ఎంతోమంది మహనీయులకు జన్మనిచ్చిన గోరఖ్‌పూర్ ప్రపంచానికి అందించిన యోగిరత్నమే ముకుందలాల్ ఘోష్. బాల్యం నుంచే భక్తిభావాలతో యోగవిద్యను తెలుసుకునేందుకు పలువురు సాధువులను, సన్యాసులను కలుసుకునే సందర్భంలో పదిహేడో ఏట కోల్‌కతాలోయుక్తేశ్వరగిరి అనే సాధువును కలిశారు. వీరివద్దే సన్యాసాశ్రమ స్వీకారం చేసి స్వామి యోగానందగా గుర్తింపుపొందారు.
క్రియాయోగ సాధనలో మెలకువలనూ నేర్చారు. వర్గభేదం లేని ఈ బోధలు జీవితపు అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమయే ధ్యానపద్ధతులతో పాటు జీవితంలో సర్వతోముఖ విజయాన్ని, క్షేమాన్ని సాధించగలిగే సంపూర్ణ తాత్విక బోధలను, జీవన విధానాన్ని కలిగి ఉన్నాయి. యోగానందులు అందరికీ ఆచరణ యోగ్యమైన భారతదేశపు ఆత్మసాక్షాత్కార బోధలను పాశ్చాత్యులకు ఆచరణయోగ్యంగానూ, అందుబాటులోనూ ఉండే విధంగా అమెరికాలో సెల్ఫ్–రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) ను స్థాపించారు.
అనంతరం పశ్చిమబెంగాల్‌లో తొలి యోగ పాఠశాలను స్థాపించారు. ఆ మరుసటి ఏడాదే రాంచీలో మరో యోగ పాఠశాలను స్థాపించగా, తర్వాతి కాలంలో అదే భారత యోగా సత్సంగంగా రూపొందింది. పిమ్మట ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పర్యటించి భారతీయ యోగవిద్యకు విశేష ప్రచారం కల్పించారు. వీరి ప్రభావంతో క్రియాయోగం వైపు మళ్లిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
ప్రభావవంతమైన గ్రంథంగా ‘ఆత్మకథ’
ఖండాంతర కీర్తి కలిగిన పరమహంస యోగానంద జీవిత చరిత్రను యోగద సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా ‘ఒక యోగి ఆత్మకథ’ పేరుతో గ్రంథరూపంలో ప్రచురించింది. ఈ గ్రంథం 20వ శతాబ్దపు 100 అత్యుత్తమమైన గ్రంథాలలో ఒకటిగా పేరుగాంచి నేటివరకు ఎన్నో ముద్రణలను పొందుతూ ఎంతోమంది సత్యాన్వేషకుల ఆధ్యాత్మిక పిపాసను తీర్చుతోంది.
వర్తమానంలో ఆయన ప్రభావం
పరమహంస రచనలు, ప్రసంగాలు, ధార్మిక గ్రంథాలకు ఆయన చేసిన సాధికార విశ్లేషణలు, ఇంట్లో చదువుకోగలిగే పాఠాలు అవ్యక్త పరమాత్మకు చెందిన సత్యాలపై వెలుగు ప్రసరిస్తాయి. విశ్వ చైతన్యమనే అనంత సాగరంలో మనిషి నేను అనే అహంకారాన్ని అధిగమించి పరమాత్మను తెలుసుకోవడంలో క్రియాయోగ ధ్యానం పాత్రను ఆయన నొక్కి చెప్పారు. ధ్యాన సాధనతో మీరు మీ హృదయంలోనే మీ వెంట మోసుకుపోగలిగిన స్వర్గం ఉందని కనుగొంటారన్నది ఆయన ఆచరణాత్మక బోధ.
మనిషి చేసే మానసిక ఆధ్యాత్మిక కృషికి శాశ్వతమైన విలువ ఉంటుందనీ, మనిషి తన శక్తిని సరిగ్గా ఉపయోగించగలిగితే భౌతికంగా ఎదురయ్యే ఎన్నో అవరోధాలను జయించగలడనీ తన జీవితం ద్వారా నిరూపించిన పరమహంస యోగానంద.. చెడును మంచితోనూ, విచారాన్ని సంతోషంతోనూ, క్రూరత్వాన్ని దయతోనూ, అజ్ఞానాన్ని జ్ఞానంతోనూ జయించగలమన్న సందేశమిచ్చారు. ప్రాచీన శాస్త్రీయ ధ్యాన పద్ధతి ‘క్రియాయోగం’ యోగానంద బోధనలకు ప్రధాన ఇతివృత్తం. మానవ అస్తిత్వపు అంతిమ మర్మాలను విడమరిచే యోగానందుల జీవితాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టగలిగితే మనిషి జీవితం ఉన్నతమవుతుంది.
ఇద్దరి మహా సమాధి రోజులు
చిరస్థాయిగా నిలిచి ఉండే మహాగ్రంథమైన హోలీ సైన్స్‌ను రచించిన స్వామి యుక్తేశ్వర్ గిరి 1936, మార్చి 9 న ఒరిస్సాలోని పూరీలో తన శరీర త్యాగం చేయగా, ప్రపంచ విఖ్యాతి పొందిన ఆయన శిష్యులు పరమహంస యోగానంద మార్చి 7,1952 లో లాస్ ఏంజలిస్ లో ఉన్న బిల్ట్ మోర్ హోటల్‌లో మహాసమాధి చెందారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో వారి జ్ఞాపకార్థం మహా సమాధి రోజులు నిర్వహిస్తున్నారు.
– డి.వి.ఆర్
Comments
Please login to add a commentAdd a comment