సాక్షి, విజయవాడ: ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈద్గా మైదానంలో జమాతే ఈ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో జరిగిన వక్ఫ్ పరిరక్షణ మహాసభలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారన్నారు.
‘‘ఈ బిల్లును కేబినెట్‌లో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదు. వక్ఫ్ సవరణలో 8 అంశాలను వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. వైఎస్సార్‌సీపీ తరఫున మేము డీసెంట్ నోట్ కూడా ఇచ్చాం. ముస్లింల తరఫున వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ నిలబడే ఉంటుంది. వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో, ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుంది. కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కామన్ ఫండ్‌ని ఏడు నుంచి ఐదు శాతానికి తగ్గించడానికి కూడా వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం’’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.
‘‘రైల్వే శాఖకు 4.88 లక్షల హెక్టార్లకు పైగా భూమి ఉంది. ఆ భూముల్లో చాలా భాగం వక్ఫ్ బోర్డు ఆక్రమించుకుందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు తప్పు. కుట్రపూరితంగా వక్ఫ్ బోర్డు మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను వైఎస్సార్‌సీపీ ఖండిస్తోంది. వక్ఫ్ బోర్డు భూములే 50 శాతం ఆక్రమణలకు గురయ్యాయి. 9.40 లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుకు ఉంటే అందులో 5 లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ భూములను ఆక్రమించారు. ఆ ఆక్రమణదారులకే భూములను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
‘‘ముస్లిం సంస్థలకు నాన్ హిందువులు విరాళాలు ఇవ్వకూడదన్న బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ముస్లింలు ఇతరులకు విరాళం ఇవ్వవచ్చు. ఇతరులు మాత్రం వక్ఫ్ బోర్డుకు ఇవ్వకూడదనటం చాలా అన్యాయం. వక్ఫ్ బోర్డు సీఈవోగా గతంలో ముస్లింలే ఉండేవారు. ఇప్పుడు నాన్ ముస్లింలు కూడా సీఈవోగా ఉండొచ్చని ఈ బిల్లులో నిర్ణయం తీసుకోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముస్లింల హక్కులకు భంగం కలిగిస్తే మేము సహించం. వైఎస్ జగన్ ఆదేశాలతో మేము ముస్లింల హక్కుల కోసం పోరాడతాం’’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment