నరజన్మకూ, మిగిలిన ప్రాణులకూ ఒక ప్రత్యేకమైన భేదం ఉంది. ఇతరప్రాణులకు ఒకే ధర్మం–పశుధర్మం. ఆకలి, నిద్ర, ప్రత్యుత్పత్తి.. అంతకుమించి వాటికి ధర్మం అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కానీ ఒక్క మనిషికి మాత్రం అత్యంత ప్రధానమైనది – ధర్మాచరణ. అయితే దీనిలో ఒక సంక్లిష్టత ఉంది. ఇదే ధర్మము.. అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. ధర్మం నిరంతరం మారిపోతుంటుంది. భార్యముందు నిలబడితే–భర్త ధర్మం. తల్లి ముందు నిలబడితే–పుత్ర ధర్మం. సోదర ధర్మం... ఉద్యోగ ధర్మం.. అలా నిరంతరం మారిపోతుంటుంది. దేశాన్నిబట్టి, కాలాన్నిబట్టి మారిపోతుంది. ఉత్తర భారతదేశంలో చలి కారణం చేత వీలయినంతగా శరీరాన్ని కప్పుకుని పూజాదులు చేయడం అక్కడి ధర్మం. దక్షిణ భారతదేశంలో.. కేవలం ఉత్తరీయం పైన వేసుకుని అభిషేకాలు, పూజలు చేయడం ఇక్కడి ధర్మం.
అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు, సన్యాసికి.. ఇలా ధర్మం మారుతుంటుంది. బ్రహ్మచారి ఏదీ కూడబెట్టకూడదు. విద్యార్థిగా గురువుగారు చెప్పింది శ్రద్ధగా విని మననం చేసుకోవడం ఒకటే ధర్మం. అదే గృహస్థాశ్రమంలో భోగం అనుభవించవచ్చు. భార్యాబిడ్దలతో సుఖసంతోషాలతో గడపవచ్చు. రేపటి అవసరాలకోసం సంపాదించి దాచుకోవచ్చు. వానప్రస్థు భార్యతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఆత్మవిచారం చేస్తూ గడపవచ్చు. చిట్టచివరన అన్నీ పరిత్యజించి ఏకాకిగా వైరాగ్యంలో ఉండడం ధర్మం. అలా ధర్మం మారిపోతున్నా ఎక్కడికక్కడ ధర్మం నియమాలకు కట్టుబడి ఉంటుంది. అసలు ధర్మం లేకుండా ఉండడం, దానిని పాటించకుండా జీవించడం సాధ్యం కాదు.
ధర్మాచరణతోనే మనుష్యప్రాణి ఉత్తమగతులు పొందగలడు. శాస్త్రం చెప్పినట్టుగా ధర్మాచరణ చేస్తూ శరీరం పతనమయిన తరువాత స్వర్గలోకం వెళ్ళవచ్చు. పుణ్యఫలితం అయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి చేరుకోవచ్చు.‘నాకు శాస్త్రం మీద నమ్మకం లేదు. ఈ పుణ్యకర్మలు నేను చేయను. నాకు ఏది సంతోషం అనిపిస్తే, నా ఇంద్రియాలకు ఏది సుఖం అనిపిస్తే, నా మనసుకు ఏ భోగం అనుభవించాలనుకుంటే దానిని అనుభవిస్తూ శాస్త్రాన్ని పక్కనబెట్టి ప్రవర్తిస్తే.. ఆ పాటిదానికి నరజన్మ అవసరం లేదని తిర్యక్కుగా (వెన్నుపూసలేని జీవిగా) జన్మ లభిస్తుంది.
అలా కాదు, నాకు పాపమూ వద్దు, పుణ్యమూ వద్దు. నేను ఈ మంచిపని చేసి పుణ్యం కావాలనుకోవడం లేదు, నేను కేవలం భగవంతుడు చెప్పినట్లు బతకడం నాకు సంతోషం. నేను చేయవలసినివి కాబట్టి చేస్తున్నా.. దానినుంచి నేను ఏ ప్రయోజనమూ ఆశించడం లేదనుకున్నప్పుడు అది చిత్తశుద్ధిని సూచిస్తుంది. ఇది ఏదో ఒకనాడు భగవంతుని అనుగ్రహానికి కారణమయి, జ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని ఇస్తుంది. అంటే ధర్మాన్ని అనుష్ఠానం చేసి దేవతాపదవిని అధిష్టించగలడు. ధర్మాచరణను పక్కనబెట్టి పతనమమై తిర్కక్కు అయిపోగలడు. ఏ ఫలితాన్ని ఆశించకుండా ధర్మాచరణచేసి మోక్షాన్ని పొందగలడు. కాబట్టి ధర్మం కన్నా గొప్పది మరొకటి లేదు.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
ఇవి చదవండి: మీరెంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట!
Comments
Please login to add a commentAdd a comment