bhogi
-
ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడమే పండుగ!
సంక్రాంతి తల్లి సకల సౌభాగ్యాలు ఇచ్చే కల్పవల్లి. తెలుగు లోగిళ్ళలో భోగి, సంక్రాంతి, కనుమ పేరిట 3 రోజులపాటు వైభవోపేతంగా జరుగుతుంది. సంక్రాంతి ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలిపే పండుగ. గత సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించే పండుగ. రైతు ఇంటికి పౌష్యలక్ష్మి సమృద్ధిగా వచ్చి చేరే కాలం కాబట్టి రైతు తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటాడు. భోగి తెల్లవారు జామున భోగిమంటలు వేసి చలి కాచుకుంటారు. వచ్చిన వారంతా మంటల్లో భోగి పిడకలు వేస్తారు. ఈ మంటలపై మరిగించిన నీళ్ళతో తలంటు స్నానాలు చేస్తారు. యువతులు ఇళ్ళ ముంగిట గొబ్బెమ్మలు పెట్టి, వాటి చుట్టూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. ఈరోజునే ఐదేళ్ల లోపు పిల్లలపై భోగిపళ్ళు పోయడమనే సంప్రదాయముంది. రేగుపళ్ళునే భోగిపళ్ళుగా వినియోగించడం పరిపాటి.మరుసటి రోజు సంక్రాంతి. ఇది చాలా ముఖ్యమైన రోజు. పెద్దలంతా కోడికూత జామునే నిద్ర లేస్తారు. స్నానాదులు ముగించి, ఉపవాసముంటారు. పితృదేవతలకు భక్తిశ్రద్ధలతో పొత్తర్లు పెడతారు. పిండివంటలను నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తారు. కొత్త బట్టలు, మడపళ్ళు మూలన పెట్టి సమర్పిస్తారు. మూడోరోజు కనుమ. ఇది పశువుల పండగ. ప్రత్యేకించి గోవులకు పూజ చేస్తారు. అందుకే పశువులను అందంగా అలంకరిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు పూస్తారు. పూల మాలలు కడతారు. వండిన పిండివంటలను పశువులకు తినిపిస్తారు. ఇలాగే ముక్కనుమ రోజున కూడా పశుపూజ ఉంటుంది.ఇంకా... పల్లెల్లో అడుగడుగునా ధనుర్మాసపు శోభ తాండవిస్తుంది. వీధులన్నీ పచ్చని మామిడి తోరణాలతో, అరటిబోదులతో, చెరకు గడలతో అలంకరించబడతాయి. బొమ్మల కొలువులు, సాము గరిడీలు, సంగిడీలు ఎత్తడాలు, గంగిరెద్దుల వారి నాదస్వర గీతాలు, డూడూ బసవన్న నాట్యాలు, హరిదాసుల కీర్తనలు, రంగస్థల పద్య నాటకాలు, మేలుకొలుపు గీతాలు, బుడబుక్కల వారి పాటలు, కొమ్మదాసరుల విన్యాసాలు, పిట్టల దొరల హాస్య సంభాషణలు, జంగమ దేవరల పొగడ్తలతో పల్లె వాతావరణం పరిమళ భరితమౌతుంది. అందుకే సంక్రాంతి పండుగను సకల కళల సమాహారంగా కవులు అభివర్ణిస్తారు. కోస్తాంధ్ర అంతటా సంక్రాంతి వేడుకలు కన్నులపండువగా జరుగుతాయి. తమిళనాడులో జల్లికట్టు వలె, దక్షిణ కోస్తాలో కోడిపందాలు (ప్రభుత్వ అనుమతి లేనప్పటికీ) జోరుగా నిర్వహిస్తారు. వీటిని ప్రజలు తండోపతండాలుగా వెళ్లి చూస్తారు.పిల్లలైతే కొత్త బట్టలు ధరించి, గాలిపటాలు ఎగరవేస్తూ సందడి చేస్తారు. పండుగ రోజుల్లో ఇంటి ముంగిళ్ళన్నీ రంగురంగుల రంగవల్లికలతో కళకళలాడుతాయి. అన్నావదినలతో, అక్కాబావలతో యువతీ యువకులంతా సరదాగా పండగ సమయాలను గడుపుతారు. సంప్రదాయంగా వస్తున్న ముగ్గుల పోటీలు, ఎడ్లబళ్ళ పందాలు, కబడ్డీ, వాలీబాల్ వంటి గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహిస్తారు. మైసూర్–కలకత్తాలలో దసరా ఉత్సవాల వలె, పూణే–హైదరాబాదులో గణపతి నవరాత్రి ఉత్సవాలు మాదిరి కోస్తాంధ్ర అంతటా సంక్రాంతిని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. తమ వారితో కలసి పండుగలో పాల్గొనేందుకు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్నవారు స్వగ్రామాలకు చేరుకుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరమైతే జనం లేక బోసిపోతోంది. ఇలా వచ్చిన వారంతా తమ ఊరిలో పండుగ మూడు రోజులూ ఉత్సాహంగా గడుపుతారు. ఎన్నో మధుర జ్ఞాపకాలను మదినిండా పదిలపరుచుకుంటారు. పండుగయ్యాక వలస జీవులంతా పట్టణాలకు తిరుగు ప్రయాణ మవుతారు.పండుగలు మన సంస్కృతీ సాంప్రదాయాలలో భాగంగానే పుట్టాయి. పండుగలు జాతీయ సమైక్యతా భావనకు చిహ్నాలు. వివిధ పండుగలను కులాల, మతాలకతీతంగా సామరస్యంగా జరుపుకోవడం మన కర్తవ్యం. మన వైవిధ్య జీవనానికి పండుగలు గొప్ప ప్రతీకగా నిలుస్తాయి. పండుగల నిర్వహణలో ఆచార వ్యవహారాలు అన్ని ప్రాంతాలలో ఒకేలా ఉండవు. ఐనప్పటికీ పండుగ యొక్క సామాజిక, సాంస్కృతిక ధ్యేయం ఒకటే కాబట్టి, అంతటా ఒకేలా ఐక్యత పరిఢవిల్లుతుంది. భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే విశిష్ట లక్షణాన్ని కలిగియున్నది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడూతాను ఇష్టపడుతున్న జీవనాన్ని స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. దీనిలో భాగంగానే తాను కోరుకున్న సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తన జీవితంలో ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా మేళవించుకోవచ్చు.పిల్లా తిరుపతిరావు వ్యాసకర్త తెలుగు ఉపాధ్యాయులుమొబైల్: 7095184846 -
విభేదాలూ, విద్వేషాలను దహించేసి.. భోగాల రాగాలు
మన్మథుడికి వసంతుడి లాగా, భోగి పండగ సంక్రాంతికి సామంతుడు. పెద్ద పండగకు హంగుదారు. ‘సంక్రాంతి లక్ష్మి వేంచేస్తు న్నదహో, బహుపరాక్!’ అని ముందస్తు హెచ్చరికలు చేస్తూ, ఊరంతటినీ ఉత్తేజపరిచి, పండగ కళకు పటిష్ఠమైన పునాది వేస్తుంది.ధనుర్మాసపు ముచ్చటలకు యథోచితంగా భరతవాక్యం పలికి, పౌష్యయోష ఆగమనానికి అంగరంగ వైభవంగా రంగం సిద్ధం చేస్తుంది. మకర సంక్రమణం జరగ బోతున్న మహత్తర ముహూర్తం వేళకు, చప్పటి సాధారణ జీవితపు స్తబ్ధతను వది లించే ప్రయత్నం చేస్తుంది. చలిమంటల నెపంతో, ఆబాల గోపాలంలోనూ సంబరాల వేడి పుట్టిస్తుంది. పల్లె సీమలలో ప్రతి ఇంటి ముంగిటా సమృద్ధికి సంకేతాలుగా, సంతుష్టికి గుర్తులుగా, పూర్ణ కలశాల ‘కుండ ముగ్గులు’ పూయిస్తుంది.వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి! /అరటి స్తంభాలతో అందగింతాము, / బంతి పూదండలన్ భావించుదాము, / తామరాకులతోడ దళ్ళల్లు దాము, / కలవ కాడల తోడ మెలికలేతాము! అంటూ (రాయప్రోలు వారి) పాటలు పాడుతూ వచ్చి, అందరినీ హుషారు చేస్తుంది.మరో రకంగా చూస్తే, సుదీర్ఘమైన సంక్రాంతి ఉత్సవంలో భోగి పండగ భోగానుభవాల రోజు. పులకింతలు కలిగించే చలిమంటలూ, ఉత్సాహం పెంచే ఉష్ణోదక అభ్యంగన స్నానాలతో ఆరంభించి, కొత్త బట్టల కోలాహలాలతో, వంటలు, పిండి వంటల ఆటోపాలతో, ఆత్మారాముడిని ఆనందపరిచే రోజు భోగి. సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభ సమయం. మార్తాండుడి మకర సంక్రమణ వేళ. కనుక దానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎక్కువ. ఆ రోజు ఆస్తికులు దానాలూ, తపాలూ, పితృతర్పణాల లాంటి ఆధ్యాత్మిక వ్యాసంగాలలో ఎక్కువ కాలం గడుపుతారు. కాబట్టి, సరదాలకూ, భోగాలకూ సమయం సరిపోక పోవచ్చు. కాబట్టి భోగినాడే చలిమంటలలో విభేదాలూ, విద్వేషాలూ, ఈర్ష్యా సూయల లాంటి నకారాత్మక భావనలు యథాశక్తి దహించేసుకొని, ఆ రోజంతా బంధుమిత్రుల సాంగత్యంలో ఉల్లాసంగా గడిపి, జీవితంలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ నింపుకొని, ఆపైన జరపవలసిన సంక్రాంతి విధులకు సన్నద్ధం కావాలి.అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు!– ఎం. మారుతి శాస్త్రి -
Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?
దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు అడుగుపెట్టే సమయంలో వచ్చే అందమైన పండుగ సంక్రాంతి. ఊరూ వాడా అంతా సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా మొదలైపోయాయి. తెల్లవారుఝామున భోగి మంటలతో ఆరంభమై మకర సంక్రాంతి, పొంగళ్లు, కనుమ, ముక్కనుమ మూడు రోజుల పాటు ముచ్చటైన వేడుకలతో పల్లెలన్నీ కళకళ లాడతాయి. ఈ వేడుకల్లో ప్రధానమైంది భోగిపళ్లు. పిల్లలకు భోగి పళ్లు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? ఎలా పోయాలి? ఈ విషయాలు తెలుసుకుందాం రండి.సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు..చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే రేగుపళ్లు పోయడం ద్వారా చాలా రోగాల నుంచి రక్షణ లభిస్తుందంటారు పెద్దలు. అంతేకాదు వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం పోతుందని ప్రతీతి. సూర్యుడికి ప్రతీకగా, పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారనీ, అలాగే ఆరోజన పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోస్తే సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే ఆ లోక నాయరాణుని కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ల పోసే వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తారు. భోగి రోజు వచ్చిందంటే... ఇంట్లో చిన్నపిల్లలందరికీ భోగి పళ్లు పోసే వేడుక నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతారు అమ్మమ్మలు, అమ్మలు. ఎలాగా పిల్లలందరికీ భోగి రోజు పొద్దున్నే భోగి మంటల సందడి ఉంటుంది. పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకొని, తలారా స్నానాలు చేసి, కొత్త బట్టలు వేసుకొని భోగిమంటల విభూదిని దిద్దుకుంటారు.నోటి తీపి చేసుకుంటారు. ఇక భోగి పళ్లు పోస్తున్నామంటూ ముత్తుయిదువలను పేరంటానికి ఆహ్వానిస్తారు. సాయంత్రం ఇంట్లో 10 ఏళ్ల లోపు పిల్లలందరికీ కొత్త బట్టలు తొడిగి ముస్తాబు చేస్తారు. రేగి పళ్లు, పూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు, నానబెట్టిన సెనగలు, అక్షింతలు మొదలైనవి కలిపి ఉంచుతారు. అందరు రాగానే, తూర్పు ముఖంగా కానీ, ఉత్తరముఖంగా చిన్నారులను కూర్చోపెడతారు. ఎలా పోయాలి? ఇంట్లోని పెద్దవాళ్లు (అమ్మమ్మ, నానమ్మ) తల్లి కలిపి ఉంచుకున్న భోగిపళ్లను మూడు గుప్పిళ్లతో పిల్లల శిరస్సు చుట్టూ దిష్టి తీసినట్టు తలచుట్టూ తిప్పి పోయాలి. అంటే మూడు సార్లు సవ్య దిశలో, మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి తలమీద పోయాలి. ఆ తరువాత పేరంటాళ్లు కూడా ఇలాగే చేయాలి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని పిల్లల్ని నిండు మనస్సుతో దీవించాలి.ఈ సందర్భంగా "ఓం సారంగాయ నమః" అనే నామం చెప్పాలని పెద్దలు చెబుతారు.ముత్తయిదువలకు పండూ ఫలం కానుకగా ఇస్తారు. ఇలా కార్యక్రమం పూర్తైన తర్వాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వదిలిపెడతారు. పిల్లలకు దిష్ట పోవాలని తీసినవి కాబట్టి, ఈ రేగు పళ్లును ఎవరూ తినకూడదని కూడా చెబుతారు.విశిష్టతశ్రీమన్నారాయణుడు రేగుచెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాన్ని తింటూనే తపస్సు చేశాడని చెబుతారు. రేగుపళ్లను అర్కఫలం అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్య భగవానుడు. సూర్యుడితో సమానంగా రేగుపళ్లను భావించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ భోగిపళ్లు పోస్తారు. రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలు కూడా ఉండడంతో చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయట. -
సీఎం జగన్ ఇంట అంబరాన్నంటిన ‘సంక్రాంతి’ సంబరాలు (ఫొటోలు)
-
ఏపీ ప్రజలకు సీఎం జగన్ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు
-
భోగి పండుగను ఇలా మాత్రం చెయ్యొద్దు!
అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఊళ్లు, పల్లెలు జనసందోహంతో కళకళలాడిపోతుంటాయి. ఎంతెంత దూరమైనా వ్యయప్రయాసలు కోర్చి మరీ పట్టణాలు, విదేశాల నుంచి సోంతూళ్లకి పయనమైపోతుంటారు. అంతటి సరదాలు, ఆనందాలు తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ నాలుగు రోజుల పండుగకి ఉన్న క్రేజ్ మరే పండుగకి ఉండదేమో అన్నంతలా చిన్న పెద్ద భేదం లేకుండా జరుపుకునే పండుగ. అలాంటి ఈ పండుగను మన పూర్వీకులు ఏ ఉద్దేశ్యంతో ఇలానే జరుపుకోండని మనకు ఒక సంప్రదాయన్ని అందిస్తే దానికి తిలోదాకాలు ఇచ్చేసి తప్పుగా అర్థం చేసుకుంటూ పిచ్చిపిచ్చిగా జరుపుకుంటున్నాం. అజ్ఞానంతో పర్యావరణానికి హాని కలిగించడమే గాకుండా లేనిపోనీ అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాం. ఈ విషయమై పర్యావరణ అధికారులు, వైద్యులు, ఆయా పాలనాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా దయచేసి ఇలా చెయ్యొద్దు అని వేడుకుంటున్నారు. ఇంతకీ ఈ పండుగను ఎలా జరుపుకోవాలి? ఎలాంటివి చెయ్యకూడదు?. వాళ్లంతా భయాందోళనలు వ్యక్తం చేయడానికి రీజన్? నిజానికి ఈ సంక్రాంతి పండుగలో భోగితో మొదలయ్యే తొలి పండుగ అంటే అందరికీ సరదానే. ఎందుకంటే? బోగి మంటలతో ప్రారంభమయ్యే ఈ పండుగ సఓ సంబరంలా అంతా ఒక చోట చేరి ఐక్యమత్యంగా జరుపుకుంటారు. అయితే ఈ భోగి మంటలకు కావాల్సిన కలప, పిడకలు, వంటివి నగరాల్లో అందుబాటులో ఉండవు. అదీగాక అభివృద్ధి పేరుతో ఓ టౌన్ మాదిరివి కూడా నగరాల్లో మారిపోయాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటవన్నీ అందుబాటులో ఉండవు. పైగా అందరికి వ్యయప్రయాసలు కోర్చి మరి సొంతూళ్లుకు వెళ్లడం కూడా కుదరదు. దీంతో వారంతా ఈ భోగమంటను ఇంట్లోని పాత వస్తువులను తగలబెట్టి భోగి మంట వేసుకోవడం లేదా టైర్లు, వేస్ట్ ప్లాస్టిక్‌ని తగలబెట్టడం వంట పనులు చేస్తారు. ఇలాంటి చలిమంట వల్ల పర్యావరణ కాలుష్యమే గాక, ఈ పొగ పీల్చడం వల్ల అనారోగ్య సమస్యల బారినపడతారు. ముఖ్యంగా ప్లాస్టిక్, టైర్లు వంటివి కాల్చడం వల్ల చాలా విషపూరితమైన వాయువులు గాల్లోకి విడుదల అవుతాయి. వీటిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, కేన్సర్ వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యనిపుణులు, పర్యావరణ అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పండుగ అనేది మనకు కొత్త ఉత్తేజన్ని తీసుకొచ్చి ఆనందంగా గడిపేలా ఉండాలే కానీ మన వినాశనానికి కారణమయ్యేలా ఉండకూదనేది వారి ఆవేదన. కానీ చాలామంది ఇలానే చేసి చేజేతులారా తమ ఆరోగ్యాన్ని పక్కవారి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. అస్సలు మన పూర్వీకులు ఎందుకని పండగను ఇలా భోగిమంటలతో చేసుకోవాలని చెప్పారు? దానిలో దాగున్న అంతరార్థం ఏంటో తెలుసుకోకుండా అజ్ఞానంతో తప్పుగా జరుపుకుని లేనిపోనీ సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం. ఇంతకీ ఎలా చేసుకోవాలంటే.. పర్యావరణ హితంగా మంచి ఔషధ చెట్ల కలప లేదా ఆవుపిడకలతో వేసిన భోగిమంటే అన్ని విధాల మంచిది. దీని నుంచి విడుదలయ్యే వాయువులు పీల్చేతే శ్వాస సంబంధ సమస్యలు తలెత్తవు. మన పూర్వీకులు ఈ భోగి మంటల వేయడానికి కారణం కూడా ఈ రోజుల్లో చలి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇలా రావి, వేప వంటి ఔషధ గుణాలు గల చెట్ల దుంగల్ని తెచ్చి మంట వేస్తారు. అందులోనే దేశీ ఆవు నెయ్యి, పిడకలు వంటివి కూడా వేస్తారు. ఇలా భోగిమంటను వేసి దాని నుంచి విడుదలయ్యే గాలిని పీల్చితే ఎలాంటి అనారోగ్య సమస్యల రావు. పైగా శ్వాసకోశ సమస్యలు కూడా ఉండవు. ఈ శీతాకాలంలో వచ్చే జలుబు, ఆయాసం వంటి సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని మన పెద్దలు ఈ ఆచారాన్ని తీసుకొచ్చారు. అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇంట్లోని పాత వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, పాత టైర్లతో చలిమంటలు వేసుకుని అనారోగ్యం పాలవ్వుతున్నారు. తెలియకుండానే అటు దేవుడి అనుగ్రహానికి నోచుకోక పోగా, ఇటు ఆరోగ్యాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నవారవమవుతున్నాం అని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల దయచేసి ఇలా మాత్రం చేసుకోవద్దు. అవన్నీ అందుబాటులో లేకపోతే కనీసం కొబ్బరి చిప్పలు, వేపాకులు వంటివి తెచ్చుకుని భోగిమంట వేసుకోండి. ఇది కూడా ఆరోగ్యానికి అన్ని విధాల మంచిదే అని హితవు చెబుతున్నారు పర్యావరణ నిపుణులు. అందువల్ల అందరం ఈ పండుగను ఆరోగ్యకరమైన రీతీలో పర్యావరణ హితంగా జరుపుకుని ఆరోగ్యమనే భాగ్యాన్ని, సంతోషమనే సంపదను పొందుదాం. -
ముగ్గుల ఫోటోలు తీస్తుండగా విషాదం..ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి..
సాక్షి, కుషాయిగూడ: పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. అపార్టుమెంట్ ముంగిట వేసిన ముగ్గుల ఫొటోలు తీస్తుండగా జారీ పడి ఓ బాలిక మృతిచెందిన సంఘటన శనివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఉపేందర్‌యాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాప్రా, సాధనవిహార్ కాలనీ, ఆవాస్ అపార్టుమెంట్లో ఉంటున్న పోతిశెట్టి కిన్నెర (14) 9వ తరగతి చదువుతోంది. శనివారం బోగి పండుగ సందర్భంగా అపార్ట్మెంట్ ఆవరణలో వేసిన ముగ్గులను ఐదో అంతస్తునుంచి సెల్ఫోన్లో ఫొటో తీస్తూ ప్రమాదవశాత్తు జారి కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెద్దలకు తెలియజేయడమే శాపమైందో ఏమో! ఆ ప్రేమ జంట..) -
పల్లెబాట పట్టిన నగరవాసులు
-
భోగి ఎందుకు జరుపుకొంటారో తెలుసా? భోగి పళ్లు పోయడం వెనుక అంతరార్థం?
తెలుగు లోగిళ్ల ముంగిట ముచ్చటైన ముగ్గులతో ఆడపడుచుల సందడి మొదలైంది. మూడు రోజుల సంక్రాంతి పండుగకు సమయం ఆసన్నమైంది. ఈ పెద్ద పండుగలో మొదటి రోజు భోగి. దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ.. దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై చలి పెరుగుతుంది. ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకు వీలుగా ప్రజలు సెగ కోసం చలి మంటలు వేసుకునేవారు. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ.. రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలను భోగి మంటలుగా వ్యవహరిస్తారు. ఇదిలా ఉంటే.. భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారో, అందుకు గల శాస్త్రీయ కారణాలు గమనిద్దాం. పురాణ గాథలు "భుగ్" అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథస్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది పురాణ గాథ. అదే విధంగా... శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాథ అందరికీ తెలిసిందే. అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందని చెప్పుకొంటారు. ఇందులో భాగంగా.. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో ఉన్నదనేది పెద్దల మాట. ఆరోగ్యం కూడా సాధారణంగా వ్యవహారంలో ఉన్న ప్రకారం.. ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని అందరూ చెబుతుంటారు. అయితే, భోగి మంటల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ధనుర్మాసంలో నేలంతా ఇంటి ముందు, ముగ్గుల్లో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలు చేస్తారు. వీటినే ఈ భోగి మంటలు వేయడానికి ఉపయోగిస్తారు. పిడకలని కాల్చడం గాలిలోని.. సుక్ష్మక్రిములు నశిస్తాయి. అంతేకాదు ఆక్సీజన్ గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. శ్వాసకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి. వీటన్నిటికీ ఇది మెడిసిన్‌గా పనిచేస్తుందనడం అతిశయోక్తి కాదు. భోగి మంటలు పెద్దవిగా రావడానికి మామిడి లాంటి ఔషద చెట్ల బెరడ్లు వేసి.. అవి కాలడానికి నెయ్యని వేస్తారు. అంతా ఒక్కచోట చేరి ఈ ఔషద మూలికలు నెయ్యి, పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి శుద్ధి అవుతుంది. ఇక అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయం వల్ల.. ఈ మంట నుంచి నుంచి వచ్చే గాలి అందరు పీల్చగలుగుతారు. అంతేకాదు అంతా ఒక్కచోట చేరి పండుగ జరపుకోవడం.. ప్రజల మధ్య అంతరాలను తగ్గించి, ఐకమత్యాన్ని పెంచుతుంది. అయితే, ఇటీవల కాలంలో భోగి రోజున రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టడం వంటి పనులు చేస్తున్నారు. ఆ మంట నుంచి వెలువడే విష వాయువులను పిలుస్తూ, కాలుష్యం పెంచుతున్నారు. పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. దానర్థం.. ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి మాత్రం కావు. నిజానికి భోగి మంటల్లో కచాల్సింది పాత వస్తువులని కాదు.. పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. భోగి పళ్లు పోయడం ఎందుకు? భోగి రోజున రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. ఈ కార్యక్రమాన్ని భోగి పళ్ల వేడుక అంటారు. సంస్కృతంలో రేగి చెట్టును బదరీ వృక్షంగా వ్యవహరిస్తారు. రేగి చెట్లు, రాగి పండ్లు ఆ నారాయణుడి ప్రతి రూపంగా భావిస్తారు. అంతేకాదు.. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. అందుకే రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తే మంచి జరగుతుందని నమ్మకం. వాటిని తలపై పోయడం వలన ఆ దేవుడి అనుగ్రహం పిల్లలపై ఉంటుందని, వారికి ఉన్న దిష్టి తొలగి పోతుందని విశ్వసిస్తారు. ఈ భోగి పండ్లను పోయడం వల్ల తల పై భాగంలో ఉండే ఆ బ్రహ్మరంద్రాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లలలు జ్ఞానవంతులు అవుతారని పెద్దలు చెబుతారు. రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయట. కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్ఛక్తి, శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపి సత్ఫలితాలు ఇస్తాయి. ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్థాలు, అంతర్థాలు, రహస్యాలు ఉంటాయి. అందుకు అనుగుణంగానే ప్రజలు పండుగలు జరుపుకొంటారు. -
నవ్యక్రాంతి.. తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి
సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాము. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాము. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాము కనుకే ప్రతి సంవత్సరం తిథులతో సంబంధం లేకుండా పుష్యమాసంలో జనవరి నెలలో 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ వస్తుంది. తెలుగువారి పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాము. కనుమ మర్నాడు ముక్కనుమగా కూడా పండుగ చేస్తాము. మన సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధి పరిచే ఎన్నో అంశాలతో కూడిన పండుగ సంక్రాంతి. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ ఇది. సంక్రాంతి నాడు కొత్త అల్లుళ్ళతో బంధుమిత్రులతో ఇల్లు, మనసు ఆనందంతో కళకళలాడుతుంది. కనుమ నాడు ఇంతటి పాడి పంట ఇంటికి రావటానికి కారణమైన గోవులను, వృషభాలను అలంకరించి, పూజించి, చక్కటి దాణా వేసి, ఆనందింప జేస్తారు. ప్రతి సంక్రమణం పవిత్రమైనదే. ప్రతి సంక్రమణంలోనూ పితృ తర్పణాలివ్వాలి. విశేషంగా మకర సంక్రమణ కాలంలో మకర సంక్రమణ స్నానం చెయ్యాలి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున తప్పక పితృ తర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తుతించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు గడలు, గుమ్మడి పండు మొదలైనవి దానమివ్వాలి. ఈ కాలంలో చేసే గోదానం వల్ల స్వర్గవాసం కలుగుతుందని చెప్తారు. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే ధనుర్మాసమంతా ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇళ్ళ ముందు కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బెమ్మలు పెడతారు. సంక్రాంతినాడు ఇంటి ముందు కళ్ళాపి చల్లి, అందమైన పెద్ద రంగవల్లులను తీర్చిదిద్దుతారు. వాటిమీద గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మిడి పూలతో, బంతి పూలతో అలంకరించి, చుట్టూరా రేగుపళ్ళు, చెరుకు ముక్కలు వేసి, మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా, చుట్టూరా ఉన్న గొబ్బెమ్మలను ఆమె చెలికత్తెలుగా భావన చేసి, పసుపు కుంకుమలతో పూజించి, హారతిస్తారు. సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. డోలు, సన్నాయి వాయిస్తూ ఉంటే, వాటికి అనుగుణంగా గంగిరెద్దులు నర్తిస్తాయి. ‘అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు‘, అంటుంటే గంగిరెద్దులు మోకాళ్ళ మీద కూర్చుని లేవటం, ‘డూడూ డూడూ బసవన్నా‘ అంటుంటే, తలలూపుతూ విన్యాసాలు చెయ్యటం కన్నుల పండుగగా ఉంటుంది. అందరూ గంగిరెద్దును సాక్షాత్తుగా బసవన్నగా భావించి నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు డబ్బులిస్తారు, ధాన్యాన్నిస్తారు. వృషభం ధర్మ దేవతకు ప్రతీక. ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయపాత్రను కదలకుండా పెట్టుకుని, రెండు చేతులతో చిరుతలు పట్టుకుని వాయిస్తూ, నుదుటిన తిరునామం పెట్టుకుని, కాళ్ళకు కంచు గజ్జెలు కట్టుకుని, అవి ఘల్లు ఘల్లుమంటుండగా ‘హరిలొ రంగ హరీ‘ అంటూ గానం చేస్తూ, చిందులు వేస్తూ వస్తాడు. అలాగే చిందులేస్తూ, హరినామం గానం చేస్తూ, తంబూరా మీటుతూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సంతోషంగా సాక్షాత్తుగా శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. వారిరువురికీ సంభావనలిచ్చి సత్కరిస్తారు. ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి ఇంటింటి ముందుకు బుడబుక్కలవాళ్లు వస్తారు. ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ‘హర హర మహాదేవ‘ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమ దేవర వస్తాడు. వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిచ్చి సంభావిస్తూ మన సంస్కృతిని సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీను. సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలకు ప్రతీకగా పరమాత్మను ప్రార్ధిస్తారు. బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వులుండలు ఇస్తారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో కోడిపందాలు, గొర్రెపొట్టేళ్ళ పందాలు, కొన్ని ప్రాంతాల్లో జల్లెకట్టు వంటివి ఆడి ఆనందిస్తారు. పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేసి ఆనందిస్తారు. సాధారణంగా అందరూ సంక్రాంతి పండుగకు ముందు రోజు అరిశలు, చక్కిలాలు, నువ్వులుండలు, పాలకాయలు, జంతికలు వంటివి చేస్తారు. పండుగ రోజున పరమాన్నం, బొబ్బట్లు, పులిహోర లాంటివి చేస్తారు. అన్నింటినీ దైవానికి నివేదించి, బంధువులకు, ఇంటి చుట్టుపక్కల వారికి, ఇంట్లో పనిచేసే వారికి పంచిపెడతారు. మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను కనుమనాడు పూజిస్తారు. పుడమి తల్లిని పూజిస్తారు. ‘కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది’ అంటారు కనుక కనుమ నాడు గారెలు, ఆవడలు తప్పకుండా భుజిస్తారు. ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభాలకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మన మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా అత్యధిక శాతం మంది జరుపుకునే గొప్ప పండుగ ‘నవ్య సంక్రాంతి పండుగ‘. పెద్ద పండగ ఎలా అయింది? సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి మారటం వలన ప్రకృతిలో కూడా ప్రతి నెల స్పష్టమైన మార్పును సంతరించుకుంటుంది. ఈ మార్పు మానవ జీవితంపైన మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగ గా జరుపుకుంటున్నాము అంటే, దానికి అనేక కారణాలున్నాయి. అప్పటి వరకు ఉన్న చలి మకర సంక్రమణంతో తగ్గుముఖం పడుతుంది. వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, సుందరమైన, ఆహ్లాదకరమైన వసంత కాల ఆగమనానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభ మవుతుంది. దక్షిణాయనంలో పగళ్ళు తక్కువ, రాత్రిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఉత్తరాయణంలో పగళ్ళు ఎక్కువ, రాత్రిళ్ళు తక్కువ ఉంటాయి. ప్రకృతిలో ఇది గొప్ప మార్పు. ఆనందకరమైన, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని కలిగించే మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. దక్షిణాయనం సాధనా కాలం, ఉపాసనా కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి సూర్యుని రథ గమనంలో మార్పు వల్ల ఎండ వేడిమి నెమ్మదిగా పెరగటం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం ప్రారంభమవగానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభ కార్యాలను జరిపిస్తాము. కనుకే ఉత్తరాయణం ప్రారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని ‘సంక్రాంతి పండుగ‘గా జరుపుకుంటున్నాము. పెద్దలకు తర్పణలు విడుచుకునే పర్వదినం ఇది. వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ. ‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే – ‘చేరటం’ అని అర్థం. మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే శ్రీ సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి. – డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత సంస్కృత ఆచార్యులు -
పూర్ణం బూరెలు, బాసుంది, చెన్నా పొడా... ఇలా సులభంగా ఇంట్లోనే చేసుకోండి!
తెలుగింటి పొరుగింటి రుచులు.. మనకు తెలుగింటి పూర్ణం బూరె ఉండనే ఉంది. నోరూరించే తమిళ పొంగల్ తెచ్చుకుందాం. మరాఠీ పూరన్పోలీని రుచి చూద్దాం. చెన్నా పొడాను ఒడియాలో పలకరిద్దాం.సార్సో కా సాగ్‌తో చలి నుంచి రక్షించుకుందాం. ఇక... గుజరాత్ బాసుంది కప్పు అందుకుందాం. పొరుగింటి పాయసం కోసం ఎదురు చూడద్దు. మన వంటింట్లో ఇవన్నీ వండుకుందాం. పూర్ణం బూరెలు కావలసినవి: మినప్పప్పు – ఒక కప్పు, బియ్యం – రెండు కప్పులు, పచ్చి శనగపప్పు– ఒక కప్పు, బెల్లంపొడి – ఒక కప్పు, పంచదార– ఒక కప్పు, ఏలకుల పొడి – ఒక టీ స్పూను, నెయ్యి – రెండు టీ స్పూన్లు, ఉప్పు – చిటికెడు, నూనె – సరిపడినంత తయారీ: బియ్యాన్ని, మినప్పప్పును కడిగి నానబెట్టాలి ∙మూడు గంటల తరువాత చిటికెడు ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి ∙రుబ్బేటప్పుడు నీళ్లు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి ∙దోసెల పిండిలాగా మెత్తగా రావాలి కానీ పలుచగా ఉండకూడదు ∙గారెల పిండికంటే కొంచెం వదులుగా ఉండేటట్లు చూడాలి ∙శనగపప్పును కడిగి పది నిమిషాల సేపు నానబెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ∙ఉడికిన పప్పులో నీటిని మొత్తం పోయే వరకు వడపోయాలి ∙శనగపప్పు చల్లారిన తర్వాత అందులో బెల్లం పొడి, పంచదార వేసి గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని చిన్న మంట మీద ఉడికించాలి. బెల్లం, పంచదార కరిగి, అవి తిరిగి దగ్గరయ్యే వరకు అడుగుకు పట్టకుండా గరిటతో తిప్పుతూ ఉడికించాలి ∙కొద్ది సేపటికి శనగపప్పు, బెల్లం, పంచదార అన్నీ కలిసిపోయి ముద్దయిన తరువాత ఏలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి దించేయాలి ∙చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలు చేయాలి ∙బాణలిలో నూనె వేడి చేసి ఒక్కొక్క లడ్డూను మినప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి ∙పూర్ణాల తయారీలో నైపుణ్యం ఇక్కడే ఉంటుంది ∙లడ్డు నలగకుండా మినప్పిండిలో ముంచి తీసి నూనెలో వేయాలి ∙ఇలా వేసేటప్పుడు మినప్పిండి మిశ్రమం అన్ని వైపులా సమంగా పట్టాలి ∙ఇలా చేస్తే పూర్ణం చక్కటి రౌండ్లో చూడడానికి అందంగా ఉంటుంది ∙నూనెలో అన్ని వైపులా సమంగా వేగేటట్లు తిప్పుతూ దోరగా వేగిన తరువాత తీసేయాలి ∙వీటిని మరీ వేడిగా తినకూడదు. కొంచెం అమరిన తర్వాత రుచి ఇనుమడిస్తుంది. చెన్నా పొడా కావలసినవి: పనీర్– పావు కేజీ, చక్కెర లేదా బెల్లం పొడి – 125 గ్రాములు, ఏలకుల పొడి – అర టీ స్పూన్, బియ్యప్పిండి – అర టేబుల్ స్పూన్, జీడిపప్పు – పది (చిన్న పలుకులు చేయాలి), బాదం – పది (సన్నగా తరగాలి), కిస్మిస్ – పది, వెన్న – ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా – చిటికెడు (ఇష్టం లేకపోతే మానేయవచ్చు), రవ్వ – ఒక టేబుల్ స్పూన్, పాలు– అర కప్పు (అవసరమైతేనే వాడాలి) తయారీ: ఒవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌లో వేడి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి ∙పనీర్‌ను మెత్తగా చిదమాలి లేదా గ్రేటర్లో తురిమి ఒక పాత్రలో వేసుకోవాలి (ఇంట్లో చేసుకున్న పనీర్ అయితే చేత్తో చిదిమితే సరిపోతుంది, రెడీమేడ్ కేక్ అయితే తురమాల్సి ఉంటుంది) ∙ఈ పనీర్‌లో చక్కెర లేదా బెల్లం పొడి వేసి మిశ్రమం మెత్తగా అయ్యే వరకు చేత్తో కలపాలి ∙మిశ్రమం మరీ గట్టిగా ఉన్నట్లనిపిస్తే కొద్దిగా పాలు కలుపుకోవచ్చు. పనీర్ మిశ్రమంలో ఏలకుల పొడి, బియ్యప్పిండి, బేకింగ్ సోడా(ఇష్టమైతేనే), రవ్వ, జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, కిస్మిస్ వేసి కలపాలి. మిశ్రమం చిక్కగా, గరిటె జారుడుగా ఉండాలి ∙చిక్కదనాన్ని బట్టి బియ్యప్పిండి, పాల మోతాదును మార్చుకోవాలి ∙బేకింగ్ పాన్‌కి వెన్న రాసి ఈ మిశ్రమాన్ని పోసి, పాన్ మొత్తానికి సమంగా పరుచుకునేటట్లు స్పూన్‌తో సర్దాలి ∙ఈ పాన్‌ను ఒవెన్‌లో టోస్ట్ మోడ్‌లో పెట్టి 350 డిగ్రీల ఫారన్‌హీట్‌లో అరగంట సేపు బేక్ చేయాలి ∙ఒవెన్ లేకపోతే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. బాసుంది కావలసినవి: చిక్కటి వెన్న తీయని పాలు – 2 లీటర్లు, జాజికాయ తురుము – ఒక టేబుల్ స్పూన్, బాదం పప్పు – పది (సన్నగా తరగాలి), పిస్తా – పది పలుకులు (సన్నగా తరగాలి) కుంకుమ పువ్వు – చిటికెడు, ఏలకుల పొడి– టీ స్పూన్, చక్కెర – పావు కేజీ తయారీ: పాలను మందపాటి బాణలిలో పోసి జాజికాయ తురుము, కుంకుమ పువ్వు వేసి అప్పుడప్పుడూ గరిటెతో కలుపుతూ మరిగించాలి ∙పాలు పావు వంతుకి తగ్గిన తర్వాత చక్కెర వేసి కలుపుతూ ఉండాలి ∙చిక్కబడడం మొదలైన తర్వాత తరచూ కలపాలి (కలపకపోతే అడుగు మాడుతుంది) ∙చక్కెర కరిగిన తర్వాత మళ్లీ మిశ్రమం చిక్కబడే వరకు మరిగించి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత మరొక పాత్రలో పోయాలి ∙మరొక పెనంలో సన్న మంట మీద బాదం పప్పు తరుగు, పిస్తా తరుగు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ∙చివరగా ఏలకుల పొడి వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పాల మిశ్రమంలో వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి ∙రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి తీసిన తర్వాత సర్వ్ చేయాలి. సార్సో కా సాగ్ కావలసినవి: ఆవ ఆకులు – నాలుగు కట్టలు పాలకూర – ఒక కట్ట ఆలివ్ ఆయిల్ – 5 టేబుల్ స్పూన్లు అల్లం – అంగుళం ముక్క (సన్నగా తరగాలి) వెల్లుల్లి – 6 రేకలు ఉల్లిపాయలు – రెండు (మీడియం సైజ్) పచ్చి మిర్చి – 4 (తరగాలి) ఉప్పు – రుచికి తగినంత తయారీ: ∙ఆకుకూరలను కాడలు లేకుండా వలిచి కడిగి నీరు కారిపోయేటట్లు చిల్లుల పాత్రలో వేసి పక్కన పెట్టుకోవాలి. ∙బాణలిలో నూనె వేడి చేసి అల్లం తరుగు, వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి మూడు – నాలుగు నిమిషాల సేపు సన్నమంట మీద మగ్గనివ్వాలి. ∙ఆకుకూరలను తరిగి బాణలిలో వేసి కలపాలి. ∙ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టి మరికొంత సేపు మగ్గనివ్వాలి. ∙ఆకు ఆవిరికి ఉడికి మెత్తబడిన తరవాత దించేయాలి. ∙చల్లారిన తర్వాత ఆకులను మిక్సీలో గ్రైండ్ చేయాలి. ∙మిశ్రమం జారుడుగా అనిపిస్తే మళ్లీ బాణలిలో వేసి మరికొంత సేపు ఉడికించాలి. ∙మిశ్రమం దగ్గరగా వచ్చే వరకు సన్న మంట మీద ఉడికిస్తే సార్సో కా సాగ్ రెడీ. ∙ఈ సార్సోకా సాగ్‌లో నెయ్యి లేదా వెన్న వేసుకుని మొక్కజొన్న రొట్టెల్లోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. ∙పంజాబ్‌లో ఈ రోజుల్లో అధిక శీతల వాతావరణం ఉంటుంది. ఈ వంటకం దేహాన్ని చలి నుంచి కాపాడుతుంది. -
సంక్రాంతి సందడే సందడి త్వరలో...
-
భోగిమంటలతో సంక్రాంతి సంబరాలు త్వరలో...
-
రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు,సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని,రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ( సేంద్రీయ సాగు రైతులకు మేలు ) రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు,సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని,రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను#Sankranthi — YS Jagan Mohan Reddy (@ysjagan) January 13, 2021 -
టాలీవుడ్ సెలబ్రిటీల భోగి సందడి..
తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. మూడు రోజుల పండుగలో తొలి రోజైనా భోగి నాడు.. భోగి మంటలు వేసి, వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో అలకరించారు. పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా భోగిని ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ఈ సంబరాల్లో చిరంజీవి, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్‌తేజ్, కల్యాణ్‌దేవ్, నిహారిక, సుష్మిత.. ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. నిహారిక దోశ వేస్తున్న ఫొటోను సుష్మిత.. దోశ స్టెప్పు అని పేర్కొన్నారు. మరోవైపు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కుటుంబం శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో భోగి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలిపిన మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్‌లు పలు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘ కొత్తగా ప్రారంభించడానికి ఒక శుభ దినం, భోగ భాగ్యాలను అందించే పర్వదినం. మీ కుటుంబం సిరిసంపదలతో సుసంపన్నంగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ భోగి శుభాకాంక్షలు’ అని లక్ష్మి పేర్కొన్నారు. అలాగే విక్టరీ వెంకటేశ్ కూడా భోగి శుభాకాంక్షలు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ఈషా రెబ్బా.. తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
ఆన్లైన్లో రైళ్లు, బోగీల బుకింగ్
న్యూఢిల్లీ: పెళ్లి వేడుకలకు, విహార యాత్రలకు ఇకమీదట రైల్వే బోగీలను, ప్రత్యేక రైళ్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. ‘సింగిల్ విండో బుకింగ్’ విధానంలో ఫుల్ టారిఫ్ రేట్ (ఎఫ్టీఆర్) చెల్లించి బుక్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. ఇలాంటి బుకింగ్‌లపై 30 శాతం సేవా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద ప్రతి బోగీకి రూ.50,000 చెల్లించాలి. గతంలో కోచ్‌లు, రైళ్లను బుక్ చేసేందుకు సంబంధిత స్టేషన్ సూపర్వైజర్, స్టేషన్ మాష్టర్‌ను సంప్రదించాలి. ప్రయాణవివరాలన్నీ ఎఫ్‌టీఆర్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. డబ్బులు డిపాజిట్ చేశాక రసీదు ఇస్తారు. అయితే ఈ విధానమంతా గందరగోళంగా ఉందని, దీన్ని సవరించాలని ఫిర్యాదులు రావడంతో కొత్తగా ఈ విధానం తెచ్చారు. -
భోగి మంటల వెచ్చదనం సంక్రాంతికి తొలిమెట్టు
-
భోగి మంటల్లో కారు దగ్ధం
బంజారాహిల్స్(హైదరాబాద్): భోగి పండుగ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. భోగి మంటలు వ్యాపించి కారు దగ్ధమైన సంఘటన కమలాపురికాలనీ గణపతి కాంప్లెక్స్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోట భార్గవరావుకు చెందిన కారు డ్రైవర్ సికిందర్ యజమాని కుమారుడిని ట్యూషన్‌కు తీసుకొచ్చి రోడ్డు పక్కన కారు ఆపాడు. అయితే అక్కడ భోగి మంటలు ఉన్న విషయాన్ని అతను గుర్తించకపోవడంతో చూసుకోకపోవడంతో ఇంజన్, టైర్లకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో కారులో కూర్చున్న సికిందర్‌ను స్థానికులు అప్రమత్తం చేయడంతో అతను కారులో నుంచి బయటకు దూకి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అప్పటికే కారు చాలా వరకు దగ్ధమైంది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కమనీయం...గోదాదేవి కల్యాణం
అనంతపురం కల్చరల్ : సంక్రాంతి పర్యదిన వేడుకల్లో భాగంగా శుక్రవారం గోదాదేవి కల్యాణాలు కమనీయంగా జరిగాయి. తపోవనంలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ రంగనాథస్వామి ఆలయంలో శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో గోదాదేవి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితులు వడిగేపల్లి నరసింహాచార్యుల నేతృత్వంలో జరిగిన కల్యాణోత్సవంలో బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ విశిష్ట అతిథిగా పాల్గొని కల్యాణం జరిపించారు. అంతకు ముందు ఆలయంలో కొలువైన శ్రీనివాసుడికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు, అలంకార సేవలు, అర్చనలు జరిగాయి. కార్యక్రమంలో వైష్ణవ సంఘ సభ్యులు విజయ్‌కుమార్, అయ్యంగార్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రామనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం ప్రధాన అర్చకులు సుధాకర శర్మ నేతృత్వంలో గోదా, రంగనాథుల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
భోగి సంబరాల్లో ఎంపీ వైవీ
ఒంగోలు: ప్రకాశంజిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగిన సంక్రాంతి భోగి సంబరాల్లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. స్థానిక సాయిబాబా గుడి వద్ద భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ లయన్స్ క్లబ్, సేవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కోలాటాలను, పాటల కచేరిని ఆయన తిలకించారు. జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులు పాడిపంటలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. -
'భోగి' రోజునే చిరు వస్తున్నాడు
తూర్పుగోదావరి: అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతూ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'కి సంబంధించి తాజా అప్ డేట్స్ వచ్చాయి. చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ సినిమా విడుదల రోజును ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా భోగి రోజున సినిమాను విడుదల చేస్తామని వినాయక్ చెప్పారు. ఈ సినిమాతో మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. అటు చిరు అభిమానులతోపాటు మొత్తం ప్రేక్షకులంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. బుధవారం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో విద్యాగణపతిని సందర్శించిన వీ వినాయక్ అనంతరం మీడియాతో మాట్లాడారు. భోగి రోజున విడుదలయ్యే ఈ చిత్రం ఒక్క అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుందని వివరించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి.. తెలుగువారికి ప్రీతికరమైన పండుగ. మూడు రోజుల ఈ పండుగలో మొదటది భోగి. ఈ భోగి పండుగను ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే తమ ఇంటి ముందు భోగి మంటలు వేసుకున్నారు. పాత చీడలన్నీ పోయి... జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని భగవంతుడిని ప్రార్థించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పోలీస్ గ్రౌండ్లో యువకులు భోగి మంటలు వేసుకుని పండుగ జరుపుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో భోగభాగ్యాల భోగి పండుగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పవిత్రమైన ఉత్తరాయణ ఘడియలను వెంట పెట్టుకుని వస్తున్న భోగిని ఊరువాడా భక్తిశ్రద్ధలతో ఆహ్వానించారు. మంచుతెరల పరదాలను పక్కకు నెడుతూ తెల్లవారుజామునే భోగిమంటలు వేసుకున్నారు. దెందులూరు మండలం కొవ్వలిలో భోగి పండుగ కనులవిందుగా జరిగింది. అలాగే రాజమండ్రిలో భోగి పండుగ ఘనంగా జరుగుతోంది. ఈ భోగి... భోగభాగ్యాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసుకున్నారు. విశాఖలో భోగి సంబరాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు ఇళ్లముందు భోగి మంటలు వేశారు. పాత వస్తువులను మంటల్లో దహనం చేసి కొత్తదనాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇక సంక్రాంతి సందర్భంగా విజయనగరంలో పల్లె వాతావరణం ఉట్టిపడుతోంది. అపార్ట్మెంట్ల కల్చర్‌లోనూ భోగి పండుగను అంతా కలిసి మెలిసి జరుపుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్ మలేషియన్ టౌన్ షిప్లో భోగి పండుగను జరుపుకున్నారు. భోగి మంటలు వేసి చిన్న పెద్ద సందడి చేశారు. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. నగరంలో ప్రతి ఏరియాలో భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. నగర ప్రజలు భోగి పండుగను భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకున్నారు. కేబీఆర్ పార్క్‌లో జరిగిన భోగి మంటల వేడుకలో టీఆర్ఎస్ ఎంపీ కవిత పాల్గొన్నారు. గతాన్ని భోగి మంటల్లో కాల్చేద్దాం.. కొత్త ఆశలు, ఆశయాలను ఆహ్వానిద్దామని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు కవిత భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. -
ముగ్గురు స్నేహితులు.. ఒక ప్రయాణం!
‘‘ఈ మధ్యే భోగి సంబరాలు జరుపుకున్నాం. మళ్లీ నేను భోగి పండగ మూడ్‌లో ఉండబోతున్నా’’ అంటున్నారు త్రిష. అలా అనడానికి కారణం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో త్రిష, పూనమ్ బజ్వా, ఓవియా కథానాయికలుగా ‘భోగి’ అనే చిత్రం రూపొందుతోంది. ముగ్గురు స్నేహితులు, ఒక ప్రయాణం నేపథ్యంలో సాగే మంచి థ్రిల్లర్ మూవీ ఇదని త్రిష పేర్కొన్నారు. -
పసిడి రాశుల పచ్చని కాంతిసంక్రాంతి
ఇళ్లముందు ఆవుపేడ కళ్ళాపిలో అందంగా తీర్చిదిద్దిన రంగవల్లికలు, ఆకాశంలో నుంచి కిందికి దిగి వచ్చినట్టు కనపడే చుక్కల ముగ్గుల మధ్యలో కంటికింపుగా దర్శనమిచ్చే గొబ్బెమ్మలు, వాటిపైనుంచి పలకరించే బంతి, చేమంతి, గుమ్మడిపూలు, వాటిని తొక్కకుండా ‘హరిలో రంగ హరి’ అంటూ తమ మధుర గానంతో మేలుకొలుపు పలుకుతున్న హరిదాసులు, వారు వెళ్ళగానే ‘అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు’ అంటూ గంగిరెద్దుల నాడించేవారు, జంగంవారు, బుడబుక్కలవారు...తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది జానపద కళాకారులు... అదొక కళావిలాసం. అదే సంక్రాంతి పండుగ వైభవం. ఏడాదంతా ఎక్కడెక్కడున్నా సంక్రాంతికి మాత్రం తమ స్వగ్రామాలకి చేరుకుంటారు అందరూ. సంక్రాంతి వైభవం అంతా పల్లెలలో చూడాలి. ఎందుకంటే సంక్రాంతి పండుగ సమయానికి దరిదాపుల్లో అన్ని పంటలు ఇంటికి వచ్చి ఉంటాయి. రైతులు మాత్రమే కాక వ్యవసాయ కూలీలు ఇంకా సరిగా చెప్పాలంటే గ్రామంలో ఉన్న అందరూ పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా, కంటికి ఇంపుగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. పొలం పనులు పూర్తి అయి ఉంటాయి. కొంత కాలం విశ్రాంతి తీసుకునే వీలుంటుంది. దానితో సందడి, సంబరాలు. తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమికి, రైతులకు, కూలీలకు, పాలేర్లకు, పశువులకు, పక్షులకు అన్నింటికీ కృతజ్ఞతను తెలియచేసుకోవడం, తమ సంపదను సాటివారితో బంధుమిత్రులతో పంచుకోవడం ఈ వేడుకల్లో కనపడుతుంది. ఈ రోజుకే ప్రత్యేకత ఎందుకు? భారతీయులు సాధారణంగా పాటించేది చాంద్రమానాన్ని. కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది మకర సంక్రమణం. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. దానిని సంక్రమణం అంటారు. మకర రాశిని సంక్రమించినపుడు అది మకరసంక్రమణం అవుతుంది. సంవత్సరంలో ఉండే పన్నెండు సంక్రమణాలలో మకర సంక్రమణం ప్రధానమైనది. దీనికి కారణం మకర సంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటివరకు దక్షిణ దిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది. అందుకే ఆ రోజు నుంచి ఆరు నెలలు ఉత్తరాయణం అంటారు. అప్పటికి ఆరు నెలల నుండి దక్షిణాయనం. దక్షిణాయణాన్ని పితృయానం అని, ఉత్తరాయణాన్ని దేవయానంఅని చెబుతారు. అందుకనే ఈరోజుని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. తాము సంతోషంగా ఉండే కాలంలో ఆ ఆనందాన్ని వ్యక్తపరచుకునేందుకు ఈ పుణ్యకాలాన్ని నిర్ణయించుకున్నారు. విధులు: అంతరిక్షంలో జరిగే ఖగోళ విశేషాలననుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనుషులు చేయవలసిన పనులను పండుగ విధులుగా చెప్పటం మన రుషుల ఘనత, అవి మనిషి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా ఉంటాయి. ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్ర విజ్ఞాన్ని అందించేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి ఎదగటానికి సహాయం చేసేవిగా ఉంటాయి. నిజానికి మన పండుగలు బహుళార్థ సాధన ప్రణాళికలు. అన్నింటిని సమీకరించి ఎప్పుడేం చెయ్యాలో చక్కగా చెప్పారు. విశిష్టాద్వైత సంప్రదాయాన్ననుసరించే వారు తిరుప్పావై లేక శ్రీవ్రతాన్ని ఆచరిస్తారు. ద్వాపర యుగం చివరిలో గోపికలు ఆచరించిన ఈవ్రతాన్ని గోదాదేవి ఆచరించి శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో సశరీరంగా లీనమైంది. ప్రకృతిలో భాగమైన సర్వజీవులు స్త్రీలు. వారు పరమపురుషుని చేరుకోవడం కోసం చేసే సాధన మధురభక్తి మార్గం. దానికి ప్రతీక అయిన గోదాదేవి చేసిన వ్రతాన్ని ఈ నెలరోజులు సాధకులు, భక్తులు అందరు ఆచరిస్తారు. భోగి: సంక్రమణానికి ముందు రోజుని భోగి అనే పేరుతో జరుపుకోవడం మన సంప్రదాయం. తెల్లవారుజామునే లేచి ఒక పక్క భోగిమంటల దగ్గర కొంతమంది చలి కాచుకుంటూ ఉంటే, మిగిలిన వారు వంటికి నువ్వుల నూనె రాసుకొని, నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని, నువ్వులు వేసి కాచిన వేడినీళ్ళతో తలంటు పోసుకొని, కొత్తబట్టలు కట్టుకుంటారు. (చలికాలం వల్ల వచ్చే ఎన్నో ఇబ్బందులను అధిగమించటానికి నువ్వుల వాడకం ఆరోగ్యసూత్రం) పిండి వంటలతో పులగం, చక్కెరపొంగలి మొదలైనవాటితో భోజనం, అరిసెలు, చక్కిలాలు(సకినాలు)మొదలైనవి నములుతూ, ఇంటికి వచ్చినవారికి ఇస్తూ బంధుమిత్రుల ఇళ్ళకి వెళుతూ ఆనందంగా గడుపుతారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే భోగి పళ్ళుపోస్తారు. వీటివల్ల దృష్టిదోషం పోయి, ఒక సంవత్సరం వరకు దృష్టి సోకకుండా ఉంటుందని నమ్మకం. ఆడపిల్లలు ఉంటే బొమ్మల కొలువు పెడతారు. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మగారి కొలువును తమ ఇంటిలో చిన్న పన్నాలో చూడడం నేర్పటానికి. సృష్టిలోని అన్ని రకాల వస్తువులని కొలువులో పెట్టి, వాటికి పూజ చేసి, నైవేద్యం పెట్టి, హారతి ఇవ్వటంతో అన్నీ దేవుడి స్వరూపాలుగా చూడటం అలవాటవుతుంది. అంతేకాదు, భోగి పళ్ళకి, బొమ్మల కొలువుకి పేరంటం చేసి వచ్చిన వారికి తాంబూలాలివ్వటం పద్ధతి. ఆ తాంబూలాలతో పాటు తమ శక్తికొద్దీ ఇంకేమైనా ఇస్తారు. తమకు కలిగిన దానిని అందరితో పంచుకోవడం అలవాటు చేయడం ఈ వేడుకలలో అంతరార్థం. పితృదేవతలకేకాక సమస్తానికి కృతజ్ఞతలని తెలియజేసే పండుగ కదా! తమ ఇంటికి పంట వచ్చి ఆనందంగా ఉండటానికి కారణభూతమైన భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి కూడా తమ కృతజ్ఞతలని తెలియజేయటం ఈ పండుగలో ప్రతి అంశంలోనూ కనపడుతుంది. పక్షులు వచ్చి తమ పంట పాడుచేయకుండా ఉండేందుకు, పురుగులని తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను ఆవిష్కరించేందుకు వరికంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమనాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. తమిళనాడులో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి కనుమనాడు అన్నపుముద్దలను ఊరి బయటకు తెచ్చి పక్షులకు పెడతారు. ఆ రోజు మాట్టు పొంగల్ అంటారు. వారికి పొంగలి వండటం ప్రధానం కనుక ఈ సంక్రాంతి పండుగను పొంగల్ అంటారు. తెలుగువారు కూడా పొంగలి వండుతారు. దానిని తెలుగువారు పులగం అంటారు. కొత్తబియ్యం, కొత్తపెసరపప్పు కలిపి వండిన పులగాన్ని ముందుగా దేవుడికి నివేదన చేసి కృతజ్ఞతను చూపిస్తారు. ఈ సందర్భంగా కొత్త బియ్యాన్ని లేగంటిఆవు పాలలో వండి, కొత్త బెల్లం వేసి పరమాన్నం తయారుచేయడం చాలా ముఖ్యం. అన్ని కొత్త వస్తువులను ఇప్పుడే ఉపయోగించడం మొదలుపెడతారు. ‘కనుమునాడు కాకైనా కదలదు’, ‘కనుమునాడు కాకైనా మునుగుతుంది’ అనే సామెతలు కనుముకి, పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. ఏమైనా పండుగలలోని ఆచారాలను అర్థం చేసుకుని ఆచరిస్తేనే అసలైన ఆనందం. - డాక్టర్ ఎన్.అనంతలక్ష్మి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ పుణ్యకాలంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడు రోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలికి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్టం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకర రాశిలో ఉండే శ్రవణా నక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వులదానం చేయడం శ్రేయస్కరం. దీనితోబాటు వస్త్రదానం, పెరుగుదానంతో పాటు ఏ దానాలు చేసినా మంచిదే. దక్షిణాయణం పూర్తి అయి పితృదేవతలు తమ స్థానాలకి వెడితే మళ్ళీ ఆరు నెలల వరకు రారు కనుక వారికి కృతజ్ఞతాపూర్వకంగా తర్పణాలు ఇస్తారు. కొంతమంది కనుమనాడు తర్పణాలిస్తారు. కనుమని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రెపొటేళ్ళ పోటీలు, కోడి పందాలు మొదలైనవి నిర్వహిస్తారు. పాలేళ్ళకి ఈ రోజు సెలవు. వాళ్ళని కూడా తలంటు పోసుకోమని కొత్తబట్టలిచ్చి పిండివంటలతో భోజనాలు పెడతారు. సంవత్సరమంతా వ్యవసాయంలో తమకు సహాయం చేసిన వారిపట్ల కృతజ్ఞత చూపటం నేర్పుతుంది ఈ సంప్రదాయం. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఇందుకు ఉపయోగిస్తారు. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. -
భోగినాడు రాజకీయ నాయకులతో సిల్లీబ్రాండ్
-
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో...
సంక్రాంతి అంటేనే పందేల పండుగ. పది రోజుల ముందే పండుగ హడావిడి మొదలైనా... ఆ శోభకు శ్రీకారం జరిగేది మాత్రం ‘భోగి’ నుంచే. భోగిమంటలతో పోటీల పర్వం మొదలవుతుంది. ఇక ముగ్గుల పందేలతో ఆడవాళ్లు... కోడి పందేలతో మగాళ్లు... గాలిపటాల పందేలతో పిల్లలు... ఇలా చెప్పుకుంటూ పోతే... సర్వం పందేల మయం. వీటి మధ్య సినిమాల పందేలు. అప్పుడే బాక్సాఫీస్ దగ్గర వేడి మొదలైంది. మహేష్ ‘1’, చరణ్ ‘ఎవడు’ రిలీజులు ఇప్పటికే జరిగిపోయాయి. కనుమ దాటి ముక్కనుమకు చేరేసరికి విజయం ఎవరి సొంతమో తేలిపోతుంది. ఈ లోపు సరదాగా ‘భోగి స్పెషల్ సాంగ్స్’ని కాసేపు నెమరు వేసుకుందాం. భోగి పండుగ భోగం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఈ పాటలు నిజంగా తెలుగు దనానికి ప్రతికలే. భోగిమంటలు(1981) భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో... తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో... ఆచార్య ఆత్రేయ రాసిన ఈ పాట ఏ రోజు విన్నా... ఆ రోజే భోగి పండుగలా అనిపిస్తుంది. ఇక రమేశ్‌నాయుడు స్వరరచన తెలుగుదనానికి అద్దం పట్టిందనే చెప్పాలి. దీనికి తోడు కృష్ణ, రతి అగ్నిహోత్రిల అభినయం, విజయనిర్మల టేకింగ్ ఈ పాటకు హైలైట్స్. ‘భోగిమంటలు’ సినిమా వచ్చి 33 ఏళ్లు అవుతున్నా... ఇంకా ఈ పాట శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. బాలు, సుశీల, బృందం ఈ పాటను ఆలపించారు. దళపతి (1992) సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంటా పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగ జీవితాలే సాగాలంటా ఆడాలి ఈనాడు.. ఊరంతటా... రాగాల దీపాలటా.. నీకోసం.. వెలిగేనటా.. ఉల్లాసం.. నీవేనటా.. హోయ్ ఈ పాటను అనువాద గీతమంటే ఎవరైనా నమ్ముతారా? అంతగొప్పగా రాశారు రాజశ్రీ. ‘వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని.. కొత్తగ ఇపుడే పుట్టావనీ అనుకోమంటారా హోయ్. మూలబడివున్నా.. బుట్టా తట్టా తీసి.. భోగిమంటల్లోన నీవే వెయ్యరా..’ అంటూ.. భోగి పండుగ పరమార్థాన్ని రెండే ముక్కల్లో చెప్పారాయన. రాజశ్రీ అక్షరాలకు ఇళయరాజా స్వరరచన తోడైతే.. ఇక చెప్పేదేముంది! శ్రోతలు పులకించక ఏంచేస్తారు? నిజంగానే అంతగా ఆకట్టుకుందీ పాట. పైగా ఈ పాట పాడింది ఎవరనుకున్నారు.. కె.జె.ఏసుదాస్, ఎస్పీబాలు. ఇద్దరూ అగ్రగణ్యులే. పాటకు పట్టాభిషేకం చేసినవారే. ఇక చేసింది తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి. తీసింది మణిరత్నం. ఇంతమంది ఘనాపాటీలు కలిశారు కాబట్టే రెండు దశాబ్దాలు దాటినా ఇంకా ఈ పాటను జనాలు ఇష్టపడుతూనే ఉన్నారు. రాముడొచ్చాడు (1996) మా పల్లే రేపల్లెంటా... ఈ పిల్లే రాధమ్మంటా... రేగుతుంటే భోగిమంట.. రేగుపళ్ల విందులంటా రేతిరంతా కోడిపుంజు కొక్కోక్కో మంచుపూల జల్లులంటా మంచెకాడ గిల్లుడంటా మంచమేస్తే సంకురాత్రి తిరునాళ్ళో పల్లె పచ్చగా పిల్ల వెచ్చగా ఉంటే పండగ. భోగి పండుగ శోభ అంతా ఈ పాటలోనే కనిపిస్తుంది కదూ! మరి వేటూరా మజాకా. సిటీల్లో పరిస్థితి ఎలా ఉన్నా... పల్లెల్లో యువతరానికి సంక్రాంతి అంటే నిజంగా పెద్ద సంబరమే. పట్టు పరికిణీల్లో అమ్మాయిలూ, టిప్పుటాప్పుగా అబ్బాయిలూ... అలకలు, అల్లర్లు, సరదాలు, సరాగాలు అన్నింటికీ వేదిక సంక్రాంతి. ‘రేగుతుంటే భోగిమంట...రేగుపళ్ల విందులంటా... రేతిరంతా కోడిపుంజు కొక్కోక్కో...’ అని వేటూరి రాసింది అందుకే. ఎస్పీబాలు, చిత్ర, బృందం ఆలపించిన ఈ పాటకు స్వరరచన చేసింది రాజ్. ఆయన సంగీతం సమకూర్చిన హిట్ సాంగ్స్‌లో ఇదీ ఒకటి. ఇక నాగార్జున, సౌందర్యల అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాలా! సిందూరం (1997) ఏడుమల్లెలెత్తు సుకుమారికి ఎంత కష్టమొచ్చింది నాయనో.. భోగిపళ్లు పోయాలి బేబికి.. ఏమి దిష్టి కొట్టింది నాయనో.. ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చెమట్లు పట్టాయిరో... మంచు బొట్లు ఆ బుగ్గలో అగ్గిచుక్కలైనాయిరో... పల్లెల అందాలు ఏ తీరుగా ఉంటాయో ఈ పాట చూస్తే అర్థమైపోతుంది. అలముకున్న మంచు పొరల మాటున పరుచుకున్న పచ్చదనం, భగభగ మండుతున్న భోగి మంటలు, పాలపుంతల్ని తలపించే సంక్రాంతి ముగ్గులు. వీటికి దీటుగా అందమైన అమ్మాయిలు. వాళ్లనే టార్గెట్ చేస్తూ సిరివెన్నెల కలం కదిపారు. ఆ అక్షరాలను స్వరబద్ధం చేసే బాధ్యతను సంగీత దర్శకుడు ‘శ్రీ’ తలకెత్తుకున్నాడు. తండ్రి చక్రవర్తిని తలపించాడు కూడా. కృష్ణవంశీకి తెలుగుదనంపై ఉన్న మమకారం మొత్తం ఈ పాటలో కనిపిస్తుంది. ఇక పరికిణీలో సంఘవి అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగమ్మాయి కాకపోయినా.. బాపు బొమ్మనే గుర్తుచేసింది. ఇక రవితేజ గురించి తెలిసిందేగా! ఓవరాల్‌గా అందర్నీ రంజింపజేసేసిందీ పాట. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా పాటలొచ్చాయి కానీ, భోగి పాటలు మాత్రం తక్కువే. అయినా... వచ్చిన ప్రతిపాట అందర్నీ అలరించి, మన సంప్రదాయ విలువలకు అద్దం పట్టింది. కొన్నేళ్లుగా ఇలా పండుగల్ని ప్రతిబింబించే పాటలు సినిమాల్లో కరువయ్యాయి. ‘ట్రెండ్’ అంటూ... క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ, విదేశాల చుట్టూ సినిమా పాట తిరుగుతోంది. మన ‘సోల్’ ఏంటో మనం మరిచిపోతున్న పరిస్థితి ప్రస్తుతం సినిమాల్లో నెలకొని ఉంది. పాశ్చాత్య పోకడలను ప్రతిబింబించే ఈ విధానాలను భోగిమంటల్లో ఆహుతి చేస్తూ... మన సంస్కృతిని ప్రతిబింబించే కొత్తదనాన్ని తెలుగు సినిమా ఆహ్వానించాలని ఆశిద్దాం. -
సిరుల కాంతి సంక్రాంతి
వివరం ఎంతో గొప్ప వ్యక్తి వస్తున్నాడంటే, ఎందరెందరో ఎన్నెన్నో బహుమానాలతో ఎంతసేపటినుంచో ఎలా ఎదురుచూస్తూ గౌరవ పూర్వకంగా నిలబడే ఉంటారో, అలాగే సంక్రాంతి రాబోతోందనగానే గృహిణులు ముగ్గులతోను, కన్నెలు గొబ్బెమ్మలతోను, హరిదాసు శ్రీహరి గానామృతంతోను, పిల్లలు గాలిపటాలతోను ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే సంవత్సర చక్రంలో కనిపించేవన్నీ కేవలం పండుగలైతే ఈ పండుగకి మాత్రమే ‘పెద్దపండుగ’ అనే పేరొచ్చింది. బొమ్మల కొలువు ‘పాఠాల ద్వారా చెప్పడం కంటే చూసి గ్రహించేలా చేయడం మేలు’ అనేది ప్రాచీనుల ఆలోచన కాబట్టి బొమ్మల కొలువుని ఏర్పాటు చేయించారు ప్రాచీనులు.పెమైట్టు మీదున్న ఆదిశక్తి అందరికీ మూలమని, ఆ కింది మెట్టు మీదున్న త్రిమూర్తులూ సృష్టి స్థితి లయలకి కర్తలని, ఆ కింది మెట్టు మీదున్న సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలన్నీ ఆకాశంలో ఉంటాయని, ఆ దిగువ మెట్టు మీదున్న వివిధ జాతి పశుపక్షి మృగ క్రూర మృగ జంతు క్రిమి కీటకాల విభాగమంతా నేలమీద ఉంటుందని... ఇలా పిల్లలు క్షణంలో గ్రహించెయ్యగలుగుతారు. తన స్నేహితులకి తాను వివరించేలా మన సంతానాన్ని అక్కడ ఉంచితే, పదిమార్లు వివరించవలసి వచ్చిన కారణంగా మన సంతానానికి ఆ బొమ్మల కొలువులోని విశేషాలు ఈ రోజున కాకున్నా ముందునాటికి బాగా బోధపడతాయి. బొమ్మల్లో చందన వృక్షం - కుంకుడు వృక్షాలూ, సింహం - కుక్క బొమ్మలూ, దైవం, రాక్షసుని బొమ్మలూ... పక్కపక్కగా ఉన్నా, ఒకరికి మరొకరి మీద పగ, ద్వేషం, అసూయ వంటివి లేకపోవడాన్ని చూపించేతీరుగా అమర్చిన ఈ దృశ్యాలని గూర్చి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అనిపిస్తుంది.సాయంవేళ స్త్రీలంతా పేరంటాన్ని చేసుకుని, తమని పిలిచినవారి ఇళ్లలోని శిశువుల్ని ఆశీర్వదిస్తూ వెళ్లడమనేది నష్టాయుర్లాభానికే (రోజురోజుకీ తరిగిపోతూండే ఆయుష్యాన్ని తిరిగి పూర్తి చేసుకునేందుకే). ఎవరి నోటి ఆశీర్వచనాక్షరాలు మంత్రాలుగా పనిచేసి ఎవరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయో ఆ విషయం మనకి తెలియదు కాబట్టి, సంవత్సరానికి ఒక్కరోజైనా ఈ సంక్రాంతి నాడు ఈ సంప్రదాయాన్ని ఏ వినోద కాలక్షేపాన్నో చేస్తూ విడుచుకోవడం తగునా? ఎంతో శ్రద్ధతో అభిషేకం చేస్తాం గాని ఆ శంకరుణ్ని ప్రత్యక్షంగా చూడలేం. ఎంతో భక్తితో అర్చిస్తాంగాని ఆ శ్రీహరిని దర్శించలేం. ఈ దేవతలంతా పరోక్ష దర్శనాన్నిచ్చేవాళ్లౌతున్నా కూడా ఆరాధిస్తున్నాం గాని, ప్రతిరోజూ కనిపించే సూర్యుణ్ని దర్శిస్తూ కూడా పట్టించుకోకపోవడమంటే ఎంత నేరం! వెనుక కాలంలో రైతులు పొలాల్లో నుండే సూర్యోదయమౌతున్న వేళ నమస్కరించుకుంటుండేవారు. విప్రులు సంధ్యావందనం మధ్యలో ఆ ఉదయ సూర్యునికి ప్రత్యక్షంగా అర్ఘ్యాన్ని సమర్పించుకుంటూండేవారు. గృహిణులు స్నానాన్ని ముగించి ఆ సూర్యునికి కుంకుమని చూపించి తిలక ధారణని చేస్తూండేవారు. అలాంటి సూర్యుడు ధనూ రాశి నుండి మకర రాశిలోకి సంక్రమణం (జరగడం) చేయడమేదుందో అదే ‘మకర సంక్రమణ’మంటే! ఈ విషయాన్ని లోకమంతటికీ అర్థమయ్యేలా వివరించేందుకే ఓ పెద్ద నెగడు (కర్రలతో మంట)ని నాలుగు మార్గాల కూడళ్లలోనూ వేస్తారు. ‘ఈ మంట ఎలా వేడిమినిస్తూ ఇంతకుముందెన్నడూ లేని విధంగా వెలుగుతూ కనిపిస్తోందో అదే తీరుగా రేపటి నుండి వేడిమిని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్తూండే కొత్త సూర్యుడు (ఉత్తరాయణ సూర్యుడు) రాబోతున్నాడు సుమా!’ అనే ఓ సూచననియ్యడం దీని భావం. ఇక్కడ వెలుగుతున్న ఈ మంటకి ఆకర్షింపబడి ఎన్నెన్నో వ్యాధికారక క్రిమికీటకాలు తగలబడి వ్యాధుల్ని మనకి దూరం చేశాయి. రాబోయే సూర్యుని వేడిమి అలాంటిది కాదు, ఉష్ణ వ్యాధులని కలిగించేది’ కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాల్సిందే’’ అని చెప్పేదే ఈ చలి మంట. అసలీ సంప్రదాయంలో ఓ గొప్ప రహస్యముంది. ‘అది మా తాతయ్య వాడిన చెక్క కుర్చీ, ఇది మా అమ్మమ్మ వాడిన నులక మంచం’... అంటూ శాశ్వత అనారోగ్యంతో బాధపడుతూండే ఎన్నెన్నో అనవసర వస్తువులు ఇళ్లలో ఉంటూ, మన గదిలోని వైశాల్యాన్ని తగ్గిస్తూ ఇంటిని చూడవచ్చేవారికి ‘సామానులు భద్రపరుచు గది’కి ప్రతిరూపంగా కనిపించే అన్నింటినీ అగ్ని సమర్పణం చేయగలిగిన పవిత్రాగ్ని ఈ చలిమంట. ఈ సంప్రదాయాన్ని పాటిస్తే ఇల్లు విశాలమూ అవుతుంది. తాతయ్య అమ్మమ్మలని తృణీకరించినట్టూ కాదు. దానిక్కారణం ఈ మంట సూర్యునికి ప్రతిబింబమైన నెగడు కాబట్టీ, ఉత్తరాయణ పుణ్యకాలానికి నాందిగా వేయబడేది కాబట్టీను. ఆకారంలోనూ రంగులోనూ పేరులో కూడా (అర్క ఫలమ్) సూర్యుణ్ని పోలి ఉండే రేగుపళ్లని పిల్లల తల మీదుగా పోసి పేరంటం చేయడమంటే సూర్యానుగ్రహాన్ని పిల్లలకి కోరుతున్నట్లే! భోగి తర్వాత సంక్రాంతి తెల్లవారుజామునే లేచి చక్కగా ఒంటికి నువ్వుల నూనె (తిలల నుండి వచ్చేది మాత్రమే తైలం)ని పట్టించి ఒక గంటపాటు, ఆ నూనె మన శరీరంలో ఇంకేలా చూసుకుని ఆ మీదట నలుగు పిండితో ఒంటిని మర్దించుకున్నట్లయితే శరీరంలోని ఏ నాళాల్లో రక్తం ఆగిపోయిందో ఆ రక్తం ప్రవహించే అవకాశాన్ని కల్పించినట్లే. నూనెని పట్టించుకోవడం, నలుగు పెట్టుకోవడం కోసం శరీరాన్ని వంచుతూ ఎత్తుతూ ఉన్న కారణంగా వ్యాయామమూ చేసినట్టే. ఇక కుంకుడు పులుసుతో మాత్రమే తలని అంటుకున్నట్లయితే, ఆ పులుసులోని చేదుతనానికి తలలో చుండ్రు, పేలు వంటివి రావు. ఈ ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం రోజున ఇంట్లో తల్లి ఆశీర్వచనాన్ని, తలంటు ప్రారంభం వేళ నూనెని పెట్టించుకుంటూ పొందినట్లయితే, అది పార్వతీమాత అనుగ్రహంతో సమానమని భరద్వాజ మహర్షి చెప్పాడు. ఈ స్నానం ముగించిన మరుక్షణంలో ఉత్తరాయణ సూర్యుణ్ని ఉదయిస్తూండగా చూస్తే, వీలుంటే ‘శం నో మిత్ర శ్శం వరుణః’ అనే వేద మంత్రాన్ని గాని, ‘జపాకుసుమసంకాశమ్... దివాకరమ్’ అనే శ్లోకాన్ని గాని సూర్యుని సంఖ్య అయిన 12 మార్లు పఠించినట్లయితే, శారీరక అనారోగ్యాలు రావు. ఉంటే తొలగిపోతాయని బోధాయన మహర్షి తెలిపాడు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఈ రోజున ఉదయ మధ్యాహ్న సాయంకాలాలు (3ఁ12) మొత్తంలో 36 మార్లు గాని చదవగలిగినట్లయితే, బుద్ధి వికాసం కలుగుతుందని గద్గ మహర్షి వివరించాడు. దైవపూజ ముగిశాక, మనకి రక్త మాంసాలనీ బుద్ధినీ ఇచ్చిన తల్లిదండ్రులు జీవించి ఉంటే పాదాభివందనం చేయాలి. లేని పక్షంలో వారిని తలుచుకుని తీపి గుమ్మడిపండుతో పాటు వస్త్రాలనిస్తూ ఆ పెద్దల సంస్మరణ చేస్తూ మనం తినబోయే ఆహారాన్ని దైవానికి నివేదన చేయాలి. ఇలా చాలామంది చేస్తూండని సందర్భంగానే చాలామందికి తాత ముత్తాతల పేర్లు కూడా తెలియకుండా అయిపోతున్నాయి. వారి ఆస్తుల్ని అనుభవిస్తూ ఈ ఉత్తరాయణ పుణ్యకాలవేళలోనైనా తలుచుకోకుండా ఉండటం సమంజసమా? కనుమ భారతీయ సంప్రదాయంలో దైవ భావనని ప్రతి ప్రాణిలోనూ చూసేలా ఆచార వ్యవహారాలని రూపొందించారు రుషులు. ఆ కారణంగా ఆషాఢ మాసపు తొలకరి చినుకు పడినప్పటి నుండి గాదెల్లోకి ధాన్యాలు వచ్చి నిండేంత వరకూ శ్రమించిన ఆ ఎద్దుల్నీ, పాడిని పుష్కలంగా అందించే ఆవుల్నీ ఈ రోజున ఎంతో చక్కగా అలంకరించి ఊరంతా తిప్పుతారు. ఏ రైతునైనా అడిగి చూస్తే వాళ్లు చెప్తారు - ఎద్దు దున్నినదానికీ యంత్రం దున్నినదానికీ ఉండే తేడాని! ఏ తల్లినడిగినా చెప్తుంది - ఆవుపాల శక్తినీ పిండిపాల బలాన్నీ. ఈ కనుము నాడు జరిగే పశువుల ఉత్సవాన్ని సంతోషంగా చేసుకోవడం పోయి బండ లాగుడు పోటీలతో వాటిని కొడుతూ, హింసిస్తూ, వాటి ద్వారా వచ్చే బహుమానాలని పొందడం మనసుకి కష్టమే అనిపిస్తుంది. ముక్కుకి ముక్కుని తగిలిస్తే దోషం పెరిగే కోడిజాతి ఆ దుర్లక్షణం కారణంగా తమ ప్రాణాలని తీసుకుంటూంటే కోడిపందాల పేరిట వినోదించడం దారుణం. ఇంకా దారుణం గొర్రె పొట్టేళ్ల పందాలు పోటుగిత్తల పందాలున్నూ. మనిషి తనకున్న హింసా స్వభావాన్ని వాటికి అంటగడుతూ ధనార్జన చేసుకోవడం ఎంత నీచం! ఉత్తరాయణం మనకి పుణ్యకాలమూ వాటికది చావు కాలమా? కొద్దిగా మనసుని మార్చుకోవద్దూ మనం! ముగ్గులు మూడు నిలువుగా మూడు అడ్డంగా పెట్టిన చుక్కలతో ఏర్పడే తొమ్మిది చుక్కల ముగ్గు నవగ్రహాలకీ సంకేతంగా చెప్పబడినదే. అలాగే ఐదూ మూడు, ఒకటి చుక్కలతో ఏర్పడే ముగ్గు పంచభూతాలూ(5) ఆ సృష్టి స్థితి లయలకి(3) లోబడే ఉండేవనీ ఆ ముగ్గురూ కూడా ఆదిశక్తి (1) అమ్మ ఆజ్ఞానుసారం ఉండేవారేనని బోధిస్తోంది. 64 చుక్కల ముగ్గు చతుష్షష్టి కళలకి, 16 చుక్కల ముగ్గు షోడశ కళలకి... ఇలా సంకేత రూపంగా వేయబడేవే. పరమ పద సోపాన పటాన్ని తలపిస్తూ వేసే 1008 చుక్కల ముగ్గుకి నాలుగు వైపులా వేయబడే నిలువు గీతలూ నాలుగు సముద్రాలకి సంకేతం.ఈ తీరుగా ఆలోచించి చూస్తే ఆవు పేడతో అలికిన నేల ఆకాశానికి సంకేతం. అక్కడి ముగ్గులో కనిపించే చుక్కలు ఆకాశంలోని నక్షత్రాలకి సంకేతం. ఈ భూమి రంగం మీద వేయబడిన తీగల్లాంటి ముగ్గు రంగవల్లికలకి సంకేతం. అన్ని చుక్కలకీ నడుమనున్న చుక్క సూర్యునికి సంకేతమౌతూ ఆ సూర్యుడు లేనిదే ఆకాశమే లేదనే రహస్యాన్ని వివరిస్తాయి ముగ్గులు. ఆ సూర్యుని పండుగే కదా ఉత్తరాయణమంటే! హరిదాసు హరి రూపంతోను, దాస భావంతోను వస్తూ చక్కటి శ్రీహరి కీర్తనని ఆలపిస్తూ ఓ పురందర దాసులా ఓ అన్నమయ్యలా ఓ తులసీదాసులా... సాగుతూ గృహిణి కనిపించిన వేళ గొంతుకు కూర్చుని తన తలమీది పాత్రలో బియ్యాన్ని వేయించుకుని వెళ్తుంటాడు హరిదాసు. ఆ వేయబడే బియ్యం బిచ్చం లాంటిది కాదు. రాబోయే కాలానికి విత్తనాలుగా భూమి ఆకారంగా ఉండే ఆ హరిదాసు తలమీది పాత్రలో వేయబడుతున్న బియ్యమన్నమాట. ‘కృష్ణార్పణ’మంటూ వేస్తుంది గృహిణి. ఆ హరిదాసు కూడా ‘శ్రీమద్రమా రమణ! గోవింద! హరే!’ అంటాడు. ‘ఈ గృహిణి కృతజ్ఞతాభావంతో నీ ప్రతినిధిగా వచ్చిన నాకు, నీ భార్య అయిన భూదేవికి సమర్పించవలసినదిగా బియ్యన్ని (నిజానికి ధాన్యాన్ని ఇస్తూండేవారు వెనుకట) అందించిందని హరిదాసు ఆ శ్రీహరికి తెలియజేయడమే శ్రీమద్రమా రమణ... అంటూ ముందుకి సాగిపోవడమంటే! ఇంకా గంగిరెద్దులూ, బుడబుక్కలూ, పిట్టదొరలూ, జంగమ దేవరలూ, కర్రులబండివాళ్లూ, కాటికాపరులూ... ఇందరి రాక సాగే ఈ పుణ్యకాలంలో ఆధ్యాత్మిక శ్రద్ధని చూపించకపోవడం ఎంత సమంజసం! గచ్ఛ త్పిపీలికా పంక్తిః సముద్ర మధిగచ్ఛతి! అగచ్ఛన్ వైనతేయోనాపి పదమేకం న గచ్ఛతి!! ‘అడుగులో అడుగు వేసుకుంటూ నడిచే చీమ కూడా నడక అనే పనిని ప్రారంభించి సముద్రాన్ని చేరుకోగలుగుతోందిట గాని, చెప్పలేనంత వేగంతో ఆకాశమంతటినీ గిర్రున తిరుగుతూ సర్వలోకాలూ తిరగగలిగిన శక్తి ఉన్న గరుత్మంతుడైనా అడుగు ముందుకి వేయనిదే ఉన్నచోటే ఉంటా’డని అర్థం! కుదిరినంతలో సంప్రదాయాన్ని యధాశక్తి పాటించండి - సూర్యానుగ్రహాన్ని సొంతం చేసుకోండి! డా॥మైలవరపు శ్రీనివాసరావు ఫొటోలు: వీరభగవాన్ తెలగరెడ్డి, సాక్షి, రాజమండ్రి