అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఊళ్లు, పల్లెలు జనసందోహంతో కళకళలాడిపోతుంటాయి. ఎంతెంత దూరమైనా వ్యయప్రయాసలు కోర్చి మరీ పట్టణాలు, విదేశాల నుంచి సోంతూళ్లకి పయనమైపోతుంటారు. అంతటి సరదాలు, ఆనందాలు తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ నాలుగు రోజుల పండుగకి ఉన్న క్రేజ్ మరే పండుగకి ఉండదేమో అన్నంతలా చిన్న పెద్ద భేదం లేకుండా జరుపుకునే పండుగ. అలాంటి ఈ పండుగను మన పూర్వీకులు ఏ ఉద్దేశ్యంతో ఇలానే జరుపుకోండని మనకు ఒక సంప్రదాయన్ని అందిస్తే దానికి తిలోదాకాలు ఇచ్చేసి తప్పుగా అర్థం చేసుకుంటూ పిచ్చిపిచ్చిగా జరుపుకుంటున్నాం. అజ్ఞానంతో పర్యావరణానికి హాని కలిగించడమే గాకుండా లేనిపోనీ అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాం. ఈ విషయమై పర్యావరణ అధికారులు, వైద్యులు, ఆయా పాలనాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా దయచేసి ఇలా చెయ్యొద్దు అని వేడుకుంటున్నారు. ఇంతకీ ఈ పండుగను ఎలా జరుపుకోవాలి? ఎలాంటివి చెయ్యకూడదు?. వాళ్లంతా భయాందోళనలు వ్యక్తం చేయడానికి రీజన్?
నిజానికి ఈ సంక్రాంతి పండుగలో భోగితో మొదలయ్యే తొలి పండుగ అంటే అందరికీ సరదానే. ఎందుకంటే? బోగి మంటలతో ప్రారంభమయ్యే ఈ పండుగ సఓ సంబరంలా అంతా ఒక చోట చేరి ఐక్యమత్యంగా జరుపుకుంటారు. అయితే ఈ భోగి మంటలకు కావాల్సిన కలప, పిడకలు, వంటివి నగరాల్లో అందుబాటులో ఉండవు. అదీగాక అభివృద్ధి పేరుతో ఓ టౌన్ మాదిరివి కూడా నగరాల్లో మారిపోయాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటవన్నీ అందుబాటులో ఉండవు. పైగా అందరికి వ్యయప్రయాసలు కోర్చి మరి సొంతూళ్లుకు వెళ్లడం కూడా కుదరదు. దీంతో వారంతా ఈ భోగమంటను ఇంట్లోని పాత వస్తువులను తగలబెట్టి భోగి మంట వేసుకోవడం లేదా టైర్లు, వేస్ట్ ప్లాస్టిక్‌ని తగలబెట్టడం వంట పనులు చేస్తారు.
ఇలాంటి చలిమంట వల్ల పర్యావరణ కాలుష్యమే గాక, ఈ పొగ పీల్చడం వల్ల అనారోగ్య సమస్యల బారినపడతారు. ముఖ్యంగా ప్లాస్టిక్, టైర్లు వంటివి కాల్చడం వల్ల చాలా విషపూరితమైన వాయువులు గాల్లోకి విడుదల అవుతాయి. వీటిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, కేన్సర్ వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యనిపుణులు, పర్యావరణ అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పండుగ అనేది మనకు కొత్త ఉత్తేజన్ని తీసుకొచ్చి ఆనందంగా గడిపేలా ఉండాలే కానీ మన వినాశనానికి కారణమయ్యేలా ఉండకూదనేది వారి ఆవేదన. కానీ చాలామంది ఇలానే చేసి చేజేతులారా తమ ఆరోగ్యాన్ని పక్కవారి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. అస్సలు మన పూర్వీకులు ఎందుకని పండగను ఇలా భోగిమంటలతో చేసుకోవాలని చెప్పారు? దానిలో దాగున్న అంతరార్థం ఏంటో తెలుసుకోకుండా అజ్ఞానంతో తప్పుగా జరుపుకుని లేనిపోనీ సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం.
ఇంతకీ ఎలా చేసుకోవాలంటే..
పర్యావరణ హితంగా మంచి ఔషధ చెట్ల కలప లేదా ఆవుపిడకలతో వేసిన భోగిమంటే అన్ని విధాల మంచిది. దీని నుంచి విడుదలయ్యే వాయువులు పీల్చేతే శ్వాస సంబంధ సమస్యలు తలెత్తవు. మన పూర్వీకులు ఈ భోగి మంటల వేయడానికి కారణం కూడా ఈ రోజుల్లో చలి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇలా రావి, వేప వంటి ఔషధ గుణాలు గల చెట్ల దుంగల్ని తెచ్చి మంట వేస్తారు. అందులోనే దేశీ ఆవు నెయ్యి, పిడకలు వంటివి కూడా వేస్తారు. ఇలా భోగిమంటను వేసి దాని నుంచి విడుదలయ్యే గాలిని పీల్చితే ఎలాంటి అనారోగ్య సమస్యల రావు. పైగా శ్వాసకోశ సమస్యలు కూడా ఉండవు.
ఈ శీతాకాలంలో వచ్చే జలుబు, ఆయాసం వంటి సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని మన పెద్దలు ఈ ఆచారాన్ని తీసుకొచ్చారు. అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇంట్లోని పాత వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, పాత టైర్లతో చలిమంటలు వేసుకుని అనారోగ్యం పాలవ్వుతున్నారు. తెలియకుండానే అటు దేవుడి అనుగ్రహానికి నోచుకోక పోగా, ఇటు ఆరోగ్యాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నవారవమవుతున్నాం అని నిపుణులు చెబుతున్నారు.
అందువల్ల దయచేసి ఇలా మాత్రం చేసుకోవద్దు. అవన్నీ అందుబాటులో లేకపోతే కనీసం కొబ్బరి చిప్పలు, వేపాకులు వంటివి తెచ్చుకుని భోగిమంట వేసుకోండి. ఇది కూడా ఆరోగ్యానికి అన్ని విధాల మంచిదే అని హితవు చెబుతున్నారు పర్యావరణ నిపుణులు. అందువల్ల అందరం ఈ పండుగను ఆరోగ్యకరమైన రీతీలో పర్యావరణ హితంగా జరుపుకుని ఆరోగ్యమనే భాగ్యాన్ని, సంతోషమనే సంపదను పొందుదాం.
Comments
Please login to add a commentAdd a comment