పటేల్ ఎవరివాడు?! | BJP, Congress competing to claim Sardar Patel's legacy | Sakshi
Sakshi News home page

పటేల్ ఎవరివాడు?!

Published Sat, Nov 2 2013 1:14 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

BJP, Congress competing to claim Sardar Patel's legacy

సంపాదకీయం:  ఈ ప్రపంచంలో మార్పు తప్ప ఏదీ మార్పునకు అతీతం కాదంటారు. చరిత్రయినా అంతే. దశాబ్దాలనాటి లేదా శతాబ్దాలనాటి ఘటనలు... వ్యక్తుల, సంస్థల వర్తమాన అవసరాలకు అనుగుణంగా కొత్త అర్ధాలను సంతరించు కుంటాయి. సరికొత్తగా దర్శనమిస్తాయి. ఇప్పుడు దేశ తొలి ఉపప్రధాని సర్దార్ పటేల్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు తాపత్రయ పడుతున్న వేళ చరిత్ర మరోసారి ఇలాంటి ‘మార్పు’నకు లోనవుతోంది. స్వాతంత్య్రోద్యమం, అటు తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో పటేల్ పాత్రపైనా... ఆయనకూ, ఆనాటి ప్రధాని నెహ్రూకూ మధ్యగల సంబంధాలపైనా జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని కావడం కోసం ఏ అవకాశాన్నీ వదలకుండా కృషి చేస్తున్న, సర్వశక్తులూ ఒడ్డుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీయే ఈ చర్చకు ఆద్యుడు. తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేంతవరకూ బీజేపీలో ఆయనెంత పట్టుదలగా పనిచేశారో, అడ్డంకులను ఎలా అధిగమించారో, అసంతృప్తితో రగిలిపోయిన అద్వానీని సైతం తన  తోవకు ఎలా తెచ్చుకున్నారో అందరూ చూశారు.
 
 ఇప్పుడు ఆ పనినే బయటా చేస్తున్నారు. ప్రస్తుత ప్రత్యర్థులు వైరి పక్షం వారు గనుక యుద్ధం మరింత రక్తి కడుతోంది. కాంగ్రెస్ సారథ్యాన్ని స్వీకరించి తనకు పోటీ వస్తారను కుంటున్న రాహుల్‌గాంధీనీ, ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌నూ ఇప్పుడాయన ఒంటిచేత్తో ఎదుర్కొంటున్నారు. వారిద్దరూ ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో అందరి కంటే ఎక్కువగా మోడీయే గమనిస్తున్నారు. ఏ వేదికపై కుదిరితే ఆ వేదికపై... ఏదీ కుదరకపోతే ట్విటర్ ద్వారా ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
 
 పటేలే తొలి ప్రధాని అయివుంటే దేశ ముఖచిత్రం మరోలా ఉండేదంటూ మోడీ ప్రధాని మన్మోహన్ సమక్షంలో వ్యాఖ్యానించి ఈ చర్చకు తెరతీశారు. ఆయనకు ఆ పీఠం దక్కనందుకు ప్రతి భారతీయుడూ బాధపడుతున్నాడని కూడా అన్నారు. దేశానికి ఇప్పుడు కావాల్సింది ‘వోటు బ్యాంకు సెక్యులరిజం’ కాదని, పటేల్ తరహా సెక్యులరిజమని మోడీ చెప్పారు. పటేల్ వారసత్వాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం మోడీక న్నా ముందు బీజేపీ కూడా చేసింది. ఇంకా చెప్పా లంటే ఆ పార్టీ పూర్వరూపమైన జనసంఘ్ కూడా చేసింది. సోషలిజం సిద్ధాంతాన్ని విశ్వసించి, వామపక్షాలకు సన్నిహితంగా మెలిగిన జవహర్‌లాల్ నెహ్రూకంటే వారి పేరెత్తితే ఉగ్రుడయ్యే పటేల్ తమకు సన్నిహితుడని బీజేపీ భావించడంలో వింతేమీ లేదు. మోడీ మరో అడుగు ముందుకేసి నెహ్రూ-పటేల్ విభేదాలను ప్రస్తావించారు. పటేల్ అంత్యక్రియలకు నెహ్రూ వెళ్లలేదని కూడా చెప్పారు. బీజేపీ చెబుతున్నట్టు నెహ్రూ-పటేల్ మధ్య విభేదాలున్నాయా? వారిద్దరి మధ్యా భిన్నాభి ప్రాయాలున్నాయనీ, వాటిని విభేదాలనడం సరికాదని చరిత్రకారులంటారు. కాశ్మీర్, చైనాతో చెలిమి, అలీన ఉద్యమంలో భాగస్తులం కావడం వంటి అంశాల్లో ఆయన నెహ్రూతో విభేదించారు. అయితే, స్వతంత్ర భారతదేశం స్వరూప, స్వభావాలు ఎలా ఉండాలన్న అంశంలో ఇద్దరివీ ఒకే రకమైన అభిప్రాయాలు.
 
 మత ప్రమేయం లేకుండా పౌరులందరికీ సమాన హక్కులుండాలనే విషయంలో ఇద్దరి విధానాలూ ఒకటే. సర్దార్ పటేల్ మత విశ్వాసాలను వ్యక్తిగత స్థాయికే పరిమితం చేసుకున్నారు. పాలనలో వాటిని ప్రతిబింబించనీయలేదు. స్వాతంత్య్రా నంతరం సంస్థానాలను విలీనం చేసే కీలకమైన కార్యాన్ని పటేల్ చేపట్టారు. అందు కోసం ఆయన వేర్వేరు విధానాలను అవలంబించారు. లొంగిరారనుకున్న హైదరా బాద్, జునాగఢ్ సంస్థానాధీశులపై బలప్రయోగంచేసి దారికితెచ్చారు. ఆయన కృషి ఫలితంగానే దాదాపు 600 సంస్థానాలు విలీనమై ఐక్య భారతదేశం ఏర్పడింది.
 
 అలాంటి నాయకుణ్ణి బీజేపీ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ఇప్పుడు కాంగ్రెస్ ఆక్రోశిస్తోంది. ఆయన జీవితాంతం కాంగ్రెస్ వాదిగానే ఉన్నారని గుర్తుచేస్తోంది. అన్ని మతాలనూ ఆయన సమంగా చూశారని, దేశ సమగ్రతే లక్ష్యంగా పనిచేశారని చెబుతోంది. ఇవన్నీ మోడీని, ఆయన ప్రాతినిధ్యంవహిస్తున్న పార్టీని ఎత్తిపొడవటమని వేరే చెప్పనవసరంలేదు. మోడీ పటేల్‌ను ప్రశంసించ డంతో సరిపెట్టలేదు. ఆయన స్మృతి కోసం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. నర్మదా తీరంలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని నెలకొల్పుతు న్నారు. అసలే వచ్చే ఎన్నికలను అధిగమించడం తనవల్ల కాదనుకుంటున్న కాంగ్రెస్‌కు ఇదంతా ఇబ్బందికరంగా మారింది. అందుకే, చరిత్రలోకి తొంగిచూసి మహాత్ముడి హత్యానంతరం పటేల్ ఆరెస్సెస్‌ను నిషేధించడం, ఆ సంస్థ అధినేత గోల్వాల్కర్‌ను అరెస్టుచేయించడంవంటి అంశాలను వెలికితీస్తోంది. అంతేకాదు... యూపీఏ ప్రభుత్వం ఈసారి సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనపై అధికంగా వాణిజ్య ప్రకటనలు విడుదలచేసింది. స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ పాత్ర అత్యంత కీలకమైనదనడంలో సందేహంలేదు. కానీ, ఆయనతో సమానంగా పోరాడిన నేతాజీ సుభాస్‌చంద్రబోస్, ఆజాద్, పటేల్‌వంటివారి వర్ధంతులకూ, జయంతులకూ తగిన ప్రాధాన్యత నివ్వడంలో ఆదినుంచీ కాంగ్రెస్ చూపుతున్న తేడా దేశ ప్రజలందరికీ తెలుసు. ఆఖరికి మహాత్మాగాంధీ విషయంలోనూ ఈ వివక్ష కొనసాగింది. తనవైపు ఇన్ని లోపాలు పెట్టుకుని ఇప్పటికిప్పుడు సర్దార్ పటేల్ తమవాడంటూ వీధికెక్కడం కాంగ్రెస్‌కే చెల్లింది. పటేల్ కాంగ్రెస్ నీడలోనే మరణించినా అప్పుడున్న కాంగ్రెస్ ఇప్పుడులేదు. ఎన్నెన్నో శకలాలై ఇప్పుడు ఈ రూపంలో మిగిలింది. అలాగని పటేల్‌కు లేని భావాలను ఆయనకు ఆపాదించి సొంతంచేసుకోవానుకుంటున్న బీజేపీ తీరునూ ప్రజలు మెచ్చరు. జాతీయ నాయకులు దేశ ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. ఆ నేతల ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలగడమే వారికి అర్పించే నిజమైన నివాళి అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement