లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
సమాజాన్ని విచ్ఛిన్నం చేసే క్రూరమైన బిల్లు వద్దంటూ నినాదాలు
వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్
వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. బిల్లును జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయం
న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టం–1995లో పలు మార్పులు తీసుకురావడంతోపాటు చట్టం పేరును ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫీషియెన్సీ, డెవలప్‌మెంట్ యాక్ట్–1995’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాయి.
సమాజంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ క్రూరమైన బిల్లు వద్దే వద్దంటూ నినదించాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సమాజాన్ని విచి్ఛన్నం చేసే ఈ బిల్లును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బీజేపీ సహా అధికార ఎన్డీయే కూటమి పక్షాలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి. చివరకు ప్రతిపక్షాల నిరసనతో ప్రభుత్వం దిగొచి్చంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు బిల్లును పంపిస్తున్నట్లు ప్రకటించింది.
హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే..
కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు వక్ఫ్(సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ ప్రారంభించారు. బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు. దేశంలో మత స్వేచ్ఛను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తోందని మండిపడ్డారు.
ప్రజల మధ్య చిచ్చు పెడుతూ విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, అయినప్పటికీ హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబి్ధకోసమే బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తున్నారని, తర్వాత క్రైస్తవులపై, జైన్‌లపై దాడి చేస్తారని ధ్వజమెత్తారు.
అనంతరం విపక్ష సభ్యులు బిల్లుపై దుమ్మెత్తిపోశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ బషీర్ బిల్లును వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పారు.
ఎన్డీయేలోని కొన్ని పార్టీ సభ్యులు మాత్రం బిల్లుకు మద్దతు ప్రకటించారు. సభలో వాడీవేడిగా జరిగిన చర్చ తర్వాత మంత్రి కిరెణ్ రిజిజు స్పందించారు. బిల్లును జేపీసీ పరిశీలనకు పంపిస్తున్నట్లు తెలిపారు. జేపీసీ ఏర్పాటు కోసం త్వరలో అన్ని పారీ్టల నేతలో చర్చిస్తామని వివరించారు. ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్–1923ని రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును సైతం రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీ
‘‘కరడుగట్టిన బీజేపీ మద్దతుదారులను సంతోషపర్చడానికి బిల్లును తీసుకొచ్చారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమిస్తారా? ఇతర మత సంస్థల విషయంలో ఇలాగే చేయగలరా? ఎన్నికల్లో లబ్ధి కోసం బిల్లు రూపొందించారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. ఆ పార్టీ పేరును భారతీయ జమీన్ పారీ్టగా మార్చుకోవాలి. వక్ఫ్ బోర్డుల భూములను కాజేయాలని చూస్తున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ బోర్డు భూములు అమ్మబోమంటూ గ్యారంటీ ఇవ్వాలి. ముస్లింల హక్కులను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోం. కచ్చితంగా అడ్డుకుంటాం’’
– అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ
మైనారీ్టలను రక్షించుకోవడం బాధ్యత
‘‘బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోందో చూడండి. మైనారీ్టలను రక్షించుకోవడం మన నైతిక బాధ్యత. బిల్లు వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం బయటపెట్టాలి. బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అందరితో చర్చించి పారదర్శకమైన బిల్లు రూపొందించాలి’’
– సుప్రియా సూలే, ఎన్సీపీ(శరద్ పవార్)
పారదర్శకత కోసమే
మద్దతు
‘‘బిల్లుకు మద్దతిస్తున్నాం. వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకతకు ఈ బిల్లు దోహదపడుతుంది. ముస్లిం వ్యతిరేక చర్య అనడంలో అర్థం లేదు. ఎవరికీ వ్యతిరేకం కాదు’’ –చిరాగ్ పాశ్వాన్, ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి
ముస్లింలను శత్రువులుగా చూస్తున్నారు
‘‘వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేయడం దుర్మార్గం. ముస్లింలను శత్రువులుగా భావిస్తున్నారు. అందుకు ఈ బిల్లే నిదర్శనం. దర్గా, మసీదు, వక్ఫ్ ఆస్తులను స్వా«దీనం చేసుకోవాలనుకుంటున్నారా? ఈ బిల్లు ద్వారా దేశాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్నారా? ఏకం చేద్దామనుకుంటున్నారా? బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే రూల్ 72 కింద నోటీసు ఇచ్చాం. ప్రభుత్వం తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలి’’
– అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం
వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. సభలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు. ‘ముస్లిం వర్గాల్లో అనేక ఆందోళనలు ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లు మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముస్లిం సమాజాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ లేవనెత్తిన ఆందోళనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది’అని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
ముస్లింలకు వ్యతిరేకం కాదు
ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. మతపరమైన విభజనలను ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. పారదర్శకత కోసమే బిల్లు రూపొందించారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును ఆలయాలతో పోలుస్తున్నాయి. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పాలనలో వేలాది మంది సిక్కులను ఊచకోత కోశారు. ఇందిరా గాంధీ హత్యకు ఏ ట్యాక్సీ డ్రైవర్ కారణం? దీనిపై కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలి.
– రాజీవ్ రంజన్ సింగ్, జేడీ(యూ) సభ్యుడు, కేంద్ర మంత్రి
రాజ్యసభలో వక్ఫ్ ఆస్తుల బిల్లు ఉపసంహరణ
వక్ఫ్ ఆస్తుల(ఆక్రమణదార్ల తొలగింపు) బిల్లు–2014ను ప్రభుత్వం గురువారం రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుంది. బిల్లు ఉపసంహరణకు మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలిపారు. వక్ఫ్ ఆస్తుల్లో ఎవరైనా అనధికారికంగా తిష్టవేస్తే వారిని అక్కడి నుంచి తొలగించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా 2014 ఫిబ్రవరి 18న అప్పటి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కె.రెహా్మన్ ఖాన్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2014 మార్చి 5న బిల్లును పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు పంపించారు. అప్పటినుంచి బిల్లు పెండింగ్‌లో ఉంది.
టీడీపీ మద్దతు
లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు–2024కు టీడీపీ మద్దతు ప్రకటించింది. బిల్లును స్వాగతిస్తున్నామని టీడీపీ ఎంపీ హరీశ్ చెప్పారు. అన్ని మతాల వారు తమ మత కార్యక్రమాలకు భూములు, ఆస్తులను విరాళంగా ఇస్తుంటారని తెలిపారు. దాతల ప్రయోజనాలు కాపాడేలా సంస్కరణలు తీసుకొచ్చి ఆ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment