ఆర్టీఐకి మరణశాసనం | madabhusi Sridhar Article On RTI Act | Sakshi
Sakshi News home page

ఆర్టీఐకి మరణశాసనం

Published Fri, Jul 26 2019 12:54 AM | Last Updated on Fri, Jul 26 2019 12:54 AM

madabhusi Sridhar Article On RTI Act - Sakshi

ప్రధానమంత్రి మోదీ పారదర్శకత అంటే చాలా ఇష్టపడతారు. అవినీతిని సహించేది లేదని పదేపదే చెప్పారు. గుజరాత్‌లో అనేకసార్లు, కేంద్రంలో ప్రధానిగా రెండుసార్లు గెలిపించారంటే మోదీ మాటను జనం పూర్తిగా నమ్మారని నమ్మక తప్పదు.  పారదర్శకతను పెంచడానికి మాత్రమే ఆర్టీ ఐని సవరిస్తున్నానని మంత్రిగారు, బీజేపీ అధికార ప్రతినిధులు నమ్మబలుకుతూనే ఉన్నారు.  ప్రభుత్వం దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదని, గుట్టు దాచడంకన్న విప్పి చెప్పడంలోనే వారి శ్రేయస్సు ఉందని మనం అనుకుంటున్నాం. కానీ, పదిరూపాయలు పడేసి ఆర్టీఐ కింద ఓ దరఖాస్తు రాసేసి మా ప్రాణం తీస్తున్నారని ప్రభుత్వ పెద్దలు కోప్పడుతున్నారు.  సమాచార హక్కు చట్టాన్ని నిస్తేజం చేయడానికి కేంద్రం దాదాపు తొమ్మిది నెలల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. నవంబర్, డిసెంబర్‌ నెలల్లో ఈ ప్రతిపాదనకు తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కాస్త వెనుకంజ వేసింది. తరువాత మే నెలలో జరిగిన ఎన్నికలలో  ప్రజలు అద్భుతమైన రీతిలో విజయం కట్టబెట్టడంతో తాము ఏం చేసినా చెల్లుతుందనే సాహసిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ సవరణ తంతు పూర్తి చేసి సమాచార కమిషనర్లను తమ కింది స్థాయి ఉద్యోగులుగా మార్చడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నది. లోక్‌సభలో, రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. రాష్ట్రపతి అయినా దీని మీద సంతకం పెట్టకుండా ఆపుతారేమోననుకుంటే అది దింపుడు కళ్లం ఆశేనేమో.   

ఇప్పుడు కేంద్రంలో ఎన్నికల కమిషన్‌తో సమా చార కమిషనర్‌కు సమాన స్థాయి, హోదా, అధికారం వేతనం ఉండాలని చట్టం నిర్దేశించింది. ఎన్నికల కమిషనర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమాన హోదా కలిగి ఉంటారు. అయిదేళ్లు లేదా 65 సంవ త్సరాల వయసు ఏది ముందైతే ఆ కాలానికి పదవి ముగుస్తుందని చట్టంలో చేర్చారు. అంటే ప్రభుత్వ ఇష్టాయిష్టాలపై కమిషనర్‌ మనుగడ ఆధారపడదు. కనుక ప్రభుత్వ పెద్దల ఆగ్రహానుగ్రహాలతో సంబం ధం లేకుండా సొంతంగా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద పెద్ద అధికారులు తీసుకున్న నిర్ణయాల సమాచారాన్ని పౌరుడు ఈ చట్టం కింద తెలుసుకునే హక్కు పొందాడు. నిజానికి ఈ సమాచారం వెల్లడికావడం వల్ల ఎవరికీ హాని ఉండదు. కానీ వెల్లడైన ఈ సమాచారం ద్వారా అందాకా దాగిన రహస్యాలు బయటపడితే జైలుకు పోయే ప్రమాదం కూడా వస్తుందని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారు. ఈ భయం ఆర్టీఐకి ఎసరుగా మారింది. ఆర్టీఐ పూర్తిగా తీసివేయడానికి కూడా ఈ పాలకులకు భయమే. కనుక ఆర్టీఐ కోరలు పీకాలి. కాటేయడానికి వీల్లేని పాముగా మార్చి, వారి నాగస్వరానికి నాట్యం చేసే బానిసగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.  

ఎన్నికల కమిషన్‌ స్థాయిని సమాచార కమిషనర్‌కు ఇవ్వడం తప్పు కనుక తగ్గిస్తాం అని చట్టం లక్ష్యాల ప్రకటనలో పేర్కొన్నారు. తగ్గించనీ అనుకుందాం. ఏ స్థాయికి తగ్గిస్తారు? ఆ విషయం రహస్యం. పోనీ తగ్గించే జీతం ఎంత? అయిదేళ్ల పదవీకాలాన్ని ఎంత కాలానికి తగ్గిస్తారు? అదీ చెప్పరు. మామూలు జనాలకే కాదు, పార్లమెంటు సభ్యులకు కూడా చెప్పడం లేదు. సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకత పెంచడం కోసం సవరిస్తున్నామని చెబుతూ, సవరణ చట్టం ద్వారా ఏం సవరిస్తున్నారో పార్లమెం  టుకు కూడా చెప్పకుండా దాచడమే పారదర్శకత పెంచడమా?  తాము నిర్దేశించబోయే నియమాలకు అనుగుణంగా కమిషనర్‌ స్థాయి నిర్ణయిస్తామని చేర్చ డమే  ఈ చట్టం సవరణ.  అంటే స్థిరంగా ఒక పాలసీ లేదు. ప్రభుత్వంలో ఎవరుంటే వారి ఇష్టం వచ్చిన రీతిలో స్థాయిని నిర్ణయించుకోవచ్చు అని దీని అర్థం. ఉదా‘‘కు... ఓసారి ఇద్దరు కమిషనర్లను నియమించా లనుకుంటే అప్పుడు కొన్ని సూత్రాలు కనిపెడతారు. ఓ రెండేళ్ల పదవీకాలం, జాయింట్‌ సెక్రటరీ హోదా అని, ఆ తరువాత రెండేళ్లకు వచ్చే ఖాళీలు పూరించడానికి పూనుకున్నప్పుడు మూడేళ్ల పదవీకాలం, డిప్యూటీ సెక్రటరీ హోదా అని కూడా అనవచ్చు. రాష్ట్రాలు నియమించే కమిషనర్లకు కూడా కేంద్రమే హోదాను, వేతనాన్ని, పదవీకాలాన్ని నిర్ణయిస్తుందట. జనం అడిగిన సమాచారం ప్రభుత్వానికి ఇబ్బందికరమైతే ఇవ్వకూడదు అన్నది పైకి చెప్పని ఆదేశం. బహిరంగ రహస్యం. కాగితాల మీద కనిపించదు.  

సమాచార హక్కు సవరణను కనుక రెండు సభలు ఆమోదిస్తే, ఇక మళ్లీ సవరించే అవసరం లేదు. ఆ చట్టంలో మిగిలేది ఏమీ ఉండదు కనుక. ఈ బిల్లును అత్యంత రహస్యంగా కాపాడి, సభ్యులు చదువుకుని మార్పులు ప్రతిపాదించే వీలు లేకుండా బిల్లు ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటల ముందు మాత్రమే చెప్పి, హడావుడిగా ముందుకు తోశారు. ఈ హక్కును అమలులో నీరుగార్చేందుకు, అనేక ప్రభుత్వ విభాగాలలో ఒకదానిగా మార్చి అనుబంధ శాఖగా మార్చేందుకు వేసిన పకడ్బందీ ప్రణాళిక అని స్పష్టంగా విశదమవుతూ ఉన్నది. పార్లమెంటు నుంచి అధికారాన్ని గుంజుకునే సవరణ ఇది. ఇది ఆర్టీఐ కమిషనర్‌ వ్యవస్థకు మరణశాసనం.


మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement