మోదీకి గద్దెనెక్కే హక్కు లేదు
సోనియా మండిపాటు
సీపీపీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రధాని నరేంద్ర మోదీకి నైతిక, రాజకీయ ఓటమిగా సోనియాగాంధీ అభివర్ణించారు. ‘‘కనుక మోదీ దేశానికి నాయకత్వం వహించే నైతిక హక్కు కోల్పోయారు. ఎందుకంటే బీజేపీని, భాగస్వామ్య పక్షాలను పూర్తిగా పక్కన పెట్టారు. కేవలం తన పేరుతోనే ప్రజా తీర్పు కోరారు. కనుక ఓటమికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలి. కానీ ఆ పని చేయకపోగా మరోసారి గద్దెనెక్కేందుకు సిద్ధపడుతున్నారు’’ అంటూ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా తిరిగి ఎన్నికయ్యారు. శనివారం సీడబ్ల్యూసీ భేటీ అనంతరం పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలంతా ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఎంపీలనుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘మోదీ నైజం తెలిసిన వారెవరూ ప్రజా తీర్పును ఆయన గౌరవిస్తారని, పాలన తీరుతెన్నులను మార్చుకుంటారని అనుకోరు. కనుక మోదీ సర్కారు తీరును వేయి కళ్లతో గమనించడం, ప్రజా వ్యతిరేక చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం మనందరి బాధ్యత.
లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే యత్నాలను అడ్డుకుంటూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి’’ అని ఎంపీలకు ఉద్బోధించారు. ‘‘అయితే లోక్‌సభలో కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. పార్లమెంటులో మోదీ సర్కారు ఏకపక్ష పోకడలు గత పదేళ్ల మాదిరిగా సాగబోవు. చర్చల్లేకుండా బిల్లుల ఆమోదం, విపక్ష సభ్యులను అవమానించడం, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం వంటివి చెల్లబోవు’’ అన్నారు.
మనకు ఏకంగా శ్రద్ధాంజలి ఘటించారు...
ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా కుప్పకూల్చేందుకు అధికార పార్టీ చేయని ప్రయత్నం లేదని సోనియా అన్నారు. ‘‘పారీ్టని ఆర్థికంగా కుంగదీశారు. అందరిపైనా కేసులు పెట్టి వేధించారు. చాలామంది కాంగ్రెస్‌కు ఏకంగా శ్రద్ధాంజలే ఘటించారు! కానీ బీజేపీ కుటిల యత్నాలన్నింటినీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మొక్కవోని దీక్షతో అడ్డుకున్నారు. కలసికట్టుగా శ్రమించి మంచి ఫలితాలు సాధించారు. వారి ధైర్యానికి మా సెల్యూట్. ఈ విజయంలో అధ్యక్షుడు ఖర్గేది కీలక పాత్ర. ఆయన మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
ఖర్గే నుంచి అందరూ ఎంతో నేర్చుకోవాలి. అలాగే చరిత్రాత్మక భారత్ జోడో యాత్రలు చేసిన రాహుల్ ప్రత్యేక అభినందనలకు అర్హుడు’’ అన్నారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై ఆత్మశోధన జరగాలని ఎంపీలను కోరారు. సీపీపీ చైర్‌పర్సన్‌గా తిరిగి ఎన్నికవడం తనకెంతో భావోద్వేగపూరిత క్షణమని సోనియా అన్నారు. ‘‘మీరంతా నాపై ఎంతో ప్రేమ చూపుతూ వస్తున్నారు. మీ నమ్మకాన్ని కాపాడుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తా’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment