రాష్ట్రపతికీ మూడు నెలలే | Supreme Court sets 3-month deadline for President to decide on Bills | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికీ మూడు నెలలే

Published Sun, Apr 13 2025 4:35 AM | Last Updated on Sun, Apr 13 2025 4:35 AM

Supreme Court sets 3-month deadline for President to decide on Bills

బిల్లులపై ఆలోపు నిర్ణయం తీసుకోవాలి 

స్పష్టమైన గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు 

లేదంటే రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించవచ్చు 

ఈ విషయమై రాష్ట్రపతికి వీటో అధికారాల్లేవు 

ఆ నిర్ణయాలు న్యాయసమీక్షకు అతీతం కావు 

తమిళనాడు గవర్నర్‌ కేసులో చరిత్రాత్మక తీర్పు 

రాష్ట్రపతికి గడువు నిర్దేశించడం ఇదే తొలిసారి

న్యూఢిల్లీ: గవర్నర్ల నుంచి ఆమోదం నిమిత్తం రాష్ట్రపతి వద్దకు వచ్చే బిల్లుల విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిపై రాష్ట్రపతి మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని పేర్కొంది. తమిళనాడు గవర్నర్‌కు సంబంధించిన కేసుపై ఇటీవల వెలువరించిన తీర్పులో ఈ మేరకు స్పష్టం చేసింది. రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం ఇలా గడువు నిర్దేశించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 

మూణ్నెల్లు దాటినా సరైన కారణాలు చూపకుండా బిల్లులపై రాష్ట్రపతి ఏ నిర్ణయమూ తీసుకోని పక్షంలో సంబంధిత రా ష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ‘‘బిల్లుల విషయంలో 201 ఆర్టికల్‌ కింద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయసమీక్షకు అతీతమేమీ కాదు. వాటిని కోర్టులు సమీక్షించవచ్చు’’అని కూడా పేర్కొనడం విశేషం! 

బిల్లులపై నిర్ణయం విషయంలో గవర్నర్లకు స్పష్టమైన గడువు నిర్దేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ జె.బి.పార్థీవాలా, జస్టిస్‌ ఎం.మహదేవన్‌ ధర్మాసనం ఏప్రిల్‌ 8న చరిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. ‘‘అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుపై గవర్నర్‌ మూడు నెలల్లోపు నిర్ణ యం తీసుకోవాలి. 

రెండోసారీ పంపితే నెలలోపు వి« దిగా ఆమోదించాల్సిందే తప్ప రాష్ట్రపతికి పంపడం చట్టవిరుద్ధం’’అని స్పష్టం చేసింది. అలా ఈ విషయమై గవర్నర్‌కు తొలిసారిగా గడువు విధించింది. బిల్లుల విషయమై మూడు నెలల గడువును రాష్ట్రపతికి కూడా వర్తింపజేయడం విశేషం. ఆ తీర్పు తాలూకు 415 పేజీల పూర్తి ప్రతిని సుప్రీంకోర్టు శుక్రవారం వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. 

రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడాలి 
ఆర్టికల్‌ 201 ప్రకారం గవర్నర్‌ తన వద్దకు పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు, లేదా పెండింగ్‌లో పెట్టవచ్చు. అది ఎంతకాలమన్న విషయమై అందులో రాజ్యాంగం గడువూ నిర్దేశించలేదు. అంతమాత్రాన బిల్లులపై నిరవధికంగా ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండేందుకు రాష్ట్రపతికి ‘పాకెట్‌ వీటో’అధికారాలేమీ ఉండబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘రాష్ట్రపతి తన వద్దకొచి్చన బిల్లుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే (షల్‌ డిక్లేర్‌) అని ఆర్టికల్‌ 201లో స్పష్టంగా పేర్కొన్నారు. దానికి ఆమోదం తెలపడమో, పెండింగ్‌లో పెట్టడమో ఏదో ఒకటి తప్పనిసరన్నదే దాని ఉద్దేశం. అంతే తప్ప రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అదే రాజ్యాంగం తాలూకు స్ఫూర్తికి విరుద్ధంగా ఉపయోగించవచ్చని కాదు. 

అదీగాక ఏ అధికారన్నైనా వాడుకునే విషయంలోనైనా సముచిత కాలావధి తప్పనిసరి. చట్టపరంగా కూడా అదే సరైనది. ఈ సాధారణ న్యాయసూత్రానికి 201 ఆర్టికల్‌ కింద రాష్ట్రపతికి సంక్రమించిన అధికారాలు కూడా అతీతం కాదు’’అని పేర్కొంది. ‘‘ఏదైనా బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం మూడు నెలలకు మించి ఆలస్యమయ్యే పక్షంలో అందుకు తగిన కారణాలను విధిగా నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియపరచాలి. రాష్ట్రాలు కూడా వాటికి సరైన వివరణలు, సమాధానాలివ్వడం ద్వారా ఈ విషయంలో పూర్తిగా సహకరించాలి’’అని స్పష్టం చేసింది.

కోర్టుల పాత్ర పోషించొద్దు 
చట్టసభలు రూపొందించే బిల్లుల రాజ్యాంగబద్ధత విషయంలో కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆ కారణంగా బిల్లులను పెండింగ్‌లో పెట్టే పక్షంలో వాటి రాజ్యాంగబద్ధతను తేల్చాల్సింది సుప్రీంకోర్టు మాత్రమే. కనుక ఆర్టికల్‌ 143 ప్రకారం ఈ అంశాన్ని విధిగా సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉంటుంది’’అని స్పష్టం చేసింది. అంతే తప్ప వాటిపై ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుని కోర్టుల పాత్ర పోషించడానికి వీల్లేదని పేర్కొంది. ‘‘ఫక్తు న్యాయపరమైన అంశాలివి. ఇలాంటి వాటిలో కార్యనిర్వాహక విభాగం వేలు పెట్టడానికి వీల్లేదని చెప్పడానికి మేం ఎంతమాత్రమూ సంశయించడం లేదు. ఎందుకంటే బిల్లుల రాజ్యాంగబద్ధతపై లోతుగా పరిశీలన జరిపి తగిన చర్యలను సిఫార్సు చేసే అధికారం కేవలం రాజ్యాంగ ధర్మాసనాలది మాత్రమే’’అని వివరించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement