న్యూఢిల్లీ: అదానీ అంశాన్ని పార్లమెంట్ లోపలా, బయటా లెవనెత్తుతూనే ఉంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇది చాలా పెద్ద కుంభకోణమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ అంశంతోపాటు తన, పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించడం తదితర 10 ప్రశ్నలను ఆయన ప్రభుత్వానికి సంధించారు. ప్రజల డబ్బునకు సంబంధించిన అదానీ అంశం పెద్ద కుంభకోణమని ఖర్గే పేర్కొన్నారు.
‘దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది? ఆర్‌బీఐ, సెబీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలు తమ విధులను నిర్వర్తించకుండా ఎందుకు చేశారు? కుంభకోణాలెన్ని జరిగినా మౌనంగా ఉన్నారెందుకు?అని ఆయన అన్నారు. వీటిపై పార్లమెంట్ వెలుపల, లోపల ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వీటిపై ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుండా, నియంత మాదిరిగా వ్యవహరిస్తానంటే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతారని హెచ్చరించారు.
రాజ్యసభలో ప్రశ్నలు మాత్రమే అడిగాను తప్ప ఎలాంటి అన్‌పార్లమెంటరీ మాటలు మాట్లాడలేదన్నారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ, రాజ్యసభ రికార్డుల నుంచి తన మాటలను తొలగించడంపై ఆయన.. ప్రజాస్వామ్యం పేరుతో ఏం జరుగుతోందో మీరే ఊహించుకోండని వ్యాఖ్యానించారు. తన మిత్రుడి కుంభకోణాల మకిలిని పోగొట్టేందుకు ప్రధాని మోదీ పార్లమెంట్‌ను వాషింగ్ మెషీన్‌లాగా వాడుకుంటున్నారని ఖర్గే ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment