Saint
-
క్యూబాలో వింత ఆచారం
కోరికలు తీర్చాలనో.. అవి తీరినందుకు మొక్కు చెల్లించుకోవడానికో ఆలయాల్లో పొర్లు దండాలు పెట్టడం చూస్తూనే ఉంటాం. క్యూబాలో కూడా ఇలాంటి సంస్కృతే ఉండటం విశేషం. పొర్లు దండాలు కాకున్నా సెయింట్ లాజరస్ ఊరేగింపు సందర్భంగా భక్తులు నేలపై పాకుతూ వెళ్తుంటారు. అందుకోసం భక్తులు పేదరికానికి ప్రతీకగా సంచులతో చేసిన బట్టలు వేసుకుంటారు. మోచేతులు, కాళ్లు రక్తమోడుతున్నా పట్టించుకోకుండా పాకుతారు. హవానా శివార్లలోని ఎల్ రిన్కాన్ అనే చిన్న చర్చికి చెప్పుల్లేకుండా నడిచి వెళ్తారు. కోర్కెలు తీర్చాల్సిందిగా లాజరస్ను మొక్కుకుంటారు. ఇది తాతల నాటి సంప్రదాయమట. ఏదేమైనా దాన్ని కచ్చితంగా ఆచరిస్తామని చెబుతారు వాళ్లు. క్యూబా నాస్తికత్వాన్ని వీడి 1992లో లౌకిక రాజ్యంగా మారింది. అక్కడ ఇటీవల బహిరంగ మత విశ్వాస ప్రదర్శనలు పెరిగాయి. 200 ఏళ్ల క్రితం బానిసలుగా వచ్చిన ఆఫ్రికన్లు యోరుబా మతంలోని శాంటరియా శాఖను తమతో తీసుకొచ్చారు. కొందరేమో బలవంతంగా కాథలిక్ మతంలోకి మారారు. దేశమంతటా ఈ రెండు మతాల సమ్మిళిత వాతావరణం ఉంటుంది. 1959 విప్లవం తరువాత క్యూబాలో వ్యవస్థీకృత మతాన్ని అణచివేసి శాంటరియా చాలావరకు విస్తరించింది. అది మతం కాదని క్యూబా ఆధ్యాత్మిక సంస్కృతి అని చెబుతుంటారు. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికాతో శత్రుత్వమున్నా ఒబామా హయాంలో దౌత్య సంబంధాలు కాస్త మెరుగయ్యాయి. కానీ 2016లో డొనాల్డ్ ట్రంప్ రాకతో క్యూబాపై ప్రతికూల ప్రభావం పడింది. మళ్లీ ట్రంప్ రాకతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడుతుందని క్యూబన్లు భయపడుతున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో మత విశ్వాసాలను నమ్ముకుంటున్నారు. -
స్వామీ బ్రహ్మానంద్ ఎవరు? ఎంపీ స్థాయికి ఎలా చేరారు?
దేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు (80) కలిగిన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశ రాజకీయాల్లో సాధువుల ప్రవేశం 90వ దశకంలో రామమందిర ఉద్యమం నుంచి ప్రారంభమైంది. ఇది నేటికీ కొనసాగుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన స్వామి బ్రహ్మానంద్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి బ్రహ్మానంద్ గోసంరక్షణ కోసం పాటుపడ్డారు. పార్లమెంటులో కూడా ఈ అంశంపై చర్చించారు. స్వాతంత్య్రానంతరం 1951-52లో తొలి సాధారణ ఎన్నికలు జరిగాయి. గోరఖ్‌నాథ్ పీఠానికి చెందిన మహంత్ దిగ్విజయ్నాథ్ 1952,1957 ఎన్నికలలో హిందూ మహాసభ నుండి పోటీ చేసినప్పటికీ, కాంగ్రెస్ ముందు సత్తా చాటలేకపోయారు. 1966లో స్వామి బ్రహ్మానంద్ స్వామి కర్పాత్రి మహారాజ్‌తో కలిసి లక్షలాది సాధువులతో కలసి గోహత్యను నిషేధించాలనే ఉద్యమాన్ని చేపట్టారు. దీనిపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ ఉద్యమ నేపధ్యంలో అప్పటి ప్రభుత్వం స్వామి బ్రహ్మానంద్‌ను అరెస్టు చేసి, జైలుకు తరలించింది. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల్లోకి రావాలని ఆయనను పలువురు కోరారు. దీంతో ఆయన జన్ సంఘ్‌లో చేరడం ద్వారా రాజకీయాల్లోకి కాలుమోపారు. 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ లోక్‌సభ స్థానం నుండి స్వామి బ్రహ్మానంద్ పోటీ చేసి విజయం సాధించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక సాధు సన్యాసి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికవడం అదే తొలిసారి. తరువాతి కాలంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ 1967లో బ్యాంకుల జాతీయకరణ అంశాన్ని లేవనెత్తినప్పుడు, స్వామి బ్రహ్మానంద్ అందుకు మద్దతుగా నిలిచారు. దీంతో జన్సంఫ్కు, స్వామి స్వామి బ్రహ్మానంద్కు మధ్య దూరం పెరిగింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో హమీర్పూర్ నుండి స్వామి బ్రహ్మానంద్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఈ విధంగా ఆయన రెండోసారి ఎంపీ అయ్యారు. -
నయా దోపిడీ: సాధువు వేషంలో పాములను మనుషులపైకి వదులుతూ..
రోజూ మాదిరిగానే ఆమె తన అత్యవసర పనుల కోసం బయటకు వచ్చింది. నగరంలోని రోడ్లు బిజీగా ఉన్నాయి. ఎంతో కష్టమీద ఆమెకు ఆటో దొరికింది. ఆమె ఆటోలో కూర్చుంది. ట్రాఫిక్ అధికంగా ఉన్న కారణంగా ఆటో మెల్లగా ముందుకు కదులుతోంది. ఇంతలో ఆమెకు రోడ్డుపై కాషాయవస్త్రాలు ధరించిన ఇద్దరు సాధువులు కనిపించారు. వారిద్దరూ ఆమె ప్రయాణిస్తున్న ఆటో దగ్గరకు వచ్చి.. ‘అమ్మా దానం చేయండి.. మీకు మేలు జరుగుతుంది’ అని అన్నారు. ఆమె ఆ సాధువులను చూసి, తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి, కొంత డబ్బు ఇవ్వాలనుకుంది. అయితే ఇంతలో వారు తమ దగ్గరున్న జోలెలో నుంచి ఒక పామును బయటకు తీశారు. ఆ పామును ఆ మహిళ ముఖం దగ్గరకు తీసుకువచ్చారు. పామును చూడగానే ఆమె హడలెత్తిపోయింది. గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. దీనిని గమనించిన ఆ సాధువులు ఆమె హ్యాండ్ బ్యాగ్ లాక్కున్నారు. దానిలో రూ. 2000 ఉన్నాయి. ‘భగవంతుడు మీకు మేలు చేస్తాడు’ అంటూ ఆ బ్యాగుతో సహా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ తరహా మోసాలకు పాల్పడే గ్యాంగ్ ఢిల్లీలో ఉంటూ గురుగ్రామ్‌లో జనాలను లూటీ చేస్తోంది. ఈ గ్యాంగ్‌లోని వ్యక్తులు సాధువుల వేషం ధరించి, జనానికి ఉండే భక్తి సెంటిమెంట్‌ను సద్వినియోగం చేసుకుంటూ, మోసాలకు పాల్పడుతున్నారు. బైక్, కారు, బస్సులలో ప్రయాణిస్తున్నవారిని ఈ గ్యాంగ్ టార్గెట్ చేసుకుంటోంది. వీరు ముందుగా జనాలను డబ్బులు అడుగుతారు. ఎదుటివారు పర్సు తీయగానే వారిపైకి పామును వదులుతారు. వారు భయపడగానే వారి దగ్గరున్న సొమ్ము లాక్కుని పాముతో సహా పారిపోతుంటారు. కొద్ది రోజుల క్రితం గుర్గ్రామ్కుచెందిన రాధావాణి అనే మహిళ తనకు జరిగిన ఈ విధమైన మోసం గురించి సెక్టార్-52 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాబాల వేషంలో తన దగ్గర నుంచి రూ.2000 లాక్కున్నారని ఆమె ఆ ఫిర్యాదులో తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆ మోసగాళ్లను పట్టుకున్నారు. ఇది కూడా చదవండి: చీకటి సొరంగమా?.. దట్టమైన అడవా?.. అబ్బురపరుస్తున్న వీడియో! -
నమ్మలేని నిజం.. 10 ఏళ్లకుపైగా ఎత్తిన చేతిని దించలేదు..!
మీ చేతిని పైకి ఎత్తి ఎంత సమయం వరకు ఉండగలరు? మహా అయితే ఓ 10-20 నిమిషాలు అతి కష్టంతో పైకి ఎత్తి ఉంచగలరేమో. కానీ, గంటలు కాదు, రోజులు కాదు.. ఏళ్ల తరబడి ఎత్తిన చేతిన దించకుండా ఉండటం అంటే నమ్మశక్యంగా లేదు కదా. అయితే, అది నిజం. ఓ సాధువు దానిని గతంలోనే చేసి చూపించారు. 70 ఏళ్ల సాధువు అమర్ భర్తీ.. సుమారు 50 ఏళ్లకుపైగా తన కుడి చేతిని పైకే ఎత్తి ఉంచినట్లు అప్పట్లో తెగవైరల్గా మారింది. తొలి రెండేళ్లు తీవ్రంగా నొప్పి ఉండేదటా! కానీ అది క్రమంగా తగ్గిపోయిందని, ఆ తర్వాత ఎలాంటి నొప్పిలేదని సాధువు అమర్ భర్తీ వెల్లడించారు. మరోవైపు.. ఆ చేతికి రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోవటం వల్లే ఎలాంటి నొప్పి కలగటం లేదని, ఇకపై ఆ చేతిని కిందకు దించలేదని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. 1973 వరకు అమర్ భర్తీ ఒక సాధారణ వ్యక్తే. అందరిలా వివాహం చేసుకుని పిల్లాపాలతో జీవించేవారు. ఆ తర్వాత తన జీవితాన్ని శివుడికి అంకితం చేయాలని నిశ్చయించుకుని సాధువుగా మారారు. తనలోని శివుడిపట్ల ఉన్న నిబద్ధతను చాటుకునేందుకు కుడి చేతిని పైకి ఎత్తి ఉంచటం మొదలు పెట్టారు. భర్తీ అంశం 2020లోనే వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే భర్తీ లాగే మరో వ్యక్తి చేతిని పైకి ఎత్తి ఉంచుతుండటం వెలుగులోకి వచ్చింది. అమర్ భర్తీ 50 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయలేకపోయినా.. తనకు సాధ్యమైనంత మేరకు చేతిని పైకి ఎత్తే ఉంచుతానని చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా చేతిని పైకి ఎత్తే ఉంచానని వెల్లడించారు. ఓ రిపోర్టర్ సాధువుతో మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎన్ని రోజుల పాటు ఇలా చేతిని పైకి ఎత్తి ఉంచుతారని విలేకరి ప్రశ్నించగా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. చేతిని పైకి ఉంచే నిద్రపోతానని, ఆ సమయంలోనూ ఎలాంటి ఇబ్బంది కలిగినట్లు అనిపించదని తెలిపారు. Guy from India hasen't put his arm down for 10 Years to honor his God 😱#amazing #india #pandit #guru #sacrifice #ENGvIND @unexpected_new pic.twitter.com/ldAVoXpMJi — Next Level (@NextInteresting) September 24, 2022 ఇదీ చదవండి: Viral Video: హీరో లెవల్లో యువకుడి బైక్ స్టంట్.. ఝలక్ ఇచ్చిన పోలీసులు -
ఒక యోగి మహా సమాధి
ఎంతోమంది మహనీయులకు జన్మనిచ్చిన గోరఖ్‌పూర్ ప్రపంచానికి అందించిన యోగిరత్నమే ముకుందలాల్ ఘోష్. బాల్యం నుంచే భక్తిభావాలతో యోగవిద్యను తెలుసుకునేందుకు పలువురు సాధువులను, సన్యాసులను కలుసుకునే సందర్భంలో పదిహేడో ఏట కోల్కతాలోయుక్తేశ్వరగిరి అనే సాధువును కలిశారు. వీరివద్దే సన్యాసాశ్రమ స్వీకారం చేసి స్వామి యోగానందగా గుర్తింపుపొందారు. క్రియాయోగ సాధనలో మెలకువలనూ నేర్చారు. వర్గభేదం లేని ఈ బోధలు జీవితపు అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమయే ధ్యానపద్ధతులతో పాటు జీవితంలో సర్వతోముఖ విజయాన్ని, క్షేమాన్ని సాధించగలిగే సంపూర్ణ తాత్విక బోధలను, జీవన విధానాన్ని కలిగి ఉన్నాయి. యోగానందులు అందరికీ ఆచరణ యోగ్యమైన భారతదేశపు ఆత్మసాక్షాత్కార బోధలను పాశ్చాత్యులకు ఆచరణయోగ్యంగానూ, అందుబాటులోనూ ఉండే విధంగా అమెరికాలో సెల్ఫ్–రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) ను స్థాపించారు. అనంతరం పశ్చిమబెంగాల్లో తొలి యోగ పాఠశాలను స్థాపించారు. ఆ మరుసటి ఏడాదే రాంచీలో మరో యోగ పాఠశాలను స్థాపించగా, తర్వాతి కాలంలో అదే భారత యోగా సత్సంగంగా రూపొందింది. పిమ్మట ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పర్యటించి భారతీయ యోగవిద్యకు విశేష ప్రచారం కల్పించారు. వీరి ప్రభావంతో క్రియాయోగం వైపు మళ్లిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ప్రభావవంతమైన గ్రంథంగా ‘ఆత్మకథ’ ఖండాంతర కీర్తి కలిగిన పరమహంస యోగానంద జీవిత చరిత్రను యోగద సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా ‘ఒక యోగి ఆత్మకథ’ పేరుతో గ్రంథరూపంలో ప్రచురించింది. ఈ గ్రంథం 20వ శతాబ్దపు 100 అత్యుత్తమమైన గ్రంథాలలో ఒకటిగా పేరుగాంచి నేటివరకు ఎన్నో ముద్రణలను పొందుతూ ఎంతోమంది సత్యాన్వేషకుల ఆధ్యాత్మిక పిపాసను తీర్చుతోంది. వర్తమానంలో ఆయన ప్రభావం పరమహంస రచనలు, ప్రసంగాలు, ధార్మిక గ్రంథాలకు ఆయన చేసిన సాధికార విశ్లేషణలు, ఇంట్లో చదువుకోగలిగే పాఠాలు అవ్యక్త పరమాత్మకు చెందిన సత్యాలపై వెలుగు ప్రసరిస్తాయి. విశ్వ చైతన్యమనే అనంత సాగరంలో మనిషి నేను అనే అహంకారాన్ని అధిగమించి పరమాత్మను తెలుసుకోవడంలో క్రియాయోగ ధ్యానం పాత్రను ఆయన నొక్కి చెప్పారు. ధ్యాన సాధనతో మీరు మీ హృదయంలోనే మీ వెంట మోసుకుపోగలిగిన స్వర్గం ఉందని కనుగొంటారన్నది ఆయన ఆచరణాత్మక బోధ. మనిషి చేసే మానసిక ఆధ్యాత్మిక కృషికి శాశ్వతమైన విలువ ఉంటుందనీ, మనిషి తన శక్తిని సరిగ్గా ఉపయోగించగలిగితే భౌతికంగా ఎదురయ్యే ఎన్నో అవరోధాలను జయించగలడనీ తన జీవితం ద్వారా నిరూపించిన పరమహంస యోగానంద.. చెడును మంచితోనూ, విచారాన్ని సంతోషంతోనూ, క్రూరత్వాన్ని దయతోనూ, అజ్ఞానాన్ని జ్ఞానంతోనూ జయించగలమన్న సందేశమిచ్చారు. ప్రాచీన శాస్త్రీయ ధ్యాన పద్ధతి ‘క్రియాయోగం’ యోగానంద బోధనలకు ప్రధాన ఇతివృత్తం. మానవ అస్తిత్వపు అంతిమ మర్మాలను విడమరిచే యోగానందుల జీవితాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టగలిగితే మనిషి జీవితం ఉన్నతమవుతుంది. ఇద్దరి మహా సమాధి రోజులు చిరస్థాయిగా నిలిచి ఉండే మహాగ్రంథమైన హోలీ సైన్స్‌ను రచించిన స్వామి యుక్తేశ్వర్ గిరి 1936, మార్చి 9 న ఒరిస్సాలోని పూరీలో తన శరీర త్యాగం చేయగా, ప్రపంచ విఖ్యాతి పొందిన ఆయన శిష్యులు పరమహంస యోగానంద మార్చి 7,1952 లో లాస్ ఏంజలిస్ లో ఉన్న బిల్ట్ మోర్ హోటల్లో మహాసమాధి చెందారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో వారి జ్ఞాపకార్థం మహా సమాధి రోజులు నిర్వహిస్తున్నారు. – డి.వి.ఆర్ -
సాధువు మృతి.. సంచిలో లక్షా 80 వేలు!
