కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్‌పర్సన్ నజ్మా హెప్తుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక విషయాన్ని సోనియా గాంధీకి తెలియజేసేందుకు తాను గంట పాటు ఫోన్ కాల్‌లో వేచి ఉండాల్సి వచ్చిందని తనను జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్నారు. ఆనాటి ఘటన ఇప్పటికీ తన మనసులో అలాగే ఉండిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.
మాజీ రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్, బీజేపీ నాయకురాలు నజ్మా హెప్తుల్లా తన ఆత్మకథ..‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ: బియాండ్ పార్టీ లైన్స్’ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని కీలక ఘటనలను ఇందులో వెల్లడించారు. ఈ క్రమంలో 1999లో తాను కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న ఓ అవమానాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆత్మకథలో ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. నజ్మా హెప్తుల్లా 1999లో ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ (IPU) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పడానికి ప్రయత్నించారు. నజ్మా హెప్తులా బెర్లిన్ నుంచి ఇండియాలో ఉన్న సోనియా గాంధీకి కాల్ చేశారు. ఆ సమయంలో సోనియా సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేసి మేడమ్ బిజీగా ఉన్నారని ఆమెకు చెప్పారు. దీంతో, గంట పాటు ఆమె.. ఫోన్ కాల్‌లోనే వేచి ఉన్నట్టు చెప్పారు. చివరికి సోనియాతో మాట్లాడకుండానే కాల్ కట్ చేసినట్టు తెలిపారు. ఆ ఘటన తన మనసులో తిరస్కరణ భావాన్ని కలిగింపజేసినట్టు ఆమె చెప్పుకొచ్చారు. అది ఇప్పటికీ తన మనసులో అలాగే ఉన్నట్టు రాసుకొచ్చారు. సోనియా చుట్టూ ఉన్న ఓ కోఠరీనే దీనికి కారణమని ఆరోపించారు. ఈ ఘటనే తనను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసిందని అన్నారు.
అయితే, సోనియా గాంధీకి కాల్ చేసే ముందు.. తాను ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి సమాచారం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి ఆమెతో మాట్లాడి అభినందనలు చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో సోనియాపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ నాయకత్వ శైలిని ఇందిరా గాంధీతో విభేదించారు. పార్టీ నేతలంటే ఆమెకు చులకన భావమనే విధంగా ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా.. 2004 ఎన్నికల సందర్భంగా సోనియాతో విభేదాలు రావడంతో నజ్మా హెప్తుల్లా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆమె కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్నప్పుడు పదహారేళ్లపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇక, బీజేపీ ప్రభుత్వంలో 2014-2016 మధ్య కేంద్రమంత్రిగా పనిచేశారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిగా కొనసాగారు. అలాగే, 2016 నుండి 2024 మధ్య కాలంలో మూడు సార్లు ఆమె మణిపూర్ గవర్నర్‌గా పనిచేశారు. 2017 నుండి 2023 వరకు జామియా మిలియా ఇస్లామియా ఛాన్స్‌లర్‌గా ఉన్నారు. హమీద్ అన్సారీ మీద భారతీయ జనతా పార్టీ తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడారు. ఇక, నజ్మా హెప్తుల్లా.. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనుమరాలు.
Comments
Please login to add a commentAdd a comment