కోరికలు తీర్చాలనో.. అవి తీరినందుకు మొక్కు చెల్లించుకోవడానికో ఆలయాల్లో పొర్లు దండాలు పెట్టడం చూస్తూనే ఉంటాం. క్యూబాలో కూడా ఇలాంటి సంస్కృతే ఉండటం విశేషం. పొర్లు దండాలు కాకున్నా సెయింట్ లాజరస్ ఊరేగింపు సందర్భంగా భక్తులు నేలపై పాకుతూ వెళ్తుంటారు. అందుకోసం భక్తులు పేదరికానికి ప్రతీకగా సంచులతో చేసిన బట్టలు వేసుకుంటారు. మోచేతులు, కాళ్లు రక్తమోడుతున్నా పట్టించుకోకుండా పాకుతారు. హవానా శివార్లలోని ఎల్ రిన్కాన్ అనే చిన్న చర్చికి చెప్పుల్లేకుండా నడిచి వెళ్తారు. కోర్కెలు తీర్చాల్సిందిగా లాజరస్‌ను మొక్కుకుంటారు.
ఇది తాతల నాటి సంప్రదాయమట. ఏదేమైనా దాన్ని కచ్చితంగా ఆచరిస్తామని చెబుతారు వాళ్లు. క్యూబా నాస్తికత్వాన్ని వీడి 1992లో లౌకిక రాజ్యంగా మారింది. అక్కడ ఇటీవల బహిరంగ మత విశ్వాస ప్రదర్శనలు పెరిగాయి. 200 ఏళ్ల క్రితం బానిసలుగా వచ్చిన ఆఫ్రికన్లు యోరుబా మతంలోని శాంటరియా శాఖను తమతో తీసుకొచ్చారు. కొందరేమో బలవంతంగా కాథలిక్ మతంలోకి మారారు. దేశమంతటా ఈ రెండు మతాల సమ్మిళిత వాతావరణం ఉంటుంది. 1959 విప్లవం తరువాత క్యూబాలో వ్యవస్థీకృత మతాన్ని అణచివేసి శాంటరియా చాలావరకు విస్తరించింది.
అది మతం కాదని క్యూబా ఆధ్యాత్మిక సంస్కృతి అని చెబుతుంటారు. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికాతో శత్రుత్వమున్నా ఒబామా హయాంలో దౌత్య సంబంధాలు కాస్త మెరుగయ్యాయి. కానీ 2016లో డొనాల్డ్ ట్రంప్ రాకతో క్యూబాపై ప్రతికూల ప్రభావం పడింది. మళ్లీ ట్రంప్ రాకతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడుతుందని క్యూబన్లు భయపడుతున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో మత విశ్వాసాలను నమ్ముకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment