మానవుల మార్గదర్శనం కోసం అల్లాహ్ అన్ని కాలాల్లో, అన్నిజాతుల్లో తన ప్రవక్తలను ప్రభవింప జేశాడు. గ్రంథాలనూ అవతరింప జేశాడు. హజ్రత్ ఆదం (అ) మొదలు, ముహమ్మద్ ప్రవక్త (స) వరకు అనేక మంది సందేశహరులు భూమండలంపై జన్మించారు. వారిలో చిట్టచివరి దైవప్రవక్త ముహమ్మద్ (స). ఆయనపై అవతరించిన చివరి గ్రంథం పవిత్ర ఖురాన్ . ఇక ప్రళయకాలం వరకూ ప్రవక్తలూ రారు, గ్రంథాలూ అవతరించవు. కనుక మానవులు ప్రళయకాలం వరకు ఆయనను అనుసరించవలసిందే. ముహమ్మద్ ప్రవక్త తనంత తాను ఏమీ బోధించలేదు. మానవుల సంక్షేమం కోసం, సాఫల్యం కోసం దైవం అవతరింపజేసిన హితోపదేశాలనే ఆయన మానవాళికి అందజేశారు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశల్లో, వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో, ఏది హితమో, ఏది హితం కాదో ఆచరణాత్మకంగా ఆయన విశద పరిచారు.
అందుకే ఆయన ప్రపంచ మానవాళికి సంపూర్ణ మార్గదర్శిగా పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని పవిత్ర జీవనానికి సంబంధించిన కొంత సమాచారాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. దాదాపు 1450 సంవత్సరాల క్రితం అరేబియా దేశంలోని మక్కానగరంలో ముహమ్మద్ ప్రవక్త (స) జన్మించారు. ఆమినా, అబ్దుల్లాహ్ తల్లిదండ్రులు. పుట్టకముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. తాతయ్య ఆయన్ని పెంచారు. చిన్నతనం నుంచే అనేక సుగుణాలను పుణికి పుచ్చుకున్న ముహమ్మద్ ప్రవక్త, ‘అమీన్’గా, ‘సాదిఖ్’గా వినుతికెక్కారు. ఆయన గొప్ప మానవతావాది. సంస్కరణాశీలి. ఉద్యమనేత. అతి సాధారణ జీవితం గడిపిన సామ్రాజ్యాధినేత. జ్ఞానకిరణాలు ప్రసరింపజేసిన విప్లవజ్యోతి. ప్రాణశత్రువును సైతం క్షమించిన కారుణ్య కెరటం.
సుమారు వెయ్యిన్నర సంవత్సరాలంటే.. ఆ సమాజం ఎంత అనాగరికంగా ఉండేదో నేటి ఆధునికులకు తెలియనిదేం కాదు. ప్రవక్త జననానికి ముందు నాటి సమాజంలో ‘కర్రగలవాడిదే బర్రె’ అన్నట్లుగా బలవంతుడు బలహీనుణ్ణి పీక్కుతినేవాడు. స్త్రీల హక్కుల విషయం కాదుగదా అసలు వారికంటూ ఓ వ్యక్తిత్వం ఉన్న విషయాన్నే వారు అంగీకరించే వారు కాదు. స్త్రీని విలాస వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు. అలాంటి జాతిని అన్ని విధాలా సంస్కరించి, వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దిన ఘనత ముహమ్మద్ ప్రవక్తకే దక్కింది. నాటి సమాజంలో లేని దుర్మార్గమంటూ లేదు. అలాంటి ఆటవిక సమాజాన్ని నిరక్షరాస్యులు అయిన ముహమ్మద్ ప్రవక్త సమూలంగా సంస్కరించి, ఒక సత్సమాజంగా ఆవిష్కరించారు.
ప్రవక్త బోధనల ప్రకారం...
మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. ఆయనకు మాత్రమే భయపడాలి. తోటిమానవుల్ని, సమాజాన్ని ప్రేమించాలి. స్త్రీలను గౌరవించాలి. ఎలాంటి స్థితిలోనూ నీతినీ, న్యాయాన్ని విస్మరించకూడదు. అనాథలను, వృద్ధులను ఆదరించాలి. తల్లిదండ్రులను సేవించాలి. వారిపట్ల విధేయత కలిగి ఉండాలి. బంధువులు, బాటసారులు, వితంతువులు, నిస్సహాయుల పట్ల తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. సంఘంలో ఒక మనిషికి మరో మనిషిపై పడే విధ్యుక్త ధర్మాల పట్ల ఉపేక్ష వహించకూడదు. అన్యాయం, అధర్మ సంపాదనకు ఒడికట్టవద్దు. ధనాన్ని దుబారా చేయవద్దు. వ్యభిచారం దరిదాపులకు పోవద్దు. దానికై పురిగొలిపే అన్నిరకాల ప్రసార ప్రచార సాధనాలను రూపుమాపాలి. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపవద్దు. ప్రజల ధన, మాన, ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిని సాధించలేదు. సదా సత్యమే మాట్లాడాలి. చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి. వాగ్దాన భంగానికి పాల్పడకూడదు. పలికే ప్రతి మాటకూ, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది.
వ్యాపార లావాదేవీల్లో, ఇచ్చి పుచ్చుకోవడాల్లో లెక్కాపత్రాలు, కొలతలు, తూనికలు చాలా ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలి. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలి. తోటి మానవ సోదరులను తమకన్నా తక్కువగా చూడకూడదు. స్త్రీ జాతిని గౌరవించాలి. ఆమె మీకు జన్మనిచ్చిన తల్లి. ఆత్మీయత కురిపించే చెల్లి. ప్రేమించే ఇల్లాలు. అమ్మ పాదాల చెంత స్వర్గం ఉంది. వితంతువుల్ని చిన్నచూపు చూడకూడదు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలి. శుభకార్యాల్లో వారినీ ఆహ్వానించాలి. వితంతువుల పునర్వివాహం వారి హక్కు. అజ్ఞానకాలపు దురాచారాలు, దుర్మార్గాలన్నింటినీ నేను అంతం చేస్తున్నాను. ఒక మనిషికి మరో మనిషిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మానవులంతా ఒక్కటే. విద్యార్జన స్త్రీలు, పురుషులు అందరి విధి. జ్ఞానం జీవితం.. అజ్ఞానం మరణం. కళ్ళున్న వాళ్ళు, గుడ్డివాళ్ళు సమానం కానట్లే, జ్ఞాన సంపన్నులు, జ్ఞాన విహీనులు సమానం కాలేరు.
ప్రతి తల్లీదండ్రీ తమ సంతానానికి విద్య నేర్పాలి. భావితరాల సంక్షేమానికి ఇది చాలా అవసరం. అధికార దుర్వినియోగం చేయకూడదు. పరిపాలన అంటే కేవలం ప్రజాసేవ మాత్రమే... పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని భావించాలి. ప్రతినిత్యం ప్రజలకు జవాబుదారుగా దైవానికి భయపడుతూ జీవించాలి. ఇక్కడ మనం పలికే ప్రతి మాటకు, చేసే ప్రతిపనికీ రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవాలన్న భావన కలిగి ఉండాలి. ఇలాంటి భావనలే మానవులను మంచివారుగా, నిజాయితీ పరులుగా, సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. ఇటువంటి బాధ్యతాభావాన్ని, జవాబుదారీ తనాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ప్రజల మనసుల్లో నూరిపోసి, మానవీయ విలువలతో తులతూగే ఓ చక్కని సత్సమాజాన్ని ఆవిష్కరించారు. అందుకే ఆయన మానవాళికి ఆదర్శమయ్యారు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment