నెహ్రూ, గాంధీజీ, పటేల్
అభిప్రాయం
1946లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ దశలో పార్టీ అధ్యక్షుడయే వ్యక్తి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఉపాధ్యక్షుడు అవుతాడు. స్వాతంత్య్రానికి ముందు మధ్యంతర ప్రభుత్వంలో అటువంటి అవకాశం లభిస్తే, ఇక స్వాతంత్య్రానంతరం అతనే ప్రధాని కాగల అవకాశం ఉంటుంది. ఆ స్థితిలో ఆజాద్, నెహ్రూ, పటేల్, కృపలానీ నలుగురూ పార్టీ అధ్యక్ష పదవిని ఆశించారు. వారిలో నెహ్రూ పట్ల గాంధీజీ అనుకూలత చూపారు.
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలలో గత వారాంతంలో ప్రత్యేక చర్చ జరిగినపుడు ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తావనకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ పాలనా కాలంలో రాజ్యాంగాన్ని పలుమార్లు దుర్వినియోగ పరచటమే కాకుండా, స్వాతంత్య్రానంతరం సర్దార్ పటేల్ బదులు నెహ్రూను ప్రధాని చేసేందుకు తమ సొంత పార్టీ రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించిందన్నారు.
ఆయన అటువంటి ఆరోపణ చేసినపుడు ఎందువల్లనో గానీ కాంగ్రెస్ పక్షం నుంచి పూర్తి మౌనం తప్ప కనీస నిరసనలు కూడా కనిపించలేదు. ప్రధాని విమర్శలో నిజమున్నదని వారావిధంగా అంగీకరించినట్లా? కనీసం మరునాడైనా తమ స్పందన లేమిటో ఎందుకు తెలియజేయలేదు? చరిత్రలో వాస్తవంగా జరిగిందేమిటో తెలిసిన కాంగ్రెస్‌వాదులు సభలో చర్చ జరిగిన సమయంలోగానీ, ఆ తర్వాతగానీ లేకపోయారా? వారి మౌనాన్ని బట్టి మాత్రం, మోదీ ఆరోపణ నిజమని నమ్మే అవకాశం సహజంగానే ఉంటుంది.
యథాతథంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని దేశం కోసం సహేతుకమైన అవసరాల కోసం సవరించటంతోపాటు, తమ అధికార ప్రయోజనాల కొరకు దుర్వినియోగ పరిచాయన్నది నిజం. ఆ విషయమై ఎప్పటికప్పుడు విమర్శలు రావటం తెలిసిందే. వాటిని పురస్కరించుకుని 1983లో ఏర్పడిన జస్టిస్ సర్కారియా కమిషన్,కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ఒక గొప్ప నివేదికను ఇచ్చింది. దానితో, కేంద్రంలోని అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను యథేచ్ఛగా కూలదోసే దుష్ట సంప్రదాయం నిలిచిపోగలదని అందరూ ఆశించారు.
కానీ, ఆ తీరు కొంత అదుపులోకి వచ్చినా, ఆ తర్వాత సైతం రాజ్యాంగ దుర్వినియోగం కొన సాగింది. ప్రభుత్వాలను ఆర్టికల్ 365 అనే ఆయుధంతో పడగొడు తుండటం ఒకటైతే... రాష్ట్రాల ఆర్థిక, రాజకీయాధికారాలను కుదిస్తూ పోయారు. ఆ ధోరణు లకు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం (1989–91) కళ్లెం వేసింది. అది ఒక జాతీయ పార్టీ ప్రభుత్వం కాకుండా పలు ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం కావటం అందుకు కారణం.
ఆ విధంగా దుర్వినియోగపరచటమనే రికార్డు గల కాంగ్రెస్, బీజేపీలు రెండూ జాతీయ పార్టీలే కావటం గమనించదగ్గది. అందు వల్ల, ఈ విషయమై ఈ రెండు గురివింద పార్టీలలో ఎవరు ఎవరిని వేలెత్తి చూపినా అది హాస్యాస్పదమే అవుతుంది.
అందువల్ల,రాజ్యాంగ ఆమోదానికి 75 సంవత్సరాలు పూర్తి కావటమనే ఒక ఘనమైన సందర్భాన్ని ఉపయోగించుకుని వీరిద్దరితోపాటు అన్ని పార్టీలు కూడా, పరస్పరం వృథా విమర్శలు చేసుకోవటానికి బదులు, ఇంతకాలం జరిగిన దుర్వినియోగాలకు చింతిస్తున్నామని, అందుకు దేశ ప్రజలు తమను క్షమించాలని, ఇక ముందు ఎట్టి పరిస్థితులలోనూ దేశ అవసరాల కోసం తప్ప స్వప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని ఉపయోగించుకొనబోమని ఏకగ్రీవ తీర్మానం చేసి ఉంటే, ఈ సంద ర్భానికి తగినట్లు అంతే ఘనంగా ఉండి, దేశ భవిష్యత్తుకు ఉపయో గకరమయేది.
కొంత భిన్నమైనదే అయినా రాజ్యాంగ దుర్వినియోగాలకు సంబంధించిన అవగాహనలకు అవసరమైన ఈ చర్చను అట్లుంచితే, స్వాతంత్య్రానంతరం ప్రధానమంత్రి ఎన్నిక లేదా ఎంపిక విషయంలో వాస్తవంగా జరిగిందేమిటి?
దేశానికి 1947లో ఇక స్వాతంత్య్రం రానున్నట్లు ధ్రువపడిపోయింది. అంతకుముందు 1946లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నిక కాలానికి మౌలానా అజాద్ అప్పటికే ఆరు సంవత్సరాలుగా ఆ పదవిలో ఉన్నారు. అయినా మళ్లీ కావాలనుకున్నారు. అందుకు కారణం, ఆ దశలో పార్టీ అధ్యక్షుడయే వ్యక్తి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఉపాధ్యక్షుడు కానుండటం! ఆ హోదాలో ఆ వ్యక్తి, ప్రధానమంత్రికి సమానుడవుతాడు.
స్వాతంత్య్రానికి ముందు మధ్యంతర ప్రభుత్వంలో అటువంటి అవకాశం లభిస్తే, ఇక స్వాతంత్య్రానంతరం అతనే ప్రధాని కాగల అవకాశం ఉంటుంది. ఆ స్థితిలో ఆజాద్, నెహ్రూ, పటేల్, కృపలానీ నలుగురూ పార్టీ అధ్యక్ష పదవిని ఆశించారు. వారిలో నెహ్రూ పట్ల గాంధీజీ అనుకూలత చూపారు. దానితో ఆయన 1946 ఏప్రిల్ 20న ఆజాద్‌కు లేఖ రాసి పోటీ నుంచి విరమింపజేశారు.
అంతేకాదు, ‘ఎవరైనా నా అభిప్రాయం అడిగితే జవహర్‌లాల్ పేరు చెప్తాను. అందుకు నాకు చాలా కారణాలు న్నాయి’ అని కూడా అదే లేఖలో స్పష్టం చేశారు (ప్యారేలాల్ పేపర్స్). నామినేషన్లకు చివరి రోజు 29వ తేదీ కాగా, తను ఎవరికి అనుకూలమో 20వ తేదీ నాటికి మరి కొందరికి కూడా సూచించారు. మరొక వైపు, వర్కింగ్ కమిటీ సభ్యులు 15 మందిలో 12 మంది, మొత్తం అన్ని పీసీసీల నుంచి పటేల్‌కు మద్దతు లభించింది.
అయినప్పటికీ, గాంధీజీ అభిప్రాయం తెలిసిన కృపలానీ, నెహ్రూ పేరును ప్రతిపాదించి పోటీ నుంచి తప్పుకున్నారు. అపుడు పటేల్ కూడా ఉపసంహరించుకుని, ‘నెహ్రూ ఏకగ్రీవంగా ఎన్నికయేందుకు వీలుగా’ అంటూ ఒక కాగితంపై రాసి ఆజాద్‌కు అందజేశారు (పటేల్ కుమార్తె మణిబెన్). దానితో నెహ్రూ ఏకగ్రీవ ఎంపిక, అదే క్రమంలో అంతిమంగా ప్రధాని కావటం ఖాయమైంది.
అదే సమయంలో గాంధీజీ నెహ్రూతో, తన పేరును ఒక్క పీసీసీ కూడా ప్రతిపాదించని విషయాన్ని లాంఛనంగా ప్రస్తా వించారు గానీ, అందుకు నెహ్రూ స్పందించకపోవటంతో, ఎట్లాగూ గాంధీజీ ఆమోదం కూడా ఉన్నందున నెహ్రూదే నాయకత్వం అయింది. పీసీసీల మద్దతు గురించి ఒక విశేషాన్ని చెప్పుకోవాలి.
ఉదాహరణకు, పటేల్‌కు సన్నిహితుడైన సెంట్రల్ ప్రావి న్సెస్ పీసీసీకి చెందిన డి.పి. మిశ్రా, తర్వాత ‘లివింగ్ యాన్∙ఈరా’ అనే పుస్తకం రాస్తూ, తాము పటేల్‌నైతే బలపరిచాముగానీ భవి ష్యత్తులో నెహ్రూ ప్రధాని కాకుండా అడ్డుపడటం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. నెహ్రూ అప్పటికే మూడుసార్లు అధ్యక్షునిగా పని చేసినందున పటేల్‌కు రెండో అవకాశం ఇవ్వాలనుకున్నామని, పైగా ప్రధానమంత్రి పదవికి సంబంధించినంతవరకు గాంధీజీ తన వారసునిగా నెహ్రూను ఎప్పుడో ప్రకటించారని అన్నారు.
వాస్తవానికి గాంధీజీ స్వాతంత్య్రోద్యమ సమయంలో ఒక దశలో తన వారసునిగా పటేల్‌ను ప్రకటించి, ఆ తర్వాత అభిప్రాయం మార్చుకున్నారు. అందుకు కారణాలేమిటో 1945 ప్రాంతంలోనే బహిరంగంగా చెప్పారు. అవి ఈ విధంగా ఉన్నాయి: దేశానికి ఆంగ్లే యుల నుంచి అధికారం రానుండగా ఆ సమయంలో నెహ్రూ మినహా మరొకరు ఆ స్థానంలోకి రాలేరు. విదేశాలలో చదివి బారిస్టర్ అయిన తను మాత్రమే వారితో వ్యవహరించగలడు.
అది గాక ముస్లిములతో తనకున్న సత్సంబంధాలు పటేల్‌కు లేవు. ఇవి గాక మరికొన్ని కార ణాలు కూడా ఉన్నాయి. దేశంలో మత కలహాలు, దేశ విభజన అవ కాశాల స్థితిలో, ముస్లిములకు వ్యతిరేకి అనే ముద్ర గల పటేల్ వల్ల సామరస్యతలు సాధ్యం కాకపోవచ్చు. ఇండియా వంటి దేశపు విదేశాంగ వ్యవహారాలను నెహ్రూ వంటి దృక్పథంగల వారే సరిగా చక్కబెట్టగలరు.
పటేల్ మితవాది అయినందున పార్టీలోని మితవాద, ఫ్యూడల్ వర్గాల మద్దతు బలంగా ఉండటం నిజమే గానీ, సామాన్య ప్రజానీకానికి సంబంధించి వారి హృదయ సమ్రాట్ నెహ్రూ మాత్రమే. పైగా, మొదటి నుంచి దరిద్ర నారాయణ్ అంటూ ఆ వర్గాలతో మమేక మైన గాంధీజీకి, ఫేబియన్ సోషలిస్టు భావజాలం గల నెహ్రూయే సరైన ప్రధానిగా తోచటంలో వింత లేదు.
ఇంతకూ దీనంతటిలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘన ఎక్కడున్నదో, ఆ పని నెహ్రూ కుటుంబం ఏ విధంగా చేసిందో ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు. అప్పటి పరిణామాలకు సంబంధించిన వాస్తవాలు మాత్రం ఈ విధంగా ఉన్నాయి.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment