విపక్షాల డిమాండ్
సుమోటోగా స్వీకరించండి
సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి
మాధబీ బచ్ రాజీనామా చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లో సెబీ చైర్‌పర్సన్ మాధబీ పురీ బచ్ పెట్టుబడుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు ఆదివారం డిమాండ్ చేశాయి. ‘‘అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. దీనిపై మోదీ ప్రభుత్వం తక్షణం స్పందించాలి’’ అన్నాయి. అదానీ గ్రూప్‌లో మాధబీ దంపతులు పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌వర్గ్ తాజాగా ఆరోపించడం తెలిసిందే.
అదానీ గ్రూప్, సెబీ చైర్‌పర్సన్ బంధంపై కేంద్రం నోరు విప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఉదంతాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న సంపన్న మిత్రులను కాపాడుకొనేందుకు మోదీ ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధబీ పదవిలో కొనసాగడం అనైతికమన్నారు. ఆమె ఇంకా రాజీనామా ఎందుకు చేయలేదని రాహుల్ ప్రశ్నించారు. నియంత్రణ సంస్థ సమగ్రతను కేంద్రం కాపాడాలని డిమాండ్ చేశారు. సెబీ చైర్‌పర్సన్–అదానీ బంధం స్పష్టంగా కనిపిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని సీతా రాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), జైరాం రమేశ్ (కాంగ్రెస్), మహువా మొయిత్రా (టీఎంసీ), సంజయ్ సింగ్ (ఆప్), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐ–ఎంఎల్) ఆరోపించారు. అదానీ గ్రూప్‌ను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నించారు.
విపక్షాల కుట్ర: బీజేపీ
దేశంలో ఆర్థిక అస్థిరత సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ మండిపడింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసింది. విదేశీ కుతంత్రాల్లో ప్రతిపక్షాలు భాగంగా మారాయని ధ్వజమెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment