్యాయమూర్తులతో సమీక్ష సంగారెడ్డి క్రైం: జిల్లాలోని అన్ని కోర్టుల్లో కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్ సూచించారు. సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో జిల్లాలోని న్యాయమూర్తులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ రవికుమార్ మాట్లాడుతూ... కేసులను పరిష్కరించడంలో జిల్లా వెనుకబడి ఉందన్నారు. ఇప్పటికైనా వేగవంతం చేయాలని తెలిపారు. కేసుల పరిష్కారం తదితర వివరాలను తెలుసుకునేందుకు ఇకపై మూడు నెలలకోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. కేసుల నమోదు, పరిష్కారం రెండూ సమానంగా ఉండాలని సూచించారు. కేసులను ఎక్కువ సంఖ్యలో పరిష్కరించి రాష్ర్టంలోనే మొదటి స్థానంలో నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి జడ్జి డా. జి.రాధారాణి, న్యాయమూర్తులు భారతి, దుర్గాప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ రవికుమార్ సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురం శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ స్వామి వారికి పూజలు చేశారు. మొదట హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవికుమార్‌కు స్థానిక ఐబీ వద్ద జిల్లా ఇన్చార్జి జడ్జి డా. జి.రాధారాణి స్వాగతం పలికారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జ్ఞానోభా, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్, రవి, అనిల్ పాటిల్, హన్మంత్‌రెడ్డి, బాపురెడ్డి, దర్శన్, సదానందంలు జస్టిస్ రవికుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. -
సీఆర్డీఏ చట్టబద్ధతపై స్పందించిన హైకోర్టు
{పభుత్వానికి నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం పిటిషనర్ల భూములపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోండి అప్పటి వరకు వారి వ్యవసాయ కార్యకలాపాల్లో జోక్యం వద్దు.. ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశం హైదరాబాద్: రాష్ట్రపతి ఆమోద ముద్ర లేని సీఆర్డీఏ చట్టాన్ని రాజ్యాం గ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖ లైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులైన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్లు దాఖలైన రెండు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని పిటిషనర్లకు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. రాజధాని నిర్మాణానికి చేపట్టిన భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్)కు ప్రభుత్వం పిటిషనర్ల ఆమోదం ప్రభుత్వం కోరడం గానీ, పిటిషనర్లు ఆమోదం తెలపడంగానీ జరగనందున వారి భూముల విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది. అప్పటివరకు పిటిషనర్ల వ్యవసాయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. పిటిషనర్లు తమ భూములను ఇతరులకు విక్రయించడం లేదా బదలాయించడం లేదా థర్డ్ పార్టీ హక్కులను సృష్టించడానికి వీల్లేదని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానికి భూములు అవసరమైతే భూ సమీకరణ కింద కాకుండా కేంద్రం తెచ్చిన కొత్త భూ సేకరణ చట్టం కింద మాత్రమే సేకరించాలని గుంటూరు, విజయవాడలకు చెందిన కొమ్మినేని చలపతిరావు, మరికొందరు రైతులు గతవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ అసలు తాము పిటిషనర్ల భూములను ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునేందుకు వారి అనుమతి కోరలేదని, వారు కూడా భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రానందున వారి భూముల్లో జోక్యం చేసుకుంటామని చెప్పడం సరికాదన్నారు. ఒకవేళ వారి భూములు కావాలంటే 2013లో వచ్చిన కొత్త భూ సేకరణ ద్వారానే తీసుకుంటామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ నోటీసులు మాత్రమే జారీ చేస్తున్నామని, ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం లేదని తెలిపింది. దీనిపై పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది స్పందిస్తూ తాము సీఆర్డీఏ చట్టబద్ధతను మాత్రమే సవాలు చేశామని, వ్యవసాయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. -
నైట్ ఢాంనేషన్
పోలీస్ చర్యలను తప్పుబట్టిన హైకోర్టు నగరంలో ఆపరేషన్ నైట్ డామినేషన్ రద్దు ప్రభుత్వ మార్గదర్శకాలు తీసుకోవాలని సూచన డీలాపడిన కమిషనరేట్ అధికారులు ఆది నుంచి విమర్శల్లో చిక్కుకున్న ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’కు హైకోర్టులో చుక్కెదురైంది. సీపీ వెంకటేశ్వరరావు ప్రతి ష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను రద్దుచేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం తీర్పు చెప్పింది. నైట్ డామినేషన్ పేరుతో పోలీసులు తీసుకుంటున్న చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ నగరానికి చెందిన న్యాయవాది తానికొండ చిరంజీవి చేసిన వాదనతో హైకోర్టు బెంచ్ ఏకీ భవించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ సిటీ/హైదరాబాద్ : ‘నైట్ సేఫ్ సిటీ’ కార్యక్రమంలో భాగంగా గత నవంబర్ 15న ఆపరేషన్ నైట్ డామినేషన్ కార్యక్రమానికి సీపీ వెంకటేశ్వరరావు శ్రీకారం చుట్టారు. రాత్రి 11 గంటల తర్వాత తగిన గుర్తింపు పత్రాలు లేకుండా రోడ్లపై తిరగడాన్ని నిషేధించారు. పోలీసుల ఆంక్షలను ఖాతరు చేయని వారిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యారావుపేట పోలీసు కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరానికి వీరిని తరలించి విచారణ జరిపారు. రాత్రివేళ పట్టుబడిన వారి వేలిముద్రలు, కంటిపాప ఆధారాలను సేకరించారు. పాత నేరస్తులపై కేసులు నమోదుచేసి జైలుకు పంపిన పోలీసు అధికారులు మిగిలిన వారు నగరం విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తొలిరోజుల్లోనే నైట్ డామినేషన్‌ను నగరవాసులు వ్యతిరేకించారు. అత్యవసర పనుల మీద, ఆస్పత్రులకు.. ఇలా రకరకాల పనులతో హడావుడిగా వెళ్లే వారు తగిన గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లక ఇబ్బందులు పడ్డారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) కూడా నైట్ డామినేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరేమనుకున్నా వెనక్కి తగ్గేది లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. రాత్రివేళ నగరంలో తిరగాలంటే గుర్తింపు పత్రాలు తప్పనిసరి అంటూ తేల్చిచెప్పారు. సీనియర్ న్యాయవాది పిటిషన్‌తో.. పోలీసులు చేపట్టిన ఈ నైట్ డామినేషన్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ న్యాయవాది తానికొండ చిరంజీవి డిసెంబర్ ఒకటో తేదీన హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-21లో నిర్ధేశించిన స్వేచ్ఛ, సమానత్వానికి పోలీసుల చర్య విరుద్ధమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత గుర్తింపుకార్డులు లేని వారిని పోలీసుస్టేషన్లకు తరలించడాన్ని తప్పుబట్టారు. రాజ్యాంగంలోని సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, లేని అధికారాలతో ప్రజల హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని చెప్పారు. పిటిషనర్ వాదనను దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 8న హైకోర్టు నైట్ డామినేషన్‌పై స్టే విధించింది. ఆ సమయంలోనే డివిజన్ బెంచ్ పోలీసుల చర్యలను తప్పుబట్టింది. ఇదే సమయంలో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు విధులు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు సోమవారం నాటి తీర్పులో నైట్ డామినేషన్‌ను రద్దు చేసింది. ఆది నుంచి అనుకూలమే.. ఆపరేషన్ నైట్ డామినేషన్‌ను రద్దుచేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్‌సేన్ గుప్తా, సంజయ్‌కుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అధికారం లేని విషయాల్లో పోలీసుల జోక్యం కూడదంటూ నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది చిరంజీవి దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈ మేరకు ఆదేశించింది. స్టే విధింపు సమయంలోనే న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాత్రివేళ తిరగాలంటే పాస్‌పోర్టు వెంట ఉంచుకోవాలా? అంటూ అప్పట్లోనే కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం తగిన మార్గదర్శకాలు నిర్ధేశించి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ డివిజన్ బెంచ్ సూచించింది. చెంపపెట్టు : న్యాయవాది చిరంజీవి హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు నగర పోలీసులకు గుణపాఠమని పిల్ దాఖలు చేసిన న్యాయవాది తానికొండ చిరంజీవి వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తమకు తాము రాజులమని భావించుకుని వ్యక్తిగత ఎజెండాతో సామాన్య పౌరులను ఇబ్బంది పెట్టడం దారుణమని హైకోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు. లేని అధికారాలు సృష్టించుకుని ఎప్పుడూ తమ మాటే చెల్లాలనుకునే అధికారులకు ఈ తీర్పు చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఇంకా ఆదేశాలు అందాలి : సీపీ నైట్ డామినేషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు అందాల్సి ఉందని సీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ నగరానికి చెందిన న్యాయవాది వేసిన పిల్‌పై చట్ట ప్రకారం పోలీసులు తమ పనిని తాము చేసుకోవచ్చని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తూ నైట్ సేఫ్టీ మెజర్స్ విషయంలో అవసరమైన సూచనలు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సూచించినట్టు పేర్కొన్నారు. -
న్యాయ పోరాటానికి సమాయత్తం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లోని జరీబు భూముల రైతులు మూకుమ్మడి న్యాయపోరాటానికి సమాయత్తం అవుతున్నారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా సోమ, మంగళవారాల్లో హైకోర్టులో పిటిషన్లు వేయనున్నారు. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి నిర్బంధంగా భూములు సేకరించారని వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని వాటిపై నిర్ణయాన్ని రెండు వారాల్లో వివరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టులో వివరించిన విషయం విధితమే. సీఆర్డీఏ నిబంధనలకు లోబడి భూ సమీకరణ చేశామని ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో చేసిన వాదనలో వాస్తవం లేదని జరీబు రైతులంతా మూకుమ్మడిగా పిటిషన్లు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నియోజకవర్గానికి చేరుకుని గ్రామాల్లో పర్యటిస్తూ రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు రాజధాని గ్రామాల రైతుల న్యాయ పోరాటానికి ఆర్కే సహకరిస్తున్నారు. ఆందోళన చెందుతున్న రైతులకు ధైర్యం చెబుతూ సీఆర్డీఏ చట్టంపై అవగాహన కలిగిస్తున్నారు. అభ్యంతర పత్రాలు ఇచ్చిన రైతుల భూములను ప్రభుత్వం తీసుకునే అవకాశం లేదని, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి, మంగళగిరి రైతులు ఐక్యంగా న్యాయపోరాటానికి సిద్ధమైతే అందుకు పార్టీ పరంగా సహకరిస్తామని భరోసా ఇస్తున్నారు. గ్రామాల వారీగా కలుస్తున్న రైతులను గ్రూపులుగా చేసి వారితో కోర్టులో పిటిషన్లు వేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ న్యాయపోరాటంలో ఎక్కడా లోపాలు లేకుండా ఉండేందుకు భూ సమీకరణను మొదటి నుంచి తాము వ్యతిరేకించామని, అధికారులు, పాలకుల దందా వలనే తాము అంగీకారపత్రాలు ఇచ్చామంటూ రైతులతో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌కు రిజిస్టర్డ్ లేఖ పంపే ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది రైతులు సోమ, మంగళవారాల్లో పటిషన్లు వేయనున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం.. శనివారం మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ఆర్కే రైతులతో సమావేశం అయ్యారు. 9.2 ఫారాలతో పాటు 9.3 ఫారాలు ఇచ్చిన రైతులంతా కేవలం భయపడి మాత్రమే భూములు ఇచ్చారని వారందరికి న్యాయం జరిగేవరకు పోరాడతానన్నారు. తొలివిడత కోర్టును ఆశ్రయించిన 32 మంది రైతుల విషయంలో స్పష్టమైందన్నారు. మిగిలిన వారంతా కోర్టులో పిటిషన్ వేస్తే తొలి విడత కోర్టులో పిటిషన్ వేసిన రైతులకు వర్తించే న్యాయమే జరుగుతుందన్నారు. ఆదివారం బేతపూడి, నవులూరు, పెనుమాక, యర్రుపాలెం, ఉండవల్లి గ్రామాల్లో ఆర్కే పర్యటించనున్నారు. సోమవారం వరకు గ్రామాల్లో పర్యటించి న్యాయపరమైన పోరాటానికి రైతులను సిద్ధం చేస్తామని, మంగళవారం వారందరితో పిటిషన్లు వేయిస్తానని ఆర్కే సాక్షి ప్రతినిధికి వివరించారు. -
వేర్వేరు హైకోర్టుల ఏర్పాటును పరిశీలించండి...
ఉమ్మడి హైకోర్టు సీజేకు కేంద్ర మంత్రి సదానందగౌడ లేఖ ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది గచ్చిబౌలిలో భవనాన్ని కూడా గుర్తించింది లేఖలో సీజే దృష్టికి తీసుకొచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాకు కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రెండు రోజుల క్రితం జస్టిస్ సేన్‌గుప్తాకు ఓ లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా గత ఏడాది జూన్ 2న ఏర్పడిన విషయం మీకు తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సచివాలయం, శాసనసభ, మండలి భవనాలను రెండు రాష్ట్రాలకూ విభజించారు. ఇవి రెండూ అన్ని సౌకర్యాలతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. అయితే రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటు మాత్రం జరగలేదు. తెలంగాణకు చెందిన న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రానికి వేరే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న రెండు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటు చేయాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. హైకోర్టుకు గచ్చిబౌలి ప్రాంతంలో 4.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఓ బహుళ అంతస్తుల భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి, అందులో అన్ని సౌకర్యాల కల్పనకు ముందుకొచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో రెండు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటుకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో న్యాయవాదులు గత కొంత కాలంగా కోర్టు విధులను బహిష్కరించారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్న హామీతో వారు ఆందోళన విరమించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు హైకోర్టులను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించగలరు’ అని సదానందగౌడ తన లేఖలో పేర్కొన్నారు. -
17 తర్వాత సమ్మెలోకి..
న్యాయశాఖ ఉద్యోగుల సంఘం సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజనతోపాటు తన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 17 తర్వాత ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగులు ప్రకటించారు. సమ్మె నోటీసు గడువు17తో ముగుస్తున్న నేపథ్యంలో.. హైకోర్టు నుంచి చర్చలకు పిలుపు రాకపోతే సమ్మెకు దిగడం అనివార్యమని స్పష్టం చేశారు. సమ్మెపై చర్చించేందుకు ఆదివారం సిటీ సివిల్ కోర్టు ఆవరణలో తెలంగాణ పది జిల్లాలకు చెం దిన న్యాయశాఖ ఉద్యోగుల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు సమావేశమయ్యారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరి గింది. హైకోర్టు విభజనతోపాటు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించారు. అయితే సమ్మెను ఎప్పటి నుంచి చేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీకి అప్పగించారు. ప్రత్యేక హైకోర్టు కోసం న్యాయవాదులతో కలసి ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరున చలో హైదరాబాద్ నిర్వహించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం హైకోర్టు విభజనతోపాటు వారి డిమాండ్ల సాధన కోసం న్యాయశాఖ ఉద్యోగులు సమ్మె నిర్ణయం తీసుకోవడంపై నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొండారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 45 రోజులుగా న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని, ఈ నేపథ్యంలో న్యాయశాఖ ఉద్యోగులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. -
హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోండి
కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడకి టీఆర్ఎస్ ఎంపీలు, బార్‌కౌన్సిల్ సభ్యుల విజ్ఞప్తి న్యూఢిల్లీ/ హైదరాబాద్: వీలైనంత త్వరగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరు హైకోర్టులను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు కేంద్ర మంత్రి సదానందగౌడకి విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనాయకుడు జితేందర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బాల్క సుమన్, బార్ అసోసియేషన్ సభ్యులు సదానందగౌడను మంగళవారం ఢిల్లీలో ఆయన నివాసంలో కలిశారు. హైకోర్టు విభజన ఆలస్యం కావడంతో పెండింగ్ కేసులతోపాటు ఇతర సమస్యలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ‘విభజన బిల్లు పాస్ అయి ఏడు నెలలు అవుతోంది. వీలైనంత త్వరగా హైకోర్టును విభజించాలి, కోర్టులో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చినట్టు చెప్పారు. హైకోర్టు విభజన అంశాన్ని ఇప్పటికే పార్లమెంట్‌లోనూ లేవనెత్తినట్టు గుర్తు చేశారు. విభజన చట్టంలో హామీ మేరకు హైకోర్టు విభజన అంశాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళతానని మంత్రి సదానందగౌడ హామీ ఇచ్చినట్టు జితేందర్‌రెడ్డి తెలిపారు. మరోవైపు హైకోర్టును విభజించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించాలని కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడ్‌ను రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి కోరారు. ఈ మేరకు నర్సింహారెడ్డి సోమవారం సదానందగౌడ్‌కు ఓ లేఖ రాశారు. -
ఏపీఓఏ విభజన కోసం పిటిషన్
రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాన్ని విభజించాలని... రెండు సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రంగారెడ్డి, కృష్ణా జిల్లాల ఒలింపిక్ సంఘ కార్యదర్శులు మల్లారెడ్డి, కేపీరావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రెండు రాష్ట్రాల క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు శాప్, శాట్స్ ఎండీలను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. -
కోర్టుకెక్కిన ‘కేపీఎస్సీ’ వివాదం
ప్రభుత్వ సిఫార్సు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిల్ బెంగళూరు: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్(కేపీఎస్సీ) అధ్యక్ష, సభ్యుల నియామకానికి సంబంధించి గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడిక హైకోర్టుకు చేరింది. కేపీఎస్సీ అధ్యక్ష స్థానానికి వి.ఆర్.సుదర్శన్‌తో పాటు ఇత ర సభ్యుల నియామకానికి ప్రభుత్వం పంపిన సిఫార్సును ప్రశ్నిస్తూ సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహాం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశా రు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కేపీఎస్సీ అధ్యక్ష, సభ్యుల నియామకానికి గవర్నర్ ఆధ్వర్యంలో మార్గదర్శకాలను రూపొందించాలని, ఈ మార్గదర్శకాలు వె లువడే వరకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన జాబితా ను పక్కన పెడుతూ గవర్నర్ ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సూచించాలని ఈ వ్యాజ్యంలో కోరారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రానుంది. -
బ్రిటిష్ కాలం నాటి విద్యా వ్యవస్థే మన దౌర్భాగ్యం
తిరుపతి రూరల్: బ్రిటిష్ కాలం నాటి విద్యా వ్యవస్థ నేటికీ ఉండటం మన దౌర్భాగ్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. భ్రష్టు పట్టిన విద్యావ్యవస్థను నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతిలో శుక్రవారం నారాయణ విద్యాసంస్థల ఐఐటి, మెడికల్ విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. బ్రిటిష్ కాలం విద్యావ్యవస్థ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. విద్యార్థులకు స్వేచ్ఛనిస్తే వారు అనుకున్నది సాధించి చూపుతారన్నారు. కాని 90 శాతం తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు బిడ్డల మనసును గుర్తించకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. దేశానికి నూతనంగా ఆలోచించేవాళ్లు అవసరమని, ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా కృషి చేయాలని చెప్పారు. ఎంత ఎదిగినా సమాజాన్ని మరువవద్దని, మంచిని, మానవ త్వాన్ని పెంచే చదువులు అభ్యసించాలని సూచించారు. స్వా తంత్ర దేశంలో ఇంకా రిజర్వేషన్లు అవసరమా? అని భ గవాన్ అనే విద్యార్థి ప్రశ్నించగా ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగి, చిన్ననాటి నుంచే కుల, మతాలకు అతీ తంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందినప్పుడు రి జర్వేషన్ల అవసరం ఉండదని చెప్పారు. విద్యార్థులకు స్ఫూ ర్తి కలిగించేదుకు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యా సంస్థల డీజీయం కొండలరావు తెలిపారు. అనంతరం జస్టిస్ చంద్రకుమార్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అకడమిక్ డీన్ శేషంరాజు, ఏజీయంలు శంకరరావు, చంద్రబాబు, ప్రిన్సిపల్స్ రాజశేఖర్, వెంకట చౌదరి, హేమంత్ పాల్గొన్నారు. -
‘అంబులెన్స్ పన్ను’ తగదు!
* నిరాకరించిన హైకోర్టు * రైల్వే పరిపాలనా విభాగం పిటిషన్ తిరస్కరణ సాక్షి, ముంబై: అంబులెన్స్ సేవలు అందిస్తున్నందుకు టికెటుపై అదనంగా పన్ను వసూలు చేసేందుకు అనుమతివ్వాలని రైల్వే పరిపాలన విభాగం దాఖలుచేసిన పిటిషన్‌ను హై కోర్టు తిరస్కరించింది. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు అందించడం రైల్వే శాఖ బాధ్యత. గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించడం మౌలిక సదుపాయాల్లో ఒక భాగమని, సేవలు అందించినందుకు అదనంగా పన్ను వసూలు చేయడం చట్టరీత్యా నేరమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రయాణికులకు పన్ను పెంపు నుంచి ఊరట లభించింది. నగరంలో సెంట్రల్, హార్బర్, పశ్చిమ, ట్రాన్స్ హార్బర్ పేరిట నాలుగు లోకల్ రైల్వే మార్గాలున్నాయి. ప్రతిరోజూ దాదాపు 70 లక్షల మందికి పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. నిత్యం ఏదో మార్గంలో, ఏదో ఒక స్టేషన్ పరిధిలో రైలు ఢీ కొని లేదా కిందపడి పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందుతున్నారు. కొందరు తీవ్రంగా గాయపడగా మరికొందరు అవయవాలు కోల్పోయి శాశ్వతంగా వికలాంగులుగా మారుతున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు చేరవేసేందుకు గతంలో స్టేషన్ బయట ఎలాంటి ప్రత్యేక వాహనాలుండేవి కావు. దీంతో బాధితులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో విలువైన ప్రాణాలు మధ్యలోనే గాలిలో కలిసిపోయేవి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బాంబే హైకోర్టు గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించే ఏర్పాట్లుచేయాలని రైల్వే పరిపాలన విభాగానికి హుకుం జారీ చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ కొన్ని కీలక స్టేషన్లలోనూ, ప్రమాదాలు ఎక్కువ జరిగే స్టేషన్ల బయట అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచింది. అయితే ఉచితంగా అంబులెన్స్ సేవలు అందిస్తున్నందుకు రైల్వేపై యేటా కొన్ని కోట్ల రూపాయల భారం పడుతోందని పేర్కొంటూ భారాన్ని తట్టుకునేందుకు ప్రయాణికుల టికెటుపై అదనపు పన్ను వసూలు చేయాలని ప్రతిపాదించింది. కాని ఈ సేవలు అందించడం రైల్వే బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది. అంతేగాకుండా బాధితులకు తీవ్ర రక్తస్రావం జరగకుండా అన్ని స్టేషన్లలో ‘ఎమర్జెన్సీ మెడికల్ రూం’ వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా ప్రస్తుతం వికలాంగులకు, గర్భిణులకు, కేన్సర్ రోగులకు కేటాయించిన మాదిరిగానే వృద్ధులకు కూడా ప్రత్కేకంగా ఓ బోగీలో కొంత భాగం కేటాయించాలని సూచించింది. -
సీఎం సిద్ధుకు హైకోర్టు నోటీసులు
బెంగళూరు: కనకపుర యోజన ప్రాధికార సభ్యుల నియామకంలో అవకతవకలు జరిగాయన్న విషయానికి సంబంధించి హైకోర్టు ము ఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నోటీసులు జారీచేసింది. సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్, సీబీఐకి శుక్రవా రం నోటీసులు జారీచేసింది. వివరాలు... తా ను సూచించిన వారిని కనకపుర యోజన ప్రాధికారలో సభ్యులుగా నియమించాలని ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. దాని ప్రకారమే సిద్ధరామయ్య నియామకాలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన దాఖలాలను ఆర్టీఐ కార్యకర్త రవికుమార్ సంపాదిం చారు. వాటిని మొదట సీబీఐ అధికారులు ముందు ఉంచి.. కేసు నమోదు చేయాలని కోరారు. అందుకు వారు నిరాకరించడంతో ఆయన దీనిపై హైకోర్టులో రిట్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు మంత్రి డీకే శివకుమార్, సీబీ ఐ సంస్థలను రవికుమార్ ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. -
చెరువులు
ఆక్రమణదారుల గుప్పిట్లో చెరువులు, కుంటలు వేలాది ఎకరాల శిఖం భూములు అన్యాక్రాంతం రూ.కోట్ల విలువైన సంపద అక్రమార్కుల పరం నేడు భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు రాక ప్రతి చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో నిర్మాణాలకు అనుమతించొద్దు.. నిర్మిస్తే కూల్చి వేయూలి.. అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. వీటిని అమలు చేయూలని ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. వరంగల్ రూరల్ :జిల్లాలోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నారుు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమార్కుల గుప్పిట్లోకి వెళ్లారుు. పల్లెలు, పట్టణాలు, నగరాలు విస్తరించడం.. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో స్థలాల విలువ పెరగడం.. నివాస స్థలాలు దొరక్కపోవడంతో రియల్టర్లు, రాజకీయ నాయకుల దృష్టి చెరువులపై పడింది. రెవెన్యూ అధికారుల అండదండలతో కాకతీయుల కాలం నాటి చెరువులు కనుమరుగవుతున్నాయి. దీంతో తెలంగాణ సర్కారు సాగు, తాగు నీటి అవసరాల కోసం చిన్న చెరువుల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేసింది. ‘మిషన్ కాకతీయ’ పేరిట ప్రతి చెరువును పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు నిధులు కూడా మంజూరు చేస్తోంది. జిల్లాలో అసలు చెరువులు ఎన్ని ఉన్నాయి? అందులో అక్రమణలకు గురైనవి ఎన్ని? అనే విషయాలపై సర్వే నిర్వహించాలని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు అక్రమణలకు గురైన వాటిని గుర్తించారు. జిల్లాలో 5,865 చెరువులు ఉండగా.. 63 చెరువులు అక్రమణలకు గురైనట్లు లెక్క తేల్చారు. గ్రేటర్ పరిధిలో చెరువులన్నీ అన్యాక్రాంతం గ్రేటర్ వరంగల్ పరిధిలోని చెరువులు ఉన్న ప్రాంతాల్లో కాలనీలు వెలియడంతో చెరువుల అనవాళ్లు లేకుండా పోయాయి. జిల్లావ్యాప్తంగా 63 చెరువులు అక్రమణలకు గురి కాగా.. గ్రేటర్ వరంగల్ పరిధిలోని హన్మకొండ, వరంగల్, కాజీపేట, హసన్‌పర్తి రెవెన్యూ గ్రామాల పరిధిలో 34 చెరువులు అక్రమణలకు గురయ్యాయి. హన్మకొండ మండల పరిధిలో న్యూశాయంపేట కోట చెరువు, కాజీపేట దంతాల, బంధం, భట్టుపల్లి కోట, తిమ్మాపూర్ బెస్తం, మడికొండ లోయ కుంట, అయోధ్యాపురం దాసరి కుంట, సోమిడి ఊర చెరువు, పైడిపెల్లిలోని ఉగాది చెరువు, పురి గిద్దు, మొగుళ్లబంధం, ఆరెపల్లి తుర్కకుంట, తిమ్మాపూర్‌లోని మద్దెలకుంట, మంగళకుంట, ఎర్రకుంట, మామునూరులోని భగవాన్ చెరువు, సాయికుంట, ఏనుమాములలోని సాయి, రామసముద్రం, బ్రాహ్మణకుంట, గోపాలపురంలోని ఎనకెర్ల సూరం కుంట, ఊర చెరువు, పలివేల్పుల లోని పెద్ద చెరువు, ఉంగల, మాలకుంటలు ఉన్నాయి. వరంగల్ మండల పరిధిలో ఉర్సు రంగసముద్రం, మట్టెవాడ కోట, నిమ్మల చెరువు, దేశాయిపేట కొత్త వడ్డేపల్లి చెరువు, హసన్‌పర్తి మండల పరిధిలో వంగపహాడ్ చింతల్ చెరువు, ఎల్లాపూర్ సాయన్న చెరువు, భీమారం శ్యామల చెరువు, హసనపర్తి చెన్నంగి చెరువు, ముచ్చర్ల వెంకటాద్రి చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పరిధిలోని వేలాది ఎకరాల్లో ఇళ్లు, ఫ్లాటింగ్ చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అసలు చెరువు విస్తీర్ణం ఎంత ఉంది.... అందులో ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతం అయిందన్న వివరాలు ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా చె ప్పలేక పోతున్నారు. ట్రైసిటీస్తోపాటు కాజీపేట రెవెన్యూ గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యూరుు. ఆక్రమణల్లో మరో 29 చెరువులు సాగు నీటి పారుదల శాఖ అధికారులు నిర్వహించిన సర్వేల్లో 63 చెరువులు అక్రమణలకు గురికాగా.. అందులో 34 నగర శివారు పరిధిల్లో ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో మరో 29 చెరువులు అక్రమణలకు గురైనట్లు అధికారులు లెక్కల్లో పేర్కొన్నారు. చేర్యాల మండలంలో కుడి చెరువు, పెద్ద చెరువు, కొండ పోచమ్మ చెరువు, బచ్చన్నపేటలో గోనే చెరువు, నర్సింహులపేటలో పేకలచెరువు, కురవీలో బంధం చెరువు, దత్తరాల చెరువు, మామిడాల చెరు వు, ఊర చెరువు, నర్సంపేటలో పెద్ద చెరువు, దామె ర చెరువు, ఖానాపూర్‌లో పాకాల చెరువు, చిట్యాలలో ఊర చెరువు, పెద్ద చెరువు, టేకుమట్ల ఊర చెరువు, భూపాలపల్లిలో తిప్పిరెడ్డికుంట, పోల్కమ్మ చెరువు, దోమలపల్లి చెరువు, పెద్దదామెర చెరువు, శాయంపేట గట్లకానిపర్లిలో పెద్ద చెరువు, రేగొం డలో దామెర చెరువు, యాసిన్ చెరువు, వెంకటాద్రికుంట, చౌకుంట, ఆత్మకూరు ఓగ్లాపూర్‌లోని ఊర చెరువు, మహబూబాబాద్‌లో బంధం చెరువు, జానాల చెరువు, గుండ్ల కుంట, కృష్ణసాయి కుంటలు ఉన్నాయి. చేర్యాల, మహబూబాబాద్, నర్సంపేటల్లోని చెరువులు నివాస గృహాల కోసం ప్లాటింగ్ చేయగా మిగిలిన మండలాల్లోని చెరువు వ్యవసాయం నిమిత్తం ఆక్రమణలకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఎన్ని ఎకరాలు అక్రమణలకు గురైన వివరాలు లేకపోవడం వల్ల ఈ సర్వే మొక్కుబడిగా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సమగ్ర సర్వేను నిర్వహిస్తే అన్యాక్రాంతం అయిన చెరువుల వివరాలు వెలుగుచూస్తాయి. కబ్జాకు గురైన చెరువుల భూములు.. వరంగల్ దేశాయిపేట రెవెన్యూ గ్రామ పరిధి సర్వే నంబర్ 300లోని చిన్న వడ్డేపల్లి విస్తీర్ణం 100 ఎకరాలు.. కాగా ఎఫ్టీఎల్ పరిధి 130 ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు. ఇందులో 18 ఎకరాలు అక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. జెసీ కరుణ ఉన్న సమయంలో అక్రమణ నిర్మాణాలు కూల్చేందుకు ఉపక్రమించగా అధికారంలో ఉన్న నేతలు అడ్డుకున్నారు. దీంతో మళ్లీ తాజాగా అక్రమించుకునేందుకు రియల్టర్లు వ్యూహాలు రచిస్తున్నారు. మట్టెవాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 352లో ఉన్న కోట చెరువు 158 ఎకరాలని రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 30 ఎకరాలు కబ్జాలకు గురైంది. రంగశాయిపేట సర్వే నంబర్ 179లోని దామెర చెరువు విస్తీర్ణం 134 ఎకరాలు ఉండగా.. అందు లో 10 ఎకరాలు, సర్వే నంబర్ 64లోని బెస్తం చెరువు 6.17ఎకరాలు ఉండగా.. 4 ఎకరాలు అన్యాక్రాంతమైంది. సర్వే నంబర్ 304లోని ఉర్సు రంగసముద్రం 132 ఎకరాల్లో 18 ఎకరాలు అక్రమించుకున్నట్లు సమాచారం. నగర నడిబొడ్డున ఉన్న భద్రకాళి చెరువు సుమారు 700 ఎకరాల్లో విస్తరించి ఉంది. నగర ప్రజల నీటి అవసరాల కోసం ఈ చెరువును స్టోరేజీ ట్యాంకుగా మార్చారు. స్టోరేజీ ట్యాంకుగా మారిన చెరువులోకి వర్షపు నీరు రాకుండా చుట్టూ బండ్ ఏర్పాటు చేయడంతో ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈ విషయంపై ఇటీవల విజిలెన్స్ అధికారులు విచారణ సైతం జరిపారు. ఎన్ని ఎకరాలు అక్రమణలకు గురైందన్న వివరాలు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. -
మూసీ కినారే.. కానూన్ హవేలీ
మూసీ నదీ తీరంలో, నయాపూల్ బ్రిడ్జికి దగ్గర్లో, ఎరుపు-తెలుపు రంగుల్లో ఉన్న రాష్ట్ర హైకోర్టు భవనం గంభీరంగా ఎంతో హుందాగా కన్పిస్తుంది. మతసామరస్యానికి ప్రతీకగా అన్నట్లు హైకోర్టు భవనంపై ‘రాం-రహీం’ అని రాసి ఉన్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన శంకర్‌లాల్ హైకోర్టు భవనానికి ప్లాన్‌ను రూపొందించగా, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఆస్థానంలోని ఇంజనీర్, మెహెర్ అలీ ఫజల్ పర్యవేక్షణలో నిర్మాణం పూర్తయింది. 1915 ఏప్రిల్ 15న హైకోర్టు భవనానికి శంకుస్థాపన జరిగింది. నాలుగేళ్లకు అంటే 1919 మార్చి 31 నాటికి ఈ నిర్మాణ ం పూర్తయింది. 1920 ఏప్రిల్ 20న ఏడో నిజాం ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. చల్లని నీడలో లా.. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. హైకోర్టు భవన నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా.. కుతుబ్‌షా రాజులు నిర్మించిన హీనా మహల్-నాడీ మహల్ తాలుకా అవశేషాలు బయల్పడ్డాయని చరిత్రకారులు తమ రచనలలో పేర్కొన్నారు. ఏడో నిజాం పరిపాలనకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1937లో జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకల సమయంలో నిజాం ప్రభువుకు సుమారు వంద కిలోల బరువున్న వెండితో చేసిన హైకోర్టు భవన నమూనాను వెండి తాళం చెవితో సహా బహూకరించారు. ఈ నమూనా నేటికీ పురానీ హవేలీలోని నిజాం మ్యూజియంలో భద్రంగా ఉంది. విశాలమైన కోర్టు గదులు, భవనం చుట్టూ ఎత్తయిన వృక్షాలతో చల్లని నీడలో ఉన్న హైకోర్టు భవనం సందర్శకులను ఆకట్టుకుంటోంది. సమన్యాయం.. 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కొత్త రాష్ట్రం హైకోర్టును ఇదే భవనంలో కొనసాగించారు. 1956 నవంబర్ 5 నుంచి ఏపీ హైకోర్టు పనులు ప్రారంభం అయ్యాయి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2005 నవంబర్‌లో అదే భవన ప్రాంగణంలో స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైకోర్టు ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్‌కు ఈ భవనమే హైకోర్టుగా భాసిల్లుతోంది. -
జ్యుడీషియల్ కస్టడీకి రాంపాల్
వివాదాస్పద స్వామీజీని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు 28వ తేదీన తదుపరి విచారణ రాంపాల్ అరెస్ట్‌పై సమగ్ర నివేదిక కోరిన కోర్టు చండీగఢ్: హర్యానాకు చెందిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురు స్వామి రాంపాల్‌ను పోలీసులు గురువారం పంజాబ్, హర్యానా హైకోర్టులో హాజరుపరిచారు. ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపించిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 28వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, 2006 నాటి హత్యాకేసుకు సంబంధించి రాంపాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను కూడా రద్దు చేసింది. రాంపాల్ అరెస్ట్ కోసం నిర్వహించిన ఆపరేషన్ తాలూకు పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. రాంపాల్కున్న ఆస్తుల వివరాలతో ఒక నివేదిక అందించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో మత కేంద్రాలైన ‘డేరా’ల్లో అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వచేయడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం రాంపాల్‌ను తాజాగా నమోదైన దేశద్రోహం, హత్య, ఆశ్రమం వద్ద హింసాకాండ తదితర నేరారోపణలపై పోలీసులు హిస్సార్ కోర్టుకు తీసుకువెళ్లారు. ఆరుగురు మరణించడం సహా గత రెండు రోజులుగా ఆశ్రమంలో జరుగుతున్న ఘటనలపై తాజాగా రాంపాల్, ఆయన అనుచరులపై పోలీసులు 35 కేసులను నమోదు చేశారు. కొన్ని కేసుల దర్యాప్తునకు గానూ హిస్సార్ ఎస్పీ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. ఆశ్రమ వ్యవహారాల్లో మావోయిస్టుల పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలితే.. దానిపై కూడా క్షుణ్ణంగా విచారణ జరుపుతామని హర్యానా డీజీపీ వశిష్ట్ తెలిపారు. తప్పుడు ఆరోపణలు: రాంపాల్ కోర్టుకు హాజరుపర్చేముందు స్వామి రాంపాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని స్వామి రాంపాల్ పేర్కొన్నారు. కోర్టు హాల్లో మాత్రం ఆయన మౌనంగా ఉన్నారు. బుధవారం వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న రాంపాల్‌కు చెందిన సత్లోక్ ఆశ్రమం నుంచి అనుచరులందరినీ పోలీసులు ఖాళీ చేయించి, క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మీడియాను ఆశ్రమంలోకి అనుమతించారు. స్నానం పాలతో.. ప్రసాదం! హిస్సార్: అరెస్ట్ అనంతరంరాంపాల్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భక్త కబీరు ఆధ్యాత్మిక వారసుడిగా ప్రకటించుకున్న రాంపాల్.. భక్తులకు రోజూ అందించే ప్రసాదం ఏంటో తెలుసా?. పాలతో స్నానం చేసి.. ఆ పాల తో ఖీర్ తయారుచేయించి, భక్తులకు క్షీరామృతంగా అందిస్తా రు. హర్యానాలోని బల్వారాలో 12 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటైనఈ ఆశ్రమం ఆధునిక హంగులతో అలరారుతూ ఉంటుం ది. భారీ స్విమింగ్ పూల్, ఎసీ గదులు, ల్యాప్‌టాప్‌లు, ఎల్ఈడీ స్క్రీన్లతో లెక్చర్ హాళ్లు ఉన్న ఆధునిక ఆశ్రమం అది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా భారీ గానే సమకూర్చుకున్నారని సమాచారం. తమను అర్థనగ్నంగా ఉండాలనిమేనేజ్మెంట్ వేధించిందని ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన మహిళలు తెలిపారు. -
22న ‘కో ఆప్షన్’ ఎన్నిక
కామారెడ్డి టౌన్ : హైకోర్టు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ ఎ న్నికలు తిరిగి ఈనెల 22న జరుగనున్నాయి. హైకోర్టు నియమించిన ఎన్నికల జాయింట్ అబ్జర్వర్లు (అడ్వొకేట్స్) దివ్యదత్త, నమీరాచామా ఈ మేరకు ప్రకటన చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయం చేరుకున్న వారు కమిషనర్ నుంచి వివరాలు సేకరించారు. జూలై 30న జరిగిన కో ఆప్షన్ ఎన్నికలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. వ్యవహారం హైకోర్టుకు చేరడంతో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌కు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల జాయింట్ అబ్జర్వర్లు మూడు కో ఆప్షన్ స్థానాలకు జనరల్, మైనార్టీ మహిళ, పురుష అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు. పరిశీలన అనంతరం రెండుమూడు రోజులలో తుది జాబితాను ప్రకటిస్తారు. అబ్జర్వర్ల పరిశీలనలో అనర్హుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులలో కొందరిపై అధిక సంతానం, క్రిమినల్ కేసులు ఉన్నట్లు గత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు సమర్పించిన ఆధారాలను కూడా అబ్జర్వర్లు తీసుకెళ్లారు. పార్టీలలో మొదలైన టెన్షన్ ముగ్గురు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి 15 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ప్రధాన పార్టీలలో మళ్లీ టెన్షన్ మొ దలైంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పదవులు దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. పాలకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు 17 మంది, టీఆర్ఎస్ ను ంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఎనిమిది మంది ఉన్నారు. సీపీఎం, ఇండిపెండెంట్, ఎంఐఎం కౌన్సిలర్లు ఒక్కొక్కరు ఉన్నారు. బీజేపీ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. మున్సిపల్ పాలకవర్గంలో ఎక్స్అఫీషియో సభ్యులైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కో ఆప్షన్ పదవులను తమ పా ర్టీకే దక్కేలా పోటాపోటీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అబ్జర్వర్ల సమక్షంలో ఎన్నికల నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ బాలోజీ నాయక్ తెలిపారు. ఎన్నికల తేదీని పొడిగించాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు, చైర్పర్సన్ కోరుతున్నట్లు తెలిసింది. ఏం జరిగిందంటే జూలై 30న కామారెడ్డి మున్సిపల్ హాల్లో ముగ్గురు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగగా, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే గంపగోవర్ధన్ మధ్య ఆధిపత్య పోరు కొనసా గింది. నామినేషన్ వేసినవారిలో అధిక సంతానం, అనర్హులు ఉన్నారని షబ్బీర్ అలీతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలను వాయిదా వే యాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గంప, టీఆర్ఎస్ కౌన్సిలర్లు వాదించారు. ఇరుపార్టీల మధ్య వాగ్వాదం జరు గడంతో చైర్పర్సన్ పిప్పిరి సుష్మ సమావేశాన్ని వాయిదా వేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం సమావేశం నుంచి వెళ్లిపోయారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మెజార్టీ సభ్యులైన కౌన్సిలర్లు అప్పటికప్పుడు ప్యానల్ కమిటీ చైర్మన్‌గా చాట్ల లక్ష్మిని ఎన్నుకున్నారు. అనంతరం నిట్టు క్రిష్ణమోహన్రావు, అప్సరీడేగం, మహ్మద్ సాజిద్‌ను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక చట్టవిరుద్ధమని కాంగ్రెస్ పార్టీ, చైర్పర్సన్ హైకోర్టును ఆశ్రయించడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. -
పీఆర్కే రాకతో వెల్లువెత్తిన అభిమానం
మాచర్ల టౌన్ : టీడీపీ నాయకుల ప్రోద్బలంతో నమోదైన అక్రమ కేసుపై హైకోర్టు నుంచి స్టే పొంది నెలరోజుల తరువాత శుక్రవారం రాత్రి మాచర్లలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అడుగడుగునా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలవర్షం కురిపించారు. ఎమ్మెల్యే పీఆర్కే హైదరాబాద్ నుంచి మాచర్లకు వస్తున్నారని తెలుసుకున్న మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, రెంటచింతల మండలాలకు చెందిన వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయంత్రం 4 గంటలకే సాగర్ కొత్త బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. ఆరు గంటలకు విజయపురిసౌత్‌కు చేరుకున్న ఎమ్మెల్యే పీఆర్కే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు ఘనస్వాగతం పలికారు. సాగర్ నుంచి మాచర్లకు వచ్చేంతవరకు రోడ్డుకిరువైపుల ప్రతి గ్రామంలో అభిమానులు, ప్రజలు వందలాది మంది వేచి వుండి వైఎస్సార్ సీపీ జెండాలను రెపరెపలాడిస్తూ పూలుజల్లుతూ అన్నా.. రామకృష్ణ అన్నా ఎప్పుడూ విజయం మీదేనంటూ అపూర్వస్వాగతం పలికారు. ఏకోనాంపేట, భైరవునిపాడు, తాళ్లపల్లి, కొత్తూరు, పశువేముల గ్రామాలకు చెందిన ప్రధాన రహదారి పైకి చేరుకొన్న ఎమ్మెల్యే పీఆర్కే కాన్వాయ్ పై పూలుజల్లుతూ జై పీఆర్కే అంటూ నినాదాలు చేశారు. ఆయా గ్రామాల్లో ఘనస్వాగతం పలకడంతో 15 కిలోమీటర్ల దూరం రావడానికి రెండు గంటల సమయం పట్టింది. కొత్తపల్లి జంక్షన్ వద్దకు రాగానే పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ పూలజల్లు కురిపించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి పీఆర్కే, వెంకట్రామిరెడ్డిలకు అభినందనలు తెలిపారు. కొత్తపల్లి జంక్షన్ నుంచి 500 ద్విచక్ర వాహనాలతో వేలాది మంది కార్యకర్తలు అనుసరిస్తూ బస్టాండ్ వరకు భారీ ఊరేగింపు జరిపారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్ సీపీని అడ్డుకోలేరని ఎమ్మెల్యే పీఆర్కే పట్ల అభిమానాన్ని ఆపలేరంటూ కేరింతలు కొడుతూ కార్యకర్తలు పీఆర్కేను భుజాలపై ఎక్కించుకొని ప్రదర్శన నిర్వహించారు. తరువాత తన వాహనంపై కూర్చొ ని ప్రజలకు అభివాదంచేస్తూ పీఆర్కే ప్రదర్శనలో పాల్గొన్నా రు. పట్టణంలో బాణసంచా కాలుస్తూ కార్యకర్తలు, పీఆర్కే యూత్ సందడిచేశారు. భారీ ఊరేగింపుతో పట్టణంలో ఎటుచూసినా వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తల నినాదాల తో దద్దరిల్లింది. కార్యక్రమంలో జెడ్పీటీసీ శేరెడ్డి గోపిరెడ్డి, ఎంపీపీ ఓరుగంటి పార్వతమ్మజయపాల్రెడ్డి, వైఎస్సార్ సీపీ పురపాలకసంఘ ఫ్లోర్, డిప్యూటీలీడర్లు బోయ రఘురామిరెడ్డి, షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్లు బత్తుల ఏడుకొండలు, కామనబోయిన కోటయ్యయాదవ్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు యరబోతుల శ్రీనివాసరావు, తాడి వెంకటేశ్వరరెడ్డి, పట్టణ, మండల, రెంటచింతల, దుర్గి మండలాల కన్వీనర్లు పోలూరి నరసింహారావు, నోముల కృష్ణ, శొంఠిరెడ్డి నర్శిరెడ్డి, వెలిదండి గోపాల్, నాయకులు ఎం.శ్రీనివాసశర్మ, జూల కంటి వీరారెడ్డి, మేకల కోటిరెడ్డి, నర్రా గురవారెడ్డి, గుత్తికొండ సత్యనారాయణరెడ్డి, చుండూరి రోశయ్య, మాజీ కౌన్సిలర్లు షేక్ కరిముల్లా, మాచర్ల సుందరరావు, షేక్ రషీద్, కౌన్సిలర్లు అనంతరావమ్మ, వింజమూరి రాణిమోషె, బి.నాగలక్ష్మీసుధాకర్రెడ్డి, పోలా భారతిశ్రీను,పోతిరెడ్డి కోటిరెడ్డి, ఓరుగంటి చిన్న, ధర్మవరం శ్రీను, ట్రాక్టరు వెంకటేశ్వర్లు, మెట్టువీరారెడ్డి, ట్రాక్టరు కరిముల్లా, కణితి మస్తాన్‌వలి, రమావత్ నర్శింగ్నాయక్, రవినాయక్, మాజీ సర్పంచ్ కరంటోతు పాండునాయక్, తురకా కిషోర్, బత్తుల రాజా తదితరులు పాల్గొన్నారు. విజయం న్యాయం వైపే.. : పీఆర్కే అధికార టీడీపీ నాయకులు అధికారం శాశ్వతం అనే విధంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు, ఎమ్మెల్యేలను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని, అక్రమ కేసులకు భయపడేది లేదని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మాచర్లకు వచ్చిన ఆయన ర్యాలీ అనంతరం అంబేద్కర్ సెంటర్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనపై అక్రమకేసులు పెట్టారన్నారు. అక్రమ కేసు బనాయించడానికి కారకులైన టీడీపీ నాయకులందరూ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎప్పుడూ అధికారం ఒకరివైపే ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కార్యకర్తలు, అభిమానులను తాత్కాలికంగా ఇబ్బందిపెట్టినా విజయం న్యాయం వైపే ఉంటుందన్నారు. కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు ఎప్పుడూ అండదండలు అందిస్తానన్నారు. కార్యకర్తల జోలికివస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేయాలన్నారు. తనపై అభిమానం చూపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వెల్దుర్తి జెడ్పీటీసీ కళ్లం కృష్ణవేణిరామాంజనేయరెడ్డి, ఎంపీపీ ఓరుగంటి పార్వతమ్మ, జెడ్పీటీసీలు శౌరెడ్డిగోపిరెడ్డి, నవులూరి భాస్కరరెడ్డి, నాయకులు మెట్టు రామ కృష్ణారెడ్డి, మందా శ్యామ్యేలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపైసా సంక్షేమానికి ఖర్చుచేయాలి
ఆదిలాబాద్ అర్బన్ : మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న ప్రతిపైసాను వారి సంక్షేమానికే ఖర్చు చేసి అభివృద్ధికి తోడ్పడాలని హైకోర్టు న్యాయమూర్తులు బి.చంద్రకుమార్, జి.చంద్రయ్యలు అన్నారు. మంగళవారం జిల్లా పరిష త్ సమావేశ మందిరంలో మౌలానా అబుల్ కలాం అజాద్ 126వ జయంతిని, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో హైకోర్టు న్యాయమూర్తులు ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ అబుల్ క లాం ఆజాద్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆర్వీఎం, మైనార్టీ కా ర్పొరేషన్ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల తీరును ఆయా శాఖ అధికారులు వివరించారు. ఆజాద్ జయంతి సందర్భంగా ముగ్గురు విద్యార్థులను హైకోర్టు జడ్జిలతో పాటు కలెక్టర్, నాయకులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన 20 మంది విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపాలకృష్ణమూర్తి, ఏఎస్పీ జోయేల్ డేవిస్, ఎంపీ జి.నగేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ రంజానీ, మైనార్టీ నాయకులు సాజిద్‌ఖాన్, యూనిస్ అక్బానీ, సాజిదొద్దీన్, సిరాజ్‌ఖాద్రి, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు జడ్జిలను జిల్లా కలెక్టర్, అధికారులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. -
సుజనా చౌదరి రూ.106 కోట్లు ఎగవేశారు
హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంక్ పిటిషన్ బాకీ ఉన్నట్లు ఆయనే ఒప్పుకున్నారు.. అయినా బకాయిలు చెల్లించడంలేదు... లండన్ కోర్టు చెప్పినా స్పందన లేదు . సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, ఆస్తులు అమ్మి మా అప్పులు తీర్చండి .అందుకు లిక్విడేటర్‌ను నియమించండి.. కంపెనీ ఆస్తులు విక్రయించకుండా, అన్యాక్రాంతం చేయకుండా ఆదేశాలివ్వండి విచారణను 18కి వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరి తమకు 106 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని, సొమ్ము చెల్లించాలని కోరినా సమాధానం చెప్పడంలేదంటూ మారిషస్‌కు చెందిన మారిషస్ కమర్షియల్ బ్యాంక్(ఎంసీబీ) ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. తమ బకాయి తిరిగి చెల్లించే పరిస్థితిలో లేనందున ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, దాని ఆస్తులను అమ్మి, తమ అప్పు తీర్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఎంసీబీ పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ మారిషస్‌లో హేస్టియా పేరుతో అనుబంధ కంపెనీ ఏర్పాటుచేసింది. హేస్టియా 2010లో ఎంసీబీ నుంచి రూ.100 కోట్లు రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారు (గ్యారెంటార్)గా ఉంది. రుణానికి సంబంధించి ఇంగ్లిష్ చట్టాలకు లోబడి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగింది. 2012 నుంచి హేస్టియా రుణ చెల్లింపులు నిలిపివేసింది. వీటి పై హేస్టియాకు ఎంసీబీ పలుమార్లు లేఖలు రాసింది. అయితే, ఒప్పందానికి సవరణలు చేయాలని హేస్టియా కోరగా, అందుకు ఎంసీబీ అంగీకరించింది. ఆ తరువాత కూడా బకాయిలు చెల్లించకుండా మరోసారి ఒప్పందానికి సవరణలు చేయించింది. ఇదే సమయంలో ఎంసీబీ అధికారులు హేస్టియా డెరైక్టర్‌గా ఉన్న సుజనా చౌదరిని ఎస్ఎంఎస్ ద్వారా సంప్రదించారు. బకాయి ఉన్న మాట వాస్తవమేనని, జరుగుతున్న పరిమాణాలకు క్షమాపణలు కోరుతున్నానని ఎంసీబీ అప్పటి గ్లోబల్ బిజినెస్ హెడ్ ప్రతిక్ ఘోష్‌కు 2012, అక్టోబర్ 16న సుజనా చౌదరి ఎస్ఎంఎస్ పంపారు. వీలైనంత త్వరగా మొత్తం వ్యవహారాన్ని పరిష్కరిరు. తాను అమెరికా వెళుతున్నానని, అక్కడి నుంచి తిరిగి వచ్చాక బ్యాంకర్లతో మాట్లాడతానని ఆ ఎస్ఎంఎస్లో సుజనా చౌదరి పేర్కొన్నారు. మరో డెరైక్టర్ హనుమంతరావు కూడా డిసెంబర్ నెలలో పంపిన మెయిల్లో బకాయి ఉన్న విషయాన్ని అంగీకరించారు. అయినా బకాయిలు చెల్లించలేదు. బ్యాంకు పంపిన నోటీసులకు కూడా స్పందన లేదు. ఇదిలా ఉండగానే ఈ మొత్తం వ్యవహారంలో ఇంగ్లిష్ కోర్టుల న్యాయ పరిధిని సవాలు చేస్తూ హేస్డియా, సుజనా యూనివర్సల్ కంపెనీలు లండన్‌లోని క్వీన్స్ బెంచ్ కమర్షియల్ కోర్టులో ముందస్తుగా ఓ పిటిషన్ వేశాయి. ఇంగ్లిష్ చట్టాల ప్రకారం చేసుకున్న ఒప్పందాల్లో జోక్యం చేసుకునే అధికారం ఇంగ్లండ్ కోర్టులకు ఉందని ఆ న్యాయస్థానం తేల్చి చెప్పింది. వడ్డీతో సహా బకాయి ఉన్న రూ.105 కోట్లు, ఖర్చుల కింద మరో రూ.72 లక్షలు ఎంసీబీకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సైతం హేస్టియా, సుజనా యూనివర్సల్ కంపెనీలు పట్టించుకోలేదు. దీంతో ఎంసీబీ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి లండన్ కోర్టు తీర్పును అమలు చే యాలని కోరింది. సుజనా యూనివర్సల్ ఆస్తిని జప్తు చేసి, దానిని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని బకాయి కింద చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ ఎగ్జిక్యూషన్ పిటిషన్లు (ఈపీ) దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. బకాయి చెల్లించే విషయంలో హేస్టియా, సుజనా యూనివర్సల్ చేస్తున్న అసాధారణ జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీని మూసివేయాలని కోరుతూ హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ వేసింది. సుజనా యూనివర్సల్‌ను మూసివేసి, ఆ కంపెనీ ఆస్తులను విక్రయించి తమ బకాయిలను తీర్చేందుకు ఓ అధికారిక లిక్విడేటర్‌ను నియమించాలని కోరింది. అంతేకాకుండా కంపెనీ ఆస్తులను విక్రయించడం, అన్యాకాంత్రం చేయడం, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం చేయకుండా కూడా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఎంసీబీ కోరింది. -
జీఎంసీకి జరిమానా
భవన నిర్మాణానికి అనుమతులపై హైకోర్టు తీర్పు మూడు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశం ఓ భవన నిర్మాణానికి అనుమతిని మంజూరు చేసే విషయంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని హైకోర్టు తేల్చింది. ఇందుకు గాను కార్పొరేషన్‌కు రూ.20వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని మూడు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని కార్పొరేషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. కోర్టు తీర్పుల పట్ల అధికారులు చూపే గౌరవంపైనే న్యాయ పాలన ఆధారపడి ఉందని, కోర్టు తీర్పులను పదే పదే అగౌరవపరిస్తే కఠిన శిక్షలకు గురి కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్ రామచంద్రరావు తన తీర్పులో అధికారులను హెచ్చరించారు. గుంటూరులోని సంపత్‌నగర్, సర్వే నెంబర్ 673లో డి.అంకిరెడ్డి, ఎం.జానకి 875 చదరపు గజాల స్థలాన్ని సరోజనీదేవి అనే మహిళ నుంచి కొన్నారు. ఆ భూమిలో ఇంటి నిర్మాణం నిమిత్తం దరఖాస్తు చేసుకోగా, ఆ భూమి ప్రజోపయోగం కోసం కేటాయించారంటూ ఇంటి నిర్మాణం కోసం అనుమతినిచ్చేందుకు గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నిరాకరించారు. దీనిని సవాలు చేస్తూ అంకిరెడ్డి, జానకి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ రామచంద్రరావు విచారించారు. సదరు భూమిని ప్రజోపయోగం కేటాయించలేదని, అది సరోజనీదేవి పూర్వీకులకే చెందుతుందంటూ కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు స్పష్టం చేసినా కూడా గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. పిటిషనర్లు సరోజనీదేవి నుంచి కొన్న 875 చదరపు గజాల భూమి ప్రజోపయోగాల కోసం కేటాయించింది కాదని కోర్టులు చెప్పినా పట్టించుకోకుండా, పిటిషనర్ల భవన అనుమతి నిర్మాణ దరఖాస్తును తిరస్కరించడం మునిసిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యానికి నిదర్శమని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. కార్పొరేషన్ పొగరుబోతు వైఖరి, నిర్లక్ష్యపు తీరు కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని తేల్చి చెప్పారు. ఇందుకు గాను కార్పొరేషన్‌కు రూ.20వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని పిటిషనర్లకు మూడు వారాల్లో చెల్లించాలని కార్పొరేషన్‌నున ఆదేశించింది. -
రేషన్ డీలర్షిప్ నామినేటెడ్ పోస్టు కాదు
చౌక దుకాణదారుల తొలగింపుపై హైకోర్టు వ్యాఖ్య హైదరాబాద్: ఎన్నికల్లో తమకు సహకరించలేదనో.. తమకు చెందిన వారు కాదనో.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత చౌక దుకాణదారులను తొలగిస్తుండటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అలా తొలగించేందుకు రేషన్ డీలర్లు ఏమీ నామినేటెడ్ వారు కాదని వ్యాఖ్యానించింది. చౌక దుకాణ డీలర్‌గా నియమితుడైన వ్యక్తిని, కొంతకాలం మాత్రమే అధికారంలో ఉండే నేతల ఇష్టానుసారం తొలగించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. డీలర్ కొనసాగింపు, నియామకం అధికార నేతల దయ మీద ఆధారపడి ఉండటానికి వీల్లేదంది. ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిదికాదని వ్యాఖ్యానించింది. వారి తొలగింపులో ప్రస్తుత విధానాన్ని, తీరును మార్చుకోవాలని అధికారులకు హితవు పలికింది. డీలర్లను తొలగిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు.పాలక పక్ష నేతల ఆదేశాల మేరకు అధికారులు తమను తొలగించడాన్ని సవాలు చేస్తూ పలువురు చౌక దుకాణాల డీలర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తొలగింపునకు వాస్తవాలతో నిమిత్తం లేకుండా చిన్న చిన్న లోపాలను కారణాలుగా చూపారని వారు కోర్టుకు నివేదించారు. దీనిపై సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి ‘‘అధికారులు తమ తీరు మార్చుకోకుండా డీలర్లను తొలగిస్తున్నారు. తమకు నచ్చిన వారిని నియమించుకోవాలన్న ఉద్దేశంతోనే తమను తొలగిస్తున్నారన్న పిటిషనర్ల ఆరోపణల్లో వాస్తమున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చే ముందు రేషన్ డీలర్ షిప్ నామినేటెడ్ పోస్టు కాదన్నది అధికారులు గుర్తు పెట్టుకోవాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను తమ చెప్పుచేతల్లో పెట్టుకుకోవాలనుకునే వారి చేతుల్లో అధికారులు ఉపకరణాలుగా మారరాదు’’ అని తన తీర్పులో పేర్కొన్నారు. నిర్దిష్ట ఆరోపణలు లేకుండా పిటీషనర్లను తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. -
హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వరంగల్ : తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో సురవరం ప్రతాప్‌రెడ్డి స్మారక ప్రథమ సభ కు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ‘ప్రత్యేక హైకోర్టు లేని తెలంగాణ రాష్టం రాజ్యంగ బద్ధమేనా?’ అం శంపై ఆయన మాట్లాడుతూ ‘నేను ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంటే విశాల ప్రజానీకానికి వ్యతిరేకమైన ఈ చర్యను తీవ్రంగా పరిగణించేవాడినని’ అన్నారు. 214వ అధికరణం ద్వారా ప్రతి రాష్ట్రానికి విధిగా హైకోర్టును ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వైశాల్యంలో, జనాభాలో చిన్న రాష్ట్రాలు అయిన త్రిపుర, మణిపూర్, మేఘాలయాకు హైకోర్టును ఏర్పాటు చేశారని, 4కోట్లకు పైగా జనాభా, విశాలమైన విస్తీర్ణం ఉన్న తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. -
పూర్తి వివరాలు కోర్టు ముందుంచండి
‘సరస్వతి’ వ్యవహారంలో ఏపీ పోలీసులకు హైకోర్టు ఆదేశం విచారణ వచ్చేవారానికి వాయిదా హైదరాబాద్: సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డెరైక్టర్ ఆదిరాజు వేణుగోపాలరాజు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై గుంటూరు జిల్లా మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ అధికారులను ఆదేశించింది. అంతేగాక సరస్వతి పవర్ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన వారిపై ఆ కంపెనీ ప్రతినిధులిచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడానికి గల కారణాలను సైతం తమ ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ రెండు వ్యవహారాల్లో వివరాలను వచ్చేవారంలోగా తమ ముందుంచాలని అధికారులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మాచవరం పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ, తమ భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినవారిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఆదిరాజు వేణుగోపాలరాజు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను జస్టిస్ పుర్కర్ మంగళవారం విచారించారు. పిటిషనర్ల తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మార్కెట్‌ధర కన్నా అధిక మొత్తం చెల్లించి రైతులనుంచి సరస్వతి పవర్ భూములను కొనుగోలు చేసిందని కోర్టుకు నివేదించారు. భూములు అమ్మినవారే భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని, అడ్డువచ్చిన సరస్వతి సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి కేసు నమోదు చేయలేదన్నారు. ఇదే సమయంలో పిటిషనర్లు ఇతరులపై దాడి చేశారంటూ తప్పుడు కేసు బనాయించారని సుధాకర్‌రెడ్డి తెలిపారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా.. పోలీసులు పిటిషనర్లపై కేసు నమోదు చేశారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ రెండు కేసుల్లో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హోంశాఖ అధికారులను ఆదేశిస్తూ విచారణను వచ్చేవారానికి వాయిదా వేశారు.