రాజమహేంద్రవరం క్రైం : రాజమండ్రిలోని యాచిస్తూ జీవనం గడుపుతూ మరణించిన ఓ వృద్ధ సాధువు జోలె సంచిలో రూ. లక్షా 80 వేల నగదు ఉండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. జోలె సంచిలో రకరకాల కవర్లలో సాధువు నగదు దాచుకున్నారు. ఆ సంచితోనే గోదావరి గట్టుపై ఆయన నిద్రించేవారు. కమల్ హాసన్ పుష్పకవిమానం సినిమాలోని సీన్ తరహాలోనే చనిపోయిన యాచకుడి వద్ద భారీ డబ్బు దొరికిందని అంటున్నారు. ఈ సంఘటన రాజమహేంద్రవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ త్రినా«థ్, ఎస్సై వెంకయ్య కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న మార్కెండేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న ప్రాంతంలో సుమారు 75 ఏళ్ల వృద్ధ సాధువుగా గత పదేళ్లుగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. గురువారం మధ్యహ్న భోజనం చేసిన అనంతరం గుడి వద్దకు చేరుకొని ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న ఉన్నవారు ప్రథమ చికిత్స చేసినా లాభం లేకపోయింది. అనంతరం గుండె నొప్పి వచ్చి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ సీఐ త్రినా«థ్, ఎస్సై వెంకయ్యలు మృతుడి వివరాల కోసం సాధువు వద్ద ఉన్న జోలేను తనిఖీ చేయగా దానిలో రూ. 1,80,465 ఉన్నట్టు గుర్తించారు. నగదును సంఘటన స్థలంలోనే లెక్కించి స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్‌టౌన్ ఎస్సై వెంకయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పేరు నాగేశ్వరరావుగా స్థానికులు చెబుతున్నారు. -
నేను ఇలా చెయ్యడం సముచితమేనా?
ఆయన ఓ సాధువు. ఆయన దగ్గర బోలెడంత మంది శిష్యులున్నారు. ఓ రోజు ఆయన వద్దకు ఓ పాత శిష్యుడు వచ్చాడు. గురువుగారికి నమస్కరించాడు. అవీ ఇవీ మాట్లాడుకున్నాక అతను ‘‘గురువుగారూ నాకో సందేహం. మనసెప్పుడూ గందరగోళంగా ఉంటోంది’’ అన్నాడు శిష్యుడు.‘‘ఎందుకు?’’ గురువుగారు ప్రశ్నించారు.‘‘నేను మీ దగ్గరున్న రోజుల్లో పద్ధతి ప్రకారమే ధ్యానపద్ధతులు నేర్చుకున్నాను. అంకితభావంతోనే అనుసరించాను. ఆ ధ్యానపద్ధతులు నాకు తగిన ప్రశాంతతనే ఇచ్చాయి. మంచి ఆలోచనలు చేయగలుగుతున్నాను కూడా. ఇది అనుభవపూర్వకంగానే తెలుసుకున్నాను’’ అన్నాడు ఆ పాత శిష్యుడు. ‘‘అటువంటప్పుడు సంతోషమేగా... మరెందుకు గందరగోళం?’’ అన్నాడు గురువు.‘‘నేను ధ్యానంలో లేనప్పుడు పూర్తి మంచి వాడిగా ఉంటున్నానో లేదో అనే సందేహం కలుగుతోంది. ఆ విషయం నాకే తెలుస్తోంది. కొన్నిసార్లు సరిగ్గా లేనని అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడూ ఒకటి రెండు తప్పులు కూడా చేస్తున్నాను. ధ్యానం తెలిసిన నేను ఇలా చేయడం సముచితమేనా. అది ఆలోచించినప్పుడు నా మనసు కలవరపడుతోంది’’ అన్నాడు శిష్యుడు.అతను చెప్పిన మాటలన్నీ విన్న గురువుగారు ఓ నవ్వు నవ్వారు.‘‘ఆహా, నువ్వు ధ్యానమూ చేస్తున్నావు. తప్పులూ చేస్తున్నావు. అంతేగా నీ మాట’’ అన్నాడు గురువు.‘‘అవును గురువుగారూ...’’ అది తప్పు కదా అని అడిగాడు గురువు.‘‘కాదు. నువ్వు రోజూ ధ్యానం చెయ్యి. తప్పులూ చెయ్యి. ఇలాగే చేస్తూ ఉండు. ఏదో రోజు ఈ రెండింట్లో ఏదో ఒకటి ఆగిపోతుంది’’ అన్నాడు గురువు.‘‘అయ్యో.. గురువుగారూ అలా అంటే ఎలాగండీ... ఒకవేళ తప్పులకు బదులు ధ్యానం ఆగిపోతే..?’’ అని ప్రశ్నార్థకంగా చూశాడు శిష్యుడు గురువు వంక.‘‘అదీ మంచిదేగా....నీ నైజమేంటో నీ సహజత్వమేదో తెలిసొస్తుంది కదా’’ అన్నాడు గురువు. అర్థమైందన్నట్లుగా చిరునవ్వుతో తల పంకిస్తూ గురువుగారికి నమస్కరించాడతను. – యామిజాల జగదీశ్ -
నీకన్నా నేనే ఎక్కువ ఇస్తున్నా... నన్నెందుకు అసహ్యించుకుంటున్నారు!?
ఓ ఊళ్ళో ఒకడున్నాడు. అతనికి పిల్లా పీచూ అంటూ ఎవరూ లేరు. అయినా అతను మహాపిసినారి. ఎవరికీ ఏదీ ఇచ్చేందుకు అతనికి మనసు రాదు. చెయ్యి చాచినా సరే ఇవ్వడు. పైపెచ్చు విసుక్కొంటాడు. చీదరించుకుంటాడు. దాంతో ఊళ్ళోని వారంతా అతనిని లోపల్లోపల తిట్టుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఆ తిట్టూ శాపనార్థాలూ అతని చెవిన కూడా పడుతుండేవి. ఓ రోజు అతను ఓ సాధువు దగ్గరకు వచ్చాడు.‘‘అయ్యా, నేను చనిపోయిన తర్వాత నా ఆస్తిపాస్తులు అన్నీ ధర్మకార్యాలకు వినియోగించాలని వీలునామా రాసాను. కానీ వాళ్ళకీ విషయం తెలీదు. ఇది తెలీనందువల్లే కాబోలు నన్నెవరూ మెచ్చుకోరు... ఊళ్ళో నాకు మంచి పేరనేదే లేదు. అందరూ నన్ను మహాపిసినారి అని అంటుంటారు. వ్యంగ్యంగా ఏవో మాటలు అంటూనే ఉంటారు. వాళ్ళకేం తెలుసు.. నా ఆస్తంతా ధర్మానికే పోతుందని’’ అని మనసులోని బాధను చెప్పుకున్నాడు.అతని మాటలన్నీ విన్న సాధువు ‘‘అలాగా, అయితే నీకొక మాట చెప్పాలనుకుంటున్నాను’’ అని చెప్పడం మొదలుపెట్టాడు.‘‘అది ఓ ఆవుకు, పందికి మధ్య జరిగిన మాటల ముచ్చట. ఆ మాటలు విన్నావంటే నీకే విషయం అర్థమవుతుంది’’ అంటూ ఇలా చెప్పారు. ‘‘ఓ రోజు పంది ఆవుని చూసి బాధతో ‘ప్రజలందరూ నీ గురించి, నీ గుణగణాల గురించి తెగ పొగుడుతూ చెప్పుకుంటూ ఉంటారు. అదంతా నిజమే. కాదనను. నువ్వు వారికి పాలు ఇస్తావు. కానీ నీకన్నా నేనే వారికి ఎక్కువ ఇస్తున్నాను. నా మాంసాన్ని వారు తినేవారున్నారు. నన్ను వండి ఆకలి తీర్చుకుంటారు. నా దేహంలోని ఏ భాగాన్నీ వారు విడిచిపెట్టరు. నేను నన్ను పూర్తిగా వారికి అర్పిస్తున్నాను. అయినా ప్రజలు నన్ను ప్రశంసించరు. పైపెచ్చు నన్ను అసహ్యించుకుంటారు. దీనికి కారణమేంటీ’’ అని వాపోయింది. అప్పుడు ఆవు కాస్సేపు ఆలోచించింది. ఆ తర్వాత ఇలా చెప్పింది...‘‘నేను ప్రాణంతో ఉన్నప్పుడు వారికి ఉపయోగపడుతున్నాను. బహుశా అందుకే నన్నందరూ పొగుడుతారు. తలుస్తారు...’’ కాబోలు– వినమ్రతతో ఆవు చెప్పిన మాటలు విని పంది వాస్తవపరిస్థితిని అర్థం చేసుకుంది.పిసినారి అసలు విషయం గ్రహించాడు. తాను బతికున్నప్పుడే నలుగురికీ ఉపయోగపడాలి కానీ చనిపోయిన తర్వాత ఆస్తిపాస్తులన్నీ ధర్మకార్యాలకు ఉపయోగపడటం దేనికీ అనే నిజాన్ని గ్రహించాడు. ఉన్నప్పుడే నలుగురికీ తనవంతు సాయం చేయాలి, ధర్మం చేయాలి అనుకుని తన తీరు మార్చుకున్నాడు పిసినారి. – యామిజాల జగదీశ్ -
డ్రోన్ల ఫ్లయింగ్ శిక్షణ
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఐటీ, ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ ఆధ్వర్యంలో డ్రోన్ల ఫ్లయింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (టీఎస్‌ఏఏ)లతో ఒప్పందం చేసుకుంది. ఇది తెలంగాణలో తొలి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సర్టిఫైడ్ ట్రయినింగ్ అని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ఎంవోయూలో భాగంగా సైయంట్ శిక్షణ ఉపకరణాలను, టీఎస్‌ఏఏ మౌలిక వసతులు, నిర్వహణ బాధ్యతలను చేపడుతుందని తెలిపారు. ఐదు రోజుల శిక్షణ అనంతరం డీజీసీఏ రిమోట్ పైలెట్ లైసెన్స్ సర్టిఫికెట్ అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఏఏ సీఈఓ జీబీ రెడ్డి, సైయంట్ ఎండీ అండ్ సీఈఓ కృష్ణా బోడనపు పాల్గొన్నారు. -
సంస్కార బలం
ఒకసారి ఒక రుషి గాఢమైన సమాధి స్థితిలో ఒక తోవ పక్కన పడి ఉన్నాడు. ఒక దొంగ ఆ దోవలో వెళుతూ, ఆ రుషిని చూసి ఇలా ఆలోచించాడు. ‘‘వీడు కూడా దొంగ అయి ఉంటాడు. నిన్న రాత్రి కొన్ని ఇళ్లలో దొంగతనాలు చేసి అలసిపోయి ఇక్కడ పడి నిద్రపోతున్నాడు. ఈపాటికి పోలీసులు వీడికోసం వెతుకుతూ ఉండి ఉంటారు. వాళ్లు వచ్చేలోపలే నేను పారిపోవడం మేలు’’అనుకుని ఆ దొంగ అక్కడినుంచి పారి పోయాడు. కాసేపటి తర్వాత ఒక తాగుబోతు అక్కడికి తూలుకుంటూ వచ్చాడు. రుషిని చూసి ‘‘ఏరా! తాగి పడిపోయావా? నన్ను చూడరా! ఎంత తాగినా ఎలా నిలబడి ఉన్నానో!’’ అన్నాడు. చివరిగా అక్కడికి ఇంకొక సాధువు వచ్చి ఒక గొప్ప రుషి సమాధిస్థితిలో అక్కడ పడి ఉన్నాడని గ్రహించాడు. ఆ రుషి పక్కనే కూర్చుని ఆయన పాదాలు వత్తడం ప్రారంభించాడు. ప్రాపంచిక సంస్కారాలు నిజమైన ఆధ్యాత్మికతను, పవిత్రతను గుర్తించకుండా చేస్తాయి. అదెలాగంటే, పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా, ఒక మనిషి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిని బట్టే ఎదుటివారిని అంచనా వేస్తాడని చెప్పడానికి శ్రీ రామకృష ్ణపరమహంస ఈ కథను శిష్యులతో చెప్పారు. -
‘నాకు టోపీ పెట్టకండి’
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మరోసారి విపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించారు. హిందుత్వకి మారుపేరుగా చెప్పుకునే యోగి.. మఘర్‌లో ఉన్న ప్రసిద్ధ ప్రవక్త, కవి కబీర్ సమాధిని సందర్శించడానికి వెళ్లినప్పుడు ముస్లింలు ధరించే టోపీ / పగడీ ధరించడానికి నిరాకరించి విపక్షాలకు పని కల్పించారు. వివరాల ప్రకారం గురువారం(నేడు) కబీర్ ప్రవక్త 500వ వర్ధంతి వేడుకల సందర్భంగా ఆ మహాత్మునికి నివాళులు అర్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీ మఘర్‌కు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు యోగినే స్వయంగా మఘర్‌కు వెళ్లారు. ఆ సయంలో సమాధి నిర్వహకుడు ముస్లింలు ధరించే టోపీని యోగి తలపై పెట్టడానికి ముందుకు వచ్చాడు. కానీ టోపీ ధరించడానికి ఇష్టపడక వద్దని సున్నితంగా యోగి వారించారు. ముఖ్యమంత్రి చర్యను విపక్షాలు విమర్శిస్తున్నాయి. మతం పేరుతో యోగి సమాజాన్ని విడదీస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘ఆ టోపీ ఏ మతానికి చెందినది కాదు. అది కేవలం మర్యాదను సూచిస్తుంది. ముఖ్యమంత్రి అన్నాక అందరిని కలుపుకుపోవాలి. యోగి టోపీని ధరిస్తే బాగుండేద’ని కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారి అన్నారు. అయితే యూపీ మంత్రి వర్గంలోని ఏకైక ముస్లిం మంత్రి మొహ్సిన్ రాజా మాత్రం యోగీకి మద్దతు తెలిపారు. ‘ముఖ్యమంత్రికి టోపీ ఇవ్వడం.. ఆయన దాన్ని ధరించకపోవడం.. దాన్ని ప్రతిపక్షాలు ఇలా ప్రచారం చేయడం వీటన్నింటిని చూస్తుంటే మీరు ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో జనాలకు అర్ధం అవుతుంది. మీరు ప్రజలకు ఏ సందేశం ఇద్దామనుకుంటున్నారు? నేను ఒక ముస్లింనే. కానీ నేను ఎప్పుడు టోపీ ధరించలేదు. అంతమాత్రాన నేను ముస్లింను కానా? టోపీని ధరించకపోవడం పెద్ద నేరమా? ఈ విషయం గురించి మాట్లాడేవారు ఆలయాలకు వెళ్లి ప్రజలతో పాటు నిల్చుని, వారిని శుభాకాంక్షలు తెలుపుతున్నారా? ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలను విలువివ్వడం... మతాన్ని అవమానించడం ఎలా అవుతుంది. ముందు మనం మన ఆలోచనల్ని మార్చుకోవాలి’ అన్నారు. -
దొంగతనం చేయని సొమ్ము
‘మర్యాదగా సొమ్ములు ఎక్కడున్నాయో చెప్పు’ అని కత్తి తీశాడు దొంగ. ‘నా చదువుకు అంతరాయం కలిగించకు, అక్కడ పెట్టెలో ఉన్నాయి చూడు’ ఏమాత్రం ఉద్వేగపడకుండా చెప్పాడు సాధువు. ఒక సాధువు ఇంట్లో కూర్చుని మంత్రాలు ఏవో పఠిస్తున్నాడు. అప్పటికే బాగా రాత్రయింది. అయినా సాధువు లోతుగా పఠనంలో మునిగివున్నాడు. ఆ సమయంలో ఒక దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ అలికిడికి సాధువు ఏకాగ్రత చెదిరింది. ‘మర్యాదగా సొమ్ములు ఎక్కడున్నాయో చెప్పు’ అని కత్తి తీశాడు దొంగ. ‘నా చదువుకు అంతరాయం కలిగించకు, అక్కడ పెట్టెలో ఉన్నాయి చూడు’ ఏమాత్రం ఉద్వేగపడకుండా చెప్పాడు సాధువు. సాధువు చెప్పినట్టే దొంగ పెట్టె దగ్గరికి వెళ్లాడు. ‘అందులో కొన్ని నాకోసం ఉంచు, రేపు కొన్ని అవసరాలున్నాయి’ అన్నాడు సాధువు. సాధువు చెప్పినట్టే కొన్ని ఉంచి, మరికొన్ని సొమ్ములు తీసుకుని బయటికి వెళ్లబోయాడు దొంగ. ‘కనీసం సొమ్ములు తీసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పే మర్యాదైనా పాటించవయ్యా’ అన్నాడు సాధువు. దొంగ సిగ్గుపడ్డాడు. సాధువు చెప్పినట్టే ‘కృతజ్ఞతలు’ చెప్పి వెళ్లిపోయాడు. అయితే, ఆ రాత్రే ఆ దొంగను గస్తీ తిరుగుతున్న రక్షక భటులు పట్టుకున్నారు. తెల్లారి సాక్ష్యం తీసుకోవడం కోసం సాధువును పిలిపించారు. ‘లేదు, ఈయన నా సొమ్ములు దొంగతనం చేయలేదు. ఆయన కొన్ని కావాలన్నాడు, నేను ఇచ్చాను. దానికి బదులుగా కృతజ్ఞతలు కూడా చెప్పాడు’ అన్నాడు సాధువు. దాంతో, రక్షక భటులు దొంగను వదిలేశారు. ఆ తర్వాత ఆ దొంగ కూడా దొంగతనాన్ని వదిలేశాడు. -
నాలుగో బొమ్మ
ఒక రాకుమారుడి పట్టాభిషేకానికి ముందు ఒక సాధువు మూడు చిన్న బొమ్మలను అతడికి కానుకగా ఇచ్చాడు. ‘‘నేనేమైనా ఆడపిల్లనా! నాకు బొమ్మలిస్తున్నావు?’’ అన్నాడు రాకుమారుడు. సాధువు నవ్వాడు. ‘‘కాబోయే రాజుకు అవసరమైన కానుకలివి’’ అన్నాడు. ప్రశ్నార్థకంగా చూశాడు రాకుమారుడు.‘‘ప్రతి బొమ్మకు చెవిలో రంధ్రం ఉంటుంది. ఈ దారాన్ని ఆ బొమ్మల చెవిలోకి ఎక్కించి చూడు’’ అన్నాడు సాధువు. రాకుమారుడు మొదటి బొమ్మను తీసుకున్నాడు. ఆ బొమ్మ చెవిలోకి దూర్చిన దారం అవతలి చెవిలోంచి బయటికి వచ్చింది. ఈ రకం మనుషులు విన్నది విన్నట్లుగా గాలికి వదిలేస్తారు అని చెప్పాడు సాధువు. రాకుమారుడు రెండో బొమ్మ చెవిలోకి దూర్చిన దారం బొమ్మ నోట్లోంచి బయటికి వచ్చింది. ఈ రకం మనుషులు విన్నది విన్నట్లుగా బయటికి చెప్పేస్తారు అని చెప్పాడు సాధువు. రాకుమారుడు మూడో బొమ్మ చెవిలోకి దూర్చిన దారం ఎటు నుంచీ బయటికి రాలేదు! ఈ రకం మనుషులు విన్న దానిని తమ లోపలే నిక్షిప్తం చేసుకుంటారు అని చెప్పాడు సాధువు. ‘‘ఈ ముగ్గురిలో ఏ రకం మనుషులు నేను నమ్మదగినవారు?’’ అని అడిగాడు రాకుమారుడు. సాధువు నాలుగో బొమ్మను రాకుమారుడి చేతికి అందించాడు. ఆ నాలుగో బొమ్మ చెవిలోకి దారం దూర్చమన్నాడు. రాకుమారుడు దారం దూర్చగానే అది రెండో చెవిలోకి బయటికి వచ్చింది. మళ్లీ అదే బొమ్మలోకి ఇంకోసారి దారం దూర్చమని చెప్పాడు సాధువు. ఈసారి దారం నోట్లోంచి వచ్చింది. మళ్లీ ఒకసారి దారాన్ని దూర్చమని చెప్పాడు. అది ఎటువైపు నుంచీ బయటికి రాలేదు! ‘‘రాకుమారా ఈ నాలుగో రకం మనుషులే నువ్వు నమ్మదగినవారు, నువ్వు ఆధారపడదగినవారు. ఎప్పుడు వినకూడదో, ఎప్పుడు మాట్లాడకూడదో, ఎప్పుడు మౌనంగా ఉండకూడదో తెలిసిన వారే రాజ్యపాలనలో నీకు సహకారులుగా ఉండాలి’’ అని చెప్పాడు సాధువు. రాకుమారుడు సాధువుకు నమస్కరించి, నా నాలుగు బొమ్మలనూ తన దగ్గర ఉంచుకున్నాడు. ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండడం విజ్ఞత. ఎలా ఉండకూడదో అలా ఉండకపోవడం వివేకం. ఈ రెండూ ఉన్న వ్యక్తులు జీవితంలో రాణిస్తారు. -
రాజ్యంలో ఒకే ఒక్కడు
ఒక సాధువు ఊళ్లు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే.. నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంట పడింది. వంగి, చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ ఆ నాణెం వల్ల అతడికేం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అవసరం లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి. అవి చాలు. ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు. అందువల్ల ఆ నాణేన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు. దాని అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు! చివికిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్లూ సంతోషంగానే ఉన్నారు తప్ప, ఎవరినీ చెయ్యి చాచడం లేదు. సాధువుకు సంతోషం వేసింది. ప్రజలు సంతృప్తిగా ఉండడం, అతడికి సంతోషాన్నిచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు. తెల్లారి సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు, తన సైన్యంతో పక్కరాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే, రాజు వారికి ఆగమని సైగ చేసి, రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు. ‘‘ఓ సాధు పుంగవా.. రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను. నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి’’ అని కోరాడు. సాధువు తనకు దొరికిన నాణేన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ‘ఏమిటి దీనర్థం’ అన్నట్లు సాధువు వైపు చూశాడు. సాధువు చిన్నగా నవ్వి, ‘ఓ మహారాజా.. ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో, అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను. అలాంటి వాళ్లు ఒక్కరూ కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా, ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు. అందుకే ఈ నాణెం మీకు ఇచ్చాను’’ అని చెప్పాడు. రాజు అంతరార్థం గ్రహించాడు. దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు. నిరంతరం.. లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే, ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. ఆ భాగ్యం లేని వాడు.. ఎంత ఉన్నా.. ఏమీ లేనివాడే! -
నీ ఆలోచనలే నువ్వు
‘‘స్వామీ! నా మనసు బాగులేదు. ఏదైనా వైద్యం ఉంటే చేయరా ...’’ అని తన ముందు తలవంచుకుని నిల్చున్న వ్యక్తిని చూసి ఓ చిన్న నవ్వు నవ్వాడు జెన్ సాధువు. ‘‘నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. నిజానికి నీకు ఎలాంటి సమస్యా లేదు... నీకు ఏ మందూ అక్కరలేదు...’’ అన్నారు. ‘‘అలా అనకండి... నా మీద దయ ఉంచి సహాయం చేయండి. లేకుంటే ఏ స్థితికి లోనైపోతానో తలచుకుంటేనే భయమేస్తోంది...’’ అన్నాడు ఆ వ్యక్తి. ‘‘సరే! నేను నీకు ఓ మందు ఇస్తాను... కానీ ఓ షరతు... నువ్వు ఈ మందు వేసుకునేటప్పుడు మామిడి పండు గురించి ఆలోచించకూడదు.. సరేనా’’ అన్నారు సాధువు. ‘‘అలాగే’’ అంటూ గురువుగారి నుంచి ఆయన ఇచ్చిన మందు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడతను. మరుసటిరోజు ఉదయం, స్నానం చేసి మందు వేసుకోవడానికి కూర్చున్నాడు. ఆ క్షణమే అతనికి మామిడి పండు గురించి జ్ఞాపకం వచ్చింది. అతని మనసంతా మామిడి పళ్ళతో నిండిపోయింది. ‘‘ఏమిటిది?’’ అనుకున్న అతను అర గంట తర్వాత మళ్ళీ మందు వేసుకోవడానికి ఓ మూల కూర్చున్నాడు. మళ్ళీ ఇందాకలాగే అతనికి మామిడి పండు గుర్తుకు వచ్చింది. ఆరోజు అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా మామిడి పళ్ళు గుర్తుకు రావడంతో మందు వేసుకోలేక పోయాడు. ఇక లాభం లేదనుకుని అతను ఆ రోజు సాయంత్రం గురువు దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు నమస్కరించి ‘‘మీరు ఇచ్చిన మందు వేసుకోవడం నా వల్ల కాలేదు... ఎన్నిసార్లు ప్రయత్నించినా మామిడిపళ్ళు గుర్తుకు వస్తూనే ఉన్నాయి...’’ అన్నాడు బాధగా. ‘‘అవును... ఎందుకు మామిడి పండు జ్ఞాపకానికి రాకుండా ఉంటుంది. నేను నీకిచ్చింది మామిడి పండు రసమే... ఆ వాసన వస్తుంటే నీకు మామిడి పండు గుర్తుకు రాకుండా ఉంటుందా... మామిడిపండు గుర్తుకు వచ్చే తీరుతుంది...’’ అని నవ్వుతూ సాధువు మళ్ళీ ఇలా అన్నారు – ‘‘నువ్వు దేని గురించి ఆలోచిస్తావో అది నీ మనసులో మెదులుతూనే ఉంటుంది. నీకు బుద్ధి పని చేయడం లేదని పదే పదే అనుకుంటే నీకు బుద్ధి లేదనే అనిపిస్తుంది. అలా కాకుండా నీ బుద్ధి బాగానే ఉంది అనుకుంటే నీ బుద్ధి సవ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది... నువ్వు ఏది అనుకుంటే అదే నిజం... కనుక నువ్వు ఇప్పుడు ఏమనుకుంటావో ఆలోచించు... నీ ఇష్టం’’ అని అనడంతో అతను తన వాస్తవ స్థితిని తెలుసుకున్నాడు. తనకేమీ అనారోగ్యం లేదని అనుకుని గురువుకు దణ్ణం పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. -
మదర్ థెరిస్సా ఆశయాలను కొనసాగిద్దాం
– కర్నూలు, అనంతపురం డయాసిస్ బిషప్ పూల ఆంతోని కర్నూలు సీక్యాంప్: మధర్‌థెరిస్సా ఆశయాలను కొనసాగిద్దామని కర్నూలు, అనంతపురం డయాసిస్ బిషప్ పూలఆంతోని పిలుపునిచ్చారు. సోమవారం మాధవనగర్‌లోని లూర్ధుమాత దేవాలయంలో మధర్‌థెరిస్సా పట్టాభిషేకోత్సవ కార్యక్రమం జరిగింది. బిషప్ పూల ఆంతోని మాట్లాడుతూ.. మదర్థెర్సిస్సా సేవలు మరువలేనివన్నారు. శాంతి, ప్రేమ, జాలి, కరుణ, దయలను ఆయుధాలుగా చేసుకుని ప్రపంచాన్ని మార్చడానికి థెరిస్సా కృషి చేశారన్నారు. మదర్‌కు పునీత పట్టం ప్రకటించిన వాటికన్ సిటీకి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం సీక్యాంప్ సెంటర్ నుంచి చెక్పోస్ట్వరకు ర్యాలీ నిర్వహించారు. -
సెయింట్ థెరిసాకు మరో గౌరవం
ముంబయి: సెయింట్ హోదా పొందిన మదర్ థెరిసాకు భారత తపాళా సంస్థ తన కృతజ్ఞతను ప్రకటించింది.. వాటికన్ సిటీలో నేడు (సెప్టెంబర్ 4) భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత మదర్ థెరిసాకు ఆదివారం వాటికన్ సిటీలో సెయింట్‌హుడ్ బహూకరించారు. రోమన్ కేథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ ఈ అరుదైన బిరుదును ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత తపాళా సంస్థ ఆమె జ్ఞాపకార్థం ఆదివారం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఈ స్టాంపును డివైన్ చైల్డ్ హైస్కూల్లో విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మిషనరీ ఆఫ్ చారిటీస్ అధికార ప్రతినిధులుగా బిషప్ ఆగ్నెలో గ్రాసియస్, సిస్టర్ రూబెల్లా హాజరయ్యారు. -
హవ్వ.. ఆసారాం మహాత్ముడట!
జోధ్‌పూర్: 'పిల్లలూ ఈ రోజు పాఠంలో మనదేశంలో మహనీయులుగా వెలుగొందిన మహాత్ముల పేర్లు చెప్పుకుందాం. శంకరాచార్య, మదర్ థెరిసా, రామకృష్ణ పరమహంస, వివేకానంద, గురునానక్, సంత్ కబీర్.. ఆసారం బాపు.. రామ్ దేవ్ బాబా..' అప్పటి వరకూ టీచర్ చెబుతున్న పేర్లను వల్లెవేస్తూ వచ్చిన పిల్లలందరూ చివరి రెండు పేర్ల దగ్గర మాత్రం ఠక్కున ఆగిపోయారు! తమ లాంటి ఓ చిన్నారిని చిదిమేసే ప్రయత్నంచేసి, ప్రస్తుతం జైలులో ఉన్న ఆసారాం మహాత్ముడు ఎలా అవుతాడో ఆ చిన్ని బుర్రలు ఆలోచించడం మొదలుపెట్టాయి. కానీ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు.. వాటిని ముద్రించిన పబ్లిషర్లకు మాత్రం ఆ సందేహం ఇసుమంతైనా కలగలేదు. ప్రస్తుతం రాజస్థాన్ లోకి కొన్ని జిల్లాల పాఠశాలల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితి ఇది! 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై అరెస్టయిన ఆసారం బాబును మహాత్ముడిగా అభివర్ణిస్తూ.. ఆయన చిత్రపటాన్ని గుర్తించాల్సిందిగా మూడో తరగతి జీకే పుస్తకంలో చేర్చిన పాఠ్యాంశంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహోన్నతుల సరసన అత్యాచారం కేసులో నిందితుడ్ని ఎలా చేర్చుతారంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇలాంటి పాఠ్యాంశం ఒకటుందని తమకు ఇంకా తెలియరాలేదని విద్యాశాఖ అధికారు చెబుతున్నారు. ఇటు పబ్లిషర్ వివరణ మరోలా ఉంది. 'ఆసారంను పాఠ్యాంశంలో చేర్చేనాటికి ఆయనపై ఎలాంటి కేసులు లేవు. పుస్తకం ప్రింట్ అయి.. విద్యార్థులకు చేరిన తర్వాతే ఆయన అరెస్టయ్యాయి. వెంటనే ఆ పుస్తకాలన్నింటినీ వెనక్కి తెప్పించి.. కొత్త వాటిని ముద్రించేపనిలో ఉన్నాం' అని చెప్పాడు పబ్లిషర్. భావిభారత పౌరులకు బోధిస్తున్న పాఠ్యాంశాల్లో ఇలాంటివి ఇంకెన్ని విషయాలు బయటపడతాయో వేచిచూడాలి. -
ఆటలు ఎందుకు ఆడాలి?
జెన్ పథం అదొక మైదానం. అక్కడ ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ మార్గంలో నడుచుకుంటూ పోతున్న ఒక సాధువు ఆడుకుంటున్న పిల్లలను చూసి అక్కడే ఆగిపోయారు. పిల్లలు మహదానందంగా ఆడుకుంటున్నారు. వాళ్లకు చుట్టూ ఏం జరుగుతున్నదీ పట్టలేదు. వారి ఆటను చూసి సాధువు సంతోషించారు. ఓ గంటైంది. అనంతరం ఆయన చప్పట్లుకొట్టి వాళ్ల ముగ్గుర్నీ పిలిచారు. పిల్లలు ముగ్గురూ సాధువు వద్దకు వచ్చి ఆయనను ఎగాదిగా చూశారు. ఆయన వేషధారణ పిల్లలకు విచిత్రంగా అనిపించింది. పిల్లలు నవ్వు ఆపుకోలేకపోయారు. అయినా సాధువు వారిని కోపగించుకోలేదు. వాళ్లు నవ్వు ఆపిన తర్వాత సాధువు వారివంక చూసి ‘‘మీరెప్పుడూ ఇక్కడే ఈ మైదానంలోనే ఆడుకుంటారా?’’అని అడిగారు. ‘‘అవును’’ అని ముగ్గురూ ఒక్క మాటగా చెప్పారు. ‘‘ఇంతకీ ఎందుకు రోజూ ఆడుకుంటారు? దాని వల్ల మీకు కలిగే లాభమేంటి?’’ అని సాధువు ముగ్గురినీ ప్రశ్నించారు. అప్పుడు మొదటి కుర్రాడు ‘‘బాగా ఆడితే శరీరానికి ఎంతో మంచిది. దేహం గట్టిపడుతుంది. బలమొస్తుంది. అంతేకాదు, ఎవరికీ భయపడక్కర్లేదు. ఎదురుగా ఎవరొచ్చినా వారిని ఇట్టే ఎదుర్కోవచ్చు’’ అన్నాడు. ఆ కుర్రాడి మాటలు విని సాధువుకు ఆనందమేసింది. ‘‘నువ్వు తప్పకుండా బలవంతుడివవుతావు’’ అని ఆశీర్వదించారు. ఆ తర్వాత రెండో కుర్రాడు ‘‘హాయిగా ఆడితేనే మనసుకి ఉల్లాసంగా ఉంటుంది. ఆ తర్వాత మొహం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. ప్రశాంతంగా చదువుకోవచ్చు. చదివినదంతా బుర్ర కెక్కుతుంది’’ అన్నాడు. వాడి మాటలు విన్న సాధువు ‘‘బాగా చెప్పావు. నువ్వు గొప్ప విద్యావంతుడివవుతావు’’ అని ఆశీర్వదించారు. అనంతరం మూడో కుర్రాడు ‘‘నాకు ఆటలంటే ఇష్టం. అందుకే ఆడతాను’’ అని టూకీగా చెప్పాడు. అంతకన్నా మరేమీ మాట్లాడలేదు. సాధువు వాడికి నమస్కరించి ‘‘ఇకమీదట నువ్వే నా గురువు’’ అని అన్నారు. మనం చేసే ప్రతి పనికీ ఏవేవో కార ణాలు, ఫలితాలు, ప్రభావాలు ఉంటాయి. లాభనష్టాలు ఉంటాయి. వాటినే ఆలోచిస్తూ అయోమయంలో పడిపోక మనమున్న క్షణాన్ని ఆవగింజంత కూడా మిగల్చక అనుభవించాలి. అదే జెన్ పథంలోని తొలి మెట్టు. అప్పుడే ఏ బాదరబందీలుండవు. - యామిజాల జగదీశ్ -
మర్కట ముని..
ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మునిలా కనిపిస్తున్న ఈ మర్కటం ఫొటో అద్భుతం కదా.. ఇది ఇంత బాగుంది కాబట్టే.. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పోటీలో వైల్డ్ స్టోరీస్ విభాగంలో విజేతగా నిలిచింది. జాస్పర్ అనే ఫొటోగ్రాఫర్ జపాన్‌లో ఈ మంచుకోతి చిత్రాన్ని తీశారు. అవార్డులు పొందిన ఇలాంటి అనేక చిత్రాలతో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ లండన్‌లో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 17 వరకూ అది కొనసాగుతుంది. -
సర్వజ్ఞుడి తీర్పే మేలు
సాధ పురుషుడొకడు, ఓ సందులో, ఇళ్ల మధ్య నడిచి వెళ్తుంటే, ఎవరో పొయ్యి లోని బూడిద ఓ తట్టలోకి తీసి బయట పడేశారు. అది అతడి తల మీద పడింది. అందుకు సాధువు విచిత్రంగా స్పందించాడు. చేతులు జోడించి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ‘‘నిన్నేమని పొగడను దేవా! బూడిదకాక ముందు, ఆ పొయ్యిలో మండే బొగ్గులు నా తల మీద కుమ్మరించినా, చేసిన పాపాలకు అందుకు నేను అర్హుణ్నే. కానీ నీ అపారమైన దయ మూలంగా, అంతటి శిక్షను తగ్గించి, నిప్పులు బదులు, నేను ఓర్చుకోగలిగిన ఈ చల్లటి బూడిద పడేయించావు’’ అని విన్నవించుకున్నాడు. సాధుపురుషుడైనవాడే తాను ఒకప్పుడు - అది నిన్నగానీ, నిరుటేడు గానీ, ఈ జన్మలో గానీ, మరే జన్మలో గానీ - చేసిన కర్మకు ఫలితమునుభవిం చక తప్పదని తెలుసుకొని బ్రతుకుతుంటాడు. వర్తమా నంలో తానేదైనా ఇక్కట్టుకు గురైతే అది పూర్వజన్మ ఫలిత మని గ్రహించి, ఈ ఇక్కట్టును గానీ, దీనిని తనపై విధించిన విధాతను గానీ నిందించ కుండా, సంపూర్ణ సమ్మతితో అనుభవిస్తాడు. ఈ తెలివి లేనివాడు, ఈ కార్య కారణ సంబంధమెరుగనివాడు, ఆక్రోశపడుతూ దీని నుండి తప్పించుకోవడానికి పలు విఫలయత్నాలు చేసి అనుభవిస్తాడు. అనుభవమనేది ఇద్దరి విషయంలోనూ సమానమే. కానీ తెలివిగలవాడు ‘ప్రతిక్రియా’ భావం లేకుండా విధికి తల ఒగ్గాడు కాబట్టి, విధితో సహక రిస్తున్నాడు. కాబట్టి అతడి బాధ కాస్త ఉపశమిస్తుంది. తేలిగ్గా ఆ అనుభవం వెళ్లిపోతుంది. రెండోవానికి ఆ తెలివి, ఆ ఎరుక లేవు కాబట్టి ప్రతిక్రియా భావంతో పెనుగులాడి అనుభ వాన్ని మరింత కఠినంగా చేసు కుంటాడు. అవగాహన లేని మానవుడు రోదిస్తాడు. విసు గును ప్రదర్శిస్తాడు. కొత్త పాపం చేయకూడదనే గుణ పాఠం నేర్చుకోడు. జన్మ పరంపర కొనసాగుతుంది. ఎదురుగా ఉన్న వాస్తవం ‘భగవంతుడు’ అని అనుకుంటే (ట్రూత్ రియాలిటీ) ఈ ఎదురుగా ఉన్నది భగవదేచ్ఛ ప్రకారమే జరుగుతున్నదనుకోవాలి. భగవంతుడు సృష్టిస్తున్న కోటానుకోట్ల జీవరాశిలో మనం ఒకరం. మనం ఒకప్పుడు చేసిన కర్మలకి ఎలాంటి ఫలితమనుభవిం చాలో అతడికి తెలిసినంతగా మనకు తెలియదు. నీకు విధాయకంగా ఏది మేలు చేస్తుందో, దీర్ఘకాల భవి ష్యత్తును దృష్టిలో ఉంచుకొని దానినే విధి నిర్వర్తిస్తున్నది. ఇది నమ్మితే నీ సమస్య పరిష్కారమవుతుంది. నువ్వు నమ్మకపోయినా, జరిగేది అంతే జరుగుతుంది. నమ్మని వారు అంతఃసంఘర్షణ పడుతూ శక్తిని కోల్పోతుంటారు. ఎంతగట్టిగా అనుకున్నప్పటికీ ‘ఇదేమేలని’ ఖాయంగా చెప్పగలిగేది లేదు. మనకా సర్వజ్ఞత్వమెలావుంటుంది! ఆ సర్వజ్ఞుడికి తెలిసి ఉండవచ్చు. మన పరిమితమైన జ్ఞానాన్ని విశ్వసించడం బదులు, ఆ సర్వజ్ఞుడి తీర్పును శిరసావహించడం శ్రేయోదాయకమవచ్చు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
ఇద్దరు పోప్‌లకు సెయింట్ హోదా
పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన పోప్ 23వ జాన్, పోప్ రెండో జాన్పాల్లకు అరుదైన గౌరవం కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ పోప్ పదహారో బెనెడిక్ వాటికన్ సిటీ: పోప్ 23వ జాన్, పోప్ రెండో జాన్పాల్లకు సెయింట్ హోదాను కల్పిస్తూ పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఆదివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ వారికి సెయింట్ హోదాతో అరుదైన గౌరవం కట్టబెట్టారు. పోప్ ఫ్రాన్సిస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ పోప్ పదహారో బెనెడిక్ట్ కూడా రోమన్ కేథలిక్ మతాధికారులతో కలిసి హాజరు కావడం విశేషం. ఇంతకుముందెప్పుడూ పోప్, రిటైర్డ్ పోప్ ఇలాంటి బహిరంగ కార్యక్రమంలో పాల్గొనలేదు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ తొలుత సెయింట్ హోదా కల్పించే ప్రక్రియను లాటిన్లో పఠించారు. అనంతరం 23వ జాన్, రెండో జాన్‌పాల్‌లు ఇక సెయింట్లు అని, వారిని ఇకపై చర్చి ఆరాధిస్తుందని ప్రకటించారు. దీంతో సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి టైబర్ నది దాకా ఒక్కసారిగా భక్తుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. గతేడాది రిటైర్ అయిన తర్వాత అజ్ఞాతంలోనే ఉంటానని పోప్ బెనెడిక్ట్ ప్రకటించినప్పటికీ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్ కోరారు. అయితే కేథలిక్ చర్చి ఐక్యతను చాటేలా ఇద్దరు పోప్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం పోప్‌లకు సెయింట్ హోదాపై వివాదాలకు తావు లేకుండా చూడాలనేదానికి సంకేతంగా నిలిచింది. కాగా పోప్ 23వ జాన్ 1958 నుంచి 1963లో పరమపదించేదాకా పోప్ పదవిలో ఉన్నారు. పోప్ రెండో జాన్‌పాల్ 1978-2005లో పరమపదించేదాకా పోప్ పదవిలో కొనసాగారు. కే రళ కేథలిక్కుల సంబరాలు: కేరళను సందర్శించిన ఏకైక పోప్ అయిన పోప్ రెండో జాన్‌పాల్ అంటే కేరళలోని కేథలిక్కులకు ప్రత్యేక అభిమానం. 1986లో ఆయన రెండు రోజులు కేరళలో పర్యటించారు. సిస్టర్ అల్ఫోన్సా, కురియకోస్ ఎలియాస్ చవరా అచెన్ల బీటిఫికేషన్ కోసం కేరళకు వచ్చిన ఆయన పర్యటనకు ముందు మళయాళం నేర్చుకుని మరీ విచ్చేశారు. ఆయనకు సెయింట్ హోదా ప్రకటించడంతో కేరళలోని కేథలిక్కులు సంబరాల్లో మునిగారు.