అమెరికా అభియోగాలపై అదానీ
చట్టాలను ఉల్లంఘించినట్టు చెప్పలేదు
మీడియాలో విద్వేషపూరిత కథనాలు
సవాళ్లు తమకు కొత్తేమీ కాదని వ్యాఖ్యలు
జైపూర్: అదానీ గ్రూప్‌పై ఇటీవల అమెరికాలో దాఖలైన అభియోగాలపై సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ తొలిసారి బహిరంగంగా స్పందించారు. చట్టాలు, నిబంధనల అమలుకు తమ గ్రూప్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రతి దాడీ తమను మరింత బలోపేతమే చేస్తుందన్నారు. ఆయన శనివారం ఇక్కడ 51వ జెమ్స్, జువెల్లరీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘‘నిబంధనల అమలుకు సంబంధించి ఇటీవలే అమెరికా నుంచి కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నాం. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం మాకిది మొదటిసారేమీ కాదు. ప్రతి దాడీ మమ్మల్ని మరింత బలోపేతమే చేస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ అంశానికి సంబంధించి మీడియాలో మాపై పుంఖానుపుంఖాలుగా వివక్ష, విద్వేషపూరిత కథనాలు వచ్చాయి. ఇంతా చేస్తే మా సంస్థకు సంబంధించిన వారెవరిపైనా అమెరికాలో ఎఫ్‌సీపీఏ చట్టాలను ఉల్లంఘించినట్టు గానీ, న్యాయ ప్రక్రియను అడ్డుకోజూసినట్టు గానీ ఒక్క అభియోగమూ నమోదు కాలేదు’’ అని అదానీ గుర్తు చేశారు.
నియంత్రణ సంస్థల నియమ నిబంధనలన్నింటికీ కట్టుబడి ఉండటంలో తమ సంస్థ ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తుందన్నారు. ‘‘నేటి సమాజంలో వాస్తవాల కంటే పుకార్లే వేగంగా వ్యాపిస్తాయి. ఇన్నేళ్లలో అదానీ గ్రూప్ పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో రంగాల్లో మార్గదర్శకంగా నిలిచినందుకు మేం చెల్లించిన మూల్యమది. ఆ సవాళ్లే మమ్మల్ని తీర్చిదిద్దాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అధిగమిస్తూనే వస్తున్నాం. సవాళ్లను తట్టుకుని నిలుస్తూ కొత్త దారి వెదుక్కుంటూ ధైర్యంగా సాగడమే మాకు తెలుసు’’ అని అదానీ చెప్పుకొచ్చారు.
హిండెన్‌బర్గ్‌పై చట్టపరంగా చర్యలు
తమ గ్రూప్‌పై గతేడాది హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను కూడా అదానీ తోసిపుచ్చారు. ఆ సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ‘‘మాపై హిండెన్‌బర్గ్ చేసింది ఆరోపణలు నిజానికి మా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బ తీయడంతో పాటు సంస్థను రాజకీయ వివాదంలోకి కూడా లాగేందుకు చేసిన భారీ కుట్ర. ఆ ఆరోపణలను ఒక వర్గం మీడియా తమ స్వార్థ ప్రయోజనాల కోసం విపరీతంగా ప్రచారం చేసింది. అంతటి సంక్షోభంలో కూడా మేం విలువలతో ఎక్కడా రాజీ పడలేదు. అదే ఏడాది సంస్థను ఆర్థికంగా సమున్నత శిఖరాలకు చేర్చి తలెత్తుకు నిలిచాం. మేం ఎలాంటి అవకతవకలకూ పాల్పడలేదని చివరికి సుప్రీంకోర్టే తేల్చింది’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment