తాడేపల్లిలోని గోశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో హరిదాసుకు బియ్యం సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి
CM YS Jagan To Attend In Sankranthi Celebrations: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. తన క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాల వద్ద శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలను ఆయన సతీమణి భారతితో కలిసి ప్రారంభించారు. తెలుగుదనం ఉట్టిపడేలా అచ్చ తెలుగు పంచెకట్టుతో ఆయన గోశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. మేళ తాళాల మధ్య వేద పండితులు పూర్ణ కుంభంతో ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సీఎం దంపతులు గోపూజ నిర్వహించి, గో సేవ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించారు. దాదాపు గంటన్నర సేపు సీఎం దంపతులు వేడుకలను తిలకించారు.
సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ..
చదవండి: భోగం వైభోగం.. భోగి పళ్లు ఎందుకు?
ఆకట్టుకున్న గోశాల ప్రాంగణం:
గ్రమీణ వాతావరణం ఉట్టిపడే విధంగా గోశాలను తీర్చిదిద్దారు. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో తులసి కోట, ధాన్యపు రాశులు, చెరుకు గడలు, రంగవల్లులు, ముత్యాల ముగ్గులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, డోలు వాద్యాలు, కోలాటాలు, హరిదాసులు, గంగిరెద్దులు, అరిసెల వంటకాలతో ఆ ప్రాంతం పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టింది. కోలాటం, డోలు విన్యాసాలు, గంగిరెద్దుల విన్యాసాలు, నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంగ్లీ ఆలపించిన సంక్రాంతి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరిదాసుకు సీఎం దంపతులు బియ్యం అందజేశారు.
గోమాతకు పసుపు కుంకుమ సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాల వద్ద నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు
ప్రదర్శన ఇచ్చిన చిన్నారులు, కళాకారులను ఆశీర్వదించి ముఖ్యమంత్రి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అంతా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అర్చకులు సీఎంకు దేవుడి చిత్రపటాన్ని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరో చిత్ర పటాన్ని అందజేశారు. కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment