కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు, విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. వారాణాసి లాంటి ఉత్తర భారతదేశంలోఇదే రోజుని దేవ దీపావళి, దేవ దివాళి అని పిలుస్తుంటారు. అలాగే అలాగే దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల దీన్ని త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. అంత పరమ పవిత్రమైన ఈ కార్తీక పూర్ణిమ వెనుకున్న నేపథ్యం, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా..!
ఏం చేస్తారంటే..
కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి ఆ పరమ శివుడిని పూజించి రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకి ఆనవాయితీ. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే , శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని... అందులోనూ పవిత్రమైన నదుల్లో ఈ నదీ స్నానం మరింత పవిత్రతని , పుణ్యంని చేకూరుస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందువల్లే కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వారణాసి భక్తుల రాకతో కిటకిటలాడుతుంటుంది.
ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన చేస్తే మరింత పుణ్యం , పూజా ఫలం దక్కుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది కార్తిక పౌర్ణమి రోజున 365 దీపాలు వెలిగిస్తుంటారు. దీనికి అర్థం.. సంవత్సరంలో ఒక్కో రోజుకి ఒక్కో దీపం చొప్పున అన్ని దీపాలు ఈ పరమ పవిత్రమైన రోజే వెలిగించి మీ అనుగ్రహం కోరుకుంటున్నాను దేవా అని.
సత్యనారాయణ వ్రతం :
సత్యనారాయణ వ్రతం జరుపుకోవడానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన రోజు మరొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు కారణం ఆ శ్రీ మహా విష్ణువుకి ఈ కార్తీక పౌర్ణమి అతి ప్రీతి పాత్రమైనది కావడమే. అందుకే మిగతా రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయడం కన్నా కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతానికే పూజా ఫలం అధికం అని అంటుంటారు పెద్దలు.
ఏకాదశి రుద్రాభిషేకం :
ఈరోజు శివనామస్మరణతో మోగిపోయే ఆలయాలన్నింటిలో సర్వ సాధారణంగా కనిపించేది ఏకాదశి రుద్రాభిషేకం. పదకొండుసార్లు రుద్ర చమకం లేదా శివ నామస్మరణతో శివుడిని అభిషేకించడమే ఈ ఏకాదశి రుద్ర అభిషేకం ప్రత్యేకత.
జ్వాలాతోరణం...
ఈ రోజు సంధ్యాసమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీపరమేశ్వరులను పల్లకిలో ఉంచి ఈ తోరణం నుంచి మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకిని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుంచి చేసిన పాపాలన్నీ పటాపంచలై సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని శాస్త్రవచనం.
ఈ పూర్ణిమకు మరొక పేరు..
కార్తీక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీకపురాణం ప్రకారం ఈరోజు దీపదానం, సాలగ్రామ దానం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇవి కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని భక్తుల నమ్మకం. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ప్రాముఖ్యత గలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. పౌర్ణమినాడు శ్రీ కృష్ణుని రాసలీలకు పెట్టినది పేరు. అందువలన ఈ రోజు శ్రీ కృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతమైనది.
మరోవేపు సిక్కులు , జైనులు కూడా..
సిక్కులు , జైన మతస్తులు కూడా ఈ కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటుంటారు. సిక్కులు దైవంగా భావించే శ్రీ గురు నానక్ పుట్టింది కార్తీక పౌర్ణమి రోజే కావడంతో సిక్కులు ఈ రోజుని పవిత్రమైనదిగా భావిస్తారు. జైన్లు కూడా ఈ కార్తీక పౌర్ణమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment