సంక్రాంతి సందడి
మూడు రోజుల ముచ్చట
దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు అడుగుపెట్టే సమయంలో వచ్చే అందమైన పండుగ సంక్రాంతి. ఊరూ వాడా అంతా సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా మొదలైపోయాయి. తెల్లవారుఝామున భోగి మంటలతో ఆరంభమై మకర సంక్రాంతి, పొంగళ్లు, కనుమ, ముక్కనుమ మూడు రోజుల పాటు ముచ్చటైన వేడుకలతో పల్లెలన్నీ కళకళ లాడతాయి. ఈ వేడుకల్లో ప్రధానమైంది భోగిపళ్లు. పిల్లలకు భోగి పళ్లు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? ఎలా పోయాలి? ఈ విషయాలు తెలుసుకుందాం రండి.
సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు..చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే రేగుపళ్లు పోయడం ద్వారా చాలా రోగాల నుంచి రక్షణ లభిస్తుందంటారు పెద్దలు. అంతేకాదు వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం పోతుందని ప్రతీతి. సూర్యుడికి ప్రతీకగా, పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారనీ, అలాగే ఆరోజన పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోస్తే సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.
రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే ఆ లోక నాయరాణుని కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ల పోసే వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తారు.
భోగి రోజు వచ్చిందంటే... ఇంట్లో చిన్నపిల్లలందరికీ భోగి పళ్లు పోసే వేడుక నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతారు అమ్మమ్మలు, అమ్మలు. ఎలాగా పిల్లలందరికీ భోగి రోజు పొద్దున్నే భోగి మంటల సందడి ఉంటుంది. పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకొని, తలారా స్నానాలు చేసి, కొత్త బట్టలు వేసుకొని భోగిమంటల విభూదిని దిద్దుకుంటారు.నోటి తీపి చేసుకుంటారు. ఇక భోగి పళ్లు పోస్తున్నామంటూ ముత్తుయిదువలను పేరంటానికి ఆహ్వానిస్తారు. సాయంత్రం ఇంట్లో 10 ఏళ్ల లోపు పిల్లలందరికీ కొత్త బట్టలు తొడిగి ముస్తాబు చేస్తారు. రేగి పళ్లు, పూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు, నానబెట్టిన సెనగలు, అక్షింతలు మొదలైనవి కలిపి ఉంచుతారు. అందరు రాగానే, తూర్పు ముఖంగా కానీ, ఉత్తరముఖంగా చిన్నారులను కూర్చోపెడతారు.
ఎలా పోయాలి?
ఇంట్లోని పెద్దవాళ్లు (అమ్మమ్మ, నానమ్మ) తల్లి కలిపి ఉంచుకున్న భోగిపళ్లను మూడు గుప్పిళ్లతో పిల్లల శిరస్సు చుట్టూ దిష్టి తీసినట్టు తలచుట్టూ తిప్పి పోయాలి. అంటే మూడు సార్లు సవ్య దిశలో, మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి తలమీద పోయాలి. ఆ తరువాత పేరంటాళ్లు కూడా ఇలాగే చేయాలి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని పిల్లల్ని నిండు మనస్సుతో దీవించాలి.
ఈ సందర్భంగా "ఓం సారంగాయ నమః" అనే నామం చెప్పాలని పెద్దలు చెబుతారు.ముత్తయిదువలకు పండూ ఫలం కానుకగా ఇస్తారు. ఇలా కార్యక్రమం పూర్తైన తర్వాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వదిలిపెడతారు. పిల్లలకు దిష్ట పోవాలని తీసినవి కాబట్టి, ఈ రేగు పళ్లును ఎవరూ తినకూడదని కూడా చెబుతారు.
విశిష్టత
శ్రీమన్నారాయణుడు రేగుచెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాన్ని తింటూనే తపస్సు చేశాడని చెబుతారు. రేగుపళ్లను అర్కఫలం అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్య భగవానుడు. సూర్యుడితో సమానంగా రేగుపళ్లను భావించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ భోగిపళ్లు పోస్తారు. రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలు కూడా ఉండడంతో చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయట.
Comments
Please login to add a commentAdd a comment