
కబీర్ దాస్ ఆధ్యాత్మిక కవి. సాధువు. మధ్యయుగ భక్తి ఉద్యమ కారుల్లో ఆయన ఒకరు. ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన... రామానంద బోధనలకు ప్రభావితమై ఆయన్ని గురువుగా స్వీకరించారు. కబీర్ అన్ని మతాల అర్థరహిత, అనైతిక పద్ధతులను ప్రధానంగా ప్రశ్నించారు. ఆయన మరణించినప్పుడు హిందువులు– ముస్లింలు ఇరువురూ ఆయనను తమవారంటే తమవారని చెప్పుకున్నారు.
కబీర్ సత్యాన్ని తెలుసుకోవడానికి, ‘అహాన్ని‘ వదిలివేయమని సూచించారు. ఆయన రాసిన దోహాలు నాటి సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. అటువంటి కబీర్ జీవితంలో జరిగిన సంఘటనగా చెప్పే ఉదంతం ఇది: ఒకానొకరోజు కబీర్ తన కొడుకుని ఆవులకు మేత కోసం గడ్డి కోసుకు రమ్మన్నారు. సరేనని వెళ్లిన కుమారుడు చాలాసేపటి వరకు తిరిగి రాలేదు. దీంతో కబీర్ కొడుకును వెతుక్కుంటూ వెళ్లారు.
పచ్చిక బయళ్ల మధ్యలో నిల్చుని ఉన్న కొడుకు కనిపించాడు. చల్లటి గాలి వీస్తోంది. గడ్డి అటూ ఇటూ ఊగుతోంది. కబీర్ తన కొడుకు కూడా అది చూసి మైమరచిపోయి హుషారుగా ఊగుతూ ఉండడాన్ని చూశారు. దగ్గరకువెళ్లి ఎందుకు ఊగుతున్నావని అడిగారు. అప్పుడతను ‘నాన్నా! నేనిక్కడికి వచ్చేసరికి ఈ గడ్డంతా ఏకాంతంలో గాలికనుగుణంగా కదలాడుతోంది. ఆ దృశ్యం చూడటానికి ఎంతో బాగుంది. నాకు కూడా గడ్డితోపాటు అలా కదలాలనిపిస్తోంది. ఆహా! ఏమానందం? ఏమానందం?’ అన్నాడు.
ఇదీ చదవండి : బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!
అతని మాటలకు దిగ్భ్రాంతి చెందిన కబీర్, ‘నేను నిన్ను గడ్డి కోసుకురమ్మన్నాను కదా? మరచిపోయేవా?’ అన్నారు. అందుకు ‘ఏమిటీ? పచ్చికను కోయాలా? నేనెప్పటికీ అలా చేయలేను. నాకీ పచ్చిక ఎనలేని ఆనందాన్నిచ్చింది. నేను పచ్చికతో సన్నిహిత సంబంధాన్నిపెంచుకున్నాను. ప్రస్తుతానికి నేను వేరే ప్రపంచంలో ఉన్నాను’ అన్నాడతను. ‘ఈ భగవంతుని సృష్టిలో ప్రతిదీ విలువైనదే... ఆనందమిచ్చేదే’ కదా అంటూ కబీర్ కుమారునితో కలిసి వెనుదిరిగారు. (Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం!)
– యామిజాల జగదీశ్