సిరుల కాంతి సంక్రాంతి | sankranthi is bright full festival | Sakshi
Sakshi News home page

సిరుల కాంతి సంక్రాంతి

Published Sun, Jan 12 2014 1:47 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

సిరుల కాంతి సంక్రాంతి - Sakshi

సిరుల కాంతి సంక్రాంతి

 వివరం
 
 ఎంతో గొప్ప వ్యక్తి వస్తున్నాడంటే,
 ఎందరెందరో ఎన్నెన్నో బహుమానాలతో ఎంతసేపటినుంచో ఎలా ఎదురుచూస్తూ గౌరవ పూర్వకంగా నిలబడే ఉంటారో, అలాగే సంక్రాంతి రాబోతోందనగానే గృహిణులు ముగ్గులతోను, కన్నెలు గొబ్బెమ్మలతోను, హరిదాసు శ్రీహరి గానామృతంతోను, పిల్లలు గాలిపటాలతోను ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే సంవత్సర చక్రంలో కనిపించేవన్నీ కేవలం పండుగలైతే ఈ పండుగకి మాత్రమే ‘పెద్దపండుగ’ అనే పేరొచ్చింది.
 
 
 బొమ్మల కొలువు
 ‘పాఠాల ద్వారా చెప్పడం కంటే చూసి గ్రహించేలా చేయడం మేలు’ అనేది ప్రాచీనుల ఆలోచన కాబట్టి బొమ్మల కొలువుని ఏర్పాటు చేయించారు ప్రాచీనులు.పెమైట్టు మీదున్న ఆదిశక్తి అందరికీ మూలమని, ఆ కింది మెట్టు మీదున్న త్రిమూర్తులూ సృష్టి స్థితి లయలకి కర్తలని, ఆ కింది మెట్టు మీదున్న సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలన్నీ ఆకాశంలో ఉంటాయని, ఆ దిగువ మెట్టు మీదున్న వివిధ జాతి పశుపక్షి మృగ క్రూర మృగ జంతు క్రిమి కీటకాల విభాగమంతా నేలమీద ఉంటుందని... ఇలా పిల్లలు క్షణంలో గ్రహించెయ్యగలుగుతారు. తన స్నేహితులకి తాను వివరించేలా మన సంతానాన్ని అక్కడ ఉంచితే, పదిమార్లు వివరించవలసి వచ్చిన కారణంగా మన సంతానానికి ఆ బొమ్మల కొలువులోని విశేషాలు ఈ రోజున కాకున్నా ముందునాటికి బాగా బోధపడతాయి.
 
 బొమ్మల్లో చందన వృక్షం - కుంకుడు వృక్షాలూ, సింహం - కుక్క బొమ్మలూ, దైవం, రాక్షసుని బొమ్మలూ... పక్కపక్కగా ఉన్నా, ఒకరికి మరొకరి మీద పగ, ద్వేషం, అసూయ వంటివి లేకపోవడాన్ని చూపించేతీరుగా అమర్చిన ఈ దృశ్యాలని గూర్చి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అనిపిస్తుంది.సాయంవేళ స్త్రీలంతా పేరంటాన్ని చేసుకుని, తమని పిలిచినవారి ఇళ్లలోని శిశువుల్ని ఆశీర్వదిస్తూ వెళ్లడమనేది నష్టాయుర్లాభానికే (రోజురోజుకీ తరిగిపోతూండే ఆయుష్యాన్ని తిరిగి పూర్తి చేసుకునేందుకే). ఎవరి నోటి ఆశీర్వచనాక్షరాలు మంత్రాలుగా పనిచేసి ఎవరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయో ఆ విషయం మనకి తెలియదు కాబట్టి, సంవత్సరానికి ఒక్కరోజైనా ఈ సంక్రాంతి నాడు ఈ సంప్రదాయాన్ని ఏ వినోద కాలక్షేపాన్నో చేస్తూ విడుచుకోవడం తగునా?
 
 
 ఎంతో శ్రద్ధతో అభిషేకం చేస్తాం గాని ఆ శంకరుణ్ని ప్రత్యక్షంగా చూడలేం. ఎంతో భక్తితో అర్చిస్తాంగాని ఆ శ్రీహరిని దర్శించలేం. ఈ దేవతలంతా పరోక్ష దర్శనాన్నిచ్చేవాళ్లౌతున్నా కూడా ఆరాధిస్తున్నాం గాని, ప్రతిరోజూ  కనిపించే  సూర్యుణ్ని దర్శిస్తూ కూడా పట్టించుకోకపోవడమంటే ఎంత నేరం! వెనుక కాలంలో రైతులు పొలాల్లో నుండే సూర్యోదయమౌతున్న వేళ నమస్కరించుకుంటుండేవారు. విప్రులు సంధ్యావందనం మధ్యలో ఆ ఉదయ సూర్యునికి ప్రత్యక్షంగా అర్ఘ్యాన్ని సమర్పించుకుంటూండేవారు. గృహిణులు స్నానాన్ని ముగించి ఆ సూర్యునికి కుంకుమని చూపించి తిలక ధారణని చేస్తూండేవారు. అలాంటి సూర్యుడు ధనూ రాశి నుండి మకర రాశిలోకి సంక్రమణం (జరగడం) చేయడమేదుందో అదే ‘మకర సంక్రమణ’మంటే!
 
 ఈ విషయాన్ని లోకమంతటికీ అర్థమయ్యేలా వివరించేందుకే ఓ పెద్ద నెగడు (కర్రలతో మంట)ని నాలుగు మార్గాల కూడళ్లలోనూ వేస్తారు. ‘ఈ మంట ఎలా వేడిమినిస్తూ ఇంతకుముందెన్నడూ లేని విధంగా వెలుగుతూ కనిపిస్తోందో అదే తీరుగా రేపటి నుండి వేడిమిని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్తూండే కొత్త సూర్యుడు (ఉత్తరాయణ సూర్యుడు) రాబోతున్నాడు సుమా!’ అనే ఓ సూచననియ్యడం దీని భావం.
 ఇక్కడ వెలుగుతున్న ఈ మంటకి ఆకర్షింపబడి ఎన్నెన్నో వ్యాధికారక క్రిమికీటకాలు తగలబడి వ్యాధుల్ని మనకి దూరం చేశాయి. రాబోయే సూర్యుని వేడిమి అలాంటిది కాదు, ఉష్ణ వ్యాధులని కలిగించేది’ కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండాల్సిందే’’ అని చెప్పేదే ఈ చలి మంట.
 
 అసలీ సంప్రదాయంలో ఓ గొప్ప రహస్యముంది. ‘అది మా తాతయ్య వాడిన చెక్క కుర్చీ, ఇది మా అమ్మమ్మ వాడిన నులక మంచం’... అంటూ శాశ్వత అనారోగ్యంతో బాధపడుతూండే ఎన్నెన్నో అనవసర వస్తువులు ఇళ్లలో ఉంటూ, మన గదిలోని వైశాల్యాన్ని తగ్గిస్తూ ఇంటిని చూడవచ్చేవారికి ‘సామానులు భద్రపరుచు గది’కి ప్రతిరూపంగా కనిపించే అన్నింటినీ అగ్ని సమర్పణం చేయగలిగిన పవిత్రాగ్ని ఈ చలిమంట. ఈ సంప్రదాయాన్ని పాటిస్తే ఇల్లు విశాలమూ అవుతుంది. తాతయ్య అమ్మమ్మలని తృణీకరించినట్టూ కాదు. దానిక్కారణం ఈ మంట సూర్యునికి ప్రతిబింబమైన నెగడు కాబట్టీ, ఉత్తరాయణ పుణ్యకాలానికి నాందిగా వేయబడేది కాబట్టీను. ఆకారంలోనూ రంగులోనూ పేరులో కూడా (అర్క ఫలమ్) సూర్యుణ్ని పోలి ఉండే రేగుపళ్లని పిల్లల తల మీదుగా పోసి పేరంటం చేయడమంటే సూర్యానుగ్రహాన్ని పిల్లలకి కోరుతున్నట్లే!
 
 భోగి తర్వాత సంక్రాంతి
 తెల్లవారుజామునే లేచి చక్కగా ఒంటికి నువ్వుల నూనె (తిలల నుండి వచ్చేది మాత్రమే తైలం)ని పట్టించి ఒక గంటపాటు, ఆ నూనె మన శరీరంలో ఇంకేలా చూసుకుని ఆ మీదట నలుగు పిండితో ఒంటిని మర్దించుకున్నట్లయితే శరీరంలోని ఏ నాళాల్లో రక్తం ఆగిపోయిందో ఆ రక్తం ప్రవహించే అవకాశాన్ని కల్పించినట్లే. నూనెని పట్టించుకోవడం, నలుగు పెట్టుకోవడం కోసం శరీరాన్ని వంచుతూ ఎత్తుతూ ఉన్న కారణంగా వ్యాయామమూ చేసినట్టే. ఇక కుంకుడు పులుసుతో మాత్రమే తలని అంటుకున్నట్లయితే, ఆ పులుసులోని చేదుతనానికి తలలో చుండ్రు, పేలు వంటివి రావు. ఈ ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం రోజున ఇంట్లో తల్లి ఆశీర్వచనాన్ని, తలంటు ప్రారంభం వేళ నూనెని పెట్టించుకుంటూ పొందినట్లయితే, అది పార్వతీమాత అనుగ్రహంతో సమానమని భరద్వాజ మహర్షి చెప్పాడు.
 
 ఈ స్నానం ముగించిన మరుక్షణంలో ఉత్తరాయణ సూర్యుణ్ని ఉదయిస్తూండగా చూస్తే, వీలుంటే ‘శం నో మిత్ర శ్శం వరుణః’ అనే వేద మంత్రాన్ని గాని, ‘జపాకుసుమసంకాశమ్... దివాకరమ్’ అనే శ్లోకాన్ని గాని సూర్యుని సంఖ్య అయిన 12 మార్లు పఠించినట్లయితే, శారీరక అనారోగ్యాలు రావు. ఉంటే తొలగిపోతాయని బోధాయన మహర్షి తెలిపాడు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఈ రోజున ఉదయ మధ్యాహ్న సాయంకాలాలు (3ఁ12) మొత్తంలో 36 మార్లు గాని చదవగలిగినట్లయితే,  బుద్ధి వికాసం కలుగుతుందని గద్గ మహర్షి వివరించాడు.
 
 దైవపూజ ముగిశాక, మనకి రక్త మాంసాలనీ బుద్ధినీ ఇచ్చిన తల్లిదండ్రులు జీవించి ఉంటే పాదాభివందనం చేయాలి. లేని పక్షంలో వారిని తలుచుకుని తీపి గుమ్మడిపండుతో పాటు వస్త్రాలనిస్తూ ఆ పెద్దల సంస్మరణ చేస్తూ మనం తినబోయే ఆహారాన్ని దైవానికి నివేదన చేయాలి. ఇలా చాలామంది చేస్తూండని సందర్భంగానే చాలామందికి తాత ముత్తాతల పేర్లు కూడా తెలియకుండా అయిపోతున్నాయి. వారి ఆస్తుల్ని అనుభవిస్తూ ఈ ఉత్తరాయణ పుణ్యకాలవేళలోనైనా   తలుచుకోకుండా ఉండటం సమంజసమా?
 
 కనుమ
 భారతీయ సంప్రదాయంలో దైవ భావనని ప్రతి ప్రాణిలోనూ చూసేలా ఆచార వ్యవహారాలని రూపొందించారు రుషులు. ఆ కారణంగా ఆషాఢ మాసపు తొలకరి చినుకు పడినప్పటి నుండి గాదెల్లోకి ధాన్యాలు వచ్చి నిండేంత వరకూ శ్రమించిన ఆ ఎద్దుల్నీ, పాడిని పుష్కలంగా అందించే ఆవుల్నీ ఈ రోజున ఎంతో చక్కగా అలంకరించి ఊరంతా తిప్పుతారు. ఏ రైతునైనా అడిగి చూస్తే వాళ్లు చెప్తారు - ఎద్దు దున్నినదానికీ యంత్రం దున్నినదానికీ ఉండే తేడాని! ఏ తల్లినడిగినా చెప్తుంది - ఆవుపాల శక్తినీ పిండిపాల బలాన్నీ. ఈ కనుము నాడు జరిగే పశువుల ఉత్సవాన్ని సంతోషంగా చేసుకోవడం పోయి బండ లాగుడు పోటీలతో వాటిని కొడుతూ, హింసిస్తూ, వాటి ద్వారా వచ్చే బహుమానాలని పొందడం మనసుకి కష్టమే అనిపిస్తుంది.
 ముక్కుకి ముక్కుని తగిలిస్తే దోషం పెరిగే కోడిజాతి ఆ దుర్లక్షణం కారణంగా తమ ప్రాణాలని తీసుకుంటూంటే కోడిపందాల పేరిట వినోదించడం దారుణం. ఇంకా దారుణం గొర్రె పొట్టేళ్ల పందాలు పోటుగిత్తల పందాలున్నూ. మనిషి తనకున్న హింసా స్వభావాన్ని వాటికి అంటగడుతూ ధనార్జన చేసుకోవడం ఎంత నీచం! ఉత్తరాయణం మనకి పుణ్యకాలమూ వాటికది చావు కాలమా? కొద్దిగా మనసుని మార్చుకోవద్దూ మనం!
 
 ముగ్గులు
 మూడు నిలువుగా మూడు అడ్డంగా పెట్టిన చుక్కలతో ఏర్పడే తొమ్మిది చుక్కల ముగ్గు నవగ్రహాలకీ సంకేతంగా చెప్పబడినదే. అలాగే ఐదూ మూడు, ఒకటి చుక్కలతో ఏర్పడే ముగ్గు పంచభూతాలూ(5) ఆ సృష్టి స్థితి లయలకి(3) లోబడే ఉండేవనీ ఆ ముగ్గురూ కూడా ఆదిశక్తి (1) అమ్మ ఆజ్ఞానుసారం ఉండేవారేనని బోధిస్తోంది.
 
 64 చుక్కల ముగ్గు చతుష్షష్టి కళలకి, 16 చుక్కల ముగ్గు షోడశ కళలకి... ఇలా సంకేత రూపంగా వేయబడేవే. పరమ పద సోపాన పటాన్ని తలపిస్తూ వేసే 1008 చుక్కల ముగ్గుకి నాలుగు వైపులా వేయబడే నిలువు గీతలూ నాలుగు సముద్రాలకి సంకేతం.ఈ తీరుగా ఆలోచించి చూస్తే ఆవు పేడతో అలికిన నేల ఆకాశానికి సంకేతం. అక్కడి ముగ్గులో కనిపించే చుక్కలు ఆకాశంలోని నక్షత్రాలకి సంకేతం. ఈ భూమి రంగం మీద వేయబడిన తీగల్లాంటి ముగ్గు రంగవల్లికలకి సంకేతం. అన్ని చుక్కలకీ నడుమనున్న చుక్క సూర్యునికి సంకేతమౌతూ ఆ సూర్యుడు లేనిదే ఆకాశమే లేదనే రహస్యాన్ని వివరిస్తాయి ముగ్గులు. ఆ సూర్యుని పండుగే కదా ఉత్తరాయణమంటే!
 
 హరిదాసు
 హరి రూపంతోను, దాస భావంతోను వస్తూ చక్కటి శ్రీహరి కీర్తనని ఆలపిస్తూ ఓ పురందర దాసులా ఓ అన్నమయ్యలా ఓ తులసీదాసులా... సాగుతూ గృహిణి కనిపించిన వేళ గొంతుకు కూర్చుని తన తలమీది పాత్రలో బియ్యాన్ని వేయించుకుని వెళ్తుంటాడు హరిదాసు.
 
 ఆ వేయబడే బియ్యం బిచ్చం లాంటిది కాదు. రాబోయే కాలానికి విత్తనాలుగా భూమి ఆకారంగా ఉండే ఆ హరిదాసు తలమీది పాత్రలో వేయబడుతున్న బియ్యమన్నమాట. ‘కృష్ణార్పణ’మంటూ వేస్తుంది గృహిణి. ఆ హరిదాసు కూడా  ‘శ్రీమద్రమా రమణ! గోవింద! హరే!’ అంటాడు. ‘ఈ గృహిణి కృతజ్ఞతాభావంతో నీ ప్రతినిధిగా వచ్చిన నాకు, నీ భార్య అయిన భూదేవికి సమర్పించవలసినదిగా బియ్యన్ని (నిజానికి ధాన్యాన్ని ఇస్తూండేవారు వెనుకట) అందించిందని హరిదాసు ఆ శ్రీహరికి తెలియజేయడమే శ్రీమద్రమా రమణ... అంటూ ముందుకి సాగిపోవడమంటే!
 
 ఇంకా గంగిరెద్దులూ, బుడబుక్కలూ, పిట్టదొరలూ, జంగమ దేవరలూ, కర్రులబండివాళ్లూ, కాటికాపరులూ... ఇందరి రాక సాగే ఈ పుణ్యకాలంలో ఆధ్యాత్మిక శ్రద్ధని చూపించకపోవడం ఎంత సమంజసం!
 గచ్ఛ త్పిపీలికా పంక్తిః సముద్ర మధిగచ్ఛతి!
 అగచ్ఛన్ వైనతేయోనాపి పదమేకం న గచ్ఛతి!!
 ‘అడుగులో అడుగు వేసుకుంటూ నడిచే చీమ కూడా నడక అనే పనిని ప్రారంభించి సముద్రాన్ని చేరుకోగలుగుతోందిట గాని, చెప్పలేనంత వేగంతో ఆకాశమంతటినీ గిర్రున తిరుగుతూ సర్వలోకాలూ తిరగగలిగిన శక్తి ఉన్న గరుత్మంతుడైనా అడుగు ముందుకి వేయనిదే ఉన్నచోటే ఉంటా’డని అర్థం!
 కుదిరినంతలో సంప్రదాయాన్ని యధాశక్తి పాటించండి - సూర్యానుగ్రహాన్ని సొంతం చేసుకోండి!
 డా॥మైలవరపు శ్రీనివాసరావు
 ఫొటోలు:
 వీరభగవాన్ తెలగరెడ్డి, సాక్షి, రాజమండ్రి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement