
సీపీపీ భేటీలో సోనియా గాంధీ
న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు భారత రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ అన్నారు. సమాజాన్ని శాశ్వతంగా విభజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో ఇది భాగమన్నారు. లోక్‌సభలో బిల్లును ఆదరాబాదరగా ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. సంవిధాన్ సదన్‌లో గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా తమ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు.
ఒక దేశం– ఒకే ఎన్నిక బిల్లు కూడా రాజ్యాంగ విద్రోహమన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ‘వక్ఫ్ (సవరణ) బిల్లును బుధవారం లోక్‌సభలో హడావుడిగా ఆమెదింపజేసుకున్నారు. గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి సుస్పష్టం. ఇది రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమే. సమాజాన్ని ఎప్పటికీ విభిజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో భాగమే’ అని సోనియా పేర్కొన్నారు.
విపక్షాల సవరణలను మూజువాణి ఓటుతో తిరస్కరించాక, వక్ఫ్ బిల్లును బుధవారం అర్ధరాత్రి లోక్‌సభ 288–232తో ఆమోదించిన విషయం విదితమే. మహిళా రిజర్వేషన్ బిల్లును రెండేళ్ల కిత్రమే ఇరుసభలు ఆమోదించాయని, దాన్ని తక్షణం అమలులోకి తేవాలనే కాంగ్రెస్ డిమాండ్‌ను బీజేపీ ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పైనా బీజేపీ శీతకన్ను వేస్తోందన్నారు.