న్యూఢిల్లీ: ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘అదానీ గ్రూప్’నకు మరో విజయం లభించింది. స్టాక్ ధరల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థపై కొనసాగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లేదా సీబీఐకి అప్పగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అదానీ గ్రూప్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కొనసాగిస్తున్న దర్యాప్తు పట్ల న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది.
సెబీ సమగ్ర దర్యాప్తు జరుపుతోందని వెల్లడించింది. ఈ దశలో సెబీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దర్యాప్తును సెబీ నుంచి సిట్ లేదా సీబీఐకి బదిలీ చేయాలన్న వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 46 పేజీల తీర్పు వెలువరించింది. అదానీ గ్రూప్‌పై పెండింగ్‌లో ఉన్న రెండు దర్యాప్తులను 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది.
సెబీ దర్యాప్తును అనుమానించలేం
అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని, మదుపర్లను మోసగించిందని ఆరోపిస్తూ అదానీ–హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ వివాదం తర్వాత సుప్రీంకోర్టులో నాలుగు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. న్యాయవాదులు విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ, కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, అనామికా జైశ్వాల్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ నివేదిక వచి్చన తర్వాత ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
సెబీ చట్టంలో చేసిన మార్పుల కారణంగా అదానీ గ్రూప్ అవకతవకలు బయటపడడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. సెబీని పటిష్టం చేయాలని కోరారు. ఈ నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పత్రికల్లో వచి్చన వార్తలు లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు(ఓసీసీఆర్‌పీ) వంటి థర్డ్ పార్టీ సంస్థల నివేదికల ఆధారంగా సెబీ దర్యాప్తును అనుమానించలేమని స్పష్టం చేసింది.
అలాంటి నివేదికలను కేవలం ఇన్‌పుట్స్‌గా పరిగణించవచ్చని అభిప్రాయపడింది. సెబీ దర్యాప్తును అనుమానించడానికి అలాంటివి ఆధారాలుగా ఉపయోగపడవని పేర్కొంది. చట్టబద్ధమైన సంస్థ అయిన సెబీ కొనసాగిస్తున్న దర్యాప్తును మరో సంస్థకు బదిలీ చేసే అధికారం కోర్టుకు లేదని పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే మాత్రమే అలా బదిలీ చేయగలమని తేలి్చచెప్పింది.
నిర్ధారణ కాని సమాచారంపై ఆధారపడొద్దు
అదానీపై గ్రూప్‌పై 24 ఆరోపణలు రాగా, సెబీ ఇప్పటికే 22 ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేయడానికి, కోర్టుకెక్కడానికి నిర్ధారణ కాని సమాచారంపై పిటిషనర్లు ఆధారపడినట్లు తెలుస్తోందని వెల్లడించింది. వారు తగిన పరిశోధన కూడా చేయకుండానే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని ఆక్షేపించింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకూడదని సూచించింది.
న్యాయవాదులు గానీ, పౌర సమాజం సభ్యులు గానీ అప్రమత్తంగా ఉండాలని, నిర్ధారణ కాని సమాచారం లేదా థర్డ్‌పార్టీ నివేదికల ఆధారంగా ఇష్టారాజ్యంగా పిటిషన్లు వేయడం సరైంది కాదని తేలి్చచెప్పింది. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సానుకూల సంకేతాలు రావడంతో బుధవారం స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌లోని నమోదిత కంపెనీల షేర్ల ధరలు పైకి ఎగబాకాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఎన్‌డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ వంటి సంస్థల షేర్ల ధరలు గణనీయంగా పెరిగాయి.
సత్యమేవ జయతే: గౌతమ్ అదానీ
సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. సత్యమే జయిస్తుందన్న నిజాన్ని ఈ తీర్పు మరోసారి నిరూపించిందని అన్నారు. భారతదేశ ప్రగతి చరిత్రలో తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉంటామని చెప్పారు. ప్రతికూల సమయంలో తమకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘సత్యమేవ జయతే’ అంటూ గౌతమ్ అదానీ బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment