ముంబై: హిండెన్‌బర్గ్-అదానీ వ్యవహారంపై విపక్ష నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్వరం మార్చారు. ఈ అంశంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ)ని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ సమావేశాలను సైతం విపక్షాలు స్తంభింపజేశాయి. అయితే.. విపక్షాల జేపీసీ డిమాండ్‌కు తాము అంగీకరించబోమని, కాకుంటే విపక్షాల ఐక్యత కోసం వాళ్ల డిమాండ్‌ను వ్యతిరేకించబోమని మంగళవారం ప్రకటించారాయన.
ఈ విషయంలో(జేపీసీ డిమాండ్) మా మిత్ర పార్టీలతో మేం విబేధిస్తున్నాం. మద్దతు ఇవ్వం. కానీ, మేం ఐక్యంగా కొనసాగాలనుకుంటున్నాం. అందుకే విపక్షాల డిమాండ్‌ను వ్యతిరేకించకూడదని నిర్ణయించుకున్నాం అని ఓ మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ తెలిపారు.
అంతకు ముందు ఇదే ఎన్సీపీ చీఫ్ హిండెన్‌బర్గ్-అదానీ అంశంపై జేపీసీ విచారణకు తాను పూర్తిగా వ్యతిరేకం కాదని పేర్కొన్నారాయన. ఈ విషయంలో సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు ప్యానెల్ మరింత ఉపయోగకరంగా మరియు ప్రభావవంతంగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, కొన్నిరోజులకే ఆయన స్వరం మార్చారు. గత వారం ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ గ్రూప్‌నకు అనుకూలంగా మాట్లాడారు.
హిండెన్‌బర్గ్ నివేదిక ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా, కేవలం విమర్శనాత్మకంగా ఉందంటూ పేర్కొన్నారు పవార్.
‘‘గతంలో మేం అధికారిక ప్రభుత్వంపై విమర్శలు చేసిన క్రమంలో పదేపదే టాటా బిర్లా పేర్లు ప్రస్తావించేవాళ్లం. అలా అని వాళ్లు ఈ దేశానికి చేసిన సేవల్ని తప్పు పట్టలేం కదా. ఇప్పుడు అంబానీ, అదానీ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు కూడా దేశానికి ఏం చేశారన్నది ఓ సారి పరిశీలించాలి. ఆ కమిటీ ద్వారా నిజాలేవీ బయటకు రావని తేల్చి చెప్పారు. ఇప్పటికే చాలా సార్లు మా మీటింగ్‌లో నేను చెప్పాను. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసినా వృథాయే. ఆ కమిటీలో 21 మంది సభ్యులుంటే.. అందులో 15 మంది బీజేపీ వాళ్లే ఉన్నారు. అలాంటప్పుడు నిజాలు బయటకు వస్తాయని నేను అనుకోవడం లేదు. అందుకే నేను ఓ సూచన చేశాను. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఓ స్వతంత్ర కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని చెప్పాను అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. పవార్ 2015లో తన ఆటోబయోగ్రఫీలో అదానీనీ పొడుగుతూ.. రాసిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. అదానీతో బంధం వల్లే ఆయన విమర్శించలేకపోతున్నారని చెబుతున్నారు. మరోవైపు విపక్షాల ఐక్యతపైనా ఈ అంశం ప్రభావం చూపెట్టవచ్చని, 2024 ఎన్నికల కోసం బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుని ముందుకు పోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నానికి ఇది.. అడ్డుపుల్లాలాంటి ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment