కేంద్రంలో బీజేపీ అధికారంతో కళకళలాడుతూ ఉంటే, అధికారం లేక అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ విలవిలలాడుతుంటే, ఏవిధంగానైనా సరే అధికారాన్ని చేజిక్కించుకోవాలని తోచిన వ్యూహాలన్నీ పన్నుతుంటే, మధ్య (మద్య) తరగతి జనం, మతం పేరున విడిపోయి బీజేపీకి ఓటు వేయడమంటే హిందూమతానికి, సాక్షాత్తూ భగవంతుడికి ఓటువేయడమనే మాయమత్తులో కొట్టుమిట్టాడుతున్న దుర్దశలో ఉన్నారు. నాయకత్వ సంక్షోభంతో కాంగ్రెస్ పార్టీ దిక్కూ మొక్కూ లేకుండా క్షీణిస్తున్న దయనీయ వాతావరణంలో కూడా, బీజేపీని కాదని కాంగ్రెస్ పార్టీకి రాజస్తాన్ ప్రజలు ఎక్కువ ఓట్లు వేసి ఎక్కువ సీట్లు ఇచ్చి గద్దెను అప్పగిం చారు. అది ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేక ఓటు.
అధికారం పంచుకోవడంలో రాజకీయ నాయకుల మధ్య సఖ్యత ఏ మాత్రం ఉండదు, దోచుకున్న సొమ్ము పంచుకోవడంలో బందిపోటు దొంగల మధ్య అద్భుతమైన సఖ్యత ఉంటుంది. అధికారం పంచుకునేప్పుడు నేతలకు రాజ్యాంగం అడ్డురాదు. కాని బందిపోట్లు నిశ్శబ్దంగా డబ్బు పంచుకోకపోతే ఇండియన్ పీనల్ కోడ్ అడ్డు వస్తుంది. ప్రశాంతంగా లూటీ సొమ్ము పంచుకోగలిగి నంత మాత్రాన బందిపోట్లను మంచివాళ్లని అనలేము. అశోక్ గెహ్లాట్, సచిన్ మధ్య వర్గ రాజకీయాల ఔన్నత్య నీచత్వాల గురించి చర్చించే పని లేదు. కాంగ్రెస్ వల్ల పదవులు పొందిన జ్యోతిరాదిత్య సింధియా కానీ, సచిన్ పైలట్ కానీ, వారిని అదిరించి, బెదిరించి పార్టీ మారడానికి ప్రోత్సహిస్తున్న బీజేపీగానీ ఫిరాయింపు చట్టాన్ని పట్టించుకోరు.
కాంగ్రెస్ పార్టీకి జనం ఓటు వేస్తే జ్యోతిరాదిత్య సింధియా బీజేపీతో కలవడం పార్టీకి ద్రోహం చేయడమే అన్నారు. నిజానికి ఆయన ఆపార్టీకి ఓటేసిన ఓటర్లకు ద్రోహం చేసారు. ఈ ప్రజాద్రోహం, ఐపీసీలో ఉన్న రాజ ద్రోహం కన్నా ఘోరనేరం. జ్యోతిరాదిత్య సింధియా రాజ కుటుంబానికి చెందిన వాడంటారు. ఒకవేళ ఆయన రాజే అయితే ఇది రాజు చేసిన ప్రజాద్రోహం అవుతుంది. సత్యమేవజయతే (సత్యం ఒక్కటే జయిస్తుంది అని దీని అర్థమని చాలామందికి తెలియదు) అనే ధ్యేయవాక్యంతో మనదేశం వర్ధిల్లుతున్నది. కానీ ఈ దేశంలో ఉన్నంత అసత్యం మరెక్కడయినా ఉందో లేదో. సత్యం చెప్పినందుకు మెప్పు లభించకపోయినా అసత్యం చెప్పిన వాడు అందలాలు ఎక్కుతాడు.
వాట్సాప్ ద్వారా కోట్లాది ప్రజలకు ఫేక్ న్యూస్ చేర్చి అధికారంలోకి వచ్చామని సగర్వంగా ఊరేగే పార్టీలున్న దేశం మనది. కాంగ్రెస్ తరఫున పోటీచేసి కాంగ్రెస్ వాగ్దానాలు అమలుచేస్తానని చెప్పి గెలిచి, ఆ తరువాత బీజేపీలో చేరే వారు, (ఆ విధంగా పార్టీ మార్చే అందరూ కూడా) అసత్యనేరానికి జైల్లో ఉండవలసిన వారు. ఆర్జేడీతో పొత్తుపెట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి, ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన నితీశ్ కుమార్, ఆర్జేడీని వదిలేసి రాజీనామా చేసి, బీజేపీతో పొత్తు పెట్టుకుని మరునాడు మళ్లీ ముఖ్యమంత్రి కావడం కూడా ఇటువంటి ప్రజాద్రోహమే. అసత్యనేరం కూడా. ఈవిధంగా ప్రజాద్రోహం చేసి పార్టీ మారి వచ్చే వారిని అందలాలెక్కించే పార్టీలు కూడా నేరగాళ్లే. ఈ రోజు సచిన్ పైలట్ ఒక సంచలన యువకిశోరం. నిన్న జ్యోతిరాదిత్య సింధియా కూడా. సచిన్ నాన్న చనిపోయినప్పుడు తన వయసు 23. వాళ్ల అమ్మగారి స్థానంలో 26 ఏళ్లకే ఎంపీ అయిపోయాడు.
32 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రి. 36 సంవత్సరాల వయసులో రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. 40 ఏళ్లకు ఉపముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి పదవి తప్ప ఇంకేమీ ఈయనగారికి ఇవ్వడానికి కాంగ్రెస్ దగ్గర లేదు. ఇంకా కావాలి. ఏదో కావాలి. అహం కారం, దురాశ కలిసినప్పుడు తమకు ఓట్లేసిన ప్రజలు, టికెటిచ్చిన పార్టీ గుర్తుకురావు. ఈ కనులకు కమ్మిన పొరలను తీయడానికి కాటరాక్టు ఆపరేషన్లు ఉండవు. రాహుల్ గాంధీ అవమానించి ఉంటాడు. సోనియా తిట్టి ఉంటుంది. లేదా ఇంకెవరో ఏదో అని ఉంటారు. వారి ఆత్మగౌరవం (అహంకారానికి వేసిన మేకప్ పదం) దెబ్బతిని ఉంటుంది. ఇది ఒక కోణం. ఎక్కడో జనం డబ్బు తినేసి ఉంటారు. సాక్ష్యాలతో సహా వీరు చేసిన ఏదో నేరం దొరికిపోయి ఉంటుంది. ఆదాయం పన్ను ఎగవేసి ఉంటారు. జైల్లో ఆర్థిక నేరస్తుడిగా ఉండడం కన్న అధికారపార్టీలో మంత్రిగా ఉండడం గొప్ప కీర్తి కదా. అప్పుడు ఆత్మగౌరవానికి ఏ లోపమూ ఉండదు. కనుక ‘నేను బీజేపీలో చేరడం లేదు’ అని సచిన్ పైలట్ చెప్పడం మనదేశానికి తాటికాయ అక్షరాల వార్త.
కరోనాతో ఎంత మంది జనం చస్తే ఏమిటి, వారికి చికిత్స చేయాల్సిన ప్రజారోగ్యం రోగాన పడి మంచాన పడి గింజుకుంటేనేమిటి? కాంగ్రెస్ చేతిలోంచి ఇంకో ప్రభుత్వం మన చేతిలోకి వస్తుంటే.. అని బీజేపీ పండుగ చేసుకోవచ్చు. అయితే పైలట్ మనవాడయితే విమానాన్ని హైజాక్ చేయడమెందుకు?
వ్యాసకర్త
మాడభూషి శ్రీధర్
బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment