హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి.. తెలుగువారికి ప్రీతికరమైన పండుగ. మూడు రోజుల ఈ పండుగలో మొదటది భోగి. ఈ భోగి పండుగను ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే తమ ఇంటి ముందు భోగి మంటలు వేసుకున్నారు. పాత చీడలన్నీ పోయి... జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని భగవంతుడిని ప్రార్థించారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పోలీస్ గ్రౌండ్‌లో యువకులు భోగి మంటలు వేసుకుని పండుగ జరుపుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో భోగభాగ్యాల భోగి పండుగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పవిత్రమైన ఉత్తరాయణ ఘడియలను వెంట పెట్టుకుని వస్తున్న భోగిని ఊరువాడా భక్తిశ్రద్ధలతో ఆహ్వానించారు. మంచుతెరల పరదాలను పక్కకు నెడుతూ తెల్లవారుజామునే భోగిమంటలు వేసుకున్నారు. దెందులూరు మండలం కొవ్వలిలో భోగి పండుగ కనులవిందుగా జరిగింది.
అలాగే రాజమండ్రిలో భోగి పండుగ ఘనంగా జరుగుతోంది. ఈ భోగి... భోగభాగ్యాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసుకున్నారు.
విశాఖలో భోగి సంబరాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు ఇళ్లముందు భోగి మంటలు వేశారు. పాత వస్తువులను మంటల్లో దహనం చేసి కొత్తదనాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇక
సంక్రాంతి సందర్భంగా విజయనగరంలో పల్లె వాతావరణం ఉట్టిపడుతోంది. అపార్ట్‌మెంట్ల కల్చర్‌లోనూ భోగి పండుగను అంతా కలిసి మెలిసి జరుపుకుంటున్నారు.
మరోవైపు హైదరాబాద్ మలేషియన్ టౌన్ షిప్లో భోగి పండుగను జరుపుకున్నారు. భోగి మంటలు వేసి చిన్న పెద్ద సందడి చేశారు. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. నగరంలో ప్రతి ఏరియాలో భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. నగర ప్రజలు భోగి పండుగను భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకున్నారు. కేబీఆర్ పార్క్లో జరిగిన భోగి మంటల వేడుకలో టీఆర్ఎస్ ఎంపీ కవిత పాల్గొన్నారు. గతాన్ని భోగి మంటల్లో కాల్చేద్దాం.. కొత్త ఆశలు, ఆశయాలను ఆహ్వానిద్దామని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు కవిత భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు
Published Thu, Jan 14 2016 10:23 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM
Advertisement
Advertisement