moral
-
నైతిక, రాజకీయ ఓటమి...
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రధాని నరేంద్ర మోదీకి నైతిక, రాజకీయ ఓటమిగా సోనియాగాంధీ అభివర్ణించారు. ‘‘కనుక మోదీ దేశానికి నాయకత్వం వహించే నైతిక హక్కు కోల్పోయారు. ఎందుకంటే బీజేపీని, భాగస్వామ్య పక్షాలను పూర్తిగా పక్కన పెట్టారు. కేవలం తన పేరుతోనే ప్రజా తీర్పు కోరారు. కనుక ఓటమికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలి. కానీ ఆ పని చేయకపోగా మరోసారి గద్దెనెక్కేందుకు సిద్ధపడుతున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా తిరిగి ఎన్నికయ్యారు. శనివారం సీడబ్ల్యూసీ భేటీ అనంతరం పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలంతా ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఎంపీలనుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘మోదీ నైజం తెలిసిన వారెవరూ ప్రజా తీర్పును ఆయన గౌరవిస్తారని, పాలన తీరుతెన్నులను మార్చుకుంటారని అనుకోరు. కనుక మోదీ సర్కారు తీరును వేయి కళ్లతో గమనించడం, ప్రజా వ్యతిరేక చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం మనందరి బాధ్యత. లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే యత్నాలను అడ్డుకుంటూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి’’ అని ఎంపీలకు ఉద్బోధించారు. ‘‘అయితే లోక్‌సభలో కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. పార్లమెంటులో మోదీ సర్కారు ఏకపక్ష పోకడలు గత పదేళ్ల మాదిరిగా సాగబోవు. చర్చల్లేకుండా బిల్లుల ఆమోదం, విపక్ష సభ్యులను అవమానించడం, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం వంటివి చెల్లబోవు’’ అన్నారు. మనకు ఏకంగా శ్రద్ధాంజలి ఘటించారు... ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా కుప్పకూల్చేందుకు అధికార పార్టీ చేయని ప్రయత్నం లేదని సోనియా అన్నారు. ‘‘పారీ్టని ఆర్థికంగా కుంగదీశారు. అందరిపైనా కేసులు పెట్టి వేధించారు. చాలామంది కాంగ్రెస్‌కు ఏకంగా శ్రద్ధాంజలే ఘటించారు! కానీ బీజేపీ కుటిల యత్నాలన్నింటినీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మొక్కవోని దీక్షతో అడ్డుకున్నారు. కలసికట్టుగా శ్రమించి మంచి ఫలితాలు సాధించారు. వారి ధైర్యానికి మా సెల్యూట్. ఈ విజయంలో అధ్యక్షుడు ఖర్గేది కీలక పాత్ర. ఆయన మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఖర్గే నుంచి అందరూ ఎంతో నేర్చుకోవాలి. అలాగే చరిత్రాత్మక భారత్ జోడో యాత్రలు చేసిన రాహుల్ ప్రత్యేక అభినందనలకు అర్హుడు’’ అన్నారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై ఆత్మశోధన జరగాలని ఎంపీలను కోరారు. సీపీపీ చైర్‌పర్సన్‌గా తిరిగి ఎన్నికవడం తనకెంతో భావోద్వేగపూరిత క్షణమని సోనియా అన్నారు. ‘‘మీరంతా నాపై ఎంతో ప్రేమ చూపుతూ వస్తున్నారు. మీ నమ్మకాన్ని కాపాడుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తా’’ అని చెప్పారు. -
కళ్లు తెరిచి చూడవయ్యా.. మీ గమ్యస్థానం కనిపిస్తుంది
ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉంటుంది. చాలా జీవులు ఆ విషయాన్ని తెలుసుకోకుండానే తమ జీవితాన్ని పూర్తి చేస్తాయి. అడవిలో ఉన్న జంతువుకు దాని ప్రాణాలు కాపాడుకోవడమే అతి పెద్ద లక్ష్యం. ఆకాశంలో తిరిగే పక్షులకు, నీళ్లలో ఈదే చేపలకు ఆ పూట కడుపు నింపుకోవడమే తమ ముందున్న లక్ష్యం. మరి మెదడున్న మనిషికి మాత్రం అంతకంటే పెద్ద లక్ష్యాన్ని దేవుడు నిర్ణయించాడు. జంతువులా కాకుండా.. భిన్నంగా కొంతైనా సమాజానికి ఉపయోగపడాలని నిర్దేశించాడు. ఆ కర్తవ్య బోధను అర్థం చేసుకున్న వాడు గొప్పవాడయ్యాడు. అది అర్థమయ్యేందుకు చిన్న కథలు రెండు. మొదటి కథ ఒక కుక్క కాశీకి వెళ్దామని బయలు దేరింది. ఎలాగైనా విశ్వనాథుడిని దర్శించుకోవాలన్నది దాని లక్ష్యం. బ్రహ్మండమైన పట్టుదలతో బయల్దేరింది. దారి మధ్యలో ఒక బొక్క కనిపించింది. కాశీకి తర్వాత పోదాంలే.. ముందు బొక్క సంగతి చూద్దామనుకుంది. ఆ బొక్క నోట కరుచుకున్నాక.. పరవశమయింది. కాశీకి పోయే దారి వదిలేసి బొక్క నాకడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కథ షరా మామూలే. మనిషి పాత్ర అలాగే… మనిషి పాత్ర కూడా అంత గొప్పేమీ కాదు. జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ‘దేవుడి వద్దకు చేరాలి ఈ బాధ నేను భరించలేను’ అని నిర్ణయించుకుంటాడు. తన లక్ష్యం అదే అని ఎంచుకుంటాడు. కానీ జన్మించిన తర్వాత.. భౌతిక ప్రపంచాన్ని చూస్తూ తను లక్ష్యాన్ని వదిలేస్తాడు. సుఖదుఃఖ జనన మరణాలలోనే ఉండి పోతున్నాడు. ఇలా ఎన్నో జన్మలు అనుకుంటూనే ఉన్నాడు. జన్మించిన తర్వాత మర్చిపోతూనే ఉన్నాడు. అదృష్టవంతులు కొందరు మాత్రమే దైవాన్ని చేరుకుంటున్నారు. వారే ధన్యజీవులు. రెండో కథ చదివితే మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఆవు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది. ఇంతలో ఓ పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం అటూ ఇటూ పరుగెత్తింది. పులి కూడా అంతే వేగంగా వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో చెరువులోకి దూకేసింది. పులి ఆకలి మీదుంది. ఎలాగైనా ఆవుని పట్టుకోవాలన్న తాపత్రయంలో అది కూడా చెరువులోకి దూకేసింది. క్షణాల్లో మారిన ప్రాధాన్యతలు ఆ చెరువులో నీళ్ళు తక్కువగా ఉన్నాయి, పైగా అందులో లోతైన బురద ఉంది. ముందు వెనకా చూసుకోకుండా దూకడం వల్ల ఆవు పీకల్లోతున బురదలో కూరుకుపోయింది. ఆవుని చంపాలని వచ్చిన పులి కూడా అదే బురదలో చిక్కుకుంది. ఇప్పుడు రెండింటి లక్ష్యాలు మారిపోయాయి. ఆ క్షణం వరకు పులి నుంచి తప్పించుకోవాలనుకున్న ఆవుకు ఇప్పుడు బురదనుంచి బయటపడడం ముఖ్యం. పులి సంగతి కూడా అంతే. ఆవు కాకపోతే మరేదైనా తినొచ్చు కానీ ఈ బురద బారి నుంచి ఎలా బయటపడాలన్నది అర్థం కావడం లేదు. ఆవులో ఆలోచన, పులిలో ఆహంకారం ఇప్పుడు ఆవు, పులీ రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. ఇక్కడే ఆవులో ఆలోచన ప్రకాశవంతమయింది. పులి నుంచి తప్పించుకున్నానన్న ఉత్తేజం, ఈ దుస్థితి నుంచి బయటపడతానన్న నమ్మకం దానిలో ఉన్నాయి. అందుకే పులితో మాట్లాడడం మొదలెట్టింది. "నీకెవరైనా యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?” అని అడిగింది. ఎప్పుడు చస్తానో తెలియని పులికి ఇంకా బింకం పోలేదు. "నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు మళ్లీ వేరేగా ఎవరు యజమాని ఉంటారు?” అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, “నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయికదా..”అంది. అప్పుడు ఆ పులి, ఆవుతో ఇలా అంది, “నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?” అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది.. “చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు.?” అంది. ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే పరిస్థితి గమనించాడు. జాగ్రత్తగా ఓ తాడును కట్టి ఆవుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి బయటకు లాగాడు. ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. తలుచుకుంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ కథలో... ఆవు - సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo. పులి- అహంకారం నిండి ఉన్న మనస్సు. యజమాని - సద్గురువు/పరమాత్మ బురదగుంట - ఈ సంసారం/ప్రపంచం ఆవు-పులి యొక్క సంఘర్షణ : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం. ఇందులో నీతి ఏంటేంటే.. ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ, “నేనే అంతా, నా వల్లే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలగరాదు. దీనినే 'అహంకారము' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. ఈ జగత్తులో పరమాత్మను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఉండరు. వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. లోకా సమస్తా సుఖినోభవన్తు! -
వినయమే బలం.. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని విర్రవీగితే ఇక అంతే!
ఒకడు బాగా రాస్తాడు, ఒకడికి జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. ఒకడు బాగా పాడతాడు, ఒకడు బాగా అలంకారం చేస్తాడు, ఒకడు బాగా మాట్లాడతాడు...ఏది ఉన్నా అది భగవంతుడు వాడికి ఇచ్చిన విభూతి. ‘‘యద్యత్ విభూతిరాతిమత్ సత్వం శ్రీమదూర్జిత మేవనా/తత్తదేవావగచ్ఛత్వం మమ తేజోంశ సంభవమ్’’ అంటాడు గీతాచార్యుడు. ఎక్కడెక్కడ ఏ ఉత్కృష్టమయిన ప్రాణి ఉన్నా అది పరమేశ్వరుడి విభూతి. ‘అది ఈశ్వరుడు నాకు అనుగ్రహించిన మహత్తరమైన శక్తి’ అని ఎవరయితే నమస్కారం పెట్టి వినయంతో బతుకుతుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. ఇదంతా నా మహిమే.. నాతో సాటిరాగల వాడు లేడు.. అని విర్రవీగుతాడో వాడు ఎప్పటికీ ముందుకు పోలేడు. పాడయి పోతాడు. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని ఎవర్నయినా తూలనాడుతూ తక్కువచేసి ప్రవర్తిస్తే... అవతలి వాడు సాధనచేసి ఏదో ఒకరోజు నిన్ను దాటిపోతాడు. నిజంగా అవతలివాడు నీకన్నా తక్కువ అనిపించినప్పుడు సానుభూతితో, ప్రేమతో పెద్ద మనసు చేసుకొని వాడిని వృద్ధిలోకి తీసుకురావడానికి నీ వంతు ప్రయత్నం నీవు చేయడం ధర్మం అవుతుంది. అది లేనప్పుడు... ‘‘కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతింబొందరే?/వారేరీ సిరిమూటగట్టుకుని పోవంజాలరే? భూమిపై/ బేరైనంగలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై/యీరే కోర్కులు? వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!’’ ఈ పద్యం మనందరికీ తెలిసిందే. అంటే పొగరుబోతు తనంతో నీవు బావుకునేదేమీ ఉండదు. వినయంతో ప్రవర్తించిన వాళ్ళను చరిత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. సంస్కృత భాగవతాన్ని అద్భుతంగా ఆంధ్రీకరించిన పోతనామాత్యుడు ఎక్కడా ఆ ప్రతిభ తనదికానే కాదన్నాడు. ‘‘పలికెడిది భాగవతమట/పలికించు విభుండు రామభద్రుండట /నేపలికిన భవహరమగునట/పలికెద; వేరొండు గాథ పలుకగనేలా!’’ అన్నాడు. నేను కానే కాదు, ఆ రామచంద్రమూర్తి నా వెనుక ఉండి నాచేత దానిని ఆంధ్రీకరింప చేస్తున్నాడు. ఆయన నాతో ఏది చేయిస్తున్నాడో అదే చేస్తాను తప్ప మరొకటి చేసే శక్తి నాకు లేదు... అని నిలబడినందుకు తరతరాలుగా ప్రజలు ఆ మహాకవిని గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారు. హనుమ కూడా... ‘లంకకు వెళ్లిరాగల శక్తి నాకు పుష్కలంగా ఉంది’ అన్లేదు. రామచంద్ర మూర్తి బంగారు కోదండాన్ని పట్టుకొని అక్షయ బాణ తూణీరం లోంచి ఒక బాణాన్ని తీసి వింటినారిని సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టినప్పుడు రాముడి శక్తి బాణంలోకి వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడుతుందో ఆయన అనుగ్రహంతో ఆయన శక్తి నాలో ప్రవేశించినందువల్ల లంకాపట్టణానికి వెళ్ళగలుగుతున్నాను తప్ప నాకుగా ఆ శక్తి లేదు’ అని సవినయంగా చెప్పుకొన్న కారణంతో సదా రాముడి కనుసన్నలలో మెలిగే అదృష్టాన్ని పొందాడు హనుమ. అందుకే ఈరోజున రాముడి గుడి లేని ఊరు లేనట్టే, హనుమంతుడి విగ్రహం లేని వీథి లేదు. వినయం అంటే అదీ. బలవంతుడనాకేమని ...అని చెప్పిన బద్దెన గారే సుమతీ శతకంలో మరో చోట ఇలా అంటారు. ‘‘అధరము గదిలియు గదలక / మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడై/ అధికార రోగపూరిత బధిరాంధక శవము జూడబాపము సుమతీ’’... అధికారంతో విర్రవీగుతూ ఎవరితో మాట్లాడనివాడు అధికారం అన్నరోగం సోకి శవంగా మారినవాడు...అని ఘాటుగా విమర్శించారు. ఇష్టమైన ఆహార పదార్థాలను ఆస్వాదిస్తూ తిన్నట్లుగా తెలుగులో ఉన్న మంచి పద్యాలను కూడా జ్ఞాపకం పెట్టుకొంటే జీవితంలో అక్కరకు వస్తాయి. (సుమతీ శతక నీతి పద్యాలు ఇంతటితో సమాప్తం) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
విలువలే గెలవాలి!
త్రికాలమ్ నంద్యాల శాసనసభ స్థానం కోసం జరుగుతున్న హోరాహోరీ పోరాటంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే నైతిక విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్న శిల్పా చక్రపాణిరెడ్డికి జగన్మోహన్రెడ్డి అనూహ్యమైన పరీక్ష పెట్టారు. తెలుగుదేశం పార్టీ టికెట్టు పైన గెలుచుకున్న శాసనమండలి స్థానానికి రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి ఆహ్వానిస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి మాదిరి నీతిలేని రాజకీయం చేయలేనని స్పష్టం చేశారు. చేతిలో ఉన్న మండలి స్థానం వదులుకోవడానికి ధైర్యం కావాలి. బాగా ఆలోచించుకున్న తర్వాత మండలి స్థానానికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరడానికే చక్రపాణిరెడ్డి నిర్ణయించుకున్నారు. గురువారంనాడు నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో తన రాజీనామా లేఖను జగన్మోహన్రెడ్డికి సమర్పించారు చక్రపాణిరెడ్డి. స్పీకర్ ఫార్మాట్లో శాసనమండలి అధ్యక్షుడిని ఉద్దేశించి రాసిన రాజీనామా లేఖను అనంతరం మండలి అధ్యక్షుడి కార్యాలయానికి పంపించారు. అరుణాచలప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ దేశ వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం భ్రష్టుపడుతున్న తీరు చూసినవారికి వైఎస్ఆర్సీపీ పాటించిన నైతికత ఆనందం కలిగించి తీరుతుంది. ఈ పార్టీ స్థాపించినప్పటి నుంచీ చట్టసభలలో సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకోవాలనే నియమాన్ని పట్టింపుతో అమలు చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన శాసనసభ్యులంతా రాజీనామాలు చేసి ఉపఎన్నికలలో గెలిచారు. ఢిల్లీలో, అమరావతిలో, హైదరాబాద్‌లో అధికారంలో ఉన్న పార్టీలు పాటించని నైతిక విలువలనూ, ప్రదర్శించని రాజ్యాంగ నిబద్ధతనూ యువనాయకుడు జగన్మోహన్రెడ్డి పాటించినందుకు అభినందించి తీరాలి. నంద్యాల రణక్షేత్రంలో చక్రపాణిరెడ్డి బాసట చాలా ముఖ్యమైనది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి విజయం సాధించాలంటే అతని సోదరుడు చక్రపాణిరెడ్డి సహకారం ప్రధానం. నంద్యాల విజయం వైఎస్ఆర్సీపీకీ, జగన్మోహన్రెడ్డికీ చాలా అవసరం. చావోరేవో తేల్చుకోవలసిన సందర్భం. శాసనమండలి స్థానం వదులుకోవడానికి చక్రపాణిరెడ్డి అంగీకరించకపోతే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం లేదు. నంద్యాలలో విజయావకాశాలు ఆ మేరకు దెబ్బతినేవి. ఇది తెలిసి కూడా సీటు వదులుకోవాలని జగన్మోహన్రెడ్డి షరతు విధించడం విశేషం. ఒక విధంగా నంద్యాల ఉప ఎన్నికలో విజయం కన్నా నైతికత, రాజ్యాంగ స్ఫూర్తి పాటించడమే తనకు ముఖ్యమని జగన్ చాటి చెప్పినట్టు అయింది. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులలో ఈ అంశం చర్చనీయాంశం కాకపోవచ్చు. పత్రికలూ, వార్తా చానళ్ళూ ప్రాముఖ్యం ఇవ్వకపోవచ్చు. జాతీయ స్థాయిలో చానళ్ళ, పత్రికల దృష్టి వేరే అంశాలపైన ఉండవచ్చు. స్థానిక మీడియా సంగతి సరేసరి. తగినంత ప్రచారం లభించకపోయినప్పటికీ ఇది అన్ని రాజ కీయ పార్టీలూ గమనించవలసిన పరిణామం. విలువలు పాటించే విషయంలో అధికార పార్టీకీ, ప్రతిపక్షానికీ ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తారో లేదో మరి. ఇది కారుమబ్బుల్లో తళుక్కున కనిపించిన కాంతిరేఖ. గెలుపే ప్రధానం చంద్రబాబు ఎన్నికల వ్యూహ రచనలో దిట్ట. మూడు దశాబ్దాలకు పైగా అనేక ఎన్నికలలో పోరాడిన అనుభవం ఆయనది. ముఖ్యమంత్రికి గెలుపే ప్రధానం. ఏ విధంగా గెలిచామన్నది అప్రధానం. లక్ష్యం ముఖ్యం. మార్గం కాదు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా విజయం సాధిం చేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. నైతిక విలువలతో పనిలేదు. రాజకీయ విలువలకు పాతర వేసినా పర్వాలేదు. గెలవాలి. తిమ్మిని బమ్మిని చేసైనా సరే, ఆరు నూరైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే విజయం సాధించి తీరాలి. ఉపఎన్నికలో ఒక సీటు గెలిచినా ఓడినా ప్రభుత్వ సుస్థిరతకు భంగం లేదు. చట్టసభలలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఉపఎన్నిక జరుగుతున్న ఒక్క స్థానం గెలుచుకోవడంపైనే తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్టు సర్వశక్తులూ వొడ్డి పోరాడటం చంద్రబాబు స్వభావం. ప్రత్యర్థులతో పోల్చుకొని ప్రతిరోజూ బేరీజు వేసుకోవడం, ప్రతి పోటీలో తనదే పైచేయి కావాలనుకోవడం, విజయం కోసం అన్ని రకాల నియమాలనూ ఉల్లంఘించి, అడ్డదారులు తొక్కడం ఆయనకు అలవాటు. ఇప్పుడు నంద్యాలలోనూ అదే చూస్తున్నాం. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత చంద్రబాబు ప్రణాళికలో నంద్యాల అత్యధిక ప్రాముఖ్యం సంతరించుకున్నది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి సమర్థుడూ, స్థానికంగా విశేషమైన ప్రాబల్యం కలిగిన వ్యక్తీ కావడంతో చంద్రబాబు పని మరింత కష్టభూయిష్టౖమైపోయింది. భూమా నాగిరెడ్డి భార్య శోభ 2014 ఎన్నికల ప్రచారంలో కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన కారణంగా సానుభూతి పవనాలు వీచినప్పటికీ టీడీపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి కంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగిరెడ్డి (శోభ భర్త)కి స్వల్ప మెజారిటీ (3,604 ఓట్లు) లభించింది. నాగిరెడ్డికి 82,194 (46.97 శాతం) ఓట్లు రాగా, మోహన్‌రెడ్డికి 78,590 ( 44.91శాతం) ఓట్లు వచ్చాయి. ఎన్నికలైన తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందిన శాసనసభ్యులను తెలుగుదేశంలోకి చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం చేశారు. ప్రతిపక్ష సభ్యులను వేధించారు. బెదిరించారు. ప్రలోభపెట్టారు. వారి బలహీనతలు తెలుసుకొని వారితో ఆడుకున్నారు. నాగిరెడ్డిపైన పోలీసులను ప్రయోగించారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టించారు. రౌడీషీట్ తెరిపించారు. పద్నాలుగు రోజులు జైల్లో పెట్టించారు. చతుర్విధ ఉపాయాలు ప్రయోగించి ఆయన చేత తప్పు చేయించారు. పార్టీ ఫిరాయించే వరకూ ఆయనను వేధిస్తూనే ఉన్నారు. ఒక వైపు పోలీసు కేసులతో వేధించడం, మరో వైపు మంత్రి పదవి చూపించి ఊరించడం. ఆ విధంగా నాగిరెడ్డి సహా 21 మంది వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుల చేత పార్టీ ఫిరాయింపజేశారు. వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా శాసనసభ స్థానానికి రాజీనామా చేయలేదు. నాగిరెడ్డి వ్రతం చెడినా ఫలం దక్కలేదు. మంత్రి పదవి అందని ద్రాక్షే అయింది. మానసికంగా కుంగిపోయారు. మండలి ఎన్నికలలో తన అభీష్ఠానికి భిన్నంగా పని చేయాలని నాగిరెడ్డిపైన ఒత్తిడి పెరిగింది. చంద్రబాబు అమరావతికి పిలిపించుకొని నాగిరెడ్డిని మందలించారు. అపరాధభావంతో, అవమానభారంతో భూమా గుండెపోటు వచ్చి మరణించారు. ఆ క్షణం నుంచీ నంద్యాల స్థానం ఎట్లా నిలబెట్టుకోవాలో చంద్రబాబు ఆలోచిస్తున్నారు. నువ్వా–నేనా? భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రివర్గంలోకి నలుగురు ఫిరాయింపుదారులను చంద్రబాబు తీసుకున్నారు. భూమా కుమార్తె అఖిలప్రియ వారిలో ఒకరు. నంద్యాల స్థానం తమ కుటుంబానికే చెందాలని అఖిలప్రియ కోరుకోవడం సహజం. ఆ స్థానం గెలుచుకునేందుకు టీడీపీ టికెట్టు తనకే దక్కాలని 2014లో స్వల్ప తేడాతో ఎన్నికలలో ఓడిపోయిన శిల్పామోహన్‌రెడ్డి ఆశించడం ధర్మం. ఎవరినీ వదులుకోలేని డోలాయమాన స్థితిలో చంద్రబాబుని చూసిన శిల్పా మోహన్‌రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా వైఎస్ఆర్సీపీకీ బలమైన అభ్యర్థి లభించారు. పెరుగుతున్న జగన్మోహన్రెడ్డి ప్రాబల్యంతో మోహన్‌రెడ్డి సొంత బలం తోడైతే విజయం సాధ్యం. ఎట్లాగైనా నంద్యాల స్థానం నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో చంద్రబాబు తనకు తెలిసిన విద్య ప్రదర్శించడం ప్రారంభించారు. మూడేళ్ళలో నంద్యాల ప్రజలకు కనిపిం చని చంద్రబాబు తరచూ తమ మధ్యకు రావడం, అడగని వరాలు గుప్పించడం, అన్ని వర్గాల ప్రజలతో చనువు ప్రదర్శించడం ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. నంద్యాలలో వైశ్యులు గణనీయంగా ఉన్నారు కనుక వారికి అవసరమైన భవనం కట్టిస్తానని వాగ్దానం చేశారు. అడిగినవారికీ, అడగనివారికీ రకరకాల పథకాలు మంజూరు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే అన్ని వర్గాలకీ అన్ని రకాల వాగ్దానాలు చేశారు. నంద్యాల పట్టణంలో ముస్లింలు 70 వేల పైచిలుకు ఉంటారు. వారిని ప్రసన్నం చేసుకోవాలంటూ మాజీ మంత్రి ఫారుఖ్‌ని పట్టుకోవాలి. 2014 ఎన్నికల సమయంలో నంద్యాల టిక్కెట్టు ఆశించిన ఫారుఖ్‌కి చంద్రబాబు ఇంటర్వ్యూ దొరకటం కష్టమైంది. అప్పటి నుంచి ముఖ్యమంత్రికీ, పార్టీకీ దూరంగా ఉంటున్న మాజీ మంత్రిని పిలిపించుకొని ఆయనకు శాసనమండలి సభ్యత్వమే కాకుండా శాసనమండలి అధ్యక్ష పదవి కూడా ఇస్తానంటూ వాగ్దానం చేసి ఆయనను రంగంలో దింపారు. చక్రపాణి పదవీ విరమణ అనంతరం మండలి అధ్యక్ష స్థానం ఖాళీగా ఉంది. ఇదే అధ్యక్ష పదవి చక్రపాణిరెడ్డికి చంద్రబాబు ఇవ్వజూపారు. అది మోహన్‌రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరక మందు ముచ్చట. చక్రపాణిరెడ్డి టీడీపీలో కొనసాగినప్పటికీ అన్నకి వ్యతిరేకంగా ఎంత శక్తిమంతంగా పని చేయగలరనే విషయంపై తెలుగుదేశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పైగా, నంద్యాలలో గెలవాలంటే చక్రపాణిరెడ్డి మద్దతు కంటే ఫారుఖ్ మద్దతు అవసరమని భావించిన చంద్రబాబు ఫారుఖ్‌ని మండలి అధ్యక్ష పదవి చూపించి సుముఖం చేసుకున్నారు. చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారన్న విశ్వాసం లేకపోయినప్పటికీ ఫారుఖ్ యాంత్రికంగా తెలుగుదేశం అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి తరఫున ముస్లిం సమాజంలో ప్రచారం చేస్తున్నారు. ముస్లింలలో వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల ఆరాధనాభావం ఉన్నది. నాలుగు శాతం రిజర్వేషన్లు ఇప్పించింది వైఎస్ఆర్ అనే విషయం ముస్లింలు తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. చంద్రబాబు చేస్తున్న హడావుడి చూసి నంద్యాల ప్రజలు నివ్వెరపోతున్నారు. ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంది. అది ఎంతమేరకు ఉన్నదనే విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. సాధారణ పరిస్థితులలో, 174 స్థానాలతో కలిపి నంద్యాల స్థానానికి కూడా ఎన్నిక జరిగి ఉంటే వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం. ఫిరాయించిన ఇతర ఇరవై మంది ఎంఎల్ఏలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు జరిగి, వాటితో పాటుగా నంద్యాల ఉప ఎన్నిక కూడా జరిగి ఉన్నట్లయితే వైఎస్ఆర్సీపీకి విజయావకాశాలు స్పష్టంగానే ఉండేవి. కానీ ఒక్క నంద్యాలలోనే ఎన్నికలు జరగడం, ప్రభుత్వ యంత్రాంగాన్నీ, టీడీపీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయితో చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో దింపడంతో పోటీ నువ్వా–నేనా అన్నట్టు సాగుతోంది. ఏ రోజు చూసినా నంద్యాలలో అరడజను మందికి తక్కువ కాకుండా మంత్రులు మకాం వేసి ఉంటున్నారు. శాసనసభ్యులు సరేసరి. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి టీడీపీ ఏర్పాట్లు చేసుకున్నది. వైఎస్ఆర్సీపీ చేతిలో అధికారం లేదు. నిధులు లేవు. అయినప్పటికీ చక్రపాణిరెడ్డి చేరికతో వైఎస్ఆర్సీపీ పట్ల సానుకూలత పెరిగింది. తొమ్మిదో తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ నంద్యాలలోనే ఉంటానంటూ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు ఎలక్షన్ వాచ్ ఆధ్వర్యంలో నంద్యాలలో పర్యటించబోతున్నారు. ఒక సార్వత్రిక ఎన్నికకు ఉండే ప్రాముఖ్యం నంద్యాల ఉప ఎన్నిక సంతరించుకోవడం విశేషం. నంద్యాల ఎన్నిక రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ విజయానికి నాంది పలుకుతుందేమో చూడాలి. ఫలితం ఏ విధంగా ఉన్నప్పటికీ ఇది చారిత్రక ఉపఎన్నిక కాబోతున్నది. రాజకీయ విలువలకూ, నైతికతకూ ప్రజలు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఈ ఎన్నికలో నిర్ధారణ అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
నేడు ‘నైతిక’ పరీక్ష
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు శనివారం ఇంటర్ విద్యార్థులకు నైతిక, మానవ విలువల పరీక్ష నిర్వహించనున్నట్లు డీవీఈఓ టీవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఆర్ఐఓ వై.పరమేశ్వరరెడ్డిలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నైతిక పరీక్ష, ఈ నెల31వ తేదీన పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.