విదేశీ డొల్ల కంపెనీల్లో వాటాలు
మరో బాంబు పేల్చిన హిండెన్‌బర్గ్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి బాంబు పేలి్చంది. పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో సాక్షాత్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్సన్ మాధబీ పురీ బోచ్‌కు, ఆమె భర్త ధవళ్ బోచ్‌కు సంబంధముందని తీవ్ర ఆరోపణలు చేసింది! అందుకే అదానీ ఆర్థిక అవకతవకలపై లోతుగా విచారణ జరిపేందుకు సెబీ పెద్దగా ఆసక్తి చూపడం లేదని అభిప్రాయపడింది.
బెర్ముడా, మారిషస్‌ల్లోని అదానీ గ్రూప్ డొల్ల కంపెనీల్లో మాధబీ దంపతులకు వాటాలున్నట్టు శనివారం రాత్రి విడుదల చేసిన తాజా నివేదికలో హిండెన్‌బర్గ్ వెల్లడించింది. ‘‘ఆ కంపెనీల్లో వారిద్దరూ కోటి డాలర్ల మేరకు ‘పెట్టుబడులు’ పెట్టినట్టు చూపారు. పెట్టుబడులకు భారత్‌లో ఎన్నో మ్యూచువల్ ఫండ్లు తదితరాలుండగా ఏరి కోరి పన్ను ఎగవేతదారుల స్వర్గధామంగా పేరొందిన దేశాల్లో, అదీ అదానీలకు చెందిన డొల్ల కంపెనీల్లోనే పెట్టడం ఆశ్చర్యకరం.
అదానీల ఆర్థిక అవకతవకల్లో ఏకంగా తమ చీఫే భాగస్వామి కావడంతో లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసింది’’ అని పేర్కొంది. అదానీల విదేశీ నిధుల మూలాలపై సెబీ విచారణ తేలి్చందేమీ లేదంటూ అప్పట్లో సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిందని హిండెన్‌బర్గ్ గుర్తు చేసింది. అంతకుముందు, ‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అంటూ సంస్థ శనివారం ఉదయమే ఎక్స్‌లో పోస్టు పెట్టింది.
నాటినుంచీ దుమారమే
అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుందంటూ 2023 జనవరి 23న హిండెన్‌బర్గ్ ఇచి్చన నివేదిక దుమారం రేపడం తెలిసిందే. ధరలు పెంచిన షేర్లను తనఖా పెట్టి భారీ రుణాలు పొందిందని, అకౌంటింగ్ మోసాలకూ పాల్పడిందని నివేదిక పేర్కొంది. బెర్ముడా, మారిషస్ దేశాల్లో అదానీ కుటుంబం డొల్ల కంపెనీలు పెట్టి వాటి ద్వారా అవినీతికి, నగదు అక్రమ బదలాయింపుకు పాల్పడుతోందని ఆరోపించింది.
చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ వీటిని నియంత్రిస్తున్నట్టు పేర్కొంది. ఈ నివేదిక దెబ్బకు అప్పట్లో అదానీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాని సంపద ఏకంగా 150 బిలియన్ డాలర్ల మేరకు హరించుకుపోయింది. ఈ ఉదంతం రాజకీయంగా కూడా ఇప్పటికీ జాతీయ స్థాయిలో పెను ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. అధికార బీజేపీ, విపక్ష ఇండియా కూటమి మధ్య పరస్పర ఆరోపణలకు కారణమవుతూ వస్తోంది. అయితే హిండెన్‌బర్గ్ నివేదిక వెనక కుట్ర దాగుందన్న వాదనలూ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment