ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ తన సర్వీస్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్‌లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఈ సమాచారం నియంత్రణకు ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. దాంతో సంస్థ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దురోవ్ పావెల్‌ను ఇటీవల పారిస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఫలితంగా కంపెనీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సర్వీస్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్లాట్‌ఫారమ్ సెర్చ్ ఫంక్షన్‌ని ఉపయోగించి ఇకపై చట్టవిరుద్ధ కార్యకలాపాలు, కంటెంట్ కోసం వెతకలేరని తెలిపింది. ఒకవేళ వినియోగదారులు అలాంటి కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి పలుమార్లు ప్రయత్నిస్తే చట్టబద్ధంగా అవసరమైతే వారి ఫోన్ నంబర్‌లు, ఐపీ చిరునామాలను ప్రభుత్వ అధికారులకు అందజేస్తుందని సంస్థ వర్గాలు స్పష్టం చేశాయి. టెలిగ్రామ్ సెర్చ్ ఫీచర్ స్నేహితులు, వార్తలను కనుగొనడం కోసం ఉద్దేశించబడిందని, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల కోసం కాదని ఈ సందర్భంగా దురోవ్ తెలిపారు. టెలిగ్రామ్‌లో డ్రగ్స్, స్కామ్, పిల్లల లైంగిక వేదింపులు, హింస..వంటి కంటెంట్‌ను కట్టడి చేయడానికి ప్రత్యేకంగా కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?
పారిస్ పోలీసులు దురోవ్ పావెల్‌ను ఇటీవల అరెస్ట్ చేయడంతో నిబంధనల ప్రకారం ఐదు మిలియన్ యూరోలు(రూ.46 కోట్లు) విలువ చేసే బాండ్‌ను అందించి న్యాయ పర్యవేక్షణలో ఉన్నారు. దాంతోపాటు టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చర్యలు అమలు చేస్తున్నారు. దురోవ్ అరెస్ట్ సమయంలో టెలిగ్రామ్‌ను నిలిపేస్తారేమోననే వార్తలు రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment