ప్రతీకాత్మకచిత్రం
వసుదైక కుటుంబం, ఇంట్లోనే అందరూ ఉంటే అంతకన్నా కావలసిందేమిటి? ఇల్లే స్వర్గం... ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.. ఇవన్నీ భావావేశాలు, అందమైన కవితలు. అర్థాంగి, సుమంగళి, సతీఅనసూ య వంటి పాతకాలం సినీ పైత్య ప్రకోపాలు. ప్రవచనానంద స్వాముల పవిత్ర నినాదాలు. మానవత్వం పరిమళించే కొన్ని సంస్కారవంతమైన కుటుంబాలకు మాత్రమే పరిమితమైన వాస్తవాలు. మనదేశంలో లాక్‌డౌన్ మొదలయిన తరువాత నెలరోజుల్లో 500 గృహహింస కేసులు వచ్చాయట. ప్రపంచమంతటా 20 శాతం పెరిగాయని ఐక్యరాజ్యసమితి లెక్క.
జాతీయ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసి వివాహితల్లో ప్రతి మూడో మహిళ గృహహింసకు గురవుతున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భర్తల వల్ల 31 శాతం మహిళలు శారీరక, లైంగిక, మానసిక హింసలకు గురవుతున్నారు. 27శాతం భర్తలు భార్యలను కొడుతున్నారు. 13 శాతం మానసికంగా చిత్రవధ చేస్తున్నారని సర్వే తెలిపింది. ఆర్థిక హింస గురించి వీరు పట్టించుకోలేదు. వండి పెడుతుంటే బుద్ధిగా ఉండలేక ఇంతులను హింసించడం పతనమవుతున్న కుటుంబ సంబంధాల ప్రతీక. కోడల్ని వేధించడం, భార్యను సాధించడం. భర్తలను కూడా సాధిస్తున్నారని ఎవరైనా అనొచ్చు. కాని అటువంటి ఫిర్యాదులున్నట్టు దాఖలా లేదు. ఇటీవల రాచకొండ పోలీసులు ఒక గృహిణిని గృహహింస నుంచి కాపాడారు. 498ఎ ఐపిసి దుర్వినియోగం అవుతున్నదని భార్యా బాధితుల సంఘాలు తీవ్రంగా ప్రచారం చేసినా ఈ దేశపు ఆడపడుచులకు ఆ సెక్షన్ అవసరం ఇంకా తీరలేదనే రుజువులు రోజూ కనిపిస్తాయి.
కోవిడ్ కాలంలో, కోవిడ్ తరువాత అనే తేడాలు పెద్దగా లేవు. కోవిడ్ కాలంలో అందరూ ఇంట్లోనే ఉంటారు కనుక వేధించడానికి అనేక సదుపాయాలున్నాయి. ఇంటి హింస ఎదురైతే తమకు ఫోన్ చేయాలని పోలీసు అధికారులు ప్రకటించారు. పోలీసులు టెలికౌన్సెలింగ్ ద్వారా సలహాలు ఇస్తున్నారు. కరోనా మనుషులను ఒంటరి చేస్తున్నది. జీవిత భాగస్వాములే కాదు, కన్నకొడుకులు కూతుళ్లు.. తల్లిదండ్రులకు కూడా కరోనా ఉందన్న అనుమానంతో దూరంగా ఉండమంటున్నారు. దాన్ని సామాజిక దూరం అని పిలుస్తున్నారు. కుటుంబాల మధ్య దూరం పెంచి, వృద్ధులైన కన్న తల్లిదండ్రులు దగ్గినా సరే భయపడే పుత్రరత్నాల ధైర్యసాహసాలు బయపడుతున్నాయి. హాస్పిటల్ వారు ఆదరిస్తే అదృష్టం. లేకపోతే దిక్కులేదు.
కరోనా అంటురోగంతోపాటు ప్రబలుతున్న ఇంటి రోగం ఈ గృహహింస. శారీరకంగా, మానసికంగా, ఆడవారిని హింసించే సంఘటనలు పెరిగాయని జాతీయ మహిళా కమిష న్ కూడా హెచ్చరించింది. ఆర్థికహింస కూడా ఉంటుంది కాని బయటపడదు. కనిపించదు. బెదిరింపులు, దాడులు, అవమానించడం, తిట్టడం, కొట్టడం, నీ సంగతి చూస్తా అనడం, తిండి పెట్టకపోవడం, మంచి నీళ్లకు కూడా బాధించడం, అక్రమ సంబంధాలు, రోగాలు అంటగట్టడం ఇవన్నీ హింసకిందికే వస్తాయి. పట్టించుకోకుండా వదిలేస్తే, ఒత్తిడి వల్ల మానసిక శారీరక రుగ్మతలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. పిల్లలుంటే వారు మరింత ఒత్తిడికి గురవుతారు. కనుక ఈ దుర్మార్గుల నుంచి మహిళలు ఆత్మరక్షణ చేసుకోవలసిందే.
కొడుకుల తిట్లకు అవమానాలకు తల్లులు గురికావడం కూడా కోవిడ్ రోజుల్లో మామూలై పోయింది. ఇటువంటి ఫిర్యాదులు కూడా చేసి తల్లులు, వయోధిక వృద్ధుల సంక్షేమ చట్టం సాయంతో, కొడుకులను కూడా సరిచేసుకునే అవకాశం ఉపయోగించుకోవాలి. కోవిడ్ కదా ఎవ్వరికి చెప్పుకున్నా ఏం లాభం అని అనుకోకుండా వెంటనే మిత్రుడికో ఆప్తుడైన బంధువుకో, ఇరుగుపొరుగువారికో చెప్పుకోవడం వల్ల ఒంటరిగా మారి దెబ్బతినే అవకాశాలు తగ్గే వీలుంది. జాతీయ మహిళా కమిషన్ వాట్సప్ ద్వారా కూడా అలర్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. 07217735372కు బాధితులు అలర్ట్ సందేశాలు పంపవచ్చని జాతీయ మహిళా కమిషన్ ఒక నోటీసు జారీ చేసింది. SఏఉఖౖఉSS అనే ఎన్‌జీవో కూడా అందుబాటులో ఉంటానని ప్రకటించింది. నారీడాట్‌కామ్ వారు హెల్ప్‌లైన్ సౌకర్యం కల్పించారు. నందితాదాస్ అనే నటి, దర్శకురాలు ‘లిజెన్ టు హర్’ అని ఈ వేధింపులపైన ఒక చిన్న సినిమా కూడా తీశారు. మహిళలు తమను కాపాడుకోవడానికి ట్విట్టర్ వేదికను కూడా వాడుకోవచ్చు.
హైదరాబాద్‌లో షీటీంలతో పోలీసులు రక్షణ కార్య క్రమాన్ని చేపట్టారు. పోలీసు అదనపు కమిషనర్ క్రైమ్స్ అండ్ ఎస్‌ఐటీ ఆధ్వర్యంలో 100 షీటీంలు పనిచేస్తున్నాయి. ఎక్కడ మహిళలను వేధించే అవకాశాలున్నాయో ముందే గుర్తించి అక్కడ నిఘా ఎక్కువ చేసామని చెబుతున్నారు. నేరాల తీవ్రత తక్కువైతే కౌన్సిలింగ్ చేస్తారు, దారుణ నేరాలు చేస్తే నిర్భయ చట్టం కింద కేసులు పెడతారు. 100 నెంబర్‌కు వచ్చే ఫిర్యాదులను షీ విభాగం తీసుకుంటుంది. దౌర్జన్యం చేసే వారితోనే బాధితులు కూడా ఒకే కప్పుకింద నివసించవలసి రావడం చాలా ప్రమాదకరమైన దురదృష్టం. భయపడితే నిర్భయ చట్టం కూడా ఉపయోగపడదు. కుటుంబమైనా రాష్ట్రమైనా, దేశమైనా నిలదీయకపోతే నిలబడడం సాధ్యంకాదు. ప్రశ్నిస్తేనే పౌరసత్వమైనా, మానవత్వమైనా?
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment