లా శాఖకు హైకోర్టు చురక! | The High Court criticises Ministry of Justice | Sakshi
Sakshi News home page

లా శాఖకు హైకోర్టు చురక!

Published Fri, Jun 10 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

లా శాఖకు హైకోర్టు చురక!

లా శాఖకు హైకోర్టు చురక!

- విశ్లేషణ
 
యాసిడ్ దాడి, రేప్‌కు ప్రయత్నించిన వ్యక్తిని చంపే అధికారం మహిళలకు ఉందంటూ.. పార్లమెంటు ఐపీసీకి చేసిన సవరణ మరుగునపడితే మహిళ లకు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని ఎలా తెలుస్తుంది?
 
బెంగళూరు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఎన్‌ఎల్‌ఎస్‌యూఐ) విద్యార్థి వంశ్ శరద్ గుప్తకు భారతీయ క్రైస్తవ వివాహ చట్టం 1972 పూర్తి పాఠం అవసరమైంది. ఎక్కడా దొర కలేదు. న్యాయ మంత్రిత్వ శాఖ లా విభాగం అధికారిక వెబ్‌సైట్ http://indiacode.nic.inలో ఆ చట్టం పాఠం ఉన్నా ఒక్క వాక్యం కూడా వరసగా చదవలేనంత జటిలంగా ఉంది. విద్యార్థులకు ఉపయోగమయ్యే ఈ వెబ్‌సైట్‌లో కొన్ని చట్టాలు అసలు చదవలేమనీ, ప్రైవేట్ పబ్లిషర్లు ప్రచురించే పుస్తకాలలో మూల చట్టం తప్పులు లేకుండా ఉందనలేమనీ, అధికారిక ప్రతినిధుల ఈమెయిల్ ఐడీలు పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. 1908లో రూపొందించిన సివిల్ ప్రొసీజర్ కోడ్ తాజా ప్రతి అధికారిక వెబ్‌సైట్‌లో లేదు. అడిగితే 1908 నాటి ప్రతిని, ఆ తరువాత పార్లమెంటు చేసిన వందకు పైగా సవరణల ప్రతులను ఇస్తున్నారు. వీటన్నింటిని సమన్వయం చేసి చట్టం పాఠం ఏమిటో తెలుసుకోవాలంటే కొన్ని నెలలు పడుతుంది. సవరణలను చేరుస్తూ నవీకరించిన తాజా ప్రతిని తయారు చేయవలసిన బాధ్యత శాసనాల విభాగానిదే.  

సవరించిన చట్టాల్ని ప్రైవేటు ప్రచురణ కర్తలు అమ్ముకుంటున్నారు. అధికారికంగా ప్రభుత్వం సవరించిన ప్రతిని అందుబాటులోకి తేవలసి ఉంది. సవరించిన రూపంలో వందలాది చట్టాలను ఇచ్చే స్థితి లేదు. శాసన విభాగం పీఐఓ సవరించిన తాజా శాసన పాఠాలను రూపొందించి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం మొదలైందని, ఇంకా కొన్నేళ్ల సమయం పడుతుందని వివరించారు. హిందీ భాషలో కూడా చట్టాలను అనువదించే కార్యక్రమం సాగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రస్తుత దశ, పూర్తయ్యే గడువు వివరాలు ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది.  దరఖాస్తుకు నెలరోజుల్లో జవాబు ఇవ్వలేదు. మొదటి అప్పీలు పట్టించుకోలేదు. తమ ఈ మెయిల్ పనిచేస్తుందో లేదో చూసుకోరు. తాము పాటించవలసిన చట్టాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ఈ చట్టాల సమాచారం ప్రభుత్వం స్వయంగా వెల్లడించాల్సింది పోయి అడిగినా చెప్పకపోవడం ఆర్టీఐ ఉల్లంఘన అవుతుందంటూ విద్యార్థులకు కలిగిన నష్టాన్ని పూరించడానికి రూ.10 వేలను యూనివర్సిటీ గ్రంథాలయానికి ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది.


 ప్రభుత్వమే నడిపే విశ్వవిద్యాలయానికి రూ. 10వేలు ఇస్తే ప్రభుత్వానికి ఏ నష్టమూ లేదు. ఇవ్వకపోతే యూనివర్సిటీ సీఐసీలో ఫిర్యాదు కూడా చేయకపోవచ్చు. ఈ తీర్పు చట్ట విరుద్ధమని, అన్యాయమనీ నష్టపరిహారం ఆదేశం రద్దు చేయాలని శాసన మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. చట్టాన్ని అస్పష్టంగా, అసందిగ్ధంగా అందుబాటులో లేకుండా చేయడం అంటే దాన్ని రహస్యంగా మార్చి చట్టాలను తెలుసుకునే ప్రజల హక్కును భంగపరచరాదని, ఐటీని ఉపయోగించుకుని చట్టాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం ప్రభుత్వ బాధ్యత అనీ, సవరణలతో సంస్కరించిన చట్టాల పూర్తి ప్రతులను వెబ్‌సైట్‌లో ఉంచాలనీ, గ్రంథాలయానికి పదివేలు పరిహారం ఇవ్వాలనీ, ిసీఐసీ ఆదేశిస్తే దానిపై రిట్ పిటిషన్ వేయడాన్ని  ఢిల్లీ హైకోర్ట్టు ప్రశ్నించింది. ఇది ప్రభుత్వ కనీస బాధ్యత. మహిళ తనపై యాసిడ్ దాడి జరిగినా, రేప్ ప్రయత్నం జరిగినా ఆత్మరక్షణ కోసం దాడి చేసే వ్యక్తిని చంపే అధికారం ఉందంటూ నిర్భయ చట్టం ద్వారా పార్లమెంటు ఇటీవల ఐపీసీని సవరించింది. ఈ సవరణతో కూడిన తాజా ఐపీసీని సులువుగా ప్రజలకు అందుబాటులో ఉండేట్టు చేయకపోతే మహిళలు తమను రక్షించుకునే హక్కు ఉందని ఎలా తెలుసుకుంటారు? ఇటువంటి తాజా శాసన సవరణ విషయాలను ఎప్పటిలోగా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారో చెప్పాలని సీఐసీ ఆదేశించింది.


దీనిపైన రిట్ దాఖలు చేసిన విద్యార్థి ఆర్టీఐని సరైన రీతిలో దరఖాస్తు వేయలేదని, ఫీజు ఇవ్వలేదని, మొదటి అప్పీలు వేయలేదని కనుక రెండో అప్పీలు వినరాదని శాసన విభాగం వాదించింది. దీన్ని తిప్పికొడుతూ ఢిల్లీ హైకోర్టు గణనీయమైన తీర్పు ఇచ్చింది. ిసీఐసీ తీర్పుపై విచారించేందుకు హైకోర్టు అప్పీలు కోర్టు కాదని, కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ అసలు న్యాయానికి అడ్డుతగలకూడదని హితవు చెప్పింది. సీఐసీ ఇచ్చిన ఆదేశం సమంజసమనీ, న్యాయ విధానాన్ని ముందుకు నడిపేదిగానూ ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ సింగ్ వివరించారు. అసలు చట్టాలు ఒక క్లిక్‌లో అందు బాటులో తేవాల్సిన బాధ్యత ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రభుత్వంపైన ఉందని సీఐసీ సరిగ్గానే చెప్పారు... ప్రభుత్వమే అన్ని చట్టాలను అందుబాటులో ఉంచాలి. రూ.10వేల పరిహారం గురించి లేవనెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ ఈ పిటిషన్ వేయడానికి రూ.10వేల కన్న ఎక్కువే ప్రభుత్వం ఖర్చుచేసి ఉంటుంది. కనుక సీఐసీ ఆదేశించిన రూ.10వేలను ఈ పిటిషన్ వేయడానికి కారకులైన అధికారుల జీతాలనుంచి మినహాయించి పరిహారం చెల్లించాలి అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
 
సామాన్య జనంపై.. కోర్టుల్లో ప్రభుత్వాలే సుదీర్ఘ సమరాలు చేయడం ఎంత అసమంజసమో ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పులో వివరించింది. (సీఐసీలో ఈ రచయిత ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు రిట్ పిటిషన్(సి) 4761-2016లో మే 24 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
 

 

- మాడభూషి శ్రీధర్
 వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్  professorsridhar@gmail.com
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement