భారత రాజ్యాంగ పీఠిక ఒక జాతీయ గీతం వలె కనిపిస్తుంది, వినిపిస్తుంది. కవీంద్ర రవీంద్రుడు రాసిన జాతీయ గీతం ‘జనగణ మన అధినాయక జయహే’ ఒక దేశభక్తి గీతం. సందేహం లేదు. ఒక గౌరవ వందన గీతం. ఈ పీఠిక పాట కాదు, ఒక పాఠం. ఒక ప్రతిజ్ఞ. ఒక ప్రకటన. ఒక లక్ష్య వాగ్దానం! ఇందులో నిరంతరం గుర్తుంచుకోవలసిన మంత్రాక్షరాలున్నాయి. దిశా నిర్దేశనం నియంత్రణ చేసే ఒక ఆదేశ పత్రం. ప్రజాసార్వభౌములు జారీ చేసిన ఒక రిట్. అనుల్లంఘనీయ శాసనం. కానీ రక్షిస్తామన్నవారూ, పాటిస్తామన్నవారూ, చదవవలసిన వారూ, అర్థం చేసు కోవలసిన వారూ అందరూ మరిచిపోయారు!!
ఈ పీఠిక చదవడం ప్రభువులకు కోపకారణం అయింది! పోలీసులు లాఠీలెత్తారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శిస్తూ ప్రసంగించినందుకూ, పీఠిక చదివి నందుకూ, రాజ్యాంగాన్ని జనానికి చూపినందుకూ చంద్రశేఖర్ ఆజాద్‌పై క్రిమినల్ కేసులు పెట్టారు. పీఠికను గుర్తు చేయడం తరాజులకు నచ్చడం లేదు. యూఏపీఏ చట్టం కింద బెయిల్ రాని సెక్షన్లతో కొడుతున్నారు. తిడుతున్నారు. రాజు దైవమై పోతున్నాడు. కోర్టులు బెయిల్ ఇవ్వడం దైవాధీనంగా మారిపోయింది. చివరకు ఢిల్లీ కోర్టు న్యాయాధికారి కామినీ లావ్ ‘‘ధర్నా చేస్తే తప్పేమిటి, నిరసన చేయడం నేరమా? అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా? మీరు అసలు రాజ్యాంగం చదివారా?’’ అని పోలీసులను అడిగారు. న్యాయమూర్తులకూ, న్యాయాధికారులకూ, రాజ్యాంగం కింద నియుక్తులైన అధికారులకూ... అందరికీ రాజ్యాంగం పవిత్ర పత్రమైనపుడూ, ఆ రాజ్యాంగం సరైనదైనపుడూ, చదివితే నేరమా? ఎంత మాత్రం కాదని ఆ కోర్టు తీర్పు చెప్పవలసి వచ్చింది. పీఠిక రాజ్యాంగాన్ని పరిచయం చేస్తుంది. రాజ్యాంగ లక్ష్యం, సూత్రాలు, మౌలిక తత్వం వివరించిన పీఠం అది. పీఠిక చదివితే అరెస్టు చేయరాదని కోర్టు చెప్పిన తరువాత గానీ బెయిల్ దొరకలేదు. విడుదలైన వెంటనే పీఠిక చదివాడాయన, కరతాళ ధ్వనుల మధ్య!
ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడానికి ఉపయోగించే నిరసనోద్యమ దీప్తిగా పీఠికా పఠనం మారిపోయింది. తరువాత కొన్ని నెలలకు భారత ప్రభుత్వం పీఠికా పఠనాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్దేశించింది. 75 సంవత్సరాల అజాదీ ఆమృతోత్సవంలో తప్పనిసరిగా కేంద్ర మంత్రిత్వశాఖలు తమ కార్యాల యాల్లో గోడలమీద ప్రవేశిక లిఖించి పెట్టాలని ఆదేశించింది. రాష్ట్రపతి స్వయంగా పీఠికను అందరితోపాటు చదివే కార్యక్రమాన్ని 2020లో అధికారికంగా ఆరంభిం చారు. 2015లో ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో పీఠిక చదివారు. న్యాయ, పర్యావరణ శాఖామాత్యులు తన మంత్రిత్వ భవనంలో ప్రియాంబుల్ గోడను ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్, కేరళ వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పీఠికను అన్ని పాఠశాలల్లో తప్పని సరిగా చదవాలని ఆదేశం జారీ చేశాయి. ఇదీ మన పీఠిక! దీన్ని అవతారిక అనీ అంటారు. ఇంగ్లీషులో ప్రియాంబుల్ అన్నారు.
భారత ప్రజలమైన మనం, మన భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి, మన దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను; ఆలోచనా, భావ ప్రకటనా, మత విశ్వాస ఆరాధనా స్వేచ్ఛను; హోదాల్లోనూ, అవకాశా ల్లోనూ సమానత్వాన్ని సాధించేందుకు; వ్యక్తి గౌరవాన్నీ, జాతి ఐక్యత– సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలనీ; మన రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, శాసనీ కరించి, ఆమోదించి, మనకు మనము సమర్పించు కున్నాం.
మొదట్లో భారత్‌ను సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు. అయితే 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఇది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది. (చదవండి: ‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం)
1776లో అమెరికన్ రాజ్యాంగ పీఠిక అమెరికా స్వతంత్ర ప్రకటనలో కీలకమైన భాగం. రాజ్యాంగానికి పీఠిక గుర్తింపు కార్డు వంటిదని శంకరీ ప్రసాద్ కేసులో (1952) జస్టిస్ హిదయతుల్లా పేర్కొన్నారు. విచిత్రమేమంటే పీఠిక మన రాజ్యాంగంలో అంతర్భా గమా లేక బయట ఉన్న ఒక పేజీయా అని పేచీ వచ్చింది. ఈ అంశాన్ని బాగా విచారించి, సుదీర్ఘమైన వాదోపవాదాలు విన్న తరువాత న్యాయమూర్తుల ధర్మాసనం కేశవానంద భారతి కేసులో పీఠిక రాజ్యాంగంలోని అంతర్భాగమేనోయీ అని తీర్పు చెప్పింది. అంతకు ముందు సుప్రీంకోర్టు వారు పీఠిక అంతర్భాగం కాదన్నారు. విచిత్రమేమంటే పీఠికలో ఉన్న హక్కులకు భంగకరమైన నియమాలు, లక్ష్యాలను అడ్డుకునే నియ మాలు కొన్ని మొదటినుంచీ ఉండటం; మరెన్నో తరువాత కాలంలో వచ్చి చేరుతూ ఉండటం గమనించవలసి ఉంది.
భారత ప్రజలు చేసుకున్న సామాజిక ఒప్పందమే ఈ పీఠిక. ఇందులో విలువలను కాపాడటానికి మనం దీక్షాబద్ధులం కావాలి. పౌరుడిని చైతన్యవంతమైన, సహేతుకమైన, స్వేచ్ఛాయుతుడైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయాలి. మనం ఇంకా కులమతాల చట్రాలలోంచీ, చట్టాల లోంచీ బయటకు రాలేదు. మన ఎన్నికలన్నీ కులమతాలకు చెందిన ఓటర్లను ప్రేరేపించడంతోనే మొదలై, ముగుస్తున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా మనం సామాజిక అభివృధ్ధి, ప్రజాస్వామ్య విలువల వంటి వాటిని చూడడం లేదు. తాతల నాటి కట్టడాలు తమ ఘన కార్యక్రమం అన్నట్టు చూపి, సంస్కృతిని బూచిగా మార్చి, మతాన్నీ, కులాన్నీ నిత్యం వల్లిస్తూ ఎన్నికల్లో గెలవటం కోసం ప్రయత్నించడం చూస్తూనే ఉన్నాం. మత్తు పుచ్చుకుని ఇచ్చుకుంటున్నాం. (చదవండి: ఒక తీర్పు – అనేక సందేహాలు)
- ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్
స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment