Sardar Patel
-
పటేల్ ప్రధాని ఎందుక్కాలేదు?
1946లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ దశలో పార్టీ అధ్యక్షుడయే వ్యక్తి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉపాధ్యక్షుడు అవుతాడు. స్వాతంత్య్రానికి ముందు మధ్యంతర ప్రభుత్వంలో అటువంటి అవకాశం లభిస్తే, ఇక స్వాతంత్య్రానంతరం అతనే ప్రధాని కాగల అవకాశం ఉంటుంది. ఆ స్థితిలో ఆజాద్, నెహ్రూ, పటేల్, కృపలానీ నలుగురూ పార్టీ అధ్యక్ష పదవిని ఆశించారు. వారిలో నెహ్రూ పట్ల గాంధీజీ అనుకూలత చూపారు.భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలలో గత వారాంతంలో ప్రత్యేక చర్చ జరిగినపుడు ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తావనకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ పాలనా కాలంలో రాజ్యాంగాన్ని పలుమార్లు దుర్వినియోగ పరచటమే కాకుండా, స్వాతంత్య్రానంతరం సర్దార్ పటేల్ బదులు నెహ్రూను ప్రధాని చేసేందుకు తమ సొంత పార్టీ రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించిందన్నారు. ఆయన అటువంటి ఆరోపణ చేసినపుడు ఎందువల్లనో గానీ కాంగ్రెస్ పక్షం నుంచి పూర్తి మౌనం తప్ప కనీస నిరసనలు కూడా కనిపించలేదు. ప్రధాని విమర్శలో నిజమున్నదని వారావిధంగా అంగీకరించినట్లా? కనీసం మరునాడైనా తమ స్పందన లేమిటో ఎందుకు తెలియజేయలేదు? చరిత్రలో వాస్తవంగా జరిగిందేమిటో తెలిసిన కాంగ్రెస్‌వాదులు సభలో చర్చ జరిగిన సమయంలోగానీ, ఆ తర్వాతగానీ లేకపోయారా? వారి మౌనాన్ని బట్టి మాత్రం, మోదీ ఆరోపణ నిజమని నమ్మే అవకాశం సహజంగానే ఉంటుంది.యథాతథంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని దేశం కోసం సహేతుకమైన అవసరాల కోసం సవరించటంతోపాటు, తమ అధికార ప్రయోజనాల కొరకు దుర్వినియోగ పరిచాయన్నది నిజం. ఆ విషయమై ఎప్పటికప్పుడు విమర్శలు రావటం తెలిసిందే. వాటిని పురస్కరించుకుని 1983లో ఏర్పడిన జస్టిస్ సర్కారియా కమిషన్,కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ఒక గొప్ప నివేదికను ఇచ్చింది. దానితో, కేంద్రంలోని అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను యథేచ్ఛగా కూలదోసే దుష్ట సంప్రదాయం నిలిచిపోగలదని అందరూ ఆశించారు. కానీ, ఆ తీరు కొంత అదుపులోకి వచ్చినా, ఆ తర్వాత సైతం రాజ్యాంగ దుర్వినియోగం కొన సాగింది. ప్రభుత్వాలను ఆర్టికల్ 365 అనే ఆయుధంతో పడగొడు తుండటం ఒకటైతే... రాష్ట్రాల ఆర్థిక, రాజకీయాధికారాలను కుదిస్తూ పోయారు. ఆ ధోరణు లకు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం (1989–91) కళ్లెం వేసింది. అది ఒక జాతీయ పార్టీ ప్రభుత్వం కాకుండా పలు ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం కావటం అందుకు కారణం. ఆ విధంగా దుర్వినియోగపరచటమనే రికార్డు గల కాంగ్రెస్, బీజేపీలు రెండూ జాతీయ పార్టీలే కావటం గమనించదగ్గది. అందు వల్ల, ఈ విషయమై ఈ రెండు గురివింద పార్టీలలో ఎవరు ఎవరిని వేలెత్తి చూపినా అది హాస్యాస్పదమే అవుతుంది. అందువల్ల,రాజ్యాంగ ఆమోదానికి 75 సంవత్సరాలు పూర్తి కావటమనే ఒక ఘనమైన సందర్భాన్ని ఉపయోగించుకుని వీరిద్దరితోపాటు అన్ని పార్టీలు కూడా, పరస్పరం వృథా విమర్శలు చేసుకోవటానికి బదులు, ఇంతకాలం జరిగిన దుర్వినియోగాలకు చింతిస్తున్నామని, అందుకు దేశ ప్రజలు తమను క్షమించాలని, ఇక ముందు ఎట్టి పరిస్థితులలోనూ దేశ అవసరాల కోసం తప్ప స్వప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని ఉపయోగించుకొనబోమని ఏకగ్రీవ తీర్మానం చేసి ఉంటే, ఈ సంద ర్భానికి తగినట్లు అంతే ఘనంగా ఉండి, దేశ భవిష్యత్తుకు ఉపయో గకరమయేది.కొంత భిన్నమైనదే అయినా రాజ్యాంగ దుర్వినియోగాలకు సంబంధించిన అవగాహనలకు అవసరమైన ఈ చర్చను అట్లుంచితే, స్వాతంత్య్రానంతరం ప్రధానమంత్రి ఎన్నిక లేదా ఎంపిక విషయంలో వాస్తవంగా జరిగిందేమిటి?దేశానికి 1947లో ఇక స్వాతంత్య్రం రానున్నట్లు ధ్రువపడిపోయింది. అంతకుముందు 1946లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నిక కాలానికి మౌలానా అజాద్ అప్పటికే ఆరు సంవత్సరాలుగా ఆ పదవిలో ఉన్నారు. అయినా మళ్లీ కావాలనుకున్నారు. అందుకు కారణం, ఆ దశలో పార్టీ అధ్యక్షుడయే వ్యక్తి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉపాధ్యక్షుడు కానుండటం! ఆ హోదాలో ఆ వ్యక్తి, ప్రధానమంత్రికి సమానుడవుతాడు. స్వాతంత్య్రానికి ముందు మధ్యంతర ప్రభుత్వంలో అటువంటి అవకాశం లభిస్తే, ఇక స్వాతంత్య్రానంతరం అతనే ప్రధాని కాగల అవకాశం ఉంటుంది. ఆ స్థితిలో ఆజాద్, నెహ్రూ, పటేల్, కృపలానీ నలుగురూ పార్టీ అధ్యక్ష పదవిని ఆశించారు. వారిలో నెహ్రూ పట్ల గాంధీజీ అనుకూలత చూపారు. దానితో ఆయన 1946 ఏప్రిల్ 20న ఆజాద్‌కు లేఖ రాసి పోటీ నుంచి విరమింపజేశారు. అంతేకాదు, ‘ఎవరైనా నా అభిప్రాయం అడిగితే జవహర్లాల్ పేరు చెప్తాను. అందుకు నాకు చాలా కారణాలు న్నాయి’ అని కూడా అదే లేఖలో స్పష్టం చేశారు (ప్యారేలాల్ పేపర్స్). నామినేషన్లకు చివరి రోజు 29వ తేదీ కాగా, తను ఎవరికి అనుకూలమో 20వ తేదీ నాటికి మరి కొందరికి కూడా సూచించారు. మరొక వైపు, వర్కింగ్ కమిటీ సభ్యులు 15 మందిలో 12 మంది, మొత్తం అన్ని పీసీసీల నుంచి పటేల్‌కు మద్దతు లభించింది.అయినప్పటికీ, గాంధీజీ అభిప్రాయం తెలిసిన కృపలానీ, నెహ్రూ పేరును ప్రతిపాదించి పోటీ నుంచి తప్పుకున్నారు. అపుడు పటేల్ కూడా ఉపసంహరించుకుని, ‘నెహ్రూ ఏకగ్రీవంగా ఎన్నికయేందుకు వీలుగా’ అంటూ ఒక కాగితంపై రాసి ఆజాద్‌కు అందజేశారు (పటేల్ కుమార్తె మణిబెన్). దానితో నెహ్రూ ఏకగ్రీవ ఎంపిక, అదే క్రమంలో అంతిమంగా ప్రధాని కావటం ఖాయమైంది. అదే సమయంలో గాంధీజీ నెహ్రూతో, తన పేరును ఒక్క పీసీసీ కూడా ప్రతిపాదించని విషయాన్ని లాంఛనంగా ప్రస్తా వించారు గానీ, అందుకు నెహ్రూ స్పందించకపోవటంతో, ఎట్లాగూ గాంధీజీ ఆమోదం కూడా ఉన్నందున నెహ్రూదే నాయకత్వం అయింది. పీసీసీల మద్దతు గురించి ఒక విశేషాన్ని చెప్పుకోవాలి. ఉదాహరణకు, పటేల్‌కు సన్నిహితుడైన సెంట్రల్ ప్రావి న్సెస్ పీసీసీకి చెందిన డి.పి. మిశ్రా, తర్వాత ‘లివింగ్ యాన్∙ఈరా’ అనే పుస్తకం రాస్తూ, తాము పటేల్నైతే బలపరిచాముగానీ భవి ష్యత్తులో నెహ్రూ ప్రధాని కాకుండా అడ్డుపడటం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. నెహ్రూ అప్పటికే మూడుసార్లు అధ్యక్షునిగా పని చేసినందున పటేల్‌కు రెండో అవకాశం ఇవ్వాలనుకున్నామని, పైగా ప్రధానమంత్రి పదవికి సంబంధించినంతవరకు గాంధీజీ తన వారసునిగా నెహ్రూను ఎప్పుడో ప్రకటించారని అన్నారు.వాస్తవానికి గాంధీజీ స్వాతంత్య్రోద్యమ సమయంలో ఒక దశలో తన వారసునిగా పటేల్‌ను ప్రకటించి, ఆ తర్వాత అభిప్రాయం మార్చుకున్నారు. అందుకు కారణాలేమిటో 1945 ప్రాంతంలోనే బహిరంగంగా చెప్పారు. అవి ఈ విధంగా ఉన్నాయి: దేశానికి ఆంగ్లే యుల నుంచి అధికారం రానుండగా ఆ సమయంలో నెహ్రూ మినహా మరొకరు ఆ స్థానంలోకి రాలేరు. విదేశాలలో చదివి బారిస్టర్ అయిన తను మాత్రమే వారితో వ్యవహరించగలడు. అది గాక ముస్లిములతో తనకున్న సత్సంబంధాలు పటేల్‌కు లేవు. ఇవి గాక మరికొన్ని కార ణాలు కూడా ఉన్నాయి. దేశంలో మత కలహాలు, దేశ విభజన అవ కాశాల స్థితిలో, ముస్లిములకు వ్యతిరేకి అనే ముద్ర గల పటేల్ వల్ల సామరస్యతలు సాధ్యం కాకపోవచ్చు. ఇండియా వంటి దేశపు విదేశాంగ వ్యవహారాలను నెహ్రూ వంటి దృక్పథంగల వారే సరిగా చక్కబెట్టగలరు. పటేల్ మితవాది అయినందున పార్టీలోని మితవాద, ఫ్యూడల్ వర్గాల మద్దతు బలంగా ఉండటం నిజమే గానీ, సామాన్య ప్రజానీకానికి సంబంధించి వారి హృదయ సమ్రాట్ నెహ్రూ మాత్రమే. పైగా, మొదటి నుంచి దరిద్ర నారాయణ్ అంటూ ఆ వర్గాలతో మమేక మైన గాంధీజీకి, ఫేబియన్ సోషలిస్టు భావజాలం గల నెహ్రూయే సరైన ప్రధానిగా తోచటంలో వింత లేదు.ఇంతకూ దీనంతటిలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘన ఎక్కడున్నదో, ఆ పని నెహ్రూ కుటుంబం ఏ విధంగా చేసిందో ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు. అప్పటి పరిణామాలకు సంబంధించిన వాస్తవాలు మాత్రం ఈ విధంగా ఉన్నాయి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
సర్దార్ పటేల్‌కు ప్రధాని మోదీ నివాళులు
న్యూఢిల్లీ: ఈరోజు (అక్టోబర్ 31) జాతీయ ఐక్యతా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్‌కు నివాళులు అర్పించారు.గుజరాత్‌లోని కేవడియాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రజలతో ఐక్యతా ప్రమాణం చేయించారు. జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. #WATCH केवड़िया, गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने सरदार वल्लभभाई पटेल की जयंती पर एकता की शपथ दिलाई। (सोर्स: डीडी न्यूज) pic.twitter.com/7w7ESJpuuB— ANI_HindiNews (@AHindinews) October 31, 2024దీనికి ముందు ప్రధాని మోదీ సోషల్ మీడియా సైట్లో ఒక పోస్ట్‌లో ఇలా రాశారు.. దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం కోసం వల్లభాయ్‌పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన వ్యక్తిత్వం, ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ పేర్కొన్నారు.भारत रत्न सरदार वल्लभभाई पटेल की जन्म-जयंती पर उन्हें मेरा शत-शत नमन। राष्ट्र की एकता और संप्रभुता की रक्षा उनके जीवन की सर्वोच्च प्राथमिकता थी। उनका व्यक्तित्व और कृतित्व देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा।— Narendra Modi (@narendramodi) October 31, 2024సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి(అక్టోబర్ 31)ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటారు. దీనిని రాష్ట్రీయ ఏక్తా దివస్ అని కూడా పిలుస్తారు . భారతదేశపు ఉక్కు మనిషిగా పేరొందిన పటేల్ దేశ స్వాతంత్ర్యం తర్వాత భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారు.ఇది కూడా చదవండి: సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు -
మన తొలి ప్రభుత్వం అలా ఏర్పడింది.. ఆయన ప్రధానైతే కథ వేరేలా.. !
ఈ సువిశాల భారతం ఒకే ప్రభుత్వం కింద ఉన్న కాలం చరిత్రలో తక్కువే. క్రీస్తుపూర్వమో, మధ్య యుగాలలోనో కొంతకాలం కొంతమంది మన పాలకులు మొత్తం భారతావనిని పాలించే అవకాశం దక్కించుకున్నారు. అప్పుడు కూడా కొన్ని భూభాగాలు చక్రవర్తులో, పాదుషాలో వారి అధీనంలో లేవు. అయినా యావద్భారతావనిని వారు ఏలారని అనుకోవచ్చు. కొన్ని శతాబ్దాల క్రితం భారతదేశం కోల్పోయిన ఆ అవకాశం మళ్లీ 1946లోనే వచ్చింది. తాత్కాలిక ప్రాతిపదికనే కావచ్చు, అప్పుడే భారత దేశానికి భారతీయులతో కూడిన ప్రభుత్వం కొలువైంది. ఇది చరిత్రలో అపురూపం. రాజకీయ ఏకత్వానికి ఆధునిక యుగంలో అదే తొలి అడుగు. కొద్దినెలలే అయినా ఆ తాత్కాలిక సంకీర్ణం అఖండ భారతాన్ని పాలించిందన్న విషయం ప్రత్యేకమైనదే. కానీ రక్తపాతాల మధ్య భారత విభజన పనిని పూర్తి చేసినదీ ఆ ప్రభుత్వమే. రెండో ప్రపంచ యుద్ధం తరువాత తన వలస దేశాలలో యూనియన్ జాక్‌ను అవనతం చేయాలని ఇంగ్లండ్ నిర్ణయించుకుంది. ఎంత ఇష్టం లేకపోయినా అలా వదులుకోవలసిన దేశాలలో భారత్ మొదటిది. దీనికి తొలిమెట్టు పాలనా వ్యవహారాలలో బ్రిటిష్ ప్రభుత్వం పక్కకు తొలగి, జాతీయ సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడమే. బ్రిటిష్ ఇండియా ఏర్పాటు చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వాములు కావలసిందని వైస్రాయ్ లార్డ్ ఆర్చిబాల్డ్ వేవెల్ 1946 జూలై 22న భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు జవహర్లాల్ నెహ్రూకు, ముస్లింలీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు లేఖలు రాశాడు. ఆ ప్రభుత్వంలో 14 శాఖలు ఉంటాయనీ, ఆరు కాంగ్రెస్‌కు, ఐదు లీగ్‌కు, మైనారిటీలకు మూడు వంతున ఇవ్వాలని నిర్ణయించినట్టు కూడా అదే లేఖలో వివరించాడు వేవెల్. ముఖ్యమైన శాఖల విషయంలో కాంగ్రెస్, లీగ్‌ల మధ్య సమతౌల్యం పాటిస్తామనీ చెప్పాడు. కానీ ఈ ప్రతిపాదనను ఆ ఇద్దరూ నిరాకరించారు. భారత కార్యదర్శి సలహా మేరకు వేవెల్ ముస్లింలీగ్‌ను పక్కన పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 1946 ఆగస్ట్ 12న కాంగ్రెస్‌ను ఆహ్వానించాడు. అదే సమయంలో తన ప్రతిపాదనలు ఏమైనప్పటికీ వాటిని జిన్నాతో చర్చించే అధికారం కూడా అప్పగించాడు వేవెల్. నెహ్రూ జిన్నాతో చర్చించారు. కానీ ప్రయోజనం కనిపించలేదు. మరొక పక్క మత కల్లోలాలు తీవ్రమవుతున్నాయి. నెహ్రూను తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచి తప్పు చేశానేమోనని వేవెల్ శంకించడం మొదలుపెట్టాడు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుతో దేశంలో తిరుగుబాటు వస్తుందేమోనని బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ భయపడ్డాడు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా వైస్రాయ్ వేవెల్ తీసుకున్నాడు. ఇన్ని పరిణామాల తరువాత 1946 సెప్టెంబర్ 2న కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వామి అయింది. ఈ ప్రభుత్వంలో చేరేవారిని అంతకు ముందే ఆవిర్భవించిన భారత రాజ్యాంగ పరిషత్ నియమించింది. భారత రాజ్యాంగ పరిషత్‌లో 389 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. ఇందులో 292 మందిని 11 ప్రావిన్సుల శాసనసభల ప్రజా ప్రతినిధులు ఎన్నుకున్నారు. 93 మంది సంస్థానాల ప్రతినిధులు. మరొక నలుగురు ఢిల్లీ, అజ్మీర్–మార్వాడా, కూర్గ్, బ్రిటిష్ బలూచిస్తాన్ల నుంచి వచ్చిన సభ్యులు. 1946 ఆగస్ట్ నాటికి 11 ప్రావిన్స్‌ల చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. అంటే 292 స్థానాలు. ఇందులో కాంగ్రెస్ 208 స్థానాలు గెలిచింది. ముస్లింలీగ్ 73 స్థానాలు గెలిచింది. హిందువులు ఆధిక్యం ఉన్నచోట కాంగ్రెస్, ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట లీగ్ ప్రధానంగా గెలిచాయి. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైనా, ముస్లిం లీగ్ కాంగ్రెస్‌కు సహకరించడానికి నిరాకరించింది. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ఒక విస్తృత ధ్యేయాన్ని నిర్వర్తించడానికి ఏర్పాటు చేశారు. విభజన ప్రక్రియను సజావుగా సాగించి, అధికార బదలీని వేగవంతం చేయడానికి అది ఏర్పాటైందన్నది నిజం. బ్రిటిష్ ప్రభుత్వం విన్నపం మేరకు కాంగ్రెస్ ఇందులో చేరడానికి అంగీకరించింది. మరోవైపు ముస్లింల కోసం వేరొక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని లీగ్ కొత్త కోర్కెను తెర మీదకు తెచ్చింది. రాజ్యాంగ పరిషత్‌లో మెజారిటీ కాంగ్రెస్‌దే కాబట్టి, కాంగ్రెస్ అంటే హిందువుల సంస్థ అనే లీగ్ నిశ్చితాభిప్రాయం కాబట్టి లీగ్ ఈ గొంతెమ్మ కోర్కె కోరింది. తమతో కలసి పనిచేయడానికి లీగ్ నిరాకరించినందున పార్టీకే చెందిన 12 మందిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు ముస్లింలు. తరువాత మనసు మార్చుకున్న ముస్లిం లీగ్ అక్టోబర్ 26న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కానీ తమ మంత్రులు నెహ్రూకు జవాబుదారీగా ఉండబోరని షరతు పెట్టింది. ముగ్గురు ముస్లిం లీగ్ సభ్యులకు అవకాశం కల్పించడానికి వీలుగా ముగ్గురు కాంగ్రెస్ వారు రాజీనామా చేశారు. వారు శరత్చంద్ర బోస్, సయ్యద్ అలీ జహీర్, షఫత్ అహ్మద్ ఖాన్. తాత్కాలిక ప్రభుత్వంలోని కార్యనిర్వాహక విభాగానికి వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి అనుబంధంగా పని చేస్తుంది. తాత్కాలిక ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడిగా (అధ్యక్షుడు వైస్రాయ్), జవహర్లాల్ నెహ్రూ ఎంపికయ్యారు. విదేశ వ్యవహారాలు, కామన్వెల్త్ శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఇంకా వల్లభ్‌భాయ్ పటేల్ (హోం, సమాచార, ప్రసార శాఖలు), బల్దేవ్ సింగ్ (రక్షణ), డాక్టర్ జాన్ మత్తయ్ (పరిశ్రమలు, రవాణా), సి. రాజాజీ (విద్య, కళలు), సిహెచ్ భాభా (పనులు, గనులు, విద్యుత్), బాబూ రాజేంద్ర ప్రసాద్ (ఆహారం, వ్యవసాయం), అసఫ్ అలీ (రైల్వే), జగ్జీవన్ రావ్ (కార్మిక), ముస్లిం లీగ్ నుంచి లియాఖత్ అలీ ఖాన్ (ఆర్థిక), టిటి చుంద్రిగర్ (వాణిజ్యం), అబ్దుర్ రబ్ నిష్తార్ (కమ్యూనికేషన్లు), గజాన్ఫార్ అలీ ఖాన్ (ఆరోగ్యం), జోగీంద్రనాథ్ మండల్ (న్యాయం. ఈయన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వంలో అదే శాఖను నిర్వహించి, తరువాత భారత్ వచ్చారు). భారత్‌లో తొలిసారి భారతీయులతో ఏర్పడిన సంకీర్ణం ఏర్పాటులో గాంధీజీ పాత్ర ఏమిటి? కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నెహ్రూ ఎంపిక కావాలన్న తన ఆకాంక్షను 1946 ఏప్రిల్ 20న గాంధీజీ వ్యక్తం చేశారు. అప్పటికే జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎక్కడ లేని ప్రాముఖ్యం వచ్చింది. స్వతంత్ర భారతదేశ ప్రధానిగా కాంగ్రెస్ అధ్యక్షుడే ఎన్నికవుతాడు. నిజానికి ఆ పదవిని తాను కూడా ఆశించానని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. కానీ ఈ ఇద్దరినీ కాకుండా 15 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు గాను 12 సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను ఎన్నుకున్నాయి. మిగిలిన మూడు కమిటీలు ఓటు చేయలేదు. ఈ సంగతి స్వయంగా గాంధీజీయే నెహ్రూకు చెప్పారు. రెండో స్థానం నెహ్రూకు ఆమోదయోగ్యం కాదనీ గాంధీయే చెప్పడంతో పటేల్ నెహ్రూకు అనుకూలంగా రంగం నుంచి తప్పుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వం 1947 ఆగస్ట్ 15 వరకు పనిచేసింది. గాంధీజీ కోరుకున్నట్టు నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26 నాటికి రాజ్యాంగ నిర్మాణం పూర్తి చేసింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే సంవత్సరం సర్దార్ పటేల్ కన్నుమూశారు. మరి...ఆయనను ప్రధానిని చేసి ఉంటే? - డా. గోపరాజు నారాయణరావు చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
మోదీ స్టేడియంగా మారిన మొతేరా
-
మొతేరా స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం
-
నరేంద్ర మోదీ స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
అహ్మదాబాద్: కొత్తగా నిర్మించిన స్టేడియానికి కొత్త పేరు పెట్టారు. ‘ఉక్కుమనిషి’ సర్దార్ పటేల్ పేరుతో ఉన్న మైదానానికి ఉక్కు సంకల్పంతో అడుగువేసే భారత ప్రధాన మంత్రి ‘నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం’గా మార్చారు. అయితే భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించేదాకా పేరు మార్పుపై గోప్యత పాటించారు. లాంఛనంగా ప్రారంభించాక రాష్ట్రపతి మాట్లాడుతూ ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్ర మోదీ మైదానం భారత్‌లో ఉండటం మనందరికీ గర్వకారణం’ అని అన్నారు. 2018లో ఆస్ట్రేలియాకు వెళ్లినపుడు 90 వేల సీట్ల సామర్థ్యమున్న మెల్బోర్న్ స్టేడియంను చూశానని... అదే అప్పుడు అతిపెద్ద మైదానమని ఇప్పుడు అతిపెద్ద స్టేడియానికి భారత్ వేదికయిందని కోవింద్ వివరించారు. మోదీ పేరెందుకంటే... గుజరాత్ క్రికెట్ సంఘం(జీసీఏ)లో భాగమైన ఈ స్టేడియం కాబట్టి అంతా సర్దార్ పటేల్ పేరుతోనే కొత్తగా ముస్తాబైందనుకున్నారు. బుధవారం జాతీయ, ప్రాంతీయ దినపత్రికల్లో నూతన సర్దార్ పటేల్ స్టేడియంలోనే పింక్‌బాల్ టెస్టు అనే రాశారు. కానీ రాష్ట్రపతి ఆవిష్కరించే సరికి ఇది మోదీ మైదానమని బయటపడింది. ఇది ఇప్పటి ప్రధాని, ఒకప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు. సీఎంగా ఉన్నప్పుడే ప్రపంచంలోని అన్ని స్టేడియాల్ని తలదన్నేలా ఓ ఎవరెస్ట్ అంతటి క్రికెట్ మైదానాన్ని నిర్మించాలనే సంకల్పంతో మోదీ పునాదిరాయి వేశారు. ఆఖరిదాకా అదే సంకల్పంతో పూర్తి చేశారు కాబట్టే మోదీ స్టేడియంగా మన ముందుకొచ్చింది. సర్దార్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్... మోదీ స్టేడియం ఆవిష్కరించినప్పటికీ సర్దార్ పటేల్ నామఫలకం కనుమరుగేం కాలేదు. ఎందుకంటే 17 ఎకరాల సువిశాల ప్రాంగణంలోనే ‘ది సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్’కు రాష్ట్రపతి భూమిపూజ చేశారు. ఇందులో ఫుట్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, కబడ్డీ, బాక్సింగ్, లాన్‌టెన్నిస్ తదితర స్టేడియాలను కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిర్మించనున్నారు. అధునాతన సదుపాయాలతో బహుళ క్రీడా మైదానాల సముదాయంగా సర్దార్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు అంతర్జాతీయ స్థాయి మెరుగులు దిద్దనున్నారు. అందుకే ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఇప్పుడు అహ్మదాబాద్ క్రీడానగరిగా రూపాంతరం చెందిందని అభివర్ణించారు. When I went to Australia in Nov 2018, I learnt that 90,000-seater Melbourne Cricket Ground was the largest in world. It is a proud moment for India today that Motera's 1,32,000-seater stadium has become the world's largest cricket stadium: President Ram Nath Kovind in Ahmedabad pic.twitter.com/p7IoBsHjyf — ANI (@ANI) February 24, 2021 Coupled with Sardar Vallabhbhai Patel Sports Enclave & Narendra Modi Stadium in Motera, a sports complex will also be built in Naranpura. These 3 will be equipped to host any international sports event. Ahmedabad to be known as the 'sports city' of India: Union Home Min Amit Shah pic.twitter.com/4qkn4gBs04 — ANI (@ANI) February 24, 2021 -
‘పటేల్‌ను నెహ్రూ ఆడ్డుకున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి (అంతరిక్ష వ్యవహారాల శాఖ ఇన్‌ఛార్జి) జితేంద్ర సింగ్ స్పందించారు. కశ్మీర్‌కు బదులుగా హైదరాబాద్‌ను పాకిస్తాన్‌కు ఇచ్చేందుకు తొలి హోంమంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్ పాక్‌కు ఆఫర్ చేశారని సైఫుద్దీన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జితేంద్ర సింగ్.. కశ్మీర్ విషయంలో పటేల్ జోక్యం చేసుకుని ఉంటే ఈ రోజు భారతదేశ చర్రిత మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై పటేల్ జోక్యం చేసుకోకుండా ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నియంత్రించారని, లేకపోతే కశ్మీర్ సమస్యకు అప్పడే శాస్వత పరిష్కారం ఏర్పడేదని పేర్కొన్నారు. హోంమంత్రి స్థానంలో ఉన్నా పటేల్‌ను ప్రధాని నెహ్రూ నిలువరించారని, కశ్మీర్‌పై నెహ్రూ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కశ్మీర్ సమస్య ఏర్పడిందని తెలిపారు. పటేల్ చర్యల కారణంగానే హైదరాబాద్ సంస్థానం విలీనం జరిగిందని, కశ్మీర్ సమస్య కూడా ఆనాడే ముగిసిపోయి ఉండేదని అన్నారు. ప్రస్తుత కశ్మీర్లో పాకిస్తాన్ భాగంగా ఉందని అది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. -
‘నెహ్రూ, పటేల్‌లను ఉరితీశారు’
న్యూఢిల్లీ : ‘సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, పండిట్ నెహ్రూ, భగత్ సింగ్, రాజ్‌గురు.. సబీ ఫాంసీ పర్ చఢె(అందర్నీ ఉరి తీశారు)’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఆయన మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా బహిర్గతమవడంతో వివాదమైంది. వివాదం రేగడంతో వివరణ ఇచ్చారు. ‘ఈ వార్త విని నవ్వుకున్నాను. స్వాతంత్య్రోద్యమంలో ప్రాణాలర్పించిన వారిని గౌరవిస్తూ మాట్లాడాను. గాంధీ, నెహ్రూ, నేతాజీలాంటి నేతలపేర్లను ప్రస్తావించాను. అక్కడితో ఆ వాక్యం పూర్తి చేసి, తర్వాత బ్రిటిష్ వారు ఉరితీసిన వీరుల పేర్లు చెప్పాను. కానీ ఈ రెంటినీ కలిపి చెప్పాననుకుంటున్నారు’ అని అన్నారు. -
నెహ్రూ, సర్దార్ పటేల్ ను కూడా ఉరితీశారా!
సాక్షాత్తు కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ చరిత్ర విషయంలో నాలుక కర్చుకున్నారు. భగత్ సింగ్, రాజ్ గురుతోపాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా బ్రిటిష్ పాలకులు ఉరితీశారని ఆయన తప్పులు ఒప్పజెప్పారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో సోమవారం జరిగిన ఓ బహిరంగ సభలో జవదేకర్ మాట్లాడారు. '1857లో ప్రారంభమైన స్వాతంత్ర్య సమరం 90 ఏళ్ల అనంతరం బ్రిటిష్ వాళ్లను వెళ్లగొట్టడంతో ముగిసింది. బ్రిటిష్ పాలకులు ఉరితీసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, పండిట్ (నెహ్రూ), భగత్ సింగ్, రాజ్ గురు వంటి స్వాతంత్ర్య పోరాటయోధులకు మనం ఈనాడు జోహార్లు అర్పిస్తున్నాం' అని పేర్కొన్నారు. దేశంలోని విద్యాశాఖ వ్యవహారాలను చూసే జవదేకర్ తన ప్రసంగంలో చారిత్రక వాస్తవాలను తప్పుగా ఉటంకించారు. నిజానికి భారత ప్రథమ ప్రధాని నెహ్రూ సహజ కారణాలతో 1964లో 74 ఏళ్ల వయస్సులో మరణించారు. భారత ప్రథమ కేంద్ర హోమంత్రి పటేల్ 1950లో 75 ఏళ్ల వయస్సులో ప్రాణాలు విడిచారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీగా మిగిలిపోగా.. భగత్ సింగ్, రాజ్ గురులను మాత్రం బిటిష్ సర్కారు ఉరితీసింది. భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తిరంగా యాత్రను సోమవారం చింద్వారాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జవదేకర్ మాట్లాడుతూ చరిత్రను విషయంలో నాలుక కర్చుకున్నారు. -
సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి వేడుకలు
-
'చాణక్యుడి తర్వాత పటేల్‌కే దక్కుతుంది'
న్యూఢిల్లీ : భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే క్రమంలో పటేల్ కృషిని మరువలేమన్నారు. శనివారం న్యూఢిల్లీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పటేల్ స్మారక స్తూపం వద్ద ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుడిగా, దేశానికి తొలి హోంశాఖ మంత్రిగా సర్దార్ పటేల్ దేశానికి చేసిన సేవలను మోదీ గుర్తు చేశారు. చాణక్యుడి తర్వాత దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత పటేల్‌కే దక్కుతుందని అన్నారు. ఆ లక్ష్యంగా దిశగా అందరూ కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పటేల్ జయంతి సందర్భంగా రాజ్‌పథ్‌లో ఏక్తా పరుగును ప్రధాని మోదీ జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రహోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. అలాగే ఏక్తా పరుగులో విద్యార్థులు, క్రీడాకారులు, నగర వాసులు భారీగా సంఖ్యలో పాల్గొన్నారు. -
మీడియాపై నిషేధానికి కాలం చెల్లింది: జైట్లీ
న్యూఢిల్లీ: దేశంలో మీడియాపై నిషేధానికి కాలం చెల్లిందని, ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని అమలు చేయడం దాదాపు అసాధ్యమని కేంద్ర ఆర్థిక, సమాచార-ప్రసారశాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఆలిండియా రేడియో(ఏఐఆర్) సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ స్మారకోపన్యాసంలో జైట్లీ మాట్లాడుతూ వివిధ కోర్టు తీర్పులు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి వల్ల దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ హక్కు విస్తరించిందన్నారు. అయితే ఈ హక్కు నేటికీ దుర్వినియోగమవుతున్నప్పటకీ మీడియా స్వేచ్ఛ నియంత్రణ విషయంలో ప్రభుత్వం వీలైనంత వరకు జోక్యం చేసుకోరాదని అభిప్రాయపడ్డారు. -
మేక్ ఇన్ ఇండియా నినాదానికి బ్రేక్
-
విమోచనా? విలీనమా?
స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన పరిణామాలకు, వ్యాఖ్యానాలకు దారితీసిన ఘటన తెలంగాణలో నిజాం ప్రభుత్వం పై భారత సైనిక చర్య ఘటన. నాటి హోమంత్రి సర్దార్ పటేల్ ఆదేశానుసారం నిజాం ప్రభుత్వంపై భారత సైన్యం జరిపిన దాడితో దేశం మొత్తంలో రాజ సంస్థానాల విలీనం అనేది ఒక కొలిక్కి వచ్చిన మాట నిజమే. కానీ 1948 సెప్టెంబర్ 17న జరిగిన ఆ ఘటన తెలంగాణ విమోచనా, పండుగ దినమా, విలీనమా, విషాదమా, విద్రోహమా అంటూ నేటికీ వివిధ వర్గాలు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నాయి. ఒక చారిత్రక ఘటన ముగిసి 66 ఏళ్లు అయిన తర్వాత కూడా సమాజం ఒక ఉమ్మడి అభి ప్రాయానికి రాకపోవడం ఆ ఘటనకున్న అపూర్వ ప్రాధాన్యతను, సంక్లిష్టతను స్పష్టం చేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తెలంగా ణతోసహా పూర్వపు నిజాం రాజ్యంలో అంతర్భాగా లుగా ఉండి ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విలీనమైన జిల్లాల్లోని ప్రజలు భారత సైనిక దాడి ఘటనను విమోచన దినంగానే జరుపుకుంటున్నా రు. పైగా, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ఈ విమోచనా దినోత్సవాలను అధికారికంగానే నిర్వహి స్తున్నాయి. కానీ, నిజాం నిరంకుత్వం నుంచి విము క్తి పొందిన ఆ చారిత్రక ఘట్టాన్ని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ నేటి తెలంగాణ రాష్ట్రంలో కానీ విమోచన దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రభు త్వాలే సాహసించకపోవడం ఒక వైచిత్య్రం కాగా, దాన్ని ఏ పేరుతో పిలవాలి అనే అంశంపై కూడా ప్రభుత్వాలు నోరు మెదపడం లేదు. అయితే ఆనాడు జరిగింది భారత్‌లో నిజాం రాజ్య విలీనం మాత్రమే అనే వాదన నాటి ప్రజల అభీష్టాన్ని ప్రతి బింబించకపోవచ్చని ఒక అభిప్రాయం ఉంది. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రమ హాసభ, ఆర్యసమాజం, హిందూ మహాసభ, తది తర సంస్థలు తిరుగుబాటు ఉద్యమాలు నడిపిందీ.. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన సాయుధ పోరా టంలో వేలాదిమంది ప్రజలు తమ ధన, మాన, ప్రాణాలు ఫణంగా పెట్టిందీ.., జైలు నిర్బంధాలకు వెరవకుండా పోరుబాటకు సాహసించినదీ నిజాం పాలన నుంచి విముక్తికోసమే. ఒక్కమాటలో చెప్పా లంటే ఆనాటి క్రూర పెత్తందారీతనం కోరల నుంచి బయటపడటానికి తెలంగాణ ప్రజానీకాన్ని ఏక తాటి మీద నిలిపిన తక్షణావసరం విమోచనే తప్ప విలీనం కాదని గ్రహించాలి. కానీ సైనిక చర్య అనంతరం రజాకార్ల దురాగ తాలపై ప్రతీకారచర్య పేరిట నిజాం సంస్థానంలో చెలరేగిన హింస, దాడులు, ఒక మతస్తులపై జరిగిన సాయుధ దాడులు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజలపై భారత సైన్యం జరిపిన దాడులు... పరిమా ణంలో తక్కువేం కాదని చరిత్ర రుజువులు చెబుతు న్నాయి. భారత ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై సైనికచర్య చేపట్టిన రోజు సెప్టెంబర్ 17 అనీ, నాలు గు వేల పైచిలుకు రైతాంగ సాయుధ పోరాట వీరు లు అమరులు కావడానికి, వేలాది ముస్లింలు ప్రతీ కారదాడుల్లో పాణాలు కోల్పోవడానికీ పునాది పడ్డ పీడ రోజు తెలంగాణ చరిత్రలో విద్రోహదినమే తప్ప అది విమోచనా కాదు, విలీనమూ కాదు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కానీ 1948 సైనిక చర్య ద్వారా జరిగింది దురా క్రమణతో కూడిన విలీనమే అని అప్పట్లో ప్రకటిం చిన, వాదించిన కమ్యూనిస్టులు కూడా విస్తృతార్థం లో సెప్టెంబర్ 17ను తెలంగాణలో పండుగలా జర పాలని గతంలోనే నిర్ణయించారు. విమోచన అంటే ముస్లింలను అవమానపర్చినట్లు అవుతుందనే వాద న తెలంగాణ ప్రభుత్వాన్ని విమోచన దినోత్సవం జోలికిపోకుండా చేస్తున్నట్లుంది. కానీ నాటి సాయు ధ పోరాటం ప్రధానంగా నిజాంకి వ్యతిరేకంగానే తప్ప ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. భావోద్వేగా లతో కూడిన నిజాంపై భారత సైనిక చర్యను విస్తృ తార్థంలో విమోచన దినంగా గుర్తించడమే నాటి ప్రజల త్యాగాలకు గుర్తింపుగా ఉంటుంది. (సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశత్వం నుంచి తెలంగాణ విమోచన జరిగిన సందర్భంగా) కొనగంటి మోహనరావు, హైదరాబాద్ -
ఆశయం కోసమే జీవించిన మాననీయుడు
భావోద్వేగంతో ఆశయం కోసం ప్రాణాలర్పించడం వేరు. ఆశయం కోసం యావజ్జీవితాన్ని అంకితం చేయడం వేరు. ఎస్వీ రాజు రెండో కోవకు చెంది నవారు. తనతో నా జ్ఞాప కాలు 60 ఏళ్ల వెనుకటివి. 20 ఏళ్ల వయసులో జీవిక కోసం దక్షిణాది నుంచి ముంబై వెళ్లిన రాజు అప్పట్లో.. అంటే 1959లో ఆవిర్భవించిన స్వతంత్ర పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా చేరారు. రాజా జీ స్థాపించిన ఈ పార్టీకి రంగా అధ్యక్షుడు కాగా ఎం ఆర్ మసాని ప్రధాన కార్యదర్శి. 1950 ప్రారంభంలో కమ్యూనిస్టు భావజాల ప్రచారం జాతిని ఊపేసింది. దాన్ని ఎదుర్కొనడా నికి ఏదో ఒకటి చేయమని సర్దార్ పటేల్, మసానీని కోరారు. కూర్చోవడానికి ఒకచోటు, రూ.5 వేలను ఇస్తే అలాగే చేయగలనన్నారు మసానీ. సర్దార్ ఆదే శంతో నాటి బాంబే రాష్ట్ర ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయ్ ఆ ఏర్పాట్లను పూర్తి చేశారు. అలా అందివ చ్చిన చిన్న మొత్తంతోనే మసానీ ఉదార తత్వశాస్త్రం పై సంబంధించిన పలు పుస్తకాలను ప్రచురించి పంపిణీ చేశారు. ఫ్రీడమ్ ఫస్ట్ అనే మాస పత్రికను కూడా ఆయ న ప్రారంభించారు. ఈ పత్రిక గత 64 ఏళ్లుగా నిరంత రాయంగా ప్రచురిత మవుతూవచ్చింది. 1998 మే 27న మసానీ అస్తమయంతో రాజు ఫ్రీడమ్ ఫస్ట్ పత్రిక తోపాటు ఇతర బాధ్యతల నూ స్వీకరించారు. అత్యవసర పరి స్థితి కాలంలో పేరొందిన ప్రెస్ ప్రభుత్వ ఆదేశాలకు పూర్తిగా లొంగిపోయినప్పుడు ది స్టేట్స్‌మన్, ఇండి యన్ ఎక్స్‌ప్రెస్, ఫ్రీడమ్ ఫస్ట్ వంటి పత్రికలే పత్రికా స్వాతంత్య్రం కోసం లేచి నిలబడ్డాయి. అరవైల మధ్యలో గుంటూరు వైద్య కళాశాలలో మెడికోగా ఉన్నప్పుడు రాజుతో నాకు పరిచయం ఏర్పడింది. ఆనాటినుంచి ఆయనతో స్నేహబంధం సాగిస్తూ వచ్చాను. 1963-64 మధ్యలో 17వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళ నలో, 1972-73నాటి చారిత్రాత్మక జై ఆంధ్ర ఉద్య మంలో రాజు మాకు మార్గదర్శకత్వం వహించారు. స్వతంత్ర పార్టీ కథ ముగిసిపోయాక రాజు ఏడేళ్ల పాటు మసానీ కార్యదర్శి గా పనిచేశారు. తర్వాత నాలుగేళ్ల పాటు గల్ఫ్ దేశాల్లో పనిచేశారు. కూడ బెట్టిన కొద్ది మొత్తంతో ముంబైలోని చెంబూరు ప్రాంతంలో చిన్న ఇల్లు కొనుక్కున్నారు. ముంబైకి వెళ్లడం ఎ ప్పుడు తటస్థించినా మసానీ, పాయ్, నాని పాల్కీవాలా, రాజుతో కాస్సేప యినా గడిపి వచ్చేవాడిని. ఆంధ్రప్రదేశ్‌లోని గుం టూరు, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, విశా ఖపట్నంతోపాటు మద్రాసు, కోయంబత్తూరుల్లో కూడా మేము విద్యపై పలు వర్క్‌షాపులను నిర్వ హించాం. రాజు ఆధ్వర్యంలో 1997లో గుంటూరు పట్టణంలో ‘50 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత’ భారత్ అనే అంశంపై మూడురోజుల వర్క్‌షాపును నిర్వ హించాం. 2004లో గుంటూరులోనే వ్యవసాయ సం క్షోభంపై సభ నిర్వహించాం. 1977లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ప్రొఫె సర్ ఎస్పీ అయ్యర్‌తో కలసి రాజు ‘విదర్ ది విండ్ బ్లోస్’ అనే గ్రంథాన్ని రచించారు. తన పుస్తకంలో ఆయన నాపేరు కూడా ప్రస్తావించారు. మసానీ శత జయంతి ఉత్సవాలను 2005 కాలంలో హైదరాబా ద్లో నిర్వహించాం. రైతుల సమస్యలపై హైదరాబా ద్లో ఎన్నో సభలు పెట్టాం. వైఎస్ రాజశేఖరరెడ్డి, జక్కర్, బర్నాలా వంటి ప్రముఖ రాజకీయనేతలు, స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తలు వీటిలో పాల్గొన్నా రు. గోపాలకృష్ణ గోఖలే శత వర్థంతి సందర్భంగా గతేడాది నవంబర్ 15న ఒక గోష్టి నిర్వ హించారు. రాజుతో అదే నా చివరి సమావేశం. ఉదారవాదంపై రాజాజీ, మినూమసానీ, రం గా వంటి ప్రముఖుల అమోఘమైన వారసత్వం గత 25 ఏళ్లుగా జాతిపై ప్రభావం చూపుతూ వస్తోంది. దురదృష్టవశాత్తూ రాజు తదితరులు తమ కాలం కన్నా పావు శతాబ్దం ముందుండేవారు. రాజుకు తన పరిమితులు తెలుసు. అందుకే ఆయన బహిరంగ జీవితంలోకి రాకుండా ఎల్లప్పుడూ తెరవెనుకే ఉండేవారు. (ఇటీవలే కన్నుమూసిన సోషలిస్టు చింతనాపరుడు ఎస్వీ రాజు స్మరణలో...) వ్యాసకర్త మాజీ పార్లమెంట్ సభ్యులు మొబైల్: 986637673 యలమంచిలి శివాజీ -
పటేల్ గిరీ!... పావురంపై గురి?
సాంఘిక శాస్త్రం నెహ్రూ 125వ జయంతి పేరుతో కాంగ్రెస్ పార్టీ ఒక అంతర్జాతీయ సెమినార్‌ను ప్రకటించింది. ఈ సెమినార్లో పాల్గొనడానికి దేశ, విదేశాలలోని ఎందరెందరో ప్రముఖులకు ఆహ్వానాలందాయి. కానీ, ఈ దేశ ప్రధానమంత్రిని మాత్రం పిలవలేదు. ఎందుకంటే, ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యక్తి. నెహ్రూను కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా భావిస్తున్నారు, కనుక పిలవలేదు. ఒక ప్రపంచ స్థాయి నాయకునికి, విశ్వమానవ ప్రేమికునికి ఇంత సంకుచితంగా నివాళి ఘటిస్తారా? ‘‘పటేల్.... ఈ మాట తెలుగువాళ్లకు చిరపరిచితం. తెలంగాణ ప్రాంతంలోని గ్రామాధికారి. ఆంధ్ర ప్రాంతంలో మునసబుకు సమాంతరం. తెలంగాణ ప్రాం తం చిరకాలం రాచరికవ్యవస్థలో మగ్గిన కారణంగా, ఫ్యూడల్ దోపిడీకి, పెత్తనా నికి, దాష్టీకానికి ప్రతీకగా పటేల్ అనేమాట నిలిచిపోయింది. అందుకే ఈ వ్యవస్థ రద్దయినప్పుడు ప్రజల నుంచి హర్షామోదాలు వ్యక్తమైనాయి. ఈ దేశా న్ని కాంగ్రెస్‌పార్టీ పరిపాలించిన కాలంలో కొంత నిర్లక్ష్యానికి గురైన జాతీయో ద్యమ నాయకుడు సర్దార్ పటేల్ స్మృతికి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం విశేషంగా ప్రాధాన్యమిస్తున్నది. ఈ విషయంపై ప్రచార మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ కూడా నడుస్తున్నది. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ పేరు వింటున్నప్పుడు మన పాత పటేల్ కూడా గుర్తుకొస్తున్నాడు. అంతమాత్రాన ఆ పటేల్‌కూ, ఈ పటేల్‌కూ ఏదో సంబంధం ఉన్నట్టు కాదు. అస్సలు లేదు. ఉండకూడదు. పావురం... అంటే కపోతం, శాంతికి చిహ్నం. దేశ తొలిప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూకు, పావురానికీ ఎంతో అనుబంధం. చిత్రకారులు గీసిన నెహ్రూ చిత్తరువుల్లో ఆయన ఎదపై ఎర్రగులాబీ ఎంత స్ఫుటంగా ఉంటుందో ఆయన చేతుల్లో ఎగరబోతున్న పావురం కూడా అంతే ప్రస్ఫుటంగా ఉంటుంది. శాంతిదూతగా పేరుగాంచిన నెహ్రూకు బ్రాండ్ అంబాసిడర్ పావురం. పావురం అంటే ప్రేమ అనే అర్థం కూడా ఉంది. జయంతి సందర్భంగా మళ్లీ నెహ్రూ మీద సాగుతున్న చర్చను చూస్తూవుంటే ఈ దేశంమీద, ప్రజలమీద, ప్రజాస్వామ్యం మీద, లౌకికభావనమీద ఆయనకున్న పావురం(ప్రేమ) కూడా గుర్తుకొస్తున్నది. పటేల్‌కూ, పావురానికి ఏమైనా పోలికవుందా? ఏమీ లేదు. ఫ్యూడల్ పటేల్‌కు, శాంతికపోతానికి వైరుధ్యం ఉంది. ఫ్యూడల్ పటేల్ అణచివేతకు గుర్తు, శాంతికపోతం స్వేచ్ఛకు సంకేతం. సర్దార్ పటేల్‌కూ, జవహర్లాల్ నెహ్రూకు ఏమైనా వైరుధ్యం ఉందా? ఏమీలేదు. పోలిక ఉంది. ఇద్దరూ శిఖర సమానులైన జాతీయోద్యమనేతలు. నవభారత నిర్మాణానికి పునాదులు వేయ డంలో ఒకరికొకరు చేదోడువాదోడుగా కలసి పనిచేసినవారు. అభిప్రాయాల్లో భేదాలున్నాయి. ఆలోచనల్లో తేడాలున్నాయి. నెహ్రూ ఉదారవాది, పటేల్ మిత వాది. నెహ్రూ సంపూర్ణ లౌకికవాది. పటేల్‌కు మెజారిటీ హిందువులపట్ల కొంత సానుభూతి. నెహ్రూ సౌమ్యుడు, సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారాన్ని కోరుకునేవాడు. అవసరమైతే కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడనితత్వం పటేల్‌ది. ఈ మాత్రం భిన్నాభిప్రాయాలు, భిన్న ఆలోచనలు కాంగ్రెస్‌పార్టీలో స్వాతంత్య్ర పోరాటకాలం నుంచీ ఉన్నాయి. మితవాద ధోరణుల నుంచి, మార్క్సిస్టు ఆలోచనా స్రవంతుల వరకూ ఎన్నో పాయలు కలసి ప్రవహించిన గంగానదిలా సాగింది కాంగ్రెస్ ప్రయాణం. ఉమ్మడి లక్ష్యాలను సమష్టిగానే కాంగ్రెస్‌పార్టీ సాధించింది. భిన్నాభిప్రాయాలు ఏనాడూ శత్రువైరుధ్యాలుగా మారలేదు. నెహ్రూ చనిపోయి యాభయ్యేళ్లయింది. సర్దార్ పటేల్ అంతకుముందే చని పోయారు. ఇంతకాలానికి ఇప్పుడు నెహ్రూ వర్సెస్ పటేల్ అనే రచ్చ బయ ల్దేరింది. ప్రస్తుత రాజకీయపార్టీల స్వార్థప్రయోజనాలకోసం ఈ రచ్చ అవసర మైంది. సర్దార్ పటేల్‌ను భారతీయ జనతాపార్టీ బహిరంగంగా కబ్జా చేసింది. నెహ్రూను ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం కుటుంబ ఆస్తిగా ప్రకటించుకుంటోం ది. నెహ్రూ 125వ జయంతి పేరుతో కాంగ్రెస్‌పార్టీ ఒక అంతర్జాతీయ సెమినా ర్ను ప్రకటించింది. ఈ సెమినార్లో పాల్గొనడానికి దేశ, విదేశాలలోని ఎంద రెందరో ప్రముఖులకు ఆహ్వానాలందాయి. కానీ, ఈ దేశ ప్రధానమంత్రిని మాత్రం పిలవలేదు. ఎందుకంటే, ప్రధానమంత్రి భారతీయ జనతాపార్టీ వ్యక్తి. నెహ్రూను కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా భావిస్తున్నారు, కనుక పిలవలేదు. ఒక ప్రపంచ స్థాయి నాయకునికి, విశ్వమానవ ప్రేమికునికి ఇంత సంకుచితంగా నివాళి ఘటి స్తారా? బీజేపీ-ఆరెస్సెస్‌లతో కూడిన సంఘ్ పరివార్ భావజాలానికీ, నెహ్రూ భావజాలానికీ సాపత్యం కుదరదు. నెహ్రూ లౌకికవాదం, ఉదారవాదం, సోష లిస్టు స్నేహం వగైరాల పొడ సంఘ్ పరివార్‌కు గిట్టదు. దేశంలో బీజేపీ ప్రధాన రాజకీయపక్షంగా ఎదిగిన నేపథ్యంలో సంఘ్ పరివార్‌కు ఒక జాతీయహీరో కావాలి. జాతీయోద్యమంలో దాని భావజాలానికి ఒక ప్రతీక కావాలి. ఒక మస్కట్ కావాలి. నెహ్రూ కాంగ్రెస్ మస్కట్‌గా మారాడు. మహాత్మాగాంధీని కబ్జా చేయడం సాధ్యంకాదు. ఆయన భావజాలం కూడా సంఘ్ పరివార్‌కు సరి పడేది కాదు. అలాగని విస్మరించనూలేదు. అందుకే ఆయన బోధించిన అనేకా నేక అంశాల్లో ఒకటైన పారిశుధ్యాన్ని తీసుకొని ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇంతటితో పారిశుధ్య ప్రచారక్ పాత్రకు మహాత్ముడు పరిమితం. జాతీయోద్యమం నుంచి తమకు కావలసిన హీరోను సర్దార్‌పటేల్ రూపంలో సంఘ్ పరివార్ చాలాకాలం కిందటే కనిపెట్టింది. నెహ్రూ భావజాలాన్నీ, తద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం దశాబ్దం క్రితం నుంచే పటేల్‌ను పక్కకు తీసే కార్యక్రమాన్ని పరివార్ చేపట్టింది. నెహ్రూ స్థానంలో పటేల్ తొలి ప్రధాని అయివున్నట్లయితే దేశ భవిష్యత్తు గొప్పగా ఉండేదనే అభిప్రాయాన్ని అది ప్రచారంలో పెట్టింది. బాబ్రీమసీదు విధ్వంసం అనంతరం బీజేపీ నాయ కుడు అద్వానీకి అభినవ సర్దార్ అనే బిరుదును కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఏకంగా గుజరాత్లో 200 మీటర్ల ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. తప్పేమీలేదు. ఒక జాతీయోద్యమ నాయకునికి ఘనమైన స్మృతి చిహ్నాన్ని నెలకొల్పడం స్వాగతించదగ్గదే. కానీ ఒక పెద్దగీతను చిన్న బుచ్చడం కోసం మరో పెద్ద గీత గీయాలన్న సూత్రం స్ఫూర్తితో ఈ భారీ విగ్ర హం ద్వారా నెహ్రూ స్థాయిని తగ్గిస్తామనుకుంటే మాత్రం జనం నవ్వుకుం టారు. ఒకటి రెండు సందర్భాలలో పటేల్ హిందూ అనుకూలవైఖరి తీసుకు న్నారు. మహాత్మాగాంధీ హత్యతో ఆరెస్సెస్‌పై నిషేధం విధించిన పటేల్ ఆ సంస్థ ఇకనుంచి తాము సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితమవుతామని ప్రక టించిన వెంటనే నిషేధాన్ని ఎత్తివేశారు. కొన్ని సందర్భాల్లో నెహ్రూ ఉదారవాద విధానాలను బహిరంగంగానే వ్యతిరేకించారు. ఇలాంటి కొన్ని సంఘటనలను భూతద్దంలో చూసుకున్న పరివార్ కాంగ్రెస్ పార్టీ పటేల్‌ను తమ హీరోగా క్రమ క్రమంగా తెరమీదకు తెచ్చింది. ఆ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇక సర్దార్ పటేల్ కాషాయ హీరో. మస్కట్ మాత్రమే సర్దార్ పటేల్. మస్తిష్కం నిండా ఫ్యూడల్ పటేల్. పరిపాలనలో పటేల్గిరీ ఛాయలు కనబడుతున్నాయి. చరిత్ర పుస్తకాల్లో మతభావాలు ప్రవేశించబోతున్నాయి. ప్రత్యామ్నాయాలు లేకుండానే ప్రణాళికా సంఘాల్లాంటివి (నెహ్రూ ఛాయలు) రద్దయిపోతున్నాయి. మహా రాష్ర్ట ప్రభుత్వం బలనిరూపణ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన తీరు మనకు కనిపించింది. కశ్మీర్ వంటి సున్నిత రాష్ర్టంలో హిందువును ముఖ్యమంత్రిని చేయాలనే తెంపరితనం కనబడుతున్నది. ఆలోచనల మీద నిఘా వేస్తున్నారు. అభిప్రాయాలకు కాపలా కాస్తున్నారు. ఆడ-మగ స్నేహంపై ఆంక్షలు పెడుతున్నారు. ‘మోరల్ పోలీసింగ్‘ మొదలైంది. ఇదంతా ఏరకమైన పటేల్ గిరీ? సర్దార్ పటేల్ గిరీ మాత్రం కాదు. ఇప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇమేజ్‌పై పరోక్ష యుద్ధం జరుగు తున్నది. ఆ ఇమేజ్ మాటున ఉన్న అసలు వ్యక్తిని ఒక్కక్షణం స్ఫురణకు తెచ్చు కుందాం. నెహ్రూ తొలి భారత ప్రధాని. పదిహేడేళ్లపాటు ఆయన ప్రధానిగా ఉన్నారు. అంతకుముందు స్వాతంత్య్ర పోరాటంలో మరో పదిహేడేళ్లు జైల్లో ఉన్నారు. జైలు జీవితాన్ని ఆయన చరిత్ర పరిశోధనకు అంకితం చేశారు. భారత దేశచరిత్ర, సంస్కృతితో పాటు ప్రపంచదేశాలు- వాటి పరిణామాలను విస్తృ తంగా అధ్యయనం చేశారు. జైల్లో ఉండగానే ఆయన రాసిన గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా వంటి గ్రంథాలు ప్రసిద్ధ చరిత్రకారులు రాసిన పాఠ్యపుస్తకాలకు దీటుగా గౌరవాన్ని పొందాయి. భారతదేశ చరిత్రను ప్రత్యేక శ్రద్ధాసక్తులతో ఆయన పరిశోధించారు. తొలినాటి షోడశ మహాజనపద గణరాజ్యాలనూ, వాటి ప్రజాస్వామిక లక్షణాలను సంభ్రమాశ్చర్యాలతో తిలకిం చాడు. రాజేంద్రచోళుడు ఆగ్నేయాసియాను జయించకముందే, కనిష్కుడు సెంట్రల్ ఆసియాను పాలించకముందే మనదేశంలో వర్ధిల్లిన బౌద్ధం యావత్తు ఆసియాఖండంలో గురుపీఠం సాధించిన వైనాన్ని ఆనందోద్వేగాలతో పరిశీలిం చాడు. అనేకజాతులు, అనేకభాషలు, అనేక సంస్కృతులు, అనేక తెగలు, పొంత నలేని ఆచారవ్యవహారాలు, ఎంత వైవిధ్యభరితమైన దేశం? అయినా, సహస్ర భిన్నాంశాలను కలుపుతూ ఏదో అంతర్వాహిని ప్రవహిస్తున్నది. ఆ అంతర్వా హినిలో భారతీయ ఆత్మను నెహ్రూ సందర్శించాడు. భిన్న జాతుల ప్రదేశంగా ఉన్న భారతదేశాన్ని ఒక భారతజాతిగా నిర్మించడానికి నెహ్రూకు చరిత్ర అధ్య యనం ఉపకరించింది. ఈ అధ్యయనం పర్యవసానమే నెహ్రూ ఉదారవాదం, లౌకికవాదం, ప్రాపంచిక దృక్పథం. నెహ్రూ పరిపాలనాకాలంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. చైనా యుద్ధం, షేక్ అబ్దుల్లా అరెస్ట్ వంటి కొన్ని తప్పిదాలకు నెహ్రూ కారకుడే. అయితే వాటన్నిటినీ మించి వెనుకబడిన ఈ వ్యవసాయక దేశాన్ని ఆధునిక భారత్‌గా అడుగులు వేయించిన వ్యక్తి నెహ్రూ. భారతదేశంతోపాటు వలస పాలన నుంచి విముక్తి పొందిన అనేక దేశాలు ప్రజాస్వామ్య ప్రయోగంలో విఫలమైనప్పటికీ భారత్ మాత్రం అగ్రశ్రేణి ప్రజాస్వామ్యంగా వర్ధిల్లగలిగిం దంటే అది నెహ్రూ చలవే. నాజర్, సుకర్ణో. టిటో వంటి నేతలను కలుపుకుని నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమం మరో ప్రపంచయుద్ధం జరగకుండా నిరోధించిందనడంలో సందేహంలేదు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భార తీయ పెట్టుబడిదారి వర్గం రైల్వేలు, ఉక్కుపరిశ్రమలు వంటి భారీ పరిశ్రమలను స్థాపించేంత బలంగా లేదు. అందుకే భారీ పరిశ్రమలను ఆయన ప్రభుత్వ రంగంలో ప్రారంభిస్తూ మిశ్రమ ఆర్థికవ్యవస్థను నిర్మించారు. ఈ ప్రభుత్వరంగ సంస్థలే భవిష్యత్తులో ఒక బలమైన మధ్యతరగతి ఆవిర్భావానికి కారణమైన విషయం మరువరాదు. ఇప్పటికీ దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలుగా వెలుగొందు తున్న ఐఐటీలు, ఐఐఎమ్‌లూ నెహ్రూ మానసపుత్రికలే. అణ్వస్త్ర రంగంలో, అంతరిక్ష రంగంలో దేశం సాధించిన విజయాలూ నెహ్రూ దూరదృష్టి ఫలితాలే. మతాలుగా, జాతులుగా, ప్రాంతాలుగా ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఒక భారతజాతిగా అజేయంగా నిలబడిందంటే అందుకు కారణం నెహ్రూ అవలంబించిన ఉదారవాద, లౌకిక విధానాలే. మేరు పర్వతం లాంటి నెహ్రూ వ్యక్తిత్వాన్ని మరుగుజ్జుగా చూపడం ఎవరికీ సాధ్యమయ్యే పనికాదు. -
నెహ్రూ, పటేల్ ఇద్దరూ స్మరణీయులే
త్రికాలమ్ వాస్తవాలు పవిత్రమైనవి. వాటిని వక్రీకరించకూడదు. వ్యాఖ్యానం మీ ఇష్టం (ఫ్యాక్ట్స్ ఆర్ సేక్రెడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ). ఆ విధంగా రాసిన చరిత్రను ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు అన్వయించుకోవచ్చు. అన్వయస్వేచ్ఛ చరిత్ర రాసేవారికే కాదు. చదివేవారికీ ఉంటుంది. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఇది మెట్టవేదాంతం కాదు. వర్తమాన రాజకీయాలు చెబుతున్న గుణపాఠం. ఇంత కాలం నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని విశ్వసించాం. ఇప్పుడు నవభారత నిర్మాణం చేసిన అధినాయకుడు సర్దార్ పటేల్ అంటూ ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటిస్తున్నారు. చరిత్ర ఎప్పటికీ ఒకే తీరుగా ఉండదు. రాజ్యం ఎవరి చేతుల్లో ఉంటుందో చరిత్ర కూడా వారు చెప్పినట్టే నడుస్తుంది. పాలకులు మారినప్పుడు, కొత్త భావజాలాలకు ఆధిపత్య స్థానం దక్కినప్పుడు చరిత్రలో దిద్దుబాటు ప్రయత్నం జరగడం సహజం. అందుకు ప్రతిఘటన ఎదురు కావడం అంతే సహజం. ఒక తప్పును దిద్దే క్రమంలో మరో తప్పు చేసే అవకాశం కూడా లేకపోలేదు. చరిత్ర సృష్టించినవారికి కూడా చరిత్రలో శాశ్వత స్థానం ఉంటుందనే నమ్మకం లేదు. చరిత్ర గతితో పాటు చరిత్ర పురుషులకూ స్థానభ్రంశం అనివార్యం. ఈ సత్యం తెలిసినవారు చరిత్రను చదివే సమయంలో పాలకవర్గ భావజా లాన్నీ, సిద్ధాంతాలనూ మదిలో పెట్టుకుంటారు. మినహాయింపులూ, జోడింపులూ చేసిన తర్వాతనే చరిత్రను సవ్యంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. స్మృతికి రంగులు పులమొద్దు మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్‌ల జయంతి, వర్ధంతులు మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించాలనీ, ఇతర నాయకుల పుణ్యతిథులను వారి ట్రస్టులో, కుటుంబ సభ్యులో నిర్వహించాలనీ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. శుక్రవారం నాడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా మరో అడుగుగా చెప్పుకోవచ్చు. ఇందిరాగాంధీ వర్ధంతి కూడా అదే రోజు అని గుర్తు చేస్తూ, ఆమె మరణం తర్వాత సిక్కుల ఊచకోత దేశ సమైక్యతపైన ఖడ్గ ప్రహారం వంటిద ంటూ మోదీ వ్యాఖ్యానించడం మానుతున్న గాయాన్ని రేపడమే. దీనికి ప్రతిగా లౌకికవాదులుగా చెప్పుకునేవారు గోధ్రాలో ముస్లింల ఊచకోత గురించి ప్రస్తావించి అటువంటి వ్యాఖ్యలే చేయవచ్చు. ప్రయోజనం ఏమైనా ఉంటుందా? పటేల్‌ను అభినవ బిస్మార్క్‌గా అభివర్ణించి నవభారత చరిత్రలో ఆయనకు సముచితమైన స్థానం కల్పించాం. అంతకంటే ఉన్నతమైన స్థానం కల్పిం చాలని కొత్త పాలకులు అనుకుంటే అందుకు అభ్యంతరం లేదు. ఆ క్రమంలో అంతే ఉన్నతులైన ఇతర నాయకుల స్మృతిని కించపరచడం అనవసరం. చరిత్రలో కొందరు మహానుభావులకూ, త్యాగమూర్తులకూ అన్యాయం జరిగిం దనే అభిప్రాయం ఈ దేశంలో చాలామందికి ఉంది. నెహ్రూ ఆలోచనా విధానం, మార్క్స్ తాత్వికత కలబోసి సమన్వయం సాధించి స్వాతంత్య్రానంతరం చేసిన చరిత్ర రచనలో పాఠకులకు లౌకిక దృష్టి ప్రసాదించాలనే సంకల్పం ఉండి ఉంటుం ది. బాలల మస్తిష్కాలలో సర్వమత సహనాన్ని ప్రోదిచేయాలన్న తాపత్రయం కూడా ఉండి ఉండవచ్చు. లేకపోతే అక్బర్ చక్రవర్తిని కీర్తించే పాఠ్యాంశాలు ఉండేవి కావు. చరిత్రలో దిద్దుబాట్లు అవసరమనే అభిప్రాయం నరేంద్రమోదీకి ప్రధాన మంత్రి అయిన తర్వాతనే వచ్చిన ఆలోచన కాదు. 2012 మేలో ఉదయపూర్‌లో రాణాప్రతాప్ 472వ జయంత్యుత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ ఇదే రకమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. స్వీయచరిత్రను విస్మరించినవారు చరిత్ర సృష్టించజాలరనే గొప్ప సత్యాన్ని ఆనాడే చెప్పారు. రాణా ప్రతాప్ గోవులనూ, మహిళలనూ, పాఠశాలలనూ, దేవాలయాలనూ రక్షించాడు కనుక ఆయన ఈ రోజు జీవించి ఉంటే కుహనా లౌకికవాదులు ఆయన మీద కూడా రాళ్ళు వేసేవారంటూ ధ్వజమెత్తారు. సముజ్వలమైన గతాన్ని, దేశంకోసం ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావులను విస్మరించడం ఈ జాతి దురదృష్టమని అంటూ త్యాగాలు చేసింది ఒక్క కుటుంబం మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. శ్యామాజీ కృష్ణ వర్మ, భగత్‌సింగ్, రాజగురు. వీర సావర్కర్ వంటి త్యాగపురుషులను గౌరవించాలంటూ ఉద్బోధించారు. అవాస్తవాల గుచ్ఛం చరిత్రను సవరించే ప్రయత్నాలు జరగడం ప్రపంచంలో ఇదే ప్రథమం కాదు. సోవియెట్ యూనియన్‌లో కృశ్చెవ్ అధికారంలోకి రాగానే స్టాలిన్ ఆనవాలు లేకుం డా చేశాడు. పైగా స్టాలిన్ డాన్స్ చేయమంటే మేమంతా డాన్స్ చేసేవాళ్ళం అంటూ పూర్వాధినేతను అవహేళన చేసేవాడు. బ్రెజ్నేవ్ పగ్గాలు చేతబట్టిన తర్వాత కృశ్చెవ్కూ అదే మర్యాద జరిగింది. యూరీ గగారిన్ అంతరిక్ష యానం చేసి తిరిగి వచ్చిన చారిత్రక సందర్భంలో అతనికి స్వాగతం చెబుతూ కృశ్చెవ్ పుష్పగుచ్ఛం ఇచ్చాడు. బ్రెజ్నేవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోవియెట్ యూనియన్ టెలివిజన్ చానల్స్‌లో అప్పటి దృశ్యాన్ని సందర్భవశాత్తూ చూపించినప్పుడు గగారిన్ పుష్ప గుచ్ఛం అందుకుంటూ కనిపించేవాడు కానీ దాన్ని అందిస్తున్న కృశ్చెవ్ కనిపించే వాడు కాదు. చేయి మాత్రమే కనిపించేది. కృశ్చెవ్ కనిపించకుండా కత్తిరించేవారు. ఈ ఉదంతాన్ని గ్లాస్‌నోస్త్, పెరిస్త్రోయికా గురించి రాస్తూ గోర్బచేవ్ స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు రష్యాలో సర్వత్రా పుతిన్ ఒక్కడే. చైనా రాజకీయం కొంచెం భిన్నం. మావో హయాంలో జరిగిన సాంస్కృతిక విప్లవం ఘోరమైన తప్పిదం అంటూ 1956 అనంతర మావో పాలనను నిశితంగా విమర్శించే తీర్మానాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ 1981లో ఆమోదించింది. అయినప్పటికీ మావోను మహానాయకుడుగా, చైనా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా, సిద్ధాంతకర్తగా డెంగ్ ప్రభుత్వం గుర్తించి స్మృతిశాల నిర్మించింది. 1966లో మొదలైన సాంస్కృతిక విప్లవంలో అప్పుడు అధికారిగా ఉన్న డెంగ్‌ను మావో ప్రభుత్వం జైల్లో కుక్కింది. డెంగ్ కుటుంబ సభ్యులను వేధించింది. అయినా సరే, మావో స్మృతికి భంగం కలగకుండా డెంగ్ ఉదాత్తంగా వ్యవహరించాడు. తొలి ఎన్డీఏ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి బంగ్లాదేశ్ విమోచన తర్వాత ఇందిరాగాంధీని దుర్గగా, విజయేందిరగా ప్రస్తుతించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అటల్జీ అట్లా అనలేదని భారతీయ జనతా పార్టీ నాయకులు అంటారు. కానీ నెహ్రూ పట్లా, ఇందిరాగాంధీ పట్లా, చివరికి తనకంటే చిన్నవాడైన రాజీవ్‌గాంధీ పట్లా వాజపేయి మర్యాదగానే వ్యవహరించేవారు. మోదీ తరహా వేరు. ఆయన వ్యక్తిత్వం వేరు. చరిత్రలో కొన్ని అంశాలు ఎప్పటికీ వివాదాస్పదంగానే మిగిలిపోతాయి. ఇప్పటికీ స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్ బలగాలను ఓడించామని అమెరికన్లు చెప్పుకుంటారు. కానీ బ్రిటిష్‌వారు మాత్రం తాము అమెరికన్లకు స్వాతం త్య్రం ప్రసాదించామని అంటారు. ఇండియాలో మైసూరు యుద్ధంపైనా, కెరిబియన్ వలస దేశాలలో ఫ్రెంచ్, డచ్ సైనికులతో పోరాడటంపైనా దృష్టి కేంద్రీకరించిన బ్రిటిష్ ప్రభుత్వం సైన్యాన్ని అటు మళ్ళించింది. అమెరికాలోని పదమూడు కాలనీల కోసం పోరాటం వృథాప్రయాస అని నిర్ణయించుకుంది. ఇది బ్రిటిష్ చరిత్రకారుల వాదన. చరిత్ర ఎవరు రాస్తున్నారనే అంశంపైన కథనం ఆధారపడి ఉంటుంది. రొమెల్లా థాపర్ వంటి నెహ్రూ-మార్క్స్ తాత్విక చింతన కలిగిన చరిత్రకా రులు చేసిన నిర్ధారణలతో ఏకీభవించడం సాధ్యం కాని విశ్వాసాలు మోదీకీ, ఆయన ఉన్నతికి కారకమైన సంఘ్ పరివారానికీ ఉన్నాయి. ఇంతవరకూ చరిత్రను లౌకిక వాదులు వక్రీకరించారనే బలమైన అభిప్రాయం వారిది. లౌకికవాదులు రాసిన చరిత్రలో వేదకాలం నుంచి బుద్ధుడు, మహావీరుడు తదితరులు జీవించిన కాలం వరకూ చారిత్రకాంశాలను పరిగణనలోకి తీసుకోలేదని వారి ఫిర్యాదు. చరిత్రను రచించే క్రమంలో హిందూ మత గ్రంథాలనూ, హిందూ కథానాయకులనూ చిన్న చూపు చూశారని అరోపణ. తప్పులను సవరించాలని తపన. అవకాశం వచ్చింది కనుక సవరణలు చేయాలన్న ఆరాటం. వాస్తవానికి సంఘ్ పరివారం స్వయంగా కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నది. బాబా సాహెబ్ అంబేద్కర్‌కు పెద్ద పీట వేస్తున్నది. అంబేద్కర్‌ను పట్టించుకోని వామపక్షాలు మాత్రం ఇప్పటికీ తమ వైఖరిని సవరించుకోలేకపోతున్నాయి. వామపక్షాలు దళితులను పట్టించుకోలేదనీ, దళితులు వామపక్షాలను ఆదరించలేద నే అభిప్రాయం ఉండనే ఉంది. పవిత్రమైనవి వాస్తవాలు తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే తెలంగాణలో అన్ని పథకాలకూ ఇందిర, రాజీవ్ పేర్లే కొనసాగేవి. టీఆర్ఎస్ అధికా రంలో ఉంది కనుకనే ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఒక విశ్వవిద్యాలయానికి పెట్టారు. కాళోజీ స్మారక మందిరాన్ని గొప్పగా నిర్మించాలని నిర్ణయించగలిగారు. కొమురం భీమ్కూ, ఐలమ్మకూ, బతుకమ్మకూ మునుపెన్నడూ లేని గౌరవం లభించింది. గోలకొండ దశ తిరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కనుక ఇక అన్ని పథకాలకూ ఎన్టీ రామారావు పేరు పెడతారు. మే ఎన్నికలలో తెదేపా ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొంది ఉంటే అవే కార్యక్రమాలకు వైఎస్ పేరు పెట్టేవారు. అధికారం ఎవరిదన్నదే ప్రశ్న. ఢిల్లీకి రాజైన మోదీ కత్తికి ఇప్పట్లో ఎదురులేదు. చరిత్రను తిరగరాయక తప్పదు. కొత్త చరిత్ర ఉంటుంది. లౌకికవాదులు రాసిన పాత చరిత్రా ఉంటుంది. బహుళత్వాన్ని స్వాగతించవలసిందే. కానీ వారూ, చరిత్రకారులు ఒక్క నియమం పాటిస్తే చాలు. జర్నలిజంలో పాటించే మౌలికమైన సూత్రం: వాస్తవాలు పవిత్రమైనవి. వాటిని వక్రీకరించకూడదు. వ్యాఖ్యానం మీ ఇష్టం (ఫ్యాక్ట్స్ ఆర్ సేక్రెడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ). ఆ విధంగా రాసిన చరిత్రను ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు అన్వయించుకోవచ్చు. అన్వయస్వేచ్ఛ చరిత్ర రాసేవారికే కాదు. చదివేవారికీ ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదన్న సత్యాన్ని చరిత్ర రాసేవారూ, రాయించేవారూ గుర్తుపెట్టుకుంటే మేలు. -
హైదరాబాద్ విలీనం పటేల్ ఘనతే!
సాక్షి, హైదరాబాద్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ లేకుంటే నేడు హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగమై ఉండేది కాదేమోనని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. మనమంతా భారతీయులమని గర్వంగా చెప్పుకొంటున్నామంటే ఆ కీర్తికి పటేల్ మాత్రమే కారణమని, హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేసిన ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ను నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు... హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం 7.45కు అసెంబ్లీ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ‘ఐక్యతా పరుగు’ను నిర్వహించారు. దీనిని రాజ్‌నాథ్‌సింగ్ జెండావూపి ప్రారంభించారు. అంత కు ముందు ఆయన అసెంబ్లీ ఎదురుగా ఉన్న పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. అనంతరం ప్రసంగిస్తూ.. భారతదేశం అఖండంగా, సమగ్రంగా ఉండడం ఇష్టంలేని ఆంగ్ల పాలకులు.. వెళ్లిపోయేముందు వందలాది సంస్థానాలకు స్వతంత్ర నిర్ణయాధికారం ఇచ్చారని.. దాంతో అల్లర్లు కూడా చెలరేగాయని గుర్తుచేశారు. అనంతరం దేశంలోని 562 సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసిన ఘనత పటేల్‌కే దక్కుతుందన్నారు. పటేల్ జయంతి సందర్భంగా దేశం సమైక్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. కాగా ఐక్యతాపరుగులో పాల్గొనడానికి తరలి వచ్చిన పాఠశాలల విద్యార్థులు, బీజేపీ కార్యకర్తలతో రాజ్‌నాథ్‌సింగ్ తెలుగులో సమైక్య ప్రతిజ్ఞ చేయించడం ఆకట్టుకుంది. అసెంబ్లీ నుంచి బయలుదేరిన ఈ ర్యాలీ ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. చివరగా బీజేపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, మురళీధర్‌రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా, పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. నేర నిరోధానికి వ్యూహాలు రచించాలి: రాజ్‌నాథ్ సింగ్ పోలీసు అధికారులు ఏదైనా ఘటన జరగడానికి ముందే దాన్ని గుర్తించాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మావోయిజం వంటి వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి, సైబర్ నేరాలు నిరోధించడానికి వ్యూహాలు సిద్ధం చేయూలని సూచించారు. 2013-14 గణాంకాల ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లో కంటే ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ పెరుగుదల నమోదు కావడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీలో (ఎన్పీఏ) శుక్రవారం జరిగిన 66వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్‌కు రాజ్‌నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఈ 66వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల్లో 21 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని, ఈ సంఖ్య 50 శాతానికంటే ఎక్కువ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రస్తావన లేని ప్రసంగం కేంద్ర హోం మంత్రి ప్రసంగంలో ఎక్కడా తెలంగాణ రాష్ట్ర ప్రసావన రాలేదు. ప్రసంగం ప్రారంభంలో అధికారులకు స్వాగతం పలుకుతూ ‘ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు’అని వ్యాఖ్యానించడంతో పలువురు విస్మయానికి గురయ్యారు. -
మోదీకి కానుకగా పటేల్ వస్తువులు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అపూరమైన కానుక స్వీకరించారు. మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ వాడిన వ్యక్తిగత వస్తువులను మోదీకి బహూకరించారు. పటేల్ 139 జయంతి సందర్భంగా మంజరి ట్రస్ట్ర్ వీటిని అందజేసినట్టు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పటేల్ వాడిన ప్లేట్లు, కప్‌లు, సాసర్లు మోదీకి అందజేశారు. పటేల్ మనవడు దహ్యాభాయ్ పటేల్ ఆయన భార్య లూయ్ వీటిని మంజరి ట్రస్ట్ ద్వారా మోదీకి పంపించారు. భారత వారసత్వంలో పటేల్ ఉపయోగించిన వస్తువులు కీలకమని మోదీ అన్నారు. వీటిని భద్రపరచడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని మోదీ చెప్పారు. -
కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ చురకలు
-
సర్దార్ పటేల్ లేకుంటే గాంధీ లేరు: మోదీ
న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే మహాత్మా గాంధీ పోరాటం సైతం అసంపూర్తిగా మిగిలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ పటేల్, గాంధీ పాత్ర అసాధారణమని, ఉద్యమాన్ని బలోపేతం చేసిందని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం పటేల్ 139 జయంతిని పురస్కరించుకుని మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. పటేల్ జయంతిని కేంద్రం జాతీయ ఏక్తా దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలో నిర్వహించిన సమైక్యత పరుగులో మోదీ పాల్గొనగా, వేలాదిమంది ఆయనను అనుసరించారు. అంతకుముందు పార్లమెంట్‌కు సమీపంలోని పటేల్ విగ్రహానికి మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశానికి పటేల్ చేసిన సేవలను కొనియాడారు. పటేల్ తన జీవితాన్ని జాతి సమగ్రత కోసం అంకితం చేశారన్నారు. ఇదే రోజు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్థంతి. మోదీ ఇందిరను గుర్తు చేసుకుంటూ.. 30 ఏళ్ల క్రితం దురదృష్టవశాత్తు ఇదే రోజు దారుణం చోటుచేసుకుందని అన్నారు. 1984లో జరిగిన అల్లర్లు జాతి సమగ్రతను దెబ్బతీశాయన్నారు. కాంగ్రెస్ సంకుచిత సిద్ధాంతాల కోసం చరిత్రను, వారసత్వాలను చీల్చవద్దని మోదీ హితవు పలికారు. కాగా ఇందిరా గాంధీకి మోదీ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. -
పటేల్ తొలి ప్రధాని అయివుంటే ...
న్యూఢిల్లీ : దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలి ప్రధానమంత్రి అయ్యి ఉంటే దేశ పరిస్థితి మరో విధంగా ఉండేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ ఐక్యత పరుగులో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పటేల్ దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన నేతల్లో మొట్ట మొదటి వ్యక్తి అన్నారు. మహాత్మాగాంధీకి నెహ్రు, పటేల్ రెండు కళ్లు, చెవుల్లా వ్యవహరించేవారన్నారు. అయితే గాంధీ మరణాంతరం పటేల్‌ను విస్మరించారని వెంకయ్య విమర్శించారు. దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా పరుగు నిర్వహించి పటేల్‌ను మనం ఘనంగా స్మరించుకున్నామని ఆయన అన్నారు. మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్థంతిపై కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. పటేల్ జయంతిని జాతీయ ఏకతా దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మాత్రం విస్మరించిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ చురకలు
న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ వర్థంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. అక్టోబర్ 31న సర్దార్ వల్లబాయి పటేల్ జయంతిని జాతీయ ఏకతా దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని విస్మరించి కాంగ్రెస్ వర్గాల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మోదీ మాట్లాడుతూ అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అని ఆయన తన జీవితాన్ని జాతి సమగ్రత కోసం అంకితం చేశారన్నారు. అయితే 30 ఏళ్ల క్రితం దురదృష్టవశాత్తు అదే రోజు దారుణం చోటుచేసుకుందని మోదీ అన్నారు. 1984లో జరిగిన అల్లర్లు జాతి సమగ్రతను దెబ్బతీశాయన్నారు. కాంగ్రెస్ సంకుచిత సిద్ధాంతాల కోసం చరిత్రను, వారసత్వాలను చీల్చవద్దని మోదీ హితవు పలికారు. కాగా ఇందిరా గాంధీకి మోదీ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. మరోవైపు 1984 అల్లర్లలో మరణించిన సిక్కులకు ప్రధాని గురువారం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 3,325 సిక్కు కుటుంబాలకు ప్రభుత్వం రూ.167 కోట్లు పరిహారం చెల్లించనుంది. కాగా ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం తరఫున ఎలాంటి కార్యక్రమాలను ప్రకటించలేదు. అలాగే, ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్‌ను ప్రధాని సందర్శించే విషయంపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
'కుట్రలను ఉక్కుపాదంతో అణిచిన సర్దార్ పటేల్'
న్యూఢిల్లీ: భారతదేశాన్ని ఏకీకృతం చేయడానికే ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్‌పటేల్ జీవితం అంకితం చేశారని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పటేల్ జీవితం ఎందరికో స్పూర్తిదాయకమని చెప్పారు. సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద నిర్వహించిన జాతీయ ఏక్ తా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన పటేల్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... దేశాన్ని ఐక్యంగా ఉంచే క్రమంలో సర్దార్ పటేల్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. స్వాతంత్య్ర అనంతరం దేశంలోని సంస్థానాల వీలినమే పటేల్‌లో ఉన్న దేశ ఐక్యతకు నిదర్శనమని చెప్పారు. భారతదేశ స్వాతంత్ర కాంక్ష, శక్తిని చాటిన యాత్ర దండియాత్ర. ఆ యాత్రలో మహాత్మునితో కలసి అడుగులోఅడుగు వేసి నడిచిన వ్యక్తి పటేల్ అని మోదీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో దేశంలోని రైతులందరిని ఏకతాటిపై నడిపి వ్యక్తి పటేల్ అని అన్నారు. కొత్త ఉత్సాహం, లక్ష్యంతో అడుగులు వేయాలని యువతకు మోదీ పిలుపు నిచ్చారు. దేశంలో జరిగిన అనేక కుట్రను ఉక్కుపాదంతో అణిచిన వ్యక్తి పటేల్ అని తెలిపారు. అనంతరం ఐక్యమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని మోదీ ఈ సందర్భంగా విజయ్‌చౌక్ వద్ద పాల్గొన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత ఐక్యత పరుగును జెండా ఊపి మోదీ ప్రారంభించారు. ఈ పరుగులో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. -
2022 నాటికి అందరికీ ఇళ్లు: వెంకయ్య
విజయవాడ బ్యూరో: సర్దార్ పటేల్ పేరుతో త్వరలోనే కొత్త గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించి 2022 నాటికి దేశంలో పేదలందరికీ ఇళ్లు కట్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆయన శుక్రవారం నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే అమలు చేస్తామని భరోసానిచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. రెండు ప్రభుత్వాలు విభేదాలను వీడి పనిచేయాలని సూచించారు. మతతత్వం అంటూ పడికట్టు పదాలతో కాలక్షేపం చేసే కమ్యూనిస్టులు అవసాన దశలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా భారత్‌ను బీజేపీ తీర్చిదిద్దుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన మాట్లాడుతూ దేశాన్ని అగ్రగామిగా చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. -
మహిళల భద్రత కన్నా పటేల్ విగ్రహమే మిన్న!
న్యూఢిల్లీ: మహిళల భద్రత, వారి సంక్షేమం కన్నా గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణమే ముఖ్యమైనదిగా మోడీ సర్కారు భావించింది. తాజా బడ్జెట్లో మహిళల భద్రత కోసం రూ. 150 కోట్లు, వారి సంక్షేమం కోసం రూ. 100 కోట్లు ప్రకటించిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. ప్రధానమంత్రి సొంతరాష్ట్రంలో నిర్మించ తలబెట్టిన ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహ ఏర్పాటుకు మాత్రం రూ.200 కోట్లను కేటాయించారు. 182 మీటర్ల ఎత్తుతో, రూ. 2,500 కోట్ల ఖర్చుతో అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే ఎత్తై సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ‘ఐక్యతా ప్రతిమ’ పేరుతో నిర్మించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే మోడీ తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి రూ. 200 కోట్లను కేటాయించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైట్లీ ప్రతిపాదనల్లో ఇదే అత్యంత నచ్చని ప్రతిపాదనగా నెటిజన్లు అభిప్రాయపడ్డారు. -
ఎదురు చూసిన భూకంపం
మోడీ గుజరాత్లో సర్దార్ పటేల్ మహా ప్రతిమను ప్రతిష్టించే ఏర్పాట్లు చేశారు. పటేల్ ప్రతిమను మించి మోడీ కీర్తిని పెంచడంలో సొంత పార్టీ కంటె కాంగ్రెస్, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎక్కువ కృషి చేశారు. వారు చేసిన ప్రతి విమర్శ తన ప్రతిష్టను పెంచేదిగా ఆయన మలచుకున్నారు. ఆ గుజరాత్ భూకంపం నరేంద్ర మోడీ అనే రాజకీయవేత్తకు జన్మనిచ్చింది. ఆయన రాజకీయ భారతంలో భూకంపం సృష్టించారు. జనవరి 26, 2001లో గుజరాత్‌లోని భుజ్ ప్రాంతం పెను భూకంపంతో కకావికలైంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘోర ప్రకృతి వైపరీత్యంతో ఇరవైవేల మంది చనిపోయారు. ఢిల్లీలో తన పార్టీ కార్యాలయంలో ఉన్న మోడీ వార్త తెలిసి, ఒక వ్యాపారవేత్త సాయంతో హెలికాప్టర్ మీద భుజ్ ప్రాంతం చేరుకున్నారు. ఆ తరువాతే అక్కడికి చేరుకోగలిగిన నాటి గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్, ‘ఈ మనిషి నా జీవితాన్ని దుఃఖభాజనం చేసేటట్టు ఉన్నాడు’ అని చుట్టూ అధికారులు ఉన్న సంగతి కూడా పట్టించుకోకుండా వ్యాఖ్యానించారు. అక్షరాలా అదే జరిగింది. భూకంప బాధితుల రక్షణకు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమైన కేశూభాయ్‌కి బీజేపీయే ఉద్వాసన పలకవలసి వచ్చింది. అదే సంవత్సరం అక్టోబర్‌కు కేశూభాయ్ స్థానంలో వచ్చిన కొత్త ముఖ్యమంత్రే నరేంద్ర దామోదరదాస్ మోడీ. మోడీ గుజరాత్ పద్నాలుగో ముఖ్యమంత్రి. ఆ రాష్ట్ర పద్నాలుగో ముఖ్యమంత్రే ఇప్పుడు భారత పద్నాలుగో ప్రధానమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. అలా నరేంద్రమోడీ అధికార రాజకీయాలకు అంకురార్పణ జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్లకి సెప్టెంబర్ 17, 1950న గుజరాత్‌లోని వాద్నగర్లో పుట్టిన మోడీ నోటిలో వెండి చెమ్చాతో భూమ్మీద పడినవాడుకాదు. తండ్రి దామోద రదాస్ మూల్‌చంద్ మోడీ రైల్వే స్టేషన్ దగ్గర మురికోడుతూ, దుమ్ముధూళితో నిండి ఉండే ఒక పేటలో ‘చాయ్‌వాలా’. సాయంత్రం బడి గంట కొట్టిన తరువాత ఉరుకులూ పరుగులతో వచ్చి దుకాణంలో తండ్రికి సాయం చేసేవాడాయన. తరువాత ఒక సోదరుడితో (వారు ఆరుగురు సోదరులు) కలసి వాద్నగర్ బస్ టెర్మినస్ దగ్గర మోడీయే ఒక దుకాణం ప్రారంభించారు. ఒకసారి హిమాలయాలకు వెళ్లినా, తిరిగి వచ్చి మళ్లీ తేనీరు అమ్మారు. ఆ తరువాతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ‘శాఖ’ వైపు అడుగులు వేశారు. అప్పటికి ఆయన వయసు పదిహేడు సంవత్సరాలు. నిజానికి ఎనిమిదో ఏటనే మోడీకి ఆరెస్సెస్‌తో పరిచయం ఏర్పడింది. ఒక సంక్షుభిత కాలంలో, దాని వెంట నడుస్తూ సామాజిక, రాజకీయ కార్యకర్తగా ఆవిర్భవించినవాడు నరేంద్రమోడీ. 1971లో పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేసింది. ఆ సమయంలో వాద్నగర్ మీదుగా సాగే రైళ్లలో ప్రయాణిస్తున్న సైనికులకు తేనీరు సరఫరా చేశారు మోడీ. అదంతా సైన్యం మీద గౌరవం. ఆ గౌరవంతోనే తనను కూడా ఒక సైనికుడిగా ఊహించుకునేవారాయన. ఆ వెంటనే ఆరెస్సెస్‌లో పూర్తి స్థాయి కార్యకర్త (ప్రచారక్)గా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్ ఆవిర్భావం, ఆ వెంటనే జరిగిన సాధారణ ఎన్నికలలో అసాధారణ శక్తిగా నిలిచిన నాటి ప్రధాని ఇందిరను జనసంఘ్ ప్రముఖుడు అటల్ బిహారీ వాజపేయి ‘దుర్గ’గా కీర్తించడం- ఇవన్నీ మోడీ సమీపంగా చూసిన రాజకీయ పరిణామాలు. నూనూగు మీసాల మోడీ వీక్షించిన మరో పెద్ద పరిణామం- సంపూర్ణ విప్లవం. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ బీహార్‌లో ప్రారంభించిన ఆ ఉద్యమానికి తీవ్రంగా స్పందించిన రాష్ట్రం గుజరాత్. ఆ నేపథ్యంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్షాలు కలసి పోటీ చేయడం రాజనీతి శాస్త్ర విద్యార్థి మోడీకే కాదు, దేశానికే ఆసక్తి కలిగించి ఉండాలి. ఐక్యమైన విపక్షాల శక్తి ముందు నాటి ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వం తలొంచింది. జూన్ 12, 1975న ఈ ప్రజా తీర్పు వెలువడింది. చిత్రంగా అదే రోజు ఈ దేశ రాజకీయాలను మలుపు తిప్పి, భారతీయ జనతా పార్టీ అనే ప్రత్యామ్నాయ శక్తి ఆవిర్భవించడానికి బీజం వేసిన మరో తీర్పూ వెలువడింది. అదే- అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ జగ్మోహన్లాల్ సిన్హా ఇచ్చిన తీర్పు. 1971 లోక్‌సభ పోరులో రాయ్‌బరేలీలో ‘అక్రమాలకు పా ల్పడినందుకు’ ఇందిర ఎన్నికను కొట్టివేస్తూ వెలువడిన సంచలనాత్మక తీర్పు అది. జూన్ 25న సుప్రీంకోర్టులో జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ దీనిపై స్టే ఇవ్వడానికి నిరాకరించారు. ఆ రాత్రే భారత ప్రజాస్వామిక చరిత్రలో చీకటిపుటను తెరుస్తూ ఇందిర ఎమర్జెన్సీ విధించారు. ప్రతిపక్షాలకు, ఆరెస్సెస్‌కు అదో కష్టకాలం. స్వాతంత్య్రం తెచ్చుకున్న పాతికేళ్లకు దేశం అత్యవసర పరిస్థితి గుప్పెటలోకి వచ్చింది. ఎమర్జెన్సీ తరువాత 1977 ఎన్నికలలో నాలుగు పార్టీలు కలసి జనతా పార్టీగా ఆవిర్భవించాయి. అందులో భారతీయ జనసంఘ్ ఒకటి. శ్యామాప్రసాద్ ముఖర్జీ స్థాపించిన ఈ పార్టీ నుంచి వచ్చిన వారే బలరాజ్ మధోక్, దీనదయాళ్ ఉపాధ్యాయ, వాజపేయి, అద్వానీ తదితరులు. అదే 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఈ పార్టీ నుంచి వచ్చిన నాయకుడే నరేంద్ర మోడీ కూడా. మన ప్రజాస్వామ్యాన్ని వజ్రసదృశం చేసిన ఈ పరిణామాలన్నీ చూసిన ఆ చాయ్ వాలా నేడు చాచా నెహ్రూ అధిరోహించిన స్థానం దగ్గరకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన సమయానికి మోడీ ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయలేదు. కానీ ఎన్నికల నిర్వహణలో అనుభవం గడించారు. నాలుగో పర్యాయం గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినపుడే మోడీని ప్రధానిని చేయాలన్న నినాదం మొదలయింది. నిన్న మొన్న ముగిసిన ఎన్నికల వరకు చాలా చిత్రంగా మోడీ ఢిల్లీ పీఠం అధిరోహించడానికి అనువైన వాతావరణం శరవేగంతో ఏర్పడిపోయింది. రెండు స్థానాలున్న బీజేపీని 89 స్థానాలకు తీసుకువెళ్లి ప్రబల శక్తిగా తయారు చేసిన వాడిగా మన్ననలను అందుకున్న అయోధ్య రథికుడు అద్వానీ సయితం అనూహ్యంగా పక్కకు తప్పుకోవలసి వచ్చింది. ఆ యాత్రలో మోడీ అద్వానీ వెంట ఉన్నారు. కాంగ్రెస్, ఇతర రాజ కీయ పక్షాలు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి మోడీ ‘మహాశక్తి’గా ఆవిర్భవించడానికి దోహదం చేశాయి. మోడీ గుజరాత్లో సర్దార్ పటేల్ మహా ప్రతిమను ప్రతిష్టించే ఏర్పాట్లు చేశారు. పటేల్ ప్రతిమను మించి మోడీ కీర్తిని పెంచడంలో సొంత పార్టీ కంటె కాంగ్రెస్, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎక్కువ కృషి చేశారు. వారు చేసిన ప్రతి విమర్శ తన ప్రతిష్టను పెంచేదిగా ఆయన మలచుకున్నారు. ప్రత్యర్థి విసిరినది రాయే కావచ్చు, కానీ అది పుష్పగుచ్ఛమని నమ్మించిన మాంత్రికుడాయన. మోడీ ప్రతి విమర్శ ప్రత్యర్థి విసిరిన పాచికకు సమాధాన మిస్తున్న ప్రతి పాచిక వలెనే శబ్దిస్తుంది. మోడీవి ‘నీచ రాజకీయాలు’ అని ప్రియాంక అంటే, దానిని ఆయన మలచిన తీరు పెద్ద కుదుపునకే కారణమైంది. మోడీ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న పాత సిద్ధాంతానికి పరిమితమైపోలేదు. దానికి నిదర్శనం- ఈ ఎన్నికలు. ఆయన లక్ష్యం కాంగ్రెస్‌ను నేల కరిపించడం. కానీ ఆ పనిలో తనను వ్యతిరేకించే రాజకీయ పక్షాలన్నింటినీ చిరునామా లేకుండా చేయగలిగారు. ఇదొక భూకంపాన్ని మరిపిస్తుంది. మోడీ మీద ఉన్న ఆరోపణల మాటెలా ఉన్నా ఆయన అరవై అయిదు సంవత్సరాల భారత రాజకీయాలలో ఇప్పుడొక సంచలనం. ఈ సంచలనం ఎంత కాలం సాగుతుందో ప్రత్యర్థులే కాదు, సొంత పార్టీ కూడా చెప్పలేదేమో! మోడీ సమాచారాన్ని ఒక ఆయుధంగా విశ్వసిస్తారు. ఈ చాయ్‌వాలా సృష్టించిన సంచలనం టీ కప్పులో తుపాను కాదని భారత్‌తో పాటు అగ్రదేశం అమెరికా కూడా నమ్ముతోందన్నదే ప్రస్తుత సమాచారం. - డాక్టర్ గోపరాజు నారాయణరావు -
ఎస్పీ కాలేజి శుభారంభం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ విద్యాసంస్థల క్రీడల్లో భాగంగా జరిగిన వాలీబాల్ టోర్నీలో సర్ధార్ పటేల్ (ఎస్పీ) కాలేజి శుభారంభం చేసింది. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో శనివారం జరిగిన వాలీబాల్ పోటీల్లో ఎస్పీ కాలేజి 25-12, 25-20 స్కోరుతో శ్రీవెంకటేశ్వర డిగ్రీ కాలేజిపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజి 18-25, 25-16, 15-13తో శ్రీలక్ష్మీనరసింహ స్వామి కాలేజి (భువనగిరి)పై గెలిచింది. మూడో మ్యాచ్‌లో ఎస్పీ కాలేజి 25-16, 25-12తో కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్ (కల్వకుర్తి)పై గెలిచింది. అంతకు ముందు ఈపోటీలను హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈక్రీడల్లో క్యారమ్, టెన్నికాయిట్, బాస్కెట్‌బాల్ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తారు. -
‘గతం’ గెలిపించలేదు
మోడీ ఆకర్షణకు కారణం ఆయన పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తుండటం కాదు. ఇందిరను లేదా పటేల్‌ను వాడుకుని గతాన్ని సొమ్ము చేసుకోవాలనుకునే వారు అంతకంటే చాలా పెద్ద అంశాన్ని గుర్తించడంలేదు. ఆర్థికవృద్ధిపై ప్రజలలో ఉన్న విశ్వాసం పుటుక్కున తెగిపోయింది. పెరిగే ధరలు, పడిపోతున్న ఆదాయాలు అథోగతికి పయనిస్తున్న ఆర్థికవ్యవస్థకు కొట్టొచ్చినట్టుగా కనిపించే సూచనలు. భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరాగాంధీలను గుర్తుకు తెచ్చుకున్న గత వారం రోజులూ ఒక ప్రశ్న నా మెదడును తొలిచేస్తూ వచ్చింది. బ్రిటన్ వలస పాలననాటి సంస్థానాలను మహనీ యుడు పటేల్ భారత యూని యన్‌లో విలీనం చేసినది ‘భారత్ రాజ్’ అనే మరో రాచరిక పాలనను నెలకొల్పడాని కేనా? అనేదే ఆ ప్రశ్న. పటేల్, ఇందిరలు నికార్సయిన జాతీయవాదులు. పటేల్ జాతీయవాదం తప్ప మరే ఇజం పరిమితీ లేని వారు. ఇందిర అలా కాదు. ఎన్నికల విజయావకాశాల తాప మానినిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న 1969లో ఆమె అడ్డదిడ్డపు సోషలిజాన్ని రక్షణగా కప్పుకున్నారు. ఆమె ఎంచుకున్న బలహీనమైన గులాబీ సోషలిజం శాలువా తాత్కాలిక వెచ్చదనమనే బూటకపు సౌఖ్యాన్ని కలుగ జేసింది. సంస్థానాధీశులు తమకు బ్రిటన్ నుంచి లభిం చిన హక్కులను వదులుకొని 1947లో భారత యూనియన్‌లో విలీనానికి అంగీకరించారు. అందుకుగానూ పటేల్ వారికి కొన్ని హామీలను ఇచ్చారు. వాటిని రద్దు చేయడమే (రాజభరణాల రద్దు) నాటి ఇందిర కార్యక్రమంలోని ప్రధానాంశం. అటుపిమ్మట 1975, 1976లలోని అత్యవసర పరి స్థితి కాలంలో గడ్డకట్టించే శీతల రాజకీయ వాతావరణం కమ్ముకుంది. ఆ సమయంలో ఇందిర వంశపారంపర్య పాలనను ఎంచుకున్నారు. సొంత పార్టీనే రాచరిక వ్యవస్థగా మార్చేశారు. ఒకప్పుడు నెహ్రూ, ఇందిరాగాంధీలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారుగా ఉండేవారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినదిగా మారిపోయింది. వంశపారంపర్య పాలన అనే భావన ఎంత ప్రబలమైనదంటే అరుదైన వైరస్ వ్యాధిలాగా అది భారతదేశంలోన్ని అన్ని రకాల సోషలిజాలకు సోకిపోయింది. దేవుని కంటే పార్టీ భావజాలానికే ఒకప్పుడు అధిక ప్రాధాన్యం ఇచ్చిన రామ్మనోహర్ లోహి యా సోషలిస్టు వర్గానికి ప్రత్యేకించి అది బలంగా సోకిం ది. ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్‌ల నేతృత్వంలోని పార్టీలలో ఆ రెండూ తలకిందులు కావడం అందుకు దిగ్భ్రాంతికరమైన ఉదాహరణ. వారిద్దరి విన్యాసాలు వారిపైనే గాక మరింత విశాలమైన ఉత్తర భారత రాజకీయాలపైన కూడా గణనీయమైన పర్యవసానాలను కలుగజేసాయి. ఉత్తర భారతంలో సోషలిస్టుల ప్రతిష్టకు పదే పదే తూట్లు పడుతుండటంతో కాంగ్రేసేతర శక్తుల స్థానాన్ని బీజేపీ భర్తీ చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ల రాజకీయ క్రీడలో సోషలిస్టులు మొదట్లోనే ఓడిపోయారు. ఆ మీదట ఉత్తరప్రదేశ్, బీహార్లలో కూడా ప్రాధాన్యాన్ని కోల్పోయారు. సిద్ధాంతరీత్యా ప్రజాస్వామ్యం అందరికీ సమాన అవకాశాల ప్రాతిపదకను సమకూరుస్తుంది. తద్వారా అది ప్రతిభ వికసించడానికి, ప్రతిభారాహిత్యం క్షీణించిపోవ డానికి తోడ్పడుతుంది. వంశపారంపర్య పాలన ప్రజాస్వామ్యానికి పరిమితిని విధిస్తుంది. ఎలాగైనా వంశపారంపర్య పాలనను అమలుచేయాలని ప్రయత్నించేటప్పుడు భావోద్వేగపూరితమైన చరిత్ర ద్వారా సమంజసత్వాన్ని సంపాదించాలనే వాంఛ పెరుగుతుంది. నాయనమ్మ ఇం దిర, తండ్రి రాజీవ్ హత్యల ద్వారా రాహుల్ తన వ్యక్తిగత ఆకాంక్షకు సమంజసత్వాన్ని కోరుకుంటున్నారు. పూర్వీకుల త్యాగాలతోనే ఎవరైనాగానీ అధికారం అందలం ఎక్కగలిగేట్టయితే మహాత్మాగాంధీ మునిమనుమడైన గోపాల్గాంధీ ఆ అన్వేషణకు దిగడం కచ్చితంగా ఉత్తమం కాదా? ఇందిరను లేదా పటేల్‌ను వాడుకుని గతాన్ని సొమ్ము చేసుకోవాలనుకునే వారు అంతకంటే చాలా పెద్ద అం శాన్ని గుర్తించడంలేదు. ఆర్థికవృద్ధిపై ప్రజలలో ఉన్న విశ్వా సం పుటుక్కున తెగిపోయింది. పెరిగే ధరలు, పడిపోతున్న ఆదాయాలు అథోగతికి పయనిస్తున్న ఆర్థికవ్యవస్థకు కొట్టొచ్చినట్టుగా కనిపించే సూచనలు. తల్లిదండ్రులు నిస్సహాయులమని భావిస్తుండటంతో యువత నిరాశానిస్పృహలకు గురికావడం మొదలైంది. అయినా వాళ్లు దేశం పట్ల నమ్మకం ఉంచాలనే భావిస్తున్నారు. అందుకే స్పష్టంగా కనిపిస్తున్న నిర్లక్ష్యంతో కూడిన యూపీఏ ప్రభుత్వపు ఉదాసీన వైఖరిపట్ల వాళ్లు అంత తీవ్రంగా ఆగ్రహం చెందుతున్నారు. ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలోని ధగధగలాడే పంజరాల్లో ఉన్నవారికి తప్ప ప్రతి ఒక్కరికీ దేశవ్యాప్తంగా యువత ఆగ్రహం కనబడుతూనే ఉంది. నేడు నరేంద్రమోడీ ఆకర్షణగా మారడానికి కారణం ఆయన పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తుండటం కాదు. ఢిల్లీ దర్బారులో తిష్టవేసినవారి కోవకు చెందని పరాయివాడు కాబట్టి. మోడీ నేటి యువతలోని ఆగ్రహపు గొంతుక, లబ్ధిదారు కూడా. ఒక కేంద్ర కాబినెట్ మంత్రి మోడీని ‘చాయ్‌వాలా’ అంటూ తీసిపారేశారు. ఢిల్లీ దర్బారులోని తల బిరుసు ఉన్నతవర్గాలు ఇలా అవమానకరమైన ధూషణలకు దిగినప్పుడల్లా మోడీ మద్దతుదార్ల బలం పెరగడం మాత్రమే జరుగుతోంది. దేశంలో టీ కప్పులు అందిస్తూ పొట్ట పోషించుకుంటున్న వారి సంఖ్య నేడు అధికారంలో ఉన్న కాలంచెల్లిన ఉన్నత వర్గపు కుమారుల కంటే చాలా ఎక్కువ. యూపీఏ సృష్టించిన పరిపాలనాపరమైన శూన్యంలోకి మోడీ ప్రవేశించారు. ఆయన ఎంత భర్తీ చేయగలిగితే అంత చోటు ఖాళీగా ఉంది. పటేల్, జవహర్లాల్ నెహ్రూలపై ఈ గొడవ గురించి ఎవరైనాగానీ చెప్పగలిగేది ఒక్కటే... ఇది ఒక నాగరికమైన అంశంపై జరుగుతున్న గొడవనే మార్పే. 1947లో ఎవరు ఉత్తమ ప్రధాని అయి ఉండేవారు? అనే అంశంపై 2014 ఎన్నికల్లో ఏ ఒక్కరూ ఓటు వేయబోవడం లేదు. 2014లో ఎవరు ఉత్తమ ప్రధాని కాగలుగుతారనే దానిపైనే ఓటింగ్ జరగబోతుంది. మోడీ అదృష్టవంతుడు. ఆయనకు రెండు శూన్యాలు లభించాయి. మన్మోహన్సింగ్ కనుమరుగైపోతున్నారు. కానీ రాహుల్‌ను వెలుగులోకి రావడానికి అనుమతించడం లేదు. రాహుల్, మోడీలు ఎదురూబొదురుగా నిలవగా ఇద్దరినీ పోల్చి బేరీజు వేసే పరిస్థితి ఏర్పడటం వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయంలో కాం గ్రెస్ నాయకత్వం ఎటూ తేల్చుకోలేకుండా ఉంది. ప్రజాభిమానపు పతనం అంచున నిలవగా, ఉత్సాహోత్తేజాలు నిట్టనిలువునా మునిగిపోయిన ఏ రాజకీయపార్టీయైనాగానీ గడ్డి పరకను పట్టుకొని గట్టెక్కాలని యత్నించడం పూర్తిగా సహేతుకమే. అందుకే మోడీ చాలా త్వరగానే అత్యంత ఉచ్ఛ స్థాయికి చేరిపోయారని, ఎన్నికలు ఇంకా ఆరునెలలు ఉన్నాయని ప్రచారం సాగిస్తున్నారు. దీపావళికి దుకాణాల్లో స్పష్టంగానే కనిపించిన మాంద్యమే ఈ వాదనకు తిరుగులేని సమాధానాన్ని చెబుతోంది. ఒక తాజా జనాభిప్రాయ సేకరణలో పాల్గొన్నవారిలో 57 శాతం మంది ఇది అత్యంత అధ్వానమైన దీపావళి అని పేర్కొన్నారు. ఇక రాబోయే ఆరు నెలల కాలంలో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్నంత అధ్వానంగానే ఉంటుందని లేదా మరింత అధ్వానంగా మారుతుందని అనుకుంటే... అప్పుడు ఆర్థికవ్యవస్థ అధ్వానంగా ఉందని అనుకునేవారు 77 శాతం అవుతారు. ఈ ధోరణి కాస్త సడలుతుందేమోగానీ మటుమాయమైపోదు. భారతదేశం నేడు సంతోషంగా లేదు. ఏ అధికారపార్టీకైనా గానీ ఇది తీవ్ర విచారాన్ని కలుగజేయక మానదు. -ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు -
పటేల్ ఎవరివాడు?!
సంపాదకీయం: ఈ ప్రపంచంలో మార్పు తప్ప ఏదీ మార్పునకు అతీతం కాదంటారు. చరిత్రయినా అంతే. దశాబ్దాలనాటి లేదా శతాబ్దాలనాటి ఘటనలు... వ్యక్తుల, సంస్థల వర్తమాన అవసరాలకు అనుగుణంగా కొత్త అర్ధాలను సంతరించు కుంటాయి. సరికొత్తగా దర్శనమిస్తాయి. ఇప్పుడు దేశ తొలి ఉపప్రధాని సర్దార్ పటేల్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు తాపత్రయ పడుతున్న వేళ చరిత్ర మరోసారి ఇలాంటి ‘మార్పు’నకు లోనవుతోంది. స్వాతంత్య్రోద్యమం, అటు తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో పటేల్ పాత్రపైనా... ఆయనకూ, ఆనాటి ప్రధాని నెహ్రూకూ మధ్యగల సంబంధాలపైనా జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని కావడం కోసం ఏ అవకాశాన్నీ వదలకుండా కృషి చేస్తున్న, సర్వశక్తులూ ఒడ్డుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీయే ఈ చర్చకు ఆద్యుడు. తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేంతవరకూ బీజేపీలో ఆయనెంత పట్టుదలగా పనిచేశారో, అడ్డంకులను ఎలా అధిగమించారో, అసంతృప్తితో రగిలిపోయిన అద్వానీని సైతం తన తోవకు ఎలా తెచ్చుకున్నారో అందరూ చూశారు. ఇప్పుడు ఆ పనినే బయటా చేస్తున్నారు. ప్రస్తుత ప్రత్యర్థులు వైరి పక్షం వారు గనుక యుద్ధం మరింత రక్తి కడుతోంది. కాంగ్రెస్ సారథ్యాన్ని స్వీకరించి తనకు పోటీ వస్తారను కుంటున్న రాహుల్‌గాంధీనీ, ప్రధానిగా ఉన్న మన్మోహన్సింగ్నూ ఇప్పుడాయన ఒంటిచేత్తో ఎదుర్కొంటున్నారు. వారిద్దరూ ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో అందరి కంటే ఎక్కువగా మోడీయే గమనిస్తున్నారు. ఏ వేదికపై కుదిరితే ఆ వేదికపై... ఏదీ కుదరకపోతే ట్విటర్ ద్వారా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. పటేలే తొలి ప్రధాని అయివుంటే దేశ ముఖచిత్రం మరోలా ఉండేదంటూ మోడీ ప్రధాని మన్మోహన్ సమక్షంలో వ్యాఖ్యానించి ఈ చర్చకు తెరతీశారు. ఆయనకు ఆ పీఠం దక్కనందుకు ప్రతి భారతీయుడూ బాధపడుతున్నాడని కూడా అన్నారు. దేశానికి ఇప్పుడు కావాల్సింది ‘వోటు బ్యాంకు సెక్యులరిజం’ కాదని, పటేల్ తరహా సెక్యులరిజమని మోడీ చెప్పారు. పటేల్ వారసత్వాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం మోడీక న్నా ముందు బీజేపీ కూడా చేసింది. ఇంకా చెప్పా లంటే ఆ పార్టీ పూర్వరూపమైన జనసంఘ్ కూడా చేసింది. సోషలిజం సిద్ధాంతాన్ని విశ్వసించి, వామపక్షాలకు సన్నిహితంగా మెలిగిన జవహర్లాల్ నెహ్రూకంటే వారి పేరెత్తితే ఉగ్రుడయ్యే పటేల్ తమకు సన్నిహితుడని బీజేపీ భావించడంలో వింతేమీ లేదు. మోడీ మరో అడుగు ముందుకేసి నెహ్రూ-పటేల్ విభేదాలను ప్రస్తావించారు. పటేల్ అంత్యక్రియలకు నెహ్రూ వెళ్లలేదని కూడా చెప్పారు. బీజేపీ చెబుతున్నట్టు నెహ్రూ-పటేల్ మధ్య విభేదాలున్నాయా? వారిద్దరి మధ్యా భిన్నాభి ప్రాయాలున్నాయనీ, వాటిని విభేదాలనడం సరికాదని చరిత్రకారులంటారు. కాశ్మీర్, చైనాతో చెలిమి, అలీన ఉద్యమంలో భాగస్తులం కావడం వంటి అంశాల్లో ఆయన నెహ్రూతో విభేదించారు. అయితే, స్వతంత్ర భారతదేశం స్వరూప, స్వభావాలు ఎలా ఉండాలన్న అంశంలో ఇద్దరివీ ఒకే రకమైన అభిప్రాయాలు. మత ప్రమేయం లేకుండా పౌరులందరికీ సమాన హక్కులుండాలనే విషయంలో ఇద్దరి విధానాలూ ఒకటే. సర్దార్ పటేల్ మత విశ్వాసాలను వ్యక్తిగత స్థాయికే పరిమితం చేసుకున్నారు. పాలనలో వాటిని ప్రతిబింబించనీయలేదు. స్వాతంత్య్రా నంతరం సంస్థానాలను విలీనం చేసే కీలకమైన కార్యాన్ని పటేల్ చేపట్టారు. అందు కోసం ఆయన వేర్వేరు విధానాలను అవలంబించారు. లొంగిరారనుకున్న హైదరా బాద్, జునాగఢ్ సంస్థానాధీశులపై బలప్రయోగంచేసి దారికితెచ్చారు. ఆయన కృషి ఫలితంగానే దాదాపు 600 సంస్థానాలు విలీనమై ఐక్య భారతదేశం ఏర్పడింది. అలాంటి నాయకుణ్ణి బీజేపీ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ఇప్పుడు కాంగ్రెస్ ఆక్రోశిస్తోంది. ఆయన జీవితాంతం కాంగ్రెస్ వాదిగానే ఉన్నారని గుర్తుచేస్తోంది. అన్ని మతాలనూ ఆయన సమంగా చూశారని, దేశ సమగ్రతే లక్ష్యంగా పనిచేశారని చెబుతోంది. ఇవన్నీ మోడీని, ఆయన ప్రాతినిధ్యంవహిస్తున్న పార్టీని ఎత్తిపొడవటమని వేరే చెప్పనవసరంలేదు. మోడీ పటేల్‌ను ప్రశంసించ డంతో సరిపెట్టలేదు. ఆయన స్మృతి కోసం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. నర్మదా తీరంలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని నెలకొల్పుతు న్నారు. అసలే వచ్చే ఎన్నికలను అధిగమించడం తనవల్ల కాదనుకుంటున్న కాంగ్రెస్‌కు ఇదంతా ఇబ్బందికరంగా మారింది. అందుకే, చరిత్రలోకి తొంగిచూసి మహాత్ముడి హత్యానంతరం పటేల్ ఆరెస్సెస్‌ను నిషేధించడం, ఆ సంస్థ అధినేత గోల్వాల్కర్‌ను అరెస్టుచేయించడంవంటి అంశాలను వెలికితీస్తోంది. అంతేకాదు... యూపీఏ ప్రభుత్వం ఈసారి సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనపై అధికంగా వాణిజ్య ప్రకటనలు విడుదలచేసింది. స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ పాత్ర అత్యంత కీలకమైనదనడంలో సందేహంలేదు. కానీ, ఆయనతో సమానంగా పోరాడిన నేతాజీ సుభాస్‌చంద్రబోస్, ఆజాద్, పటేల్వంటివారి వర్ధంతులకూ, జయంతులకూ తగిన ప్రాధాన్యత నివ్వడంలో ఆదినుంచీ కాంగ్రెస్ చూపుతున్న తేడా దేశ ప్రజలందరికీ తెలుసు. ఆఖరికి మహాత్మాగాంధీ విషయంలోనూ ఈ వివక్ష కొనసాగింది. తనవైపు ఇన్ని లోపాలు పెట్టుకుని ఇప్పటికిప్పుడు సర్దార్ పటేల్ తమవాడంటూ వీధికెక్కడం కాంగ్రెస్‌కే చెల్లింది. పటేల్ కాంగ్రెస్ నీడలోనే మరణించినా అప్పుడున్న కాంగ్రెస్ ఇప్పుడులేదు. ఎన్నెన్నో శకలాలై ఇప్పుడు ఈ రూపంలో మిగిలింది. అలాగని పటేల్‌కు లేని భావాలను ఆయనకు ఆపాదించి సొంతంచేసుకోవానుకుంటున్న బీజేపీ తీరునూ ప్రజలు మెచ్చరు. జాతీయ నాయకులు దేశ ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. ఆ నేతల ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలగడమే వారికి అర్పించే నిజమైన నివాళి అవుతుంది. -
లిబర్టీ స్టాట్యూ కంటే పెద్దదిగా సర్దార్ పటేల్ విగ్రహం!
హర్యానా: దేశ ప్రజలను ఐక్యతగా ఉంచడానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక చిహ్నంగా నిర్మిస్తామని.. ఆ విగ్రహం న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే పెద్దగా ఉంటుంది అని నరేంద్రమోడీ హర్యానాలోని ఓ సభలో తెలిపారు. ఆసభలో మాట్లాడుతూ 'అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదిగా సర్ఱార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం ఉంటుంది' అని బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ అన్నారు. దేశానికి తొలి హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ పటేల్.. దేశ ఐక్యత కోసం పాటు పడ్డారని.. అయితే ఆయన సేవలను ప్రభుత్వాలు మరిచిపోయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కు దేశంలోని రైతులందరూ తమ నాగళ్ల నుంచి చిన్న ఇనుము ముక్కను పంపించాలని.. ప్రతి గ్రామం నుంచి 200-300 గ్రాముల ఇనుముని సేకరిస్తాం అని తెలిపారు. న్యూయార్క్ నగరంలోని లిబర్టీస్ అనే రోమన్ దేవత విగ్రహం 1886 సంవత్సరలో అమెరికా దేశానికి ఫ్రాన్స్ ప్రజలు బహుమతిగా ఇచ్చారు.