అధికారం కోసం కుట్రలు
రూపహేలి/పచ్‌పదర (రాజస్థాన్): సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ కుట్రలకు తెగబడుతోందని, అధికార దాహంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ దుష్పరిపాలన సాగిస్తోందంటూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ధ్వజమెత్తిన రోజే యూపీఏ చైర్‌పర్సన్ సైతం ప్రత్యారోపణలతో దాడికి దిగారు. పనితీరు నివేదిక ఇవ్వకుండా యూపీఏ ప్రభుత్వం పారిపోతోందని అమెరికాలోని భారతీయులతో మాట్లాడుతూ మోడీ ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం సమాచార హక్కు, ఆహార భద్రత, భూసేకరణ, ఉపాధి హామీ వంటి వాటితో ప్రజలకు సాధికారత కల్పించిందని సోనియా పేర్కొన్నారు.
బీజేపీ చెప్పుకునేందుకు ఏమీ లేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన పనులను వేలెత్తి చూపుతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు కుట్రలకు పాల్పడటం, అధికారం కోసం పాకులాడటంపైనే బీజేపీ దృష్టి పెట్టిందని ఆరోపించారు. రాజస్థాన్‌లోని పచ్‌పదర, రూపహేలిల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. రూపహేలి బహిరంగ సభలో మాట్లాడుతూ మన్మోహన్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు.