
కాలంతోపాటు సాగుతున్న మానవ జీవితంలో.. కొందరు వారు తీసుకునే నిర్ణయాలను బట్టే ఫలితాలు వస్తాయని మర్చిపోతుంటారు. చిన్న ఆపద రాగానే బెంబేలెత్తుతుంటారు. దీనికి కారణం నువ్వే అంటూ తాఫీగా ఇతరులపై తప్పును నెట్టేస్తుంటారు. అసలు కారణం ఏంటో తెలుసా..! ఆ సమయానికి, సాగుతున్న క్రమానికి, అనుసరిస్తున్న విధానాలకి సరైన పొంతన లేకపోవడమే. ప్రశాంతంగా ఆలోచించకపోవడమే. మరి వాటిని అధిగమించడానికి ఏం చేయాలో చూద్దాం.
ప్రయాణ నియమాలు..
1. ప్రయాణానికి ఇంటి దగ్గర బయల్దేరిన దగ్గర నుంచి తొమ్మిదవ రోజున తిరుగు ప్రయాణమవకూడదు.
2. ప్రయాణానికి బయలుదేరేటప్పుడు శుభశకునాలు చూసుకోవాలి.
3. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భోజనం చేసిన తర్వాత వారశూల దోషాలు తగ్గుతాయి.
4. రాత్రి సమయాలలో చేయు ప్రయాణ విషయాలలో వారశూల పట్టింపు ఉండదు. కాని ఆడపిల్లలను పంపే విషయంలో శుక్ర, మంగళవారాల పట్టింపు ఉన్నది.
5. నూతన వితంతువును మంగళ, శుక్ర వారాల్లో చూడరాదు. ఆ రోజులలో చూడటానికి బయల్దేరడం కూడా పనికిరాదు.
6. అశుభకార్య నిమిత్తంగా ప్రయాణం చేసినట్లయితే వెంటనే తిరుగు ప్రయాణం చేయాలి లేదా దేవాలయంలో నిద్రచేసి వేరొక నిమిత్తంగా వెళ్ళవచ్చు.
సాధారణ నియమములు..
"స్వగృహే ప్రాక్ఛిరాః కుర్యా శ్యాశుర్యే దక్షిణౌశిరాః
ప్రత్యక్షిరాః ప్రవాసేషు నకదాచిదుదక్ఛిరాః"
స్వగహమునందు తూర్పువైపున శిరస్సు, అత్తవారింట దక్షిణ శిరస్సు, ఇతరుల ఇంట పడమర శిరస్సు ఉంచి నిదురించాలి. ఉత్తర దిశలో శిరస్సు ఉంచి ఎక్కడా నిదురించకూడదు. వాస్తుశాస్త్ర రీత్యా దక్షిణ శిరస్సు కూడా విశేషమే!
దోషం – శాంతి మంత్రం..
ఆరోగ్య సమస్యలు ఉన్నా, పిల్లలకు దృష్టిదోషం ఉన్నా, గర్భిణీస్త్రీలకు గర్భరక్షణ కోసం, మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నా విభూది చేతపట్టుకొని ఈ కింది శ్లోకాన్ని 41 సార్లు పారాయణ చేసి విభూది ముఖమున ధరించిన శాంతి లభించును.
"శ్రీమత్ నృసింహ విభవే గరుడ ధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ
తృష్ణాది వృశ్చికజలాగ్ని భుజంగ రోగ
క్లేశ వ్యయాయ హరయే గురవేనమస్తే!"
పిల్లలకు మాటలు రాగానే ఈ శ్లోకం నేర్పి వారిచేత నిత్యం పారాయణ చేయిస్తే, దృష్టిదోషం, నరఘోష, భూత, ప్రేత, పిశాచ బాధలు దగ్గరకు రావు.
రజస్వలకు మంచి కాలము..
అశ్వని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి ప్రథమ రజస్వలకు మంచి నక్షత్రాలు. గ్రహణకాలం సంధ్యాకాలం, వర్జ్యకాలం మంగళవారం, అమావాస్య రోజులలో అయినట్లయితే శాంతి చేయించుకొనవలెను. జన్మ నక్షత్రానికి నైధనతార రోజున రజస్వల అయినచో శాంతి అవసరం.
ఇవి చదవండి: అమ్మో.. కుజదోషం! పెళ్లే అవదా? అని భయపడుతున్నారా..!