ఈనెల జూలై 18వ తారీకు నుంచి అధిక శ్రావణమాసం ప్రారంభం అవుతోంది. 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం ఇది. ఈ మాసం నేటి(జూలై 18) నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు అధిక శ్రావణ మాసం ఉంటుంది. అయితే ఈ అధిక మాసం అనేది కేవలం వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మాసాలకు మాత్రమే వస్తుంది. మిగతా మాసాలకు ఎప్పుడూ అధిక మాసం రాదు. ఐతే ముందుగా ఈ అధిక మాసం వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది. అసలు అధికమాసం ఎందుకు వస్తుంది?. అంటే ఇది డూప్లికేట్ అని అర్థమా? ఎలాంటి జపతప వ్రతాలు ఆచారించాల్సిన పని లేదా?
అధికమాసం ఎందుకు వస్తుదంటే..
తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, రుతువులు, పంచాంగ గణన ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంపావు రోజులు వ్యత్యాసం ఉంటుంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇలా ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం అవదు. చాంద్రమానంలో సూర్య సంక్రాంతి లేని మాసాన్ని అధికమాసం అంటారు. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని పిలుస్తారు.
ఇది పాటించం అంటే కుదరదు..
కొన్ని ఏళ్ల తర్వాత జోడు శ్రావణ మాసాలు రావడం జరిగింది. శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తామో అదేవిధంగా మొదటి శ్రావణంలో కూడా అవే నియమాలను తప్పక పాటించాలి. ఉదాహరణకు కవల పిల్లలు పుడితే వద్దంటామా..? లేదు కదా అలాగే జోడు శ్రావణ మాసాలు వచ్చినప్పుడు కూడా ఒకటి పాటిస్తాం మరొకటి పాటించము అంటే ధర్మశాస్త్రము అంగీకరించదు. కావున రెండూ శ్రావణ మాసాలే. మొదటి శ్రావణ మాసంలో కూడా వ్రతాలు, పూజలు అనగా శ్రావణ సోమవారాలను, శ్రావణ శుక్రవారాలను, శ్రావణ శనివారాల వంటివి, అలాగే మధ్య మాంసాలను స్వీకరించకుండా కేవలం సాత్విక ఆహారాలను మాత్రమే స్వీకరించడం తదితరాలన్ని చేయాల్సిందే.
విష్ణువుకి ఎంతో ఇష్టమైనది..
శ్రీమహా విష్ణువుకి మహా ప్రీతికరమైన మాసం ఇది. అందుకే దీన్ని అధిక రాధా పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఈ మాసంలో చేసే దానాలు, వ్రతాలు అధిక ఫలితాలనిస్తాయి. ఈ మాసంలో ఏది దానం చేసిన శ్రీ అధిక రాధా పురుషోత్తమ ప్రీత్యర్థం ఇస్తున్న దానం పేరు చెప్పి కరిష్యే అనాలి. అలాగే ఈ రోజుల్లో శ్రీ అధిక రాధా పురుషోత్తమాయ నమః అని 108 సార్లు జపం చేయాలి. విష్ణువు శ్రీమహాలక్ష్మికి ఓ సందర్భంలో పురుషోత్తమ మాస విశిష్టతను వివరిస్తూ ‘ఎవరైతే ఈ మాసంలో పుణ్య నదీస్నానాలు, జపహోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయి. అధిక మాసంలో పుణ్యకర్మలు ఆచరించని వారి జీవితాల్లో కష్టనష్టాలు ఎదురవుతాయి. అధిక మాసం శుక్ల పక్షంలో కానీ, కృష్ణ పక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి నాడైనా పుణ్యకార్యాలు చేయాలి. దానివల్ల వారికి అపారమైన ఫలితం లభిస్తుందని వివరించాడని పురాణ కథనం.
Comments
Please login to add a commentAdd a comment