Rules and regulations
-
కారుణ్య నియామకాలు హక్కు కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: కారుణ్య నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వోద్యోగం పొందేందుకు వాటిని హక్కుగా భావించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు ఈ మేరకు వెలువరించింది. ‘‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగి మరణంతో ఆయన కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవద్దన్నది మాత్రమే కారుణ్య నియామకాల వెనక ఉన్న సదుద్దేశం. అందుకోసం సదరు నియామకానికి అవసరమైన నియమ నిబంధనలను విధిగా సంతృప్తి పరచాల్సి ఉంటుంది’’ అని పేర్కొంది. -
టెలిగ్రామ్‌లో ఇకపై అవి సెర్చ్ చేయలేరు!
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ తన సర్వీస్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్‌లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఈ సమాచారం నియంత్రణకు ప్లాట్ఫామ్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. దాంతో సంస్థ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దురోవ్ పావెల్‌ను ఇటీవల పారిస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఫలితంగా కంపెనీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సర్వీస్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.ప్లాట్‌ఫారమ్ సెర్చ్ ఫంక్షన్‌ని ఉపయోగించి ఇకపై చట్టవిరుద్ధ కార్యకలాపాలు, కంటెంట్ కోసం వెతకలేరని తెలిపింది. ఒకవేళ వినియోగదారులు అలాంటి కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి పలుమార్లు ప్రయత్నిస్తే చట్టబద్ధంగా అవసరమైతే వారి ఫోన్ నంబర్లు, ఐపీ చిరునామాలను ప్రభుత్వ అధికారులకు అందజేస్తుందని సంస్థ వర్గాలు స్పష్టం చేశాయి. టెలిగ్రామ్ సెర్చ్ ఫీచర్ స్నేహితులు, వార్తలను కనుగొనడం కోసం ఉద్దేశించబడిందని, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల కోసం కాదని ఈ సందర్భంగా దురోవ్ తెలిపారు. టెలిగ్రామ్‌లో డ్రగ్స్, స్కామ్, పిల్లల లైంగిక వేదింపులు, హింస..వంటి కంటెంట్‌ను కట్టడి చేయడానికి ప్రత్యేకంగా కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?పారిస్ పోలీసులు దురోవ్ పావెల్‌ను ఇటీవల అరెస్ట్ చేయడంతో నిబంధనల ప్రకారం ఐదు మిలియన్ యూరోలు(రూ.46 కోట్లు) విలువ చేసే బాండ్‌ను అందించి న్యాయ పర్యవేక్షణలో ఉన్నారు. దాంతోపాటు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చర్యలు అమలు చేస్తున్నారు. దురోవ్ అరెస్ట్ సమయంలో టెలిగ్రామ్‌ను నిలిపేస్తారేమోననే వార్తలు రావడం గమనార్హం. -
Court of Arbitration for Sport: ఒక్క గ్రాము ఎక్కువున్నా అనర్హతే
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) సూచించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయగా... కేవలం వంద గ్రాములే కదా దీన్ని మినహాయించండి అని భారత అథ్లెట్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. వాదనలు విన్న అనంతరం తీర్పును పలుమార్లు వాయిదా వేసిన సీఏఎస్ ఈనెల 14న వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ఏకవాక్యంలో తీర్పు ఇచి్చంది. ఇప్పుడు తాజాగా దీనిపై వివరణ ఇచి్చంది. ‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిరీ్ణత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే. అందుకే పోటీపడే కేటగిరీ కంటే కాస్త తక్కువే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. దరఖాస్తు చేసుకున్న అథ్లెట్ (వినేశ్ ఫొగాట్‌ను ఉద్దేశించి) తాను అధిక బరువు ఉన్నానని స్పష్టంగా పేర్కొంది. ఇందులో ఎలాంటి వివాదం లేదు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పొందుపరిచింది. దరఖాస్తుదారు అనుభవమున్న రెజ్లర్. గతంలో ఇలాంటి నిబంధనల నడుమ పోటీపడింది. రూల్స్ అర్థం చేసుకోలేకపోయిందనే సమస్యే తలెత్తదు. అయితే ఆమె అభ్యర్థన ఏంటంటే.. 100 గ్రాములు బరువు ఎక్కువ కాదని.. రుతుస్రావానికి ముందు దశలో అధికంగా నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని.. తగిన సమయం లేనందు వల్లే బరువు తగ్గించలేకపోయానని.. మినహాయింపు ఇవ్వాలని కోరింది’ అని సీఏఎస్ సోమవారం వివరణ ఇచి్చంది. కాగా మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వరుస విజయాలతో ఫైనల్ చేరిన వినేశ్.. తుది పోరుకు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురై ఒలింపిక్ పతకానికి దూరమైంది. తొలి రోజు పోటీల్లో నిరీ్ణత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపెజ్‌తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసింది. పలు అంతర్జాతీయ టోర్నీల్లో రెండు కేజీల అధిక బరువు ఉన్నా యూడబ్ల్యూడబ్ల్యూ వారిని అనుమతిస్తోందని.. దీంతో వంద గ్రాములే కాబట్టి మినహాయించాలని సీఏఎస్‌లో అప్పీలు చేసింది. దీనికి భారత ఒలింపిక్ కమిటీ మద్దతిచ్చి నిష్ణాతులైన న్యాయ నిపుణులను నియమించింది. అయినా నిబంధనలు అందరికీ ఒక్కటే అని స్పష్టం చేసిన సీఏఎస్.. వినేశ్ అప్పీల్‌ను కొట్టేసింది. దీంతో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై విజయంతో సంచలనం సృష్టించడంతో పాటు.. ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డుల్లోకెక్కిన వినేశ్‌కు నిరాశే ఎదురైంది. -
ఇదీ ఫ్లాగ్ కోడ్.. అగౌరవపరిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు!!
సాక్షి, సిటీబ్యూరో: దేశ ప్రాథమిక, ప్రధాన చిహ్నం.. భారత గౌరవ ప్రతీక.. శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వాన్ని ప్రతిబింబించేది జాతీయ జెండా. ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు పలు ప్రత్యేక రోజుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తుంటాం. అంతేకాకుండా దేశభక్తిని, భారత ప్రతిష్టను ప్రదర్శించే వివిధ సందర్భాల్లోనూ జాతీయ పతాకాన్ని వినియోగిస్తాం. ఇటీవలి కాలంలో హర్ ఘర్ తిరంగా నినాదంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతోంది. అయితే జాతీయ జెండా ఎగరవేయడానికి, ప్రదర్శించడానికి ప్రత్యేక నిబంధనలున్నాయి. ఈ నియమావళికి ఏ మాత్రం అవాంతరం ఎదురైనా దేశ ప్రతిష్టకే అవమానం. ఈ నేపథ్యంలో రాజ్యాంగం సూచించిన ఫ్లాగ్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలు తెలుసుకుందాం..జాతీయ జెండా కేవలం ప్రభుత్వ భవంతుల మీద, ప్రభుత్వాధికారులకు మాత్రమే ఎగరవేసే ఆధికారముండేది. 2001లో నవీన్ జిందాల్ సుప్రీం కోర్టు కేసులో భాగంగా ప్రతి పౌరుడూ జెండాను ఎగరేయొచ్చని సవరించింది. జాతీయ జెండా పరిరక్షణకు సంబంధించి 1950, 1971 చట్టాలతో పాటు 2002, 2005లో సవరించిన అంశాలతో నూతన జాతీయపతాక నియమావళిని రూపొందించింది. ఈ నియమావళిలో భాగంగా పతాకం నేలనుగానీ, నీటినిగానీ తాకరాదు. టేబుల్ క్లాత్‌గా, వేదికకు ముందు భాగంలో వాడకూడదు.ఉద్దేశపూర్వకంగా జెండాను తలకిందులు చేయకూడదు, విగ్రహాలమీద, ఇతర వస్తువులకు కప్పకూడదు. నడుం కింది భాగంలో, లోదుస్తులమీద జెండాను వాడకూడదు. ఆవిష్కరణకు ముందు పువ్వులు తప్ప ఇతర వస్తువులను జెండాలో ఉంచడం, జెండా మీద ఏదైనా రాయడం నిషిద్ధం. సాధారణంగా సూర్యోదయంలో జెండాను ఎగరవేసి, సూర్యాస్తమయంలో దించివేయాలి. కాషాయరంగు పైన ఉండేటట్లు, నిలువుగా వేలాడదీసినట్లైతే కాషాయరంగు చూసేవారికి ఎడమచేతివైపున ఉండాలి. మురికిగా ఉన్న జెండాను ప్రదర్శించకూడదు. రెండు జాతీయపతాకాలను ఎక్స్ ఆకారంలో కర్రలకు తగిలించినట్లైతే రెండు జెండాలూ వ్యతిరేకదిశల్లో తగిలించాలి. పోడియంలు, బిల్డింగుల మీద కప్పడానికి గానీ, రెయిలింగుల మీద అలంకరణ కోసంగానీ వాడకూడదు.వీరి ఆదేశాల మేరకు..రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం మాత్రమే సంతాపసూచకంగా పతాకాన్ని అవనతం (జెండా కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం) చెయ్యాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల్లో ఎవరు మరణించినా దేశవ్యాప్తంగా అవనతం చేస్తారు. అధికార, సైనిక, పారామిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేటప్పుడు శవపేటిక మీద తలవైపు కాషాయరంగు వచ్చేటట్లు కప్పాలి. ఐతే దానిని ఖననం చేసే ముందు తీసేయాలి. శవంతో పాటు సమాధిలోకి దించడం, కాల్చడం చెయ్యరాదు.ఇవి తప్పనిసరి..ఇతర దేశాల జాతీయపతాకాలతో కలిపి ఎగరేసే సమయంలో వరుసలో మొదటి స్థానంలో కుడివైపు (చూసేవారి ఎడమచేతివైపు) ఉండాలి. మిగతా పతాకాలు ఇంగ్లి‹Ùలో ఆయాదేశాల పేర్లను బట్టి అక్షరక్రమంలో అమర్చాలి. అన్ని పతాకాలూ దాదాపు ఒకే పరిమాణంలో ఉండాలి. అన్ని పతాకాలూ విడివిడిగా వేర్వేరు జెండాకర్రలమీద ఎగరెయ్యాలి. వృత్తాకారంలో ఎగరేసినప్పుడు భారత పతాకం దగ్గరే వృత్తం మొదలై, సవ్యదిశలో తిరిగిరావాలి. మన పతాకాన్ని ముందు ఎగరేసి అన్నిటికంటే చివర అవనతం చెయ్యాలి. పతాకాన్ని సమావేశాల్లో వేదికల మీద ప్రదర్శించేటప్పుడు కుడివైపునే (చూసేవారికి ఎడమవైపున) ఉండాలి. వక్తలు ఉపన్యసించేచోట ఉన్నట్లైతే వారికి కుడిచేతి వైపునే ఉండాలి. ఇతర జెండాలతో కలిపి ఊరేగింపులో తీసుకెళ్ళే సమయంలో మొదట్లో ఉండాలి. జెండాలన్నిటినీ ఒకే వరసలో తీసుకెళ్లేటప్పుడు కుడివైపున మొదటిదిగా లేదా మధ్యలో అన్నిటికంటే ముందు ఉండాలి. దేనికీ/ఎవరికీ గౌరవసూచకంగా జాతీయ జెండాను కిందికి దించరాదు.వాహనాలపై..జాతీయపతాకాన్ని వాహనాల మీద ఎగరేసే అధికారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, పార్లమెంటు, శాసనసభల సభ్యులు, లోక్‌సభ, శాసనసభల స్పీకర్లు, రాజ్యసభ, రాష్ట్రాల శాసనమండళ్ల అధ్యక్షులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, సైనిక, నావికాదళ, వాయుసేనల్లోని ఉన్నతాధికారులకు మాత్రమే ఉంది. ఇతర దేశాల నాయకులు భారత ప్రభుత్వ వాహనంలో తిరుగుతున్నప్పుడు భారత జాతీయపతాకం కుడి వైపు చివరన, వారి జాతీయపతాకం ఎడమవైపు చివరన ఉండాలి. -
Election Commission: హోర్డింగులు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు ముద్రించాల్సిందే
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు నియమ నిబంధనలు కచి్చతంగా పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హోర్డింగులు సహా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే ఇతర సామగ్రిపై ప్రింటర్, పబ్లిషనర్ పేర్లు స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసమే ఈ నిబంధన విధించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన హోర్డింగులపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు లేవంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సహా పలువురు ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హోర్డింగుల సహా కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. -
ఏంటి? మీకిలా జరుగుతోందా..! బహుశా ఇందువల్లేనేమో..!!
కాలంతోపాటు సాగుతున్న మానవ జీవితంలో.. కొందరు వారు తీసుకునే నిర్ణయాలను బట్టే ఫలితాలు వస్తాయని మర్చిపోతుంటారు. చిన్న ఆపద రాగానే బెంబేలెత్తుతుంటారు. దీనికి కారణం నువ్వే అంటూ తాఫీగా ఇతరులపై తప్పును నెట్టేస్తుంటారు. అసలు కారణం ఏంటో తెలుసా..! ఆ సమయానికి, సాగుతున్న క్రమానికి, అనుసరిస్తున్న విధానాలకి సరైన పొంతన లేకపోవడమే. ప్రశాంతంగా ఆలోచించకపోవడమే. మరి వాటిని అధిగమించడానికి ఏం చేయాలో చూద్దాం. ప్రయాణ నియమాలు.. 1. ప్రయాణానికి ఇంటి దగ్గర బయల్దేరిన దగ్గర నుంచి తొమ్మిదవ రోజున తిరుగు ప్రయాణమవకూడదు. 2. ప్రయాణానికి బయలుదేరేటప్పుడు శుభశకునాలు చూసుకోవాలి. 3. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భోజనం చేసిన తర్వాత వారశూల దోషాలు తగ్గుతాయి. 4. రాత్రి సమయాలలో చేయు ప్రయాణ విషయాలలో వారశూల పట్టింపు ఉండదు. కాని ఆడపిల్లలను పంపే విషయంలో శుక్ర, మంగళవారాల పట్టింపు ఉన్నది. 5. నూతన వితంతువును మంగళ, శుక్ర వారాల్లో చూడరాదు. ఆ రోజులలో చూడటానికి బయల్దేరడం కూడా పనికిరాదు. 6. అశుభకార్య నిమిత్తంగా ప్రయాణం చేసినట్లయితే వెంటనే తిరుగు ప్రయాణం చేయాలి లేదా దేవాలయంలో నిద్రచేసి వేరొక నిమిత్తంగా వెళ్ళవచ్చు. సాధారణ నియమములు.. "స్వగృహే ప్రాక్ఛిరాః కుర్యా శ్యాశుర్యే దక్షిణౌశిరాః ప్రత్యక్షిరాః ప్రవాసేషు నకదాచిదుదక్ఛిరాః" స్వగహమునందు తూర్పువైపున శిరస్సు, అత్తవారింట దక్షిణ శిరస్సు, ఇతరుల ఇంట పడమర శిరస్సు ఉంచి నిదురించాలి. ఉత్తర దిశలో శిరస్సు ఉంచి ఎక్కడా నిదురించకూడదు. వాస్తుశాస్త్ర రీత్యా దక్షిణ శిరస్సు కూడా విశేషమే! దోషం – శాంతి మంత్రం.. ఆరోగ్య సమస్యలు ఉన్నా, పిల్లలకు దృష్టిదోషం ఉన్నా, గర్భిణీస్త్రీలకు గర్భరక్షణ కోసం, మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నా విభూది చేతపట్టుకొని ఈ కింది శ్లోకాన్ని 41 సార్లు పారాయణ చేసి విభూది ముఖమున ధరించిన శాంతి లభించును. "శ్రీమత్ నృసింహ విభవే గరుడ ధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చికజలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవేనమస్తే!" పిల్లలకు మాటలు రాగానే ఈ శ్లోకం నేర్పి వారిచేత నిత్యం పారాయణ చేయిస్తే, దృష్టిదోషం, నరఘోష, భూత, ప్రేత, పిశాచ బాధలు దగ్గరకు రావు. రజస్వలకు మంచి కాలము.. అశ్వని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి ప్రథమ రజస్వలకు మంచి నక్షత్రాలు. గ్రహణకాలం సంధ్యాకాలం, వర్జ్యకాలం మంగళవారం, అమావాస్య రోజులలో అయినట్లయితే శాంతి చేయించుకొనవలెను. జన్మ నక్షత్రానికి నైధనతార రోజున రజస్వల అయినచో శాంతి అవసరం. ఇవి చదవండి: అమ్మో.. కుజదోషం! పెళ్లే అవదా? అని భయపడుతున్నారా..! -
మనుషులకూ.. మూగ ప్రాణులకు ఒక ధర్మాచరణ ఉంది!
నరజన్మకూ, మిగిలిన ప్రాణులకూ ఒక ప్రత్యేకమైన భేదం ఉంది. ఇతరప్రాణులకు ఒకే ధర్మం–పశుధర్మం. ఆకలి, నిద్ర, ప్రత్యుత్పత్తి.. అంతకుమించి వాటికి ధర్మం అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కానీ ఒక్క మనిషికి మాత్రం అత్యంత ప్రధానమైనది – ధర్మాచరణ. అయితే దీనిలో ఒక సంక్లిష్టత ఉంది. ఇదే ధర్మము.. అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. ధర్మం నిరంతరం మారిపోతుంటుంది. భార్యముందు నిలబడితే–భర్త ధర్మం. తల్లి ముందు నిలబడితే–పుత్ర ధర్మం. సోదర ధర్మం... ఉద్యోగ ధర్మం.. అలా నిరంతరం మారిపోతుంటుంది. దేశాన్నిబట్టి, కాలాన్నిబట్టి మారిపోతుంది. ఉత్తర భారతదేశంలో చలి కారణం చేత వీలయినంతగా శరీరాన్ని కప్పుకుని పూజాదులు చేయడం అక్కడి ధర్మం. దక్షిణ భారతదేశంలో.. కేవలం ఉత్తరీయం పైన వేసుకుని అభిషేకాలు, పూజలు చేయడం ఇక్కడి ధర్మం. అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు, సన్యాసికి.. ఇలా ధర్మం మారుతుంటుంది. బ్రహ్మచారి ఏదీ కూడబెట్టకూడదు. విద్యార్థిగా గురువుగారు చెప్పింది శ్రద్ధగా విని మననం చేసుకోవడం ఒకటే ధర్మం. అదే గృహస్థాశ్రమంలో భోగం అనుభవించవచ్చు. భార్యాబిడ్దలతో సుఖసంతోషాలతో గడపవచ్చు. రేపటి అవసరాలకోసం సంపాదించి దాచుకోవచ్చు. వానప్రస్థు భార్యతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఆత్మవిచారం చేస్తూ గడపవచ్చు. చిట్టచివరన అన్నీ పరిత్యజించి ఏకాకిగా వైరాగ్యంలో ఉండడం ధర్మం. అలా ధర్మం మారిపోతున్నా ఎక్కడికక్కడ ధర్మం నియమాలకు కట్టుబడి ఉంటుంది. అసలు ధర్మం లేకుండా ఉండడం, దానిని పాటించకుండా జీవించడం సాధ్యం కాదు. ధర్మాచరణతోనే మనుష్యప్రాణి ఉత్తమగతులు పొందగలడు. శాస్త్రం చెప్పినట్టుగా ధర్మాచరణ చేస్తూ శరీరం పతనమయిన తరువాత స్వర్గలోకం వెళ్ళవచ్చు. పుణ్యఫలితం అయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి చేరుకోవచ్చు.‘నాకు శాస్త్రం మీద నమ్మకం లేదు. ఈ పుణ్యకర్మలు నేను చేయను. నాకు ఏది సంతోషం అనిపిస్తే, నా ఇంద్రియాలకు ఏది సుఖం అనిపిస్తే, నా మనసుకు ఏ భోగం అనుభవించాలనుకుంటే దానిని అనుభవిస్తూ శాస్త్రాన్ని పక్కనబెట్టి ప్రవర్తిస్తే.. ఆ పాటిదానికి నరజన్మ అవసరం లేదని తిర్యక్కుగా (వెన్నుపూసలేని జీవిగా) జన్మ లభిస్తుంది. అలా కాదు, నాకు పాపమూ వద్దు, పుణ్యమూ వద్దు. నేను ఈ మంచిపని చేసి పుణ్యం కావాలనుకోవడం లేదు, నేను కేవలం భగవంతుడు చెప్పినట్లు బతకడం నాకు సంతోషం. నేను చేయవలసినివి కాబట్టి చేస్తున్నా.. దానినుంచి నేను ఏ ప్రయోజనమూ ఆశించడం లేదనుకున్నప్పుడు అది చిత్తశుద్ధిని సూచిస్తుంది. ఇది ఏదో ఒకనాడు భగవంతుని అనుగ్రహానికి కారణమయి, జ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని ఇస్తుంది. అంటే ధర్మాన్ని అనుష్ఠానం చేసి దేవతాపదవిని అధిష్టించగలడు. ధర్మాచరణను పక్కనబెట్టి పతనమమై తిర్కక్కు అయిపోగలడు. ఏ ఫలితాన్ని ఆశించకుండా ధర్మాచరణచేసి మోక్షాన్ని పొందగలడు. కాబట్టి ధర్మం కన్నా గొప్పది మరొకటి లేదు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇవి చదవండి: మీరెంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట! -
‘దత్తత’కు మార్గం సులువు..
నేరడిగొండ: శిశువు ‘దత్తత’కు ప్రభుత్వం సులువైన మార్గం తీసుకొచి్చంది. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధత ప్రకారం పిల్లలను దత్తత తీసుకునే అవకాశం కల్పించింది. గతంలో చాలామంది అడ్డదారులు తొక్కి శిశువులను దత్తత తీసుకున్న ఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఇకపై అలాంటి చర్యలకు దిగితే న్యాయపరంగా పోలీసు కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. దత్తత కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రక్రియను పూర్తిచేసి శిశువును దత్తత తీసుకునే వెసులుబాటు కల్పించింది. శిశువుల విక్రయాలు దత్తత పేరుతో గతంలో ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో శిశువులను విక్రయించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతోపాటు ఆడపిల్లలపై వివక్షతో భ్రూణహత్యలు జరగడంతో పాటు చెత్తకుప్పల్లో పడేస్తున్న విషయం విధితమే. దీన్ని నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా పూర్తిస్థాయిలో ఫలితం లేకుండా పోయింది. చిన్నారులను దత్తత తీసుకునే ప్రక్రియ గతంలో చాలా సంక్లిష్టంగా ఉండేది. అనేక రకాల పత్రాలు పొందుపర్చాల్సి వచ్చేది. దీంతో చాలా మంది దంపతులు అడ్డదారుల్లో శిశువులను దత్తత తీసునేవారు. అలా కొనుగోలు చేసిన వారిలో చాలా మంది న్యాయ సమస్యలు, కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేది. దత్తత విధానం.. శిశువు దత్తత తీసుకునే దంపతులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే శిశువును దత్తత తీసుకునే చట్టపరమైన అవకాశం ఉంటుంది. దంపతులు, శిశువు వివరాలని్నంటిని గోప్యంగా ఉంచుతారు. దంపతుల ఫొటో, పాన్‌కార్డు, జనన ధ్రువపత్రాలు, నివాస, ఆదాయ, దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులు లేవంటూ వైద్యాధికారి జారీ చేసిన పత్రం, వివాహ రిజిస్ట్రేషన్ తదితర ఆరు రకాల పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దంపతులకు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. వారి సీనియారిటీ ప్రకారం దరఖాస్తులు ప్రస్తుత దశ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటే దత్తత ఇస్తారు. శిశువు, లింగం వివరాలు, వయస్సు, ఏ ప్రాంతానికి చెందిన శిశువు అవసరం తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు దత్తత ఇచ్చే అధికారాన్ని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు దాఖలు పర్చారు. నూతన విధానం అమలు చేసిన తర్వాత శిశువుల దత్తత కోసం దంపతులు ముందుకొస్తునట్లు అధికారులు పేర్కొంటున్నారు. కావల్సిన ధ్రువపత్రాలు శిశువును దత్తత తీసుకునే దంపతులు ఇద్దరు కూడా పలు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఆదాయ ధ్రువపత్రం, పెళ్లి రిజిస్ట్రేషన్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్, జనన ధ్రువపత్రాలు, జంట ఫొటోలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పత్రాలను ఐసీపీఎస్ కార్యాలయంలో సమర్పించాలి. వీటితో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్, డీడబ్ల్యూఅండ్ సీడీఏ ఆదిలాబాద్ పేరిట రూ.6 వేల డీడీ తీయాల్సి ఉంటుంది. Cara.nic.in వెబ్సైట్ పారెంట్ లాగిన్‌లో రెసిడెంట్ ఇండియన్ పారెన్్టలో దత్తత కోరే తల్లిదండ్రుల వివరాలన్నీ పొందుపర్చాలి. అనంతరం అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. Praspective Adoptive Pareents(PAPs) పొందిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను భద్రపర్చుకొని సీనియారిటీని ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.6 వేలు, దత్తత తీసుకునే సమయంలో రూ.40 వేలు, దత్తత పొందిన ఆరు నెలలకు రూ.8 వేలు ప్రభుత్వానికి డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దత్తత కోసం ఇప్పటివరకు 269 దరఖాస్తులు జిల్లా కేంద్రంలో 2005లో శిశుగృహను ఏర్పాటు చేశారు. శిశువుల దత్తత కోసం ఇప్పటివరకు 269 మంది దంపతులు దరఖాస్తులు చేసుకున్నారు. 108 మంది శిశువులను దత్తత ఇచ్చారు. 73 మంది బాలికలు, 36 బాలుర శిశువులను అందజేశారు. మరో 183 మంది వెయిటింగ్లో ఉన్నారు. ఇందులో 96 మంది శిశువులను భారతదేశానికి, 12 మందిని ఇతర దేశాలకు దత్తత ఇచ్చారు. పారదర్శకంగా ప్రక్రియ దత్తత ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. శిశువును దత్తత తీసుకునే వారు మొదట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పైరవీలకు ఆస్కారం లేకుండా చూస్తున్నాం. సీరియల్ ప్రకారం పక్షపాతం లేకుండా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తాం. దరఖాస్తు పరిశీలన అనంతరం చిన్నారులను దత్తత తీసుకునే అవకాశం ఉంటుంది. – రాజేంద్రప్రసాద్, డీసీపీఓ, ఆదిలాబాద్ -
ఊహించని షాక్.. భారత్‌లో 17 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్!
కంపెనీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వీడియోలపై కొరడా ఘుళిపించింది ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్. భారతలో ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య దాదాపు 17 లక్షలకు పైగా రూల్స్ పాటించిన వీడియోలను తొలగించినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య 56 లక్షలకు వరకు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు 73.7 కోట్ల కామెంట్లను కూడా యూట్యూబ్ నుంచి తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో రోజు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అయితే అందులో తప్పుదారి పట్టించే మెటాడేటా, థంబ్‌నెయిల్స్, నిబంధన పాటించని వీడియోలు స్పామ్ కామెంట్లు వంటివి కలిగి ఉన్న వీడియోలను 50 లక్షలకు పైగా తొలగించింది. డేటా ప్రకారం, ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా పరీక్షించిన తర్వాత 99 శాతం కామెంట్లు తొలగించింది. మెషీన్ల ద్వారా గుర్తించి వీడియోలలో 36 శాతం వీడియోలు ఒక వ్యూస్ కూడా పొందకముందే తీసేవేసింది. కంపెనీ అనుసరిస్తున్న నియమాల ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేసింది. యూట్యూబ్ దీనిపై స్పందిస్తూ.. “మేము ఇందులో మెషీన్ లెర్నింగ్‌తో హ్యూమన్ రివ్యూయర్ల కలయిక ఉన్న టెక్నాలజీని ఉపయోగించి మా విధానాలను అమలు చేస్తున్నాము. మా ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్‌ల కంపెనీ మార్గదర్శకాలకు లోబడి పని చేస్తుంటాయి. ఇవి ఉల్లంఘనలకు పాల్పడిన వీడియోలను గుర్తించడంతో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. చదవండి: బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..! -
ఆ బ్యాంకులపై కొరడా ఝులిపించిన ఆర్బీఐ!
వివిధ బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పలు బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) దాదాపు ₹12 లక్షల జరిమానా విధించింది. అందులో ఆరు సహకార బ్యాంకులు, మూడు సహకారి బ్యాంకులతో కలిపి తొమ్మిది సంస్థలపై విధించినట్లు ఆర్బిఐ ప్రకటించింది. ఆ బ్యాంకులపై కొరడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎల్లప్పుడూ వాటి పనితీరు, కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝులిపిస్తోంది. తాజాగా తొమ్మిది బ్యాంకులపై ఫైన్ విధించినట్లు ప్రకటనలో తెలిపింది. వివరాల ప్రకారం.. బెర్హంపూర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (ఒడిశా) ₹3.10 లక్షలు, ఉస్మానాబాద్ జనతా సహకరి బ్యాంక్, ఉస్మానాబాద్ (మహారాష్ట్ర) ₹2.5 లక్షలు, మహిసాగర్ జిల్లాలోని సంత్రంపూర్ (గుజరాత్)లోని శాంత్రంపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ₹2 లక్షల జరిమానా విధించింది. జిల్లా సహకరి కేంద్రీయ బ్యాంక్ మర్యాదిట్, బాలాఘాట్ (మధ్యప్రదేశ్); జంషెడ్పూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జంషెడ్పూర్, జార్ఖండ్; రేణుకా నాగరిక్ సహకారి బ్యాంక్ మర్యాదిట్, అంబికాపూర్ (ఛత్తీస్‌గఢ్) ఒక్కొక్కరికి ₹1 లక్ష జరిమానా విధించగా, కృష్ణ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, భోపాల్ (మధ్యప్రదేశ్), కేంద్రపారా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కేంద్రపారా, ఒడిశాకు ఒక్కొక్కరికి ₹50,000 జరిమానా, నవానగర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జామ్‌నగర్ (గుజరాత్) ₹25,000 జరిమానా విధించినట్లు పేర్కొంది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
ఆపరేటర్లే స్వీయ నియంత్రణ పాటించాలి
ముంబై: ఫిన్‌టెక్ సంస్థలను నియంత్రించేందుకు ‘కచ్చితమైన విధానం‘ అంటూ లేదని రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ చౌదరి చెప్పారు. సమతూకం, స్వీయ నియంత్రణ పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించుకోవాల్సిన బాధ్యత ఆపరేటర్లపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌదరి ఈ విషయాలు చెప్పారు. ‘ఓవైపు ఆర్థిక వ్యవస్థ, కస్టమర్లను రిస్కుల నుంచి కాపాడుతూ మరోవైపు ఫిన్‌టెక్‌ల సానుకూల ప్రభావాలను గరిష్ట స్థాయిలో పెంచే విధంగా వాటిని కచ్చితంగా ఇలాగే నియంత్రించాలన్న విధానమంటూ ఏమీ లేదు. కస్టమర్ల ప్రయోజనాలను కాపాడటం, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యాలైతే.. ఫిన్‌టెక్ పరిశ్రమ తనకు తానే సమతూకం పాటించాల్సి ఉంటుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ‘జీవితంలోనైనా, వ్యాపారంలోనైనా సరైన అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా సమతూకం వస్తుందని నేను విశ్వసిస్తాను. కేవలం నియంత్రణ ద్వారా మాత్రమే ఇది సాధ్యం కాదని నా అభిప్రాయం. నియంత్రణ అనేది సహాయక పాత్ర పోషిస్తుంది. అత్యుత్తమంగా సమతూకం పాటించే బాధ్యత ఫిన్‌టెక్ సంస్థలపైనే ఉంటుంది‘ అని చౌదరి చెప్పారు. ఫిన్‌టెక్ రంగంపై ఆర్బీఐ మరింతగా దృష్టి పెడుతుండటం, డిజిటల్ రుణాల యాప్‌లపై ఇటీవల మార్గదర్శకాలు ప్రకటించడం తదితర అంశాలతో పరిశ్రమలో కొంత ఆందోళన నెలకొన్న నేపథ్యంలో చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు! -
Azadi Ka Amrit Mahotsav: జెండా ఎగరేస్తున్నారా.. ఇవీ గుర్తుంచుకోండి
మన జాతీయ జెండా.. కోట్లాది మంది భారతీయులు మది మదిలో నింపుకున్న సగర్వ పతాక. ఈ జాతీయ జెండా ఎగురవేయడానికి కొన్ని నిబంధనలున్నాయి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002లో నిబంధనలు రూపొందించింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971 కూడా ఏమేం చేయకూడదో చెబుతోంది. ► 2002, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని పారాగ్రాఫ్ 2.2 ప్రకారం ఎవరైనా వ్యక్తి, ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు అన్ని రోజుల్లో జాతీయ జెండా ఎగురవేయొచ్చు. ఇటీవల పగలు, రాత్రి కూడా జెండా ఎగరవేయొచ్చంటూ నిబంధనలు సవరించారు. ► జాతీయ జెండా చిన్నదైనా, పెద్దదైనప్పటికీ పొడవు, ఎత్తు (వెడల్పు) నిష్పత్తి 3:2 ఉండాలి. జెండా దీర్ఘ చతురస్రంలోనే ఉండాలి. ► జెండాలో కాషాయం రంగు పైకి ఉండేలా ఎగురవేయాలి. ► చేతితో లేదా మిషన్‌పై చేసిన కాటన్, పాలిస్టర్, ఉన్ని, పట్టు, ఖాదీ.. ఇలా వేటితోనైనా జెండాను రూపొందించవచ్చు. ► చిరిగిపోయిన, నలిగిపోయిన లేదంటే చిందరవందరగా ఉన్న జాతీయ జెండాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగురవేయకూడదు. ► జాతీయ జెండాయే ఎప్పుడూ ఎత్తులో ఉండాలి. మరే ఇతర దేశాల జెండాలు కానీ, ఇతర వస్తువులు కానీ జాతీయ జెండా కంటే ఎత్తులో ఉండకూడదు. ► జాతీయ జెండా ఎగురవేసిన స్తంభాలపై ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ఉండకూడదు. ► జాతీయ జెండాని ఒక డెకరేటివ్ పీస్‌గా వాడకూడదు. యూనిఫామ్ దుస్తుల్లా వేసుకోకూడదు. ఏ డ్రెస్ మెటీరియల్ మీద కూడా ప్రింట్ చేయకూడదు. నడుముకి కింద భాగంలో ధరించకూడదు. ► జాతీయ జెండా నేలపైన కానీ, నీళ్లల్లో కానీ పడేయకూడదు ► రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి వాహనాలపైన మాత్రమే జాతీయ జెండా ఉంటుంది. సొంత వాహనాలపై దానిని వాడకూడదు ► జాతీయ జెండాని మాటల ద్వారా లేదంటే చేతల ద్వారా ఎవరైనా అగౌరవపరిస్తే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971లోని సెక్షన్ 2 కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హెల్మెట్ రూల్స్ కఠినతరం: ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు..
న్యూఢిల్లీ: బండి నడిపే వాళ్లకు హెల్మెట్ తప్పనిసరితో పాటు వెనకాల కూర్చునే వాళ్లకు సైతం హెల్మెట్ తప్పనిసరి నిబంధనలు చాలా చోట్ల అమలు అవుతున్నాయి. అయితే హెల్మెట్ విషయంలో మోటార్ వెహికిల్స్ యాక్ట్ కొత్త సవరణను కఠినంగా అమలు చేయబోతోంది. తేడాలొస్తే.. జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మీద వేటు తప్పదని స్పష్టం చేసింది. నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్లు ధరించినా ఫైన్ మోత తప్పదు ఇక నుంచి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్, ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లపై తప్పక ఉండాల్సిందే. పూర్తిస్థాయిలో రక్షణ కలిగించే హెల్మెట్లు మాత్రమే.. అదీ సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. అలా లేకుంటే.. మోటర్ వెహికిల్స్ యాక్ట్ 1988 లోని సెక్షన్ 129 ఉల్లంఘనల కింద సెక్షన్-194డీ ప్రకారం.. వెయ్యి రూపాయల ఫైన్‌తో పాటు మూడు నెలలపాటు లైసెన్స్‌పై వేటు వేస్తారు. ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను మాత్రమే టూవీలర్స్‌పై ఉపయోగించడం తప్పనిసరి చేస్తూ జూన్ 1, 2021లో ఆదేశాలు జారీ అయ్యాయి. నాన్-ఐఎస్ఐ హెల్మెట్లను బ్యాన్ చేసినా.. ఇప్పటికీ చాలామంది వాటినే ఉపయోగిస్తుండడం గమనార్హం. బైక్ రైడింగ్‌లో ఉన్నప్పుడు హెల్మెట్ బకెల్, బ్యాండ్ గనుక పెట్టుకోకున్నా.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. ఐఎస్ఐ మార్క్, బీఎస్ఐ సర్టిఫికేషన్ లేని హెల్మెట్ గనుక ఉపయోగిస్తే.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. హెల్మెట్ సక్రమంగా ధరించినా.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, రెడ్ లైట్ జంపింగ్ చేయడం లాంటివాటికి కూడా 2 వేల రూపాయల జరిమానా తప్పదు. చదవండి: జీఎస్టీ సిఫార్సులపై కేంద్ర, రాష్ట్రాలకు హక్కులు -
VPN: వీపీఎన్ సేవలపై కేంద్రం సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: వీపీఎన్.. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇంటర్నెట్ను విపరీతంగా వాడే వాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇంటర్నెట్ సురక్షిత వాడకంగానే కాదు.. నిషేధించిన, మన దేశంలో అందుబాటులో లేని కంటెంట్ కోసం ఉపయోగించే ప్రత్యామ్నాయ మార్గంగా వీపీఎన్ సేవలపై ఓ విమర్శ ఉంది. అయితే ఈ సేవలపై కేంద్రం ఇప్పుడు సంచలన ప్రకటన చేసింది. భారత్‌లో నిబంధనలకు, మార్గదర్శకాలకు లోబడి నడుచుకోవాలని.. కుదరదనుకుంటే భారత్ నుంచి శాశ్వతంగా నిష్క్రమించొచ్చని వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటన చేశారు. కేంద్రం ఇదే మొండి నిర్ణయంతో ముందుకు వెళ్తే.. వీపీఎన్ సేవలను ఉపయోగిస్తున్న 27 కోట్ల మంది యూజర్లపై ప్రభావం పడడం ఖాయం. భారత్ చట్టాలకు, నిబంధనలకు అనుగుణంగా ఉండనివాళ్లకు అవకాశం ఇచ్చేదే లేదు. కుదరదని అనుకుంటే.. నిర్మొహమాటంగా సర్వీసులను దేశంలో నిలిపివేసుకోవచ్చు అని స్పష్టం చేశారాయన. అంతేకాదు వీపీఎన్ కంపెనీలు, డేటా సెంటర్ కంపెనీలు, వర్చువల్ ప్రైవేట్ సర్వర్ ప్రొవైడర్లు.. యూజర్ల డాటాను కనీసం ఐదేళ్లపాటు భద్రపరచ్చాల్సిందేనని స్పష్టం చేశారాయన. కొత్త రూల్ సైబర్ సెక్యూరిటీ లొసుగులకు దారితీయవచ్చని, సైబర్ దాడులు జరగవచ్చని కొన్ని VPN కంపెనీలు పేర్కొన్నాయి. కానీ, ఈ వాదనను కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మాత్రం తిరస్కరిస్తున్నారు. మరోవైపు అమెరికాకు చెందిన టెక్ ఇండస్ట్రీ బాడీ ఐటీఐ (ఇందులో గూగుల్, ఫేస్బుక్, ఐబీఎం, సిస్కో లాంటి ప్రముఖ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి) నిబంధనలపై సమీక్షించుకోవాలని భారత ప్రభుత్వ ఆదేశాన్ని సవరించాలని కోరింది. కానీ, భారత్ మాత్రం అందుకు ససేమీరా చెబుతోంది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగానే నడచుకోవాలని స్పష్టం చేస్తోంది. దేశంలోని సైబర్ వాచ్‌డాగ్‌గా పేరున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ద్వారా ఈ ఆదేశాన్ని జారీ చేసింది కేంద్రం. కొత్త మార్గదర్శకాలు 60 రోజుల జారీ తర్వాత అమలులోకి వస్తాయి. ఇప్పటికే జారీ కాగా.. జూన్ చివరి నాటికి అమలులోకి రానున్నాయి. వీపీఎన్ సర్వీసుల విషయంలో నిబంధనలు ► సబ్స్క్రయిబర్, కస్టమర్‌కు సంబంధించి సరైన పేరును ఇవ్వాలి ► సేవలను ఎంత కాలం వినియోగించుకుంటారో స్పష్ట ఇవ్వాలి ► యూజర్లకు ఐపీలను కేటాయించాలి ► రిజిస్ట్రేషన్ టైంలో.. ఈ-మెయిల్, ఐపీ అడ్రస్, టైమ్ స్టాంప్ వివరాలను పొందుపర్చాలి ► అయితే వీపీఎన్‌ను ఎందుకు తీసుకుంటున్నారో.. కస్టమర్ తెలియజేయాలి. ► సరైన చిరునామా, కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వాలి. ► సబ్స్క్రయిబర్ల ఒనర్షిప్ ప్యాటర్న్‌ను సమర్పించాలి మెజార్టీ యూజర్లు వీటిని ఇవ్వడానికి ఇష్టపడరు. ఇవేవీ చేయలేవు గనుకే వీపీఎన్ ప్రొవైడర్లు వెనకాడుతున్నాయి. -
నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..!
Major Changes That Will Set In From November 1: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే మనం వెంటనే అప్రమత్తమైపోతాం. ఇంటి అద్దె బిల్లులు , చిన్న చితకా బిల్లులను ఇతర లావాదేవీలను ఒకటో తారీఖున పూర్తి చేస్తాం. అంతేందుకు ప్రభుత్వాలు కూడా ఒకటో తేదీనే పలు ముఖ్యమైన కార్యక్రమాలను చేపడుతాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు కొత్త నిబంధనలను కూడా అమలులోకి తెస్తాయి. దేశవ్యాప్తంగా వచ్చే నెల నవంబర్ 1 నుంచి పలు కీలక నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.ఇక నవంబర్ 1 నుంచి సామాన్యులపై గ్యాస్ బండ మోత కూడా మోగనుంది. చదవండి: దివాళీ ఎఫెక్ట్ : తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే నవంబర్ 1 నుంచి మారనున్న రూల్స్..! ఎల్పీజీ డెలివరీ సిస్టమ్ వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే నెల నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ కోసం వినియోగదారులు కచ్చితంగా వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని అందించాల్సి ఉంటుంది.డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC)లో భాగంగా ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్‌లో ఈ మార్పు రానుంది. డిపాజిట్లు, ఉపసంహరణలపై ఛార్జీలను సవరించనున్న పలు బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నిర్దేశిత పరిమితిని మించి డిపాజిట్, డబ్బును విత్‌డ్రా చేయడం కోసం నవంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఛార్జీలు సేవింగ్స్ ఖాతాదారులతో పాటు వేతన ఖాతాదారులకు వర్తిస్తాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, యాక్సిస్ , సెంట్రల్ బ్యాంకులు డిపాజిట్లు, విత్‌డ్రా విషయంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే టైమ్ టేబుల్ దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వే పలు రైళ్ల టైమ్ టేబుల్లో మార్పులు చేయబోతోంది. నవంబరు 1 నుంచి పలు రైళ్లకు కొత్త టైమ్‌టేబుల్ ప్రకటించనుంది. భారతీయ రైల్వేస్ ప్రకారం... 13 వేల ప్యాసింజర్ రైళ్లు , 7 వేల గూడ్స్ రైళ్లు టైమింగ్స్‌లో మార్పు రానున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ ధరలు గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరల పెంపు కారణంగా..చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ధరలు పెరిగితే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో కూడా మార్పులు రానున్నాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోంపై కీలక వ్యాఖ్యలు చేసిన పేటీఎమ్..! -
క్రికెట్లో సరికొత్త ఫార్మాట్ 'ద హండ్రెడ్'.. రూల్స్ ఇలా ఉండబోతున్నాయి
The Hundred Rules: వందేళ్లకుపైగా ఘన చరిత్ర కలిగిన క్రికెట్ క్రీడ ఎప్పటికప్పుడు కొత్తగా అభిమానుల ముందుకు వస్తూనే ఉంది. ఈ ఆటలో తొలుత సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ మాత్రమే భాగంగా కాగా, ఆతర్వాతి కాలంలో వన్డేలు, టీ20లు, టీ10 లీగ్‌లు వచ్చి చేరాయి. ఇప్పుడు తాజాగా హండ్రెడ్ పేరుతో మరో కొత్త ఫార్మాట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇన్నింగ్స్‌కు 100 బంతుల చొప్పున ఉండే ఈ ఫార్మాట్లో ఎనిమిది పురుషుల జట్లు, ఎనిమిది మహిళా జట్లు ఉంటాయి. తాజాగా దీనికి సంబంధించిన నియమ నిబంధనలను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విడుదల చేసింది. దీంతో ఈ సరికొత్త ఫార్మాట్ ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన రూల్స్ ఎలా ఉండబోతున్నాయో ఓసారి చూద్దాం. * ఈ కొత్త ఫార్మాట్లో టాస్ గ్రౌండ్‌లోనే వేయాలన్న రూలేమీ లేదు. * ఈ ఫార్మాట్లో ఓవర్లు ఉండవు. బాల్స్ ఆధారంగానే ఇన్నింగ్స్ మారుతుంది. ఒక బౌలర్ ఒకే ఎండ్ నుంచి రెండుసార్లు ఐదేసి బంతులు వేయాల్సి ఉంటుంది. తొలి ఐదు బంతులు ముగిసిన తర్వాత అంపైర్ ఓ వైట్ కార్డు చూపిస్తాడు. ఓ సెట్ పూర్తయినట్లుగా ప్రేక్షకులు, స్కోరర్లు, కామెంటేటర్లు, బ్రాడ్కాస్టర్లకు తెలియడానికి ఇలా చేస్తారు. * ఇందులో తొలి 25 బంతులు పవర్ ప్లేగా పరిగణించబడతాయి. ఈ సమయంలో 30 గజాల సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. * పవర్ ప్లే ముగిసాక ఫీల్డింగ్ టీమ్ ఎప్పుడైనా రెండు నిమిషాల స్ట్రేటజిక్ టైమౌట్(బ్రేక్) తీసుకోవచ్చు. * అలాగే, బ్యాట్స్‌మెన్ క్యాచ్ అవుటైన తర్వాత అవతలి బ్యాట్స్‌మన్ క్రాస్ అయ్యాడా లేదా అన్నదానితో సంబంధం లేకుండా కొత్త బ్యాట్స్‌మన్ స్ట్రైక్ తీసుకోవాలి. * గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్ టై అయితే రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభిస్తుంది. అదే ఎలిమినేటర్, ఫైనల్లో టై అయితే.. సూపర్ ఫైవ్ ఆడాల్సి ఉంటుంది. అంటే ఒక్కో టీమ్ ఐదు బాల్స్ ఆడాల్సి ఉంటుంది. * ఒకవేళ సూపర్ ఫైవ్ కూడా టై అయితే.. మరో సూపర్ ఫైవ్ ఆడిస్తారు. అది కూడా టై అయితే.. గ్రూప్ స్టేజ్‌లో టాప్‌లో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. * వర్షం వల్ల ప్రభావితమైన మ్యాచ్‌లలో కొత్త డీఎల్ఎస్ పద్ధతిని అమలు చేస్తారు. * ఒకవేళ జట్టు నెమ్మదిగా బౌలింగ్ చేస్తుందనుకుంటే అంపైర్‌కే పెనాల్టీ విధించే హక్కు ఉంటుంది. ఇలా జరిగితే ఫీల్డింగ్ టీమ్‌కు సర్కిల్ బయట ఒక ఫీల్డర్‌ను తగ్గించాల్సి ఉంటుంది -
కట్టుదిట్టంగా దిశ చట్టం
బాలలపై అత్యాచారాలకు లేదా లైంగిక వేధింపులకు పాల్పడినా, వారిని పోర్నోగ్రఫీ కోసం వినియోగించుకున్నా ఐపీసీ సెక్షన్లతో పాటు ‘పోక్సో’ చట్టంలోని సంబంధిత సెక్షన్లను చేర్చి కేసులు దాఖలు చేస్తారు. ‘పోక్సో’ చట్టం కింద నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష మొదలుకొని మరణశిక్ష వరకు విధించే అవకాశాలు ఉంటాయి. తెలంగాణరాష్ట్రంలోని శంషాబాద్ శివార్లలో 2019, నవంబరు 27న జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ గ్యాంగ్ రేప్, హత్య ఘటనతో దేశం షాక్‌కి గురైంది. మహిళల భద్రత మీద మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఆందోళన దేశమంతా మొదలైంది. దేశంలో మిగతా రాష్ట్రాలు స్పందించకపోయినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ‘దిశ’ పేరుతో ఓ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదమూ లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా దేశమంతా ప్రశసంలు పొందిందీ చట్టం. ఏపీ దిశ చట్టంలోని ముఖ్యాంశాలు : ►కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిర్భయ చట్టం ప్రకారం నిర్భయ కేసులో దోషికి జైలు, మరణదండన శిక్షగా విధిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ‘దిశ’ చట్టం.. దోషికి కచ్చితంగా మరణదండన విధిస్తోంది. ►నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండు నెలల్లో శిక్ష పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తికావాలి. కాని ఏపీ దిశ చట్టంలో దానిని 4 నెలల నుంచి 21 రోజులకు కుదించారు. లైంగికదాడి నేరాల్లో స్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినట్టయితే.. వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తయి 21 రోజుల్లోపే దోషికి శిక్ష పడాలి. ►లైంగిక దాడి సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై జరిగే లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు. కేంద్రం చేసిన ‘పోక్సో’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులకు కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఏపీలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. ►లైంగికదాడి నేరాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలోనూ కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు... దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తి చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవరణ చేశారు. ►మెయిల్స్, సోషల్ మీడియా వంటి డిజిటల్ మాధ్యమాల్లో ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మొదటి తప్పుకు రెండేళ్లు, ఆ తర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను చేర్చారు. ►లైంగిక దాడులకు సంబంధించి 376 సెక్షన్లో సవరణ తెచ్చి, కచ్చితమైన సాక్ష్యాధారాలతో నిందితులు దోషులుగా తేలితే వారికి మరణశిక్ష విధించే వెసులుబాటు కల్పించింది. ►‘నిర్భయ’ చట్టం ప్రకారం లైంగిక నేరాలపై తీర్పు వెలువడటానికి నాలుగు నెలలుగా ఉన్న వ్యవధిని 21 పని దినాలకు కుదించింది. ►ఐపీసీ 354 సెక్షన్లో కొత్తగా 354–ఎఫ్, 354–జీ సబ్సెక్షన్లను చేర్చి, పిల్లలపై అత్యాచారం కాని ఇతర లైంగిక నేరాలకు యావజ్జీవ శిక్ష విధించేందుకు వెసులుబాటు కల్పించింది. ►మహిళలు, పిల్లలపై జరిగిన నేరాల సత్వర విచారణకు దేశంలో కొన్ని చోట్ల తప్ప ఇంకెక్కడా ప్రత్యేక కోర్టులు లేవు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, పిల్లలపై జరిగిన నేర విచారణలో జాప్యం లేకుండా.. రాకుండా వేగంగా విచారణ జరిగి దోషికి శిక్షపడేలా చేస్తాయి ఈ ప్రత్యేక కోర్టులు. రేప్, గ్యాంగ్‌రేప్, యాసిడ్ దాడులు, సోషల్ మీడియా ద్వారా వేధించడం, అసభ్యంగా చూపించడం వంటి నేరాలతోపాటు , పోక్సో పరిధిలోని అన్ని నేరాలనూ ఈ ప్రత్యేక కోర్టుల్లో విచారణ జరిగేలా చేశారు. ►ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న ఆరు నెలల కాలాన్ని, ఏపీ పరిధిలో 45 రోజులకు తగ్గించారు. ►మహిళలు, పిల్లలపై జరిగే నేరాల సత్వర విచారణ, శిక్షల విధింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లని, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర చట్టాల్లో ఇప్పటి వరకూ ఎటువంటి ఏర్పాట్లు లేవు. అయితే జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్పెషల్ పోలీస్ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు ఏపీ దిశ చట్టం ద్వారా వీలు కల్పించారు. అలాగే ప్రతి ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేకంగా పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు. ►మహిళలు, పిల్లలపై జరిగే నేరాల నమోదుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ రిజిస్ట్రీని పెట్టింది. అయితే, ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్ పద్ధతిలో డేటా బేస్ ఉన్నప్పటికీ జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే, ఏ నేరస్తుడు ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. అటువంటి డిజిటిల్ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడంతోపాటు ఈ నేరాలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులో ఉంచడంద్వారా నేరస్తుల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు. తక్షణ చర్యలు ఇవి... ►ప్రభుత్వం తక్షణ చర్యల్లో భాగంగా... రాష్ట్రంలో 18 మహిళా పోలీస్ స్టేషన్లను సమన్వయం చేసేందుకు, దిశ చట్టం అమలును పర్యవేక్షించేలా ఒక ఐపీఎస్ అధికారిని నియమించారు. ►మరిన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ►మహిళలు, బాలలపై లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగా నిధులు మంజూరు చేశారు. ►విశాఖపట్నం, తిరుపతి ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో డీఎన్ఏ, సైబర్ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ►గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాలలోని డీఎన్ఏ, సైబర్ విభాగాల్ని మరింత పటిష్ఠం చేయనున్నారు ►డయల్ 100, 112లకు సంబంధించి ఒకే కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి దాన్ని ‘దిశ కంట్రోల్’ రూంగా పిలవనున్నారు. అంతేకాదు డయల్ 100, 112లను కలిపి ఒకే టోల్ ఫ్రీ నెంబర్‌గా తెచ్చేందుకు కసరత్తూ జరుగుతోంది. ►దిశ యాప్ కోసం కోటి 26 లక్షల రూపాయలను వినియోగించనున్నారు. ►ప్రతి వన్ స్టాప్ సెంటర్‌కు ఒక మహిళా ఎస్సై పోస్టు మంజూరు చేశారు. ►ప్రత్యేక కేసుల విచారణ సందర్భంగా అదనపు విధులు నిర్వర్తించే మహిళా పోలీసుస్టేషన్ సిబ్బందికి 30 శాతం ప్రత్యేక భత్యం చెల్లించనున్నారు. ►ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు. ►2020 జనవరి నెలాఖరు నాటికి అన్ని జిల్లాల్లోని బోధనాసుపత్రిల్లో దిశా ప్రత్యేక కేంద్రాలు, దిశా మహిళా పోలీస్ స్టేషన్లు, దిశా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దిశకు యంత్రాంగం ఏపీ దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది. స్త్రీ. శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, కర్నూల్ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి దీపికాలను స్పెషల్ ఆఫీసర్లుగా అపాయింట్ చేసింది. సైబర్ మిత్ర ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘సైబర్ మిత్ర’ పేరుతో వాట్సాప్ నెంబర్ 9121211100కు నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దిశ చట్టం తెచ్చిన ప్రభుత్వం మహిళలకు సత్వర న్యాయం, రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ మొబైల్ అప్లికేషన్(యాప్)ను తేనుంది. -
అక్రమ లేఅవుట్లకు చెక్
సాక్షి, ఆదిలాబాద్: ఇన్నాళ్లు గ్రామ పంచాయతీల్లో ఇష్టారాజ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించిన వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 7 మండలాల్లో 9 బృందాలుగా ఏర్పడి అనుమతిలేకుండా వేసిన లేఅవుట్లలోని హద్దురాళ్లను గురువారం తీసేయించారు. ఇలాంటి లేఅవుట్లలో ప్లాట్లు కొనరాదని బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 130 అక్రమ లేఅవుట్లను గుర్తించగా.. డీటీసీపీ అనుమతులున్నవి కేవలం 6 మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లేఅవుట్లు అత్యధికంగా జిల్లా కేంద్రం పరిధిలో 90 వరకు ఉండగా, మిగతావి ఆయా మండలాల పరిధిలో ఉన్నాయి. కాగా ఆదిలాబాద్ మండలంలో మూడు అధికార బృందాలు ఈ లేఅవుట్లలోని హద్దురాళ్లను తొలగింపజేశారు. నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, బోథ్, జైనథ్, బేల మండలాల్లో ఒక్కో అధికార బృందం ఈ లేఅవుట్లలోని రాళ్లను తీసేయించింది. ఈ లేఅవుట్లు పట్టా భూముల్లో ఉండగా, ఆదిలాబాద్ మండలంలో 10 చోట్ల ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోనూ ఉండటం గమనార్హం. దీంతోపాటు మావల శివారు పరిధిలోని బడా రియల్ వ్యాపారుల భూముల జోలికి వెళ్లకుండా అధికారులు దూరంగా ఉన్నట్లు తెలిసింది. నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 అమలులో భాగంగా నిబంధలన ప్రకారం అనుమతి లేని లేఅవుట్లలో ఈ బండరాళ్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి కఠినమైన నియమ, నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పంచాయతీల పరిధిలో అక్రమంగా లేఅవుట్లు వేసినా, పంచాయతీ పాలకవర్గాలు అనుమతులు జారీ చేసినా చర్యలు తీసుకుంటారు. ఇక నుంచి..ఇంతకాలం మున్సిపాలిటీల పరిధిలోనే ఈ లేఅవుట్లతోపాటు ప్రస్తుతం వ్యాపారపరంగా అభివృద్ధి చెందిన ఆయా మండల కేంద్రాలు, అక్కడక్కడ అంతర్రాష్ట్ర రహదారిని అనుకుని గ్రామ పంచాయతీల్లో కూడా వేసిన లేఅవుట్లకు సైతం చెక్ పడనుంది. నూతన పంచాయతీరాజ్ చట్టం కఠినతరం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి. దీంతో ‘పంచాయతీ’ల్లోనూ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలుస్తోంది. కాగా గతంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈ లేఅవుట్‌కు నిర్ణయించినదే అనుమతిగా పరిగణించబడేది. ఇప్పుడు గతంలో లాగా కాకుండా నూతన చట్టంలోని 113 సెక్షన్ ప్రకారం సాంకేతిక అనుమతి, అధికారి అనుమతి లేకుండా లేఅవుట్ చేయరాదని, ఒకవేళ మంజూరు చేస్తే ఈ చట్టం సెక్షన్ 268 కింద గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని రద్దు చేయవచ్చని పేర్కొనబడింది. అనుమతులు తప్పనిసరి.. గ్రామ పంచాయతీల్లో అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాల కింద వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలకు, వ్యాపారాలకు, ఇతరత్ర వాటికి వినియోగించాలనుకుంటే వ్యవసాయ భూమి చట్టం కింద ముందుగా నాలా రుసుము చెల్లించాలి. భూమి మార్పిడి ఆర్డీవో నుంచి అనుమతులు పొందాలి. ఆ తర్వాతనే లేఅవుట్ ప్రతిపాదన దరఖాస్తులను నిర్ణీత ఫీజుతో గ్రామ పంచాయతీకి అందజేయాలి. ఇలా వచ్చిన దరఖాస్తులను బాధ్యతగా గ్రామ పంచాయతీ వారు జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్ అనుమతి జారీ చేసే ప్రాధికార సంస్థకు పంపించాలి. ఇలా వారం రోజుల వ్యవధి పడుతుంది. ఇందులో కమర్షియల్‌గా మార్చే భూమి రెండున్నర ఎకరాలైతే జిల్లా స్థాయిలో, ఐదు ఎకరాలలోపు అయితే రీజనల్ స్థాయి, ఆపైన అయితే రాష్ట్రస్థాయి ప్లానింగ్ విభాగం అధికారుల నుంచి అనుమతులు పొందాలి. గడువులోపు గ్రామ పంచాయతీ ఏ నిర్ణయం తీసుకోకున్నా అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణించాలని నూతన చట్టంలో పేర్కొనబడింది. డీటీసీపీ ఆదేశాలు లేకుండా లేఅవుట్‌కు అనుమతులు ఇస్తే, పంచాయతీ పాలకవర్గాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. లేఅవుట్ ఆమోదం కోసం కనీస నిబంధనలు ఇలా.. ముందుగా నాలా అనుమతి తీసుకుని ఈ లేఅవుట్ వేయదలిచిన మొత్తం స్థలంలో కనీసం 10శా తం ఖాళీ స్థలాన్ని పాఠశాలతోపాటు గుడి, పార్కు, ఇతరత్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తప్పకుండా విడిచిపెట్టాలి. ఈ స్థలాన్ని గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. ఇంతేకాకుండా ప్రజాప్రయోజనాల కోసం అంటే 40 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారి, 33 అడుగుల వెడల్పుతో అంతర్గత రహదారులు, మురికికాలువలు, తదితర వాటికోసం మరో 15శాతం కేటాయించాలి. అప్పుడు లేవుట్‌కు అనుమతి లభిస్తుంది. లేఅవుట్ ఉంటేనే సబ్‌రిజిస్ట్రార్ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేస్తారు. నెలలోపు అనుమతులు.. ప్రతిపాదించిన భూమిని సర్వే చేసి, అప్పుడు డ్రెయినేజీలు, తాగునీటి వ్యవస్థ, రహదారులు, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని సాంకేతిక కమిటీ లేఅవుట్ నిర్వాహకులకు సూచిస్తుంది. లేఅవుట్ పరిధిలోని స్థలాలను, రహదారులను పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి. అన్నింటినీ పరిశీలించిన తర్వాత జిల్లా టౌన్, కంట్రీప్లానింగ్(డీటీసీపీ) నెలలోపు ఆమోదించాల్సి ఉంటుంది. అనుమతులు జారీ చేసి, ప్రతిపాదనలను నివేదికను రెవెన్యూ, గ్రామ పంచాయతీలకు పంపుతారు. దానిపై గ్రామ పంచాయతీ సమావేశం జరిపి, తీర్మానం చేసి ఆమోదించాలి. లేఅవుట్లో గ్రామ పంచాయతీకి, ప్రజాప్రయోజనాల కోసం కేటా యించిన మొత్తం 25శాతం స్థలాన్ని ఎవరికైనా విక్రయిస్తే, చట్ట ప్రకారం లేఅవుట్ నిర్వాహకులు(భూయజమాని)పై కఠిన చర్యలు తీసుకుంటారు. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనద్దు అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయొద్దు. నియమ, నిబంధనలను పాటిస్తూ లేఅవుట్లకు డీటీసీపీ నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. లేదంటే ఆ లేఅవుట్ చెల్లదు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో నిబంధల ప్రకారం అనుమతి లేని 4 లేఅవుట్లలో రాళ్లు తొలగింపజేశాం. ముందుగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు రెవెన్యూశాఖ నుంచి నాలా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేని లేఅవుట్లపై చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – మహేందర్‌కుమార్, బేల ఎంపీడీవో -
అవగాహన లేకుంటే..చిక్కులే!
సాక్షి, కరీంనగర్: వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన అమానవీయ ఘటనపై గత శుక్రవారం కువైట్‌లో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన 24మంది ప్రవాసాంధ్రులను కువైట్ నిఘా బృందాలు అరెస్టు చేశాయి. నిరసన ప్రదర్శన ఉద్దేశం మంచిదే అయినా ఆ దేశ చట్టాలకు విరుద్ధం కాబట్టి నిరసనకారులు ఇబ్బందుల్లో పడ్డారు. భారత దేశంలో పౌరులు తమ హక్కుల కోసం, అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం, సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసికెళ్లడానికి బంద్‌లు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ప్రదర్శనలు చేయడం సర్వసాధారణం. భారత్‌లో పుట్టిపెరిగిన వారు ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచార వ్యవహారాలు, చట్టాలపై అవగాహన లేకపోవడం వలన చిక్కుల్లో పడుతున్నారు. స్వేచ్ఛ ఎక్కువగా ఉండే ప్రజాస్వామ్య దేశమైన భారత్ నుంచి రాచరిక పాలన, ముస్లిం షరియా చట్టాలు అమలులో ఉండే అరబ్ గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి పరిస్థితులలో ఇమడలేక మానసిక సంఘర్షణ పడుతుంటారు. కొంత కాలం తర్వాత అలవాటుపడి సర్దుకుపోతుంటారు. రాచరిక వ్యవస్థ అమలులో ఉన్న గల్ఫ్ దేశాలలో అక్కడి చట్టాల ప్రకారం సమ్మెలు, నిరసన ప్రదర్శనలు చేయడం నిషేధం. గల్ఫ్‌లో సభలు, సమావేశాలు,సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార సదస్సులు తదితర ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అక్కడి ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. సోషల్ మీడియా ప్రభావం గల్ఫ్‌లో ఉండే చాలా మంది ప్రవాసులు స్వదేశంలో ఉండే తమ కుటుంబ సభ్యులతో వాయిస్ కాల్, వీడియో కాల్ మాట్లాడటానికి స్మార్ట్ ఫోన్లలో ఐఎంఓ (ఈమో), బోటిం, వాట్సాప్ లాంటి యాప్‌లను వినియోగిస్తున్నారు. సమాచారం తెలుసుకోవడానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. స్వదేశంలో జరిగే సంఘటనలు, సామాజిక, రాజకీయ కార్యకలాపాలపై తమ సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలను, స్పందనలను తెలియజేస్తున్నారు. రకరకాల విషయాలపై ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపులలో వాగ్యుద్ధాలు, తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతుంటాయి. అర్థవంతమైన, విషయాత్మక చర్చలు, విలువైన సమాచార మార్పిడి కూడా జరుగుతున్నది. వార్తలు, విశేషాల అప్డేట్స్ కోసం ప్రవాసులు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. – మంద భీంరెడ్డి, ప్రవాసీ మిత్ర. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దు మంచి కోసమైనా సరే.. గల్ఫ్ దేశ నిబంధనలకు విరుద్ధంగా పొతే జైలుపాలవుతాం. ఏ కార్యక్రమం చేయాలన్నా మన దేశానికి చెందిన సీనియర్ల సలహా తీసుకుని నిర్వహించాలి. ఆ దేశ ప్రభుత్వాల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయకూడదు. గల్ఫ్‌లో చట్టం తన పని తాను కచ్చితంగా చేసుకుంటపోతది. వరంగల్ ఘటనపై ఆవేదనతో నిరసన వ్యక్తం చేసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు అరెస్టయ్యారు. వారిని విడిపించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. – గోలి, శ్రీనివాస్,ఖతార్ వినతి పత్రం రూపంలో పంపాలి గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన మనం ఇక్కడ అతిథులం మాత్రమే. ఈ దేశాల పౌరులం కాదు. మన సమస్యలు గానీ, అభిప్రాయాలు గానీ ఏమైనా వ్యక్తం చేయాలన్నా వినతి పత్రం రూపంలో ఇండియన్ ఎంబసీకి పంపాలి. మన సమస్యలపై భారత ప్రభుత్వానికి, ఆయా శాఖలకు ఉత్తరాలు రాయవచ్చు. కానీ, గల్ఫ్‌లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేయడం నిషేధం. ఇక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. – షహీన్ సయ్యద్, సామాజిక కార్యకర్త, కువైట్ -
ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాలి
సాక్షి, హుజూరాబాద్ రూరల్: పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నియామవళిని అందరూ పాటించాలని హుజూరాబాద్ టౌన్ సీఐ వాసంశెట్టి మాధవి అన్నారు. గురువారం మండలంలోని కనుకులగిద్దె గ్రామంలో ఎన్నికల కోడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం, డబ్బులు సరఫరా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లకు ప్రలోభాలకు గురి చేసేలా ఎవరూ ప్రవర్తించిన ఉపేక్షించేది లేదన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని ఇప్పలనర్సింగాపూర్, బోర్నపల్లి, పోతిరెడ్డిపేట, వెంకట్రావ్పల్లి గ్రామాల్లో వేర్వేరు వ్యక్తుల వద్ద నుంచి సుమారు రూ.15 వేల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణంలో ట్రాఫిక్ రూల్స్‌ను పాటించని వాహనదారులపై ఈ–పెట్టి కింద కేసులను నమోదు చేయడంతోపాటు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఎస్సై చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
బరిలో నిలవాలంటే.. నిబంధనలు గెలవాలి
సాక్షి, దర్శి (ప్రకాశం): ఎన్నికల నగరా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల పండుగ సందడి మొదలైంది. ప్రజాస్వామ్యంలో అభ్యర్థుల బలాబలాలు తేల్చుకునేందుకు సమయం ఆసన్నమైనది. నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు నామినేషన్లు వేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. లేదంటే పోటీకి అనర్హులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. ► నామినేషన్ పరిశీనల నాటికి అభ్యర్థి వయస్సు 25 ఏళ్లు నిండి ఉండాలి. ► తొలిసారి అభ్యర్థులకు పాన్‌కార్డు ఉండాలనే నిబంధన విధించారు. ► రాష్ట్రంలోని ఏ అంసెబ్లీ నియోజకవర్గ పరధిలో అయినా ఓటరుగా ఉండాలి. ► లోకసభకు పోటీ చేసే అభ్యర్థులు డిపాటిట్ కింద రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.12,500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలి. ► అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు డిపాజిట్ కింద రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.5 వేలు, తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలి. ► నామినేషన్ సమయంలో గుర్తింపు పొందిన పార్టీలకు ఒక వ్యక్తి ప్రతిపాదితుడిగా ఉంటే చాలు. గుర్తింపు పొందని పార్టీలకు(ఇండిపెండెంట్) పార్టీలకు పది మంది ప్రతిపాదితులుగా ఉండాలి. ► నామినేషన్ వేసే వ్యక్తి నియోజకవర్గేతరుడైతే అతను సొంత నియోజకవర్గానికి చెందిన ఏఈఆర్వో, ఈఆర్వోలతో ఓటరుగా సర్టిఫైడ్ ప్రతిని తీసుకొని నామినేషన్ పరిశీలన గడువు కన్నా ఒక రోజు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. ► నామినేషన్‌తో పాటు రెండు చొప్పున అఫిడవిట్లు దాఖలు చేయాలి. రూ.10 విలువ గల నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్లు తయారు చేసి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్/నోటరీ ద్వారా ధ్రువీకరించాలి. ► ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి. ► లోక సభ అభ్యర్థి ఖర్చు రూ. 70లక్షలు కంటే మించకూడదు. ► అసెంబ్లీ అభ్యర్థి ఖర్చు రూ.28 లక్షలు కంటే మించరాదు. ► మైకులు వాడకానికి పోలీసుల అనుమతి తప్పనిసరి. ఉదయం 6 నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే ప్రచారం చేయాలి. ► ర్యాలీలు నిర్వహించేటప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదు. ► ప్రభుత్వ కార్యాలయాలు, మసీదులు, చర్చిలు, దేవాలయాల్లో ప్రచారం నిషేధం. ► అభ్యర్థులు నియమించుకునే పోలింగ్ బూత్ ఏజెంట్లు సంబంధిత పోలింగ్ బూత్‌లో ఓటరుగా నమోదు అయి ఉండాలి. -
అంతా చూస్తుంటారు..! జాగ్రత్త
సాక్షి, శ్రీకాకుళం న్యూకాలనీ: కోడ్.. జిల్లా అంతటా మార్మోగుతున్న పేరు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సామాన్యుడి దృష్టంతా దీనిపైనే ఉంది. విగ్రహాలు, పోస్టర్లు, బ్యానర్ల విషయంలోనే కాదు అధికారుల కదలికలు సైతం ఈ కోడ్ పరిధిలోకే వస్తాయి. కోడ్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి అధికార పార్టీ పాల్పడకూడదు. ఎన్నికల ప్రచారం కోసం తన అధికార హోదాని దుర్వినియోగం చేశారనే అభియోగం తలెత్తకుండా కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ చూసుకోవాలి. ఎన్నికల పనికి గానీ, ప్రచారానికి గానీ పాలనా యంత్రాంగాన్ని, సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. అధికారంలో ఉండే పాలకులు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ విశ్రాంత గృహాలు, బంగ్లాలు లేక ప్రభుత్వ వసతి సౌకర్యాలను వినియోగించుకోకూడదు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రభుత్వ ఖజానా, ప్రజాధనం వెచ్చింది ప్రకటనలు, సంక్షేమ పథకాల ఆర్టికల్స్‌ను ప్రచురించకూడదు. ఇవ్వకూడదు. ఎన్నికల కోసం పక్షపాత పూరితమైన రాజ కీయ వార్తల కవరేజీ ప్రచారం కోసం ప్రభుత్వం మాస్ మీడియాని ఉపయోగించి దుర్వినియోగానికి పాల్పడకూడదు. ఎన్నికల సంఘం నిర్వహణ తేదీలు ప్రకటించినప్పటి నుంచి మంత్రలు, ఇతర అధికారులు తమ విచక్షణా నిధుల నుంచి ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయరాదు. ప్రభుత్వంలోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఎటువంటి అడహక్ నియామకాలుగాని, కమిటీలుగాని జరపరాదు. అధికారులకు నియమావళి.. ప్రజాప్రతినిధులకు అధికారులు, ఉద్యోగులు ప్రోటోకాల్ పాటించకూడదు. ప్రజాప్రతినిధులు వద్ద పీఏలుగా, పీఆర్ఓలగా, ఫోటోగ్రాఫర్లగా ఉన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తిరిగి వారి సొంతశాఖల్లో రిపోర్ట్ చేయాలి. జిల్లాలకు ప్రచారం కోసం వచ్చే సమయంలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ఆహ్వానం పలకడానికి వెళ్లకూడదు. ప్రజాప్రతినిధుల నిర్వహించే సమావేశాలకు హాజరుకావడం కావడం వంటి పనులు అధికారులు చేయకూడదు. కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. -
ఎస్ఐ అభ్యర్థులూ.. ఇవి పాటించండి!
మహబూబ్‌నగర్ క్రైం : పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ కేడెట్ ట్రెయినీ ఎస్ఐ(సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్ సీపీఎల్, ఫైర్) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కోసం ఉమ్మడి జిల్లాలో కేవలం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మాత్రమే 32పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13,292మంది పరీక్షకు హాజరుకానుండగా.. పరీక్ష ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాతపరీక్షకు హాజరుకానున్న అభ్యర్థుల కోసం పోలీసు శాఖ పలు సూచనలు జారీ చేసింది. అభ్యర్థులకు ముఖ్య సూచనలు అభ్యర్థులు పరీక్షా కేంద్రం వద్దకు నిర్ణీత సమయం కంటే ముందుగా చేరుకోవాలి. నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించరు. పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు పంపించరు. టీఎస్ఎల్ఆర్బీ తుది నిర్ణయం మేరకు హాల్‌టికెట్లు జారీ చేశారు. డూప్లికేట్ జారీ ఉండదు. తుది రీక్ష అనంతరం సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్, దేహదారుఢ్య పరీక్షలు, అభ్యర్థి తన దరఖాస్తులో పేర్కొన్న పూర్తి వివరాలను పరిశీలించాకే అర్హతల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక జరుగుతుంది. పరీక్ష హాల్లో బ్లాక్ లేదా బ్లూపాయింట్ పెన్ను, తుది పరీక్ష హాల్ టికెట్, ఏదైనా ఒక ఒరిజినల్ ధ్రువపత్రం(పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్) మాత్రమే వెంట ఉంచుకోవాలి. హాల్ టికెట్లలో అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టం గా ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటారు. హాల్‌టికెట్‌ను లేజర్ ప్రింటర్ ద్వారా తీసుకోవాలి. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో పూరించిన విధంగా తన హాల్‌టికెట్‌లో ఇన్విజిలేటర్ సమక్షాన సంతకం చేయాలి. పరీక్ష రాసే ముందు అభ్యర్థి ఓఎంఆర్ షీట్‌పై సూచనలను పూర్తిగా చదవాలి. ఓఎంఆర్ షీట్‌పై పేర్కొన్న బుక్లెట్ కోడ్ వచ్చిందో చూసుకోవాలి. తుది పరీక్ష 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు. అభ్యర్థి ప్రశ్నాపత్రం తెరిచిన వెంటనే పేపర్ బుక్లెట్, 200 ఆబ్జెక్టివ్ మాదిరి ప్రశ్నల ముద్రణ సరిగ్గా ఉందా, లేదా అని చూసుకోవాలి. లేనిపక్షంలో వేరే ప్రశ్నపత్రం తీసుకోవాలి. అభ్యర్థి ఓఎంఆర్ షీట్‌పై అనవసరపు సమాచారం, గుర్తులు, మతపరమైన చిహ్నాలు, ప్రార్థనలు, గుర్తింపు చిహ్నాలు రాస్తే పరిగణనలోకి తీసుకోరు. పరీక్ష హాల్లో అభ్యర్థి ఏ విధమైన మోసపూరిత చర్యలకు పాల్పడినా ఆ అభ్యర్థి ఓఎంఆర్ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థి పరీక్షా హాల్‌ను వదిలి వెళ్లేటప్పుడు ఒరిజినల్ ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. కేవలం ప్రశ్నపత్రం బుక్లెట్, ఓఎంఆర్ షీట్ పెన్సిల్ కాపీని మాత్రమే తీసుకెళ్లాలి. పరీక్ష పూర్తయ్యేంత వరకు దీనిని ఒరిజినల్ ఓఎంఆర్ నుంచి వేరు చేయొద్దు. పరీక్ష అనంతరం ఇన్విజిలేటర్ సమక్షంలో డూప్లికేట్ ఓఎంఆర్ షీట్‌ను వేరు చేసి తీసుకెళ్లాలి. మరికొన్ని... పరీక్ష సెంటర్ లోపలికి ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువు లు సెల్‌ఫోన్, సెల్యూలర్ ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్, బ్లూటూత్‌లు, వాచ్‌లు, కాలిక్యులేటర్లు, లాగ్‌టేబుల్, పర్సులు, చార్ట్స్, విడి కాగితాలు, రికార్డు చేసే పరికరాలను అనుమతించరు. ప్రతీ అభ్యర్థి నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు. అభ్యర్థులు చేతులు, పాదాలపై మెహందీ, సిరా రాసుకుంటే పరీక్షకు అనుమతించరు. ప్రశ్నపత్రం ఆంగ్లం – తెలుగు, ఆంగ్లం – ఉర్దూ భాషల్లో ఉంటుంది. ఓఎంఆర్ పత్రంలో వృత్తాలను బ్లూ, బ్లాక్ పెన్నులతో మాత్రమే పూరించాలి. ఇతర రంగుల పెన్నులు, పెన్సిల్స్, ఇంక్,జెల్, పెన్నులతో రాయడానికి అనుమతి లేదు. అలాగే, షీట్‌పై రబ్బర్ లేదా వైట్ప్లూయిడ్ వాడినట్లు గుర్తిస్తే దానిని పరిగణనలోకి తీసుకోరు. పరీక్ష కేంద్రాలు ఇవే.. రూట్ – 1 : భూత్పూర్ వైపు ప్రజ్ఞా హైస్కూల్, ఢిల్లీ ఒలింపియాడ్ స్కూల్, మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్, ఎంవీఎస్ జూనియర్ కళాశాల, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, పంచవటి విద్యాలయం, ఫాతిమా విద్యాలయం, క్రీస్తుజ్యోతి విద్యాలయం రూట్ – 2 : దేవరకద్ర రోడ్ గవర్నమెంట్ మోడల్ బేసిక్ హైస్కూల్, గవర్నమెంట్ హైస్కూల్(గాంధీ రోడ్డు), నాగార్జున హైస్కూల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, జేపీఎన్సీఈ, స్విట్స్ రూట్ – 3 : ఏనుగొండ వైపు గవర్నమెంట్ డైట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్, లుంబిని హైస్కూల్, గెలాక్సీ హైస్కూల్, ఆదర్శ డిగ్రీ, పీజీ కాలేజ్, ఎస్వీఎస్ డెంటల్ కళాశాల, ఎస్వీఎస్ మెడికల్ కళాశాల. రూట్ – 4 : కొత్త బస్టాండ్ ఆదర్శ జూనియర్ కళాశాల, మోడ్రన్ హైస్కూ ల్, రెయిన్బో హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలుర), ఎన్టీఆర్ డిగ్రీ క ళాశాల, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్(బాలికలు) రూట్ – 5 : న్యూటౌన్ నుంచి మెట్టుగడ్డ వాసవి డిగ్రీ కాలేజీ, భవిత జూనియర్ కాలేజ్, హ్యాపీనైజ్ స్కూల్, స్వామి వివేకానంద డిగ్రీ కళాశాల, న్యూరిషి హైస్కూల్ పారదర్శకంగా రాత పరీక్ష మహబూబ్‌నగర్‌లో ఈనెల 26న నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష అత్యంత పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు ఇన్చార్జ్ ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేం ద్రంలోని 32 సెంటర్లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుం దని తెలిపారు. వేలిముద్రలు సేకరించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రతీ అభ్యర్థి గంట ముందుగానే కేం ద్రాలకు చేరుకోవాలని సూచించారు. కాగా, పరీక్ష నేపథ్యంలో 26న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఆ రోజు జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లు మూసి వేయాలని ఆదేశించారు. లౌడ్స్పీకర్లు, మైకులకు పట్టణంలో అనుమతి ఉండదని చెప్పారు. అలాగే, పరీక్షరాసే అభ్యర్థుల కోసం స్థానిక బస్టాండ్‌లో హెల్ప్‌డెస్క్ ఏరాకపటుచేస్తామని తెలిపారు. పరీక్షలో అవకతవకలకు పాలడ్పిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నోడల్ అధికారి 94910 43859 నంబర్లో సంప్రదించాలని ఎస్పీ కోరారు. ఈ సందర్భంగా పలు పరీక్షల కేంద్రాలను ఎస్పీతో పాటు ఏఎస్పీ వెంకటేశ్వర్లు, జేఎన్టీయూ అధికారులు పరిశీలించారు. -
మెట్రోలో వెళ్లాలంటే ఇవి పాటించాల్సిందే..
సాక్షి, హైదరాబాద్ : మరి రెండురోజుల్లో అందుబాటులోకి రానున్న మెట్రో రైలు సర్వీసులపై అందరికీ ఆసక్తి నెలకొంది. జర్నీ ఎంతో సులభం అని.. పొల్యూషన్ లేకుండా హ్యాపీగా వెళ్లిపోవచ్చని అందరూ ఖుషీ అవుతున్నారు. జర్నీ టైం కూడా తక్కువ. కొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతున్న మెట్రో రైలులో జర్నీకి నిబంధనలు ఉన్నాయి. అందరూ వీటిని ఫాలో కావాల్సిందే. లేకపోతే జరిమానా తప్పదు. మా ఇష్టం అంటే అస్సలు కుదరవు అంటోంది మెట్రో. ప్రయాణికులు పాటించాల్సిన నియమ నిబంధనలు ⇒ మెట్రో రైలులోకి ప్రవేశించగానే సీటు ఉంటే అందులో కూర్చోవచ్చు. లేకపోతే నిలబడాలి. అంతేగానీ కింద కూర్చుంటాను అంటే కుదరదు. కింద కూర్చుంటే జరిమానా వేస్తారు. ⇒ ఒక్కో టికెట్ పై కేవలం 10కేజీల వరకు మాత్రమే లగేజీకి అనుమతి ఇస్తారు. ఆపై ప్రతి కిలోకి రూపాయి లగేజీ చార్జ్ వసూలు చేస్తారు. అది కూడా గరిష్టంగా 40కిలోలు మాత్రమే. ⇒ 40కిలోల బరువు మాత్రమే ఉంది కదా వెళతామంటే అస్సలు కుదరదు. బ్యాగ్ పొడవు 60 సెంటిమీటర్లు, వెడల్పు 45 సెంటిమీటర్లు, ఎత్తు 25 సెంటిమీటర్లలోనే మీ 40కిలోల బ్యాగ్ ఉండాలి. పెద్ద పెద్ద గోతాలు వేస్తాం అంటే అనుమతించరు. అసలు ఎంట్రీనే ఉండదు. ⇒మెట్రో టికెట్ కొనుగోలు చేసిన 29 నిమిషాల్లోపు స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ పైకి ఎంట్రీ అవ్వాలి. టికెట్ కొన్నాం కదా అని అర గంట తర్వాత వెళితే అతి చెల్లుబాటు కాదు. మళ్లీ టికెట్ కొనుగోలు చేయాలి. ⇒ అందంగా ఉన్నాయి.. చల్లగా ఉంది.. హాయిగా ఉంది కదా అని మెట్రో స్టేషన్లు, మాల్స్ లోనే ఉండిపోతాం అంటే అస్సలు ఊరుకోరు. రెండు గంటల వరకు మాత్రమే మీకు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జరిమానా విధిస్తారు. టోకెన్లు, స్మార్ట్‌కార్డులు లేకపోయినా, తీసుకున్న టోకెన్ సమయం గడిచిపోయినా జరిమానా విధిస్తారు. దీని కోసం మెట్రో ఎంట్రీ నుంచి అడుగడుగునా సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు తిరుగుతూనే ఉంటారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తుంటారు. ఎవరైనా గంటల తరబడి అక్కడే ఉంటుంది గుర్తించి బయటకు పంపిస్తారు. ⇒ రద్దీ సమయాల్లో టోకెన్లు ఇచ్చేందుకు వీలుగా పోర్టబుల్ టికెట్ అనలైజర్ (PTA) మిషన్ తో సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రతి మెట్రో స్టేషన్లో సిబ్బంది తిరుగుతూ ప్రయాణీకులను తనిఖీలు చేస్తుంటారు. ⇒ ప్రతి మెట్రో స్టేషన్‌ను.. పబ్లిక్ ఏరియా, ప్రైవేట్ ఏరియా, ప్లాట్‌ఫామ్ మూడు భాగాలుగా విభజించారు. పబ్లిక్ ఏరియాలోకి ఎవరైనా వెళ్లొచ్చు. ప్రైవేట్ ఏరియాలోకి మాత్రం టికెట్ ఉండాల్సిందే. అక్కడి నుంచి ఫ్లాట్ ఫాంపైకి వెళ్లొచ్చు. ⇒ స్మార్ట్‌కార్డు ఉన్నవారికి కూడా ఈ కాలపరిమితి నిబంధనలు వర్తిస్తాయి. రెండు గంటలకు మించి ఉంటే.. బయటకు వెళ్లేటప్పుడు కార్డ్ స్వైప్ చేయగానే ఆ విషయం బయటపడుతుంది. ⇒ మెట్రో స్టేషన్లో టికెట్ క్యాష్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ కీలకంగా వ్యవహరిస్తుంటారు. టిక్కెట్ల సమయాన్ని, ఇతర సమాచారాన్ని తెలుసుకునేందుకు స్టేషన్లో రీడర్లను ఏర్పాటు చేశారు. టికెట్‌ను మిషన్ పై ఉంచగానే మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు. ⇒ అగ్గిపెట్టెలు, లైటర్లు, గ్యాస్ సిలిండర్లు, కిరోసిన్, పెట్రోల్ వంటి నిషేధిత ఇంధనాలు, వస్తువులు నో ఎంట్రీ. ఫ్రూట్స్ కట్ చేసే చిన్న చాకును కూడా అనుమతి ఇవ్వరు. మీరు మెట్రో జర్నీ చేయాలి అనుకుంటే ఈ నిబంధనలు పాటించి తీరాల్సిందే. లేకుంటే అక్కడి వరకు వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుంది. ఈనిబంధనలు కఠినంగా అమలు అవుతాయి. ఏ మాత్రం వెసలుబాటు ఉండదు. సో.. మెట్రో జర్నీ చేద్దాం అనుకున్న వారు వీటిని ఫాలో అవ్వండి. హ్యాపీగా జర్నీ కొనసాగించండి. -
మంత్రిగారూ...వాళ్లొద్దండీ
‘మంత్రిగారూ ! ఆ అధికారి ఎన్నికల్లో టీడీపీకి సహకరించలేదు. మరో ఆయన మేం చెప్పినా బొత్తిగా పట్టించుకోవడం లేదు..సీఐలతో కూడా బాగా ఇబ్బందిగా ఉంది. వీరందరినీ కచ్చితంగా బదిలీ చేయాల్సిందే! వారి స్థానంలో మనకు అనుకూలంగా ఉన్న వారిని తీసుకుందాం! ఇందా జాబితా!’ - ఇటీవల మంత్రి బొజ్జలతో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలివి. సాక్షి, చిత్తూరు : పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం...రానున్న ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలకు లాభం జరగాలన్నా... తాము చెప్పిట్లుగా పనులు జరగాలన్నా...తాము ఏం చెబితే ఆ మాటకు ‘జీహుజూర్...!’ అనే అధికారులు కావాలి. చెప్పి న ప్రతిపనికీ ‘రూల్స్ అండ్ రెగ్యులేషన్స్’ అని తమ మాట వినని అధికారులు వద్దని టీడీపీ నేతలు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి స్పష్టం చేశారు. ప్రస్తుతం బదిలీపై నిషే ధం ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు అక్టోబర్ 10వ తేదీ వరకూ అమలులో ఉంటాయి. ఆపై నిషేధం తిరిగి అమల్లోకి రానుంది. దీంతో పుణ్యకాలం ముగిసేలోపు తమ దారికిరాని అధికారులపై బదిలీ వేటువేసి, అనుకూలురైన అధికారులను రప్పించుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా అధికారులతో పాటు జిల్లావ్యాప్తంగా ఎక్కడ ఏ అధికారి తమకు అవసరం లేదో వారి జాబితాను సిద్ధంచేసి, ఈ నెల 25న చిత్తూరుకు వచ్చిన అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సమర్పించారు. ఈ జాబితాలో డీఈవో ప్రతాప్‌రెడ్డి, డీటీసీ బసిరెడ్డి, చిత్తూరు ఆర్డీవో పెంచలకిషోర్తోపాటు మరికొందరి అధికారుల పేర్లు ఉన్నట్లు తెలిసింది. వీరితో పాటు సీఐలు రాజశేఖర్, రవిమనోహర్, అల్లాబక్ష్ స్థానంలో కూడా కొత్తవారిని నియమించాలని సూచించినట్లు సమాచారం. అలాగే చిత్తూరు డీఎస్పీ కమలాకర్‌రెడ్డి బదిలీ తర్వాత ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టుకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులునాయుడు నియమించాలని కూడా వారు తెలిపినట్లు తెలుస్తోంది. ఇదేక్రమంలో జిల్లా వ్యాప్తంగా డీఎస్పీలు, సీఐల జాబితాను సిద్ధంచేసి మంత్రికి అందించారు. వైఎస్సార్సీపీ ఎంపీపీలున్నచోట ఎంపీడీవోల నియామకంపై ప్రత్యేక దృష్టి జిల్లా వ్యాప్తంగా 65 మండలాల్లోని ఎంపీడీవోల్లో ఎవరు తమకు అవసరం, ఎవరు అవసరం లేదనే జాబితాను కూడా టీడీపీ నేతలు మంత్రికి అందించారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 22 చోట్ల ఎంపీడీవోల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మండలాల్లో టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుకునే ఎంపీడీవోలను నియమించేలా 22 మందితో జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో తహశీల్దార్లకు కూడా స్థానచలనం కల్పించాలని సూచించినట్లు తెలిసింది. కమిషనర్ బదిలీపై మేయర్ గట్టి పట్టు చిత్తూరు కమిషనర్ రాజేంద్రప్రసాద్‌ను కచ్చితంగా బదిలీ చేయాలని మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త గట్టిగా పట్టుపట్టారు. ప్రస్తుతం వీరు ఉప్పనిప్పుగా కార్పొరేషన్లో కొనసాగుతున్నారు. దీంతో ఆ స్థానంలో కడప కమిషనర్ ఓబులేసుతో పాటు హైదరాబాద్ డీఎం ఆఫీసులో పనిచేస్తున్న ఈశ్వరయ్యలో ఒకరిని రప్పించుకునేందుకు మేయర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సయోధ్యలేని చోట పనిచేయడం కంటే బదిలీనే మేలనే యోచనలో కమిషనర్ ఉన్నారు. జెడ్పీ సీఈవో బదిలీపై వీడని పీటముడి జెడ్పీ సీఈవో వేణుగోపాలరెడ్డి బదిలీపై ఇంకా సందిగ్ధత వీడలేదు. జెడ్పీ పాలకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో సీఈవో బదిలీ ఇక అనివార్యమే అని అంతా భావించారు. అయితే తర్వాత ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ప్రస్తుతం టీడీపీలోని ఓ వర్గం సీఈవోను బదిలీ చేయాలని ప్రయత్నిస్తుంటే, జెడ్పీ చైర్మన్, ఆమె భర్త చంద్రప్రకాశ్ మాత్రం సీఈవోకు అండగా నిలుస్తున్నారని తెలుస్తోంది. దీంతో సీఈవో బదిలీ గండం నుంచి బయటపడ్డట్లే!