వక్ఫ్ ట్రిబ్యునల్ నుంచి ఈ అధికారం తొలగింపు
కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో, రాష్ట్రాల బోర్డుల్లో ఇద్దరేసి మహిళలు
ముస్లిమేతరులకూ చోటు
వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించే బోర్డుల అధికారం రద్దు
కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లు తేనెతుట్టను కదిపింది. విపక్షాలు, ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. వక్ఫ్ ఆస్తుల రిజి్రస్టేషన్ ప్రక్రియను సెంట్రల్ పోర్టల్ ద్వారా క్రమబదీ్ధకరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ భూముల యాజమాన్య హక్కులపై వివాదం తలెత్తితే ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యూనల్‌కు నిర్ణయాధికారం ఉండేది. కొత్త బిల్లు ఈ అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతోంది. వక్ఫ్ చట్టం–1995ను ఇకపై యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్‌గా మారుస్తోంది. మొత్తం 44 సవరణలను ప్రతిపాదిస్తోంది.
వక్ఫ్ అంటే ఏమిటి?
ఇస్లామిక్ చట్టం కింద మతపరమైన, ధారి్మక కార్యక్రమాల నిమిత్తం అంకితం చేసిన ఆస్తిని వక్ఫ్‌గా పేర్కొంటారు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే.. ఇక అది అంతిమం. దాన్ని తిరగదోడటానికి ఉండదు. ఈ అంశంపై దృష్టి సారించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.
9 లక్షల ఎకరాలు
దేశంలోని 30 వక్ఫ్ బోర్డులు 9 లక్షల పైచిలుకు ఎకరాలను నియంత్రిస్తున్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. భారత్‌లో పెద్ద మొత్తంలో భూములు కలిగి ఉన్న వాటిల్లో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డులు మూడోస్థానంలో ఉన్నాయి.
బిల్లులోని కీలకాంశాలు
→ ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టింది వక్ఫ్ చట్టం– 1995. అందులోని సెక్షన్– 40 ఇందుకు వీలు కలి్పంచింది. కొత్త బిల్లులో ఈ సెక్షన్– 40 రద్దుకు ప్రతిపాదించారు. ఇలా చేయడం ద్వారా వక్ఫ్ బోర్డుల చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని లాగేసుకుంటోందని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దుమారం రేగుతోంది.
→ కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు. కౌన్సిల్‌లో, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరేసి ముస్లిం మహిళలకు చోటు. ముస్లిమేతరులకూ స్థానం. ఇద్దరు లోక్‌సభ, ఒక రాజ్యసభ ఎంపీకి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో చోటు కలి్పంచాలి. ఈ ముగ్గురు ఎంపీలు ముస్లింలే అయ్యుండాలనే నిబంధనేమీ లేదు. పాత చట్టం ప్రకారం తప్పనిసరిగా ముస్లిం ఎంపీలకే కౌన్సిల్‌లో చోటు ఉండేది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పును మార్చే అధికారాన్ని కూడా బిల్లు కేంద్రానికి కట్టబెడుతోంది.
→ ఒక ఆస్తి వక్ఫ్‌కు చెందినదా, ప్రభుత్వానిదా అనే వివాదం తలెత్తితే ఇక కలెక్టర్లదే నిర్ణయాధికారం. వక్ఫ్ చట్టం–1995 సెక్షన్– 6 ప్రకారం ఇలాంటి వివాదాల్లో వక్ఫ్ ట్రిబ్యునళ్లు తీర్పు చెప్పేవి. వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటున్న దేన్నైనా కలెక్టర్ ప్రభుత్వ భూమిగా తేలి్చతే ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచొచ్చు. అక్రమంగా ఆస్తులు దక్కించుకోవడానికి స్వార్థపరులు ట్రిబ్యునళ్లను అడ్డం పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
→ ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేసే ముందు సంబంధిత పక్షాలన్నిటికీ నోటీసులు ఇవ్వడం. రెవెన్యూ చట్టాల ప్రకారం నిర్దిష్ట ప్రక్రియను అనుసరించి మ్యూటేషన్ చేయడానికి మార్గదర్శకాలను రూపొందించడం.
→ కాగ్ నియమించిన ఆడిటర్ ద్వారా ఏదేని వక్ఫ్ బోర్డు ఆస్తుల తనిఖీకి ఆదేశించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు దఖలు పరుస్తుంది.
→ బోరాలు, అగాఖానీల కోసం ప్రత్యేకంగా ఔఖాఫ్ బోర్డును ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ బోర్డుల్లో షియాలు, సున్నీలు, బోరాలు, ఆగాఖానీలు, ముస్లింలోని ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తుంది.
→ తన ఆస్తిని దానంగా ఇవ్వడానికి ఒక వ్యక్తి సిద్ధపడినపుడు.. అతను రాసిన చెల్లుబాటయ్యే అంగీకారపత్రాన్ని (వక్ఫ్‌నామా)ను కొత్త బిల్లు తప్పనిసరి చేస్తోంది. ప్రస్తుతం ఒక వ్యక్తి మౌఖికంగా కూడా తన ఆస్తిని వక్ఫ్‌కు ఇవ్వొచ్చు.
→ ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తూ.. ఆస్తిపై యాజమాన్య హక్కులున్నపుడే వక్ఫ్ ఇవ్వొచ్చు.
→ వక్ఫ్ బోర్డులకు వచ్చే డబ్బును వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథల సంక్షేమం కోసం వినియోగించాలి. అదీ ప్రభుత్వం సూచించిన పద్ధతుల్లో.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment