అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బిలియనీర్ గౌతం అదానీ నేతృత్వంలోని కంపెనీలపై చేసిన ఆరోపణలపై విచారణను ముగించేందుకు గడువును 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టేటస్ రిపోర్టును సమర్పించేందుకు గడువును పొడిగించాలని కూడా సెబీ కోరింది. ఈ ఏడాది మేలో, ఈ అంశంపై అప్‌డేట్ చేసిన స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించేందుకు ఆగస్టు 14 వరకు సెబీకి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.
సెబీ 15 రోజుల పొడిగింపును ఎందుకు కోరింది?
అదానీ గ్రూప్‌పై యుఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు సంబంధించి తాను దర్యాప్తు చేస్తున్న 24 లావాదేవీలలో 17 విచారణను పూర్తి చేసినట్లు సెబి తెలిపింది. మిగిలిన అంశాలపై విచారణ త్వరలోనే పూర్తి చేయనుంది. అయితే తదుపరి చర్యలను ప్లాన్ చేయడానికి ఇతర నియంత్రణ సంస్థలు , విదేశీ అధికార పరిధి నుండి మరింత సమాచారం కోరినట్లు సెబీ సుప్రీంకు తెలియజేసింది. విదేశీ లావాదేవీల ప్రమేయం కారణంగా కేసుకు సంబంధించిన కొన్ని అంశాలను పరిశోధించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.
ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూపు తీరని సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కమిటీ ఏర్పాటు సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ ఆరోపణల మేరకు నిబంధనలకు వ్యతిరేకంగా అదానీ గ్రూప్ తన గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను తారుమారు చేసిందా? సంబంధిత-పార్టీ లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైందా? అనే విషయాలపై సెబీ విచారణ చేపట్టింది.
మరోవైపు అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ అదానీ పోర్ట్స్ కంపెనీ చట్టబద్ధమైన ఆడిటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ షాక్‌తో సోమవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
కాగా తమ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో చేసిన తప్పుడు ఆరోపణలని హిండెన్‌బర్గ్ వాదనను గౌత అదానీ గట్టిగా తోసిపుచ్చారు. కేవలం తమ స్టాక్ ధరలను తగ్గించడం ద్వారా లాభాలను సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుని, కుట్రపూరితంగానేకంపెనీ ఫాలో-ఆన్-పబ్లిక్ ఆఫర్ ముందు ఈ తప్పుడు నివేదికను వెల్లడించారని 2023 వార్షిక సాధారణ సమావేశంలో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment