‘మిలాద్ ఉన్ నబి’: మహా ప్రవక్త జననం | Milad Un Nabi 2024 Know all about the Festival in India | Sakshi
Sakshi News home page

‘మిలాద్ ఉన్ నబి’: మహా ప్రవక్త జననం

Published Mon, Sep 16 2024 10:04 AM | Last Updated on Mon, Sep 16 2024 10:48 AM

Milad Un Nabi 2024 Know all about the Festival in India

చరిత్ర పుటలపై చెరగని సంతకం మహా ప్రవక్త జననం 

అజ్ఞానతిమిరంలో తచ్చాడే మానవజాతికి జ్ఞానకాంతులతో సన్మార్గం చూపిన మహాత్ముడు ఇహలోకం వీడి దాదాపు 1450 సంవత్సరాలు అవుతున్నా ఆ మహనీయుని బోధలు మనవద్ద సురక్షితంగా ఉన్నాయి. వాటిని గనక మనం ఆచరించగలిగితే, నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ అధిగమించి ఓ సుందర సత్సమాజాన్ని ఆవిష్కరించు కోవచ్చు. నేటి పరిస్థితుల నేపథ్యంలో ముహమ్మద్‌ ప్రవక్త(స) బోధనల పట్ల 
దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

క్రీ.శ. 571 ఏప్రిల్‌ నెల ఇరవయ్యోతేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో ముహమ్మద్‌ ప్రవక్త(స) జన్మించారు. తల్లి దండ్రులు ఆమినా, అబ్దుల్లాహ్‌. ఈ మహనీయుడు జన్మించక ముందే తండ్రినీ, ఆరేళ్ళ   ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. అనాథ అయిన ఆరేళ్ళ బాబును తాతయ్య అక్కున చేర్చుకున్నారు. నీతి, నిజాయితీ, సేవాతత్పరత, సత్యసంధత, విశ్వసనీయత ఆయనకు ఉగ్గుపాలతోనే అలవడ్డాయి. ఈ కారణంగానే ఆయన ప్రజల మనసులు చూరగొని ‘సాదిఖ్‌ ’గా, ‘అమీన్‌’ గా పిలవబడ్డారు. 

ముహమ్మద్‌కు చదవడం, రాయడం రాదు. అయినా ఆయన బోధలు యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. నాటి యావత్‌ అరేబియా ద్వీపకల్పమంతా ఆయన బోధనలకు ఆకర్షిత మైంది. ఫలితంగా సమస్త దుర్మార్గాలూ అంతమయ్యాయి. అసత్యం, అవినీతి, అక్రమాలు, దోపిడి, సారాయి, జూదం, వడ్డీ, అంటరానితనం, హత్యలు, అత్యాచారాలు అన్నీ సమసి పోయాయి. స్త్రీ అంగడి సరుకు అన్న భావన నుంచి, స్త్రీని గౌరవించనిదే దైవప్రసన్నత దుర్లభమన్న విశ్వాసం వేళ్ళూనుకుంది. అన్నిరకాల చెడులు, అసమానతలుఅంతమై పొయ్యాయి.

బడుగులు, బలహీనుల హక్కులు పరిరక్షించబడ్డాయి. మానవ సమాజంలో అన్ని విధాలా శాంతి, సౌభాగ్యాలు పరిఢవిల్లాయి. అందుకే, ధర్మబోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ‘ముహమ్మద్‌ ’ మాత్రమేనని ఎన్‌ సైక్లోపీడియా ఆఫ్‌ బ్రిటానికా ఘనంగా కీర్తించింది. అంతేకాదు, ప్రారంభకాలపు మూల గ్రంథాలన్నీ ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా, సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని ప్రకటించింది. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహా పురుషులను గురించి మైకేల్‌ హెచ్‌.హార్ట్‌ ఒక పుస్తకం రాశారు. అందులో రాసిన వందమంది మహాపురుషుల జాబితాలో ‘ముహమ్మద్‌’ ప్రవక్త పేరు అందరికన్నా అగ్రస్థానంలో మనకు కనిపిస్తుంది. ఇంతమంది ఇన్నిరకాలుగా ప్రశంసించిన ఆమహనీయులు నేడు మనమధ్యలేరు.

కాని ఆయన బోధనలు మనవద్ద సురక్షి తంగా ఉన్నాయి. మనం వాటిని ఆచరించ గలిగితే చాలు. ఎందుకంటే, నేటి మన సమాజం అన్నిరకాల అవలక్షణాలతో సతమతమవుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ఎంతప్రగతి సాధించినా, నైతిక, ధార్మిక, మానవీయ రంగాల్లోమాత్రం తిరోగమనంలోనే ఉన్నామన్నది నిజం. నేటి మన సమాజంలో ఏరంగమూ సంతృప్తికరంగాలేదు. ఎంత ప్రగతిపథంలో పయనిస్తున్నా, నేటికీ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. స్త్రీలకు రక్షణలేని పరిస్థితి. అవినీతి, అక్రమాలకు కొదవే లేదు. మద్య΄ానం, జూదం, అశ్లీలం, అంటరానితనం, నిరక్షరాస్యత, ఆడసంతానం హత్యలు, అత్యాచారాలు, హత్యా రాజకీయాలు నిరాఘాటంగా సాగిపోతూనే ఉన్నాయి. ఇవన్నీ సమసి΄ోవాలంటే, సమాజం నుండి ఈ దుర్మార్గాలు అంతం కావాలంటే, నీతి, నిజాయితీలతో కూడిన, ఎలాంటి వివక్ష, తారతమ్యాలకు తావులేని, ఉన్నత మానవీయ విలువలతో నిండిన సుందర సౌభాగ్యవంతమైన సమాజం పునర్‌ నిర్మాణం కావాలంటే ఈ అమృత బోధనలను అధ్యయనం చేయాల్సిన, ఆచరించాల్సిన అవసరం ఉంది.

(నేడు ప్రవక్త జయంతి  ‘మిలాదున్నబీ’)
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement